విశ్వమహిళానవల 22: ఎలిజబెత్ గాస్కెల్

తొలి నవల పాఠకుల ఆదరణ దృష్ట్యా విజయవంతమైనా, ఆ తర్వాత విమర్శకులు కత్తిగట్టడంతో (ముఖ్యంగా ఒక ప్రముఖుడు) 19వ శతాబ్ది రచయిత్రుల జాబితానుంచి పక్కకి తొలగిన రచయిత్రి ఎలిజబెత్ గాస్కెల్ (Elizabeth Gaskell). ఆమెపై విమర్శకులు కత్తిగట్టడానికి కారణమేమిటి? అంటే ‘మగవాడిలా కార్మికులు, పేదల గురించి రాయడానికి ప్రయత్నించడం, పారిశ్రామిక విప్లవం ఫలితాలను చర్చించడం!’

ఎలిజబెత్ గాస్కెల్ పేరు ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించుకున్నాం షార్లట్ బ్రాంటీ జీవిత చరిత్ర రాసిన రచయిత్రిగా. కానీ ఆమె సాహిత్య అస్తిత్వంలో అది ఒక చిన్న పార్శ్వం మాత్రమే. తనే ఒక మంచి నవలాకారిణిగా పేరు పొందింది. తన కాలంలో విమర్శలూ ఎదుర్కొంది. పారిశ్రామిక రంగంలోని అసమానతలు, పేదరికం, వర్గ సంఘర్షణ, చిత్రించిన అరుదైన రచయిత్రి. జేన్ ఆస్టిన్ తర్వాత వాస్తవిక రచనలో అంతటి గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్న గాస్కెల్, నవలా వస్తువులో మాత్రం ఆస్టిన్‌ని అనుకరించలేదు.

1810లో జన్మించి, 1865లో మరణించిన ఎలిజబెత్ ఏ సమస్యలూ పెద్దగా లేని ఆనందకరమైన బాల్యం గడిపింది. ఏ కొరతా లేని కుటుంబం, తండ్రీ సోదరుల నుంచి చదువుకోడానికి అమితమైన ప్రోత్సాహం లభించిన అదృష్టవంతురాలు ఈమె. కానీ ఆ ప్రోత్సాహం ఆమె నవలలకు విమర్శకుల నుంచి లభించలేదు. దాదాపు ఆమె రచనాజీవితం సాగిన 19వ శతాబ్ది ద్వితీయార్ధం నుంచి 20వ శతాబ్ది ప్రథమార్ధం వరకూ ఆమె నవలలకు చెప్పుకోదగ్గ ప్రశంసలేవీ పాఠకుల నుంచి కూడా అందలేదు (తొలి నవల మేరీబార్టన్‌కు తప్ప).

1934లో లార్డ్ డేవిడ్ సెసల్ (David Cecil) ఆమెపై చేసిన విమర్శ అందరికీ శిరోధార్యమైంది. ‘ఆమె మగవాడిలా రాయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది’ అని కించపరిచాడు డేవిడ్ సెసల్ ఆమెను. 19వ శతాబ్దిలో కలం పట్టిన ఎందరో ‘మైనర్ రైటర్‌లలో ఒకామె’గానే ఎలిజబెత్ గాస్కెల్‌ని ఉంచేశాడు సెసల్. తన ‘The Early Victorian novelists’ (1934)లో she was “all woman” and “makes a creditable effort to overcome her natural deficiencies but all in vain” అన్నాడతను. అతని మాటే విమర్శలోకంలో చాలాకాలం పాటు చెల్లుబాటైంది. దానితో 1950 వరకూ గాస్కెల్‌కి రావలసిన గుర్తింపు రాలేదు. అప్పుడు కూడ కొందరు స్త్రీల పరిశోధనతో పాటు, రేమండ్ విలియమ్స్ (Raymond H. Williams) వంటి మార్క్సిస్టు విమర్శకుడు కూడ పునఃసమీక్షించినపుడే ఆమె రచనలకు బ్రిటిష్ సాహిత్యంలో ఉచితమైన స్థానం దక్కింది.

జీవితం

చిన్నప్పటినుంచే ప్రశాంతంగా, దయగా, స్నేహంగా ఉండే ఎలిజబెత్ స్వభావం ఆమెను అందరికీ దగ్గరచేసింది. తనకు ఏ అవసరాలకూ కొరత లేకపోయినా, తక్కిన సమాజమంతా అలాగే ఉంటుందన్న అమాయకత్వం ఆమెలో లేదు. అందుకే తన పరిసరాలను బాగా పరిశీలించేది. తన చుట్టూ ఉన్న పేదవారిని సానుభూతితో చూడడం, ఆదరించడం, ఆ కాలంలో స్త్రీలు వారిని అలా పట్టించుకోవడం విశేషమే. వార్‌విక్‌షైర్‌లో పాఠశాల విద్య ముగించిన తర్వాత లండన్‌కు, తర్వాత న్యూకేజిల్‌కూ వెళ్ళి, అనేక వర్గాలవారితో పరిచయం చేసుకుని, లోకజ్ఞానం సంపాదించడం ఆమె వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేసింది. ప్రముఖ మినియేచర్ ఆర్టిస్టు విలియమ్ జాన్ థామ్సన్, ఆమె సవతితల్లికి సోదరుడు. అతను ఎలిజబెత్ మినియేచర్ పెయింటింగ్ వేశాడు. అదే సమయంలో డేవిడ్ డన్బర్ అనే శిల్పి ఆమె ప్రతిమను చెక్కాడు. ఇవన్నీ ఆమె ఇంకా రచనలకు పూనుకోకముందే జరిగాయి.

