సంక్షోభం-శోకం-సాహిత్యం

[మంటోనే గుర్తొస్తున్నాడు. సియా హాషియేనే గుర్తొస్తోంది.

మరణ వార్తలని వార్తాపత్రికల్లో ప్రచురించేటప్పుడు చుట్టూ చిక్కని నల్ల బార్డర్లు వేయడం ఆనవాయితీ. అదెప్పుడు? లోకం కాస్తో కూస్తో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే. యుద్ధసమయాల్లో, ప్రకృతి భీభత్సాల్లో, అల్లర్లలో మనిషి చావుకి ఒక గౌరవం ఉండదు. హోదాలుండవు. దహన సంస్కారాలు ఉండవు. కనీసం వారిని లెక్కపెట్టి అధికార గణాంకాల్లో ఆ మాత్రం ఉనికిని కూడా వారికి మిగలనివ్వరు.

ఇలా అసందర్భంగా, అన్యాయంగా, అమానుషంగా, అర్థరహితంగా చనిపోయినవాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళకి సాహిత్యమే కాస్తన్నా మర్యాదనిస్తుంది. తెల్లబట్టలో చుట్టి తాళ్ళు కట్టిన ‘శవాల’ వెనుక మనుషులని, జీవితాలని గుర్తుచేసుకుంటుంది. మంటో సియా హాషియే చదివినప్పుడు మరీ అంత విడ్డూరంగా, అమానుషంగా ఎలా ఉంటుందా అని వాపోయేదాన్ని. ఇప్పుడు సోషల్ మీడియా, వాలంటరింగ్ ద్వారా వినిపిస్తున్నవన్నీ ‘సియా హాషియే’లే.

ముస్లిమ్ పేషంట్ కొన ఊపిరితో ఉంటే కల్మా చదివిన హిందూ డాక్టర్; ఆక్సిజన్ సప్లయర్ ముస్లిమ్ కనుక అత్యవసరమున్నా సిలిండర్ తీసుకెళ్ళడానికి నిరాకరించిన హిందూ కుటుంబం; తనామనా బేధం లేకుండా కులమతాలకతీతంగా రోజుకి వందలాది దహన సంస్కారాలు చేస్తూ, చనిపోయినవారికి కనీస గౌరవాన్ని అందిస్తున్న యువత; హోమ్ ఐసోలేషన్‌లో ఉండి కూడా ‘బ్రాహ్మణుల ఇంట వండితేనే మీ మీల్స్ తీసుకుంటాం’ అని ఖరాఖండీగా చెప్పే ఒక ఒంటరి పెద్దమనిషి; కరోనా రోగ లక్షణాలు కనిపించగానే గదిలో పెట్టి తాళం వేసి మర్నాడు ప్రాణం పోయేవరకూ పెద్దాయనకి పచ్చిమంచినీళ్ళు కూడా ఇవ్వని కుటుంబ సభ్యులు; వైరస్ వచ్చి ఊపిరాడనివాళ్ళు, వైరస్ అంటుకుంటుందేమోన్న భయాందోళనలతో ఊపిరి తీసుకుంటున్నవాళ్ళు; “డబ్బు లేకపోతే బతికే హక్కు లేదా?” అని రగిలిపోయే గుండెలు, “ఇంత డబ్బుండీ, అంత ఖర్చు పెట్టీ మనిషిని దక్కించుకోలేకపోయామే” అని కుమిలిపోయే మనసులు; ఎలా అయినా బతికి తీరాలన్న మొండిపట్టు, అందరూ పోయి మనమే ఎందుకు బతుకుతున్నామనే సర్వయివల్ గిల్ట్…

ఈ గండం గట్టెక్కగానే మర్చిపోయే సంగతులు కావివి. #sabYaadRakhaJaayega (అన్నీ గుర్తుపెట్టుకుంటాం) అన్నది ఒక పొలిటికల్ స్లోగన్ మాత్రమే కాదు. బతికి బట్టకట్టిన ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అది. ఆ బాధ్యతని మోయాల్సినవాళ్ళల్లో ప్రప్రథమంగా ఉండాల్సింది కవులూ, రచయితలూ, కళాకారులు. చిన్న వెలుగుని కూడా చూడనలేంతగా కళ్ళు చీకటికి అలవాటు పడిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ కళ్ళు తెరవమని గుర్తు చేసి, గుండె రాయి అయిపోయి శోకమంతా గొంతులో అటకాయించినప్పుడు కరిగించి కన్నీరుగా మార్చి, కన్నీటి ఉప్పెనలో కొట్టుకుపోతున్న జీవానికి ఆసరా ఇవ్వగలిగినవారిలో సాహిత్యకారులు ఒకరు!

