నేను రైలు దిగగానే కనబడిందా వంతెన.
దూరంగా రెండు కొండల మధ్యనుందది. ప్లాట్‌ఫామ్ మీదనుంచి చూస్తే ఆకాశంలో ఉన్నట్టు కనబడింది.
తియన్ చియావ్ (Sky bridge)
నేను వెళ్ళాల్సిన చోటు పేరు ‘ఎద్దు పడిన లోయ.’ మూడు సామ్రాజ్యాల చరిత్ర కథలో [1]“Romance of the three kingdoms” a fourteenth century epic written by Luo Guanzhong. This covers the period of Chinese history from 220 A.D. to 265 A.D. and is about the rise and fall of the three kingdoms — Wei, Shu, and Wu — that covered most of China. This has been translated into English at least by two sets of translators. One of the two English translations can be read at www.threekingdoms.com. This is also made into an acclaimed TV series in China.ముగ్గురు రాజులుంటారు. ఆ ముగ్గుర్లో ల్యూ పే అనే రాజు దగ్గిర పంగ్ టోంగ్ అనే సేనాని ఉంటాడు. పంగ్ టోంగ్‌కే అగ్నిపక్షి అని ఇంకో పేరు. మూడు సామ్రాజ్యాల చరిత్రలో ఈ పంగ్ టోంగ్ తన సైన్యాన్ని ఒక చోటుకి నడిపించి అక్కడ ఓటమికి గురవ్వడమే కాకుండా తన ప్రాణాల్నే పోగొట్టుకుంటాడు. ఇప్పుడా చోటును ‘అగ్నిపక్షి కూలిన వాలు’ అని పిలుస్తారు. మా అమ్మ ఎద్దు సంవత్సరంలో పుట్టింది. ఆవిడ ఎద్దు పడిన లోయలో చనిపోవడం కాకతాళీయమో కాదో. రైల్లో ఈ విషయం గురించే ఆలోచించాను గానీ నా ఆలోచన పూర్తయ్యేలోపలే నేను దిగాల్సిన చోటొచ్చేసింది.
నాతో పాటు రైలు దిగిన వాళ్ళందరిలో నేను విలక్షణంగా కనబడుండాలి. ఎందుకంటే ఈ స్టేషన్లో దిగిన వాళ్ళందరూ సంత నుంచి తిరిగి వస్తున్న రైతులే. అందరి తలల మీదా రెల్లు టోపీలు, భుజాల మీద కావడి బద్దలు కనబడ్డాయి. కావడి బద్దలకి ఒక కొసన ఖాళీ సంచులున్నాయి. సిటీ నుంచొచ్చింది నేనొక్కణ్ణే. ఈ సంగతి గమనించగానే, అప్పుడే పెట్టుకున్న చలువ కళ్ళద్దాలు తీసేశా. మిట్ట మధ్యాహ్నం. ఎండ తీవ్రతకి కళ్ళు మిరుమిట్లుగొలిపి కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకున్నా. అదుగో, అలా కళ్ళకడ్డం పెట్టుకున్న చేతి వేళ్ళమధ్యనుంచి కనబడిందా వంతెన మొదటిసారిగా.
ఆ వైపుగా ప్లాట్‌ఫామ్ చివరకి నడిచాను. నా ఛాతీ ఎత్తున్న రాతిగోడ ఉందక్కడ. గోడకవతలి పక్కనో లోయ. ఓ ఐదారువందలడుగుల లోతుంటుందేమో. గోడ మీదకు వంగి లోయ అడుక్కు చూశాను. చిన్నా పెద్దా గుండ్రాళ్ళు తప్పించి నీళ్ళు కనబడలేదు. ఒకప్పుడు నీళ్ళుండేవేమో తెలీదు. ప్రస్తుతం మాత్రం నీటి చాయల్లేవు. రెండు శిఖరాల మధ్యనుందా వంతెన. ఎదురుగా కనబడుతూ, తల ఎత్తి చూడాల్సినంత ఎత్తుగా ఉంది. కొండమీంచి క్రిందకి కాలిబాటొకటి అస్పష్టంగా కనబడుతుంది. గడ్డిలో మెట్లు మెట్లుగా క్రిందికి దిగి, క్రిందనున్న బండరాళ్ళని దాటి వంపు తిరిగి రెండవ కొండ మీదికి మెట్లు మెట్లుగా సాగింది. వంతెన కొండచరియను తాకుతున్న చోట ఒక పెద్ద స్థూపం లాంటి కట్టడం కనబడుతోంది. ఎవరి జ్ఞాపకార్థమో కట్టుండవచ్చు. ఆ వంతెన నిజంగా ఆకాశంలో ఉన్నట్టుందన్న సంగతి అప్రయత్నంగా స్ఫురించింది.
