మనం మరిచిన మాణిక్యం

చెట్ల గుబురులో దాగినా ఆ భవనం వద్దకు దుమ్ము రేగే అడ్డదోవ దారి తీస్తుంది. భవనం గోడలపై తాతలనాడు వేసిన సున్నం పెచ్చులు ఊడిపోతోంది. ఒక ఊరకుక్క భవనం ముందు కాపలా కాస్తున్నట్లు నిలిచి కనిపించింది. ఆ భవనమే రాజమండ్రి లోని దామెర్ల రామారావు స్మారక కళాకేంద్రమ్. కళలకు ఆలయంగా విలసిల్లవలసిన ఈ భవనం నేడు గోరీల దొడ్డిలా కనిపిస్తోంది.

భవనం లోపల నియాన్ లైటు వెలుగుతున్న గుహలాంటి గదిలో దామెర్ల రామారావు సృష్టించిన అపురూప కళాఖండాలు ఉన్నాయి. 1925లో ఈ సుప్రసిద్ధ కళాకారుడు 28 ఏళ్ళ చిరుప్రాయంలోనే మశూచికంతో మరణించారు. ఆధునిక భారతీయ చిత్రకళ ఆద్యులలో దామెర్ల కూడా ఒకరు. ఆయన రాజా రవివర్మ వంటి చిత్రకారుల కోవకు చెందుతారని కళారంగ చరిత్రకారులు పేర్కొంటారు. రామారావు చిత్రాలు, ఆయన కుంచె గీతలు సుప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షెర్-గిల్ బాణీలో ఉంటాయని సుకాంతో బసు వంటి పండితులు ప్రశంసిస్తారు. బెంగాల్‌లో రవీంద్రనాథ ఠాగూర్, కర్నాటకలో వెంకటప్ప, మద్రాసులో రాయ్ చౌధరి, కేరళలో రవివర్మ లానే ఆంధ్ర చిత్రకళా పునరుజ్జీవనంలో దామెర్ల రామారావు కీలకపాత్ర వహించారని కళారంగంలో ప్రసిద్ధ రచయిత ఎ. ఎస్. రామన్ వివరించారు.

అయినప్పటికీ, దామెర్ల రామారావు స్మారక కళాకేంద్రం ఇప్పుడెవరినీ ఆకర్షించడం లేదు. ఈ కళాకేంద్రంలో ప్రస్తుతం ప్రేతకళ మాత్రమే తాండవిస్తోంది. చనిపోవడానికి ఒక్క ఏడాది ముందు రామారావు ప్రారంభించిన ఈ ఆర్ట్‌ స్కూలులో ఇప్పుడు మచ్చుకు ఒక్క విద్యార్థి కూడా లేడు. రంగులు కలపడానికి ఉపయోగించే ఫలకాలుఎనిమిదేళ్ళ క్రితమే మూలబడిపోయాయి. కళలపై, ముఖ్యంగా చిత్రకళపై సేకరించిన అరుదైన పుస్తకాలు చెదలు పట్టిపోతున్నాయి.

ఇక పక్కనే ఉన్నా పాతభవనం లోని రామారావు అమూల్య చిత్రాలు జీర్ణావస్థలో ఉన్నాయి. దశాబ్దాల నిర్లక్ష్యం ఫలమిది. రామారావు 34 తైలవర్ణ చిత్రాలను, 129 వాటర్‌కలర్ చిత్రాలను, 26 స్కెచ్ పుస్తకాలను మనకు వారసత్వంగా మిగిల్చి వెళ్ళారు. ఇవి గాక, విడిగా కాగితాలు, కాన్వాసులపై వేసిన చిత్రాలు అనేకం ఉన్నాయి. వీటిలో చాలాభాగం అంతరించిపోతున్నాయి. ఆయిల్ పెయింటింగులపై ఏళ్ళతరబడి నుంచి దుమ్ము పేరుకొంటున్నది. పెయింటు, కాగితం వేటికవి ఊడిపోతున్నాయి. చాలా స్కెచ్‌ల పైన, వాటర్‌కలర్ చిత్రాల పైన నీళ్ళ మరకలు కనిపిస్తున్నాయి.