అలా తమ వంతుగా ప్రస్తుత పరిస్థితుల గురించి నేరుగా, సూటిగా కవిత్వం రాస్తున్నవారిలో ఎంపిక చేసిన ఆరు కవితలకి అనువాదాలు ఇవి. అనువాదాలకి అనుమతినిచ్చిన కవులకి ధన్యవాదాలు. – పూర్ణిమ.]


ఫోన్ కాల్

హలో, హలో, కట్ చేయకండి.
వినిపిస్తోందా? ఇబ్బంది పెడుతున్నందుకు
ఇంత అర్ధరాత్రి, ఏమనుకోకండి.
నేనా? మీకు తెలీదులేండి.
మాట్లాడొచ్చా?
లోకమెంత క్రూరమైపోయిందసలు.
హలో… వినిపిస్తోందా? సర్, ఇది
ముఖ్యమైన సంగతి. అట్టే
సమయం తీసుకోను.
ఎవరూ లేరు ఇంట్లో. బాధేస్తోంది.
ఈ పీడ ఎప్పుడు విరగడవుతుంది?
నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలిగే
లోకమొకటి ఉందా? ఈ రాత్రి
చీమ చిటుక్కుమనటం లేదు.

హలో, హలో,
వినిపిస్తోందా?

– రోహిత్. (మూలం: Phone call[1]Phone Call

Hello, Hello, do not hang up
Can you hear? Sorry for calling
at this untimely hour.
You don’t know me.
I hope it’s okay to speak.
The world has become cruel.
Hello… am I audible? Sir, this is
Important. I won’t take
much of your time.
No one’s at home. It’s painful.
When will this suffering end?
Is there a world where
I can breathe free? The night
is too silent.

Hello, Hello,
Can you hear?
– Rohith
)

సమయం లేదు

ఎలానూ చావబోతున్నావు కాబట్టి
కాస్త నిశ్శబ్దంగా చావు.
ఇది చప్పుడు చేయాల్సిన సమయం కాదు.

వినలేదా, మంత్రిగారికి
ఇప్పుడే రెప్పవాలింది
అతి కష్టం మీద!
ప్రజలందరినీ నిద్రపుచ్చి
పాపం, కొద్దిగా
నడుము వాల్చడానికి.

ఈ గొడవలూ కొట్లాటలతో
ఆవేశాలూ కావేషాలతో
నిద్రపోతున్న జనానికి గానీ మెలకువ వస్తే
ఆకలి, రోగం, నిస్సహాయత,
తీసే ప్రతీ ఊపిరి బరువెక్కుతూ…
బతకాలనే ఆశ పెరిగిపోతే
ఈ అమాయక ప్రజానీకం తట్టుకోగలదా?

ఇవన్నీ పోనీలే అనుకుందాం.
కానీ,
మన ప్రియమైన మంత్రిగారు,
ఇన్నాళ్ళ ఎన్నికల తర్వాత
ఇప్పుడే కాళ్ళు చాచి పడుకున్న
ఆయనని నిద్రలేపాలని జనాలు గుమిగూడితే
ఊహించు, అదెంత ప్రమాదమో!

దేశం మొత్తాన్ని శ్మశానం చేస్తావా ఏం?
నీకు చావు ఎంత ముంచుకొస్తే మాత్రం!
చావు నిఖార్సైన నిజం, నువ్వు వినలేదా?
తెల్లగుడ్డ కప్పుకో, చప్పుడు చేయకుండా చావు!

– కార్తీకే. (మూలం: समय नहीं है[2]समय नहीं है

अगर मर ही रहे हो,
तो शांति से मरो – ये आवाज़ करने का
समय नहीं है!

सुना नहीं, मंत्री जी की आँख लगी है,
बड़ी मुश्किल से।
जनता आदि को सुलाकर,
अब बेचारे आराम कर रहे।

इस सारे शोर-शराबे से,
यूं चीखने-चिल्लाने से,
अगर सोती जनता जाग गई तो—
भूख, बीमारी, लाचारी, हर सांस
होती हुई भारी, जीवन की ये लालची कोशिश
—क्या भोली जनता सह पाएगी?

