మరణ వార్తలని వార్తాపత్రికల్లో ప్రచురించేటప్పుడు చుట్టూ చిక్కని నల్ల బార్డరు వేయడం ఆనవాయితీ. అదెప్పుడు? లోకం కాస్తో కూస్తో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే. యుద్ధసమయాల్లో, ప్రకృతి భీభత్సాల్లో, అల్లర్లలో మనిషి చావుకి ఒక గౌరవం ఉండదు. హోదాలుండవు. దహన సంస్కారాలు ఉండవు. కనీసం వారిని లెక్కపెట్టి అధికార గణాంకాల్లో ఆ మాత్రం ఉనికిని కూడా వారికి మిగలనివ్వరు. ఇలా అసందర్భంగా, అన్యాయంగా, అమానుషంగా, అర్థరహితంగా చనిపోయినవాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళకి సాహిత్యమే కాస్తన్నా మర్యాదనిస్తుంది. తెల్లబట్టలో చుట్టి తాళ్ళు కట్టిన ఆ ‘శరీరా’ల వెనుక మనుషులని, జీవితాలని గుర్తు చేసుకుంటుంది.
ముస్లిమ్ పేషంట్ కొనవూపిరితో ఉంటే కల్మా చదివిన హిందూ డాక్టర్; ఆక్సిజన్ సప్లయర్ ముస్లిమ్ కనుక అత్యవసరమున్నా సిలిండర్ తీసుకువెళ్ళమన్న హిందూ కుటుంబం; మీల్స్ అందించబోతున్న వాలంటరీ అబ్బాయిని ఏ కులస్థులు వండిన వంట ఇది అని అడిగిన హోమ్ ఐసోలేషన్లో ఒంటరిగా ఉన్న పెద్దమనిషి; తనామనా బేధం లేకుండా కులమతాలకతీతంగా రోజుకి వందలాది దహన సంస్కారాలు చేస్తూ, కనీస గౌరవాన్ని చనిపోయినవారికందిస్తున్న యువత, కరోనా రోగ లక్షణాలు కనిపించగానే గదిలో పెట్టి తాళం వేసి మర్నాడు ప్రాణం పోయేవరకూ ఒక పెద్దాయనకి కనీసం తాగడానికి పచ్చిమంచినీళ్ళు కూడా ఇవ్వని కుటుంబ సభ్యులు; వైరస్ వచ్చి ఊపిరాడని వాళ్ళు, వైరస్ అంటుకుంటుందేమోన్న భయాందోళనలతో ఊపిరి తీసుకుంటున్న వాళ్ళు; ‘డబ్బు లేకపోతే బతికే హక్కు లేదా?’ అని రగిలిపోయే గుండెలు, ‘ఇంత డబ్బుండీ, అంత ఖర్చు పెట్టీ మనిషిని దక్కించుకోలేకపోయామే’ అని కుమిలిపోయే మనసులు; ఎలా అయినా బతికి తీరాలన్న మొండిపట్టు; అందరూ పోయి మనమే ఎందుకు మిగిలున్నామనే సర్వయివల్ గిల్ట్… ఈ గండం గట్టెక్కగానే మర్చిపోయే సంగతులు కావివి. #sabYaadRakhaJaayega (అన్నీ గుర్తుపెట్టుకుంటాం) అన్నది ఒక పొలిటికల్ స్లోగన్ మాత్రమే కాదు. బతికి బట్టకట్టిన ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అది. ఆ బాధ్యతని మోయాల్సినవాళ్ళల్లో ప్రప్రథమంగా ఉండాల్సింది కవులు, రచయితలు, కళాకారులూ. చిన్న వెలుగుని కూడా చూడనలేంతగా కళ్ళు చీకటికి అలవాటు పడిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ కళ్ళు తెరవమని గుర్తు చేసి, గుండె రాయి అయిపోయి శోకమంతా గొంతులో అటకాయించినప్పుడు కరిగించి కన్నీరుగా మార్చి, కన్నీటి ఉప్పెనలో కొట్టుకుపోతున్న జీవానికి ఆసరా ఇవ్వగలిగినవారిలో సాహిత్యకారులు ఒకరు! – పూర్ణిమ తమ్మిరెడ్డి.