ఆంధ్రుల చరిత్రలో వెలుగు చూడని కొన్ని ఘట్టాలు 3: ముబారిజ్ ఉద్దౌలా
నిజాం సికిందరుజా 1829 జూన్ నెలాఖరున చనిపోవగా ఆయన పెద్ద కుమారుడైన వజీరు ఉద్దౌలా నిజామై 1857 వరకును పరిపాలించెను. ఇంగ్లీషు రెసిడెంటుగారాయనను అభినందించుటకు దర్బారుకు వెళ్ళగా కొత్త నిజాముగారు తన రాజ్యములోని ఫరంగీయుద్యోగులు చాలా హెచ్చుగా ప్రభుత్వాధికారములు చెలాయించుచున్నారనియు, వారిని తీసివేయవలెననియు రెసిడెంటును కోరెను. అయితే తన తండ్రిగారి కోరికపైననే యీ ఆంగ్లేయోద్యోగులు నియమంపబడియున్నందున అతడు కోరినట్లు వారిని వెంటనే తీసివేయక ఉపేక్షవహించిరి.
నిజాముగారు ఆరడుగుల పైగా ఎత్తుగల ఆజానుబాహుడు. మంచి స్ఫురద్రూపి. నీలవర్ణపు తార్తారీనయనములవారు. ఈయన సోదరుడైన ముబారిజుద్దౌలా కొందరు అరబ్బులను ఆఫ్గనులను చేరదీసి 1830లో హైదరాబాదులో స్వేచ్ఛావిహారము చేయుచు తవ అన్నగారినేవో కొన్ని కోరికలు కోరసాగెను. అతడు బలవంతుడుగానున్నందున అల్లరులు జరుగుటకు సిద్ధముగా నుండగా ఇంగ్లీషు సేనాధిపతియైన కర్నల్ స్టీవార్టును బొలారం నుండి ఒక సైనికదళమును పంపి అల్లరులనణచవలసినదని నిజాముగారు కోరిరి. అంతటనొక బ్రిగేడియరును సైనికదళమును రెండు ఫిరంగులను ఇచ్చి పంపి ముబారిజుద్దౌలాగారిని హైదరాబాదు వదలి, గోలకొండకు పోయి అక్కడనుండవలసినదనియు తన అన్నగారితో తనకుగల తగవులను పరిష్కరించుకొను విషయమున దౌర్జన్యమునకు దిగక అన్నగారిపైన భారమువేసి ఓపికపట్టి యుండవలసినదనియు చెప్పి ఒప్పించిరి. అతడక్కడకు పోయిన పిమ్మటనొక క్రొత్త చిక్కు కలిగెను. గోలకొండ కోటలో అప్పుడు పదిలక్షల నవర్సులు ఖజానాలో నుండెను. దానిని తీసుకొని వచ్చుటకై నిజాముగారొక అధికారిని, కొంత సైనిక సిబ్బందినిచ్చి పంపిరి. అయితే ముబారిజుఖాను వారిని ఖజానాను తీసికొని పోనివ్వక ఆటంకపరచిరి. అధికారికి తగిననంత సైనిక బలము లేనందువలన నతడు చేయునది లేక కోటగుమ్మం దగ్గర సైనికులను కాపలాయుంచెను. అంతట, హైదరాబాదు నగరమునందు గొప్ప అలజడి కలిగెను. అప్పుడు అయిదువేల మంది అరబ్బులు రోహిలాలు శిక్కులు మొదలైన జాతీయ సైనికులను, పూర్వకాలపు ఫ్రెంచిలైను సైనికులను నిజాముగారు గోలుకొండకు పంపగా వారక్కడ విడిసియుండిరి. అయినప్పటికి ముబారిజుద్దౌలా భయపడలేదు. ఆ సైనికులలో కొంతమంది ఈరాజకుమారునిపట్ల సానుభూతి కలిగియున్నవారని అందరికిని తెలిసిన విషయమే. అంతట కొన్నాళ్ళపాటు నిజాముగారి మంత్రులకు రాజకుమారునికి రాయబారములు జరిగెను. కాని ప్రయోజనము లేకపోయెను. అందువలన నిజాముగారి మంత్రి బొలారములోని ఇంగ్లీషు సైన్యము యొక్క ప్రధానాధికారిని సహాయము చేయవలసినదని కోరెను.