“ఎవరండీ అదీ? ఏం చేస్తున్నారక్కడ?” వెయిటింగ్ రూమ్ బయట నుంచున్న ఒక వ్యక్తి గట్టిగా కేక పెట్టాడు. కాసేపట్నించీ నన్నే గమనిస్తున్నాడల్లే ఉంది. ఏమనాలో తెలీలేదు. “జాగ్రత్త!” నా వైపు చూపుడువేలు సారించి మళ్ళీ తనే మాట్లాడాడు, “ఇంతకుముందు అక్కడ నుంచే కొందరు క్రిందకి పడ్డారు. రెండు నెలల క్రితమే ఒక అబ్బాయి పడ్డాడు. బుర్ర చితికిపోయింది.”
నాకు అతనితో చెప్పాలనిపించింది. ఆ అబ్బాయొక్కడే కాదు… ఇరవయ్యేడు సంవత్సరాల క్రితం ఒకావిడ కూడా ఇక్కడే చచ్చిపోయిందని. ఎద్దు సంవత్సరంలో పుట్టినావిడ. కాకపోతే అదే సమయంలో గుర్తుకొచ్చింది నాకు… నేను పుట్టింది కూడా ఎద్దు సంవత్సరంలోనేనని. ఔను. నేను పుట్టింది పంతొమ్మిదివందల ముప్పైఏడులో. పంతొమ్మిదివందల యాభయ్యేడుకి నాకు ఇరవయ్యేళ్ళు.
వెయిటింగ్ రూమ్ బయట నిలబడి కేకలు పెట్టిన వ్యక్తి స్టేషన్ మాస్టరని తరవాత తెలిసింది. నేనతని దగ్గరికి నడిచి స్టేషన్ మాస్టరెక్కడుంటాడని అడిగేను. ఆ వ్యక్తి నా వంక నింపాదిగా చూసి, “ఎందుకు?” అన్నాడు.
“ఏదో కుటుంబ విషయం,” అన్నాను.
“అలాగా! ఐతే చెప్పండి. స్టేషన్ మాస్టర్ని నేనే.”
జేబులోంచి కర్చీఫు తీసి నుదురు తుడుచుకుని, “అబ్బ, చాలా వేడిగా ఉందిక్కడ,” అన్నాను.
“ఉండదూ మరీ,” గొంతులో వ్యంగ్యం తొంగిచూస్తుండగా అన్నాడతను. “మీరు వేసవి విడిదికోసం వెతుకుతూ దారితప్పి ఇక్కడ దిగారు కాబోలును. వేసవి విడిది కావాలంటే చింగ్ డావ్[2]Qing Dao (translates to “green island”) is a well-known summer resort which is in the San Tong province. వెళ్ళాలి.”
అతనన్నది నిజమే. నేనిక్కడకి వేసవి విడిది కోసం రాలేదు. మా అమ్మ సమాధిని వెతకడానికి వచ్చేను. కానీ, ఆ సంగతి చెప్పడానికి చాలా ఓపిక కావాలి. ఎందుకంటే నేనా సంగతి చెప్పగానే, విన్నవాళ్ళు మా అమ్మ సమాధి ఇలాంటి చోట ఎందుకుందీ అంటారు మొదట. అదో పెద్ద కథ. నేనది చెప్పేసరికి, వాళ్ళింకో ప్రశ్నడుగుతారు. ‘మీ అమ్మ తెల్లగుర్రపు సరస్సుకు బయల్దేరింది నిన్ను చూడ్డానికన్నావు కదా, అసలు నువ్వు తెల్లగుర్రపు సరస్సులో ఏం చేస్తున్నావ్?’
చచ్చాను. అదింకో పెద్ద కథ.
ఈ కథన్నేను గత రెండు రోజులుగా చెప్పుకొస్తున్నాను. నిన్న నాన్ జింగ్‌లో. మొన్న బాంపూఁలో. అసలు మా ఫాక్టరీలో సెలవు కోసం అడిగినప్పుడెన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందో! ఈ కథనిలా చెప్పుకుంటూ పోతే ఏదోక నాటికి నేను కథలు చెప్పడాన్ని వృత్తిగా చేసుకోవచ్చు.
2
కొంతకాలంపాటు నా కథనెవరికన్నా చెప్పడానికి నాకు విముఖత ఉండేది కాదు. నాకైతే అందులో సిగ్గుపడాల్సిన విషయమేం కనబడేది కాదు. కాకపోతే నా కథ విన్నవాళ్ళకలా అనిపించేది కాదు. నిజానికి మా కాలేజీ స్టూడెంటైతే నా మొహమ్మీదే అన్నాడు, నాకు తగిన శాస్తి జరిగిందని. అతగాడి ఉద్ధేశ్యం అదంతా నేను కోరి తెచ్చిపెట్టుకున్నదేనని.
