కేతన ఆంధ్ర భాషాభూషణము-5

సమాసం

రెండు స్వతంత్ర పదాంశాలను కలిపి రూపొందే కొత్త పదాలను ప్రాచీన భారతీయులు ‘సమాసాలు’ అనగా, భాషా శాస్త్రంలో వాటిని Compounds అన్నారు. రెండిటి మధ్య కాస్త భేదం ఉన్నప్పటికీ వీటిని ఇంచుమించు సమానార్థకాలుగానే వాడుతున్నాం. తెలుగులో ఈ సమాసాలకు సంబంధించిన అవగాహనంతా సంస్కృతం నుండి తెచ్చుకున్నదే. అందువల్ల పాఠశాల స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకూ సమాసాల కన్నా వాటి సాంకేతికపదాల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూండటం గమనార్హం. ఎందుకంటే సమాస నిర్వచనమే చిన్నయసూరి బాలవ్యాకరణం నుండి తీసి “సమర్థంబులగు పదంబులేక పదంబులగుట సమాసంబు” (సమాస-1) అని పాఠ్య పుస్తకాలలో పెడుతూ వస్తున్నారు. కానీ కేతన ఇచ్చిన నిర్వచనం చిన్నయసూరి పై నిర్వచనం కన్నా సులభంగా అర్థమవుతూందన్నది ఎవరైనా నిర్వివాదంగా అంగీకరించాల్సిందే. చూడండి:

వ.
అనంతరంబ సమాసంబు లెఱింగించెద మొదలిపదంబు విభక్తులఁ బుచ్చి మీఁదిపదంబుల తోడ సమ్యక్సంసక్తంబు లగుటం జేసి సమాసంబులయ్యె నవి పూర్వ పదార్థ ప్రధానంబును నుత్తర పదార్థ ప్రధానంబును నన్యపదార్థ ప్రధానంబును నుభయపదార్థ ప్రధానంబును ననం జతుర్విధంబులై వర్తిలు నందుఁ బూర్వపదార్థ ప్రధానం బెట్టి దనిన. 109

అనంతరంబ= పిమ్మట; సమాసంబులు = రెండు పదాల కలయికతో ఏర్పడే పదబంధాలైన సమాసాలను; ఎఱింగించెద = చెప్తాను/ తెలియజేస్తాను. మొదలిపదంబు = మొదటి మాట (యొక్క); విభక్తులన్ పుచ్చి = విభక్తి ప్రత్యయాలను తొలగించి; మీది పదంబులతోడ = రెండవ పక్కనున్న మాటలతో; సమ్యక్ సంసక్తంబులు = చక్కగా కలపటం (జతపరచటం); అగుటం చేసి = చేయడం వల్ల; సమాసంబులు అయ్యె =’సమాసాలు’ అని పేరొచ్చింది; అవి = ఈ సమాసాలు; పూర్వ పద అర్థ ప్రధానంబును = మొదటి మాటకు అర్థ వివరణలో ప్రాధాన్యం ఉండేవి అనీ; ఉత్తర పద అర్థ ప్రధానంబును = రెండవ/ తరువాత మాటకు ప్రాధాన్యం ప్రాముఖ్యం ఉండేవనీ; అన్యపద అర్థ ప్రధానంబును = (సమాసంలోని) రెండు పదాల అర్థాలలో ఏ ఒక్కదానికీ చెందక మరో ఇతర అర్థానికి ప్రాముఖ్యం కలిగి ఉండేవనీ; ఉభయపద అర్థ ప్రధానంబును= రెండు మాటలకూ కూడా సమానమైన అర్థ ప్రాధాన్యం కలిగి ఉండేవనీ; అను = అనే విధంగా; చతుర్ విధంబులై = నాలుగు విధాలుగా; వర్తిలున్ = ఉంటాయి; అందు = వాటిలో; పూర్వపద అర్థ ప్రధానంబు = మొదటి పదానికి అర్థంలో ప్రాముఖ్యం (ఉండే విధం); ఎట్టిది అనిన = ఏ విధంగా ఉంటుంది అని (అడిగితే) చెప్పుకోవాలంటే;

“తర్వాత సమాసాలు తెలియజేస్తాను. మొదటి పదం పైన ఉండే విభక్తి ప్రత్యయాలను తొలగించి రెండవ పదంతో చక్కగా కలిపితే (జోడిస్తే) అది సమాసం అవుతుంది. ఈ సమాసాలు ‘పూర్వ పదార్థ ప్రధానం’ కలవి అనీ; ‘ఉత్తర పదార్థ ప్రధానం’ కలవి అనీ ‘అన్య పదార్థ ప్రధానం’ కలవి అనీ ‘ఉభయ పదార్థ ప్రభావం’ కలవి అనీ నాలుగు రకాలు: వాటిలో పూర్వ పదార్థ ప్రధానం కలవి ఎలా ఉంటాయంటే”.

మొదటి పదం పైన ఉండే విభక్తి ప్రత్యయాలను తొలగించి రెండవ పదంతో చక్కగా కలిపితే అది సమాసం అవుతుంది. ఇది కేతన సమాసానికి ఇచ్చిన చక్కటి నిర్వచనం. ఆ తీసివేసిన విభక్తులేమిటో చెప్పేదే ‘విగ్రహవాక్యం’. అందువల్లనే కేతన విభక్తులు చెప్పిన తర్వాత సమాసాలు చెప్పాడు. నిజానికి ఈ విధానం వల్ల సమాసాలు అర్థం చేసుకోవడం తేలికవుతుంది కూడా. ఈ సమాసాలకు ఆధునిక పాఠ్య గ్రంథాల్లో ఆరు పేర్లున్నాయి. అవి: (i) అవ్యయీభావ; (ii) తత్పురుష; (iii) కర్మధారయ; (iv) ద్విగువు; (v) ద్వంద్వ; (vi) బహువ్రీహి. మళ్ళీ వీటిలో తత్పురుష, కర్మధారయలలో, (ద్వంద్వ లోకూడా) రకాలున్నాయి. దీనివల్ల కూడా విద్యార్థులు ఇవన్నీ అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోవడం కష్టం అని భావిస్తారు. (ముఖ్యంగా కర్మధారయ, తత్పురుష విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువ అని తెలుస్తుంది).

అయితే కేతన ఈ పేర్లేవీ వాడలేదు. కానీ ఆయన ఈ వ్యాకరణం మొదట్లో తానే చెప్పిన “ఆఱు సమాసములు” (పద్యం 18) అన్న లెక్కను మరిచిపోయి “అవి… చతుర్విధంబులై వర్తిల్లు (5.110) అని చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ విషయాన్ని హరిశివకుమార్ గానీ, సూరయ్య గానీ ప్రస్తావించనేలేదు. దీన్ని బట్టి బహుశా కేతన మొదట్లో అనుకున్న ప్రణాళిక ఒక విధం అనీ, కానీ ఆచరణలో అది మరో విధంగా మారిందనీ, సమాసాల గురించిన వివరణ రాసే కాలానికి ఆయన ఆరుపేర్లతో సమాసాలను వివరించడం ఇష్టపడక, వాటిని కేవలం అర్థం ప్రాధాన్యంగానే వివరించాలను కున్నారని భావించాలి. ఈ చివర అంశాన్ని మాత్రం హరిశివకుమార్ సరిగ్గానే గ్రహించి తన సిద్ధాంత గ్రంథంలో ప్రస్తావించారు. ఏమైనప్పటికీ కేతన ఆరు సమాసాలు కాకుండా నాలుగుగా మాత్రమే అర్థాన్ని బట్టి సమాసాలను వర్గీకరించారు. అవి పూర్వ, ఉత్తర, అన్య, ఉభయ పద అర్థాలలో ఏదో ఒక అర్థానికి సంబంధించినవై ఏర్పడుతాయని. ఆయన చెప్పిన దాంట్లో విభేదించాల్సింది మాత్రం ఏమీ లేదనే చెప్పవచ్చు.

ఇక్కడ ఇంకో విషయం కూడా గ్రహించాలి. అన్ని రకాల సమాసాలలోనూ మొదలి పదం చివర విభక్తి ప్రత్యయం ఉంటుందని కేతన చెప్పింది కూడా సరియైనది కాదని.

అన్ని సమాసాల విగ్రహ వాక్యాలలోనూ విభక్తులు రావు. తత్పురుషలో వలె కాక కర్మధారయలో ‘అయిన’ అనేది ఎక్కువగా విగ్రహ వాక్యంలో వస్తుంది. ఈ ‘అయిన’ ‘వంటి’ విశేషణానికి చెందినదేకానీ విభక్తికి చెందినది కాదు. ఉదా: నల్లకలువ అంటే ‘నల్లనైన కలువ’; కరకమలము – అంటే ‘కమలం (తామరపువ్వు) వంటి చేయి’ అనీ విగ్రహవాక్యాలు. వీటిలో కూడా ప్రథమావిభక్తి ఉంది కదా అని ఎవరైనా వాదిస్తే మాత్రం బహుశ: కేతన నిర్వచనం సరియైనదిగానే మనం భావించవచ్చు. చిన్నయసూరి ఈ కారణం వల్లనే తన నిర్వచనాన్ని మార్చుకొని ఉండవచ్చు.

ఒకటి మాత్రం స్పష్టం: కేతన మొదటి అధ్యాయంలో అనుకున్న ప్రణాళికకూ తరువాత రూపొందించిన వ్యాకరణానికీ మధ్య తేడా ఏర్పడిందని; ఈ తేడాను ఆయన కూడా గుర్తించాడో లేదో? లేదా ఈ గ్రంథం అంతా (మౌఖికంగా చెప్పినదైనా) మధ్య మధ్య కొన్ని భాగాలుగా రాసినవైనా అయుండాలి!

కానీ కేతన చేసిన ఈ చతుర్విధ (4 రకాల) వర్గీకరణ మాత్రం సమాసాల అవగాహనను సులభతరం చేసిందని చెప్పుకోక తప్పదు. ఈ విషయాన్ని హరిశివకుమార్ గారు చాలా కాలం ముందే గుర్తించడం గమనార్హం.

క.
పెడతలయును క్రేగన్నులు
నడురే యెడకాలు మనుజనాథుఁడు రిపుఁ దా
నెడగాలఁ బెట్టె ననఁ బొలు
పడర నుదాహరణము లగు నభినవదండీ. 110

పెడతలయును = పెడ+తల (పెడపూర్వపదం) (పెడ=పక్క); క్రేగన్నులు= కనుగొనలు, వాలుచూపులు; నడురేయి = అర్ధరాత్రి; ఎడకాలు = కాలు కింది భాగం; మనుజనాథుఁడు = రాజు, రిపున్ = శత్రువును; తాన్ ఎడకాలన్ బెట్టెన్ = తాను కాలుకింద తొక్కి పెట్టాడు; అనన్ = అనే విధంగా; పొలుపు+అడరన్ = చక్కగా; ఉదాహరణములు + అగున్ = దృష్టాంతాలు అవుతాయి; అభినవదండీ!

“పెడతల, క్రేగన్నులు, నడురేయి; ఎడకాలు అనేవి ఉదాహరణలు. “రాజు తన శత్రువును ‘ఎడకాల’ పెట్టాడు” అని వాక్య ప్రయోగ ఉదాహరణ”.