అప్పుడు 1831 జనవరి నెల 6వ తేదీన ఇంగ్లీషు కంపెనీ సైనికదళము ఢిల్లీ దర్వాజాకు ఉత్తరమున కుతుబ్‌షాహి సుల్తానుల గోరీల దగ్గర దండు విడిసిరి. గోలుకొండ కోటలోపల రాజకుమారుడు తన సైన్యముతోనుండెను. కోట వెలుపల ప్రాకారములో నిజాముగారి సైన్యములుండెను, వీరుకూడ ఇంగ్లీషువారి సైనిక దళమును శత్రుసైన్యముగనే పరిగణించి వారిని లోపలికి రానివ్వలేదు. కోటగోడలమీది ఫిరంగులను బారుచేసియుంచి ముందుకువచ్చినచో గ్రుండ్లు ప్రేల్చెదమని బెదిరించినట్లుగా వానిని పెట్టియుంచిరి. ఇంగ్లీషు సైనిక కెప్టెను మెడోసు టెయిలరు ఒక దినమున నాయావరణము వెలుపల కందకము ప్రక్కకు తన గుర్రముపైన పోవగానచ్చటి సైనికులాయనను వెనకకు పొమ్మని నిర్మొగమాటముగా హెచ్చరిక చేసిరి. టెయిలరు ఆ కందకమును చూడగానది చాలా వెడల్పు కలిగియుండెను. అతడు అక్కడి నిజాముగారి సైనికులతోనేదో లోకాభిరామాయణము మాట్లాడినట్లుగా నాలుగు మాటలు మాట్లాడి మంచిచేసుకొని మర్యాదగా వెనుకకు వచ్చివేసెను.
ఇంగ్లీషు సైనికదళమువారు ఫిబ్రవరి 15వ తేదీవరకును ఏమియు కదలిక లేకనేయుండిరి. ఆదినముననాకస్మికముగా ఇంగ్లీషుసైన్యమును కోటలోనికి పోవలసినదనియును కోటలోపలనున్న నిజాముగారి సైన్యమును వెలుపలికి రావలసినదనియును ఉత్తర్వులు చేసిరి. ఇంగ్లీషు సైన్యము కోటలోపల ఆవరణము లోనికిపోయి రాజకుమారుడున్న రాజప్రాసాదమునకును ఖజానాయున్న కొట్లకును మధ్యగా తమ శిబిరమును స్థాపించి వెంటనే కాపలా నిమిత్తము అన్నిప్రక్కలను సైనికులను నిలిపిరి. ముందువరుసలో కెప్టెను మెడోస్ టెయిలరుగారి నాయకత్వము క్రింద నాలుగు కంపెనీల సైనికులును, రెండు ఫిరంగిబండ్లునుండెను. అతడు ఫిరంగులలో మందుగుండు సామగ్రి కూరించి సిద్ధముగానుంచెను. రాజకుమారుని పరివారము ఈ సన్నాహమును చూచుచుండిరి. నిజాముగారి మనుష్యులు ఖజానా కొట్లలోనికి పోయి అందులోని రూపాయీల సంచులను అవతలికి మోసుకొనిపోవసాగిరి. ఇది నాలుగురాత్రిళ్ళు, నాలుగుపగళ్ళును పట్టెను. ఈ నాలుగురోజులును కెప్టెన్ టెయిలరుగారు కదలుటకు మెదలుటకు వీలులేక బట్టలుకూడా మార్చుకొనలేదు. ఆ సమయమున రాజకుమారుడు చేర్చిన అరబ్బీసైనికులు మ్రోగించు ఒకవిధమైన తప్పెటలధ్వని నిరంతరము చెవులలో ధ్వనించుచుండగా ఇదిగో వారువచ్చి పైబడిపోవుచున్నారను వదంతులవలన గుండెలదురుచుండగా టెయిలరుగారును తన సైనికులును అప్రమత్తులై యుండవలసివచ్చెను. అయిదవదినము ఉదయమున రాజకుమారుని దగ్గరనుండి ఒక రాయబారమువచ్చెను. ఆయన తన పరివారజనమును మాత్రము తనదగ్గరనుంచుకొని తాను చేర్చిన ఆయుధపాణులైన అరబ్బులను