హృదయాల ఊసులు

ఆ శిథిల ఉద్యానవనంలో, ఘనీభవించిన ఆ శీతల నిశ్శబ్దంలో,
రెండు ఆకృతులు ఇప్పుడే సాగిపోయాయి.

వడలిన పెదవులు, కళ్ళు కళావిహీనం;
మంద్రస్వరంలో మాటలు వారివి.

ఆ శిథిల ఉద్యానవనంలో, ఘనీభవించిన ఆ శీతల నిశ్శబ్దంలో,
రెండు ఆత్మలు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి.

– మన పురాపారవశ్యాలు నీకు గుర్తుకు వస్తున్నాయా?
– నేనేమి గుర్తు ఉంచుకోవాలని నువ్వు ఆశించావు?

నా పేరు వినగానే నీ హృదయం ఇంకా స్పందిస్తుందా?
ఇప్పటికీ కలలో నీకు నా మనసు ఊసు వినిపిస్తుందా? – లేదు!

ఆహా! వర్ణించలేని ఆనందం నిండిన ఆ రోజులు
విడదీయరాని మన పెదవులు. – అలా అయుండవచ్చు.

ఎంత నీలంగా ఉండింది ఆకాశం, ఎంత గొప్పది మన ఆశ!
– ఆశ ఓడి ఎగిరిపోయింది, బూడిదరంగు ఆకాశం వైపు.

అలా సాగిపోయారు ఆ శిథిల నిశ్శబ్దంలో వారు
రాత్రి మాత్రమే వారి మాటలకు శ్రోత.

(మూలం: Colloque Sentimental)


కన్నిగంటి అనూరాధ

రచయిత కన్నిగంటి అనూరాధ గురించి:

కన్నిగంటి అనూరాధ ఫ్రాన్స్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’ (INALCO) లో తెలుగు బోధకురాలిగా, పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. అనువాద ప్రక్రియలలో నిపుణురాలు. తెలుగు సాహిత్య వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై చాటుతుంటారు.

 ...