విశ్వ మహిళానవల: 9. ఆన్ రాడ్‌క్లిఫ్

‘భీకరమైన అరణ్యం. మైళ్ళకు మైళ్ళు నిర్మానుష్యం. మధ్యలో పాడుపడిన రాజభవనం. అందులో రహస్యద్వారాలు; భూగృహాలు; కిర్రుమనే తలుపులు; ఎంతకీ తెగని మెట్లు; వెలుతురు దూరని గదులు. ఇంట్లోంచి, అడవిలోంచి విచిత్రమైన ధ్వనులు. మృదుమధురమైన పాటలు. దీపాలు వెలుగుతూ, ఆరిపోవడం; మనుషులు కనిపించి మాయమవడం… వీటన్నిటి మధ్యా, భయంతో దిక్కుతోచని అందాల యువతి;’ ఇలాంటి హారర్ సినిమాలు ఇప్పుడు మనకు కొత్త కాదు. కానీ 18వ శతాబ్దిలో కొత్తే.

ఇంగ్లీషులో హారర్ నవలా రచయిత్రిగా ప్రసిద్ధికి ఎక్కింది మేరీ షెల్లీ (ఫ్రాంకెన్‌స్టీన్) అయినా, ఆమెకంటే ముందు అలాంటి నవల రాసిన రచయిత్రి ఆన్ రాడ్‌క్లిఫ్ (Ann Radcliffe). 1794లో తొలి హారర్ నవల రచించింది ఆన్ రాడ్‌క్లిఫ్. ఆమెకంటే ముందు 1764లో హొరేస్ వాల్‌పోల్ (Horace Walpole) తొలి బ్రిటిష్ హారర్ నవలా రచయితగా పేరు తెచ్చుకున్నాడు ది కాసిల్ ఆఫ్ ఒట్రాంటో నవలతో. అతని తర్వాత రాసింది ఈమే. ఈ రెండు నవలల మధ్యా ఉన్న తేడా తర్వాత చూద్దాం.

మామూలుగా, హారర్ కథలు అంటే మొట్టమొదట అందరికీ గుర్తుకొచ్చే రచయిత మాత్రం అమెరికన్ అయిన ఎడ్గర్ ఆలెన్ పో (Edgar Allen Poe). ముఖ్యంగా కథల్లో భయానక వాతావరణ చిత్రణకు అతను పేరుపొందాడు. అలాంటి వాతావరణ చిత్రణ అతనికంటే ముందే చేసిన రచయిత్రి ఆన్. ఆమె ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫో రాసేనాటికి (1794) ఆలెన్ పో పుట్టను కూడ లేదు. (అతను 1809లో జన్మించాడు.) మానవాతీతశక్తుల ప్రమేయం ఉన్న రచనావిధానానికి, అనంతరం వచ్చిన డిటెక్టివ్ రచనలకు ఆలెన్ పోనే ఆద్యుడని అందరూ భావిస్తారు. కానీ ఆయన స్వయంగా ఒప్పుకున్న విషయం – ఆన్ రాడ్‌క్లిఫ్ నవలలు తనను ప్రభావితం చేశాయని.

ఆన్ రాడ్‌క్లిఫ్ మాయలో పడిపోయింది ఒక్క పో మాత్రమే కాదు. బ్రిటిష్ రచయిత వాల్టర్ స్కాట్ (Walter Scott), రష్యన్ రచయిత ఫియొదోర్ దాస్తోయెవ్‌స్కీ (Fyodor Dostoevsky), ఫ్రెంచి రచయితలు ఒనోరె దె బాల్జాక్‌ (Honoré de Balzac), విక్టర్ హ్యూగో (Victor Hugo), అలెగ్జాండర్ డ్యూమాలు (Alexander Dumas) ఆమె తమను సమ్మోహన పరిచిందని ఒప్పేసుకున్నారు. దాస్తోయెవ్‌స్కీ నవలల్లో ఆమె రచనా విధానం ప్రభావం కనిపిస్తుందని విమర్శకుల అభిప్రాయం.

దాస్తోయెవ్‌స్కీ ఇలా అన్నాడు: I used to spend the long winter hours before bed listening (for I could not yet read), agape with ecstasy and terror, as my parents read aloud to me from the novels of Ann Radcliffe – Winter Notes on Summer Impressions, 1863). ఆమె నవలల్లోని వికృత మానవ మనస్తత్వాల, వాతావరణాల చిత్రణ తనను ప్రభావితం చేసిందని ఆ మహారచయిత చెప్పాడు. అయితే ఆన్ రాడ్‌క్లిఫ్‌ని పేరడీ చేసిన రచయిత్రి కూడ ఉంది. రాడ్‌క్లిఫ్ కంటే వయసులో చిన్నదైనా, ఆమెకు సమకాలిక రచయిత్రి అయిన జేన్ ఆస్టిన్. వాస్తవికతకు ఒక అంగుళం కూడా అటూ ఇటూ వెళ్ళని జేన్ ఆస్టిన్ తన నార్తాంగర్ ఆబీ (Northanger Abbey) నవలలో రాడ్‌క్లిఫ్ నవలల పేరడీని స్పష్టంగానే చేసింది.