విద్య, సంపద ఉన్న కుటుంబంలో పుట్టడమే కాదు; మెట్టింది కూడా. భర్త విలియమ్ గాస్కెల్ యూనిటేరియన్ చర్చిలో మతాధికారి. యూనిటేరియన్ క్రైస్తవశాఖకు చెందినవారు, పూర్వ క్రైస్తవ మతాన్ని పునరుద్ధరించినవారు. అంటే క్రైస్తవంలో అనంతరం వచ్చి చేరిన ‘ఒరిజనల్ సిన్’ వంటివి అంగీకరించక, స్వచ్ఛమైన మౌలిక క్రైస్తవమతాన్ని ప్రచారం చేసిన వీరి శాఖకు చెందిన ప్రముఖుల్లో మేరీ ఉల్‍స్టన్‍క్రాఫ్ట్ కూడ ఉంది. (క్రీ.శ. 16-18వ శతాబ్ది వరకూ వీరిపై కాథొలిక్ చర్చి అణచివేత కూడ జరిపింది.) ఇంతకూ తన భర్త విలియమ్ గాస్కెల్ ప్రభావం ఎలిజబెత్‌పై కొంతైనా కనిపిస్తుంది. (ఆ ప్రభావంతోనే నార్త్ అండ్ సౌత్ నవలలో నాయిక తండ్రి మిస్టర్ హేల్, మతం విషయంలో సంశయంలో పడి, ఆంగ్లికన్ చర్చిలో తన పదవికి రాజీనామా చేస్తాడు.) ఎలిజబెత్ భర్త విలియమ్ కూడ కవే. అతని కవితావస్తువు, ప్రసంగాల వస్తువు తరచు పేదవర్గాలు, వారి జీవితంలోని కష్ట నిష్టూరాలు. బహుశ అందుకేనేమో తన తొలి నవల మేరీ బార్టన్ దగ్గర్నుంచి అన్ని నవలల్లోను ఎలిజబెత్ కార్మికుల గురించి అనివార్యంగా రాసింది. ఆమెకు నలుగురు ఆడపిల్లలు. ఒక మగపిల్లవాడు పుట్టి చనిపోయాడు. కొడుకు మరణం కలిగించిన వేదన నుంచి కోలుకోవడానికి ఉపశమనంగానే కలం పట్టిందని విమర్శకులంటారు.

తొలి నవల విజయం

ఎలిజబెత్ గాస్కెల్ తొలి నవల మేరీ బార్టన్ (Mary Barton, 1848) కొన్ని మంచి సమీక్షలను అందుకుని, పాఠకాదరణ పొందింది. అప్పటికి తాము నివసిస్తున్న మాంచెస్టర్‌ను మురికివాడలతో సహా అత్యంత సహజంగా చిత్రించిన ఆమె రచనా విధానానికి ముగ్ధులయ్యారు థామస్ కార్‌లైల్ (Thomas Carlyle, స్కాట్లండ్ రచయిత), మరియా ఎడ్జ్‌వర్త్ (Maria Edgeowrth, ఐర్లండ్ రచయిత్రి) వంటి సాహితీవేత్తలు కూడా. కానీ అప్పుడు కూడా కొందరు విమర్శకులు మాత్రం కార్మికుల గురించి రాయడానికి ఈవిడెవ్వరు? అని ప్రశ్నించారు. ఈ గోల నార్త్ అండ్ సౌత్ నవలతో తారస్థాయికి చేరుకుంది.

ఆమెకు పేరు తెచ్చిన మరో రెండు నవలలు క్రాన్‌ఫర్డ్‌ (1855), వైవ్స్ అండ్ డాటర్స్ (1865). ఆమె నవలలు అనంతరకాలంలో టీవీ సీరియల్స్‌గా, చలనచిత్రాలుగా వచ్చి, 20, 21 శతాబ్దుల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాయి. వైవ్స్ అండ్ డాటర్స్ నవలలో ప్రణయం, కుటుంబమే వస్తువు కనక దాని పట్ల విమర్శకులకు కూడ పెద్ద అభ్యంతరాలున్నట్టు లేదు. కానీ ఎలిజబెత్ మగవాడిలా రాయడానికి ప్రయత్నించిందన్న ‘కీర్తి’ని మూటగట్టుకున్న నార్త్ అండ్ సౌత్ గురించి కొంత వివరంగా తెలుసుకోవాలి. స్త్రీలు ఏ వస్తువులతో రాయాలో వేటిని స్పృశించకూడదో తెగేసి చెప్పి, తమ మాటే శాసనం చేసుకున్న విమర్శకులను చూసి ఈ తరంలో మనం చికాకుపడినా, తమ ఎదురుగా తమని అవమానపరచిన ఈ విమర్శకులను చూడనట్టే నటించి, వారి విమర్శలను పట్టించుకోకుండా, తనకు నచ్చిన వస్తువును స్వీకరించిన ఎలిజబెత్ గాస్కెల్ వంటివారిని మనమిప్పుడు సగర్వంగా గుర్తు చేసుకోవచ్చు.

