1. ఇష్టమైన ఇష్టం
ఎన్నో ఇష్టాలు
ఇష్టానికి
నువ్వు, నేను
మనం అనే ఇష్టం మాత్రం
భలే ఇష్టమైంది కదూ
అలా ఎందుకు అని
ప్రశ్నే మొలవని, ఇష్టం
అదే మరి
ఇష్టమైన ఇష్టం అంటే.
2. ఆ మాట
కొన్నిసార్లు
హాయిగా
గాలి స్పర్శలా
సాంత్వన
పలకరించినట్టుగా
సన్నటి ఆ గొంతు
నిన్ను బ్రతికించే
ఆ మాట
వాన జల్లులా
మట్టి వాసనతో
అపురూపమైన
ఎంతో ఇష్టంలో
వెలుగుతున్న దీపంలా
ఇక నువ్వు
3. నిశ్శబ్ద’నిధి’
నేను వంద మాటలు మాట్లాడితే
నువ్వు ఒక్క నవ్వు నవ్వుతావు.
నేను మౌనంగా ఉంటే
కలవరంతో
ఎలా ఉన్నావు, జాగ్రత్త అంటావు.
ఇక, ఆ మాటతో
నేను నదినై గలగలమంటానా
అది చూసి
మళ్ళీ నువ్వు
నిశ్శబ్ద’నిధి’లా నవ్వుతావు.
4. అనుకొని
ముల్లులా గుచ్చుకునే
అడ్డగీత
పగిలిన అద్దం
మౌనంగా
మరణం అబద్ధం కాదని
పువ్వులలోని పరిమళం శాశ్వతం కాదని
మట్టిని ప్రేమగా తాకుతుంటావు కదూ?