పరిచయము
వృత్తముల పాదములలో 1 నుండి 26 అక్షరములవఱకు ఉంటాయి. పాదమునకు 26 కన్న ఎక్కువ అక్షరాలు ఉంటే అట్టి వృత్తములను సంస్కృతములో దండకములు, తెలుగులో ఉద్ధురమాలలు, కన్నడములో మాలికలు అంటారు. త్రిభంగి వృత్తము అట్టి ఒక మాలా (మాలికా) వృత్తమే. త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. కొన్ని పద్యములకు (ముఖ్యముగా హిందీ, మలయాళ భాషలలో) రెండు అంత్యప్రాసలు కూడ సరిపోతాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు. ప్రాకృతములో ఛందములనే చేర్చి ద్విభంగిక, త్రిభంగికలను కల్పించినారు. అలా చూస్తే ఎత్తుగీతితో కూడిన సీస పద్యము ఒక ద్విభంగిక! ఇక్కడ అట్టి పద్యములను నేను వివరించుట లేదు.
జయకీర్తి త్రిభంగి
నాకు తెలిసి మొట్ట మొదట జయకీర్తి ఛందోనుశాసనములో త్రిభంగి వృత్తము చెప్పబడినది. అందులోని లక్షణ-లక్ష్య పాదము ఇలాగుంటుంది-
నసభనతజాంగీ – తసయమృదుపాంగీ – లసతీతి తద్భంగ విరతిస్త్రిభంగీ… (1)
ఇందులో పాదమునకు తొమ్మిది గణములతో (న/స/భ/న/త/జ/త/స/య), మొత్తము 27 అక్షరములు, 37 మాత్రలు. 7, 7, 7, 6 అక్షరములకు విఱుపులు. మొదటి మూడు విఱుపులకు ప్రాసయతి. మొదటి, రెండవ, నాలుగువ ఖండములకు అంత్యప్రాస. ఇట్టి త్రిభంగికి నా ఉదాహరణమొకటి క్రింద-
త్రిభంగి – న/స/భ/న/త/జ/త/స/య IIIII UU – IIII UU – IIU UUI IIIU UU
27 భూశ్ఛందము 24301472 (ప్రాసయతి)
మనమున దలంపే – విన నదియు సొంపే – దినమెల్ల నీరూపు దలువఁగా నింపే
వనజముఖి రావా – ప్రణయసుమ మీవా – వనమందుఁ బూదావి చిఱుగాలిఁ దేవా
ఘనమగు పదమ్మై – నినదపు నదమ్మై – వినఁ దేనె లందించు చెవులన్ ముదమ్మై
తనరు శుభతారా – నెనరు మధు ధారా – మనరమ్ము నాతోడ మధురోహ సారా (2)
తెలుగు ఛందస్సుకు సరిపోయేటట్లు మొదటి మూడు విఱుపులకు అక్షరసామ్య యతిని ఉంచి వ్రాసిన పద్యము ఒకటి-
హృదయమున నీవే – హితముముగను రావే – యెదలోన దీపాల – యెలవెల్గు తేవే
వదన మొక విందే – పరువము పసందే – ప్రణయజ్వరమ్మందుఁ – బలుకొక్క మందే
నిదురయును రాదే – నెలవెలుఁగు పోదే – నెఱయైన నాయాశ – నెరవేరలేదే
ముదములకు రేవై – పువుల కొక ప్రోవై – పులకింప రమ్మిందు – మురిపించు శ్రీవై (3)
జయకీర్తి త్రిపదలలితము
జయకీర్తి మిశ్రగతిలో కూడ త్రిపదలలితము అనే ఒక మూడు విఱుపుల వృత్తమును సృజించినాడు. దీనికి కూడ ప్రతి పాదములో 27 అక్షరములు. దాని సూత్రము-
గతినగణభన భనసకలితం త్రిపదలలితం తదనుయతిమిలితం … (4).