నార్త్ అండ్ సౌత్

సుప్రసిద్ధ నవలాకారుడు, ఎందరో తెలుగు రచయితలకు కూడా అభిమాన బ్రిటిష్ రచయిత అయిన ఛాల్స్ డికెన్స్ ఆధ్వర్యంలో నడిచిన (Household Words) పత్రికలో ఈ నవల ధారావాహికంగా ప్రచురింపబడింది. ఎలిజబెత్ ఈ నవలకు కథానాయిక పేరుతో ‘మార్గరెట్ హేల్’ అని శీర్షిక పెడదామనుకుందిగానీ, డికెన్స్ ఒప్పుకోలేదు. నార్త్ అండ్ సౌత్ అని నామకరణం చేశాడు. ఈ సీరియల్ నవలారచన లోని కష్టాలను ఎలిజబెత్ చెప్పుకుంది. 1854 జనవరి నుంచి 20 వారాల పాటు ధారావాహికంగా రాసిన నవల ఇది. ఇందులో పాఠకుల అభిరుచిని బట్టి కొన్ని మార్పులు చెయ్యాల్సి వచ్చిందని, కొన్ని చోట్ల పెంచడం, తగ్గించడం తప్పలేదనీ వాపోయింది ఆ తర్వాత. సంపాదకుడి హోదాలో డికెన్స్ కూడా పాఠకుల వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకోవాలని ఎలిజబెత్‌కి చెప్పేవాడు.

ఈ నవలలో మార్గరెట్ హేల్ కథానాయిక. 19 ఏళ్ళ మార్గరెట్ తన ప్రియమైన కజిన్ ఈడిత్ వివాహానికి ఏర్పాట్లు చేయడంతో నవల ఆరంభం. ఆ అమ్మాయి, వాళ్ళమ్మలతోనే బాల్యమంతా గడిపిన మార్గరెట్ ఆ పెళ్ళి తర్వాత తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్తుంది. పెళ్ళికొడుకు సోదరుడు హెన్రీ లెనాక్స్ మార్గరెట్ పట్ల ఆకర్షితుడై పెళ్ళి చేసుకుంటానంటాడు. మార్గరెట్ ఒప్పుకోదు. అలా ఒక వివాహ అవకాశాన్ని తల్లిదండ్రులతో చర్చించకనే తిరస్కరించిన స్వేచ్ఛాజీవి మార్గరెట్. ఆ తర్వాత ఆమె జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. దానికి కారణం తండ్రి తను పనిచేసే ఆంగ్లికన్ చర్చిపై విశ్వాసం కోల్పోవడం. (ప్రత్యక్షంగా అతను యూనిటేరియన్ భావాలు అందిపుచ్చుకున్నాడని రచయిత్రి చెప్పదు. కానీ ఈ పాత్ర చిత్రణలో తన భర్త కుటుంబం మతవిశ్వాసాలను ఎలిజబెత్ ప్రవేశపెట్టిందని అర్థమవుతూనే ఉంటుంది.) తనకు నమ్మకం పోయాక, ఆ చర్చిలో పనిచేయడం భావ్యం కాదని తండ్రి భావించి ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఇక ఆ ఊళ్ళో ఉండలేక, అందరూ కలిసి ఉత్తర ఇంగ్లండ్ లోని మిల్టన్ అనే పారిశ్రామిక పట్టణానికి వలసపోయి స్థిరపడతారు (ఇది కల్పిత పట్టణం). అంటే ఇంగ్లండులోని దక్షిణ మండలం నుంచి ఉత్తర మండలానికి వలస వెళ్తారు. మిల్టన్ పట్టణం జౌళి పరిశ్రమ కేంద్రం. అక్కడి పత్తి మిల్లులో కార్మికులకు, యజమానులకు తరచు గొడవలు జరుగుతూంటాయి. మొదట్లో ఈ పొగచూరిన పట్టణం మార్గరెట్‌కు అసలు నచ్చదు. కానీ క్రమంగా మిల్లులో పనిచేసే కార్మికుల జీవితాలను పరిశీలించడం ప్రారంభిస్తుంది. తన తండ్రి ట్యూటర్‌గా పనిచేస్తున్న కళాశాలలో చదువుకుంటున్న జాన్ థార్న్‌టన్ ఒక మిల్లుకు యజమాని. మిల్లు కార్మికులతో సాన్నిహిత్యం పెంచుకున్న మార్గరెట్ అతన్ని వర్గశత్రువుగా (ఆ పదం ఆమెకు తెలియనప్పటికీ) భావించి నిత్యం వాదిస్తూంటుంది. అతను పేదరికం నేపథ్యం నుంచి వచ్చి ఎదిగాడని లోలోపల మెచ్చుకున్నా, ప్రస్తుతం యజమానికుండే అవలక్షణాలన్నీ అలవరచుకున్నాడని అనుమానిస్తుంది. అతను కూడ మార్గరెట్ సౌందర్యం, వ్యక్తిత్వాల పట్ల ఆకర్షితుడైనా, ఆమె తెంపరితనానికి, కటువైన మాటలకూ విముఖుడవుతాడు.