పెడతల అంటే ‘తల’ కాదు; తల వెనుక భాగం; అలాగే క్రేగన్నులు అంటే కన్నులు అని అర్థం రాదు, కళ్ళకొనలు అని అర్థం. అందువల్ల వీటిలో రెండవ పదం అర్థం కన్నా మొదటి పదంలోని అర్థానికే ప్రాధాన్యం ఉందని అందువల్ల ఇలాంటి వీటిని “పూర్వపద అర్థ ప్రాధాన్యం” కల సమాసాలుగా గుర్తించాలని భావం. ఇలాంటి వాటిని ‘అవ్యయీభావ’ సమాసం అంటారు. సూరయ్య కూడా అలాగే చెప్పారు (పు. 88), కానీ ఈ విషయంలో హరిశివకుమార్ చర్చించిన అంశాలే సరియైనవని భావించాలి. ఆయన ఇలా రాసారు:

“…ఈ సమాసములు అవ్యయీ భావములగునా కావా అని విచారింపవలయును. విచారించినచో వీనియందవ్యయీభావ లక్షణ మెంత వఱకు పట్టుచున్నదో యంతవరకే కేతన దానికి లక్షణము చెప్పినాడు. ఈ సందర్భమున అవ్యయీభావ సమాసమునకున్న లక్షణము ఒక్క పూర్వ పదార్థమగుటయే కాదు. అవ్యయీభావ సమాసము కూడా అవ్యయము కావలయును… తెనుగు భాషలో పూర్వపదార్థ ప్రధానములైన సమాసములు లింగవచన విభక్తులను స్వీకరించుచున్నవి. కాబట్టి వీని నవ్యయములనుటకు వీలులేదు… కేతన వీనిని అవ్యయీభావములని చెప్పలేదు. …. అవ్యయీభావ మన్నచో వచ్చు చిక్కు కేతన యెఱిగియున్నాడు కాబట్టియే యామాటను పరిహరించినాడు” (పు. 121-122). అందువల్ల సమాసం పేరుకన్నా కూడా కేతన సమాసం అర్థానికే ప్రాధాన్యం ఇచ్చాడని, అదే సముచితమని భావించాలి.

వ.
ఉత్తర పదార్థ ప్రధానం బెట్టి దనిన. 111

ఉత్తర పద = రెండవ (తర్వాత) మాట (యొక్క; అర్థ ప్రధానంబు = భావ ప్రాధాన్యం; ఎట్టిది+అనిన = ఏవిధంగా ఉంటుంది) అంటే;

ఇప్పుడు ‘ఉత్తర పదం’ అర్థ ప్రాధాన్యం కలిగి ఉండే ఉదాహరణలను కేతన కింది పద్యంలో చూపబోతున్నాడు. ఇక్కడ సూరయ్య అన్ని తత్పురుష భేదాలను విభక్తితో కూడిన విగ్రహ వాక్యాలతో వివరించాడు (పు. 88-91).

క.
చలిగాడ్పు నల్లగలువలు
వలవంతలు తెల్లదమ్మి వలి క్రొవ్విరియె
త్తెలమావిమోక కెంజిగు
రలరమ్ములు నాఁగ నివి యుదాహరణంబుల్. 112

చలిగాడ్పు చల్లటిగాలి; నల్లగలువలు = నల్లటి కలువపూలు; వలవంతలు = కామ సంబంధమైన భావాలు; తెల్లదమ్మి = తెల్లటి తామరపూవు; వలి క్రొవ్విరి యెత్తు = మంచు బిందువులతో కూడిన కొత్త పూలదండ; ఎలమావి మోక = లేత మామిడి మొక్క; కెంజిగురు = ( > కెంపు+చిగురు) ఎర్రని చిగురు (=లేత ఆకు); అలరమ్ములు = పూవుల బాణాలు; నాఁగ = అనే విధంగా; ఇవి = ఇలాంటివి; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“చలిగాడ్పు, నల్లగలువలు, వలవంతలు, తెల్లదమ్మి, వలి క్రొవ్విరియెత్తు; ఎలమావిమోక; కెంజిగురు; అలరమ్ములు మొదలైనవి ఉదాహరణలు”.

ఉత్తర పదాలకు అర్థాలలో ప్రాధాన్యం రెండు రకాలుగా ఉంటుంది. వీటిలో విగ్రహ వాక్యాలలో భేదం ఉంటుంది. ఒకదానిలో విశేషణంతో కూడి వుండి ‘అయిన’ అనే పూరణ వస్తుంది. ఇందులో కేతన ఇచ్చిన ఉదాహరణలన్నీ దీనికి చెందినవే. చల్లనైన గాడ్పు; నల్లనైన కలువలు; తెల్లని (తెల్లగావున్న) తామరలు; ఎర్రటి లేదా ఎర్రనైన చిగురు, ఇవన్నీ దీనికి చెందినవే. రెండోది విభక్తి ప్రత్యయాలతో విగ్రహ వాక్యం చెప్పే తత్పురుష, అయితే దీనికి ఉదాహరణలు కేతన ఇవ్వలేదు; తీసుకుంటే ఒక విధంగా అలరమ్ములు తీసుకోవచ్చు. దీనికి పూల యొక్క బాణాలు అని షష్ఠీ తత్పురుష అని. కానీ ఇది అంత సబబుగా అనిపించదు. వీటిని భాషాశాస్త్రంలో కూడా ‘ఎండో సెంట్రిక్’ అని అంటారు అంటే ‘బాహ్య నిర్మాణానికి చెందినవి’గా పేర్కొంటారు. అంటే చలిగాడ్పు ప్రధానంగా గాడ్పే (గాలే); నల్లకలువ కలువనే.

హరిశివకుమార్, దేవినేని సూరయ్యగార్లు కూడా ఇదే విషయాన్ని – అంటే ఇవి కర్మధారయ సమాసాలే అని చెప్పారు. అయితే దేవినేని సూరయ్య ఉత్తర పదార్థ ప్రాధాన్యం రెంటికీ ఎలా ఉంటుందో చాలా వివరంగా రాసాడు. కానీ చివరలో “ఇవి విశేషణములు పూర్వ పదములుగా గల కర్మధారయ సమాసమునకు నుదాహరణములుగా జూపబడినవి” (పు. 92) అని ముగించక తప్పలేదు. హరి శివకుమార్ “ఇవి తత్పురుషములైన కావచ్చు లేదా కర్మధారయములైన కావచ్చు -కావున ఆ భేదములోనికి జొరక ‘ఉత్తర పదార్థ ప్రధానమైనవి” యని మాత్రము చెప్పి వదిలి వేసినాడు (పు. 123) అని అన్నారు. దీనికి సంబంధించిన మరో సూత్రాన్ని కేతన కింది పద్యంలో వ్రాసాడు.

క.
అని యగు గుణిపిఱుఁద గుణం
బనువుగ బోధించుచోట నది గాదే న
ట్ల నకార ముండు నల్లని
కనుఁగవ యన నల్లగన్నుఁగవ యనఁ జనుటన్.113

అని అగు = ‘అని’ వస్తుంది; గుణి పిఱుఁద = నామ వాచకం (విశేష్యం) ముందు; గుణంబు = విశేషణము, అనువుగ = అనుకూలంగా; బోధించుచోటన్ = వివరించేటప్పుడు; అదికాదేన్ = అలాకాకపోతే; అట్లన్ = ఆ విధంగా; అకారము + ఉండు = అకారం అలాగే ఉంటుంది; నల్లని కనుఁగవ = నల్ల+ అని+కనుగవ (అనికానీ) నల్లగన్నుఁ గవ = నల్ల (‘అ’ చివర ఉంది); అనన్ + చనుటన్ = అంటూ ఉండటం వల్ల. “విశేష్యానికి (నామానికి) ముందు వచ్చే విశేషణానికి ‘అని’ చేరుతుంది. అది (అంటే ‘అని’) చేరనట్లయితే ‘అ’ కారమే ఉంటుంది. ఎలాగంటే ‘నల్లని కనుగవ’ అని లేదా నల్ల కన్నుగవ అని అనే విధంగా”.

ఉత్తర పదార్థ ప్రాధాన్యంతో ఏర్పడే సమాసాలలో రెండవ పదానికే ప్రాధాన్యం ఉండటం వల్ల దానిని కేతన ‘గుణి’ అనీ, దానికి ముందు వచ్చే దానిని ‘గుణంబు’ అనీ అన్నాడు. వీటిని తర్వాత విశేష్యము అనీ, ‘విశేషణము’ అనీ వాడుతున్నాం. విశేషణాన్ని గుణవాచకము అనీ, విశేష్యాన్ని నామవాచకం అని కూడా వాడుతారు. ‘నల్లని కన్నుగవ’ అన్నదానికన్నా ‘నల్లకన్నుగవ’ అన్నదే ఎక్కువ సమాసరూపం అనిపిస్తుంది. ఈ పద్యం వల్ల ‘ఉత్తర పదార్థ ప్రధానం’ అని తాను చెప్పిన దాన్ని కేతన ప్రధానంగా విశేషణ – విశేష్య సంబంధ సమాసాలకే ఎక్కువగా నిర్దేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ విషయాన్నే సూరయ్య తన తత్పురుష – కర్మధారయ వివరణ తర్వాత చివరలో కేతన ఉదాహరణలన్నీ కర్మధారయమే అనీ చెప్పిన విషయం పైనే గుర్తించాం.

అన్యపదార్థ ప్రధానం బెట్టి దనిన. 114

అన్యపద = వేరే పదం; అర్థప్రధానంబు = భావానికి ప్రాధాన్యం; ఎట్టిది + అనిన = ఎలాగంటే. రెండు పదాల కలయికతో ఏర్పడే ఇతరపద అర్థాన్నిచ్చే మాటలు ఎట్లా ఉంటాయంటే… (ఉదాహరణలు కింద పద్యంలో)

తే.
చలివెలుఁగు వేఁడివెలుఁ గనఁ బులుఁగుపడగ
నలువ యన మచ్చెకంటి నా నలరువిల్తుఁ
డనఁగ వాతివాడియు జేతలాడి యనఁగఁ
దనరు నన్యపదార్థ ప్రధానచయము. 115

చలివెలుఁగు = చల్లటి కాంతి నిచ్చేవాడు (చంద్రుడు); వేడి వెలుఁగు = వేడిగా ఉండే వెలుగు నిచ్చేవాడు (సూర్యుడు); అనన్ = అనే విధంగా; పులుఁగు పడగ = పక్షి జెండాగా గలవాడు (విష్ణువు = పక్కిదాల్ వేలుపు); నలువ = నాలుగు ముఖాలు (< వాయి) కలవాడు (బ్రహ్మ); అన = అనే విధంగా; మచ్చెకంటి = చేపల వంటి కన్నులు గలది; నాన్ అన్నట్లుగా; అలరువిల్తుడు + అనఁగ = పూలు విల్లుగా గలవాడు (మన్మథుడు) అనే విధంగా; వాతివాడియున్ = నోటి దురుసు గలది; చేతలాడి = పనిమంతురాలు; అనఁగ అనే విధంగా; తనరున్ = ఉంటాయి; అన్యపద అర్థ + ప్రధాన = ఇతర మైన పద అర్థానికి ప్రాధాన్యాన్ని ఇచ్చే; చయము = గుంపు.

“అన్య పదార్థ ప్రధానానికి ఉదాహరణలు; చలివెలుగు, వేడి వెలుగు; పులుగు పడగ; నలువ; మచ్చెకంటి; అలరువిల్తుడు; వాతివాడి; చేతలాడి మొదలైనవి.”

భాషాశాస్త్రంలో, ముఖ్యంగా వర్ణనాత్మకభాషా శాస్త్రంలో రెండు పదాలకలయికతో ఏర్పడే సమాసాలను పద నిర్మాణ శాస్త్రంలో రెండు ముఖ్య అర్థప్రాధాన్య నిర్మాణాలుగా వర్గీకరించారు (Bloomfield, 1933) (1) అంతర్ కేంద్ర నిర్మాణం (endocentric) (2) బాహ్య కేంద్ర నిర్మాణం (exocentric) అంటే ఇవి ఇంచుమించు మన కర్మధారయ, బహువ్రీహి సమాసాలకు దగ్గరగా ఉండేవి. ముఖ్యంగా బాహ్య కేంద్ర నిర్మాణం లో(exocentric) అర్థం సమాసంలోని ఏ ఒక్క పదానికి చెందకుండా ఆ రెండిటి అర్థాలకూ ‘వెలుపల’ వేరే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ కూడా చలి + వెలుగు అంటే “చల్లనైన కాంతి” అని కాదు అర్థం; ‘చల్లనైన కాంతి గలవాడు’ ఎవరో ఆయన అని. అంటే దానర్థం ‘చల్లటి’ అనీ కాకుండా, ‘కాంతి’ అని కాకుండా అలాంటి కాంతి కలిగిన ‘చందమామ’ అన్న అర్థాన్ని ఇవ్వడం వల్ల ‘అన్య’ అంటే ఇతర అర్థానికి చెందినది కాబట్టి ఇలాంటి వాటిని కేతన “అన్య పదార్థ ప్రధానం” అన్నాడు. మిగిలిన ఉదాహరణలన్నీ ఇలాంటివే.

