విసిరిన గవ్వలు

పగలంతా
ఎదురుచూపు
రాత్రి
ఏమీ కనబడని
చీకటి

రాత్రింబవళ్ళ మధ్య
రంగుల గుంపులో
ఉషస్సు, సంధ్య

ఆద్యంతాల
మెరుపులు వెతుక్కుంటూ
కవితలు

అలంకారాలు పొదిగిన
శబ్దాన్ని విడిచి
వాక్యాల మధ్య
నిశ్శబ్దాన్ని హత్తుకొని
ఉడాయించింది కావ్యాత్మ

విసిరేసిన గవ్వలు
నక్షత్రాలయి
ఆట ముగిసినట్లే ఉంది
పొద్దంతా రాలుతోన్న మంచు