కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడతను. ఆమె మసగ్గా ఉన్న కారిడార్‌లో అటూ ఇటూ తిరుగుతోంది. ఆమెని ఎక్కడో చూసినట్టుంది. మాటిమాటికి నర్స్‌ని కదిలిస్తుంది. ఆమె ఎవరో క్లారిఫై చేసుకుందామని రెండడుగులు వేశాడో లేదో, డాక్టర్ పిలుపు… రిపోర్ట్ తీసుకొని అమ్మని జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తూ, దగ్గరికి రావడం ఆమెను చూడటం… ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆమె మాత్రం మొదటి చూపులో పోల్చుకోలేదు.
“డూ యూ రిమెంబర్ మీ?” క్రాంతి.
“హాఁ. హాఁ” అప్పుడే గుర్తొచ్చినట్లు నటించలేదామె. అల్క.
“లోపల…?”
“మా బాబు అభికి స్టమక్ పెయిన్.” కళ్ళు వత్తుకుంది.
“దానికి ఇంత హైరానానా!” నవ్వాడు. నవ్వించాడు. మనసు తేలికపరిచాడు. కాస్త రింగుల జుట్టు, ఓ మోస్తరు మందం, ఒక చేతికి తాయత్తు, తక్కువ రకం కుర్తాలో కూడా ఇంత ఆకర్షిస్తోంది. ఆ సందర్భాన్ని, తన భావాన్ని తలుచుకొని క్షణకాలం గిల్టిగా అనిపించి అప్పటికి వీడ్కోలు పలికాడు. ఆమె కళ్ళకి హీరోలా కనిపించాడు. కారణం అతను చూపిన కేర్ కావచ్చు, కాకపోనూవచ్చు.
మోగుతున్న ఫోన్ దాకా వెళ్ళిన చేయి ఆగిపోతోంది. ‘ఎందుకు?’ ఆమెలో కొత్త సందేహాల వల. ఈసారి తీసింది. మూడు వారాల నుంచీ ఉద్వేగం, అలజడి. అల్కా ప్రశ్నలు వల తెగి చేపపిల్లల్లా బయటపడ్డాయి.
“చాలా ఏళ్ళకి నేను తిన్నానో లేదో అడిగిన మొదటి మనిషివి, నీకు చెప్తే ఇంతకుముందు కూడా కాని పనులు అవుతున్నాయి, ఎందుకు?”
అతను సమాధానం చెప్పేలోపు పెట్టేసింది. ఆగిన ఫోన్‌కే చెప్పుకొని తృప్తిపడ్డాడు. వీడియోకాల్ చేశాడు. ఇందులో మాటలు మరీ తక్కువ.
“గ్రీన్ శారీలో నెమలిలా ఉన్నావు.”
తనలో కొత్తగా ఏదో కనుగొన్నట్లు అబ్బురంగా చూసింది.
“ఎక్కడున్నావ్?”
“సుల్తాన్ బజార్.”
“ఎప్పుడు చూడు సుల్తాన్ బజార్, అక్కడికి వెళ్ళేది కొనడానికా అమ్మడానికా?”
“మా చుట్టాలు సెలెక్షన్‌కి నన్నే పిలుస్తారు మరి.” తనకే ప్రత్యేకమైన నవ్వు తెరలు తెరలుగా. పక్కనెవరూ లేరనేది అతను చూడలేడుగా.
“ఇప్పుడెందుకు?” క్రాంతి.
“మా దగ్గర గూడిపడ్వా బాగా చేస్తారు, సో…”
“అంటే?”
“మరాఠీ ఉగాది.”
ఈసారి తనే ఫోన్ కట్‌చేశాడు. నిమిషాల్లో అక్కడ వాలిపోయాడు.
సుల్తాన్ బజార్, కోఠి… దాహానికి నిమ్మకాయ షోడా, విసుగుకి ఇరానీ ఛాయ్, బంగారాన్ని కొనలేని వాళ్ళని తృప్తిపరిచే ఇమిటేషన్ నగలు, స్వెటర్లు, పాత పుస్తకాలు, హోల్‌సేల్ మార్కెట్, ఒక్కటేమిటి, అన్నీ దొరుకుతాయి. ఎప్పుడన్నా డల్‌గా అనిపిస్తే ఇక్కడ ఒక్క రౌండ్ కొడితే చాలు, నిస్పృహ ఆ పాత బిల్డింగ్స్ మీది పావురాల్లా ఉడ్ జాతే.