పంతొమ్మిదివందల యాభయ్యేడులో నాకిరవయ్యేళ్ళు. అప్పట్లో నేను డాషిన్ మెషీన్ ఫాక్టరీలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు మా వర్క్‌షాప్ డైరెక్టర్ నా దగ్గరకొచ్చాడు, నోట్లో సిగరెట్టుతో సహా. “వాంగ్ బావ్! నువ్వు మన ఫాక్టరీ యాజమాన్యానికి వాళ్ళ లోటుపాట్ల గురించి చెప్పాలి.”
లోటు పాట్ల గురించి నేను చెప్పవల్సిందేం లేదన్నాను.
“ఈ ఫీడ్ బాక్ కావాలని ప్రభుత్వమే అడుగుతుంది[3]In 1956 April, Mao Zedong encouraged intellectuals and others to voice criticisms of party policy so that the party could correct itself. This campaign became known as The Hundred Flowers Campaign and lasted from 1956 May through 1957 May. (The name of the campaign was derived from a slogan from Chinese classical history:”let a hundred flowers blossom and a hundred schools of thought contend”.) However, the extent of criticism was beyond Mao’s expectations. Those that had spoken against the party policy and personnel during the Hundred Flowers Campaign paid a heavy price during the 1957 anti-rightist campaign that followed. Some 200,000 critics were denounced and either imprisoned or sent to labor reform camps.,” అన్నాడతను. “నువ్వు మిగతావాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి. దీనికి పెద్దగా చేయాల్సిందేం లేదు. ముందు నువ్వు చెప్పదల్చుకున్న దాన్ని పెద్ద అక్షరాలతో ఒక పోస్టర్‌లా తయారు చేసి నోటీస్ బోర్డ్‌లో పెట్టు. తరువాత కొద్ది నిముషాలపాటు చిన్న ఉపన్యాసమివ్వు.”
“నాకు పని బాగా ఎక్కువగా ఉంది. అస్సలు టైమ్ లేదు.”
“అలాక్కుదరదు. అసలే నువ్వు మీ ప్రొడక్షన్ టీముకి లీడరువి. ఆ సంగతి మర్చిపోతున్నావులా ఉంది.” సిగరెట్టుని నా మెషీన్ మీద రుద్ది ఆర్పుకుని బయటకి నడిచాడు మా డైరెక్టర్.
నేనతగాడు చెప్పినట్టే చేశాను. ఎందుకంటే, మా డైరెక్టరన్నట్టుగానే నేను మా ప్రొడక్షన్ టీముకి లీడర్ని. కమ్యూనిస్ట్ యువతలో సభ్యుణ్ణి. పై పెచ్చు, మా ఫాక్టరీ ఫుట్‌బాల్ టీములో సెంటర్ ఆడేవాణ్ణి. ప్రతీ సోమ, బుధ, శుక్ర వారాలు నైట్ స్కూల్లో మెషీన్ డ్రాయింగూ, రష్యనూ నేర్చుకునేవాణ్ణి కూడా! ఆ రోజుల్లో, నేను ఏదోరోజున రష్యన్ ఇంజినీర్లతో ముఖాముఖీ మాట్లాడుతానని కలలు కనేవాణ్ణి. ఇప్పుడు, ఒకటి రెండు ముక్కల రష్యన్ తప్ప మిగతాదంతా మర్చిపోయేను.
మళ్ళీ మళ్ళీ అడిగించుకోకుండా ఉండాలని, నేను కోటాను మించి ఏడు పేజీల పోస్టర్ తయారుచేశాను. వర్క్‌షాప్ మీటింగ్‌లో రెండు గంటలసేపు మాట్లాడేను. నిజానికి నేనంతసేపు మాట్లాడేనంటే అది నాకు ఎలా మాట్లాడాలో తెలీకపోవడం వల్ల మాత్రమే. నేనదే చెప్తే, చాలా తెలివైన సాకు చెబుతున్నానన్నారు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిన అధికార్లు. కానీ నిజం మాత్రం ఇదే. వేదికలెక్కి ప్రసంగించే అలవాటు ఉన్నవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం తాము చెప్పదల్చుకున్నదాన్ని సూటిగా స్పష్టంగా చెప్తారు. నేనెప్పుడూ అలా ప్రసంగాలిచ్చిన వాణ్ణి కాదు. నా దగ్గిర వాచ్ కూడా లేదు. నేనెంతసేపు మట్లాడుతున్నానో నాకెలా తెలుస్తుంది?