క్రింద నా ఉదాహరణము ఒకటి-
దీని గణములు – న/న/న/న/భ/న/భ/న/స III IIII – III IIU – III IIU – IIIII IIU 27 అక్షరములు, 30 మాత్రలు
27 భూశ్ఛందము 66842624
మలయపవనపు – పిలుపు వినఁడే – మలుపు గనఁడే – గృహమునకుఁ జనఁడే
చిలిపి పలుకులఁ – జెలియ యనునే – కలికి యనునే – ప్రియసకియ యనునే
అలల నుబికెడు – జలధిమదిలో – వెలుఁగు గదిలో – నవమణులు సరిలో
కలల దలఁపుల – మెలిక యతఁడే – చెలిమి వరుఁడే – నవకుసుమశరుఁడే (5)
తెలుగులో త్రిభంగి
కవిజనాశ్రయములో రేచన త్రిభంగి లక్షణములను ఈ విధముగా చెప్పినాడు-
(న-న-న-నలును స-స) (భ-మలును స-గ యు-) (క్తము లైనన్) (మృదువైనన్) (బ్రస్తుతమైనన్)
(వనరుహభవనిభ) (మన మలర ద్రిభం-) (గిని జెప్పున్) (వడి దప్పున్) (బ్రాసము లొప్పున్) – (6)
దీని ప్రకారము ఇందులో మూడు అంత్యప్రాసలు తప్ప, అక్షరసామ్య యతి గాని, ప్రాసయతి గాని లేదని భావించ వచ్చును. కాని రెండవ పాదములో మొదటి మూడు భాగములకు ప్రాసయతి గలదు. క్రింద నా ఉదాహరణము-
రేచన త్రిభంగి – న/న/న/న/స/స/భ/మ/స/గ IIII IIII – IIII IIU – IIUU – IIUU – UIIUU 28 భువశ్ఛందము 52019200, 28 అక్షరములు, 36 మాత్రలు.
మనసున నెపుడును – నినె దలఁతు హరీ – కనవేలా – మణిమాలా-ధారి నృపాలా
కనులకు నెదురుగ – గనబడు టెపుడో – కనలేనా – కవిగానా – నేనొక మ్రానా
ప్రణయ కుసుమమును – గొనుము చిరసఖా – వినుతాంగా – హరశృంగా – దివ్య శుభాంగా
మన కగు మధురము – మనికియుఁ, గనరా – ప్రణయాంగిన్ – లలితాంగిన్ – నర్త త్రిభంగిన్ (7)
సోమనాథుని త్రిభంగి – కాని తెలుగులో త్రిభంగిని పాల్కురికి సోమనాథునికి ముందు ఎవ్వరు కావ్యములలో ప్రయోగించినట్లు కనబడలేదు. పాల్కురికి సోమనాథుని నాలుగు త్రిభంగులలో నొకటి-
గురుమత సహితులు – దురిత విరహితులు – సురుచిర సజ్జన వర్తుల్ – ధ్రువ కీర్తుల్ – శాంత సుమూర్తుల్
పరిహృత వికృతులు – నిరవధి సుకృతులు – మరణ పునర్భవ కారుల్ – సువిచారుల్ – భక్తి విచారుల్
పరవశ హృదయులు – నిరుపమ సదయులు – వరసమయప్రవిఫాలుర్ – గుణశీలుర్ – దానసుశీలుర్
పరహిత చరితులు – వరగుణ భరితులు – పరమ వరాద్యనుషక్తుల్ – శివభక్తుల్ – శాంతి నియుక్తుల్ (8)
– పాల్కురికి సోమనాథుని అనుభవసారము, 194.
(శివకవులు హలంత రకారమును వాడుతారు, నన్నెచోడుడు కూడ వాడియున్నాడు.)