ఈసారి ఆమెలో ఆ ఉల్లాసం లేదు. వడివడిగా వెళుతోంది.
“అలకా? అల్కా!” మొహంలో మొహం పెట్టాడు క్రాంతి.
అతన్ని నెట్టి, ఓ చూపు చూసి తల తిప్పుకుంది. అది అతను పట్టించుకున్నట్లులేదు.
“నేను నీకన్నా ఇంకా మూడేళ్ళు చిన్న.” అల్కాకి ముప్పైఆరు ఉంటాయి. మొహం ఎర్రబడింది.
“కోపంలో కాస్త చిన్నదానిలా కనిపిస్తావ్. ఆ పెద్ద కళ్ళ వల్లా, లేక గుండ్రని మొహం వల్లా, నవ్వుకి చాన్నాళ్ళుగా దూరమైన ఆ పెదాల వల్ల మాత్రం కాదు.”
అతని కవిత్వం ఫెయిలయినప్పుడు కూడా ఆమెలో అదే థ్రిల్.
సాయంత్రం అవుతుండగా ఓలా ఎక్కారు, పనామాలో మిఠాయ్ భాండార్లో పావ్ భాజీ పంచుకున్నారు. ఆమె కోసం ఓ ముక్క కొరికాడు అంతే.
“కాలేజీలో ఉన్నప్పటి అమాయకత్వం నీలో ఇప్పుడులేదు.”
“అదే కాదు, చాలా లేవు.” తినడం ఆపింది.
“ఇంటర్ ఫస్టియర్‌లో డవ్ సోప్‌లా ఉన్న నిన్ను చూసి తెలుగు అమ్మాయని అసలు అనుకోలేదు, నా ఊహే నిజమైనందుకు చాలా బాధపడ్డాననుకో.”
“ఎందుకూ?”
“అదంతే, కానీ నీ పేరు, తీరు గమ్మత్తు. ఫ్రెషర్స్ డేకి అనుకుంటా నువ్వు పెట్టుకొచ్చిన ఆ మరాఠీ ముక్కుపుడక నిన్ను స్పెషల్‌గా చూపెట్టేది, ఇప్పుడది ఏమైంది?”
ఆమె సమక్షం అతనిలో ఓ యుఫోరియా.
“అప్పట్లో పండగలకి రెగ్యులర్‌గా పూణేకి వెళ్ళేవాళ్ళం, తర్వాత వీలు కాలేదు. ఇక్కడి కట్టుబొట్టుకి అలవాటు అయిపోయాను, హైదరాబాదులో కాస్త స్పెషల్‌గా కనబడ్డా అలా చూస్తూ ఉంటారు జనం.” శబ్దం రాని నవ్వు.
“అలా చూడటం వల్లే మూడు వారాల క్రితం కోఠిలో నా కంటపడ్డావు.”
“హా హా హా” ఇద్దరూ.
“కాలేజ్‌లో చేరి రెండునెలలు కూడా కాలేదు, పెళ్ళి అయింది.”
మ్యాజిక్ షోలో షాకయిన ప్రేక్షకుడిలా చూశాడు ఆమె వైపు. “అందుకేనా! నువ్ భలే ఉన్నావ్ అనుకున్నానా, నీకోసం రోజులు కాదు, వారాలు కాదు, నెలలు చూశాను. నువ్వు తిరిగి రాలేదు.”
“మ్మ్, మనం పెద్దవాళ్ళు తెలివైనవారు అనుకుంటాం. లేకపోతే ఒక జ్వరం నా పెళ్ళికి కారణం అవుతుందా!” రెప్ప మూస్తే పడే బిందువులు.
ముందుకు వంగి చేయి చేతుల్లోకి తీసుకున్నాడు. “డిప్రెస్ అయ్యావా?”
చెయ్యి వెనక్కి తీసుకుంది. “లేదు, ఆయన నాలా కాదు, చాలా సాఫ్ట్. అమ్మ గీసిన గీతలు చేరిపేశారు. నాకోసం తనకిష్టం లేకున్నా మూవీకి తీసుకెళ్ళేవాడు. అప్పుడప్పుడూ అన్నం కలిపి తినిపించేవాడు.”