నా ‘ఉపన్యాసం’ రోజున నేను గుర్తుపెట్టుకుని కొత్త యూనిఫామ్ వేసుకున్నాను. ముందుగానే తయారుచేసుకున్న ప్రసంగాన్ని చాలాసార్లు జాగ్రత్తగా మననం చేసుకున్నా. అయితే, స్టేజీ ఎక్కి నేను ‘గుడ్ ఆఫ్టర్‌నూన్, కామ్రేడ్స్!’ అన్నానో లేదో క్రింద కూర్చున్న నా టీమ్‌మేట్లందరూ ఏకకంఠంతో ‘గుడ్ ఆఫ్టర్‌నూన్, వాంగ్ బావ్!’ అని చిలిపిగా సమాధానమిచ్చారు. దాంతో నా బుర్రంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. స్టేజీ దిగిన తర్వాత నా ఉపన్యాసంలో ఒక్క ముక్క కూడా నాకు గుర్తులేదు. నేను మా డైరెక్టర్‌ను అడిగాను ఎలా మాట్లాడేనని.
“బాగానే మాట్లాడేవు గానీ, మీ నాన్న రిక్షా లాగుతాడనీ, మీ అమ్మ పాచి పని చేస్తుందనీ చెప్పాల్సిన అవసరమేమొచ్చింది?” అన్నాడు ఆయన.
కాలేజీ స్టూడెంటు ఈ కథని విన్నప్పుడు మంచంలో పడుకున్నవాడల్లా ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. ఆ రాత్రి చాలా చలిగా ఉంది. మా రూము బయట నీటి కుంట పూర్తిగా గడ్డ కట్టుకుపోయేంత చలిగా ఉందా రాత్రి. అంత చలిలోనూ, వాడు తను కప్పుకున్న కంబళీ విసిరేసి తన ఊచకాళ్ళతో నా మంచం దగ్గరకి పరుగెత్తుకొచ్చాడు. “నాలుగు ముక్కలు వ్రాయమంటే ఏడు పేజీలు వ్రాశావు. రెండు నిముషాలు మాట్లాడమంటే రెండు గంటలు మాట్లాడేవు. నన్నడిగినా కూడా నీకు సోషలిజమంటే ద్వేషమనే చెప్తాను. నీకు తగినశాస్తి జరిగింది,” అన్నాడు.
“నీక్కూడా తగినశాస్తే జరిగింది,” అన్నాన్నేను. దాంతో వాడు నా మంచం ముందు ఒక్క క్షణమాగి వాడి మంచానికి తిరిగి వెళ్ళేడు. తలనిండా కంబళి ముసుగేసి మళ్ళీ మాట్లాడలేదు వాడు.
వాడు మారు మాట్లాడకపోవడానికి కారణం నేనన్నది నిజం కావడమే. నిజానికి నా విషయంలో కంటే వాడి విషయంలోనే ‘తగిన శాస్తి’ అన్నమాట నిజం. అంతేకాక వాడు పనిచేసే ప్రొడక్షన్ టీముకి నేను లీడర్ని. వాడు నా సహాయం లేకుండా బ్రతకలేడు. పోయినసారి కోతల సమయంలో, మా కోటా 10 టన్నులైతే వాడు 6 టన్నులకే చేతులెత్తేసేడు. మిగిలిన నాలుగు టన్నులూ నేను పూర్తిచేశాను.
“ఒరే బచ్చాగా! నువ్వు ఈపాటి బరువు కూడా మొయ్యలేవు. అసలు నువ్వు చెయ్యగలిగిన పనేమన్నా ఉందా?” అని ఎగతాళి చేశాన్నేను వాణ్ణి.
వాడు అప్పుడే నూర్చిన ధాన్యపు కుప్ప మీద వెల్లికిలా పడుకుని, వగరుస్తూ, “నువ్వు మనుషుల్ని వాళ్ళ శరీరాల్ని బట్టి అంచనా వేయడం మంచిది కాదేమో. ఏదోరోజు నీకు నా అవసరం కలక్కపోదు,” అన్నాడు.
తరవాత్తరవాత వాడు నిజంగానే నాకు చాలా సహాయం చేశాడు. వాడు నాకు ముగ్గురాడవాళ్ళని పరిచయం చేశాడు. ఆ ముగ్గురిలో ఒకావిడ ఇప్పుడు నా భార్య.
నేను అలా స్టేజీ మీద నవ్వులపాలైన కొద్ది నెలలకు యాంటీ రైటిస్ట్ మూవ్‌మెంట్ మొదలయ్యింది. దాంతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందరూ నా మీద పోస్టర్లు వ్రాయడం, నన్ను తిట్టడం మొదలుపెట్టేరు. అయితే, నేను కార్మికుణ్ణవ్వడం వల్ల నాకు రైటిస్ట్ అనే ముద్ర వేయడం కుదరలేదు. అయినా వాళ్ళు నన్ను యాంటీ సోషలిస్ట్‌గా పరిగణించడం మొదలయింది. కొంతకాలానికి మా ఫేక్టరీ వాళ్ళు నన్ను లేబర్ ఎడ్యుకేషన్ కేంప్‌కి పంపించడానికి నిర్ణయించారు. ఆ కేంప్ ఉన్నది తెల్లగుర్రపు సరస్సు ఫార్మ్‌లో.