పంపించివేసెదనని కబురంపెను. టెయిలరుగారి సైనికులనింక వెనుకకు పంపవచ్చునని యొకయుద్యోగి వచ్చి చెప్పెను. ఆ వార్తవిని టెయిలరుగారు సంతోషించిరి. ఆయనక్రింది సైనికులు ఆయన గౌరవార్థముగా ‘బోలో మహదేవబాబాకీ జేయ్’ అని ఆకాశము చిల్లులుపడునట్లు అరచిరి. అతడు తన క్రిందిసైనికుల యనురాగమునకు పాత్రుడైయుండినందులకిది గొప్పనిదర్శనముగానుండెను. అతనికి మొదటనిది అర్థముకాలేదు. అయితే ఆయన దళములోని ఫిరంగులను జాగ్రత్తగా కనిపెట్టియుండుటకు నియోగింపబడిన టెయిలరుగారి స్నేహితుడీ జయఘోష ఆయన గౌరవార్థం చేయబడినదేనని అతనికి చెప్పి ఇకముందీబిరుదు అతనికి శాశ్వతముగా నిలుచునని, అతడదృష్టవంతుడు అనిచెప్పి, దాని నిదర్శనముగానతడు సైనికులవంకకుదిరిగి ‘బోలో మహదేవబాబాకుజేయ్’ అని హెచ్చరించగా వారు మరలనట్లు జయజయధ్వానములు చేసిరి.
ముబారిజ్ ఉద్దౌలా, వాహబీల కుట్ర
ఇక్కడ పనియైపోయినందున సైన్యమెల్ల మరల బొలారమునకు పోవదలచెను. కాని నిజాముగారు ఆరుకంపెనీలవారిని కోటలోనే యుంచవలసినదని కోరగా, ఆంగ్లసేనాధిపతియట్లా సైనికదళములో కొంతభాగమునక్కడ నిలిపి దానికి టెయిలరుగారినే అధిపతిగా నియమించెను. రాజకుమారుడు మరల ఆయుధపాణులను కోటలోపల చేర్చకుండా చూచుటకును, రెసిడెంటుగారికిని రాజకుమారునికిని జరుగు ఉత్తర ప్రత్యుత్తరములు పరిశీలించుటకును పారశీ భాష తెలిసిన టెయిలరుగారు నియమింపబడిరి. ఇదివరకే రాజకుమారుడు నిజాముగారికిని, ఆయన మంత్రిగారికిని, రెసిడెంటుగారికిని వ్రాయుజాబులలో చాలా అగౌరవముగా వ్రాయుచుండిరి. అందువలన ఆయన వ్రాయు జాబులనెల్ల విప్పి చూడవలసినదనియు అవి పూర్వపు ధోరణిలోనే యున్నచో వానిని పంపవలదనియు వీలైనచో నీయన్నదమ్ముల మధ్యగల వివాదములను సర్దుబాటు చేయుటకు ప్రయత్నించవలసినదనియు రెసిడెంటుగారు టెయిలరుగారికి చెప్పిరి. అంతట టెయిలర్‌గారు అక్కడ కొన్నాళ్ళు ఆపనిని చూడసాగిరి. కొన్ని దినములవరకును ఆ రాజకుమారుడు వీరిని గమనింపక ఉపేక్షించెను. టెయిలరుగారు చిన్న పడవనొకదానిని తెప్పించి కోటగోడలను అంటియున్న తటాకములో పడవ షికారుచేయుట ప్రారంభించిరి. రాజకుమారుడొక టెలిస్కోపుతో వీరిని చూచుట మొదలిడెను. ఈ సంగతి టెయిలరుగారు గ్రహించిరి. తుదకు రాజకుమారుని మున్షీగారొకదినమున టెయిలరుగారికి కనుచూపుమేరలో వచ్చి నిలిచిరి. అంతట పడవలోనికి రండని టెయిలరుగారాయనను ఆహ్వానించిరి. అంతట ప్రతిదినము ఉదయమును, మధ్యాహ్నమును మంచి వంటకములు బహుమతిగా వచ్చుట ప్రారంభమయ్యెను. కొంత స్నేహభావము కుదిరెనని టెయిలరుగారు రెసిడెంటుగారికి తెలిపిరి.