ఆమె మొహంలో అంత కాంతి అతను ఎప్పుడూ చూడలేదు.
“ఇంకా.”
“ఇంకేముంది?”
“అదే, అన్నం తినిపిస్తారు… ఇంకా?”
“యాఁ, పిల్లాడికి క్రికెట్, సైకిల్ నేర్పించడం… మంచి నాన్న కూడా.”
అతని పెదాలు రబ్బర్లా సాగాయి. వాటిలో నవ్వులేదని కనిపెట్టింది. మళ్ళీ ఆమె అరచేయి పట్టుకోబోయాడు. కుదరలేదు.
“లెదర్ ట్యానింగ్ కంపెనీలో జాబ్, లెదర్ పడకపోతే కిడ్నీ క్యాన్సర్ వస్తుందని ఎటాక్ అయ్యాక గానీ తెలీలేదు.”
అతని జాలి చూపుని చూసి ఆగిపోయింది. “అంత పెద్ద ప్రోబ్లమా అది?” కదిపాడు. చుట్టూ జనాన్ని చూసింది. బైటికి వచ్చారు.
“యాఁ, తను మంచానికి అంటుకుపొయ్యేదాకా నాకు పనిచేయాల్సిన అవసరం రాలేదు. తర్వాతే ఏం చేయాలి? అన్న ప్రశ్న ఎదురయింది. ఆయన పేరెంట్స్ కూడా లేరు. మా అమ్మ, అక్కలు, అన్నలు, ఎంతని సాయపడతారు. అసలు కొన్ని కార్యక్రమాలకి నా కుటుంబం ఉందని మర్చిపోయారు. ఎలాగో అమ్మవాళ్ళకి ఉన్న ఆ బిల్డింగ్‌లో ఒక పోర్షన్ ఇచ్చారు. దానికి రెంట్ లేకపోవడం పెద్ద సంతోషం. నా కాళ్ళ శక్తి తెలిసిన రోజులవి. ఎలాగో తెలిసినవాళ్ళ ద్వారా ఓ కంపెనీలో హెచ్. ఆర్. ఎక్జిక్యూటివ్ అయ్యాను.”
“డిగ్రీ కూడా పూర్తిచేయలేదు కదా నువ్వు!”
“హహ, మస్కిటో కాయిల్స్ కంపెనీలో ఉద్యోగం. తర్వాత కదా తెలిసింది, దీనికి అకడమిక్ క్వాలిఫికేషన్ కన్నా ఫేషియల్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉండాలి అని, మొదటిసారి గర్వపడ్డా అనుకో నన్ను నేను చూసుకుని. ఎక్కువసేపు అద్ధం ముందు ఉన్నందుకేమో. కానీ ఎందుకో…
“ఒకరోజు ఆయన నా వైపు చూశాడు. ఏంటి? అని అడగకున్నా, ఆ శబ్దం బయటకు రాకున్నా నాకు అర్థమైపోతుంది. వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నా. ‘రాత్రి నీ వెక్కిళ్ళు వినపడ్డాయి’ అన్నాడు. ఉలిక్కిడ్డాననుకో. నా వీపు మీద చెయ్యేసి లేవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు తన బరువు మోయగలిగినా, తనే మోయలేక ఉన్నాడు. ఓ హగ్ ఇవ్వాలని ప్రయత్నం. తన శరీరానికి శక్తి లేక, ఇవ్వలేక శిథిలమైన చూపు చూశాడు. తను అచేతనం. నాతో అతనూ కుమిలాడు. చాలాసేపటి తర్వాత నావైపు చూశాడు. తనలో ఏదో ప్రశాంతత. ఆ క్షణం అతని కళ్ళలోకి చూడాలంటే భయమేసింది. కొన్నిరోజులు తనవైపు సూటిగా చూడలేదు నేను. చివరికి అభీనే ఇంట్లో ఎక్కువగా అయనకి నీళ్ళు ఇవ్వడం, యూరిన్ తీసేయడం, తల దువ్వడం, నాన్నకి నాన్న అయ్యాడు వాడు…” మాట ఆగింది. కర్చిఫ్‌లో మొహం పెట్టుకుని ప్రతిమలా ఉంది. భుజం మీద చెయ్యి వేశాడు ఓదార్పుగా. తేరుకొని కొనసాగించింది.