నేను కేంపుకి బయల్దేరినప్పుడు మా వర్క్‌షాప్ డైరెక్టర్ నన్ను గేటుదాకా సాగనంపేడు. నా భుజం తట్టి, “వాంగ్ బావ్! నువ్వు కష్టపడి పనిచెయ్యి. వయసులో ఉన్నవాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న ఎదురుదెబ్బలు ఒక లెక్కలోకి రావు. నువ్వు ఆ గ్రామాల్లో ఒక రెండు సంవత్సరాలు కష్టపడి పనిచెయ్యి. తిరిగి రా. నేను నీ మెషీన్‌ని మళ్ళీ నీకే అప్పగిస్తాను,” అని ధైర్యం చెప్పేడు. అతను మాట్లాడిన తీరు నేను లేబర్ ఎడ్యుకేషన్‌కి కాక సైన్యంలో చేరడానికి వెళుతున్నట్లుగా ఉంది.
అతనే కాదు. మా నాన్నా నేనూ కూడా లేబర్ ఎడ్యుకేషన్ అంటే తేలిగ్గానే తీసుకున్నాం. మేం చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవాళ్ళం. కాయకష్టం చేసుకు బ్రతకడానికి అలవాటు పడ్డవాళ్ళం. ఫేక్టరీలో పనిచేయడమన్నా పొలాల్లో పనిచేయడమన్నా ఒకటే మాకు. పై పెచ్చు, మేమసలు ఉత్తర జాన్‌సూ నుంచి వచ్చినవాళ్ళమే. యుద్ధం వల్లనే మేము షాంగ్‌హాయ్‌కి మారిపోయాం.
మేం షాంగ్‌హాయ్ వచ్చింది పంతొమ్మిదివందల నలభయ్యెనిమిదిలో. ఆ తర్వాత రెండేళ్ళకి షాంగ్‌హాయ్ ఒక తీవ్రమైన తుఫానుకి గురయ్యింది. ఒక పక్క తుఫానూ, మరో పక్క వరదలూ! దాంతో మేమంతా మళ్ళీ మా స్వస్థలం ఉత్తర జాన్‌సూకి పారిపోయాం. అప్పటికి నాకు పదమూడేళ్ళు. పొలంలో ఏ పనన్నా చేయగలిగేవాణ్ణి.
నాకు గ్రామానికి తిరిగి వెళ్ళడంలో ఏమాత్రం కష్టం అనిపించలేదు. మా నాన్న కూడా ఉత్సాహంగానే కనబడ్డాడు. నేను షాంగ్‌హాయ్ వదిలి వెళ్ళే ముందురోజు రాత్రి మా నాన్న మా గ్రామాల గురించి ఆపకుండా కథలు చెపుతూనే ఉన్నాడు. అన్నీ మంచి తమాషా కథలు.
ఈ మధ్యనే పేపర్లో చదివేను. పంతొమ్మిదివందల యాభైలో షాంగ్‌హాయ్ మేయర్ చెన్ యీ [4]Chen Yi (1901-72) was one of the outstanding Chinese Communist military commanders of the 1930s and ’40s. After the Communist takeover in 1949, he became mayor of Shanghai and a major figure in eastern China. He was made a member of the ruling Politburo in 1956 and served as the foreign minister from 1958 to 1966. He was stripped of all his power during the cultural revolution. గ్రామాల్నుంచి వలస వచ్చినవాళ్ళను వెనక్కు పంపించడానికి ప్రయత్నించాడట[5]In China, there are restrictions on where one can live within China. Probably, these restrictions are meant to prevent rural labor from migrating to the cities on a large scale.. అతడా పనికి చాలా మంది పార్టీ అధికారుల్ని నియమించేడు గానీ, లాభం లేకపోయిందట. అయితే, ఆ వేసవిలో వచ్చిన తుఫానూ, వరదల దెబ్బకి వలసదారులందరూ తమంతట తామే తిరుగుముఖం పట్టేరట. అది చూసి చెన్ యీ, ‘ఇంత మంది కమ్యూనిస్టు పార్టీ మెంబర్లు చెయ్యలేని పని ఈ తుఫానూ, వరదలూ చేసినయ్య’ని చమత్కరించేడని కథనం.