వేడి వెలుగు = సూర్యుడు (వేడిగా ఉండే కాంతి కలవాడు)
పులుగు పడగ = పక్షి జెండాగా కలవాడు = విష్ణువు;
నలువ= నాలుగు ముఖాలు కలవాడు = బ్రహ్మ;
మచ్చేకంటి = చేప వంటి కన్నులు కలది;
అలరు విల్తుడు = పువ్వుల బాణాలు కలవాడు = మన్మథుడు
వాతివాడి= నోటి దురుసు గలది = స్త్రీ;
చేతలాడి = పని బాగా చేసేది = స్త్రీ

వీటన్నింటినీ ‘బహువ్రీహి’ సమాసాలుగానే పరిగణిస్తూన్నా దాని నిర్వచనం మాత్రం ‘అన్య పదార్థ ప్రధానమే’.

వ.
ఉభయ పదార్థ ప్రధానం బెట్టి దనిన. 116

ఉభయపద = రెండు పదాల; అర్థప్రధానంబు అర్థానికి ప్రాధాన్యం; ఎట్టిది అనిన = ఎలాగంటే.

వ్యాకరణం కొన్ని సందర్భాలలో గణితం వంటిది. సమాసం రెండు వేర్వేరు పదాల కలయికతో ఏర్పడుతుంది. రెండు పదాలు కలిసి ఒక కొత్త పదం రూపొందే ప్రక్రియ ఇది. అయితే అట్లా కలిసిన రెండు పదాల వల్ల ఏర్పడే అర్థం ఎలాంటిది? అన్న ప్రశ్న వేసుకుంటే, అది ‘లెక్క’ ప్రకారం నాలుగు రకాలు. x, y అనేవి పదాలనుకుంటే (i) xy = x (y కి ప్రాధాన్యం లేదు); (ii) xy=y (x కి ప్రాధాన్యం లేదు); (iii) xy=z (x కాదు, y కాదు); (iv) xy రెండూను. x ఉండాలి; y ఉండాలి, అప్పుడే పూర్తి అర్థం. ఈ చివరిదే ఉభయ పద అర్థ ప్రధానంగా ఉండేది. అంటే సమాసంలోని రెండు మాటలకూ సమాన ప్రతిపత్తి ఉందన్నమాట. ఇవి ఎలా ఉంటాయో క్రింది పద్యంలో ఉదాహరణలిచ్చి చూపాడు కేతన. వీటిని “ద్వంద్వ” సమాసం అన్నారు తర్వాత వ్యాకర్తలు.

ఆ.
తల్లిదండ్రు లన్నదమ్ములు గూడ్కూర
లెలమి నాలుబిడ్డ లెద్దుబండ్లు
బంటుఱేఁడు లాటపాటలు నుభయప్ర
ధానమునకు నివి యుదాహరణములు. 117

తల్లిదండ్రులు = అమ్మా, నాన్నలు; అన్నదమ్ములు = అన్నా, తమ్ముడూ; కూడ్కూరలు కూడూ, కూరా; ఎలమిన్ = చక్కగా; ఆలుబిడ్డలు = భార్యాపిల్లలు; ఎద్దుబండ్లు = ఎద్దు, బండీ, బంటుఱేడులు = భటుడు, రాజు; ఆటపాటలు = ఆటా, పాటా; ఉభయ ప్రధానమునకున్ = రెండు మాటల అర్థాల ప్రాధాన్యానికి; ఇవి = ఇలాంటివి; ఉదాహరణములు = ఉదాహరణలు.

“రెండుమాటలకూ అర్థంలో ప్రాధాన్యం ఉండే సమాసానికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కూడ్కూరలు; ఆలుబిడ్డలు; ఎద్దుబండ్లు; బంటుఱేడులు; ఆటపాటలు ఇలాంటివి ఉదాహరణలు”.

పైనే చెప్పుకొన్నట్లు వీటికి ‘ద్వంద్వ’ సమాసం అని పేరు. కానీ కేతన ఈ పేరు కానీ, ఏ సమాసం పేరు కానీ పేర్కొనకుండా పైన చెప్పు కొన్నట్లు కేవలం ‘అర్థాన్ని’ మాత్రమే సమాసాల గుర్తింపుకు ప్రధానాంశంగా తీసుకున్నాడు. అయితే వీటిలో కొత్త అంశం ఒకటి ఉంది. అది ఏంటంటే రెండు పదాల కలయికవల్ల సమాసపద మధ్యంలో వచ్చిన ధ్వని మార్పు. అంతేకాదు ఈ ద్వంద్వాలలో సమాసం చివర ‘లు’ బహువచనం కూడా చేరింది; హరిశివకుమార్ “… ఈ ద్వంద్వ సమాసములందు ఉత్తర పదాది పరుషమునకు గసడదవాదేశమును వచ్చుచున్నది. కాని దీనిని కేతన ప్రత్యేకముగా విధించలేదు. కేతన ప్రథమ మీద కచటతపలకు గసడదవాదేశమును విధించినాడు (పద్యం 61) దానినిక్కడ అధ్యాహారము చేసుకోవాలి” అని చెప్పాడు (పు. 124). సూరయ్య ఈ విషయమై ఏమీ చెప్పలేదు.

క.
ధీనిధి గుణపదములపై
మానుగ హల్లున్న నంతిమము లగు ములకున్
బూని పునాదేశం బగు
భూనుత పై నచ్చు లున్నఁబుట లగు ములకున్ 118

ధీనిధి = బుద్ధిమంతుడా!; గుణపదములపై = విశేషణ పదాలమీద; మానుగన్ = చక్కగా; హల్లున్నన్ = హల్లు ఉన్నట్లయితే; అంతిమములు + అగు = చివరలో వచ్చే; ములకున్ = మువర్ణాలకు; పూని = పూనుకొని, తప్పనిసరిగా; పున్+ఆదేశంబు అగు= పువర్ణం ఆదేశంగా వస్తుంది; భూనుత = భూమిపై కొనియాడబడేవాడా; పైన + అచ్చులు + ఉన్నన్ = రెండో మాటలో అచ్చువర్ణం ఉన్నట్లయితే; పుటలు+అగు = పుట అనేది వస్తుంది; ములకున్ = మువర్ణాలకు.

“ము వర్ణం చివరలో వచ్చే విశేషణ పదాలపైన హల్లుతో కూడిన పదం వచ్చి చేరినట్లయితే అప్పుడు ‘ము’ కారం ‘పు’కారం అవుతుంది; (హల్లుకాకుండా) అచ్చుతో కూడిన పదం వచ్చి చేరినట్లయితే విశేషణ ముకారానికి ‘పుట’ అనేది వర్తిస్తుంది”.

సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి చేరిన మాటలలో పురుష వాచకాలకు -డు ప్రత్యయం చేరితే, నపుంసక లింగ సంస్కృత పదాలకు సాధారణంగా ‘ము’ వర్ణం చేరి వాటిని ప్రథమా విభక్తి పదాలుగానూ, తత్సమాలుగానూ మారుస్తుంది. ఇలాంటి వాటిలో ము కారాంతంగా ఉన్న పదం మొదటగా ఉండి, రెండోమాట హల్లుతో కానీ, అచ్చుతోకానీ ప్రారంభమయినప్పుడు హల్లుకు ముందున్న ‘ము’ ‘పు’గా మారగా; అచ్చుకు ముందున్న ‘ము’కు ‘పుట’ వచ్చి చేరుతుంది. అంటే సూత్రంలో చెప్పాలంటే:

i) ము + ఏదైనా హల్లు = పు + హల్లు
ii) ము + ఏదైనా అచ్చు = పుట + అచ్చు

ఉదాహరణలు కింది పద్యంలో చూస్తాం.

క.
వాదపుఁబంతంబులును బ్ర
మోదపుశృంగారములును ముత్యపుసరులున్
జూదపుటాటలు నెయ్యపు
టాదరములు ననఁగ నివి యుదాహరణంబుల్.119

వాదపున్+పంతంబులునున్ = వాదము+పంతంబులు = వాదంతో కూడిన పంతాలు; ప్రమోదపుశృంగారములును = ప్రమోదము+శృంగారము= ప్రమోదం (సంతోషం)తో కూడిన శృంగారం; ముత్యపుసరులున్ ముత్యము+సరులున్ = ముత్యాలదండలు; జూదపుటాటలు = జూదము + ఆటలు = జూదపుటాటలు; నెయ్యపు టాదరములున్ = నెయ్యము + ఆదరములు = నెయ్యపుటాదరములు – స్నేహపూర్వక ఆప్యాయం; అనఁగన్ = అనే విధంగా; ఇవి = ఇలాంటివి; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“వాదపుపంతములు, ప్రమోదపు శృంగారములు; ముత్యపుసరులు, జూదపుటాటలు, నెయ్యపుటాదరములు అనేవి (పై సూత్రానికి) ఉదాహరణలు”.

కేతన వ్యాకరణ రచనా పద్ధతి వర్ణనాత్మక వ్యాకరణ రచనకు దగ్గరగా ఉన్నదని ఇంతకు పూర్వమే చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ పద్ధతిలో కేవలం మార్పులను వర్ణించటమే తప్ప అవి ఎందుకు ఎలా జరుగుతున్నాయో వివరించాల్సిన పని ఉండదు. అయినప్పటికీ ఏయే మార్పులు ఏయే ధ్వని పరిసరాల్లో వస్తున్నాయో ఆ వివరాలు మాత్రం తెలుస్తాయి. అందువల్ల విశేషణం మొదటి పదంగా ఉన్న సమాసంలో ఆ విశేషణం ‘ము’ కారాంతమైనట్లయితే, దాని తర్వాత పదం హల్లుతో ప్రారంభమయితే ము కు బదులు ‘పు’ వస్తుందనీ, అదే అచ్చుతో ప్రారంభమైతే ‘పు’ కాకుండా ‘పుట’ వస్తుందని చెప్పిన సూత్రానికి ఈ పద్యంలో పదాలు ‘పు’ (గాగమానికి) చేరడానికి మూడు పదాలూ; అచ్చులకు ముందు ‘పుట’ చేరడానికి రెండు ఉదాహరణలు ఇచ్చాడు కేతన.

సూత్రం:
ము > పు/-హల్లు
ము > -పుట/-అచ్చు

నిజానికి అచ్చుకు ముందు కూడా ‘పు’ నే చేరుతోంది. కానీ పు చేరిన పిమ్మట ‘టు’ గాగమం కూడా వస్తుంది. అంటే ఆధునికులు రెండు వర్ణ సూత్రాలుగా విభజిస్తే కేతన రెండు ప్రత్యయాలున్నట్లుగా పై విధంగా విభజించాడు. ఆధునికంగా సూత్ర రచన (ఇవే మాటలకు)

(1) పుగాగమ సంధి
[-ము] -> [-పు] / – రెండవ పదం
వాదము + పంతములు = వాదపుపంతములు.
[-ట] చేర్చే సూత్రం.
ఉదా: జూదము + ఆటలు > జూదపు + ఆటలు
(2)టుగాగమసంధి
→ ట | పు – అచ్చు.
జూదపు + ఆటలు = జూదపుటాటలు.

సూరయ్య, హరిశివకుమార్ వీటినే వివరించారు, కానీ ప్రత్యేకమైన అంశాలేమీ చెప్పలేదు.