అక్కడ వున్న ఒకటిన్నర సంవత్సరకాలంలో మార్గరెట్‌కు స్థానిక కార్మికనాయకుడైన నికలస్ హిగిన్స్‌తో, అతని కుమార్తె బెట్సీతో చక్కని స్నేహం ఏర్పడుతుంది. ఆ వూరి ప్రజలు ఎంత శ్రమజీవనం చేస్తున్నారో చూసి ముగ్ధురాలవుతుంది. పరిశ్రమలో పరిస్థితులు, కర్మాగారంలో కాలుష్యం వల్ల బెట్సీ అనారోగ్యం పాలై, మరణిస్తుంది. పత్తి కర్మాగారంలోని కలుషితమైన గాలుల వల్లే ఆమె మరణించిందన్న ఆగ్రహంతో కార్మికులు సమ్మెకు దిగుతారు. దీనితో థార్న్‌టన్ ఐర్లండ్ నుంచి కార్మికులను పిలిపించుకుని, ఉత్పత్తికి అవరోధం కలగకుండా చూసుకుంటాడు. దీనితో మరింత ఆగ్రహానికి గురైన కార్మికులు గుంపుగా వచ్చి అతని ఇంటిమీద దాడి చేస్తారు. కార్మికులతో చర్చలు జరపమని మార్గరెట్ అతన్ని ప్రార్థిస్తుంది. ‘ఒక మనిషిలా వాళ్ళతో మాట్లాడు’ అంటుంది. కానీ కార్మికులు మూర్ఖులని, వారితో మాట్లాడడం వ్యర్థమనీ అతను నిరాకరిస్తాడు. తర్వాత ఆమె మాటని కాదనలేక కిందికి వెళ్తాడు. అయితే అప్పటికే ఘర్షణ ముదిరి వాళ్ళు ఇంటిపై దాడిచేసి అతన్ని గాయపరచబోగా, మార్గరెట్ పరుగున వచ్చి అడ్డంగా నించుంటుంది. ఆడపిల్లమీద దాడి చెయ్యరనే నమ్మకంతో, అతనికి కవచంలా నిలబడుతుంది. కానీ ఈలోగానే ఎవరో విసిరిన ఒక పెద్ద రాయి వచ్చి మార్గరెట్‌కి తగిలి, ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమెను ఇంట్లోకి ఎత్తుకుని తీసుకువెళ్తాడు థార్న్‌టన్. ఆమె కోలుకున్న వెంటనే ఆమె పట్ల తన ప్రేమను ప్రకటిస్తాడు. తను కేవలం మానవత్వంతో అతనికి దెబ్బ తగలకుండా అడ్డుపడితే, తను ప్రేమిస్తున్నదని పొరబాటు పడుతున్నాడని అంటూ, అతని ప్రేమను తిరస్కరిస్తుంది మార్గరెట్.

ఈలోగా బ్రిటిష్ యుద్ధనౌకారంగంలో ఉద్యోగిగా ఉండి, అక్కడ ఒక అవినీతిపరుడైన అధికారిపై తిరుగుబాటు చేసి దేశం నుంచి పారిపోయిన మార్గరెట్ అన్న ఫ్రెడరిక్ తల్లి అనారోగ్యం గురించి తెలిసి, రహస్యంగా తల్లిని చూడ్డానికి వస్తాడు.