ఈ త్రిభంగి రేచన చెప్పిన త్రిభంగిలాటిది కాదు. ఇందులో ప్రతి పాదములో (న)6/స/స/భ/మ/స/గ గణములు ఉండును. ఇందులో పాదములో 34 అక్షరములు, 42 మాత్రలు. అనగా దీని అమరిక – IIII IIII – IIII IIII – IIII UIIUU – IIUU – UIIUU. ఈ త్రిభంగిలో 6 అక్షరములు, 6 మాత్రలు ఎక్కువ. ఈ భేదములను పైచిత్రములో గమనించ వీలగును. పాల్కురికి సోమనాథుడు 12-13 శతాబ్దములకు చెందినవాడు. ఇతని త్రిభంగి లక్షణములను విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో, అనంతుని ఛందోదర్పణములో మనము గమనించ వీలగును. వీరిరువురు 15వ శతాబ్ది పూర్వార్ధములోని వారు. కావున వీరి లక్షణములు సోమన లక్ష్యముపైన ఆధారపడినదని చెప్పవచ్చును. కావ్యాలంకారచూడామణి, అనంతుని ఛందోదర్పణము నుండి త్రిభంగులు –
లలి నననననన-ములు ససభమములు – నతిసనయుక్తిఁ జరింపన్ – బ్రసరింపన్ – బాటి వహింపన్
జెలువుగనవకలి – నిలుపఁగఁ దగునెడ – వెలయుఁ ద్రిభంగి సురక్తిన్ – బదభక్తిన్ – బ్రాస నియుక్తిన్ (9)
– విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి
నననన ననసస – లును భమసగలును – దనరి నటింపఁ గణంకన్ – నలువంకన్ – బెంపుదొలంకన్
మునుకొని నఖముఖ-మున వెడఁ గదలుపఁ – జనుఁ గడు నొప్పగు వీణల్ – నెరజాణల్ – వేలుపుగాణల్
వనరుహ జనితుని – తనయులు మొదలుగ – ఘనమతు లాదటతోడన్ – శ్రుతి గూడన్ – వెన్నునిఁ బాడన్
వినఁగలిగిన నది – జననము ఫలమని – మునిజను లిందు శుభాంగున్ – దగు భంగిన్ – జెప్పుఁ ద్రిభంగిన్ (10)
– అనంతుని ఛందోదర్పణము
నాఉదాహరణమొకటి క్రింద ఇస్తున్నాను –
వలపులఁ జిలుకుచు – మెలమెలఁ గులుకుచు – కిలకిల నవ్వుచు రావా – సిరి తేవా – ముద్దుల నీవా
చెలువము లొలుకుచు – తళతళ మెఱయుచు – చిలిపిగ నాడుచు రమ్మా – ముద మిమ్మా – బంగరు కొమ్మా
చెలిమికి వరముగ – నెలవునఁ గను నను – తెలితెలి వెన్నెల బాటై – విరి తోటై – తేనెల యూటై
సులలిత నయనము – లలలుగఁ దిరుగగ – వెలుగుల చూపుల నీవా – దరి రావా – సుందర భావా (11)
ప్రాకృతపైంగలములోని త్రిభంగి
పాల్కురికి సోమనాథుని త్రిభంగికి ఆధారము ఎక్కడనుండి వచ్చినది? విన్నకోట పెద్దన, అనంతులకు పూర్వమే సుమారు 14వ శతాబ్దములో రచింపబడిన ప్రాకృతపైంగలములో రెండు త్రిభంగి వృత్తములు ఉన్నాయి. అందులో పాల్కురికి సోమనాథుని త్రిభంగి రెండవదానిని పోలినది. ఆ లక్షణ లక్ష్య పద్యము –
సవ పఅహి పఢమ భణ దహఅ సుపిఅ
గణ భగణా తహ అంతా గురుజుగ్గా హత్థ పలంతా
పుణ వి అ గురుజుఅ లహుజుఅ వలఅ
జుఅల కర జంపఇ ణాఆ కహరాఆ సుందర కాఆ
పఅ పఅ తలహి కరహి గఅగమణి ససి
వఅణి చాలిస మత్తా జుత్తా ఏహు ణిరుత్తా
గుణి గణ భణ సవ పఅ వసు రస జుఅ సఅ
పఅలా తిఅభంగీ సుహఅంగీ సజ్జనసంగీ (12)
– ప్రాకృతపైంగలము, 2.214
దీని అర్థము: ఓ గజగమనా, శశివదనా, మొదటి పది గణములు ప్రియ గణములు (అనగా లఘుద్వయాత్మక గణములు II). తఱువాత ఒక భగణము (UII), రెండు గురువులు (UU), ఒక హస్తము (అనగా ఒక సగణము IIU), పిదప రెండు గురువులు (UU), రెండు లఘువులు (II), రెండు గురువులు (UU) ఉంటాయి (మొత్తము 34 అక్షరములు ప్రతి పాదములో). సుందర శరీరము గల నాగకవిరాజు (పింగళుడు) 42 మాత్రలను ఉపయోగించుకొనుమని తెలిపినాడు. ఇలా మొత్తము పద్యములో 168 మాత్రలు ఉండును. ఓ శుభాంగి యిదియే సజ్జన ప్రియమైన త్రిభంగి.
