చూశావా

నన్ను చూశావాలో ఇరుక్కోకు
జీవితం బావుంటుంది అన్నాడతను
పూవుని పూవుకన్నా కోమలంగా
తాకటానికి ప్రయత్నిస్తూ

నేను చూశానులో కూడానా అన్నాను
గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవడానికి చూస్తూ

రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను

కీచురాయి పాట ఎత్తుకుంది
కాలం దానిలోకి జలపాతంలా దూకింది.


బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...