और ये सब तो फिर भी ठीक है
लेकिन,
जो हमारे प्यारे मंत्री जी,
इतने दिन के चुनाव के बाद,
अब टांग पसारे सोये हैं,
कहीं उन्हे उठाने पहुँची जनता,
फिर तो सोचो क्या ही शामत आएगी!

क्यूँ पूरे देश को तुम्हें शमशान बनाना है,
तुम्हारी मौत आई है? अच्छा है!
मृत्यु ही अटल सत्य है, सुना नहीं?
खादी कफ़न ओढ़ो, और चुप-चाप सो जाओ!
– कार्तिके २२|०४|२१
)

అన్నింటికీ కొరతే

వెంటిలేటర్లు లేవు, బైపాప్స్ లేవు, ప్రేమ లేదు, ఊపిరి కూడా లేదు.
(కోవిడ్ వార్డులో పుట్టిన ఈ కవిత ఊపిరి ఇప్పటిదాకా తీసుకోలేదు.)
అయినా, ఏమని రాయను, నన్ను నిద్రపోనివ్వని పేషంట్ల గురించి
వారు బతికున్నప్పుడే కాదు, చనిపోయినాక కూడా.

మాస్కులోపలే కుమిలి కుమిలి ఏడ్చే ఆ బోడిగుండు ఆవిడ
తనచుట్టూ కమ్ముకున్న మొండిగోడలను చూస్తూ
వాటిపై పార్కు బొమ్మలు: ఉయ్యాలలు, పరుగెడుతూ పిల్లలూ.

రిటైరైన మిలటరీ పెద్దాయన చెప్పిన కార్గిల్ యుద్ధం ముచ్చట్లు
కేవలం షక్కర్‌పారాలు తిని అన్నిరోజులు ఎలా బతికాడో.
ఊపిరి కోసం గిలగిలలాడుతున్న ఆయన మొహంలో
నిస్సహాయత; నేను పరుగెత్తుకుంటూ వెళ్ళేసరికి.

ఆ అమ్మాయి ఒక ఆర్కిటెక్ట్; అందరికీ లంచం ఎర చూపిస్తూ
ఒక టూత్ పేస్ట్, టూత్ బ్రష్ కోసం.
(వెంటిలేటర్ మాస్క్ ఆమె ఎప్పుడూ పెట్టుకునే ఉండాలి)
‘డాక్టర్, రాబందులు నా నోట్లో చచ్చినట్టు కంపు.’

ఆ లావుపాటాయన రొప్పుతూ రోజుతూ వచ్చాడు క్యాజువాలిటీ వార్డ్ నుంచి
వెంటిలేటర్ ట్యూబులు పెట్టినాక కానీ తగ్గని భయం మొహం నిండా
అంతలోనే బట్టలు ఖరాబు చేసుకున్నాక, అతడు పడ్డ సిగ్గు అంతా ఇంతా కాదు.
వార్డ్‌లో పెద్దవాళ్ళకు వేసే డైపర్లు లేవు మరి.

వార్డ్స్‌లో అడుగుపెట్టిన ప్రతిసారీ, నిన్ను తలచుకుంటాను.
మనం కలిసిన ఆఖరిసారి
నువ్వు గిఫ్ట్ ఇచ్చిన శివుడి బొమ్మనూ తలుచుకుంటాను.
ఆ లోకమే వేరు; మనం లొట్టలేస్తూ తిన్న బీఫ్ కర్రీ
జూక్‌బాక్స్ నుంచి పాడుతూనే వున్న ఫ్రాంక్ సినాట్రా

ఆ లోకం నుంచి బయటపడడానికి కళ్ళకెదురుగా
వేలాడేసివున్న రింగర్ లాక్టేట్ ఐ.వి. డ్రిప్‌ను చూస్తాను.
బొట్టు, బొట్టుగా, ఒక్కొక్క బొట్టుగా
రాత్రి కరిగిపోయింది, మనలో.
వాన తెలిసింది, నాలో.

మై డియర్, ఒక హుందాతనం ఉంది
బతకడంలో, ప్రేమించడంలో
కానీ ఏ గొప్పతనం ఉంది చావులో?
కోరికలు ఎంతగావున్నా, ఈ కండలు చివరికి మిగలవు.
శరీరం ఒక నల్ల ప్లాస్టిక్ గోతంలో చుట్టబడుతుంది
(రోజంతా ఇదేపని చేస్తూ అలసిపోయి ఇంటికెళ్ళాలనే ధ్యాసలో ఉన్న పనివారిచేత)
చేతులు లాగబడి, కాళ్ళు గుంజబడి
బారుగా సర్దుబడి అయ్యేవరకూ.

