విశ్వనాథ సమాధానం

శ్రీ మన్మథ నామ సంవత్సరం ముగియబోతోంది.* శ్రీ విశ్వనాథ నేనడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన ‘సమాధానం’ గురించి మీకు చెబుదామని ఈ మాటలు రాస్తున్నాను. పెద్దవాళ్ళని (కొన్నిరకాల) ప్రశ్నలడగవచ్చునా కూడదా తెలీని, చిన్నా పెద్దా కాని ఆ రోజుల్లో ఒకసారి వారిని వారింట్లో కలిసినప్పుడు నేనడిగిన ఒక ప్రశ్న–వారిని ఆ ప్రశ్న అప్పటికి అనేకులు అనేకరకాలుగా అడిగి ఉంటారు కానీ నేనడిగినప్పుడు–దానికి వారు నాకు చెప్పిన సమాధానంలో నన్ను ఇరికిస్తూ చెప్పిన విధానం విలక్షణమైన వాటిలోకెల్లా విలక్షణమైనది, గూఢాతిగూఢమైనది అని నా భావన.

ప్రశ్న: – జవాబు: అని రాస్తే ఏం బావుంటుంది. అందుకని కొద్దిగా ఉపోద్ఘాతం. తర్వాత ఒక వాక్యంలో నా ప్రశ్న, అంతకన్నా చిన్నవాక్యంలో వారి సమాధానం సరిగ్గా వారు చెప్పినట్టుగా రాస్తాను. ముందే చివరి వాక్యాలు చదివేస్తారా! ఇదిగో – చివర్లో ఉన్న విశ్వనాథవారి మాటలు దయచేసి పైనెలలో ప్రచురించవలసినదిగా సంపాదకులకు విన్నపం చేస్తున్నాను. చద్దికన్నా ఆవకాయ ఎక్కువవచ్చు. నిజానికి, ఈమాటలో వచ్సిన ఏల్చూరి మురళీధరరావుగారి రచన విశ్వనాథ: వివాహాశీస్సులు చదివినప్పుడు రాద్దామనుకున్న విషయమిది. మొట్టమొదటి వాక్యం చదివారు గదా. శ్రీ మన్మథ విశ్వనాథవారు పుట్టిన సంవత్సరం.


కొన్ని సంఘటనల తారీకులు ఏ దస్తావేజు సాయమూ అక్కర లేకుండా గుర్తుండిపోతాయి. ఊహూఁ, మరికొన్ని తలకిందులుగా తపస్సు చేసినా గుర్తుకు రావు. ఈ సంఘటన నాకు-కొంత-రెండవ కోవ లోనిది. కానీ యథార్థమైనది. చిన్నతనమంతా బెజవాడలో అమ్మా నాన్నలతో, అన్నలూ చెల్లెళ్ళతో నాల్గవతరగతి దాకా ఉమ్మడి కుటుంబంలో సరస్వతీ టాకీస్‌కు దగ్గరలో ఇస్లాంపేటలోను, ఆ తర్వాత–ఎస్. ఆర్. ఆర్. కాలేజ్‌లో బి.ఎస్‌సి. అయేదాకా–సత్యనారాయణ పురంలోనూ గడిచింది. సత్యనారాయణ పురంలో మా ఇంటికి తూర్పున మారుతీ నగర్‌లో ‘అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి’ ఒకాయన మధ్యందిన మార్తాండునిలా వెలిగిపోతుండేవాడు. పడమరవైపు మా హైస్కూల్–ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మునిసిపల్ హైస్కూల్‌కు దగ్గరగా లైబ్రరీ వీథిలో మంగళంపల్లి పట్టాభిరామయ్య గారింట్లో ‘నవనవ సుందర విలసిత శశిముఖ కవనాది లలితా కళా పరిపూర్ణు’డొక యువకుడు వెన్నెలల చిరునవ్వులు చిందిస్తుండేవాడు. ఈ సూర్య, సుధాకర లోచనాలతోనే మేం పిల్లలం–నేనూ, నా ఇద్దరన్నలు, ఇద్దరు చెల్లెళ్ళూ యీ లోకాన్ని చూడటం నేర్చుకున్నాం. (ఈ భావనే ఈమాటలో వచ్చిన రామచంద్ర పుత్ర! రామ భద్ర!లో మొదటి పద్యంగా వచ్చింది.)