అటుపిమ్మట రాజకుమారుని లేఖలు రెసిడెంటుగారి పేరిట వొకటి, నిజాముగారి పేరిట నింకొకటి వచ్చెను. అందులోని భాష చాలా తీవ్రముగా నుండెను. వానిని టెయిలరుగారు త్రిప్పివేసిరి. పదునైదు దినములవరకు నిట్టిలేఖలే వచ్చుటయు, టెయిలరుగారు వానిని త్రిప్పివేయుటయు జరిగెను. చేపను వలలో వేసితివని రెసిడెంటుగారు టెయిలరుగారితో ఛలోక్తిగా పలికి ‘అతడింకను బెట్టు వదలలేదు. నేనిప్పుడే జోక్యము కలిగించుకొనను’ అనిరి. తరువాత కొన్ని దినములకు రాజకుమారుడు మౌనము వహించెను. కాని ఇది ఎంతకాలమో నిలువలేదు. ఒక దినము సాయంకాలము మున్షీగారు కొన్ని మంచి పిండివంటలను టెయిలరుగారి కొరకును, మంచి భోజనమును ఆయన సైనికులకందరకును తెచ్చియిచ్చి ‘రాజకుమారుని ఆత్మగౌరవము మీ హస్తములయందున్నది. అందరికి అంగీకారముగా నుండులాగున మీరొక లేఖను తయారుచేయుడు’ అని మున్షీగారు రాజకుమారుని మాటగా చెప్పిరి. టెయిలరుగారొక జాబుయొక్క చిత్తుప్రతిని తయారుచేసిరి. దానిని రాజకుమారుడు చూచి ఆగ్రహించి నా పరువును మీరింత అలుసుగానెంచితిరని టెయిలరుగారిని దూషించిరి. ఆ లేఖయొక్క మతలబులోని భాష విషయమై వారము దినములు పెనగులాట జరిగెను. ఎట్టకేలకు టెయిలరుగారికిష్టము వచ్చినట్లు వ్రాసి తీసికొనిరమ్మని రాజకుమారుడు మున్షీగారికి చెప్పిపంపిరి. టెయిలరుగారు ముందుగా నింగ్లీషులో నొక చిత్తును తయారుచేసి దానిని వ్రాసి రాజకుమారునికి పంపిరి. అంతట నా మరుసటిదినము మధ్యాహ్నము ఆ లేఖను రాజకుమారుని సంతకముతో మున్షీగారు తెచ్చిరి. వీరుభయులును పడవలో షికారు చేయుచుండగా రాజకుమారుడొక తెల్లని జండాను ఆడించుచు సంజ్ఞ చేయసాగెను. టెయిలరుగారు తన చిన్నయోడ ‘జోరా’లో నుండి చిన్నమూతి ఫిరంగులనుండి పండ్రెండు గుండ్లను ఆకాశములోనికి పేల్చి రాజకుమారునికి జోహారులొనర్చిరి. ఆ మరునాడాలేఖలను టెయిలరుగారు రెసిడెంటుగారి దగ్గరకు తీసికొనివెళ్ళిరి. అందులో నిజాముగారి పేర వ్రాయబడిన లేఖను వెంటనే నిజాముగారికి పంపివేసిరి. ఈ లేఖ బాగుగనె