“ఆయన్ని అలా చూడలేక అభి రోజూ ఏడ్చేవాడు. అప్పుడు అనిపించేది బాబు తర్వాత దీన్ని ఎలా తట్టుకుంటాడు, తనని ఎలా పెంచాలి అని. ఇప్పటికే ఓ రకంగా సింగిల్ పేరెంట్ లైఫ్ వాడిది, నాది కూడా. ఆయన, అభి, ఆఫీస్, ఇదే నా ప్రపంచం. యంత్రంలా ఉన్నానా? రోజురోజుకి తిండి సయించేదికాదు. నిజానికి ఇప్పుడు తన ప్రేమ రెట్టింపయింది. కాని, నాకే ఎందుకిలా అని, మరుక్షణం నేను లేకుంటే తను ఏమయ్యేవాడు అన్న తెలివి, రోజులు గడుస్తుంటే తెలీని యాతన.” కళ్ళు తుడుచుకుంది.
“పరిస్థితిని మార్చడానికి ఏం ప్రయత్నం చేయలేదా?”
“చేశా, చిన్నవే. ఆయన ఆరోజు రాత్రి మూవీ చూడాలన్నాడు. పెద్దగా సినిమాలు చూడడు, ఏమయిందో మరి? ప్లే చేశాను. గుజారిష్. అక్కడేముందో మన జీవితాల్లోనూ అదే, ఏం చూస్తాం? అని తనే మధ్యలో ఆపి ‘నీకు కాలేజి లవ్ స్టోరీ ఏం లేదా?’ అన్నాడు. ‘పూర్తిగా చదివితే ఉండేదేమో’ అన్నాను. ఎందుకో ఆయన వైపు చూడలేదు. ‘ఉండి ఉంటే బాగుండేదా?’ అన్నాడు. ‘ఎవరూ? నాకు చెప్పు?’ నవ్వాడు. ఐ థింక్ తనకి అర్థం అయ్యిందనుకుంటా. అభి జూస్ తాపుతుండగా గుటక ఆగింది. అభి కళ్ళముందే…”
“మైగాడ్, ఎలా తట్టుకున్నాడు తను?”
“రాత్రుళ్ళు సడన్‌గా లేచి నాన్న అంటూ ఏడ్చేవాడు. ఊరడించేసరికి తెల్లారేది, స్కూల్‌కి కూడా సరిగా పోలేదు, అక్కడా క్లాస్‌లో ఎక్కిళ్ళుపెట్టేవాడు, దాంతో ఇంట్లోనే వాణ్ణి కనిపెట్టుకొని ఉన్నా. వాణ్ణి మామూలు మనిషిని చేయడానికి రెండేళ్ళు పట్టింది. ఇన్నేళ్ళ తర్వాత ఇదిగో నా ముఖంలో నవ్వు ఈ మూడువారాలనుంచే.”
‘అమ్మకి ఇంకోసారి నచ్చచెప్పాలి. తను జీవితాన్ని కొత్తగా మొదలెట్టాలి.’ ఆ క్షణం గట్టిగా అనుకున్నాడు.
“ఎందుకు ఏడుస్తున్నావు?”
చిన్నగా నవ్వింది. “ఇది ఏడుపు కాదు.” అతని బుగ్గని తడిమి లేచింది బట్టలు చుట్టుకుంటూ.
“థాంక్స్ ఫర్ ది గిఫ్ట్. అయిదేళ్ళ తర్వాత.”
“ఏదీ!” అనుమానపడేలోపే అర్ధమయ్యి సిగ్గుపడి కొట్టినట్టు చేసింది.
“ఇంట్లో మాట్లాడావా?” క్రాంతి.
“అది తప్ప ఇంకేమైనా మాట్లాడు.” అల్క.
ఈ టాపిక్ ఎందుకు దాటవేస్తుందో అర్థంకాక తల గోక్కున్నాడు.
“నువ్ అతిగా పట్టించుకోవడం వల్లేమో నీ ఫోన్ ఒక ఎడిక్షన్ అయింది. ఇంక చెయ్యకు.”