ఆ.
ఇల్లు కల్లు ముల్లు పల్లును విల్లును
కన్ను మున్ను వెన్ను చన్ను నాఁగఁ
బరఁగు శబ్దములకుఁ బైహలాదులతోడ
నదుకు నపుడు జడ్డ లడఁపఁ జెల్లు. 120

ఇల్లు = నివసించేది, గృహం; కల్లు = రాయి; ముల్లు మొక్కలలో, తీగెలలో సూదిమొన (ఉదా: గులాబి) వలె ఉండి గుచ్చుకునేది; విల్లు = ధనుస్సు, పల్లు = పన్ను; కన్ను = నేత్రం, చూసే శరీర భాగం; మున్ను = పూర్వం, గతం; వెన్ను = వీపు; చన్ను = రొమ్ము, నాఁగన్ = అనే విధంగా; పరఁగు = ఉండే; శబ్దములకున్ = మాటలకు, పై హల్ + ఆదులతోడన్ = వాటి తర్వాత వచ్చే పదాలలోని హల్లులతో; అదుకున్ + అపుడు = జతపరిచేటప్పుడు, కలిపేటప్పుడు; జడ్డలు = ద్విత్వాలు, (రెండు ఒకే రకం హల్లులతో కలిసిన వర్ణాలలో); అడఁపన్ = అణచివేయటం; చెల్లు = జరుగుతుంది.

“ఇల్లు, కల్లు, ముల్లు, పల్లు, విల్లు, కన్ను, మున్ను, వెన్ను, చన్ను మొదలైన పదాలతో మరొక హల్లుతో కూడిన పదం కలిసినప్పుడు వాటిలోని ద్విత్వం పోతుంది. మొదటి పదంలోనే ద్విత్వాలయిన రెండు హల్లులు పదాంతంలో ఉన్నప్పుడు ఆ మాటలకు హల్లుతో ప్రారంభమయ్యే మరొక పదం వచ్చి చేరినట్లయితే అప్పుడది ‘మూడు హల్లుల సంశ్లేష’ అవుతుంది.”

తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషలలోనూ మూడు హల్లులు కలిసి వచ్చినప్పుడు వాటిలో ఒక హల్లు లోపించడం ఆనవాయితీ. ఇది ఇతర ప్రపంచ భాషల్లోనూ జరిగే సహజవర్ణలోప సూత్రం. ద్రావిడ భాషల్లో కొన్ని భాషల్లో ‘అనునాసిక + ఓష్ఠ్య’ జంటలు, కొన్ని భాషల్లో ఓష్ఠ్వ ద్విత్వ (జడ్డ) జంటలు పదాలలో కనపడినప్పుడు కుమారస్వామి రాజా అన్న ద్రావిడ భాషా పండితుడు వాటిని తులనాత్మకంగా అధ్యయనం చేసి అది పూర్వ ద్రావిడ భాషలో అనునాసిక + ఓష్ఠ్య జడ్డలతో కూడిన మూడు హల్లుల సమాహారం అనీ, మూడు హల్లులు రెండుగా మారే క్రమంలో కొన్ని భాషల్లో అనునాసిక + ఓష్ఠ్యలతో కూడిన జంట హల్లులు (ఒక ఓష్ఠ్యంలో పించి) మిగలగా, మరికొన్ని భాషల్లో అనునాసికం లోపించి ఓష్ఠ్య జడ్డలు మిగిలినట్లు నిరూపించారు. దీన్ని ఒకే సూత్రంలో ఇలా చూపించవచ్చు:

NPP>NP/PP
N= అనునాసికం
P= ఓష్ఠ్యం

అలాగే ఇక్కడ కూడా ద్విత్వాలైన రెండు హల్లులు పదాంతంలో ‘ల్లు, న్ను’ అని ముందే ఉండగా, తర్వాత మాటలోని మరోహల్లు వచ్చి కలిసినప్పుడు మూడు హల్లులు ఒకే దగ్గర రావటం జరుగుతోంది. అందువల్ల వీటిలో పదంలోని హల్లుపోతే ‘మాట’ మారిపోతుంది; అందువల్ల ద్విత్వంలోని ఒక హల్లులోపిస్తే, అప్పుడు మిగిలిన హల్లు తర్వాత హల్లు కలిసి కేవలం రెండు హల్లులే మిగులుతాయి. దీన్ని ఈ కింది విధంగా చూపవచ్చు:

(i) హల్లు, హల్లు, + హల్లు → హల్లు, హల్లు,
C1 C1 C2 → C1 C2
అనికానీ, లేదా:
(ii) C1 C1 + C2 –> C1 C2
– అని కానీ చూపవచ్చు అంటే ఒకే విధంగా ఉన్న రెండు హల్లుల జంటలో ఒకటి లోపిస్తుంది అని అర్థం.

సూరయ్య తన వివరణలో బాలవ్యాకరణంలోని సూత్రాన్ని “అకారము కింది ఆ కారంబునకును దుది నులలకింది నలలకు లోపంబు బహుళంబుగానగు (బాల.వ్యా.ప్ర.)” అని ఉదాహరించాడు (పు. 98).

క.
విలుకాఁ డిలువడి గలుపని
ములుపొద పలువరుస లెస్స మునుగా ల్చనుము
క్కులు గనుగొనలు వెనుప్రా
పలవడు నని చెప్ప నివి యుదాహరణంబుల్. 121

విలుకాఁడు = వేటగాడు; ఇలువడి = మంచికుటుంబం; కలుపని = రాతి పని; (ఈత, తాటి కల్లుతో చేసేపని అని మరో అర్థం) ములుపొద = ముళ్ళ(తోనిండిన) పొద; పలువరుస = ఎగుడుదిగుడుగా లేకుండా చక్కగా ఉన్న పళ్ళ వరుస; లెస్స = చక్కగా; మునుగాలు = మోకాలు; (ముందుకాలు); చనుముక్కులు = చనుమొనలు (రొమ్ము చివర మొనలు); కనుగొనలు = కళ్ళ చివరలు; వెనుప్రాపు = అండదండలు; అలవడున్ + అని = అలవాటుగా అనే విధంగా; చెప్పన్ చెప్పటం; ఇవి = ఇట్లాంటివి; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు”.

పై ఉదాహరణలను ఈ కింది విధంగా వివరించి చూపవచ్చు:

I.
విల్లు+కాడు = విలుకాడు
ఇల్లు+వడి = ఇలువడి
కల్లు+పని = కలుపని
ముల్లు+పొద = ములుపొద (ముళ్ళపొద)
పల్లు+వరుస = పలువరుస
సూత్రం – ల్లు → లు |-హల్లు లేదా/ ల్లు+హల్లు = లు+హల్లు.

II.
మున్ను +కాలు = మునుగాలు
చన్ను+ముక్కులు = చనుముక్కులు
కన్ను +కొనలు = కనుగొనలు
వెన్ను+ప్రాపు వెనుప్రాపు
సూత్రం – న్ను → ను / -హల్లు లేదా/ న్ను+హల్లు = ను+హల్లు. ఎలాగైనా, ద్విత్వ హల్లులలో ఒకటి పోయి ఒకటే మిగులుతుంది.

తే.
ఓలి రెండును మూఁడును నాలుగనఁగఁ
బరఁగుపదములఁ బట్టిన నిరు ము నలులు
పొరయు ములమీఁద జడ్డలౌ నిరువదియును
ముప్పదియు నలువదియు నా నొప్పుఁ గాఁగ. 122

ఓలి = వరుసగా; రెండును మూఁడును నాలుఁగు అనఁగన్ = రెండు, మూడు నాలుగు అనే విధంగా; పరఁగుపదములన్ పక్కన ఉన్న మాటలకు; పట్టినన్ జతపడితే; ఇరు, ము, నలులు = ఇరు – అనీ, ము – అనీ, నలు అనీ; పొరయు = అవుతాయి; ‘ము’లమీద = ‘ము’ (<మూడు) పైన; జడ్డలు +ఔన్ = - ద్విత్వాలు అవుతాయి; ఇరువదియును = ఇరవై, ముప్పదియు = ముప్పై; నలువదియు = నలభై; నాన్ = అనే విధంగా; ఒప్పున్ = ఉంటాయి; కాన = కాబట్టి.

“రెండు, మూడు, నాలుగు అనే మాటల మీద ఇతర పదాలు చేరినప్పుడు అవి ఇరు-, ము-, నలు- అని మారుతాయి. ము- ల మీద వచ్చే హల్లులు ద్విత్వాలవుతాయి. ఉదాహరణలు: ఇరువది, ముప్పది, నలువది”.

తెలుగులో సంఖ్యవాచకాలలో ఇదొక ముఖ్యమైన అంశం. సంఖ్యా వాచకాలలో రెండు రకాల మార్పులు జరుగుతాయి. (1) ఒకటి, రెండు, మూడు, నాలుగు మొదలైన సంఖ్యలు మనుష్య వాచకాలలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అని వాడబడితే, మనుష్యేతర వాచకాలలో ఒకటి, రెండు, మూడు అనే ఉంటాయి. (2) ఒకటి నుండి పది వరకు ఈ కింది విధంగా పలకుతాం/రాస్తాం.

ప్రాచీనం ఆధునికం
పదునొకండు పదకొండు
ఇరువది ఇరవై
పండ్రెండు పన్నెండు
ముప్పది ముప్ఫై
పదమూడు పదమూడు
నలువది నలభై
తొంబది తొంభై

అనేకభాషల్లో ఈ లెక్కింపు విధానం భిన్న రకాలుగా ఉంటుంది. తెలుగులో కూడా 10, 20, 30 లపై 1 నుండి 9 వరకు చేర్చి పలుకగా, 20, 30, 40 లలో 2, 3, 4 లపై 10 చేర్చి పలకడం అనే పద్ధతి ఉంది. అంటే 10 పైన ఒకటి, రెండు మొదలుకొని తొమ్మిది వరకూ చేర్చగా, 20 నుండి, 2, 3, 4 అంకెలపై పది చేర్చి వాడుతాం. అది కూడా 1-9 వరకూ ఉన్న సంఖ్యల పేర్లు కాకుండా అవి ఎలా మార్పు చెందుతాయో ఈ పద్యంలోని సూత్రం వల్ల తెలుస్తుంది. రెండుకు ‘ఇరు’కు ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలంటే ద్రావిడ భాషల్లోనూ, తెలుగులోనూ జరిగిన చారిత్రక పరిణామం అర్థం చేసుకోవాలి. తులనాత్మకంగా వీటిని అధ్యయనం చేసిన ద్రావిడ భాషా వేత్తలు ‘ఇరు’ ప్రాచీన రూపం గానూ, వర్ణవ్యత్యయం జరిగి తర్వాతి కాలంలో ఇరు → రు-ఇ = ‘రె’ గా మారడం జరిగిందని వివరిస్తారు. కేతనది వర్ణనాత్మక వ్యాకరణం కాబట్టి ఆయన రెండు ఇరు గానూ, మూడు – ము గాను, నాలుగు – నలు గానూ మారుతుందనీ, ‘ము’పై (వచ్చే హల్లు) ద్విత్వం వస్తుందనీ సూత్రీకరించి ఉదాహరణలు ఇచ్చాడు.

క.
తెనుఁగులఁ గొన్నింటిలో మును
కొని జడ్డలతోడ నిలిచి క్రొన్నెలు కృతికిన్
బనివడి క్రొత్తయు నెఱయును
ననుటఁ దెలియఁ జెప్పు వరుస నవి యెట్లనినన్. 123

తెనుఁగులన్ = తెలుగు మాటలలో; కొన్నిటిలో = కొన్ని పదాలలో; మునుకొని = పూనుకొని; జడ్డలతోడ = ద్విత్వాలతో; నిలిచి = నిలబడి వచ్చి); క్రొన్నెలు = క్రొ, నె – అనే ఉపసర్గలు; కృతికిన్ = కావ్యానికి; పనివడి = పనిగట్టుకొని; క్రొత్తయు అనీ; నెఱయును = నెఱ అనీ; అనుటన్ = అనే విధంగా; తెలియ జెప్పు = తెలియజేస్తాయి; వరుసన్ = క్రమంగా; అవి యెట్లనినన్ = అవి ఎలా గంటే.