యున్నదని నిజాముగారు సెలవిచ్చిరి. తమ తల్లిగారిని గోలకొండకు పంపి తన తమ్మునికి కొన్ని వాగ్దానములను గావించి అతనిని హైదరాబాదుకు రప్పించుటకు తగిన ఏర్పాటు చేయవలసినదని నిజాముగారుత్తరువు చేసిరి. టెయిలరుగారు గోలకొండకు తిరిగి వెళ్ళునప్పటికే నిజాముగారి తల్లిగారైన బీగం సహిబాగారు అక్కడకు వచ్చియుండిరి. తాను తన కుమారుడును ఒకరినొకరు కౌగలించుకొని యేడ్చితిమని ఇరువురు స్త్రీ పరిచారికల ద్వారా ఆమె టెయిలరుగారికి కబురంపిరి. ఒకటి రెండుదినములలో తగిన గౌరవముతో ముబారిజుద్దౌలాగారిని హైదరాబాదునకూరేగింపుతో తీసుకొని వెళ్ళిరి. తమ కుటుంబమునకింత గొప్ప సేవనుచేసినందులకు నిజాముగారు టెయిలరుగారికి వందనములు చేసిరి. అన్నదమ్ములు సఖ్యతపడిరి.
అటుతరువాత కొంతకాలమునకు టెయిలరుగారికి పెండ్లి నిశ్చయమైనట్లు ముబారిజుద్దౌలాగారు విని తమ కార్యదర్శిని టెయిలరుగారి యొద్దకు పంపి పారశీ భాషలో నొక అభినందన పత్రమును వెండి పళ్ళేరములోనుంచి దానిపైన బంగారు జరీబుటేదారి పనిచేసిన పట్టువస్త్రమును కప్పి ఆ పత్రికకు జతపరచిన జాబితాలో చెప్పబడిన బహుమతులను తమకు టెయిలరుగారు చేసిన సేవకు బహుమానముగా పంపుచున్నామనియు, వానిని స్వీకరించవలసినదనియు కోరిరి. అందులో విలువగల శాలువలు, అమూల్యములైన హారములు, శిరోభూషణములు, వజ్రములు మొదలైన రత్నములు తాపిన తోడాలు, రత్నములు తాపిన బంగారు ఒడ్డాణము, ఏడువరుసల మంచిముత్యాల హారము, నింకొక వజ్రము తాపిన పతకము ఇరువదివేల రూపాయలు విలువగల బహుమతులుండెను. అయితే టెయిలరుగారు సైనికోద్యోగి యైనందున ఆ యుద్యోగ నిబంధనల ప్రకారము అట్టి బహుమానములను స్వీకరింపవీలులేనందున రాజకుమారుడు చూపిన యనుగ్రహమునకు టెయిలరుగారు కృతజ్ఞతాసూచకమైన వందనములర్పించి బహుమతులు వలదనిరి. (Story of My Life. Meadows Taylor. PP. 71-76.)
వాహబి కుట్ర
వాహబీలనువారు తీవ్రమతావేశపరులగు మహమ్మదీయులు. వీరు హిందువులనేగాక పందిమాంసము తిను ఆంగ్లేయులను కూడా కాఫరులని ద్వేషించుచుండిరి.
