అతడే ఒక సముద్రం
‘పోరాడతాను. నా ఒంట్లో ఊపిరున్నంతవరకూ పోరాడతాను.’
కేవలం గాలిలో నిదానంగా వెళ్తున్న పడవ తప్ప దరిదాపుల్లో ఏ దీపాలు, వెలుతురూ లేవు. ఆ చిమ్మచీకట్లో అతను నిజంగానే చనిపోయానేమో అనుకున్నాడు. రెండు చేతుల్నీ దగ్గరకు తెచ్చి అరచేతుల్ని తట్టి చూసుకున్నాడు. అవి సజీవంగా ఉన్నాయి. వాటిని మూసి తెరుస్తుంటే బ్రతుకులోని వేదన అనుభవంలోకి వస్తున్నట్టుంది. పడవ వెనకభాగంలో చెక్కగోడకి ఆనుకున్న దగ్గర భుజాలకి స్పర్శ తెలుస్తుంది. దానివల్ల అతనికి తను బతికే ఉన్నాననిపించింది.
…
నొప్పి తెలీడం వల్లే ఇంకా బతికున్నానని నిర్ధారించుకున్నాడు.
హెమింగ్‌వే రాసిన ది ఓల్డ్‌మాన్ అన్డ్ ది సీకి (The old man and the sea) రవి వీరెల్లి, స్వాతికుమారి తెలుగుసేత అతడే ఒక సముద్రం లోని భాగమిది.
జీవితంలో పంచేంద్రియాల కదలికలే తప్ప జీవిస్తున్నామనడానికి మరే ఇతర ఆధారమూ కనపడని సందర్భాలుంటాయి. దీనికన్నా దుర్భరంగా నొప్పి తెలీడమొక్కటే జీవిస్తున్నామనడానికి సాక్ష్యమయ్యే సందర్భాలూ ఉంటాయి. ఈ కథలో ముసలివాడిలాగే ఇక నాకు పోరాడే శక్తి లేదు, ఆ అవసరం రాకపోతే బాగుండు అని చెప్పుకు నీరసించిపోయే క్షణాలుంటాయి. అంతా అయిపోయిందని లోపలి, బయటి వాతావరణాలన్నీ కలిసి కుంగదీసే కల్లోల క్షేత్రాలుంటాయి. అయినా ఉన్నదంతా పోగేసుకుని పోగేసుకుని పోరాడడం అనివార్యంగా మారే పరిస్థితులుంటాయి. అట్లాంటి ఒంటరి క్షణాల్లో మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఎలా తనకు తాను ధైర్యం చెప్పుకుంటాడు? ఎలా బ్రతికే శక్తిని, పోరాడే శక్తిని కూడదీసుకుంటాడు? చుట్టూ ఎవరైనా ఉన్నా, ఉండకపోయినా, ఈ శాంటియోగో లాగే మాటలకందని ఒంటరితనంలో చిక్కుపడి ఒంటరిపోరాటం చేసేవాళ్ళ గురించి ఎవరికైనా ఏం తెలుసు?
అలాంటి కుతూహలం ఉన్నవాళ్ళకు శాంటియోగోను ఒక ఉదాహరణగా చూపించి, సమాధానాలు ఏ రీతిలో ఉండగలవో విప్పి చూపించిన పుస్తకం, ఈ అతడే ఒక సముద్రం. అనువాదంలో మొదటి కొన్ని పేజీల్లో సంభాషణలు కొంత అసహజంగా అనిపించినా, లెక్కకు మించిన సాంకేతిక పదాలు పఠనీయతను తగ్గించే రీతిలో అడ్డం పడినట్టున్నా, కథ ముందుకు సాగేకొద్దీ పాఠకులను పూర్తిగా తనలో లీనం చేసుకునేలా ఉంది కథనం. శాంటియోగో సముద్రం లోలోపలికి వెళ్తున్నకొద్దీ ఉత్కంఠ పెరిగి అతని మనఃపరిస్థితితో పాఠకులు మమేకమయ్యేలా ఆర్ద్రంగా కథనాన్ని సాగించడంలో అనువాదకులు సఫలమయ్యారు. ప్రత్యేకించి, వర్ణనలున్న చోట స్వతహాగా కవులైన ఇద్దరు అనువాదకులూ పదం పదం ఆచితూచి ఎంచుకున్న జాగురూకత కనపడి ఆకట్టుకుంటుంది.
ఇప్పుడతనికి తీరపు ఆకుపచ్చ రంగు కనపడటంలేదు. మంచుపూత పూసినట్టున్న నీలికొండల అంచులు, వాటిపైన మంచుకొండల్లాగా తారట్లాడే మబ్బులు మాత్రమే అతనికి కనపడుతున్నాయి. చిక్కటి సముద్రం మీద కాంతి పరుచుకుని అద్దంపలకల్లా కనిపిస్తుంది.
చిట్టచివరి అంకంలో మానవససహజమైన పోరాటపటిమను పట్టుసడలకుండా చెప్పుకొచ్చారు. ఈ పుస్తకపు ఆత్మ ఉంది ఇక్కడే. ఎన్నో మెరుపుల్లాంటి వాక్యాలు అడుగడుగునా ఎదురై, స్పూర్తివంతమైన గాథను చదువుతున్నప్పుడు నరాల్లో నిండే ఉత్సాహాన్ని పరిచయం చేస్తాయి. ఆ అనుభవం కోసమైనా ఈ పుస్తకాన్ని చదవాలి. మచ్చుకు కొన్ని:
– మనుషులను నాశనం చేయచ్చు కానీ ఓడించడం కష్టం
– బొత్తిగా నిరాశపడటం తప్పు. పాపం కూడా.
– ఓటమి ఇంత తేలిగ్గా ఉంటుందని నాకిన్నాళ్ళూ తెలియలేదు. నన్ను ఓడించేదెవరో కూడా నాకు ఇన్నాళ్ళూ తెలియలేదు.
– “ఐనా అదృష్టాన్ని ఏం పెట్టి కొనుక్కుంటాను? ఏముంది నా దగ్గర?”
సముద్రమ్మీద ఎనభై నాలుగు రోజులుగా పట్టువదలకుండా ప్రయత్నం చేసిన అనుభవం నీ దగ్గరుంది.
ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే ఈ నవల వివరాలు:
రచన: అతడే ఒక సముద్రం
ప్రచురణ: వాకిలి ప్రచురణలు
వెల: 135/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలు, అమెజాన్.