దామెర్ల రామారావును నవీన ప్రపంచం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకొంటున్నందున, ఆయన కళాఖండాలలో కొన్నింటినైనా కాపాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ మ్యూజియం ప్రధాన పునరుద్ధరణ నిపుణుడిగా పని చేసిన సుకాంతో బసు ఇటీవల రాజమండ్రి సందర్శించి రామారావు చిత్రాలకు ఇంతవరకూ జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ చిత్రాలకు త్వరగా మరమ్మత్తు చేసి పునరుద్ధరించవలసి ఉందని బసు భావిస్తున్నారు. ‘నందలాల్ బోస్, షెర్‌గిల్‌ల శైలి, ప్రతిభలు రామారావులో మేళవించాయి. ఇంతటి మహాచిత్రకారుడి కళాఖండాలు నిర్లక్ష్యం వల్ల నశించిపోనుండడం దయనీయం’ అని బసు అన్నారు.


దామెర్ల రామారావు చిన్నతనంలోనే మరణించినా, అంత పిన్నవయసులో కూడా కీర్తిశిఖరాలను అధిరోహించారు. బొంబాయి జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక మేయో బహుమతిని, కలకత్తా ఆర్ట్ సొసైటీ కళాప్రదర్శనలో వైస్‌రాయ్ బహుమతినీ ఆయన పొందారు. రామారావు గీసిన ‘తూర్పు కనుమల్లో గోదావరి; అనే ప్రకృతి చిత్రపటాన్ని లార్డ్ రీడింగ్ కొన్నారు. విదేశాల నుంచి కూడా రామారావుపై ప్రశంసల జల్లు కురిసింది. 1920వ దశాబ్దం ఆరంభంలో రెంబ్లేలో జరిగిన ఎంపైర్ ఎగ్జిబిషన్‌లో దామెర్ల రామారావు కాన్వాస్ చిత్రాలను కళాప్రియులంతా శ్లాఘించారు. వెంబ్లే ప్రదర్శనకు రామారావు కాన్వాసులలో మూడు ఎంపిక కాగా, శాంతి నికేతన్ నుంచి ఒకే ఒక్క కాన్వాస్ మాత్రమే ప్రదర్శనలో పాల్గొనడానికి అర్హత సంపాదించగలిగిందని రామారావు సోదరుడు 82యేళ్ళ ప్రమోద్‌చంద్‌రావు చెప్పారు. రామారావు గురువు అప్పట్లో రాజమండ్రి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపాల్ అయిన ఒ. జె. కూల్డ్రే తన శిష్యుడు అసాధారణ మేధావి అని ప్రస్తుతించేవారు.

దామెర్ల రామారావు జీవితకాలంలోనే ఇంతటి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో రామారావును ఎరిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరకొర జ్ఞాపకాలే మిగిలాయి. ఆంధ్రదేశ వీరగణంలో అస్పష్టమూర్తిగానే రామారావు నిలిచారు. జాతీయ ఆధునిక చిత్రకళ గ్యాలరీలో దామెర్ల చిత్రాలు మచ్చుకు ఒక్కటైనా కనిపించవు.

బహుశా దామెర్ల అరమరికలు లేని కాల్పనికుడు కావడం వల్లనేమో కళాజగతి స్మృతిపథం నుంచి ఆయన ముద్ర చెరిగిపోయింది. రసికత ఉట్టిపడే దర్బారు దృశ్యాలు, బావి దగ్గరనో, నీళ్ళకుండ భుజానికెత్తుకునో ఒయ్యారంగా నడిచివచ్చే సుకుమార సుందరీమణులు, లలిత శృంగార దేవతలు, బిస్కెట్ డబ్బాలపై అగుపించే హృద్యమైన దృశ్యాలను తలపింపజేస్తాయి. రామారావు సృజియించినా ఈ సుందరీమణులు భువికి దిగివచ్చిన అప్సరసలలా కనిపిస్తారు. అజంతా చిత్రసుందరుల కనుబొమలు, ఒంపుసొంపులు తిరిగిన సొగసైన శరీరాలు రామారావు చిత్రాలలోని సుందరాంగుల సొత్తు.

బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో రామారావు చిత్రాలు కూడా ఒక భాగం లాంటివని భారతీయ కళాచరిత్రకారులు భావిస్తుంటారు. వీరి దృష్టిలో బెంగాల్ పునరుజ్జీవన ఉద్యమానికి అంత ప్రాముఖ్యం లేదు. పారిస్‌లో పెల్లుబికిన ఆధునిక కళోద్యమంలా ప్రశ్నించే ధోరణి కాని, అలజడి రేకెత్తించే స్వభావం కానీ రామారావు చిత్రాల్లో కనిపించదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బొంబాయి, ఢిల్లీలలో అవతరించిన ప్రోగ్రెసివ్ ఆర్ట్ గ్రూప్ తన ప్రగతివాద దృక్పథంతో మిగతా చిత్రకారులను, చిత్రకళారీతులనూ పక్కకు నెట్టేసింది.

రామారావు చిత్రకళాప్రపంచం తనకు తాను విధించుకున్న పరిమితులను దాటి బయటకు రాలేకపోవడం వల్ల కూడా ఆ చిత్రాలు మరుగునపడి పోవడానికి ఓ కారణమై ఉండవచ్చు. ‘ఆయన పల్లెలకు, పట్టణాలకు, రాజమండ్రికే అంటిపెట్టుకుపోయారు’ అని రామారావు గురించి ప్రసిద్ధ చిత్రకారుడు రెడ్డెప్ప నాయుడు వ్యాఖ్యానించారు.

ఆంధ్ర చిత్రకళ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తేవడానికి కట్టుబడిన అనేకమంది చిత్రకారులకు దామెర్ల ప్రేరణగా నిలిచారు. మనోహరమైన ఆంధ్రదేశ ప్రకృతి దృశ్యాలు, అక్కడ ప్రస్ఫుటంగా కనిపించే ఎరుపు, గోధుమవన్నె నేలలు, గుట్టలు, ఆంధ్రుల సంప్రదాయాలు, దుస్తులు – ఇవన్నీ రామారావు చిత్రాల్లోను, ఆ తరువాతి తరం చిత్రకారుల లోనూ సజీవంగా సాక్షాత్కరిస్తాయి.

రాజమండ్రిలో దామెర్ల గృహం చిత్రకళాపాఠశాలగా మారిపోయింది. రామారావు మరణించాక ఆయన శిష్యుడు, మిత్రుడు వరదా వెంకటరత్నం, చేమకూరు సత్యనారాయణ ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. రామారావు వదలివెళ్ళిన కుంచెలతో ఆయన అసంపూర్ణ చిత్రపటాలను పూర్తిచేసిన చెల్లెలు బుచ్చి కృష్ణమ్మ కూడా ఆయన కళావారసత్వాన్ని కాపాడారు. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్ళు.

రామారావు జీవితంలో అనుక్షణం కళ కోసమే బతికారని చెప్పడం అతిశయోక్తి కాదు. కళ కోసం ఆయన సంఘం కట్టుబాట్లను కూడా లేక్క చేయలేదు. సనాతన సంప్రదాయాలకు ఆటపట్టు అయిన రాజమండ్రిలో ఈ శతాబ్దం తొలినాళ్ళలోనే ఒక స్థానిక మహిళ రామారావు చిత్రాలకు మోడల్‌గా, నగ్నంగా నిలిచింది. ఇది సంచలనాత్మకమని చెప్పక తప్పదు. నగ్న సుందరీమణులను ముందుభాగం నుంచి చిత్రించిన మొట్టమొదటి ఆధునిక భారతీయ చిత్రకారుల శ్రేణిలో రామారావు ఒకరు. స్త్రీ శరీరస్వరూపాన్ని కచ్చితంగా చిత్రించడానికి వీలుగా ఆయన నకుళ అనే మహిళను మోడల్‌గా నిలవడానికి ఒప్పించారు. ఆమె పట్టణంలో సోడాలు అమ్మే ఒక వ్యక్తి ప్రియురాలు అని రామారావు సోదరుడు ప్రమోద్ వివరించారు.

ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి రామారావు కుటుంబం ప్రయత్నించినా, గోదావరి తీరాన త్వరలోనే గగ్గోలు పుట్టింది. ‘ఆయన మొగతనం పైనా సందేహాలు వ్యక్తం చేసేవారు తయారయ్యారు’ అని రామారావు భార్య సత్యవాణి గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 82 ఏళ్ళ వయసులో సత్యవాణి హైదరాబాద్ శివారులో నివసిస్తున్నారు. ‘ఆడదాన్ని దిగంబరంగా చిత్రించడానికి తప్ప ఆయన మరెందుకూ పనికిరారని కూడా అన్నారు. కానీ అవన్నీ అసత్యాలే అని వేరే చెప్పాలా? మాకు ఓ కుమారుడు కలిగాడు. కానీ దురదృష్టవశాత్తూ పదినెలల వయసులోనే వాడు చనిపోయాడు’ అని శ్రీమతి సత్యవాణి చెప్పారు.

రామారావు మోడల్‌గా తీసుకున్న మరో వ్యక్తి జీవితాన్ని కూడా ‘కళ’ చిత్రమైన మలుపు తిప్పింది. కండలు తిరిగిన దేహంతో వెంకన్న, రామారావు చిత్రాలలో కుంచెగీతలకు ఊపిరి పోశాడు. రామారావు చెల్లెలి చిత్రాలకు కూడా అతడు మోడల్‌గా నిలిచాడు. వెంకన్నను కూడా జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కు పంపారు.

వాటర్ కలర్స్‌లో చిత్రించిన రామారావు నగ్నసుందరీమణులలో లాలిత్యం, చిత్రమైన వెలుగు కనిపిస్తాయి. రామారావు కుంచె గీతల్లో ఈ సుందరాంగుల సొగసు, శృంగారం ఉదాత్తత నలవర్చుకున్నాయి. రామారావు యూరోపియన చిత్రకళాబ్రహ్మల కళాఖండాలను అధ్యయనం చేసిన మాట నిజమే. కానీ రూబెన్స్ చిత్రాల్లో బొద్దుగా కనిపించే ముద్దుగుమ్మలకు, రామారావు చిత్రాల్లోని సుందరాంగులకు పోలికే ఉండదు. దామెర్ల చిత్రాలలో సౌందర్యం అమూర్తంగా ఉంటుంది. ఆయన చిత్రాలలో ‘బావి వద్ద కథియవాడ్ వనితలు’ అనేది సుప్రసిద్ధమైనది. ఆ వనితలందరికీ ఒకేలాంటి ముఖమే ఉంటుంది. అదీ ఆయన భార్య ముఖమే.


దామెర్ల రామారావు భార్య సత్యవాణి వదనంలో మునుపటి సౌందర్యపు జాడలు ఇప్పటికీ కనిపిస్తాయి. తన భర్త చిత్రాలకు తానే ప్రేరణగా నిలిచిన సంగతి నిజమేనని ఆమె తెలిపారు. ‘నేను గనక తోడు లేకుంటే కుంచె తిరగదని ఆయన నాతో అంటూ ఉండేవారు’ అని ఆమె చెప్పారు.