ఇంగ్లీషువారు హిందూదేశములోని మహమ్మదీయ సామ్రాజ్యమును నాశనముచేసి రాజ్యాక్రమణ చేయుటయేగాక ప్రక్కనున్న మహమ్మదీయ రాజ్యమగు ఆఫ్గనిస్థానము యొక్క రాజకీయములందు జోక్యము కలిగించుకొని దోస్తు మహమ్మదుకు బదులుగా షాషుజాను సింహాసనమెక్కించుటకు కుట్ర చేసిరి. 1838 అక్టోబరు 1వ తేదీన సిమ్లాలో నీవిషయమై ఒక ప్రకటన చేసిరి. ఆఫ్గనిస్థానములో తీవ్రముగా యుద్ధము జరుగుచుండెను. ఇంగ్లీషువారు పంపిన దేశీయసైన్యములు చాలా బాధలనుభవించి నాశనమయ్యెను.
ఈ సమయమున నీయింగ్లీషువారిని మనదేశమునుండి వెళ్ళగొట్టవలెనని వాహబీలు గొప్ప కుట్ర సాగించిరి. వాహబీ ఫకీరులను దక్షిణ హిందూదేశమున హైదరాబాదునకును, మద్రాసుకు దక్షిణమునగల దూరప్రాంతములకును కూడా పంపి ఇంగ్లీషువారిపైన మతయుద్ధము (జిహాద్) చేయుడని మహమ్మదీయులను ప్రోత్సహించిరి. ఆ యుద్ధము కొరకు సర్వసన్నాహములును జరిగెను. కర్నూలు నవాబైన గులాం రసూలుఖాను వాహబీల కుట్రకులోనై తన కోటలో జనానామందిరముల క్రింద నేలకొట్లను నిర్మించి అందులో గొప్ప ఆయుధాగారమును స్థాపించి మారణాయుధములను, ఫిరంగిబండ్లు, గొట్టములు, ఇనుపగుండ్లు తయారు చేయించెను. హైదరాబాదు నిజాంగారి సోదరుడైన ముబారిజ్ ఉద్దౌలాగారును, ఆయన అనుచరులును యీ కుట్రలో చేరిరి. హైదరాబాదులోని ఇంగ్లీషు సైన్యమునకు చెందిన దేశీయ సిపాయిలను తిరుగుబాటులో చేర్చుటకై వారు కృషిచేసి సిపాయిలలో కొందరి మనస్సులు విరచిరి. అప్పుడు చిత్రచిత్రములైన రహస్యపద్ధతులతో రాజద్రోహ ప్రచారము జరుగుచుండెను. హైదరాబాదులో వాహబీల కుట్ర సంగతి 1839లో ఆకస్మికముగా బయల్పడెను. ఒక పేదరాలికి ప్రాణముమీదికి రాగా ఆమెయొక రక్షరేకును మూసీనదిలో పడవేయమని ఒకరికిచ్చెను. అందులో నీకుట్రకు సంబంధించిన ఉత్తరము బయల్పడెను. అంతట ఇంగ్లీషువారు విచారించగా నీ కుట్రయొక్క ఆనుపానులు తెలిసెను. ముబారిజ్ ఉద్దౌలాగారిని, ఆయన అనుచరులను నలుబదిమందిని పట్టుకొనిరి. ఆయనను గోలకొండ కోటలో ఖైదు చేసిరి. ఆయన అనుచరులను కొందరినురిదీసిరి. ముబారిజ్ ఉద్దౌలాగారు 1854లో చరమ నిర్బంధములోనుండి మరణించిరి.
కర్నూలు నవాబగు గులాం రసూలుఖానుగారి కోటను తనిఖీచేయగా రహస్యాయుధాగారము బయల్పడెను. అంతట ఆయనను పట్టుకొని పదచ్యుతుని చేసి తిరుచినాపల్లిలో ఖైదుచేసిరి. ఆతడక్కడ ఇంగ్లీషువారి మెప్పుకై క్రైస్తవ దేవాలయములో ప్రార్థనలకు హాజరగుట ప్రారంభించెను. అప్పుడొక వాహబీ ఫకీరతనిని వధించెను. (చూడుడు. కందనూరు నవాబు రాజరికము. కథలు గాథలు. 1వ భాగము. శ్రీ దిగవల్లి వేంకట శివరావు; South Indian Sketches. S. Tucker, 1842.)