ఆన్ రాడ్‌క్లిఫ్ రచనలు చేసే కాలం యూరప్ అంతటా ‘సెంటిమెంటల్ నవలలు’ రాజ్యమేలుతున్న రోజులు. అప్పుడే వాల్‌పోల్ భయానక రసాన్ని చిత్రించే గాథిక్ (Gothic) నవలకు బీజం వేశాడు. ఆన్ రాడ్‌క్లిఫ్ మరో అడుగు ముందుకు వేసి అటు సెంటిమెంటునూ. ఇటు హారర్‌నూ మేళవిస్తూ, ఒక సరికొత్త గాథిక్ రొమాన్స్ నవలకు ఊపిరులూదింది.

ఆన్ రాడ్‌క్లిఫ్ జీవితం

ఆన్ 1764లో జన్మించి, 1823లో మరణించింది. తన జీవితకాలంలో ఆమె రచించినవి అయిదు నవలలు. వాటిలో చివరి మూడు అసాధారణ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. కానీ తను మాత్రం ఏ విజయాన్నీ ఆస్వాదించినట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే ఆమె, చివరి నవల పూర్తయ్యాక 28 ఏళ్ళ పాటు పూర్తి అజ్ఞాతంలో గడిపింది. తన 31వ యేట తర్వాత రచించడం మానేసింది. ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియనంత గుంభనంగా జీవితం గడిపింది. ఆమెకు మతి చలించిందని, మానసిక చికిత్సాలయంలో ఉండేదనీ కథనాలున్నాయి. అలాంటిదేమీ లేదని, ఆమె దాంపత్య జీవితం సుఖంగా ఉండేదని, పిల్లలు లేని ఆమె తన భర్త విలియమ్ రాడ్‌క్లిఫ్‌నే సర్వస్వంగా భావించి, అతని స్నేహంలో హాయిగా జీవించిందని మరో కథ. ఏమైనా, జర్నలిస్టు అయిన భర్త ఎక్కువకాలం కార్యాలయంలో గడపడం వల్ల, ఏమీ తోచక రచనను తన వ్యాపకంగా మార్చుకున్న ఆమె, తన రచనలు యూరప్ సాహిత్యంలోనే చరిత్ర సృష్టిస్తాయని, గొప్ప రచయితల ప్రశంసలు పొందుతాయనీ ఊహించి వుండదు. ఆమె గురించి తెలుసుకోవాలనుకున్న ఎందరో ఆధునిక జీవితచరిత్రకారులకు పెద్దగా సమాచారం దొరకలేదు. ఆమె నవలలు ది కాసిల్స్ ఆఫ్ ఆథ్‌లిన్ అండ్ డన్‌బేన్ (The Castles of Athlin and Dunbayne, 1789), ఎ సిసీలియన్ రొమాన్స్ (A Sicilian Romance, 1790), ఆమె మరణానంతరం ప్రచురితమయ్యాయి. కానీ ఆమెకు బ్రతికివుండగానే పేరు తెచ్చిన మూడు నవలలు: ది రొమాన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (The Romance of the Forest, 1791), ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫో (The Mysteries of Udolpho, 1794), ది ఇటాలియన్ (The Italian, 1797).

మొత్తం మీద తన రచనల్లోను, జీవితంలోనూ మిస్టరీని పోషించిన విలక్షణమైన బ్రిటిష్ రచయిత్రి ఆన్ రాడ్‌క్లిఫ్. ఆమె రాసిన నవలల్లో ఎక్కువ ప్రసిద్ధి పొందినవి ది ఇటాలియన్, ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫో. ఇవి రెండూ మానవాతీతశక్తుల ప్రమేయంతో నాయిక జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లను, ఉత్కంఠభరితంగా చిత్రించిన మంచి నవలలు.

ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫో

ఈ 481 పేజీల నవల రచనాకాలం 1794 అయితే కథాకాలం 1584. రచయిత్రి బ్రిటిష్ అయినా ఈ కథ మాత్రం ఫ్రాన్స్, ఇటలీలలో జరుగుతుంది. దక్షిణ ఫ్రాన్స్, ఇటలీల సరిహద్దులోని అరణ్యప్రాంతం ప్రధాన కథాస్థలి. కథానాయిక ఫ్రాన్స్‌కు చెందిన ఎమిలీ సాన్త్ ఒబేర్ (Emily Saint Aubert). కథారంభంలోనే ఎమిలీ తల్లి చనిపోతుంది. తండ్రి ఆ వేదననుంచి బయటపడ్డానికి అతన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువెళ్తుంది ఎమిలీ. మార్గమధ్యంలో పరిచయమైన వలాన్‌కోర్ (Valancourt) అనే యువకుడితో ప్రేమలో పడుతుంది ఎమిలీ. అతను కూడ స్పందిస్తాడు. తండ్రి ఇది గమనించి ఆనందిస్తాడు. ఎంతో మృదుస్వభావి, పరోపకారి అయిన వలాన్‌కోర్ అంటే అతనికి కూడ గౌరవం ఏర్పడుతుంది. క్రమంగా తండ్రి ఆరోగ్యం దిగజారి అతను కూడ మరణిస్తాడు. అంతవరకూ మామూలు ప్రణయోదంతంలా సాగిన కథలో తండ్రి మరణశయ్యపై ఉన్నప్పటినుంచీ మిస్టరీ మొదలౌతుంది. ఆ చివరి రోజుల్లో ఎమిలీకి తన తండ్రి ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. అతని మెడలో ఉన్న లాకెట్‌లో తల్లి ప్రతిమ కాక, మరొక స్త్రీది ఉన్నట్టు గమనిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తండ్రి చెప్పడు. అడగవద్దని అంటాడు. ఎమిలీని అది బాధిస్తుంది.

తన అనంతరం, కూతురు ఒంటరిగా జీవించలేదు కనక, తన సోదరి, మదామ్ షెరాన్ (Madame Cheron) ఇంటికి వెళ్ళమని తండ్రి చెప్తాడు. ఆ మేనత్తకు, వీళ్ళకు రాకపోకలే లేవు. ముఖ్యంగా ఆమె భర్త కౌంట్ మంటోనికి ఈ కుటుంబం పట్ల ఎలాంటి ఆత్మీయతా లేదు. కానీ గత్యంతరం లేక ఎమిలీ అక్కడికి వెళ్తుంది. అక్కడినుంచీ ఆమె జీవితంలో భయంకరమైన పరిస్థితులు మొదలవుతాయి. మేనత్త ప్రేమ ఎలాగూ లేదు. ఆమె కంటే ఘోరమైన వ్యక్తి ఆమె భర్త మంటోని. వితంతువైన ఆమెను ఆస్తికోసం పెళ్ళాడిన మంటోని, భార్యను, ఎమిలీని ఇటలీలోని ఉడోల్ఫో రాజభవనంలో బందీలుగా ఉంచి, ఆస్తి తన పేర రాయమని భార్యను మానసిక హింసకు గురిచేస్తాడు. విల్లు రాయకుండా ఆమె చనిపోతే ఆస్తంతా ఎమిలీకి చెందుతుందని అతనికి తెలుసు. అందుకని విల్లు రాయించడానికి ఆమెపై వత్తిడి తెస్తాడు. మొదట ఎమిలీకి మొరానొ అనే తన మిత్రుడితో వివాహం జరిపించి ఇద్దరినీ తన కంట్రోల్‌లోనే ఉంచుకోవాలని అనుకుంటాడు. కానీ అప్పటికే వలాన్‌కోర్ ప్రేమలో పడిన ఎమిలీ, ఆ విషయాన్ని అత్తమామలకు చెప్పకపోయినా, ఈ వివాహాన్ని తిరస్కరిస్తుంది. మొరానొ మాత్రం ఆమె తనదే అన్న అపోహలో నిత్యం వేధిస్తూంటాడు. ఇంతలో, ఎమిలీ అదృష్టం బాగుండి, మొరానొకు తను ఊహించినంత ఆస్తి లేదని మంటోనికి తెలియడంతో ఆ ‘మిత్రుడి’ని ఇంటి నుంచి తరిమేస్తాడు.

కానీ ఈలోగా భర్త పెట్టే మానసిక, శారీరక హింసల వల్ల అనారోగ్యంపాలైన మేనత్త అస్వస్థతతో మరణిస్తుంది. అనారోగ్యంతో ఉన్నపుడే ఆమెను ఒక మూలగదిలో పడేస్తాడు. అక్కడ కూడ ఆమెను చివరి క్షణం వరకూ సంతకం పెట్టమని కాయితాలు చూపుతూంటాడు. దాదాపు అపస్మారక దశలో ఉండి కూడా ఆమె సంతకం పెట్టదు. చివరి రోజుల్లో అత్తకు సేవచేస్తూ ఆమె ప్రశాంతంగా మరణించడానికి కారకురాలైన ఎమిలీ, ఒక దశలో మేనత్తతో తనకు ఆస్తి మీద భ్రమలు లేవని, అత్త గనక భర్తకు ఇవ్వదలుచుకుంటే ఇవ్వొచ్చనీ కూడ చెబుతుంది. కానీ అత్త మాత్రం ఒప్పుకోదు. చివరికి ఆస్తి భర్త పేర రాయకుండానే ఆమె ప్రాణాలు వదులుతుంది. జీవితాంతం మేనకోడలి మీద ఏ ప్రేమా చూపని ఆమె మరణసమయంలో మాత్రం మేలే చేస్తుంది. అక్కడినుంచి ఎమిలీ జీవితం మరింత దుర్భరమవుతుంది. భార్యను వేధించినట్టే ఆమెను కూడ అస్తి తన పేర రాయమని మంటోని వత్తిడి తెస్తాడు. అతని చేతిలో తను చావవచ్చుననే భయం ఉన్నా, చాలా ధైర్యంగా అతన్ని తిరస్కరిస్తుంది. ఈ సందర్భంలో వారి మధ్య ఎన్నో వాగ్యుద్ధాలు జరుగుతాయి.