రామారావుకు చిన్నతనం నుంచే చిత్రకళంటే మక్కువ ఏర్పడింది. ‘బాగా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటినుంచే అతను ఎప్పుడూ బొమ్మలు గీస్తుండేవాడు’ అని సోదరుడు ప్రమోద్ చెప్పారు. ‘ఎనిమిదవ తరగతి తర్వాత అతడు చదువులో వెనకబడి పోయాడు.’ అదృష్టవశాత్తూ రామారావు పెద్దన్న, కాలేజీ లెక్చరర్ దామెర్ల వెంకటరావు, అతను 14ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు రాజమండ్రి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌ ప్రిన్సిపాల్ కూల్డ్రే వద్దకు తీసుకువెళ్ళారు. అంతే. కూల్డ్రే రామారావు లోని ప్రతిభను గుర్తించి, ఎంతో శ్రద్ధాసక్తులతో అతనికి చిత్రకళను రంగరించి పోశారు. రామారావును కూల్డ్రే అజంతా, ఎల్లోరాలకు తీసుకువెళ్ళారు. తర్వాత రామారావు తండ్రిని ఒప్పించి, ఆ బాలుడిని బొంబాయి జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌కు పంపారు.

రామారావు మరణం తర్వాత ఆయన శిష్యులు వారసత్వాన్ని కొనసాగించారు. కొన్నేళ్ళపాటు పూర్వ ఉత్సాహంతోనే ఆర్ట్ స్కూల్‌ను నడిపారు. కానీ రామారావు కుటుంబం ఆయన చిత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన తరువాత, క్రమంగా ఆర్ట్ గ్యాలరీ చుక్కాని లేని నావలా తయారయింది. ప్రస్తుతం ఈ ఆర్ట్ గ్యాలరీ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం ఏటా మూడువేల రూపాయలు కేటాయిస్తోంది. పాలనా బాధ్యతలను సమీపం లోని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అప్పగించింది. భవనం దగ్గర కాపలా ఉంటున్న వీరభద్ర మాత్రం, రామారావు చిత్రాలను పంచప్రాణాలుగా చూసుకొంటున్నారు. కళపై మక్కువ కన్న, ఆడిన మాట నిలబెట్టుకోవాలన్న దృఢసంకల్పమే వీరభద్రునికి ప్రేరణగా నిలుస్తున్నట్లుంది. రామారావు సోదరుడు దామెర్ల రాజారావుకు మరణకాలంలో తాను ఇచ్చిన మాట వీరభద్రునికి ఇంకా గుర్తుంది.

వీరభద్రుడే లేకుంటే రామారావు చిత్రాలు ఇంకా అధ్వాన్న స్థితిలోకి దిగజారిపోయి ఉండేవని సుకాంతో బసు చెప్పారు. వీరభద్రుని భారంలో రాష్ట్రప్రభుత్వం భాగం పంచుకోవలసిన తరుణం ఆసన్నమైంది.

(ప్రథమ ప్రచురణ: నవంబర్ 6, 1990. ఇండియా టుడే పత్రిక.)


[గత కొద్ది సంవత్సరాలుగా, ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఆర్ట్ గ్యాలరీ పరిస్ఠితి కొంత బాగుపడింది. పాత గ్యాలరీ పక్కనే ఒక కొత్త భవనం నిర్మించి రామారావు చిత్రాలన్నీ అందులో భద్రపరిచారు. పరిసరాలన్నీ శుభ్రం చేయబడ్డాయి. సందర్శకులకు కొద్దిపాటి వసతులు కల్పించబడ్డాయి. ఇప్పటికీ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలోనే ఉన్న గ్యాలరీ పర్యవేక్షణకు శాశ్వత ప్రాతిపదికన కనీసం ఇద్దరు ఉద్యోగులు అవసరం. అతిముఖ్యంగా, శిథిలావస్థలో ఉన్న చిత్రాలను పునరుద్ధరించవలసిన తక్షణావసరానికి ఇంకా మొదటి అడుగు పడలేదు. రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైనా పెద్ద కార్పొరేషన్ వారు ముందుకు వస్తే బాగుంటుందని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ప్రతినిధి లక్కరాజు శేషుకుమారి ఆశిస్తున్నారు.]