మాట శీతకన్నేసింది

కలలోనూ మెలకువలోనూ
మాటలోనూ మౌనంలోనూ
నాందీ వాక్యం కోసం
వెతుక్కుంటూనే ఉన్నా

బైరాగిని, శిష్ట్లానీ
వీరభద్రుణ్ణి, బోదలేర్నీ
రూమీని, వేమోనీ
చదువుతూనే ఉన్నా

ఉదయాన్ని, అస్తమయాన్ని
సముద్రపు అలల్ని, పిచుకల సవ్వళ్ళని
నీటి చలమల దగ్గర పావురాల కువకువల్ని
ఆడుకునే పిల్లల్ని, పొదువుకునే జంటల్ని
చూస్తూనే ఉన్నా

ప్రవాస ప్రవాహంలో
ఒంటరి గంధర్వుల
ఇసుక గడియారం
చప్పుళ్ళు కూడా వింటూనే ఉన్నా

అయినా
పదం కదలడం లేదు
వాక్యం నిలవడం లేదు
ఇసుక తుఫానులో
ఒయాసిస్సు
కానరావడం లేదు

ఈ దిగుడు బావి
పెను వేసవి తాకిడికి
ఒట్టి పోయింది
ఊపిరి తీయడంలోనే
జీవితం సరిపోతోంది
కాలనేమి కలవరపాటులో
మాట శీతకన్నేసింది
కాంతారాంతరాల్లో
పద్యం వెదురు విత్తనమయింది.


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...