‘You may find, perhaps, Signor,’ said Emily, with mild dignity, ‘that the strength of my mind is equal to the justice of my cause; and that I can endure with fortitude, when it is in resistance of oppression.’

‘You speak like a heroine,’ said Montoni, contemptuously; ‘we shall see whether you can suffer like one.’

ఆ బెదిరింపుకు తగినట్లుగానే ఆమెను భయభ్రాంతురాలిని చేయడానికి చాలా ఎత్తులు వేస్తాడు. కానీ ఎమిలీ లొంగదు; భయపడదు. అలా ఆమె జీవితం దినదినగండం నూరేళ్ళాయుష్షులాగే గడుస్తుంది. పనివాళ్ళ సాయంతో ఎలాగో అతన్ని తప్పించుకుని పారిపోతుంది. ఒక చర్చిలో తలదాచుకుంటుంది. అక్కడి నన్‌ల ద్వారా ఆ ప్రాంతం కథలు, తన అత్త, మామల వివాహంలోని రాజకీయాలు, తను బందీగా ఉన్న ఉడోల్ఫో భవనం గత చరిత్ర అన్నీ తెలుస్తాయి.

అక్కడే, తండ్రి లాకెట్‌లో ఉన్న స్త్రీ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆ ఉడోల్ఫో ఎవరు అనే ఆరా తీస్తున్నప్పుడు ఈ కథ బయటకు వస్తుంది. తండ్రి లాకెట్‌లో ఉన్న బొమ్మ అతని పెద్ద చెల్లెలు మార్షనస్ దె విలోరా (Marchioness de Villeroi). ఈ మేనత్త మరో వ్యక్తిని ప్రేమించినా, అతను తమ హోదాకు తగినవాడు కాడని, ఎమిలీ తాతగారు ఆమెను బలవంతంగా ఉడోల్ఫోకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆమెను ఆమె భర్తే, అంటే ఉడోల్ఫోయే, తన ప్రియురాలు లారెంటిని (Laurentini) ప్రేరణతో హత్య చేస్తాడు. అంటే ఆ లారెంటిని ఇప్పుడు తను బందీగా ఉన్న భవనానికి పూర్వం యజమానురాలు. భర్త చేతుల్లోనే అకాలమరణం పొందిన తన మేనత్త గురించిన బాధ ఎమిలీని విచలితను చేస్తుంది. ఈ కథకే బెంబేలు పడిపోయిన ఎమిలీకి అంతకంటే పెద్ద షాక్ తగులుతుంది. అక్కడ తనతో ఎంతో స్నేహంగా ఉన్న నన్ ఆన్యెస్ (Agnes) అందరూ మరణించిందనుకున్న లారెంటిని అని, అంటే తన మేనత్త హత్యకు కారకురాలనీ తెలిసి నిర్ఘాంతపోతుంది. ఒక సంసారాన్ని నాశనం చేశానన్న పశ్చాత్తాపంతో పేరు, వేషం మార్చుకుని, చర్చిలో స్థిరపడుతుంది ఆమె. రోజూ అపరాధభావంతో రాత్రి నిద్రపట్టక, పాటలు పాడుతూ అడవిలో తిరిగిన ‘మానవాతీత స్త్రీ ఆకృతి’ ఈవిడే.