“అమ్మ నిన్ను ఇంటికి తీసుకురా అంది.” క్రాంతి.
“ఆఁ!” ఆమెకి చెమటపట్టడం మొదలైంది.
“యాఁ, నువ్వు ఆల్రెడీ వచ్చావని తెలీదు.” పెద్దగా నవ్వాడు.
చిరుకోపం నటించి సాలోచనగా తలదించింది. “మన బంధం అసలంతదాకా వస్తుందనీ అనుకోలేదు.”
“వాట్ డూ యూ మీన్, ఎందుకు రాదూ?” అతనిలో ఎప్పుడూ చూడని ఉద్రేకం.
“ఏమైనా చెప్పావా అమ్మకు?”
“నాట్ మచ్. అంటే… అమ్మ పెళ్ళికి వన్ మంత్ టైమ్ ఇచ్చింది.”
“ఇంట్లో అభి ఎదురుచూస్తూ ఉంటాడు, బై.”
వాడని అద్దంలా మసకబారి ఉంది ఆ బిల్డింగ్. ‘ఆ మసక తుడిచేస్తే నా మొహంలా ఉంటుందేమో’ అనుకుంది. మెట్లెక్కి లోనికెళ్ళింది. ఎందుకో తన ఇంట్లో తనే ఫ్రీగా ఉండలేదు. అభి బౌల్ షేప్ అక్వేరియంలో చేపల్ని తడుతూ ఉంటే అవి తడబడుతున్నాయి. వాటికీ అభికీ తేడా లేదు అనిపించింది, పదోతరగతి, కానీ ఇలాగే అంతా పోగొడతాడు.
కె.ఎల్.ఎమ్. షాపింగ్ మాల్ కవర్ ఎదురుగా పెట్టింది, సోఫా చివర కూర్చుంది. మూడు నిమిషాలు ముభావంగా చూసి ఇక మెల్లగా తెరిచాడు.
“బాగున్నాయా?”
“ఇప్పుడు ఎందుకు?”
“ఊరికే తేవాలనిపించింది.”
తలాడించాడు. “ఎంతసేపు చూడాలి నీకోసం?”
తానూహించిన రెస్పాన్స్ కానందుకు అలా మౌనంగా చూసింది. పొద్దున్నే ఎప్పటిలా వంటగదిలో వీడియో కాల్, అభి కప్పుకున్న దుప్పటి వింటూ ఉంది.
“ఎపుడో ఒకప్పుడు చెప్పక తప్పదు, నెల రోజులుగా చెప్తా అంటున్నవ్ దాటేస్తున్నావ్.” క్రాంతి.
ఆమె చాలాసార్లు ఆ టాపిక్ కట్ చేస్తుంటే ఎందుకో అర్థంకాదు. అభి ప్రస్తావన వచ్చినప్పుడు తన మాటకి విలువుండదు. అదీ అతని ఉక్రోషం. అభి రావడం చూసి “మా ఫ్రెండ్, హాయ్ చెప్పు, రా” పిలిచింది. వచ్చి బాయ్ చెప్పి మొబైల్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. క్రాంతి షాక్ తిన్న విషయం ఆమెకి తెలీలేదు. మళ్ళీ చేశాడు. మళ్ళీ మళ్ళీ చేశాడు. తీసే సాహసం చేయలేదామె. ఫోన్‌నే చూస్తోంది.
‘ఏదీ అనుకున్నట్టు జరగలేదు. జాబ్ బోర్ కొడుతోంది, అది ఎంతో అవసరం అని తెలిసినా, ఊరికే చిరాకొస్తొంది. ఆ టైమ్‌లో అభి ఎఫెక్ట్ అవుతాడన్న భయం కూడా.’ ఆఫ్ చేసిన ఫోన్‌కు చెప్పుకుంది.
ఇల్లు ఇంతకు ముందులా చిందరవందరగా లేదు, ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లున్నాయి కాబోయే అత్తగారి మాటలు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిపోతుంది. అల్కా వంటలో సాయం, ఆపై లంచ్ ఏర్పాటు, బ్రతుకులో కొత్తగా తగిలిన రుచి. అన్నిటికీ మురిసిపోయింది అత్త.