ఫ్రెడరిక్ తల్లి మరణానంతరం మళ్ళీ ప్రవాసంలోకి వెళ్ళడానికి మార్గరెట్‌తో కలిసి నౌకాశ్రయానికి వెళ్ళగా, అతన్ని గుర్తుపట్టిన ఒక మాజీ నౌకాదళ ఉద్యోగి అతన్ని బెదిరిస్తాడు. వాళ్ళిద్దరి మధ్యా జరిగిన తోపులాటలో లెనర్డ్ అనే ఆ నౌకాదళ ఉద్యోగి కింద పడిపోయి, మరణిస్తాడు. ఫ్రెడరిక్ తప్పించుకుని నౌకలో వెళ్ళిపోతాడు. పోలీసులు అనంతరం మార్గరెట్ వద్దకు వచ్చి ఏం జరిగిందో చెప్పమంటే, ఆమె తను అక్కడ లేనని బుకాయిస్తుంది. నిజానికి ఆమెను అక్కడ ఫ్రెడరిక్‌తో చూస్తాడు థార్న్‌టన్. వాళ్ళిద్దరూ ప్రేమికులని అతను అపోహపడతాడు కూడా. కానీ ఈ కేసు ఒక న్యాయాధికారిగా (పట్టణ మేజిస్ట్రేట్ హోదాలో) తన వద్దకు వచ్చినపుడు, మార్గరెట్‌ని తప్పిస్తాడు. అయితే, ఎప్పుడూ అసత్యం చెప్పి ఎరగని తను పోలీసులతో అబద్ధం చెప్పినందుకు బాధపడుతున్న మార్గరెట్, తనని గడ్డుపరిస్థితి నుంచి రక్షించినందుకు థార్న్‌టన్ పట్ల కృతజ్ఞత కలిగినా, అతన్ని చూడ్డానికి మొహం చెల్లక, దూరమవుతుంది. అతనేమో, ఫ్రెడరిక్‌ను ఆమె ప్రియుడిగా భావించుకుని, అందుకే తనను తిరస్కరించిందని అనుకుంటాడు.

మరోవైపు, కూతురు బెట్సీ మరణించిన తర్వాత తాగుడుకు అలవాటుపడిన నికొలస్ హిగిన్స్‌ని ఆ దురలవాటు నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తుంది మార్గరెట్. ఇక్కడ కార్మిక సంఘాలలోని అనైక్యతను కూడ రచయిత్రి ప్రవేశపెడుతుంది. కార్మికసంఘాల వల్ల ఒరిగేదేమీ లేదని హిగిన్స్ పక్కింటి జాన్ బూషర్ తరచు అతనితో వాదిస్తూంటాడు. అతనిది పెద్ద కుటుంబం. ఆరుగురు పిల్లలు, చాలీచాలని జీతాలు అతన్ని అన్నిటి పట్లా ఆగ్రహం పెంచుకునేలా చేస్తాయి. హిగిన్స్ నాయకత్వం వహించే కార్మిక సంఘం సమ్మెకు రెచ్చగొట్టడం వల్ల, తన ఉపాధి పోయిందని అతను తిడుతూంటాడు. చివరికి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బూషర్ ఆత్మహత్య చేసుకుంటాడు. పరోక్షంగా తనే దీనికి కారణమని భావించిన నికలస్ హిగిన్స్ అతని పిల్లలను ఆదుకోవాలని భావించి, తనకు తిరిగి థార్న్‌టన్ వద్ద ఉద్యోగం ఇప్పించమని మార్గరెట్‌ని అభ్యర్థిస్తాడు. ఆమె ఎంతో కష్టం మీద అతన్ని ఒప్పిస్తుంది.

ఇక్కడితో కొత్త దశ ప్రారంభమవుతుంది ఆ ఫాక్టరీలో. యజమాని థార్న్‌టన్, కార్మికుడు హిగిన్స్‌ల మధ్య చక్కని అనుబంధం ఏర్పడి, ఒకరి కష్టాలు మరొకరు అర్థం చేసుకోవడం మొదలవుతుంది. మాటల మధ్యలో ఒకసారి నికలస్ హిగిన్స్, మార్గరెట్ అన్న ఫ్రెడరిక్ అని చెప్పడంతో, థార్న్‌టన్‌లో ఫ్రెడరిక్ పట్ల ఉన్న అపార్థం తొలగిపోతుంది. ఇంతలో మార్గరెట్ తండ్రి హేల్, భార్య మరణం వల్ల కలిగిన వ్యథనుంచి మార్పుకోసం తన మిత్రుడు బెల్ వద్దకు ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్తాడు. అయితే అనుకోకుండా హటాత్తుగా గుండెపోటుతో అక్కడే మరణిస్తాడు. హతాశురాలైన మార్గరెట్ మిల్టన్ నుంచి వెళ్ళిపోతుంది. బెల్, ఆమెను లండన్‌లో ఆమె చుట్టాల దగ్గర దింపుతాడు. తర్వాత కొంతకాలానికే వాళ్ళిద్దరి స్వస్థలమైన హెల్‌స్టోన్‌కు ఇద్దరూ వెళ్ళగా, అక్కడ మారిన పరిస్థితులను చూసి మార్గరెట్ ఆశ్చర్యపోతుంది. తను రెండేళ్ళ క్రితం నివసించినట్లు లేదు తన స్వగ్రామం. మార్పు తనలోనూ వచ్చింది కదా అనుకుని సర్ది చెప్పుకుంటుంది. ఆ తర్వాత కొంతకాలానికే బెల్ మరణిస్తూ తన ఆస్తికి వారసురాలిగా మార్గరెట్‌ని ప్రకటిస్తాడు.