సేవకుల సహాయంతో ఎట్టకేలకు ఎమిలీ, ఎన్నో విపరీతసంఘటనల తర్వాత, తన ప్రియుడు వలాన్‌కోర్ వద్దకు చేరుకుంటుంది. అతను అతడి సోదరుడి మోసం వల్ల జైలు పాలై, తిరిగి స్వస్థానం చేరుకున్న విషయం తెలుస్తుంది. అతన్ని చేరుకుని కొంత స్తిమితపడిన ఎమిలీ క్రమంగా తన ఆస్తిని మేనత్త భర్త నుంచి చేజిక్కించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఆమె తన మామను వదిలించుకోడానికి స్వయంగా ప్రయత్నం చెయ్యదు కాని, అతను చేసిన నేరాలే అతన్ని పట్టిస్తాయి. మంటోని పైకి గౌరవనీయుడిగా కనిపించినా, అతని చీకటి బతుకు, చీకటి వ్యాపారాల గురించి అతని భార్యకు, ఎమిలీకి, ఇంట్లోని సేవకులకు కూడ ముందే తెలుసు. దారిదోపిడీగాడైన మంటోని, దాన్ని మరింత విస్తరించి, ధనవంతులు, సమాజంలో హోదాకలిగిన వారి ఇళ్ళు దోచి తన ఖజానా నింపుకోవడం మొదలుపెట్టడంతో, ఫ్రెంచి పోలీసులకు అతని మీద అనుమానం వస్తుంది. ఈ దుర్మార్గాలలో తన భాగస్వామి ఒకడిని హత్యచేశాడన్న ఆరోపణపై మంటోని జైలుకు వెళ్ళడంతో, తను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు, తన అత్త ఆస్తి తిరిగి ఎమిలీకి దక్కుతాయి. వలాన్‌కోర్‌ని వివాహం చేసుకుని, తనను అన్ని సందర్భాల్లోనూ రక్షించిన సేవకురాలు ఆనెట్ ఆమె ప్రియుడు లుడ్విగోలను కూడ తన వద్దే ఉంచుకుని, సుఖంగా జీవిస్తుంది.

గాథిక్ నవలా లక్షణాలు

  1. పాడుపడిన విశాలమైన భవనం
  2. అనూహ్యమైన, నిర్హేతుకమైన సంఘటనలు
  3. శకునాలు, రహస్యాలు, భ్రమాజనిత దృశ్యాలు
  4. కష్టాల్లో కూరుకుపోయిన నాయికలు
  5. అతీతశక్తుల చేష్టలు, వివరించలేని శబ్దాలు, నిర్వచించలేని భయాలు
  6. సున్నిత మనస్తత్వం కలిగిన నాయికానాయకులు.

వీటిలో దాదాపు అన్నీ ఈ నవలలో ఉన్నాయి. ఎమిలీ స్వతహాగా చాలా సున్నితమైన హృదయం కలిగిన యువతి. దానికితోడు అడుగడుగునా ఆత్మీయులను కోల్పోయిన విషాదం (తల్లిదండ్రుల మరణం, వలాన్‌కోర్‌ దూరం కావడం), ఉడోల్ఫో భవనంలో ఇప్పుడున్న ప్రాణాంతకమైన పరిస్థితి, మేనత్త అనారోగ్యం, మామ మంటోని క్రౌర్యం, మొరానొ వేధింపులు, ప్రకృతితో మమేకమయ్యే అందమైన జీవితం నుంచి కఠినమైన రాళ్ళ భవనంలో ఊపిరాడని స్థితిలో బతకాల్సిన పరిస్థితి – ఇవన్నీ కలిసి, అసలే సున్నితమనస్కురాలైన ఎమిలీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. అవి తాత్కాలికంగా ఆమెను విభ్రాంతికి గురిచేస్తాయి. తన కర్తవ్యం విషయంలో (ఆస్తి కాయితాలపై సంతకం పెట్టకూడదన్న సంకల్పం) ఏ మాత్రం రాజీపడకపోయినా, మనోవేదన మాత్రం ఆమెను వీడదు. భౌతికమైన వాతావరణాన్ని, అది ఎమిలీలో కల్పించే మానసిక సంచలనాన్ని అద్భుతంగా చిత్రిస్తుంది రాడ్‌క్లిఫ్.

ఈ స్థితిలో ఉన్నప్పుడే ఆమెను, గోడల నుంచి వచ్చే రకరకాల శబ్దాలు, దూరం నుంచి వినిపించే మధురగీతాలు, దివిటీలతో పరిగెత్తే వ్యక్తులు భయపెట్టడం మొదలౌతుంది. అకాలమరణం పొందినవారు దెయ్యాలై పీడిస్తారని ఈనాటికీ చాలామంది నమ్మే విశ్వాసం ఒక్కటే తీసుకున్నా అలాంటివి కూడ ఈ నవలలో తరచుగానే కనిపిస్తాయి. భయానకమైన ఈ వాతావరణాన్ని చిత్రించడంలో రచయిత్రి గొప్ప ప్రతిభ కనబరుస్తుంది.