నాకన్నా అయిదున్నర సంవత్సరాలు పెద్ద అయిన నా పెద్దన్నకు అప్పటికే, అంటే 1962 ప్రాంతాలకు, తెలుగులో పద్యవిద్య పట్టుబడింది. ఆంధ్రదేశంలో నారాయణాచార్యుల వంటి మహాత్ములకు బాగా దగ్గరగా ఉన్నవారిని కాస్త మినహాయిస్తే, ఈమాత్రం ఆమాత్రం తెలుగు పద్యవిద్యలో ప్రవేశం ఉన్నవాళ్ళకి సన్నిధిలోనో, ఏకలవ్యంగానో విశ్వనాథే గురువు. ఇంత అయినా కాలేజీకి రాగానే శ్రీశ్రీ చక్రారాధన అలవడింది. అక్కడ కలిసిన మిత్రుడు జంపెన పెద్దిరాజు, కాలేజీ లిట్-కల్-అసోసియేషన్ సెక్రటరీగా, ఆకాశవాణి యువకవితాపఠన కార్యక్రమానికి, ‘మీరు రాసిన గేయమొకటి చదువుతారా’ అన్నప్పుడు, చదివేముందు జరగాల్సిన పరిశీలనకు ఇచ్చిన గేయం-

సోఫాలో నడుం వాల్చి సోయగాలొలికిస్తూ
విస్కీ సీసాల ముందు విలాసంగా నవ్వుతూ
కరెన్సీతో తెచ్చుకున్న కన్నెపిల్లను కవ్విస్తూ
కళ్ళు మూసుకు తిప్పుతున్నావ్ కాలచక్రాన్ని
మాయ జేసీ మోసం జేసీ
మసితో మారేడు జేసీ
నిశిలో వేషాలు వేసీ
కోట్లకొద్దీ నోట్లకట్టలు
కూడబెట్టీ మేడ గట్టీ
మేడలో మార్మూల గదిలో
నీడలో కలహంసి ఒడిలో
కులుకుతున్నా వెంత ప్రగతి!

పెద్దిరాజును భయపెట్టేసింది: ‘ఇది వద్దు వాసుగారూ, మరొకటి ఇవ్వండి.’ ఆ ఇచ్చిన మరొకటిని కార్యక్రమంలో చదివినప్పుడు అప్పటి విజయవాడ ఆకాశవాణి సాహితీ కార్యక్రమాల సంచాలకులు, కందుకూరి రామభద్రరావుగారు ‘మీ మీద ఠాగూర్ ప్రభావం చాలావుందే’ అనేశారు. ఇక్కడే విశాలాంధ్రకు పంపితే తిరిగి వచ్సిన గేయాన్ని కూడా రాసేయకపోతే ఇంతకన్నా మంచి అవకాశం ఎప్పుడొస్తుంది దాన్ని గురించి చెప్పటానికి? బెజవాడకి, ఎండాకాలానికి, కమ్యూనిస్టులకు, ఎలక్షన్లకూ ఉన్న అవినాభావసౌందర్యాన్ని అర్థం చేసుకోకుండా విశాలాంధ్ర తిరగ్గొట్టేసిన గేయం [1953లో హరీంద్రనాథ చట్టోపాధ్యాయ కమ్యూనిస్టు అభ్యర్థిగా బెజవాడనుంచే పార్లమెంటుకు ఎన్నిక అయ్యాడు.]

ఎండాకాలం వచ్చింది
రోహిణి ఎండలకు రోళ్ళు పగిలిపోతున్నాయి
బావులూ చేరువులూ ఎండి బావురుమంటున్నాయి
గొంతు తడుపుకోవటానికి చుక్కైనా నీళ్ళు లేక
తల్లులూ పిల్లలూ తల్లడిల్లి పోతున్నారు
పగబట్టిన తాచులా పడమర గాలి వీస్తోంది
నల్ల కళ్ళజోడు లేకుండా నడుస్తున్న
మనుషుల కళ్ళల్లో మట్టికొడుతోంది
ఎలక్షన్ల రోజుల్లో ఎర్రని రంగుతో
గోడల మీద రాసిన గొప్పవాళ్ళ మాటలు
ఏమీ తెలియనట్లు ఎటో చూస్తున్నాయి
అన్నట్టు మరిచాను
మన ఊళ్ళో గుళ్ళో
పురాణ కాలక్షేపం పురోహితుల వారు
మొదలుపెట్టి నెల్రోజులు కావస్తోంది
పగలంతా పాలేళ్ళను పాలించిన దొరలు
రాత్రికి దేవుడి గుళ్ళో పోగవుతున్నారు
పురాణం విని పుణ్యం మూట కట్టుకుంటున్నారు.

రోజులు గడుస్తూ ఆంధ్రవిశ్వకళాపరిషత్‌లో ఎం. ఎస్‌సి. ఆఖరి సంవత్సరంలో ఉన్న రోజుల్లో 1969-70ల మధ్యలో శ్రీ వెల్చేరు నారాయణరావు ముందు నిలిచి విశ్వకళాపరిషత్ లోని గాంధీ భవనంలో జరిపించిన శ్రీశ్రీ సన్మానసభలో నేనూ, అప్పటి నా జూనియర్ క్లాస్‌లో ఉన్న -ఇప్పటికీ స్నేహితుడుగా ఉంటున్న- శ్రీ బైరెడ్డి సీతారామిరెడ్డి, స్వీయకవితలు చదివాం. 1971 నాటికి ఆ ధోరణిలోనే అప్పటికి ఇంగ్లీష్‌లో రాయాలనే కోర్కె తీగలు సాగటం మొదలుపెట్టింది.