పేపర్లో ఈ విషయం వ్రాసిన రిపోర్టర్ ఆ సమయంలో పార్టీ మెంబరట. అతడు వ్రాయడం, కామ్రేడ్ చెన్ యీ ఇలా చమత్కరించిన కొంత కాలానికే, వరదలు తగ్గిపోవడమూ, వలసదారులందరూ తిరిగి షాంగ్‌హాయ్ చేరుకోవడమూ జరిగినయ్యట. అంతేకాదు, ఈసారి వలసదారులు వాళ్ళ బావల్నీ, బాబాయిల్నీ, మేనమామల్నీ, అల్లుళ్ళనీ, ఇంకా ఇరుగుపొరుగుల్నీ కూడా తీసుకు మరీ వచ్చేరట. ఆ దెబ్బకి వలసదారుల సంఖ్య రెట్టింపయ్యిందట. చెన్ యీ మళ్ళీ వీళ్ళని తరిమేయడానికి పథకాలు వేసిన దాఖలాలు లేవు.
తలుచుకుంటే నవ్వొస్తుంది. అప్పట్లో ఆ బడా మేయరు చెన్ యీని అలా ఏడ్పించిన వాళ్ళలో ముగ్గురు మా కుటుంబం నుంచే!
మా నాన్న అలా పల్లెల గురించి తమాషా కథలు చెప్తుంటే మా అమ్మ చిన్న పీట మీద కూర్చుని నా చిరిగిన చొక్కా కాలరు కుడుతూన్నది. ఆవిడ కుడుతున్నంత సేపూ కన్నీరు కారుస్తూ, ఆ కుడుతున్న చొక్కా తోనే కళ్ళు తుడుచుకున్నది. తరువాత నేనా చొక్కాని పెట్టెలో పెట్టుకునే సమయానికి అది సగం తడిసిపోయుంది.
ఈ ఎడబాటు తరువాత, మేమిద్దరమూ మళ్ళీ ఒకరినొకరం చూసుకోమని ఆవిడకి ఎలానో తెలిసుండాలి.
3
నాకు ఫేక్టరీ నుంచి మూడ్రోజుల సెలవు దొరికింది. అవసరమైన కాగితాలు నింపడానికి మా వర్క్‌షాప్ డైరెక్టర్ నాతోపాటూ హెడ్డాఫీసుకి వచ్చాడు. తర్వాత ఫేక్టరీ గేటు దాకా నన్ను సాగనంపేడు. నా భుజం తట్టి “వాంగ్ బావ్! ఎలాగైనా మీ అమ్మ సమాధిని కనుక్కో. ఆవిడ కొడుగ్గా నీ విధి అది. వీలైనంత త్వరగా తిరిగి రా,” అన్నాడు. పాపమాయన చాలా మంచి మనిషి. ఆయన్ని నేనెన్నడూ తప్పుపట్టలేదు. పోయినసారి నన్నిలా గేటు దాకా సాగనంపినప్పుడు కూడా ఇలానే వీలైనంత త్వరగా తిరిగి రమ్మన్నాడు. కాకపోతే, అప్పుడు నేను తిరిగి రావడానికి ఇరవై రెండేళ్ళు పట్టింది.
నేను బాంపూఁకి టికెట్ కొనుక్కుని రైలెక్కాను. ఈ ప్రయాణం వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో తెలీదు గానీ నాకా నెల సెలవు తీసుకోకుండా పనిచేస్తే వచ్చే బోనస్ రాదనిపించింది. నిజం చెప్పాలంటే మా అమ్మ సమాధిని పట్టుకోగలనో లేదో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఆవిడ చచ్చిపోయిందన్న విషయం మాత్రమే. ఆవిడ ఇరవయ్యేడేళ్ళ క్రితం షాంగ్‌హాయ్, బాంపూఁల మధ్య మరణించింది.
మిట్ట మధ్యాహ్నానికి రైలు నాన్‌జింగ్ చేరుకుంది. అప్పటికి నా అపనమ్మకం ఇంకా పెరిగింది. 1980లో నేను తెల్లగుర్రపు సరస్సు నుంచి వచ్చేసినప్పుడు భోజనం ఖరీదు 30 పైసలుండేది. ఈసారి అది రూపాయిన్నరైంది.
నేను చొక్కా జేబులోంచి చిల్లర డబ్బులు తీసేను. నోట్లన్నీ దొంగజేబులో ఉన్నాయి. అది నా చిన్నప్పట్నుంచీ మా అమ్మ చేసిన అలవాటు. రద్దీగా ఉన్నచోట దగ్గరున్న డబ్బులు పైకి కనబడకుండా దాచుకోవాలని చెప్పేదావిడ. (అందులోని సత్యం తరువాత తెలిసొచ్చింది. చాలా విలువైన మాటది.) మా టీములో కొంతమంది దొంగవెధవలుండేవాళ్ళు. టాయిలెట్ పేపర్నయినా సరే కొట్టేయడానికి తయారుగా ఉండేవాళ్ళు. నా దొంగజేబులో ఇంకో కాగితం కూడా ఉంది. అది బాంపూఁ రైల్వే పోలీసులిచ్చిన మరణ ధృవీకరణ పత్రం.