ఈ నవలలో 50శాతం కథ అయితే, తక్కిన సగం వర్ణనలు. నవల ఆరంభం నుంచే నాయికకు, నాయిక తండ్రికీ ప్రకృతి ప్రీతి అధికం కనక, వాళ్ళిద్దరి ప్రయాణం కొండల చుట్టూ, ఎడతెగని రోడ్లపైనా, పువ్వులు, పక్షుల మధ్య సాగుతుంది. అక్కడ మొదలయ్యే ప్రకృతి వర్ణన కాల్పనిక కవిత్వంలోలా మధురంగా ఉంటుంది. అక్కడినుంచి మొదలై, క్రమక్రమంగా ప్రకృతి కొంత బీభత్సాన్నీ, భయంకరత్వాన్నీ సంతరించుకుంటుంది. ఎమిలీకి ప్రతి చెట్టు వెనకా తనను చంపడానికి ఒక దుండగీడు దాక్కుని వున్నట్టు, పర్వతాలకు పర్వతాలు మొదలై అంతకంతకూ పెరుగుతున్నట్టు కనిపిస్తాయి. (‘ఒక పర్వత శిఖరం కనిపించగానే అమ్మయ్య పర్వతం ముగిసిందని ఊరడిల్లుతూంటే, ఆ శిఖరం మరో పర్వతానికి పునాది అని అర్థమై నిర్ఘాంతపోయింది.’) తన మామ బంధించిన రాజభవనంలోని ప్రతి మలుపు వద్దా ఆమెకు తనకు హాని చేయడానికి వస్తున్నవారే కనిపిస్తారు. చివరికి ఎస్టేట్‌కి బయట కాపలాకాసే వ్యక్తి నడిచే పద్ధతి కూడ ప్రమాదసంకేతంగా ఉంటుంది ఎమిలీకి. ఆరుబయట కూడ ప్రతిపుట్టవెనక, గుట్టవెనకా ప్రమాదం పొంచివున్నట్టే అనిపిస్తుంది. ఒక సన్నివేశంలో దాసి తనమీద చనిపోయిన స్త్రీ మేలిముసుగు వేసినపుడు, తనే మృత్యువుకు చేరువలో ఉన్నట్టు విచలితురాలవుతుంది.

ఈ నవలలో చాలాచోట్ల కవితల్ని ప్రస్తావిస్తుంది రాడ్‌క్లిఫ్. కొన్ని అప్పటికే ప్రచారంలో ఉన్న మిల్టన్, షేక్స్‌‌పియర్, గ్రే వంటి కవులవీ; కొన్ని ఎమిలీ అప్పటికప్పుడు స్వయంగా కల్పించినవీ. ఎమిలీలోని సున్నితత్వం ఆమెను మంచి కవిని చేస్తుంది. తండ్రితో ప్రయాణిస్తున్నపుడు, గుర్రబ్బండి దిగి విశ్రాంతి తీసుకున్న ప్రతిసారీ ప్రకృతితో మమేకమై ఏదో పద్యమో, పాటో అందుకునే భావుకురాలు ఎమిలీ. ఈ భావుకత్వమే ఆమె మనసులో అనంతరం కలిగే అలజడికి దారితీస్తుంది. కథకు ఎంతో కీలకమైన ఈ విషయాన్ని తండ్రి మాటల్లో చెప్తుంది రచయిత్రి.

“‘Above all, my dear Emily,’ said he, ‘do not indulge in the pride of fine feeling, the romantic error of amiable minds. Those, who really possess sensibility, ought early to be taught, that it is a dangerous quality, which is continually extracting the excess of misery, or delight, from every surrounding circumstance. And, since, in our passage through this world, painful circumstances occur more frequently than pleasing ones, and since our sense of evil is, I fear, more acute than our sense of good, we become the victims of our feelings, unless we can in some degree command them.’

సున్నితమైన మనసు, స్పందించే మనసు మనిషికి అవసరమే కానీ, మనం వాటిని నియంత్రించుకోకపోతే మనల్నే కబళిస్తాయని తండ్రి ఆమెను హెచ్చరిస్తాడు. ఈ సున్నితత్వం వల్లే ఎమిలీ అనంతరం తనకు ఎదురైన భయంకరమైన సన్నివేశాల్లో ఉద్వేగం తట్టుకోలేక, ఊహలే వాస్తవాలయ్యాయన్నంతగా భయపడిపోతుంది.

నవలలోని ప్రత్యేకత, గాథిక్ నవలా వాతావరణాన్ని చిత్రిస్తూనే, అవన్నీ ఊహాజనితాలే అని రచయిత్రి తేల్చేయడం. కథానాయిక ఎమిలీ ‘చూసే’ ప్రతి దృశ్యానికీ నవలాంతంలో వివరణలు లభిస్తాయి. ఎమిలీ కొత్త మనుషులు ఒక్కొక్కరినీ కలుసుకునే కొద్దీ, ఎవరు ఏ కారణాల వల్ల ఆ రాత్రిపూట అక్కడ నడిచారో, దివిటీలతో పరిగెత్తారో, ఏ నన్ రోజూ రాత్రి తను చేసిన పాపపు పనులను మరిచిపోవడానికి పాటలు పాడుతూ అడవుల్లో తిరిగిందో ఆమెకు అర్థమై, తను భయపడిన ఏ సంఘటనా అతీతశక్తుల ప్రమేయం కలిగినది కాదని, కేవలం యాదృచ్ఛికమైనవేనని, తను చూసిన ఆకృతులు అతీతమానవశక్తులు కారని, రక్తమాంసాలున్న మనుషులేననీ గ్రహిస్తుంది.

