మరే పనీ పాటా లేని అతడు లేక ఆమె కూర్చున్న చోటుకు ‘కళ’ అనేది పిల్లిపిల్లలా వచ్చి చేరదు. టాల్‌స్టాయ్, ఆయన కన్నకూతురుగారూ చర్చించుకున్నట్టుగా ‘కళ అంటే అదిరా అబ్బాయ్’ అని రిటైర్డ్ క్లర్క్ సూర్యారావునకు తెలియజెప్పే ముచ్చటే లేదెక్కడానూ. రెండు చెవులకు పని పెట్టినట్టే రెండు కనులకూ తగిన తర్ఫీదు ఇస్తే ఏ చిత్ర కళాఖండమైనా అర్థమవుతుంది… విన్సెంట్ వాన్ హాహ్ (Vincent Van Gogh)తో సహా దేశ విదేశీ కళాకారుల సర్వ సకల భోగట్టా, వారి అంతర్నేత్రపు సంచలనం కూడా వివరంగా తెలిసివస్తాయి. ఇందుకుగాను కళ్ళప్పగించేవారి కోసం పరిశోధక రచయితలు కొందరు సదా కిందమీదవుతుంటారు. అలాగ, ఇందులో తన సహకార వాటాలాగా ఇర్వింగ్ స్టోన్ గట్టి పరిశోధన చేసి విన్సెంట్ జీవనచిత్రాన్ని ‘కళ’గలిపి నవలగా రాసేరు. దీనిని కర్క్ డగ్లస్‌ను పెట్టి సినిమా తీసి చూశారు. తెలిసిందే…
దాదాపు అదేకాలంలో ఈ నవల లస్ట్ ఫర్ లైఫ్‍ను కొంత సంక్షిప్త తెలుగు నవలగా మనం చదివేము. ఇప్పుడు మాత్రం యథాతథంగా ఈ నవలను తెలుగులోకి తెచ్చారు రచయిత పి. మోహన్. నవల పేరు జీవన లాలస. వైనంగా అరకొర లేకుండా స్వీయ రచనవలే చేసేరు ఈ అనువాదాన్ని. విన్సెంట్‌కు, ఇర్వింగ్ స్టోన్‌కు గల ఉన్మత్తస్థాయి ఆవేశం, కృషిలో కొంతపాలు మన రచయితకి లేకపోలేదని అనువాదానికి పూనుకోడంలోనే కనిపిస్తుంది! లాలస కలిసిన కరుణ విన్సెంట్ కథ వలె అనువాద శైలిలోనూ అది వొళ్ళు దాచుకోకుండా కనిపిస్తుంది. ఇది 376 పేజీల పొడవున సత్ఫలించింది.
ఒక మనిషి జీవితాన్ని మొత్తంగా, శుభ్రంగా తినేసి, ఆ థర్మాకోల్ ప్లేట్‌ను విరిచి అవతల పడేసే సమాజం మన చుట్టూ ఉంది. ఇలాంటి సమాజపు ధోరణికి హితవు చెప్పబోవటం సంపూర్ణ దండగమారి పని. ఈ సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాన్ హాహ్ వంటి కళాకారులు సర్వకాలాల్లో సకలదేశాల్లో ఉంటారు. వారంతా విరివిగా హీన దీనావస్థలు పడీ లేచీ ముక్కచెక్కలయితే గాని వారిలోని కళ, కళాకృతులూ నలుగురి కళ్ళబడవు. ఇదీ దుర్గతి. కళ విషయంలో కళాకారుడుగారి అంతర్వేదనకు తగిన సాహసం తోడయితేగానీ తస్సదియ్యా ఏదీ పరిపూర్ణావిష్కారం చచ్చినా కాదు గదా! అదొక మరణావస్థ. అనేక మహనీయ కళాకారుల అత్యున్నత ప్రతిభ వెనక ఈ నేపథ్య సంగీతం లేకపోలేదు. సరిగ్గా ఆ అతీ గతీ లేని ఆ స్థితికి (నవల సందర్భంలో) 18, 19 శతాబ్దాల యూరప్ ఒక ఉదాహరణ. ఆధునిక చరిత్రలో అన్నిరకాల విప్లవాలకు ఆద్యశక్తి, తంత్ర, యంత్ర ప్రయోగశాల ఫ్రాన్స్. నాడు అక్కడ అకాడెమీ సాహిత్య సంగీత చిత్ర శిల్పకళలకు ప్రభుత్వ రంగులు తోడయి తీర్చిదిద్దిన గిరాకీ సదా ఉండేది. దీనికి తగ్గ ప్రచారం నోరు పెట్టుకుని, నోరు చేసుకునీ నిలదొక్కుకున్నది. అట్టి అకాడమీ చిత్కళను వేలెత్తి చూపెట్టి, ప్రశ్నించి అన్యమార్గం ఎంచుకుంటే అందుకు అధోగతి సర్వసిద్ధంగా వుండే రోజులవి. అది పెట్టిన చిచ్చులో కాలినవారిలో రచయితలు గాక చిత్రకారుల్లో విన్సెంట్ వాన్ హాహ్, పాల్ గుగాఁ (Paul Gauguin) వంటి ఇంప్రెషనిస్టులు, పోస్టు ఇంప్రెషనిస్టులు, వీరి ఇష్టులూ ఉన్నారు. గుగాఁ కథ కూడా అచ్చు వాన్ హాహ్ వంటిదే. ఇరువురూ వేరే తెరువులో జీవితాన్ని చేజేతులా పారేసుకున్నవారే. ప్రధాన కారణం ఆధునిక కళావివేచన. ఆధునికత అంటే కొందరికి గుండెలో దీపం. కొందరికి కడుపులో మంట! అందుకే, అక్కడే కొందరు కళాకారులు దారితోచక దరిద్ర దేవత పంచన చేరేవారు. తతిమ్మా సమాజానికి నాడు నవకళా విలోకనం లేదు మరి. అది మనగలిగిందీ లేదు. సుఖాన వున్న ప్రాణాన్ని దిగుడుబావిలోకి పారేసుకోడానికి విన్సెంట్‌కీ ఇష్టం లేదు. కానీ కంటి నిండా నూతన కళాప్రయోగం పోటెత్తుతోంటే అతడికి చెయ్యగలిగిన వేరు తీరెక్కడిదీ? ఇదంతా ఈ నవల నిండా పరచుకున్న వైనం వాస్తవం.