When I die
nail my coffin smooth
lift it light
beat no drum
chant no hymn
let silence swallowed seconds
witness my burial
from Cyprus treetops
a common man’s death –
a common man’s death
should stir no airy wave
queens kings are in embrace
disturb them not
dig deep the grave
and bury the slave
poets
write no elegies
friends
wish not my soul peace.

అన్నిటినీ ప్రేమ జయిస్తుంది. నాపై నా పెద్దన ప్రేమ విశ్వనాథవారి ఆంధ్రప్రశస్తి, తెలుగు ఋతువులను,

– రాజా వీడు కోదండ బాహా విధ్వస్త దిగంతరాహిత ధరా ప్రాణేశ చూడా మణిగ్రీవా మంజుల హార రత్న రుచిరశ్రీ పాదకంజుం డగున్
– బుట్టలో కూరుచుండ బెట్టిన వధువునా గుమ్మడి పూవులో కులికె నొకటి
– ఘూర్జరీ ముఖలంబి కొస ముత్తియంబునా నాదూడముఖము పైనాడెనొకటి

వంటి చరణాలనూ ఎప్పటికీ మర్చిపోలేనన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చదివేటట్టు చేసింది.

సెలవుల్లో వైజాగ్ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడూ మా పెద్దన్న, విశ్వనాథ వారిని చూద్దాం వస్తావా? అంటూ అప్పటికి రెండు మూడుసార్లు నన్ను తనతో తీసుకువెళ్ళాడు. అందులో ఒకసారి వారికి జ్ఞానపీఠ పురస్కారం వచ్సినప్పుడు. వారు మా ఎదురుగా కుర్చీలో కూర్చుని లోగొంతులో ‘అన్యథా వృత్తి చేతఃగా ఉంది’ అనటం, ‘అర్థమైనదా?’ అన్నట్టు అన్న నావంక చూడటం దూతమేఘంలో మాటగా నాకు తట్టి అన్న వంక చూచి కళ్ళతోనే చెప్పటం గుర్తు వస్తున్నాయి. అంతకు ముందు ఒక తూరి అన్న ఒక పద్యం చదవటం, విశ్వనాథవారు ‘కూర్పు రమణీయంగా ఉంది’ అన్నది విని కొంత గర్వంగా ఆనందించటమూ కూడా. ఈ సందర్భంలో విశ్వనాథవారు అన్నతో ఒకసారి, ‘శర్మా, ఏ పద్యమైనా బాగా రాలేదనుకుంటే దాన్ని చించేసి క్రొత్తది రాసుకో’ అంటూ చేసిన సూచనను గుర్తుకు తెచ్చుకోవటం సమంజసమనుకుంటాను. ఈ తూరి ముందే చెప్పాను గదా, సరిగ్గా తారీఖులు జ్ఞాపకం లేవు గానీ వైజాగ్ నుంచి ఎండాకాలం సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సాయంత్రం అన్నట్టుగా గుర్తు. అప్పటికి నేను ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఒక చిన్నపంతుల్నయినాను. వారు వాలుకుర్చీలో కూర్చుని ఉన్నారు. అన్న వారి చేతిలో పళ్ళు పెట్టి వారి పాదాలకు నమస్కరించటం, నేను అనుసరించటం జరిగాయి. రెండు మూడు నిమిషాలపాటు వారిమధ్య చిన్న సంభాషణ. అనంతరం అసలు కథ.

నేను కొంత ధైర్యంతో గొంతు పెగిలించుకుంటున్నట్టు ఆయన గమనించి, ఏమిటి అన్నట్టు నావంక చూశారు. నేనింక ఉపోద్ఘాతాలు ఏమీ లేకుండా, ‘మీకు ఆధునికతలో ఏ ఒక్క మంచీ కనపడలేదా?’ అని అడిగేశాను. నావంక చురుగ్గా చూస్తూ, నా ప్రశ్నకు వారి సమాధానం: ‘నువ్వు బ్రహ్మవేత్తవే! నీకు నాపిల్లనివ్వను.’ వెనువెంటనే అన్న చిరునవ్వు నవ్వటం, మేము లేచి నిలబడి వారికి మరొకసారి నమస్కరించి ఇంటికి బయలుదేరటం. సూర్యుడు మండిపోతున్నాడు. మేమిద్దరం మా ఇంటివైపు పడమరకు నడుస్తున్నాం. నాకంటిచూపు బలహీనత తెలిసిన అన్న, ‘బుచ్చీ జాగ్రత్త సూర్యుడు కంట్లో పడుతున్నాడు’ అన్నాడు. ‘సూర్యుడంతటివాడు కంట్లోపడతాడు గానీ విశ్వనాథ మాత్రం అంతుపట్టడు.’

*ఈ రచన మొదలుబెట్టిన సంవత్సరం.