మా అమ్మ ఎవరనేది కనుక్కోవడం రైల్వే పోలీసులకి చాలా పెద్ద పనయ్యింది. మొదట వాళ్ళకు ఊరూ పేరూ తెలీని స్త్రీ శవం దొరికింది. తరవాత వాళ్ళకు హంతకుడు దొరికేడు. వాడు 381 నంబరు రైల్లో ఒకావిణ్ణి ఖూనీ చేసినట్టు అంగీకరించాడు. అయితే వాడికి తను చంపినావిడ ఎవరు, ఏమిటనేది తెలీలేదు. ఈలోగా, 381 నంబరు రైలును శుభ్రంచేసిన క్లీనర్లకి ఒక సీటు కింద ఎవరో ప్రయాణీకులు పోగొట్టుకున్న బుట్ట దొరికింది. బుట్టని పోగొట్టుకున్నవాళ్ళని కనుక్కోలేక వాళ్ళు దాన్ని రైల్వే పోలీసులకు అందజేసేరు. పోలీసులు ఆ బుట్ట చనిపోయినావిడది అయ్యుంటుందని నిర్ణయించి దాన్ని వెతికితే అందులో రెండు జతల బట్టలు (దాదాపూ కొత్తవి), డజను బిస్కట్లు, చిన్న సంచీడు బియ్యం, కొన్ని పొట్లాల నూడిల్స్, రెండు పెట్టెల సిగరెట్లూ కనబడినయ్యట. బిస్కట్లూ, నూడిల్సూ షాంగ్‌హాయ్ ఫేక్టరీలలో తయారయ్యుండడాన్ని బట్టి పోలీసులు చనిపోయినావిడ షాంగ్‌హాయ్ నుంచయ్యుంటుందని ఊహించగలిగేరు. పోలీసులకి బుట్టకడుగున వ్రాసున్న పేరు కనబడింది.
వాళ్ళక్కనబడిన పేరు, ష్యూ గూయింగ్. గవర్నమెంటు రికార్డుల్లో మా అమ్మ పేరది. (ఇలా అన్ని వస్తువుల మీదా పేరు వ్రాయడం మా అమ్మ నాకు నేర్పిన ఇంకో అలవాటు. నేను తెల్ల గుర్రపు సరస్సుకు వెళ్ళే ముందు నా వస్తువులన్నిటిమీదా, నా పెట్టెలన్నిటి మీదా నా పేరు రాయించిందావిడ. ఇప్పటికీ నా చొక్కా లోపలిపక్క ‘వాంగ్ బావ్, 1వ టీమ్’ అన్న అక్షరాలు కనబడతాయ్.
నేను షాంగ్‌హాయ్ తిరిగి వెళ్ళినప్పుడు మా నాన్న నాకీ విషయాలన్నీ విపులంగా చెప్పేడు.
మా అమ్మ తెల్లగుర్రపు సరస్సుకు వెళ్ళుండడం వల్ల ఆరోజు మా నాన్న రిక్షా తొక్కడానికి వెళ్ళలేదు. మరి వంట తనే చేసుకోవాలి కదా! తను కుంపటి విసురుకొంటూ జానపద గీతాలు పెద్ద వాల్యూమ్‌తో వింటూండడం వల్ల మూడోసారి తలుపు తట్టేదాకా ఆయనకి వినబడలేదు. మా నాన్న తలుపు తీసేసరికి ఎదురుగా లోకల్ కమిటీ మెంబరు మిసెస్ ల్యూతోపాటూ యూనిఫారంలో ఉన్న ఆఫీసరొకతను కనబడ్డాడు. మొదట నేనే మళ్ళీ ఏదో పీకలమీదకి తెచ్చుకునుంటానని అనుకున్నాడట మా నాన్న.
“ఇతను కామ్రేడ్ గావ్. ఈయన మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతారు,” అన్నది మిసెస్ ల్యూ. మా నాన్న వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి రేడియో నోరు నొక్కేడు.
“మీ భార్య పేరు ష్యూ గూయింగేనా?” కామ్రేడ్ గావ్ ప్రశ్నించేడు.
“అవునండీ.”
“ఆవిడ ఇంట్లోనే ఉన్నదా?”
“లేదండీ. ఊరెళ్ళింది.”
“ఏ ఊరు?”
“తెల్లగుర్రపు సరస్సుకి వెళ్ళిందండీ. మా అబ్బాయిని చూడ్డానికి.”
“ఆవిడ వయసెంతుంటుంది?”
“ఆమె ఎద్దు సంవత్సరంలో[6]According to the Chinese traditional calendar, each year is associated with one of twelve animals — tiger, dragon, snake, rooster, hare, ox, dog, pig, sheep, rat, horse, and monkey. It’s a twelve year cycle with the same animal repeating after every twelve years. పుట్టింది. ఈ ఏడు నలభయ్యేడు నిండుతాయి.”
“ఏ రైలెక్కింది?”