ప్రాకృతపైంగల రచయితకు ముందటి కాలములోనే ఈ వృత్తము బహుశా వాడుకలో ఉండియుండ వచ్చును. దాని లక్షణములనే పాల్కురికి సోమన గ్రహించినాడని నా భావన. సోమనాథునికి పిదప దీనిని ఇతర తెలుగు కవులు వాడినట్లు లేదు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణ కల్పవృక్షములో రెండు త్రిభంగి వృత్తములను వాడెను, అందులో ఒకటి-
బలి, కపిపతి, కర-తలమునఁ జమరఁగ, – బలమఱి యంతట సుగ్రీ-వుఁ డపగ్రీ-వుండయి దృగ్రీ-
తులు కళవళపడఁ – దొలఁగుచు మలఁగుచు – ఛలపఱచెన్ మఱి వాలిన్ – ధృతమాలిన్ – సంగర కేళిన్
నిలచిన యదనున – నిలువక పదమున – సలలిత వేగగతుండై – వినయుండై – హాసరతుండై
కలఁచును నిలుచును – వెలుచును వెలిఁజను – బలమగు పోటులు తప్పన్ – జవమొప్పన్ – లాఘవమొప్పన్ (13)
– విశ్వనాథ సత్యనారాయన, శ్రీమద్రామయణ కల్పవృక్షము, కిష్కింధ, గజపుష్పి, 115
ఇటీవలి కాలములో శ్రీమతి సుప్రభగారు వందకుపైగా త్రిభంగి వృత్తములను వ్రాసినారు. వారి సంకలనమునుండి ఒక ఉదాహరణము-
పరిపరి విధములఁ – దిరుగును గలమిది – ధరణికి శ్రేయమొనర్చన్ – వగలార్చన్ – మోదము గూర్చన్
సరసిజ నయనయె – పెరిమను నిడెడివి – యరుదగు ఛందములైనన్ – స్తుతులైనన్ – గేయములైనన్
సరసము లయినవి – సరళత గలిగియు – మురిపెమొసంగుచు నుండన్ – గలకండన్ – బోలుచునుండన్
గురుకృపఁ బడసిన – తరుణిగఁ దెలిపెడి – సరణినిఁ బల్కులు వచ్చున్ – ముదమిచ్చున్ – మెప్పునుఁ దెచ్చున్ … (14)
హిందీలో మాత్రా త్రిభంగి
ప్రాకృతపైంగలములోనే దీని లక్షణములు కూడ ఉన్నాయి. ఆ పద్యము-
పఢమం దహ రహణం – అట్ఠ వి రహణం – పుణు వసు రహణం రసరహణం
అంతే గురు సోహఇ – మహిఅల మోహఇ – సిద్ధ సరాహఇ వరతరుణం
జఇ పలఇ పఓహర – కిమఇ మణోహర – హరఇ కలేవర తాసు కఈ
తిబ్భంగీ ఛందం – సుక్ఖాణందం – భణఇ ఫణిందో విమలమఈ (15)
– ప్రాకృతపైంగలము, 1.194.
దీని అర్థము: మొదట పది మాత్రలపై, తఱువాత ఎనిమిది మాత్రలపై, తఱువాత మళ్ళీ ఎనిమిది మాత్రలపై, చివర ఆఱు మాత్రలపై విరామయతులను ఉంచాలి. పాదాంతములో గురువు ఉండాలి. ఇట్టి ఛందము భూమిపై ఉండేవారికి మోహితముగా నుంటుంది. సహృదయులు దీనిని ప్రశంసిస్తారు. మధ్యలో పయోధర గణము (జ-గణము) ఉంటే మనోహరముగ నుంటుందా (ఉండదు, కావున జగణము నిషిద్ధము)? ఇది కవి శరీరమునే జయిస్తుంది. విమలబుద్ధితో నుండే ఫణీంద్రుడు (పింగళుడు) త్రిభంగి ఛందము సుఖము, ఆనందము ఇస్తుందని చెప్పుతాడు.