“వొక్కదానివే వచ్చావు?” వడ్డిస్తూ.
“అది… బాబుకి ఇంకా…” అల్కా.
“చెప్పాల్సిన పనేముంది?”
“పెద్దవాడు అవుతున్నాడుగా.” మెల్లగా అంది.
ఆమె భుజం తట్టి వెళ్ళింది. అల్కా మది జగిబిజి గదినిండా అలుముకుంది. ‘ఈ విషయంలో నా నిర్ణయం ఎలాంటి పరిస్థితికి నెడుతుంది? నా తాత్సారంతో క్రాంతి లైఫ్‌నీ చెడగొడుతున్నానా? ఈపాటికి నాలా ఓ బేబీతో ఆడుకుంటూ ఉండాల్సినవాడు. ఆ తల్లి దగ్గర క్రాంతి అభిలాగే అనిపిస్తాడు. వాడి ప్రవర్తన చెబితే! వద్దు. నన్ను కాదు, నా జీవితాన్నే ఎవరో నియంత్రిస్తూన్నారు.’
“ఏదో ఆలోచిస్తున్నావు!” క్రాంతి.
“ఏమీ లేదు.”
అమ్మ వంటగది నుండే అరుస్తోంది. “మావాడికి పెళ్ళి ఎప్పుడో చేయాల్సింది. కెరీర్ కెరీర్ అని ఇంతకాలం చేశాడు, నేను సంబంధాలు చూళ్ళేదని నామీదే నెడతాడు. ఈమధ్యే ఇల్లు కొనగలిగాం, నీ గురించి చెప్పాక, నేనూ ఆలోచించా. వీడు మూడు రోజులు ఇంటికి రాలేదు.”
అల్కా అతని వైపు చూసింది, తల తిప్పుకున్నాడు.
“అప్పుడే నాకు ఈ బీపీ స్ట్రోక్, తల్లికి బిడ్డ ఆనందంకన్నా కావాల్సింది ఏముంది.”
ఎందుకో ఆ మాటకి అభి గుర్తొచ్చాడు. ఎవరికీ చెప్పనిది చెప్పడం మొదలుపెట్టింది.
“ఇంకో పెళ్ళికి మా అమ్మ మొదట్లో ఇష్టపడలేదు, చిన్నపిల్లల్ని వేరేవాళ్ళు సరిగ్గా చూడరని, ఇప్పుడైతే పిల్లాడు పెద్దయ్యాక చేసుకుంటే అసహ్యంగా ఉంటుంది అన్నారు, నేనూ ఏం మాట్లాడలేదు.
“ఎప్పుడన్నా లేటుగా వస్తే చాలా సీరియస్‌గా చూస్తాడు అభి. మా అమ్మ చూపుకి వాడి చూపుకి తేడా ఉండదు. ఆశ్చర్యమేస్తుంది, నా ముందు పెరిగినవాడే కదా, కానీ…” అందరూ ఒకేసారి ఆలోచనలో పడ్డారు.
ఆమెలోన చెప్పలేని ప్రశ్నలు ఊరుతూనే ఉన్నాయి ‘వాళ్ళు నన్నంటుకున్న రంగులే పోయాయి అనుకుంటున్నారు. ప్రేమ కూడా పోయింది, అది మాత్రమేనా చెప్పలేనివి ఎన్నో పోయాయి, ఒంటరితనం అనిపించినపుడు హత్తుకుని సాంత్వన ఇచ్చే మనిషితోపాటూ. పిల్లాడు కూడా నీకు ఇప్పుడు పెళ్ళి ఎందుకు అంటే? అసహ్యంగా ఉంటుంది, వాడు అమ్మ మనసు మాత్రమే తెలుసుకోగలడు. క్రాంతి, మీరు, నేను… అందరి పాత్రలూ బహుముఖాలు. తల్లికోసం క్రాంతి తొందర, అభి కోసం నా వెనుకడుగు, రెండూ ప్రేమలే. హౌ వియర్డ్, ప్రేమకి ప్రేమే విరోధి.’ తినకుండానే తన లంచ్ పూర్తయింది.
‘కనీసం ఈరోజయినా అభితో చెప్పు.’ సైగ చేశాడు క్రాంతి. తల సగమే ఆడించి, సగమే నవ్వి, సగం మనసు అక్కడే వదిలి వెళ్ళిపోయింది.
