ఈమాట పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం సరికొత్త వ్యాసాలతో, కథలతో కవితలతో ఈ సంచిక మీ ముందుంచుతున్నాం. సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాం.
ఈ సంచికలో కొడవటిగంటి కుటుంబరావు గారు అనువదించిన గొగొల్ నవల ధారావాహికంగా ప్రచురించటానికి అనుమతించిన శ్రీ రోహిణీ ప్రసాద్ గారికి మా ప్రత్యేక అభినందనాలు. అంతేకాదు, రోహిణిప్రసాద్ గారు వారి నాన్నగారు చందమామ కథలు రాసేరోజుల్లో తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక చిన్నవ్యాసంలో పొందుపరిచారు. ఆ వ్యాసం మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాం.
ఇవికాక, వెల్చెరు నారాయణ రావు, జె. యు. బి వి. ప్రసాద్, రెంటాల కల్పన, వేమూరి వెంకటేశ్వర రావు, కె. వి. యస్. రామారావు గార్లవ్యాసాలు, అఫ్సర్, సుబ్రహ్మణ్యం, ఫణి, పద్మలత గార్ల కవితలూ, కనకప్రసాద్, గొర్తి గార్ల కథలూ ఉన్నాయి.
పాఠకుల విమర్శలు రచయితలకీ సంపాదకులకీ ఎంతో అవసరం. సహృదయంతో చేసిన విమర్శలు సూటిగా నిష్కర్షగా ఉండచ్చు. అందులో తప్పేమీ లేదు. నచ్చిన రచన పై పొగడ్త లూ ఉండచ్చు. నచ్చని రచనపై తెగడ్త చేసేటప్పుడే జాగ్రత్త అవసరం. జాగ్రత ఉంటే తెగడ్త కూడా సద్విమర్శే అవుతుంది. అటువంటి సద్విమర్శలకోసమే అతిథి పుస్తకం. ఇక ముందు, అతిథి పుస్తకంలో కొన్ని మార్పులు ప్రవేశపెడుతున్నాం. ఈ మార్పులు, ఇంగ్లీషులో చెప్పడం సులువు We reserve the right to edit, delete and abridge submission to the Guest Book.
2005 లో ఈమాట రచయితలకి, సమీక్షకులకీ, విమర్శకులకీ మా అభివందనాలు. అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శలవ్.
వేలూరి వేంకటేశ్వర రావు.