“తెలుగు కావ్యాలలో కొన్నిటిలో పనిగట్టుకొని ద్విత్వాలతో వచ్చి క్రొన్ – నెన్ – అనేవి పదానికి ముందుగా చేరుతాయి. ఇవి క్రొత్త, నెఱ (అనే అర్థాలను) వరుసగా తెలియజేస్తాయి. అవి ఎలాగంటే-”

కేతన వ్యాకరణ రచనలో కొన్ని సందర్భాలలో అత్యాధునికుడుగా కనిపిస్తాడు. ఈ పద్యంలో ఆయన సూత్రం ఊరికే చెప్పడం లేదు. అవి తెలుగు కావ్యాలలో ‘పనిగట్టుకొని’ వస్తాయి అన్నాడు. అంటే ‘కవులు’ అనకుండా ‘కృతులలో’ అని కవులు నొచ్చుకోకుండా ఉండే విధంగానే కాకుండా, ఇవి ‘పనికి మాలినవిగా (వూరికే) వస్తాయని సూచించాడు.

అయితే క్రొ- అనే దానిని ‘క్రొత్త’ గానూ నె- అనేదానిని ‘నెఱ’గానూ వాటి అర్థాలతో గ్రహించాలనీ, అట్లా ఇవి పదాలముందు వచ్చి చేరినప్పుడు దాని పక్కన పదంలోని హల్లు ద్విత్వమవుతుందని చెప్పాడు. ఇట్లా అదనంగా చేరిన వాటివల్ల ఛందస్సులో అదనపు మాత్రలు చేరడం అనే ప్రయోజనం కూడా ఉంది.

దేవినేని సూరయ్య “కొన్ని తెలుగు పదముల వెనుక క్రొ, నె అనునవి నిలిచి తమ ముందున్న అక్షరములను ద్విత్వాక్షరములుగా జేసి క్రొత్త, నెఱ అను శబ్దార్థములు వచ్చునట్లు చేయును” (పు. 99) అని అదే విషయాన్ని తన మాటల్లో వివరించారు.

క.
క్రొన్నెల క్రొమ్మెఱుఁగులు నాఁ
కొన్నన క్రొక్కారు నాఁగఁ క్రొత్తమ్ములు నా
నెన్నడుము నెమ్మొగము నా
నెన్నడ నెత్తావి యనఁగ నెన్నుదు రనఁగన్. 124

క్రొన్నెల = కొత్త చందమామ; క్రొమ్మెఱుఁగులు = కొత్త కాంతులు; నాన్ = అనే విధంగా; క్రొన్నన = కొత్త చిగురు; క్రొక్కారు = కొత్త మబ్బు; నాఁగన్ = అనే విధంగా; క్రొత్తమ్ములు నా = కొత్త తామర పూలు అనే విధంగా; నెన్నడుము = అందమైన నడుము; నెమ్మొగము = అందమైన ముఖం; నా = అనే విధంగా; నెన్నడ = అందమైన నడక, నెత్తావి = మంచివాసన; యనఁగ = అనే విధంగా; నెన్నుదురు = అందమైన నొసలు; అనఁగన్ = అనే విధంగా.

“ఉదాహరణలు; క్రొన్నెల, క్రొమ్మెఱుగులు, జొన్నన; క్రొక్కారు; క్రొత్తమ్ములు, నెన్నడుము, నెమ్మొగము, నెన్నడ, నెత్తావి, నెన్నుదురు – అనే విధంగా.”

తెలుగుకావ్యాలు చదివే వారికి ఈ పై ఉదాహరణలు ఎంత తరచుగా కనిపిస్తాయో వివరించనక్కరలేదు. నెల, నడుము, మొగము అనకుండా పెద్దగా ప్రయోజనం లేని క్రొ, నె చేర్చి క్రొన్నెల, నెన్నడుము అని కావ్యాలలో ‘పని కట్టుకొని’ వాడుతారని చెప్పాడు.

ఇలా వాడటం వల్ల ఆ మాటలకు కొత్త స్ఫూర్తి వస్తుందనో, కొన్నిసార్లు ఛందోగణ నియమాలకు పనికి వస్తాయనో వాడిన ఈ మాటలను ఆధునిక కాలంలో 70 దశకాల వరకూ సినిమా పాటలలో కూడా వాడుకున్నారు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ మాటలు కని/వినిపిస్తాయి). అయితే క్రొ-వచ్చే చోట నె – రాదు. నె వాడేచోట క్రొ-వాడటం జరగదు. ఈ రకమయిన స్థిరీకృతపదాలు కవుల ప్రయోగాలతోనే ఏర్పడ్డాయని కేతన సూత్రాన్ని వివరించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా ఇవి 13వ శతాబ్దానికే ఇలా కావ్యాలలో వాడటం ఎక్కువగా జరిగిందంటే, ఇప్పుడు మనకు లభ్యం కాని అనేక కావ్యాలు ఆ కాలానికే ఎన్నో వచ్చి ఉండి ఉండాలని ఊహిస్తే, ఆ ఊహను పూర్తిగా కొట్టిపారేయడానికి వీలులేదు. ఉదా:

1. క్రొత్త + నెల = క్రొ+నెల = క్రొన్నెల
2. నెఱ + మొగము = నె+మొగము = నెమ్మొగము

క.
తెలుఁగున కెంచెమ్ములు మును
గలవాక్యము లరుణకాంతి, గావించును గెం
దలిరులు కెందమ్ములు నాఁ
జెలువుగఁ జెంగల్వ లనఁగఁ జెందొవలనఁగన్. 125

తెలుఁగునన్ = తెలుగు భాషలో; కెంచెమ్ములు కెం, చెం అనే వర్ణకాలు; మునుగల= ముందు ఉన్న; వాక్యములు మాటలను; అరుణకాంతి కావించును = ఎర్రటి రంగును చేస్తాయి. కెందలిరులు = ఎర్రటి పూలు; కెందమ్ములు = ఎర్రతామరలు; నా= అనే విధంగా; చెలువుగన్ = అందంగా; చెంగల్వలు = ఎర్రకలువలు; అనఁగన్ = అనే విధంగా; చెందొవలు = ఎర్రతామరలు; అనఁగన్ అనే విధంగా.

“తెలుగులో కెం, చెం అనే వర్ణకాలు వాటి తరువాత పదాలకు ఎర్ర రంగును కలిగిస్తాయి. కెందలిరులు; కెందమ్ములు, చెంగల్వ, చెందొవలు అనేవి ఉదాహరణలు’.

తెలుగులో క్రొ (< క్రొత్త), నె(< నెఱ) అనేవీ, కెం (< కెంపు), చెం (< చెన్ను) అనేవి పదాంశాలని, కొన్ని ఇతర పదాంశ కలయికల్లోనే వస్తాయని గ్రహించటానికి అభ్యంతరం ఏమీ ఉండదు. కానీ వచ్చిన చిక్కల్లా అవి స్వతంత్రాలా? లేక అస్వతంత్రాలా అన్న విషయంలోనే. భాషలో వీటిని క్రొత్త, నెఱ, కెంపు, చెన్ను అనే విధంగా తీసుకొన్నప్పుడు అవి స్వతంత్ర పదాంశాలుగానే గుర్తించాలి; కానీ క్రొ-, --, కెం, చెం-అనేవి స్వతంత్రమైనవి కావు; ఇవి అస్వతంత్ర పదాంశాలే. ఈ ప్రక్రియల్లో రెండు ముఖ్యాంశాలున్నాయి. (1) పదాంశం గుర్తింపు; (2) సమాసం గుర్తింపు. వీటిని అస్వతంత్రాలుగా అంగీకరిస్తే; వీటితో ఏర్పడ్డ పదాలను సమాసాలనడం కుదరదు. పదాలకు ముందు వచ్చే ప్రత్యయాలు తెలుగులో ఎక్కువగా సంస్కృతం నుండే వచ్చాయి తప్ప, తెలుగులో పదాది ప్రత్యయాలు (prefixes) లేవు. ఈ 'కుంచించిన' పదాంశాలను పదాది ప్రత్యయాలుగా భావించే భాషాశాస్త్రవేత్త లెవరైనా ఉన్నట్లయితే వారు భాషా వ్యాకర్తలంతా వీటిని సమాసాలుగా ఎందుకు గుర్తించారో, నిష్పన్న పదాలుగా (Derivation) ఎందుకు గుర్తించలేదో వివరించాల్సి ఉంటుంది - అందువల్ల ఈ సమాస రూపకల్పనలో 1. ఆద్యక్ష రేతరవర్ణలోపం 2. సరళాదేశం; రెండూ చెప్పాల్సి ఉంటుంది. (i) కెంపు + తలిరులు — కెం + తలిరులు — కెందలిరులు (ii) చెన్ను + కల్వ > చెన్ + కల్వ > చెంగల్వ

క.
పే రనియెడుశబ్దం బే
పారం దెనుఁగులకు మొదలు నధికతఁ దెలుపున్
బేరాఁకలి పేరామని
పేరాముదపాకు లనఁగఁ బేరింపనఁగన్. 126

పేరు అనియెడు = పేరు-అనే; శబ్దంబు = మాట; ఏపారన్ = చక్కగా; తెనుఁగులకు= తెలుగుమాటలకు; మొదలన్ = మొదట, ముందు; అధికతన్ = అర్థాన్ని; తెలుపున్ = తెలుపుతుంది; పేరాఁకలి = చాలా ఆకలి; పేరామని = బాగా (ఎక్కువగా) ఉన్న వసంతం; పేరాముదపాకులు = (< పేరు+ఆముదము + ఆకు) పెద్ద ఆముదం ఆకులు; అనఁగన్ = అనే విధంగా; పేరింపు గొప్ప సంతోషం; అనఁగన్ = అనే విధంగా. “తెలుగు మాటలకు ముందు వచ్చి చేరే పేరు - అనేమాట 'ఎక్కువ, మిక్కిలి' అనే అర్థాన్నిస్తుంది; పేరాకలి, పేరామని, పేరాముదపాకులు; పేరింపు అనే విధంగా”. తెలుగులో కొన్ని మాటలకు ముందు 'పేరు' అని వచ్చి చేరుతుంది. దీనివల్ల దీనితో కలిపి ఏర్పడ్డ పదానికి 'ఎక్కువ', 'మిక్కిలి', 'పెద్ద', 'గొప్ప' అనే భావాలను కలిగించే అదనపు అర్థం తోడవుతోంది. 'పేరు' అన్నమాట తెలుగులో నానార్థాన్ని కలిగిస్తుంది. రూపంలో సామ్యం ఉండి, అర్థంలో పూర్తి సంబంధం లేని భేదం ఉన్నప్పుడు ఆ రూపాన్ని రెండు మాటలుగా చూపడం అర్థశాస్త్రంలో నానార్థాల ద్వారా తెలియవచ్చే విషయం (ఇంగ్లీషులో బ్యాంక్ అనేమాట వలె). పేరు అన్న మాటకు 'నామం' (ఉదా: మీ పేరేంటి?) అన్న అర్థంలో అది పూర్తిస్వతంత్రమైన మాట. రెండో పేరు ఇక్కడ ఈ పద్యంలో చెప్పింది. ఇది స్వతంత్రం కాదు; కేవలం ఇంకో పదానికి ముందు చేరి ఆ పదం అర్థానికి అదనంగా అర్థాన్ని కలిగిస్తుంది. అందువల్ల దాన్ని అస్వతంత్రం అనవచ్చు. అయితే ఇలా మాటలకు ముందు వచ్చి చేరి అదనపు అర్థాలను సమకూర్చే వాటిని పైన ప్రత్యయాలుగా కంటే పదాలుగా గుర్తిస్తేనే మేలు అనడం జరిగింది. కానీ అస్వతంత్రాలైన పదాంశాలను పదాలుగా పరిగణించవచ్చునా అన్నది చర్చనీయాంశమే అని అంగీకరించాలి. అలాగే తెలుగులో పదాంత ప్రత్యయాలతో బాటుగా పదాది ప్రత్యయాలు కూడా ఉన్నట్లుగా అంగీకరించవచ్చునా అన్నది మరో చర్చనీయాంశం అవుతుంది. ఏమైనా, ప్రాచీన వ్యాకర్తలు మాత్రం వీటిని పదాలు (శబ్దాలు, మాటలు)గానే పరిగణించినట్లుగా భావించాలి. ఎందుకంటే వాళ్ళు వీటిని సమాసాలలో చేర్చారే తప్ప కృత్, తద్ధిత ప్రత్యయాల వివరణల్లో చేర్చలేదు కాబట్టి. అయినా ఈ విషయమై ఇంకా విస్తృత పరిశోధన, చర్చా జరగాల్సే ఉంది. పేరును ఇతర పదాలతో కలిసినప్పుడు తెలుగులో అత్యంత సహజమైన సంధి 'ఉత్వలోపం' జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పుకునే పనిలేదు. ఉదా: పేరు + ఆకలి = పేర్ + ఆకలి = పేరాకలి 'ఎక్కువ ఆకలి'

క.
తన నా నీ యనుపలుకుల
నెనయంగ హలాదు లదుకునెడ దుఱ్ఱు నగున్
తనదుధనము నాదుగుణం
బన నీదుయశంబు నాఁగ ననువై యునికిన్. 127

తన, నా, నీ అను పలుకులన్ = తన, నా, నీ అనే మాటలను; ఎనయంగా = చేర్చి; హల్ +ఆదులు = హల్లులను; అదుకున్ + ఎడ = కలిపేటప్పుడు; దుఱ్ఱున్ + అగున్ = ‘దు’కారం వస్తుంది; తనదుధనము = తన డబ్బు, నాదుగుణంబు = నా స్వభావం; అన= అనే విధంగా; నీదుయశంబు నీ కీర్తి; నాఁగన్ అనే విధంగా; అనువై+ఉనికిన్ అనువుగా ఉండడం వల్ల.