“మధ్యాహ్నం మూడు గంటల బండి.”
“ఏ రోజు?”
“మొన్న.”
“ఆవిడ తనతోపాటు ఏం తీసుకువెళ్ళింది?”
“ఒక బుట్ట.”
“ఆహా!” కామ్రేడ్ గావ్ ఆనందం పట్టలేకపోయాడు. “మీ భార్యను రైల్లో ఎవరో హత్య చేశారు.”
మా నాన్నకి కామ్రేడ్ గావ్‌ని చాచి లెంపకాయ కొట్టాలనిపించిందిట. మా అమ్మ చనిపోతే అతనికెందుకానందమో మా నాన్నకర్థం కాలేదు. నిజానికి, కామ్రేడ్ గావ్ ఆనందమల్లా, తను ఇంకా వెతకాల్సిన పని తప్పినందుకు మాత్రమే. కామ్రేడ్ గావ్ మా నాన్నతో తరువాత అన్నాడట. “షాంగ్‌హాయ్‌లో ఎంతమంది షూ గూయింగ్‌లున్నారో, మీకు తెలుసునా? 288 మంది! వాళ్ళలో ఒక మగవాడు కూడా ఉన్నాడు.[7]It’s a unisex name.”
బాంపూఁ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఆ మగ షూ గూయింగ్‌ని లిస్టులోంచి తీసేయగలిగేరట. తరువాత మరీ పడుచువాళ్ళనీ, మరీ ముసలివాళ్ళనీ తీసేస్తే 127 మంది మిగిలేరట. కామ్రేడ్ గావ్ తలుపు కొట్టిన ఇళ్ళలో మాది 74వ ఇల్లట. కాళ్ళు విరిగినంత పనైందన్నాడు గావ్. “చాలా ఇళ్ళు ఫర్వాలేదు. తలుపు కొడతాం, షూ గూయింగ్ ఇంట్లో ఉందో లేదో అడుగుతాం. తలుపు తీసినావిడ తనే షూ గూయింగ్ అన్నదా? అడగాల్సిందేం లేదు. కానీ కొన్ని ఇళ్ళకు తాళం వేసి ఉంటుంది. ఆ ఇంట్లోని షూ గూయింగ్ పనికెళ్ళిందో, కూరగాయలకెళ్ళిందో, స్నేహితుల ఇళ్ళకెళ్ళిందో ఎలా చెప్తాం? ఇరుగూ పొరుగూ ఇళ్ళలో ఉంటే ఫర్వాలేదు. లేరా? ఆ ఇంటిముందు పడిగాపులు పడ్డమే గతి. ఆ చచ్చిపోయినావిడ దొరికిపోవడం వల్ల ఇక నేను బతికిపోయాను.”
కామ్రేడ్ గావ్‌కి షూ గూయింగ్ అంటే ఒక పేరు మాత్రమే.
వెళ్ళేముందు, ‘ఎందుకన్నా మంచిది. మీరు తెల్లగుర్రపు సరస్సులో వాకబు చేసి మీ భార్య ఆచూకీ కనుక్కోండ’ని మా నాన్నకి సలహా ఇచ్చాడు కామ్రేడ్ గావ్. ‘అదృష్టం బాగుంటే…’ వాక్యం పూర్తిచేయకుండా వెళ్ళేడు. అదృష్టం బాగుండడమంటే మా అమ్మ బ్రతికుండడమో లేక అతగాడికి మళ్ళీ పనిపడకపోవడమో మనం ఊహించుకోవాల్సిందే!
రెండు వారాల తరువాత, పోస్ట్‌మేన్ డెత్ సర్టిఫికేట్ తెచ్చిచ్చేడు. దాన్ని చూసి మా నాన్న సొమ్మసిల్లిపోయాడు. అదృష్టవశాత్తూ, మా పల్లెనుంచి ఏదో పనిమీద షాంగ్‌హాయ్ వచ్చిన మా బాబాయి మా నాన్నని మా ఊరు తీసుకెళ్ళిపోయాడు. మా నాన్న మా పల్లెలో ఆరు నెలలుండిపోవడం వల్ల మా అమ్మ శవాన్ని తీసుకువెళ్ళడానికెవరూ లేకపోయారు. మా నాన్న వెళ్ళగలిగినా, ఆపాటికి మా అమ్మ సమాధి మాత్రమే కనబడుండేది.
షాంగ్‌హాయ్‌లో ఇక 287 మంది ష్యూ గూయింగ్‌లే మిగిలుంటారు. అక్కడ తెల్లగుర్రపు సరస్సులో నాకు అందాల్సిన బుట్ట కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాసినయి.
మా అమ్మ తీసుకువస్తున్న బుట్టకోసం రెప్ప వేయకుండా ఎదురు చూసేన్నేను.
(సశేషం)
అధస్సూచికలు