ఇప్పుడు మార్గరెట్‌కి డబ్బుకు కొదవలేదు. కానీ ఎక్కడ ఉండాలన్నది సమస్య. బెల్ కంపెనీలలో థార్న్‌టన్ పరిశ్రమ మార్ల్‌బరో కూడ ఒకటి అని గుర్తిస్తుంది మార్గరెట్. అంటే ఇప్పుడు తను అతని కర్మాగారానికి అధిపతి. అతను తన కింద ఉద్యోగి. తిరిగి మిల్టన్ వెళ్తుంది. అప్పటికే ఆ పరిశ్రమ నష్టాల్లో ఉంది. తరచు కార్మికుల సమ్మెలు, వాటిని ఎదుర్కోవడం చేతకాక, ఉత్పత్తి పడిపోయి, కార్మికులకు జీతాలివ్వలేకపోవడం వంటి ఇబ్బందులతో తలమునకలవుతున్న థార్న్‌టన్‌కు మార్గరెట్ అండగా నిలిచి, ఆర్థిక సహాయం చేస్తుంది. క్రమంగా తన ప్రవర్తనను మార్చుకుని, కార్మికులను కూడ మనుషులుగా చూడడం అలవరచుకుంటున్న అతని యాజమాన్యంలో ఫాక్టరీ మళ్ళీ లాభాల బాటలో పడుతుంది. చివరకి మార్గరెట్, థార్న్‌టన్ వివాహం చేసుకుంటారు.

ఆర్థికం, సామాజికం

ఈ నవలలో ముఖ్యమైన విషయం ప్రణయం కాదు. ఆర్థిక వ్యత్యాసాలు, యజమాని-కార్మికుల సంబంధాలు. పారిశ్రామిక విప్లవం ప్రభావంతో 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో బ్రిటన్‌లో ఏర్పడిన పరిస్థితులను ఈ నవల వర్ణిస్తుంది. పారిశ్రామిక విప్లవం చివరి రోజుల్లోని కథ ఇది. అంతకుముందు వరకు భూస్వాములు ఏలిన ఇంగ్లండులో అపుడపుడే థార్న్‌టన్ వంటి పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. పారిశ్రామిక విప్లవం వల్ల, ఉద్యోగాలు పెరిగిన మాట నిజమే. ప్రజల జీవన ప్రమాణాలు కూడ కొంతవరకూ పెరిగాయి. కానీ పరిశ్రమలో పనిచేసే వాతావరణం, శ్రమ దోచుకోవడంలో పరిశ్రమల యజమానులు చూపిన వైఖరి, కార్మికుల అనారోగ్యాల పట్ల అశ్రద్ధ, ఎక్కువ పనిగంటలు, తక్కువ వేతనం – ఇవన్నీ పారిశ్రామిక విప్లవం తెచ్చిపెట్టిన ప్రమాదాలు. వీటన్నిటినీ ఈ నవల చిత్రిస్తుంది. బెట్సీ మరణం ప్రత్యక్షంగా దీనికి ఉదాహరణ అయితే, మార్గరెట్ తల్లి కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకునే స్వగ్రామం వదిలి, ఈ పారిశ్రామిక వాడకు రావడంతో, వాయుకాలుష్యం వల్ల జబ్బుపడ్డం, అకాల మరణం చెందడం ఈ నవలలోని ముఖ్యమైన ఘట్టాలు.

రెండోది – కార్మికులు తమ పనిచేసే పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేసినపుడు, వారి పట్ల సానుభూతిని చూపడానికి బదులు, యాజమాన్యం (ఇక్కడ థార్న్‌టన్) ఏం చేస్తుంది? వాళ్ళతో చర్చించడానికి బదులు వాళ్ళ అవసరం తనకు లేదని చెప్పి, ఐర్లండ్ నుంచి కార్మికులను దిగుమతి చేసుకుంటాడు. కార్మికుల మధ్య తగవులు పెట్టి తన పబ్బం గడుపుకునే అసలు సిసలు పెట్టుబడిదారుడు అతను. కార్మిక సంఘాల పనితీరు, వారిలో వారికి కలిగే విభేదాలు – అన్నీ కథలో సహజమైన సన్నివేశాల్లో ఎంతో నిపుణంగా చిత్రించింది ఎలిజబెత్.