చిత్రకళ మేరకు రంగులు, వాటిని వాడే పద్ధతి, బయటి ప్రకృతి, తన అంతరంగావలోకనం మొత్తం కేన్వాస్ నిండా మేళవించేందుకు విన్సెంట్ యంత్రంలా పనిచేశాడు-యాంత్రికంగా కాదు. కాన్వాస్ దుమ్ము దులిపి, దుక్కిదున్ని రంగులు పండించిన పంటలో అతడు ఒక్క గింజకు నోచుకోలేదు. ఇది చాలదన్నట్టు అతని సొంత తమ్ముడు కూడా చేదోడువాదోడుగా వున్నందుకు మట్టిగొట్టుకుపోయాడు! ఇద్దరూ ప్రేమలకు, బంధువులకు, సన్మిత్రులకూ చెడ్డారు. ఆవేశపు ఆకలికి, ఆకలి మిగిల్చిన అధ్యయనం దెబ్బకి తోడుగా ఎండవాతనుబడి, తల దిమ్మెక్కి, దేహం నలిగి దరిద్రగొట్టు ఊరి చివర ఆత్మాహుతి చేసుకున్నాడు విన్సెంట్.
దరిద్రాన్ని నిర్లక్ష్యం చేయగల జిజ్ఞాస, సాధనాసక్తి, కొత్త చూపు ఇచ్చే రంగుల అడవిపాలవటం ఎవరికి మాత్రం నప్పుతుంది?! విన్సెంట్ కళ్ళనిండా కారుచిచ్చు లాంటి రంగుల వెలుగు కోసం పరితపించడం అతని తప్పు కాదు. దానిని గుర్తించి, చేయందించలేకపోవటం (పరిపక్వంగాని) సాటి మనుషుల బాధ్యతారహిత్యమే. చివరికి దేనికి పరితపించాడో దానిని సాధించి మరీ తనను చంపుకున్నాడు.
నవల చదివేవారికి చిత్రకళ, చరిత్ర, రంగుల లోతుపాతులు తెలియకపోతే ఏమీ అర్థం కాదన్న సంశయం, కళాకారుడి కళామయ జీవితం దేనికన్న సంశయం కంటే, ఒక ఆర్టిస్టుకి కళ పట్ల, జీవితం పట్ల గల అగాధపు లాలస గుండె నిండిపోయేలా కనిపిస్తుంది. గొంగళిపురుగేదో తానే అయినట్టు లాలసపు గూటితో కట్టుకున్న అతడి జీవన వైరుధ్యాన్ని ప్రతి సెంటీమీటరు తాకి, స్పందించగల నిర్మాణం ఈ నవలలో ఉంది.
అక్కడక్కడ సంస్కృత పద విన్యాసాలు, కొన్ని పదాలకు ఏర్పడ్డ అనువాద సమస్య వంటివి పాఠకుడికి ఎదురయినా ఫరవాలేదనిపించే నడక సాఫీగా ఉంది.
మొత్తమ్మీద రచయిత తన బుర్ర అలిసేలాగ మనసుపెట్టి చేసిన శ్రమ సంగతి ఇట్టే తెలుస్తుంది. కథ, దృశ్యాలు, ప్రాంతాలూ అర్థమయ్యేట్టు నలుపు తెలుపు చిత్రాలు, ఫోటోలు, మేప్‌లు గాక మంచి రంగుల పేజీలు కూడా చేర్చి ఆర్థిక శ్రమకు ఓర్చి తయారయిన పుస్తకం ఇది. అంచక్కగా ఉంది.
అడుక్కుతినే స్థితిలోనయినా అవధుల్లేని జిజ్ఞాస, లాలస ఇచ్చే ఫలితం రుచి చూపెట్టే ఈ అనువాద నవల ఇప్పుడు అత్యవసరం అనిపించింది. చదువుతోంటే యూరప్ దేశాల ఆక్వర్డ్ క్లాస్ ముఖారవిందంలో మహనీయులయిన నాటి రచయితల రచనల సారం కూడా కనిపిస్తుంది గనుక ఈ నవల పట్టువట్టి చదవడం మంచిది. థాంక్యూ పి. మోహనా!
జీవన లాలస (ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వ్యాంగో జీవిత నవల)
రచయిత: ఇర్వింగ్ స్టోన్
అనువాదం: పి. మోహన్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు,
రచయిత(అనువాదకుని) వద్ద: 99490 52916.