ఈ మాత్రాత్రిభంగికి నా ఉదాహరణములు-
అక్షరసామ్య యతితో –
నామనమున నీవే – నయముగ రావే – నగవును దేవే వేగముగా
శ్రీమయముగ నుండఁగ – చెలువము పండఁగ – సిరియై నిండఁగ భోగముగా
శ్యామల మిట రాత్రియుఁ – జంద్రుని కాంతియు – జగమొక భ్రాంతియు వెన్నెలలో
ప్రేమము మన పెన్నిధి – ప్రియమగు సన్నిధి – వెలుఁగుల జలనిధి పున్నమిలో … (16)
ప్రాసయతితో –
ప్రణయపు టల ముంచెను – నను గవ్వించెను – నను నవ్వించెను నవనవమై
విను మొక ప్రియ గీతము – నును సంగీతము – స్వనము లతీతము లనుభవమై
దినమణి గను మరుణము – మనకిది తరుణము – మనుగడ మసృణము కలవలె రా
తనరెడు పాటలతో – మన యాటలతోఁ – జిన మాటలతోఁ గలయఁగ రా … (17)
తెలుగులో మాత్రాత్రిభంగి
తెలుగులోని త్రిభంగికి (పెద్దన-అనంతుడు) మాత్రాగణస్వరూపమును ఇవ్వవలెనని తోచినది. అలా కల్పించినదే ఈ తెలుగు మాత్రా త్రిభంగి.
లక్షణములు – 8 / 8 / 12 / 6 / 8 మాత్రలు, మొత్తము 42 మాత్రలు.
లగారంభము నిషిద్ధము. మొదటి మూడు భాగములకు ప్రాసయతి, చివరి మూడు భాగములకు అంత్యప్రాస. క్రింద నా ఉదాహరణము ఒకటి-
తెల్లని యుడుపులఁ – జల్లని చూపుల – నుల్లము లలరఁగ రావా – వర మీవా – కవితలఁ దేవా
వల్లకి మీటుచుఁ – బల్లకిలో రా – పెల్లున ధ్వని మ్రోఁగంగాఁ – జెలఁగంగా – నవరస గంగా
ఫుల్లము లవఁగా – నెల్లరి హృదయము – చల్లుము సత్కృపఁ దల్లీ – సురవల్లీ – మినుకుల వెల్లీ
ఘల్లని గజ్జెలు – త్రుళ్ళఁగ భారతి – యిల్లిది హృది రావమ్మా – సిరు లిమ్మా – పలుకుల కొమ్మా (18)
మలయాళ త్రిభంగి
మలయాళ త్రిభంగికి పాదమునకు 32 మాత్రలు. సామాన్యముగా మలయాళములో ద్విపద ఛందస్సులు ఎక్కువ, దానికి విరుద్ధముగా త్రిభంగ ఒక చతుష్పద. దీని లక్షణములు – రెండు చతుర్మాత్రలు, ఒక పంచ మాత్ర, ఒక ద్విమాత్ర, ఒక పంచమాత్ర, తఱువాత మూడు చతుర్మాత్రలు. పంచమాత్రలకు అంత్యప్రాస గలదు. నేను అక్షరయతిని కూడ ఉంచి ఉదాహరణమును క్రింద వ్రాసినాను.
త్రిభంగ – చ-చ / పం / ద్వి-పం / చ-చ-చ
మొదటి నాలుగు భాగములకు అక్షరసామ్య యతి, పంచమాత్రలకు ప్రాసయతి
వలపులఁ జిలికెడు – వదనమా – వర సదనమా – వాంఛలఁ దీర్చెడు సెలయా
చెలువము లొలికెడు – సిగరమా – సిరి నగరమా – చిఱుచిఱు నగవుల నెలవా
సులలిత దృక్కులు – సొమ్ములా – సుధ కిమ్ములా – సుందర సుమముల తరువా
తెలితెలి వెన్నెల – దీపమా – దృక్చాపమా – తీయని పదముల చెరువా … (19)
వృత్తములలో మూడు విఱుపులతో త్రిభంగి
ఒక ప్రత్యేక వృత్తముగా, లేక మాత్రావృత్తముగా మాత్రమే కాక సామాన్య వృత్తములలో కూడ ఈ త్రిభంగి నడకను ప్రతిఫలించుటకు వీలగును. నాగవర్మ ఛందోంబుధిలో ఇట్టి ప్రయత్నము ఒకటి గలదు. దీనిని వివరించిన పిదప మఱి కొన్ని వృత్తములకు నేను చేసిన ప్రయత్నములను తెలుపుతాను.