“తన, నా, నీ అనే మాటలు హల్లుతో ప్రారంభమయ్యే మరోమాటతో కలిసినప్పుడు ‘దు’ వచ్చి చేరుతుంది; తనదు ధనము, నాదు గుణము, నీదు యశము అనే ఉదాహరణలలో ఉన్నట్లుగా”.

దీనిని కొందరు వ్యాకర్తలు ‘దు’ గాగమసంధి అని వ్యవహరించారు. అంటే ‘దు’ కారం ఆగమంగా (అదనంగా) వస్తుంది అని అర్థం. ఈ దుగాగమం కూడా ‘తన, నా, నీ’ లతో మాత్రమే, వాటితో చేరే పదాలు హల్లుతో ప్రారంభమైనప్పుడు ‘దు’ వచ్చి చేరుతోంది అని సూత్రం చెబుతుంది. తన, నా, నీలు క్రమంగా ప్రథమ, ఉత్తమ, మధ్యమ పురుషల సర్వనామ ఏకవచన రూపాలు; అంటే కేతన ప్రకారం ‘దు’ బహువచన సర్వనామాలైన తమ, మా, మీలకు రాదు; వచ్చేటట్లయితే ఆయన ఉదాహరించేవాడు కదా!

కానీ ఆధునిక కాలంలో ఒక కవి ‘మాదేశ భూమి, మాదేశ జలాలు, మాదు గాలులు’ అనే పాటలో మాదు అని బహువచనంపై కూడా ప్రయోగించాడు. ఇలా కేతన తర్వాత ఎవరైనా ప్రయోగించారేమో పరిశీలించాల్సి ఉంది. అయినా ఈ బహువచన రూపాలు ఏకవచన సర్వనామాలపై కావ్యాలలో ‘దు’ ప్రయోగం వచ్చేంత తరచుగా బహుశా రాకపోవచ్చునని కూడా అనుకోవాలి.

ఈ విషయమై హరిశివకుమార్ తన సిద్ధాంత గ్రంథంలో “చింతామణి, బాలవ్యాకరణములు ఏకవచనము పైననే ‘దు’గాగము చెప్పినవి. అప్పకవి “తమదు కడ, తమదు పంచకములు’ వంటి వానిని ప్రయోగించినాడు కానీ యవి అస్వాభావికములు; …. దువ్వూరి వారు తమ రమణీయమున (పు. 361) బహూత్వమున గూడ ఈ దుగాగమము వచ్చుటకు సూత్రమనుమతించినటులే కానవచ్చుచున్నది. బహుత్వమున కవి ప్రయోగములు అరుదుగా కలవు. అంటూ “తమదు రాచటికంబుల్ (హరి.పు.2-172)” “మీదు విమర్శల్” (భోజ 5-302) ఉదాహరణలు చూపారని పేర్కొన్నాడు (పు. 125). “అయినప్పటికీ, ఇట్టి చర్చలకు తావీయక తన, నా, నీ శబ్దముల పైననే విధించుట కేతన ఔచిత్యము. ఈ ‘దు’గాగమ ప్రక్రియ సంస్కృతమున లేదు. తెలుగునకిది ప్రత్యేకమైనది. దీనిని లక్షణ బద్దముగా రచించిన మొట్టమొదటి లాక్షణికుడు కేతన” (పు. 125) అని ప్రశంసించాడు. సూరయ్య దీనిపై వివరణ ఏమీ ఇవ్వలేదు.

క.
నెరిఁ గులజులపై నరి దా
నెరయఁగ బహువచనషష్ఠి నిలుపఁగ నగుఁ గ
మ్మరిగడి మేదరిగడి కం
చరిగడి మూసరితెఱంగు సను ననఁ జనుటన్. 128

నెరిన్ = చక్కగా; కులజులపై = కులాలతో వ్యక్తులను తెలిపే మాటలపై; అరి = ‘అరి’ అనే మాట (ప్రత్యయం); తాన్ ఎరయఁగన్ = తాను (= ఆమాట) చేరినప్పుడు; బహువచన షష్ఠి = బహువచనంలో షష్ఠీ విభక్తి; నిలుపఁగన్+అగు = నిలుపవచ్చు, చేరవచ్చు; కమ్మరిగడి = కమ్మరి వాళ్ళ యొక్క గడి; మేదరిగడి మేదరి వాళ్ళ యొక్క లేదా మేదరుల గడి; కంచరిగడి= కంచరి వాళ్ళ యొక్క గడి; మూసరి తెఱంగు = మూసరివారి తెరగు (?); సనున్ = చెల్లుతుంది; అనన్ చనుటన్ = అనే విధంగా ఉంటుంది కాబట్టి.

“కులాలతో గుర్తించే పేర్లలో ‘అరి’ అనే ప్రత్యయం చేరినప్పుడు దానిని బహువచన షష్ఠిగా పరిగణించాయి. కమ్మరిగడి, మేదరిగడి, కంచరిగడి, మూసరి తెఱగు అనే విధంగా ఉదాహరణలు”.

ఇక్కడ చెప్పిన సూత్రం విగ్రహవాక్యానికి చెందిందని గమనించాలి. కులాల పేర్లెన కమ్మరి, కంచరి, మేదరి, మూసరి లలోని – అరిని కేతన ఆధునిక భాషా శాస్త్ర విధానంలో వలెనే వేరే పదాంశంగా వేరు చేసి ‘అరి’ ప్రత్యయంగా చేరుతోంది అన్నాడు. అప్పుడు కమ్మ+అరి; కంచ+అరి, మేద+అరి, మూస+అరి అని రెండేసి పదాంశాలుగా వాటిని గుర్తించాల్సి ఉంది. అయితే ‘అరి’ చేరక పూర్వం ఉండే కమ్మ-, కంచ-, మేద-, మూస- లకు స్వతంత్ర ప్రయోగం కాని, అర్థం కానీ లేదు.

కానీ ఇంగ్లీషులో raspberry, gooseberry, craneberry లో berry కి ఉన్నట్లుగా గుర్తించి నిర్వచించదగ్గ అర్థం దానితో కలిసిన goose, crane, rasp లకు లేదు. అయినా వాటిని సైద్ధాంతికంగా ప్రత్యేక పదాంశాలుగానే గుర్తిస్తారు. ఈ పద్ధతిలో విశ్లేషణ కేతనలో కనిపించడం ఆశ్చర్యకరం. ఈ మాటలను అర్థం చేసుకోవాలంటే వీటికి విగ్రహ వాక్యాలు చెప్పుకోవాలి. ‘అరి’ని చేర్చాక అవి బహువచన షష్ఠిలో ఈ విధంగా ఉంటాయి.

కమ్మ + అరి = కమ్మరిగడి – కమ్మరి వారి యొక్క గడి.
కంచరి (<కంచ+అరి) గడి = కంచరి వారి గడి. ఇలాగే మేదరి, మూసరి మొదలైన వాటికి కూడా బహు వచన షష్ఠిలోనే ఉంటుంది అంటే (ఏకవచనంలో * కమ్మరి వాని యొక్క, కంచరి అతని యొక్క అని కాకుండా) అని బహువచనంలోనే అర్థ వివరణ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై హరిశివకుమార్ గాని, సూరయ్య గానీ ఏమీ వివరించలేదు.

తే.
పెక్కు సంస్కృత శబ్దంబు లొక్కపదము
క్రిందఁ దద్విశేషణము లిం పొందఁ గూర్చి
తెలుఁగు తత్సమాసము క్రిందఁ గలుపునప్పు
డగ్ర పదముతో నిలనగు నర్థఘటన. 129

పెక్కు = అనేక; సంస్కృత శబ్దంబులు = సంస్కృతం మాటలు; ఒక్క పదము క్రిందన్ = ఒక మాటగానే, ఒక్క పదం కిందనే; తత్ + విశేషణములు = ఆ మాటకు విశేషణాలుగా; ఇంపు+పొందన్ = ఇంపొందన్ = చక్కగా; కూర్చి = కలిపి; తెలుగు = తెలుగు – మాటను; తత్-సమాసము క్రిందన్ = ఆ సమాసానికి ముందు; కలుపునప్పుడు = చేరేటప్పుడు; అగ్రపదముతోన్ = ఆ సమాసంలోని అగ్రస్థానాన ఉన్న మాటతో; ఇలన్ = ఈ భూమిపై; అగున్ = అవుతోంది; అర్థ ఘటన = అర్థస్ఫూర్తి.

“అనేక సంస్కృత పదాలు కలిపి ఒకే పదంగా కూర్చి దానికి ముందు తెలుగుమాట వచ్చినట్లయితే ఆ ముందున్న తెలుగు మాటను ఆ సంస్కృత సమాసంలోని అన్ని విశేషణాలతో కాకుండా అన్నిటి చివరన (అగ్రభాగాన) వచ్చే పదంతో అన్వయింపచేయాలి”.

సంస్కృత భాష పెద్ద పెద్ద సమాసాలతో నిండి ఉంటుంది. అలాంటి 3,4 (లేదా ఇంకా ఎక్కువ) పదాలతో కూడిన సమాసాన్ని వాడుతున్నప్పుడు దానికి ముందుగా చేర్చిన తెలుగుమాట ఆ సమాసంలోని అన్ని విశేషణాలతోనూ కాకుండా వాటి చివరన వచ్చే మాట (అగ్ర పదము) తో అన్వయించి, అర్థాన్ని ఇస్తుంది అని పై సూత్రానికి అర్థం. అది ఎలాగో కింది ఉదాహరణ వల్ల తెలుస్తుంది.

తే.
తన విశిష్ట కులాచారధర్మ మనఁగఁ
దనజగద్గీతసాధువర్తన మనంగఁ
దనదిగంతరవర్తిప్రతాప మనఁగ
నివి యుదాహరణంబు లై యెందుఁ జెల్లు. 130

తన = తన యొక్క; విశిష్ట = ప్రత్యేకమైన; కుల = కులానికి సంబంధించిన; = ఆచరించే సాంప్రదాయిక విధివిధానం; అనఁగన్ = అనే విధంగా, తన; జగత్ గీత = ప్రాపంచికమైన; సాధు వర్తనము = మంచి ప్రవర్తన; అనంగ = అనే విధంగా; తన; దిగంతర వర్తి = విశ్వమంతా వ్యాపించే; ప్రతాపము = శౌర్యం; అనఁగన్ = అనే విధంగా; ఇవి = ఇలాంటివి; ఉదాహరణంబులు+ఐ = ఉదాహరణలుగా; ఎందున్ = ఎక్కడైనా; చెల్లు = చెల్లుతాయి.