మనం మళ్ళీ కలవకుండానే
బహుశా, ఎవరో ఒకరం ఆ తీరాన్ని దాటవచ్చు.
మనం ఉన్నట్టుగా, ఉంటున్నట్టుగా ఇక ఉండకపోవచ్చు.
కానీ నాకు ప్రాప్తమయ్యే లోకం అనుమతిస్తే,
నేను మళ్ళీ పొగమంచు నిండిన దారుల్లో నడుస్తాను.
దారిలో ఉన్న ముద్దగన్నేరు పూలను పలకరిస్తాను.

ఇప్పుడు ఈ లోకంలో…
నువ్వు దూరంగా ఉన్నావ్.
నేను ఒక్కణ్ణే ఇక్కడ కోవిడ్ వార్డులో
కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న నలుగురు పేషంట్లు.
వెంటిలేటర్లు లేవు, ఒకటే బైపాప్.

ఒక్కనిమిషంలో నేనో నిర్ణయం తీసుకోవాలి.
ఊపిరి పీల్చేది ఎవరు? రేపటిని చూసేది ఎవరు?
ఆ నిర్ణయం నేను ఎలా తీసుకోగలను?
మానవమాత్రుణ్ణి మరొకరి విధిని ఎలా రాస్తాను?

దానికి బదులుగా నాకు చేయాలనిపిస్తున్నదొకటే.
ఆ మంచినీళ్ళ చెరువు పక్కన కాబిన్ లేదూ?
అక్కడికెళ్ళి, ఈ పిపిఈ చించిపారేసి
అలసటను విప్పిపారేసి
పచ్చిగడ్డిలో నగ్నంగా పడుకుని, నిన్ను
పేరుపెట్టి పెద్దగా పిలవాలని.

డా. అభిజిత్ షాహాజి ఖాంద్కర్ (మూలం: Out of ventilators, Bipaps, love and breaths[3]

Out of ventilators, bipaps, love and breaths.
(A poem that came to me working in the Covid wards but took some time to breathe)

And what do I write, of all the patients who don’t let me sleep.
As much as when they were alive, more so now that they are dead.
The bald woman who would keep wailing from within her mask,
staring at the claustrophobic walls.
Sketches of swings and kids running in the park.

The ex – Service man who had shared with me his exploits from the Kargil war.
How he had survived on just saltries and Shakkarparas.
The helplessness on his face when I rushed to him,
saw him gasping for breath.

The young Architect willing to bribe anyone
to get her a toothbrush and a toothpaste.
(She was on a bipap and had to have her mask on at all times)
‘Doctor, it smells like vultures have died inside my mouth.’

The obese patient rushed in from casualty,
panic all over his face till he got intubated.
The embarassment after, he had soiled his pants
and the ward was out of adult diapers.

Everytime I walk into the wards, I think of you and the Shiva you had gifted me, the last we met.
A different world when we relished the beef on our plates,
on the Juke Box, Frank Sinatra still played.
To distract myself, I stare at the pint of Ringer Lactate, drop by drop –
I see that night dissolve in us.
I feel the rain.
Beloved, there is dignity in loving, living
but there is no dignity in death.
No matter how fervent the desires, nothing lasts of this flesh.
The body gets wrapped in a black plastic bag
(by workers who have been doing this all day, now eager to go home and rest)
The hands are jerked, legs pulled to accommodate,
a flat line is all that remains.

It may so happen, without meeting again
one of us will walk away.
All the ways we were, we are, might change.
But in a realm that allows me to,
I will follow the foggy trail.
Talk to rhododendrons on my way.
In this one though,
you are far away…
I am all alone in the Covid wards
with four patients about to collapse,
no ventilators and one bipap.
In less than a minute, I must decide who gets to breathe
who shall live to see another day.
I don’t wish to though…
How can a meager mortal decide anyone’s fate.
The only thing I want to do instead,
is head to that cabin by the fresh water lake.
Doff off my PPE, disrobe my tiredness,
lie naked on the grass and call out your name.
– Dr. Abhijit Shahaji Khandkar
.