స్వభావసిద్ధంగా దయ, మంచితనం కొద్దో గొప్పో ఉన్న థార్న్‌టన్ ఆ గుణాలను కార్మికుల పట్ల ప్రసరించేలా చేయడం కథానాయిక చేసిన పని. అంతేగానీ వీరిద్దరి మధ్య సహజంగా ఉండే ప్రణయ సంభాషణలుండవు. బహుశా అందుకే కొందరు విమర్శకులకు మింగుడు పడక ‘మగవాడిలా రాయడానికి ప్రయత్నించి విఫలమైంది’ అని కితాబు ఇచ్చారు. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో హార్డ్ టైమ్స్ లాంటి నవల రాసిన డికెన్స్, స్వయంగా ఈ నవలను ప్రచురించాడన్న విషయం కూడా డేవిడ్ సెసల్ లాంటి విమర్శకులు పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ నవలకు డికెన్స్ నార్త్ అండ్ సౌత్ అని పేరు పెట్టడానికి మంచికారణం ఉంది. కథానాయిక మార్గరెట్ హేల్ పుట్టింది, పెరిగింది దక్షిణ ఇంగ్లండ్‌లో స్వచ్ఛమైన వాతావరణం కలిగిన గ్రామం హెల్‌స్టోన్‌లో. అక్కడినుంచి, కర్మాగారాల కంపు, విపరీతమైన జనం, ఇరుకు ఇళ్ళతో ఉన్న ఉత్తర ఇంగ్లండ్‌లోని మిల్టన్ నగరానికి వస్తుంది. ఈ రెండిటి మధ్య ఉన్న అంతరం కేవలం భౌతికమైంది కాదు. హెల్‌స్టోన్‌లో సామాజిక హోదాల గొడవ, ఫాక్టరీ ఉద్యోగాలు, కలుషిత వాతావరణం లేవు. అదే సమయంలో మిల్టన్‌లో ఉన్నంత సంపద, ఉపాధి అవకాశాలు కూడా లేవు. మిల్టన్‌లో మార్గరెట్ ప్రపంచజ్ఞానం పెరుగుతుంది. జీవితమంటే చల్లని గాలులు, అందమైన తోటలు, విహారాలు మాత్రమే కాదని, ఈ లోకంలోని సగంమంది మిల్లుల్లో రాత్రింబవళ్ళు పనిచేసి, తిండికీ, గుడ్డకూ కూడ మొహం వాచిపోయి వున్నారనీ తెలుసుకుంటుంది. శ్రమజీవనంలోని భయంకర అనుభవాలను ప్రత్యక్షంగా చూస్తుంది. తన జీవితంలో అతి ముఖ్యమైన ఈ రెండు పట్టణాలనూ పోల్చి చూసుకుంటూ ఉంటుంది అపుడపుడూ. తండ్రి మరణానంతరం తిరిగి తన స్వగ్రామం వెళ్ళినపుడు ఎందుకో అది మారినట్టు అనిపిస్తుంది. ఇదివరకటిలా స్వచ్ఛంగా లేదు. తన పొరుగింటావిడ తన పిల్లిని ఎవరో మూఢవిశ్వాసంతో తగలబెట్టారని చెప్పినపుడు హతాశురాలవుతుంది. తను ఎంతో రొమాంటిక్‌గా ఊహించుకునే తన గ్రామంలో కూడ, మిల్టన్‌లో ఉన్నంత క్రౌర్యం ఉందా అనుకుంటుంది. ఇంతకూ ఎక్కడున్నా మనుషులు ఒకటే అనుకుంటుంది. సమాజం మారినపుడు జీవితాలు, మనస్తత్వాలు కూడ మారుతూంటాయి. పరిణామం సహజం అని గుర్తిస్తుంది. తను కూడ మారింది కదా? థార్న్‌టన్‌ని తను కొద్దో గొప్పో మార్చగలిగింది కదా.

నవలాంతానికి జీవితంతో వీలైనంత సర్దుకుపోవడం, వీలైనంతవరకూ విలువలతో జీవించడం తప్ప, మానవుడు చేయగలిగింది ఏమీ లేదనుకుంటుంది.

శైలి

ఎలిజబెత్ గాస్కెల్ శైలి చాలా సరళంగానూ, పదునుగానూ ఉంటుంది. ముఖ్యంగా మార్గరెట్, థార్న్‌టన్‌తో కార్మికుల గురించి మాట్లాడే సందర్భాల్లో. ఉదాహరణకు, సమ్మె చేస్తున్న వారిని పట్టించుకోక, ఐర్లండ్ కార్మికులను పనిలోకి దింపినపుడు, ఆగ్రహంతో అతని భవనం వద్దకు చేరుకుంటారు కార్మికులు. వాళ్ళను చూడ్డానికి కూడ ఇష్టపడడు అతను. పైగా వాళ్ళు చేసే గోలతో తన ఐరిష్ కార్మికులు ఎక్కడ బెంబేలుపడిపోతారో అని వాపోతాడు. మార్గరెట్‌కు కోపం వస్తుంది: ‘Mr. Thornton’, said Margaret, shaking all over with her passion ‘go down this instant if you are not a coward. Go down and face them like a man. Save these poor strangers whom you have decoyed here. Speak to your workmen as if they were human beings. Speak to them kindly. Don’t let the soldiers come in and cut down poor creatures who are driven mad… If you have any courage or noble quality in you, go out and speak to them, man to man’ (pg. 209). ఆమె మాటల తీవ్రతకు లొంగి, కిందికి వెళ్తాడు థార్న్‌టన్.