“తన విశిష్ట కులాచార ధర్మమనీ, తన జగద్గీత సాధువర్తనము అనీ తన దిగంతరవర్తి ప్రతాపం అనీ ఇలాంటివి ఉదాహరణలు అంతటా కనిపిస్తాయి. చెల్లుతాయి.”

పై ఉదాహరణల్లో విశిష్ట కులాచార ధర్మం; జగద్గీత సాధువర్తనం; దిగంతరవర్తి ప్రతాపం అనేవి సంస్కృత సమాసాలు. వీటికి ‘తెనుగు మాట’ ముందుగా చేరినప్పుడు ఆ మాటతో ఆ సంస్కృత సమాసం మొత్తంలోని చివరిపదంతోనే దానికి ‘అర్థఘటన’ అంటే అర్థ సంబంధం ఏర్పడుతుంది. అంటే ‘తన విశిష్టకులాచార ధర్మం’ అంటే ‘తన ధర్మం’ అనీ, అలాగే తన జగద్గీత సాధువర్తనం అంటే ‘తన వర్తనం’ అనీ; తన దిగంతరవర్తి ప్రతాపం అంటే ‘తన ప్రతాపం’ అని అర్థం చేసుకోవాలి. భాషా శాస్త్రంలో కూడా ఈ విషయం గురించి ఇలాగే చెప్పారు. అంటే ఎన్ని విశేషణాలు చేర్చినా చివర వచ్చే ‘నామం’ మాత్రమే ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుందని వారి వివరణ. ఉదాహరణకు మనం ‘that pretty, intelligent Indian girl’ అని అన్నా అదంతా కూడా ‘that girl’ అనేదానికి సమానం. అంటే నామపదబంధంలో అసలు నామానికి పూర్వం ఎన్ని విశేషణాలైనా చేర్చుకోవచ్చు, కానీ సర్వ నామ సంబంధాలైన తన, నా, నీ, ఆ, ఈ – ఇలాంటివన్నీ చివరి నామంతో మాత్రమే కలపవచ్చు. వాటితోనే ‘అర్థం బోధపడుతుంది’ అని సారాంశం. దేవినేని సూరయ్య వివరణ: “ఇందు తన అనుశబ్దము ధర్మము, వర్తనము, ప్రతాపము అను పదములతో నన్వయించును. కాని తత్పూర్వపదంబులతో నన్వయింపదు”. (పు. 103) అనేది కూడా పైన చెప్పిన అంశాన్నే తెలియజేస్తోంది.

హరిశివకుమార్ “పెక్కు సంస్కృత శబ్దముల నొకచోట కూర్చి, వానికొక తెలుగు పదము విశేషణముగా జేర్చి సమాసము గావించినచో, నా తెలుగు పదము మిగిలిన సంస్కృత పదములన్నిటితోడను నన్వయించును – తన విశిష్టకులాచార ధర్మము, తన జగద్గీతసాధువర్తనము (ఆం.భా. భూ. 129-130) అని అన్నారు.

క.
దినకర కొడుకునకును సరి
యనిమిష మొదవునకు సాటి యని యిబ్భంగిన్
దెనిఁగింప సంస్కృతములం
దెనుఁగులు సంధించి రేనిఁ దెగడుదు రార్యుల్. 131

దినకర కొడుకునకును = సూర్యుని కుమారునికి; సరి = సమానం; అనిమిష మొదవునకు = కామధేనువుకూ, సాటి = సమానం; అని = అనేటటువంటి; ఇబ్బంగిన్ = ఈ విధంగా; తెనిగింప = తెలుగు చేస్తూ, సంస్కృతములన్ సంస్కృత పదాలతో; తెనుఁగులు = తెలుగు మాటలు; సంధించిరి – ఏనిన్ = కలిపినట్లైతే; తెగడుదురు = తిడతారు/ నిరసిస్తారు; ఆర్యుల్ = పెద్దలు. “దినకర కొడుకు, అనిమిష మొదవు అని సంస్కృత పదంతో తెలుగు పదం కలపడం పెద్దలు నిరసిస్తారు”.

ఈ వ్యాకరణ గ్రంథంలో ఈ సూత్రం ఇప్పటి దాకా కేతన ఎంచుకుని చెప్పిన పద్ధతికి భిన్న మైనది; విలక్షణమైనది, ‘సమాసాలు’ కొత్త పదాల రూపకల్పనకు దారితీస్తాయి. (Formation of New words) అయితే అలా రూపొందడానికి కూడా భాషలో కొన్ని అంతర్గత నిర్మాణ విధానాలు లేదా పద్ధతులు ఉన్నాయి. అందువల్ల ఏ పదాన్నైనా దేనితో నైనా కలపడం సాధ్యం కాదు; అలాగే కొన్నిసార్లు అంగీకార యోగ్యమయ్యే పదబంధాలు మరికొన్ని చోట్ల అలాంటి పదబంధాలను (అంటే సంస్కృతం + తెలుగు కలిసినవి) అనుమతించవు.

ఈ పద్యంలో కేతన భాషా సంబంధమైన లక్షణ సూత్రం ఏమీ చెప్పడం లేదు. ఇలాంటి సంస్కృతం తెలుగు పదాల కలయికలతో ఏర్పడే సమాసాలను ‘ఆర్యులు’ తిడతారు లేదా నిరసిస్తారు అని మాత్రమే చెప్పాడు; అంటే అలా వాడే వాళ్ళు కొందరు ఉన్నారనీ, దానిని ఆర్యులు (తర్వాత కాలంలో శిష్టులు అన్నట్లుగా) ఇష్టపడరనీ చెప్పడం వరకే ఆయన చేసారు తప్ప, తన అభిప్రాయంగా కానీ, భాషాగత లక్షణంగా కానీ చెప్పలేదు. దేవినేని సూరయ్య తన వివరణలో “సమాసములు సాంస్కృతికము నాచ్ఛికము, మిశ్రమము నని మూడు విధముగా నుండును అని చెప్పి, మిశ్రమము సంస్కృత సమములకు నచ్చ తెలుగు పదములకు గలుగునది. తటాకంబునీరు, చెఱువు జలము అని యిట్టుండనగు గాని మిశ్రమున నెప్పుడును మొదట సంస్కృత పదమును గూర్పజనదు. మీది పద్యములో దినకరకొడుకు, అనిమిషమొదవు అని యనునపుడు మొదటి పదము సంస్కృతము, రెండవది తెలుగుగానుండుటచే నవి తప్పులైనవి. మిశ్రమ సమాసములో నొకపదము తెలుగు పదముగను, మఱి యొకటి తత్సమముగను ఉండునని యెఱుంగునది” (పు. 103-104) అని తెలుగు + సంస్కృతంతో ఏర్పడే సమాసాలు సరియైనవే కానీ సంస్కృతం + తెలుగుతో ఏర్పడేవి సరియైనవి కావని చెప్పారు.

హరి శివకుమార్ “కేతన సంస్కృత శబ్దములపై తెనుగు ఘటించిన దినకరకొడుకు, అనిమిష మొదవు ఇత్యాది సమాసములు వ్యాకరణ విరుద్ధములని చెప్పి వానిని నిషేధించినారు” (పు. 126) అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక భేదం గుర్తించాలి. వీటిని కేతన నిషేధించలేదు; “ఆర్యులు తెగడుదురు” అని మాత్రమే చెప్పాడు.

క.
తెనుఁగు పదంబులపైఁ బెం
పొనరఁగ సంస్కృతము చెల్లు నొక్కొకచోటన్
మును సుకవీంద్రులు గృతులన్
బనిఁగొని రచియించినట్టిపరిపాటిమెయిన్ 132

తెనుఁగు పదంబుల పైన్ = తెలుగు మాటలపై; పెంపు ఒనరగ చక్కగా; సంస్కృతము చెల్లున్ = సంస్కృత పదం చెల్లుతోంది; ఒక్కొకచోటన్ కొన్నిసార్లు; మును = పూర్వం; సుకవీంద్రులు = మంచి కవులు; కృతులన్ = కావ్యాలలో; పనిఁగొని పనిగట్టుకొని; రచియించినట్టి = రాసినటువంటి; పరిపాటిమెయిన్ = అలవాటు వల్ల/ సంప్రదాయాల వల్ల.

“తెలుగు మాటలతో సంస్కృతం పదాలు కలిపి సమాసం చేస్తే కొన్నిసార్లు చెల్లుతుంది; పూర్వం మంచి కవులైన వాళ్ళు ఈ విధాలైన సమాసాలను పనిగట్టుకొని వాడిన సంప్రదాయం ఉంది కాబట్టి ఇవి చెల్లుతాయి)”.

తెలుగు మొదటి మాటగా సంస్కృతం రెండవ మాటగా సమాస రూపాలు ఏర్పరచి పూర్వకవులు, అందులోనూ సుకవులు వాడిన సంప్రదాయం ఉండటం వల్ల అలాంటి వాటిని కొన్నిసార్లు అనుమతించవచ్చునని పై పద్యం సారాంశం.

ఒక భాషపై మరొక భాషా పదాల ప్రభావం అనివార్యంగా ఎక్కువకాలం కలిసిపోయి ఉన్నట్లయితే ఆ రెండు భాషల భిన్న పదాలతో సమాసాలు ఏర్పడితే కొంత అసహజంగా అనిపించడం న్యాయమే. భాషలో వీటిని వైరి సమాసాలు అన్నా, మరొకటి అన్నా వాటిని నిషేధించడం మాత్రం కేతన కాలానికి పూర్వం నుండీ ఈ నాటికీ కూడా సాధ్యం కాలేదన్నది నిజం. తెలుగులోనే కాదు; ఏ భాషలోనూ కూడా ఇలాంటి నిషేధాలవల్ల భాషా పరిణామం ఆగిపోలేదు. ఎందుకంటే భాషలో కేవలం వ్యాకర్తల ఇష్టాయిష్టాలతో కాక, ప్రజల వ్యవహార సరళివల్ల పరిణామ క్రమంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నది భాషా చారిత్రక పరిణామం అధ్యయనం చేసిన వారందరికీ తెలిసిన విషయమే. దేవినేని సూరయ్య “పూర్వకవి సమ్మతమున నొక్కొకచో దెలుగు పదములు సంస్కృత పదములు సమసింపవచ్చును” (పు. 104) అని మాత్రమే చెప్పారు.

హరి శివకుమార్ “మఱియొక పద్యమున కేతన పూర్వ కవి సమ్మతమున నొక్కొకచో దెలుగు పదములపై సంస్కృత పదములు సమాసింపవచ్చునని” ఉదాహరణ లిచ్చాడని మాత్రం చెప్పారు.

క.
వాఁడిమయూఖము లనఁగా
వేఁడిపయోధార లనఁగ వింజామర నా
మూఁడస్త్రంబు లనంగా
బోఁడిమిఁ గఱకంఠనామము న్బోలి తగున్ 133

వాడిమయూఖములు = తీక్షణమైన/సూదిమొనవంటి కిరణాలు; అనఁగా = అనే విధంగా; వేడిపయోధారలు = వెచ్చటి పాలధారలు; అనఁగ = అనే విధంగా; వింజామర నా = వీవెన/విసనకర్ర అనే విధంగా; మూఁడస్త్రంబులు = మూడు అస్త్రాలు; అనఁగన్ = అనే విధంగా; పోడిమి = సరిగ్గా; కఱకంఠ నామమున్ = కఱకంఠ నామాన్ని; పోలి = పోలినటువంటివి; తగున్ = సరియైనవే.

“వాడి మయూఖములు అనీ, వేడిపయోధారలనీ, వింజామర అనీ; మూడస్త్రంబులు అనీ ఇలాంటివి ‘కఱకంఠ నామం’ అనే పేరు వలె సరియైనవే”.