ఏదో నమ్మకం బలపడుతోంది అతనికి. “ఓయ్ అల్కా, పెళ్ళికి ముహూర్తాలు చూడటం ఎందుకు, డేట్ ఫిక్స్ చేసేస్తా, కార్డ్స్ అవసరంలేదు కదా, వాట్సప్ కార్డ్ చాలేమో” ఆగకుండా చెప్తున్నాడు క్రాంతి.
“చెప్పేది విను, నా జాబ్.” అల్కా.
“జాబ్ మానేశావా, ఇంట్లో వద్దన్నారా?”
“…”
“పోనీలే నేనున్నాగా?”
“మొన్న నీ బైక్ దిగడం అమ్మ, అభి చూశారు, కాలనీలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరి మాటా నాకు రిపోర్ట్ చేస్తుంది అమ్మ, అసహ్యంగా ఉంది నా మీద నాకే.”
“నేను మాట్లాడనా?”
“నా లైఫ్‌కి తన ఒపీనియన్ అవసరం లేదు.”
“మరి?” ఏదో బరువు తగ్గినట్టు రిలాక్స్ అయ్యాడు.
కింద షాపువాడితో గొడవపడుతున్న కొడుకు వైపు చూసింది. ఫోన్ పెట్టేసింది.
ఆ రోజు అభి కూరగాయలు తీసుకొచ్చాడు. “ప్రతిసారి నువ్వు ఎందుకు, నేనే వెళ్తాలే” పెద్దోడయ్యాడు, బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూసింది, మనసు నిర్మలమైంది. మెల్లగా వెళ్ళి సోఫాలో కొడుకు పక్కన కూర్చుంది.
“అభి… నా ఫ్రెండ్ క్రాంతి నిన్ను కలవాలన్నాడు. రేపు బేకరీ దగ్గర కలుస్తాడు. వాళ్ళింటికి తీసుకెళతాడు. సరేనా?”
అభావంగా తలాడించాడు అభి.
‘జన్మనిచ్చినవాడి చేతిలో నా భవిష్యత్తు ఉండటం, ప్రేమను పంచినవాడి చేతిలో నా ప్రేమకు సొల్యూషన్ ఉండటం’ చిత్రం అనిపించిందామెకి.
“నేను వెళ్ళను.” అన్నాడు అభి. అనుకున్నంతా అయ్యింది. గుండెదడ పెరిగింది, తడబడుతూ “ఎందుకూ?” అంది.
“అతను నువ్వు పాడే పాట పాడుతున్నాడు, నువ్వు నన్ను బుజ్జగించినట్లు బుజ్జగిస్తున్నాడు. అందుకే అతనితో వెళ్ళలేదు వాళ్ళింటికి.”
“నువ్వు అందరికీ నచ్చుతావు.”
“నువ్వేం అంటున్నావో నాకు అర్దం అయింది, మమ్మీ. నేను మరొకరిని నీ పక్కన ఊహించలేను, నాకు నాన్న రోజూ గుర్తొస్తాడు.” కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. కొడుకుని గుండెకి హత్తుకుంది.
అక్వేరియంలో చేప ఒకటి ఎగిరి బయటపడింది, లోపల వేసేలోపే ఊపిరిపోయింది. దోసిట్లో పెట్టుకుని కుములుతున్న అమ్మని చూసి అతని దుఃఖం చప్పున ఆగిపోయింది.
డాబా మీద ఒంటరిగా చాలాసేపు ఏడ్చింది.
‘అభికి నేను నచ్చలేదనుకుంటా.’ క్రాంతి మెసేజ్.
యాంత్రికంగా ఉంది ఇదంతా. అతనిలో ముసురు కమ్మి వాన కురుస్తోంది.
“అభికి ప్రేమని తెలుసుకునే మెచ్యూరిటీ లేదు.” అల్క.
“ఇప్పుడెలా?”
“తల్లికి బిడ్డ ఆనందంకన్నా కావాల్సింది ఏముంది?”
“…” అతని మౌనం.
కొత్త చేపని తెచ్చి బౌల్‌లో వేశారు తల్లి, కొడుకు.