లలితగతి లక్ష్య పద్యము – న/న/న/య/య/త/మ
సుర దివిజ సుర జల నికాయం – జలోదాయం వ్యోమభూప్రాయం
నెరెదు, బరె రవియొళె విరామం – రసోద్దామం సత్యవిప్రేమం
విరచిసుదుదిదు కవిహితార్థం – శ్రుతిస్వార్థం నామమన్వర్థం
గురుజఘనె లలితగతియెందుం – జనానందం నాలి పేళ్దిందం (20)
– నాగవర్మ ఛందోంబుధి
దీని అర్థము – ఓ గురుజఘనా, మూడు న-గణములు, రెండు య-గణములు, త-గణము, మ-గణము వీటితో ద్వాదశ విరామస్థానముతో రసవంతమై కవులకు జనులకు ప్రియమై చెవులకింపైనదై పేరుకు తగినట్లు లలితగతి యను ఈ వృత్తము ఉండును. లక్షణములను త్రిక గణముల పేరులతో తెలుపక వాటి సంకేతములతో నాగవర్మ చెప్పుతాడు. పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, స్వర్గము వరుసగా మ, య, ర, స, త, జ, భ, న గణములను సూచించును. ఇక్కడ సుర, దివిజ, సుర న-గణములకు, జల య-గణమునకు, వ్యోమము త-గణమునకు, భూ మ-గణమునకు సంకేతములు. ఈ లక్ష్య పద్యములో విశేషమేమనగా ఇందులో త్రిభంగివలె అంత్యప్రాసలు చూపబడినవి. అవి ఒక పాదములో కాదు, అన్ని పాదములలో ఉన్నాయి. అనగా నాగవర్మ దీనిని వృత్త త్రిభంగిగా భావించినాడని నా ఉద్దేశము. బహుశా జయకీర్తి చెప్పిన త్రిభంగికి ఈ నాగవర్మ లలితగతి స్ఫూర్తి యేమో? జయకీర్తి నాగవర్మ సమకాలికులు. ఛందోంబుధి కాలము క్రీ.శ. 990 అనియు, ఛందోనుశాసనపు కాలము క్రీ.శ. 1000 అనియు చెప్పుతారు. క్రింద నా ఉదాహరణ మొకటి –
లలితగతి – న/న/న/య/య/త/మ IIIII IIIII UU – IUUU UIUUU 21 ప్రకృతి 136192
లలితగతు లలరఁగను రావా – రసోద్భావా మమ్ములం గావా
చలనముల మురియు నతి దక్షా – జలేజాక్షా లోకసంరక్షా
వలయమున వెలుఁగు సుమహారీ – పలాశారీ పాపసంహారీ
తలిరువలె హృదియు విరియంగాఁ – దరించంగా రమ్ము శ్రీరంగా (21)
త్రిభంగిగా మద్రకము
మద్రకము – భ/ర/న/ర/న/ర/న/గ UII UIU – III UIU – III UIU IIIU 22 ఆకృతి 1931223
ప్రాణములో సదా – వలపులే గదా – వదనమే గదా నిండుగా
గానములో సదా – గమకమే గదా – గమనమే గదా మెండుగా
యానములో సదా – యతనమే గదా – యలుపులే గదా మేలుగా
వానిని జూడఁగాఁ – బలుకు లాడఁగా – వరము వేడఁగాఁ జాలుగా (22)
త్రిభంగిగా చంపకమాల
చంపకమాల – న/జ/భ/జ/జ/జ/ర 21 ప్రకృతి 711600
వలపుల నిమ్ము – జీవన రవమ్ము – ధ్వనించఁగ రమ్ము మంచిగాఁ
దలఁపుల నింపు – సుందర పదంపు – స్వనమ్ములఁ బంపు తీయఁగాఁ
జెలువు సుమించ – పద్యము రచించ – జగత్తు రమించఁ జేయుమా
తెలివికి నీవి – జ్ఞానముల దేవి – వరమ్ముల దీవి చిన్మయీ (23)
మఱొక విధముగా –
వరవిభవా – యుగాల నభవా – విలసత్ప్రభవా సుధానిధీ
ధర వరదా – ముదాల సరదా – లవి నీ కరుదా రసాంబుధీ
మఱి వినుమా – మన్నన గొనుమా – వడి నన్ గనుమా యశోధరా
హరి సదయా – ప్రియార్ద్ర హృదయా – యతి ప్రేమమయా బిరాన రా (24)
త్రిభంగిగా మత్తకోకిల