శోక గంగ

వెలితి, నా బిడ్డ తను వేస్తున్న బొమ్మలో రంగులు నింపడానికి ఇష్టపడని ఖాళీ జాగా. అది నింపడానికి సరయిన క్రేయాన్ రంగు ఎంచుకోలేకపోతున్నానని అంటుంది. వరసబెట్టి గీసిన పర్వతాలు తిరగేసి నిలబెట్టిన ఐస్‌క్రీమ్ కోన్స్ లాగా ఊపిరాడకుండా కనిపిస్తున్నాయి. వాటికీ ఆక్సిజన్ అందటం లేదా? ఆ పక్కనే కొన్ని చెట్లు గీయమని అడుగుతాను, వాటి నొప్పి కొంత పోగొట్టడానికి, వాటి బాధ కొంత తగ్గించడానికీ. ఈపాటి ఉదారత చాలు నా ఔన్నత్యానికి కొంత ఊరటనిస్తుంది. నా అలజడిని కాస్త తగ్గిస్తుంది. పేకముక్కల మేడ ఎటూ కూలిపోయేదే. తన బొమ్మలో నా బిడ్డ వంకరటింకరగా గీసిన ఇంటికి ఏమూలనో ఇరికించిన చిన్న కిటికీ లాంటిది నా బాధ. తన ధ్యాస దానిపై లేదు. తన మానాన తను సూర్యుడికి పూసిన నారింజ రంగునే వేసింది మళ్ళీ ఇంకో రెండుసార్లు. కళ్ళు మిరుమిట్లు కొలిపే ఒక పెద్ద నారింజ బంతి. సూర్యరశ్మి బరువుగా, ఏ ఒక రెండు భుజాలో మోయలేనంతగా, పరుచుకుంది. చావు చెల్లాచెదురై పడివున్న ఈ బొమ్మలో పరిపూర్ణత్వమంటూ ఏమీ లేదు. చిక్కగా రంగుపూసిన నది భయానకంగా కనిపిస్తుంది చిన్న అలకు కూడా చోటు లేకుండా. కానీ, ఒక మొసలి (మకరాసురుడు), కొన్ని గులాబీరంగు చిన్న చేపలు మాత్రం ఉన్నాయి. ఆ మొసలి పెంపుడు జంతువని, ఎవరికీ హాని చేయదని చెప్పింది. దానికో ముద్దొచ్చే తోక కూడా ఉంది.

నాకు మాత్రం ఆ నదిలో కొట్టుకొస్తున్న శవాలు కనిపిస్తున్నాయి. నాని ఉబ్బిపోయిన శవాలు. కుక్కలు పీక్కొని తిన్న శవాలు. ఆనవాలు పట్టలేని శవాలు.

గంగా! పాప వినాశినీ! మా ధర్మచరితకు పవిత్రసాక్షివి! శివుని జటాజూటంలో కొలువైన ఉగ్రతేజానివి!

ఎందుకు రహస్యాలు నీలోనే దాచుకోవడానికి నిరాకరించావు?

ఆడదానికి, అవమానాన్ని దిగమింగుకోడానికి మాత్రమే అధికారం ఉందని తెలీదా నీకు?

– పూర్ణిమ లక్ష్మేశ్వర్ (మూలం: When grief becomes Ganges[4]When grief becomes Ganges

Loss is the empty spaces my daughter refuses to color in her landscape. She says she can’t choose a crayon shade for it. The mountains she lines together like upside ice cream cones, seem out of breath. Have they run out of oxygen too? I ask her to draw some trees to relieve them of pain, to put an end to suffering. This much clarity will add a breeze to my privilege, a calm to my panic. The pack of cards will fall anyway. Her focus is not my trauma that is as crammed as the window in her crudely outlined house. Instead, she colors the orange sun, thrice. Big bright ball – too much of a burden of sunlight to bear for any pair of shoulders. Death is scattered here. Entirety is a contradiction. The river she colors is intense without a ripple to spare. But there’s a makara, a sea monster and tiny fishes in pink. She says the sea animal is a pet and harmless. It even has a cute tail.

And all I can see now is floating bodies, bloated and disfigured; torn apart by dogs.

Ganga:

the cleanser of sins | the holiest witness of our history | the furious glory entangled in Shiva’s hair

Why did you refuse to keep the secrets within you?

Don’t you know that a woman is only allowed to swallow shame?
-Purnima Lakshmeshvar.
).