మన భయాలు, అనుమానాలే, లేనివి చూడడానికి మనల్ని ప్రేరేపిస్తాయన్న మానసిక విశ్లేషణకు సంబంధించిన సూచన కూడ రచయిత్రి చేస్తుంది. అతీత మానవ శక్తుల దర్శనం, శ్రవణం అన్నవి కేవలం మనలోని విపరీతసంచలనాల ప్రతిఫలనాలని చెప్పడం రచయిత్రి ఆలోచనావిధానాన్ని మనకు స్పష్టం చేస్తుంది. ఆన్ రాడ్‌క్లిఫ్ ఈ నవల రాసే సమయానికి మనసులోని విపరీతమైన ఉద్వేగాలు భ్రాంతులుగా మారవచ్చునన్న సైకలాజికల్ సిద్ధాంతాలేవీ రాలేదు. ఆమెకంటే ముందు, ఇంగ్లీషులో తొలి హారర్ నవల రాసిన హొరేస్ వాల్‌పోల్ (ఆయన సుప్రసిద్ధ నవల ది కాసిల్ ఆఫ్ ఒట్రాంటో) మానవాతీత శక్తుల ప్రమేయం మనిషి జీవితంలో ఉండవచ్చునని అన్నట్టుగానే రాశాడు. కానీ రాడ్‌క్లిఫ్ మాత్రం అది మన భావసంచలనాల ప్రతిఫలనమని చెప్పడం ఆమె మేధకు నిదర్శనమని చెప్పాలి. ఈ రెండు నవలల మధ్య ప్రధానమైన తేడా ఇదే. వాల్‌పోల్ అతీతశక్తుల ఉనికిని అంగీకరించడం, రాడ్‌క్లిఫ్ అవి కేవలం మన భ్రమాజనితాలని తేల్చేయడం.

ఇలా మానవాతీత శక్తులు లేవని, అవి మన ఊహాజనితాలనీ చెప్పడం వల్లనే కాబోలు 20, 21వ శతాబ్దుల్లోనూ ఆన్ రాడ్‌క్లిఫ్ ఒక సంచలన రచయిత్రిగా సాహిత్యవేత్తల మన్ననను పొందుతోంది. సెంటిమెంటల్ నవలలో సస్పెన్స్‌ని పోషించిన తొలి రచయిత్రి ఆమే. ఈ నవలలో మానసిక వైకల్యాలకు, శారీరక అనారోగ్యాలకూ కారణం ఎక్కువభాగం, ప్రేమ వైఫల్యమో, వియోగమో, విరహమో. అందుకే ఇది మౌలికంగా సెంటిమెంటల్ నవలే. కానీ అందులో సస్పెన్స్‌నూ, థ్రిల్‌నూ పొందుపరచడంలో ఆన్ రాడ్‌క్లిఫ్ చూపిన ప్రతిభ వల్ల, గాథిక్ లక్షణాలను రచనావ్యూహంగా ఎంచుకోవడం వల్ల ఇది ఒక అసాధారణ రచన అయింది.

కొన్ని పొరపాట్లు

ఈ నవలలో రచయిత్రి కొన్ని చిన్న పొరపాట్లు చేసినట్టు అనిపిస్తుంది. నవల రచనాకాలం 18వ శతాబ్ది చివరి దశాబ్ది. కానీ ఆమె వర్ణించిన ఫ్రాన్స్, ఇటలీ దేశాల వాతావరణం, రాజభవనాలు, రాజపదవుల వర్ణనను బట్టి చూస్తే కథాకాలం 16వ శతాబ్ది ద్వితీయార్ధం (1584 అని సాహిత్యకుల పరిశోధనలో తేలింది) అని అర్థమవుతుంది. నవలలో షేక్స్‌పియర్ మెక్‌బెత్‌ను, జూలియస్ సీజర్‌ను, మిల్టన్ కవిత్వాన్ని ఎమిలీ, వాళ్ళ నాన్న చర్చించుకుంటున్నట్టు ఆమె ఉల్లేఖిస్తుంది. సీజర్ తొలి ప్రదర్శన 1599లో, మెక్‌బెత్ తొలి ప్రదర్శన 1603లో జరిగాయి. ఇక మిల్టన్ 1608లో జన్మించాడు. కనక ఆమె కథాకాలం తర్వాత జరిగిన సంఘటనలను పేర్కొనడంలో ఆమె తన కథాకాలాన్ని మరచిపోయినట్టు అనిపిస్తుంది. అంతేకాక, ఇందులో పాత్రలు కాఫీ తాగుతూంటాయి. నిజానికి 1580 నాటికి యూరప్‌లోకి కాఫీ ప్రవేశించలేదు. (17 వ శతాబ్దిలో కాఫీ యూరప్‌ని చేరింది.)