మత్తకోకిల – ర/స/జ/జ/భ/ర UI UII – UI UII – UI UII UIU 18 ధృతి 93019 (ప్రాసయతి)
పాడెఁ గోయిల – చూడు మీ యిల – నాడెగా నెల నాగముల్
చూడు వన్నెల – నీడ వెన్నెల – తోడు కన్నెల రాగముల్
నేఁడు విందుకు – రాఁడదెందుకు – ఱేఁడు ముందుకు నవ్వులన్
నేఁడు పండుగ – కూడ నుండగ – తోడ నుండగ పువ్వులన్ (25)
త్రిభంగిగా తరలము
న/భ/ర/స/జ/జ/గ III UII UI UII UI UII UIU 19 అతిధృతి 186040
కదలుచున్నది – కాలమన్నది – గాఢమైనది మెల్లఁగా
వదల నన్నది – ప్రేమ నన్నది – బంధ మన్నది చల్లఁగా
ముదము పొమ్మనె – నాశ సొమ్మనె – మోవి నిమ్మనె చేరఁగా
హృదియు పొంగఁగ – సొంపొసంగఁగ – హేమగంగగ పారఁగా (26)
త్రిభంగిగా తరంగ వృత్తము
తరంగ – స/మ/స/మ/మ/గగ IIU UU – UII UU – UU UUU UU 17 అత్యష్టి 196
దిగిరా గంగా – దివ్య తరంగా – దేవీ దప్పిన్ దీర్చంగా
జగదోద్ధారా – స్ఫార తుషారా – సచ్చారిత్రా సాకారా
సుగమీయంగా – శోభ నిడంగా – సొంపీయంగా నీశాంగా
నగుచున్ రావా – నన్నిటఁ గావా – నాదానందా సద్భావా (27)
జాత్యుపజాతులలో మూడు విఱుపులతో త్రిభంగి
వృత్తములలో ఏ విధముగా మూడు అంత్యప్రాసలతో త్రిభంగి విఱుపులను సాధించ వీలగునో అదే విధముగ జాత్యుపజాతులలో ఈ ప్రయత్నము సాధ్యము. క్రింద కొన్ని ఉదాహరణములు –
త్రిభంగిగా కందము
మనమున నీవే యనిశము
కనులం దీవే యనుంగు – కవితన్ నీవే
దినమున నీవే తమిలో
ననిశము నీవే వినంగ – నలికిడి నీవే (28)
మఱొక విధముగా –
కలలు, శశి కళలు, వలపుల
వలలు, మధురజలపు సెలలు, – ప్రణయకథలలో
సడులు, చెలి నుడులు, విరహపు
ముడులు, మదిని నెలయు సుడులు, – ముదిత బ్రతుకులో (29)
(ల-డ లకు ప్రాస చెల్లుతుంది. ఇది చతుర్భంగి కూడ)
త్రిభంగిగా మహాక్కర
మహాక్కర – సూ/ఇం/ఇం/ఇం – ఇం/ఇం/చం
ఆననమ్ములో – నెన్ని యాయిమ్ములో – యందమౌ యాచూపు మాసొమ్ములో
వీణ మీటఁగాఁ – బ్రణవంపు పాటగా – విశ్వమ్మునే నింపు నీయాటగా
ప్రాణ మీయుమా – యమృతమ్ము పోయుమా – వరముగా మానాల్కపై వ్రాయుమా
మీనలోచనీ – ఘనపాప మోచనీ – మేలుగా నీయిచ్ఛ మము గాచనీ (30)
త్రిభంగిగా మధ్యాక్కర
మధ్యాక్కర – ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ
బంగారుతోఁ జేసె బమ్మ – వగఁ జిమ్మ సొగసుల బొమ్మ
సింగారముల పూల తావి – శ్రీదేవి చెలువపు దీవి
సంగీతమున సుస్వరమ్ము – సామమ్ము మాధురి కిమ్ము
శృంగమ్ముపై మేఘమాల – సిరిబాల కానవదేల (31)
త్రిభంగిగా ఉత్సాహము
ఉత్సాహము – సూ/సూ/సూ/సూ – సూ/సూ/సూ/గ
పూవు చిందు తావి యిందు – మోదమందు యువతయే
భావిలోన సుగపు వాన – భవ్యమైన నవతయే
నీవు కలవొ నీటి యలవొ – నిండు నెలవొ రాత్రిలో
జీవితమ్ము సంతతమ్ము – చింతనమ్ము ధాత్రిలో (32)
త్రిభంగిగా ఉపగణ షట్పది
ఉపగణ (అంశ) షట్పద – ఇం/ఇం // ఇం/ఇం // ఇం/ఇం – చం (// పంక్తి విఱుపును సూచించును.)