పీనుగుబండి గంగ

ముక్తకంఠంతో చెప్పారు చనిపోయిన వాళ్ళంతా
“మాకేం! ఉన్నాం హాయిగా, నిక్షేపంగా!”

మహాప్రభూ! నీ రామరాజ్యంలో శవాలు మోస్తుంది గంగ!

నిండుకున్నాయి నీ శ్మశానాలు, నిండుకున్నాయి మా కాష్టాలకు కట్టెలు
అలసిపోయాయి మా చేతులు భుజాలు, ఎండిపోయాయి మా కన్నులు
గడపగడపకీ వెళ్ళి యమదూతలు ఆనందంగా
గెలుస్తున్నారు చావుల మాయాజూదంలో వికృతంగా.

మహాప్రభూ! నీ రామరాజ్యంలో శవాలు మోస్తుంది గంగ!

మండుతున్నాయి చితిమంటలు అనుక్షణం
అడుగుతున్నాయి తీరిక ఒకే ఒక క్షణం
ఏడుస్తూ పగులకొట్టుకుంటున్నాం గాజులు
ఇంటింటా బద్దలయేలా బాదుకుంటూ గుండెలు
ఊర్లవుతుంటే వల్లకాడు వయొలిన్ వాయించండి, బిల్లా! రంగా!

మహాప్రభూ! నీ రామరాజ్యంలో శవాలు మోస్తుంది గంగ!

మహాప్రభూ, దివ్యం నీ ఆహార్యం, దేదీప్యం నీ తేజం
దేశం చూసింది నీ అసలు స్వరూపం. నువు రాయివి. కావొక ముత్యం.
“దివ్యవస్త్రాలు కావవి రాజా! నీదొక దిసమొల రూపం!”
అని ధైర్యంగా ఎలుగెత్తి చెప్పలేమనే ఎప్పటికీ ఈ సత్యం

మహాప్రభూ! నీ రామరాజ్యంలో శవాలు మోస్తుంది గంగ!

– పారుల్ ఖక్కర్ (మూలం: શબવાહિની ગંગા[5]એક અવાજે મડદાં બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
– Parul Khakhar
).

ఎవర్నువ్వు?

ధూళినై పోతున్నాను నేను
మారిపోతున్నాను పిడికిలిలా,
ఎంతకీ గడవని రాత్రుల్లో ఏడుపాగని గుండెలా,
వర్షంలా, హోరు గాలిలా,
బలవంతంగా బందీ అయిన నగరంలా,
దాని గల్లీలు నిర్మానుష్యంగా నిశ్శబ్ధంగా,
ప్రేమించినవాడి ఊసు తెలీని ప్రేయసిలా,
గావుకేకలా,
రక్తమోడుతున్న శవాల మధ్య ముగుస్తున్న యుద్ధంలా,
పంపని పోస్ట్‌కార్డ్‌లా,
నడిరేయి కాలి బూడిదవుతున్న వంతెనలా,
గుర్తుపట్టని మొఖాలతో నిండిన ఫోటోలా,
అర్థం కాని ఆవేదనగా చుట్టుముట్టే సాయంకాలంలా,
చివరి రైలు కూడా వెళ్ళిపోయిన స్టేషనులా,
పిట్టల జాడలేని ఆకాశంలా,
తిరిగిరావడానికి ఎవరూ ఇష్టపడని భూమిలా,
ఎముకలు, నీడలు, బూడిదతో నిర్మించిన నగరంలా…

‘ఎవర్నువ్వు?’

నేనొక దేశాన్ని.
కాలం కవాతులో
నన్ను నేను పోగొట్టుకున్నాను.

– రోహిత్.Who are you?[6]Who are you?

I’m turning into dust, into a fist,
into a heart that weeps interminably
on long nights, into rain, into wind,
into a town forcefully shutdown,
its streets deserted, silenced,
into a lover who lost contact with
her beloved, into a cry of pain, into
a war that is ending amidst bleeding
corpses, into an unsent postcard,
into a bridge burning in the midnight,
into a photograph with unknown faces,
into an evening that descends like an
inexplicable sadness, into a railway –
station whose last train has left,
into a sky without a bird, into a land
no one returns to, into a city built
with bones and shadows and ashes.

“Who are you?”

I’m a country that lost itself
in the march of time.
– Rohith

అధస్సూచికలు[+]


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...