షోరాపూరు సంస్థానము
హైదరాబాదు నవాబుగారికి కప్పము చెల్లించు సామంతరాజ్యములలో నేటి రాయచూరు జిల్లాలోని షోరాపూర్ సంస్థానమొకటి. దానిని బోయజాతి బేడరు నాయకులు పాలించుచుండిరి. వీరు తెలుగువారు. ఈ సంస్థానమునేలు క్రిష్టప్ప నాయకుని తండ్రి చనిపోవునప్పుడు తన రెండవభార్య కుమారుడైన యీ క్రిష్టప్ప నాయకుడే తన తరువాత రాజ్యమేలవలెనని శాసించెను. పెద్దభార్య కుమారుడైన హనప్ప నాయకుడిది అన్యాయమని, రాజ్యము తనకే రావలెనని దివాను పేష్కారు చందులాల్‌గారితో మొరపెట్టుకొనెను. తన తండ్రి పట్టాభిషేకము జరిగినప్పుడు రెండవభార్యనే తన కుడిప్రక్క కూర్చుండబెట్టుకొనెనని, అందువల్ల ఆమెనే పట్టమహిషిగా పరిగణించినాడని, తననే యువరాజుగా పరిగణించినాడని తనకే రాజ్యము రావలెనని క్రిష్ణప్ప నాయకుడనెను. ఈ తగవు పరిష్కారము చేయుటలో క్రిష్ణప్ప నాయకుడు హైదరాబాదు నిజాముగారికి పదునైదు లక్షల రూపాయలు చెల్లించు పద్దతిని చందూలాల్‌గారతనినే రాజుగా నంగీకరించిరి. ఈ సొమ్ము వాయిదాల ప్రకారము చెల్లించవలసియుండెను. ఆ బాకీ తీరకుండగనే క్రిష్ణప్ప నాయకుడు మరణించెను. అతని మైనరు కుమారుడైన వేంకటప్ప నాయకుడేడేండ్ల పిల్లవాడు. అతని తల్లి ఈశ్వరమ్మ తన కుమారుని పక్షమున రాజ్యాధికారము వహించెను. కొందరు బేడరు నాయకుల కామెపైనిష్టము లేదు. అందువల్ల వారు క్రిష్ణప్ప నాయకుని సోదరుడైన పెద్దినాయకుడు సంరక్షకుడుగా నుండి రాజ్యము పాలింపవలెనని పట్టుపట్టిరి. నిజాము సర్కారువారును ఇంగ్లీషు గవర్నరు జనరలుగారును దీనికంగీకరించిరి. అయితే కొందరు బేడరు నాయకులు పెద్దినాయకునికి వ్యతిరేకులై ఈశ్వరమ్మ పక్షమవలంబించిరి. సంస్థానమున యీతగవులతో అల్లకల్లోలముగా నుండెను. ఈ తగవులను పరిష్కరించి సంస్థానమును పరిపాలించుటకు మెడోస్ టెయిలర్ అను ఇంగ్లీషు దొరను 1841లో చందూలాల్‌గారి కోరికపైన రెసిడెంటుగారు షోరాపూరునకు మేనేజరుగా పంపించిరి. అతడు వెంకటప్ప నాయకుని మైనారిటి తీరువరకును సంస్థాన వ్యవహారములను చక్కబెట్టి రాజ్యమునతనికి వప్పగించెను.
టెయిలరు తన జీవిత చరిత్రలో ఈ సంస్థానమును గురించి, ఈశ్వరమ్మగారినిగూర్చి, వేంకటప్ప నాయకుని గూర్చి చాలా విశేషములు వ్రాసియున్నాడు.