ఆడవా వెల్గులోఁ
బాడవా తెల్గులో
నేఁడిందు నందమౌ – నీయెల్గులో
చూడుమా చల్లఁగా
తోడుగా మెల్లఁగా
వేడుకన్ వెన్నెలల్ – విలసిల్లఁగా (33)
త్రిభంగిగా కుసుమషట్పది సీసము
కుసుమ షట్పది – పం/పం // పం/పం // పం/పం – పం/గ [పం – పంచమాత్ర, గ – గురువు)
మూడవ, ఆఱవ పాదములలో చివరి లఘువు గురుతుల్యము.
సీసము – ఇం/ఇం // ఇం/ఇం // ఇం/ఇం – సూ/సూ
నిను జూడ మనసయ్యె
నునువెల్గు బరువయ్యె
కనులెల్ల జలముతోఁ – గాలువయ్యె
మనసొక్క చెఱసాల
కనలేని గాయాలఁ
బ్రణయంపు గొలుసుతోఁ – వ్రణపు మాల (34)
త్రిభంగిగా ఆటవెలఁది
ఆటవెలఁది – సూ/సూ/సూ – ఇం/ఇం // సూ/సూ/సూ – సూ/సూ
నన్ను జూడ లేవు – నగుమోముతో నీవు
కన్ను లిందు వేచెఁ – గానరావు
తెన్ను లేని యాత్ర – దేనికొఱకుఁ బాత్ర
విన్నపాల వినవు – విశ్వనేత్ర (35)
త్రిభంగిగా తేటగీతి
తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ
నీవు చేర్పించినావు ప-న్నీటి రేవు
నాకు స్వర్గంపు మ్రాఁకు స్వ-ర్ణంపు రేకు
రాణి ప్రేమంపు వాణి వ-ర్ణాల శ్రేణి
తల్లి యుల్లంపు వెల్లి సౌం-దర్య వల్లి (36)
ముగింపు
అందమైన ఒక తాళవృత్తము త్రిభంగి. ఈ వృత్తపు పుట్టు పూర్వోత్తరాలను నాకు తెలిసిన మేఱకు వివరించినాను. త్రిభంగి విఱుపులను, అంత్యప్రాసలను ఇతర వృత్తములకు, జాత్యుపజాతులకు కొనసాగించ వీలగునని నిరూపించినాను. ఒక మంచి త్రిభంగి పద్యమును వ్రాయాలంటే – పదముల విఱుపు చాల ముఖ్యము. అనగా విరామ యతిని పాటించాలి. ఒక పదము మఱొక భాగములో చొచ్చుకొని వెళ్ళరాదు. అప్పుడే అది గాన యోగ్యముగా నుంటుంది. అంత్యప్రాసలు వీలైనంతవఱకు ద్రుతములతో వ్రాయకుంటే పాడుటకు సులభముగా నుంటుంది. ఈ నియమములను పాటించి వ్రాసినప్పుడు త్రిభంగి, దానిని పోలిన ఇతర పద్యములు వాణీభూషణములుగా శోభిస్తాయి.