ఈ రెండు సందర్భాల్లో రచయిత్రి తన రచనాకాలం, తన కథాకాలాల్లో కొంత అయోమయానికి గురైనట్టు అనిపిస్తుంది. బహుశా దీనివల్లే కొందరు పరిశోధకులు ఈ నవలలో కథాకాలం 18వ శతాబ్దంగా పొరబడ్డారు. కానీ కథను పరిశీలిస్తే 16వ శతాబ్దే అయివుండాలని అర్థమవుతుంది. దాదాపు 500 పేజీల నవలలో ఇవి చాలా చిన్నపొరపాట్లే; పైగా రచనకు ఆటంకం కలిగించేవి కావు కనక అంతగా పట్టించుకోనవసరం లేదు.

కాథలిక్ మతవ్యతిరేకి

కాథలిక్ మతకేంద్రమైన ఇటలీని కథాస్థలిగా చేసుకుని రాసిన తన రెండు నవలల్లోనూ (ది ఇటాలియన్, ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫో) ఆన్ రాడ్‌క్లిఫ్ ఇంగ్లీషువారి ఆంగ్లికన్ చర్చికి అనుకూల ధోరణిని కనబరుస్తూ, కాథలిక్ మతాన్ని కించపరిచే విధంగా రాసిందని ఆరోపణలు వచ్చాయి. ది ఇటాలియన్ నవలలో మతాధికారుల ప్రవర్తన చిత్రణలోను, ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫోలో నన్ ఆన్యెస్ పాత్ర చిత్రణలోనూ కాథలిక్ మతప్రవర్తకులు నేరపూరిత స్వభావం కలిగివున్నారన్న సూచన స్పష్టంగానే ఉంది. కాథలిక్ చర్చిల్లో జరిగే కన్‌ఫెషన్‌ని కేవలం మతాధికారులు భక్తులపై ప్రయోగించే ఒక ‘కంట్రోల్ మెకానిజమ్’గా ఆమె తన చిత్రణ ద్వారా సూచించింది. ఇవి సహజంగానే కాథలిక్ మతస్థుల ఆగ్రహానికి గురయ్యాయి. అయినా సాహితీవేత్తలకు మాత్రం ఇదొక అభ్యంతరంగా అనిపించలేదు. ఆమె రచనాకౌశలానికి వాళ్ళు దాసోహమన్నారు.

అనంతర రచయితలను, విమర్శకులను ఎక్కువగా ఆకర్షించింది ఆమె శైలి, ప్రకృతి వర్ణనానైపుణ్యం. ఆమెను కవయిత్రి అనాలా వచన రచయిత్రి అనాలా అని కూడ వాదించుకున్నారు విమర్శకులు. ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫో చదివితే అడుగడుగునా ఆమె వర్ణనానైపుణ్యం, కవితాత్మకత మనల్ని కట్టిపడేస్తాయి. ఆశ్చర్యమేమిటంటే, ఇంటి నుంచి బయట కాలు కూడా పెట్టని ఆన్ రాడ్‌క్లిఫ్, జన్మలో ఫ్రాన్స్‌ను కానీ ఇటలీని కానీ సందర్శించని ఆన్, ఫ్రాన్స్, ఇటలీ సరిహద్దుల్లోని సుదీర్ఘమైన అరణ్యాలు, వృక్షాలు, పక్షులు, ఆకాశాన్నంటే భవనాలు.. ఇవన్నీ ఎలా వర్ణించింది అన్నది. బహుశా తన కాలంనాటి ఇటాలియన్, ఫ్రెంచి చిత్రలేఖనాలు చూసివుంటుందని సరిపెట్టుకున్నారు విమర్శకులు కూడా. మొత్తం మీద అనితరసాధ్యమైన ఊహాశక్తితో, సెంటిమెంటల్ వస్తువును గాథిక్ హారర్‌తో జతకలిపి అసాధారణమైన నవలలు రాసిన ఆన్ రాడ్‌క్లిఫ్ ది మిస్టరీస్ ఆఫ్ ఉడోల్ఫోలో ఉల్లేఖించగలిగిన సూక్తుల వంటి మాటలు ఎన్నో. వీటిలో ఎక్కువభాగం ఎమిలీ ఆలోచనలు, మాటల్లోనివే.

-‘How strange it is, that a fool or a knave, with riches, should be treated with more respect by the world, than a good man, or a wise man in poverty!’

-‘What is acquired without labour is seldom worth acquiring at all.’

-‘One act of beneficence, one act of real usefulness is worth all the abstract sentiment in the world.’


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...