కేతన ఇక్కడ తానిచ్చే ఉదాహరణలు వాడిమయూఖములు, వేడిపయోధారలు, వింజామరలు, మూడస్త్రంబులు వంటివి ‘ కఱకంఠ నామాన్ని పోలి సరియైనవేనని చెప్తున్నాడు. అంటే తెలుగులో ఇలాంటి సమాసాలు వాడటానికి ప్రారంభశబ్దం కఱకంఠ అన్నది. ఇది నన్నయప్రయోగం. అందువల్ల కేతన నుండి సూరి వరకూ ఈ మాటను ఉదాహరణగా ఇవ్వక తప్పలేదు. కేతన కవుల ప్రయోగాల నుండి ఒక నాలుగు మాటలు తీసి ఉదాహరణలుగా చూపాడు. పైవన్నీ నన్నయ, తిక్కన తదితర కవుల కావ్యాలలోని ఉదాహరణలే.

నన్నయ ‘శబ్ద శాసనుడు’ లేదా ‘వాగనుశాసనుడు’ అని పేరున్నవాడు; ఆయనే ‘కఱకంఠుడు’ అని వాడగా లేనిది మనం వాడితే ఏం అన్న ధోరణితో కూడిన తర్కమే తప్ప, దీన్లో కేతన సమర్థింపు ఏమీ లేదు. అప్పటికే ఇలాంటి సమాసాలు భాషలోనూ, కవి ప్రయోగాల్లోనూ స్థిరీకృతమైనాయని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి.

ఇలాంటి వాటిని అధర్వణుడు, బాలసరస్వతి మొదలయినవారు కూడా సమర్థించారని చెప్తూ, హరి శివకుమార్ కేతన “కఱకంఠ” శబ్దము నీ యుదాహరణలో చూపు సందర్భమున మిక్కిలి గడుసుతనము చూపినాడు అనీ, ‘కఱకంఠనామ’ మనుటచే ‘కఱకంఠు’డనే పేరనియు, ‘కఱకంఠము’ నామవాచకమనియును నిరువిధానముల గ్రహింపవచ్చును. కాని కఱకంఠుడనునదే నన్నయ ప్రయోగము; కావున రెండును కలిసి వచ్చునట్లు గడుసుగా కఱకంఠ నామ’మని చెప్పినాడు కేతన” (పు. 126) అన్నారు.

క.
నీ సంస్కృతంబుతోడ స
మాసించును నీవినూత్న మణినూపురశ
బ్దాసక్తచిత్తహంస
త్రాసకరాంబుదము నాఁగఁ దఱుచై యునికిన్ 134

నీ = ‘నీ’ అనే సర్వనామం; సంస్కృతంబుతోడ = సంస్కృతంతో కలిసి; సమాసించును = సమాసమౌతుంది; నీ వినూత్న మణినూపుర శబ్దాసక్తచిత్తహంస త్రాసకరాంబుదము = (ఇదొక పెద్ద సంస్కృత సమాసం; దీనికి ముందు ‘నీ’ చేరింది) కొత్త కాలి అందెల చప్పుడులో లీనమైన హృదయమనే హంసకు భయాన్ని కలిగించే మబ్బు; నాఁగ = అనే విధంగా; తఱుచి = తరచుగా; ఉనికిన్ = ఉండటం వల్ల.

“నీ అనే సర్వనామం సంస్కృతంతో కలిసి “నీ వినూత్న మణినూపుర శబ్దాసక్తచిత్త హంసత్రాసకరాంబుదము” వంటి సమాసాలు తరచుగా ఉండటంవల్ల (అలాంటివి) సమాసంగా రూపొందుతుంది”.

పైనే ‘తన, నా, నీ’ అనే వాటితో సమాసం ఏర్పడుతోందని చెప్పినా, ఎందుకనో కేతన ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద సమాసం ముందు ‘నీ’ వచ్చి ‘సమాసిస్తుంది’ (=సమాసం ఏర్పడుతోంది) అంటూ ‘నీ వినూత్న మణినూపురశబ్దా సక్త చిత్త హంస త్రాస కరాంబుదము’ అంటూ రాయడం ఉందన్నది ఉదాహరణగా చూపాడు. “అటజని కాంచె” అనే తెలుగు వాక్యంతో ప్రారంభించి పెద్దన తన మనుచరిత్రలో భూమి సురుడంబర…. శీతశైలమున్” అని చివరలో ద్వితీయావిభక్తి రూపం మాత్రం పెట్టి మొత్తం పద్యాన్నంతా ఏక సమాసంలో చూపిన విధం గుర్తుకు తెస్తుందీ పద్యం. ఇలాంటి ప్రయోగాలు తెలుగు కావ్యాలలో ‘తరచుగా’ ఉంటాయని కేతన అంగీకరించాడు. అందువల్ల ఈ ప్రయోగం నన్నయదో లేక ఇంకా ఏ గ్రంథంలో దో గుర్తించాల్సి ఉంది.

“నీ యనునది దీర్ఘ సమాసముతోడను సమాసించుననుట” అంటూ దేవినేని సూరయ్య ‘నీ’తో సంస్కృత సమాసం జరుగుతుందని దీర్ఘ సమాసం కూడా ఏర్పడుతుందని సూచించాడు. (పు.105)

క.
ముదమున నా యీ యే లను
పదములతుద నూష్మ లుడుగఁ బైవర్ణముతో
నదుకు నెడఁ గుదియు సాగును
గుదియునెడన్ జడ్డవ్రాలగున్ బైహల్లుల్. 135

ముదమునన్ = సంతోషంగా; ఆ, ఈ, ఏ లు ను = ఆ, ఈ, ఏ అనే పదాంశాలను; పదములతుదన్ = మాటలచివర; ఊష్మలు = ఊష్మాలుగా పేర్కొనే ‘శ, ష, స, హ’ అక్షరాలు; ఉడుగన్ = వదిలి పెట్టి; పై వర్ణముతోన్ = మిగిలిన, పైన వచ్చేపదంలోని అక్షరంతో; అదుకు నెడన్ = కలిపేటప్పుడు; కుదియు = చిన్నది (హ్రస్వం) అవుతోంది; సాగును = దీర్ఘం అవుతోంది; కుదియు నెడన్ = హ్రస్వమైనప్పుడు; జడ్డ వ్రాలు = ద్విత్వాలు; అగున్ = అవుతాయి; పై హల్లుల్ = పక్కనున్న హల్లులు.

“ఆ, ఈ, ఏ అనే పదాల చివర ‘శ, ష, స, హ’ అనే అక్షరాలను వదిలివేసి మిగిలిన, పక్క పదంలోని హల్లుతోను కలిపినప్పుడు ఆ, ఈ, ఏ లు హ్రస్వాలుగా నైన మారుతాయి. లేదా దీర్ఘాలుగానే ఉంటాయి. అయితే హ్రస్వాలుగా మారినప్పుడు పక్కనున్న హల్లులు ద్విత్వాలవుతాయి”.

ఊష్మాలుగా పేర్కొన బడే శ, ష, స, హ లనే అక్షరాలు తప్ప మిగిలిన అన్ని హల్లులతో ప్రారంభమయ్యే పదాలన్నీ కూడా ఆ, ఈ, ఏ అనే పదాలతో కలిసినప్పుడు ఆ, ఈ, ఏ లు హ్రస్వాలుగా అంటే “అ, ఇ, ఎ” అని అయినా మారుతాయి, లేదా అలాగే దీర్ఘాలుగానే ఉంటాయి. కానీ హ్రస్వాలైనప్పుడు పక్కనున్న హల్లులు ద్విత్వాలుగా మారుతాయి. అంటే దీనిలో రెండు సూత్రాలున్నాయి. మొదటిది వైకల్పికం లేదా ఐచ్ఛికం. రెండోది యథాతథం.

1) { ఆ/ఈ /ఏ} + హల్లు = {అ/ఇ/ఎ} / — హల్లు

2) {ఆ, ఈ, ఏ} > ఆ, ఈ, ఏ/ – హల్లు

3) హల్లు = ద్విత్వం { అ/ఇ/ ఎ}/ –

క.
ఆకామిని యక్కామిని
యీకొడు కిక్కొడుకు నాఁగ నీయూ రియ్యూ
రేకార్యం బెక్కార్యం
బాకథ యక్కథ యనఁగ నుదాహరణంబుల్. 136.

ఆ కామిని, అక్కామిని = ఆ కామిని అని కానీ; అక్కామిని అని కానీ, ‘అ’ హ్రస్వం – కా జడ్డ | ద్విత్వం క్కా); ఈ కొడుకు, ఇక్కొడుకు = ఈ రెండు రూపాలలో ఒకటి; నాఁగన్ అనే విధంగా; ఈ ఊరు, ఇయ్యూరు అనే రెండు రూపాలలోనూ; ఏ కార్యం ఎక్కార్యం అనే విధంగానూ; ఆ కథ = ఆ కథ; అక్కథ= అక్కథ; అనఁగన్ = అనే విధంగా; ఉదాహరణంబుల్ = ఉదాహరణలు.

“136లో చెప్పిన సూత్రానికి ఉదాహరణలు = ఆకామిని లేదా అక్కామిని; ఈ కొడుకు – ఇక్కొడుకు; ఈ ఊరు – ఇయ్యూరు; ఏ కార్యంబు – ఎక్కార్యంబు; ఆకథ అక్కథ”.

ఈ ‘ఆ, ఈ, ఏ’ లకు కేతన ఏ పేరూ పెట్టలేదు. కానీ తర్వాతి వ్యాకర్తలు వీటిని ‘త్రికం’ అన్నారు. వీటితో ఏర్పడే (136లోని కేతన సూత్రం ద్వారా) సంధి విధానాన్ని త్రికసంధి అన్నారు. ఇవి చేరినప్పుడు శ, ష, స, హలు మినహా మిగిలిన హల్లులన్నీ అలాగైనా ఉంటాయి, అప్పుడు ఈ త్రికాలు దీర్ఘంగానే ఉంటాయి; లేదంటే ఇవి హ్రస్వంగా మారి, పక్కనున్న హల్లుల్ని జడ్డలు అంటే ద్విత్వాలుగా మార్చేస్తాయి.

ఉదా:
అక్కామిని
(ఆ హ్రస్వం – కా ద్విత్వం)
ఆ + కామిని = అక్కామిని/ఆ కామిని
ఆ + కథ =| అక్కథ/ ఆ కథ

‘శ, ష, స, హ’ లైన ఊష్మాలకు ఈ సూత్రం వర్తించదని చెప్పడం వల్ల సూరయ్య “… అశ్శక్తి, ఆష్షట్కము, అస్సంతతి, అహవిస్సు” అనే రూపాలుండవని చెప్తూ వాటితో పాటు అర్రాజు, అగ్గామము మున్నగు రూపంబులుండవని యెఱుంగునది” అని పేర్కొన్నాడు
(పు. 106).

హరి శివకుమార్ “ఈ సమాస ప్రక్రియను తెనుగుభాషలోనికి సంస్కృతము నుండియే తెచ్చినను, తల్లక్షణానుగుణముగానే వివరించినాడు కేతన. కర్మధారయమునందలి నిగాగమము, బహువ్రీహి యందలి సమాసాంత కార్యములు, ద్వంద్వ సమాసమునందలి గసడదవా దేశము, యుష్మదస్మదాత్మార్థకంబుల కుత్వపదంబు పరంబగునపుడు దుగాగమం, తన, నా, నీ పదములతో సమాసప్రక్రియ, వైరి సమాసములు అనునవి తెలుగునకు ప్రత్యేకములు. తెనుగు భాషా సంప్రదాయమును బాగుగా నెరిగి, ఆ ప్రక్రియలను వివరించినాడు కేతన” (పు. 126) అని సరిగ్గా ముగించారు.


అయినవోలు ఉషాదేవి

రచయిత అయినవోలు ఉషాదేవి గురించి: అయినవోలు ఉషాదేవి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు. Acquisition of Telugu syntax (1990, New Delhi), ధ్వన్యనుకరణ పదకోశం (2001, తెలుగు విశ్వవిద్యాలయం), Issues on Lexicography 2006, Andhra Bhasha bhushanamu: Original Text with Transliteration, meaning, Translation మొదలైనవి ఆవిడ రాసిన గ్రంథాలలో ప్రసిద్ధమైనవి. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్‌గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి "ఉత్తమ ఉపాధ్యాయ" పురస్కారాన్నిచ్చింది. 2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు. ...