నవలంతా మార్గరెట్ కోణం నుంచే నడుస్తుంది. ఆమె ఆలోచనలకు ఎక్కువ స్థానం కల్పించింది రచయిత్రి. తను ఎవరితో ఏది మాట్లాడినా, ఎంతో ఆలోచిస్తుంది. ఒక్కోసారి సంభాషణ ముగిసిన తర్వాత కూడా విశ్లేషించుకుంటుంది. ప్రతిదాన్నీ తరచి నిశితంగా విశ్లేషించే తెలివితేటలు ఆమె స్వంతం. చదువుకున్న, తెలివితేటలు, మంచితనం ఉన్న ఒక అమ్మాయి తన చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా ప్రభావితం చెయ్యగలదో చూపించే రచన ఇది. తన అందంతోనో, సంభాషణా చాతుర్యంతోనో, సంపదతోనో, ప్రేమతోనో కాక, తన నిజాయితీతో, ధైర్యంతో పురుషుడిని ఆకట్టుకున్న చక్కని యువతి మార్గరెట్. ఒక పరిశ్రమల యజమాని, కరడుగట్టిపోకముందే ఆ ప్రమాదం నుంచి రక్షించి, మనిషిగా తీర్చిదిద్దిన వ్యక్తిత్వం ఆమెది.

ఆధిపత్యంపై తిరుగుబాటు

నవలలో మరో ఆసక్తికరమైన విషయం, సమాజంలో స్థిరపడిపోయిన భావనలను, వ్యవస్థలను ధిక్కరించే ప్రవృత్తుల చిత్రణ. ఏకకాలంలో మూడు రకాల భావవిప్లవాలు కనిపిస్తాయి. అన్నీ ఒకే కుటుంబంలోని వ్యక్తుల నుంచి వచ్చినవి. మార్గరెట్ తండ్రి హేల్, ఆంగ్లికన్ చర్చిలో కరడుగట్టిన సిద్ధాంతాలను తిరస్కరిస్తాడు. అందుకే ఆ ఉద్యోగం నుంచి తనే తప్పుకుంటాడు. కొడుకు ఫ్రెడరిక్, నావికాదళంలోని క్రూరమైన అధికారుల చర్యలను ఖండిస్తాడు. వారిపై తిరగబడతాడు. అందుకే జీవితమంతా చట్టం నుంచి పారిపోతూ, ఫ్యుజిటివ్‌గా మిగిలిపోతాడు. మిల్టన్‌లో కార్మికులు, ఫాక్టరీ యాజమాన్యంపై తిరగబడతారు. వారికి అండగా నిలుస్తుంది అదే కుటుంబం లోని మార్గరెట్. ఈ నవలలో కీలకమైన సన్నివేశం కార్మికుల సమ్మె. ఈ నవల ప్రచురణకు ఏడాది ముందు ఇంగ్లండులో జరిగిన ఒక విఫల సమ్మెను (ప్రెస్టన్ స్ట్రయిక్) నవలలో ఒడుపుగా చిత్రించింది. సమ్మెను మూడు కోణాలనుంచి చిత్రిస్తుంది ఎలిజబెత్. వివేకవంతుడైన కార్మిక నాయకుడు హిగిన్స్, అపుడపుడే కార్మికులకు యజమానులకు అంతరాన్ని, వైరుధ్యాన్ని అర్థం చేసుకుంటున్న మార్గరెట్, ఆవేశంతో అదుపు తప్పిన కార్మిక సమూహం – ఈ ముగ్గురి కోణాలు సమ్మెలో చిత్రింపబడ్డాయి.

ఎలిజబెత్ గాస్కెల్, ఈనాటి బ్రిటిష్ సాహిత్య అధ్యయనంలో అనివార్యంగా ఉంటుంది. పారిశ్రామిక విప్లవపరిణామాల చిత్రణలో చక్కని కోణాలు చూపించిన రచయిత్రిగా ఈనాడు అందరూ అంగీకరిస్తారు.

నార్త్ అండ్ సౌత్ 1966, 1975, 2004 సంవత్సరాల్లో టెలివిజన్ ఫిల్మ్‌గా రూపొందింది. ప్రముఖ నవలాసిద్ధాంతకర్త, రచయిత డేవిడ్ లాడ్జ్, నార్త్ అండ్ సౌత్ నవలను అనుకరిస్తూ, దానికి నివాళి రూపంలో నైస్ వర్క్ అనే మరో నవల రాశాడు. అది కూడా చాలా ప్రజాదరణ పొందింది.

ఈ నవలలో మార్గరెట్ అన్నట్టు, ‘I know you despise me, allow me to say; that is because you do not understand me’ అని ఎలిజబెత్ గాస్కెల్ కూడా తన సమకాలీన విమర్శకులతో అనే ఉంటుంది. ఇప్పుడు ఆమె నవలలు లోతుగా చదివిన వాళ్ళెవరైనా, ఆమెను సరిగానే అర్థం చేసుకుంటారు.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...