హైదరాబాద్ సంస్థానములో అల్లకల్లోల పరిస్థితులు
క్రీ. శ. 1769-1793 సంవత్సరములలో తెలంగాణమునందు ఘోరమైన కరవులు వచ్చెను. హైదరాబాదు నగరములోనే తొమ్మిది వేలమంది చచ్చిరి. ఇండ్లలో చచ్చినవారి మాట లెక్కలేదు. రాయచూరు జిల్లాలో రెండువేలమంది పాలెవాండ్రలో ఆర్గురు మాత్రము కరవు అనంతరము జీవించియున్నట్లు తెలిసినది. దేశమంతయు పుర్రెలతో నిండియుండినందువలన దీనికి పుర్రెల కరవని పేరు వచ్చినది. 1804లో మరల కరవువచ్చెను. అదివరకు రూపాయకు ఆరుశేర్లు అమ్ముచుండిన రాగులు రెండున్నర శేర్లు అమ్ముచుండిరి. కొందరు మనుష్యులనే చంపి తినిరని ‘బిల్ గ్రామీ’గారు వ్రాసినారు. మరల 1831లో వచ్చిన క్షామమున పిడికెడు గింజలకు పిల్లలనమ్ముకొనసాగిరి. జొన్నలు రూపాయకు 3, 4 శేర్లు అమ్మిరి. జనులు ఆకులు అలములు తిని జబ్బుపడి చావసాగిరి. 1854లో వచ్చిన కరవులో వీధులు పీనుగులతో నిండెను.
ఈ కరవుల ఫలితముగా ప్రజలు అప్పుల పాలైరి. మార్వాడీలు రైతుల ధాన్యమును కొట్లలో పోసి ధరలు పెంచిరి. అరబ్బులు, రోహిలాలు హైదరాబాదులో రెండువందలఏబది సంవత్సరముల నుండి కని విని ఎరుగని పద్దతిని నూటికి నాలుగు వందలు వడ్డీని పుచ్చుకొనుచు బాకీలను తీర్చనివారిని పొడిచి చంపి వసూలు చేయుచుండిరి. అరబ్బులు ‘రాజారాంబక్షు’ అను నిజాంగారి మంత్రిగారికి ఋణమిచ్చి అతడు బాకీ తీర్చకపోగా అతనిని బాధింపసాగిరి. అంతట అతడు నిజాముగారి దివాణములో దాగికొనెను. అరబ్బుల దౌర్జన్యము విరీతముగనుండెను. బాకీలు తీర్చనివారిని జమాదారుల యిండ్లలో పెట్టి అన్నము నీరునివ్వక బాధించుచుండిరి. పటానులును అరబ్బులును జాగీరుదారులకప్పులిచ్చి 80 లక్షల ఆదాయముగల జాగీరులను తమ వశములో నుంచుకొనిరి. హైదరాబాదులో న్యాయస్థానములలో బాకీలకు డిక్రీలు పొంది అమలుచేయు ఆచారము లేనందున కోమట్లకు, వ్యాపారులకు బాకీలు వసూలు కానప్పుడు వారు ‘రోహిలాల’ను అరబ్బులను పంపి వారిచేత దౌర్జన్యముగా బాకీలు వసూలు చేయుచుండిరి. వారు బలవంతముగా సామానులను లాగికొని వచ్చుటగాని, జంబియాలతో పొడిచి వసూలుచేయుటగాని చేయుచుండిరి. రోహిలాలు, అరబ్బులు బాకీలు వసూలు చేయుటకు ఋణగ్రస్తులపైన రాతిబండలుంచి, వాతలుపెట్టి వసూలు చేయుదురు. ఋణగ్రస్తుడు పారిపోకుండ కాపలాయుంచి కాపలావారి కూలిని కూడా వసూలు చేయుచుండిరి. జనులు తమ బాకీల కొరకు పిల్లలను కూడా అమ్ముకొనుచుండిరి.
తెలంగాణములో భూములను గుత్తకిచ్చుచుండిరి. గుత్తదారు రైతుల వద్ద ధాన్యభాగమును తీసికొని సర్కారుకు రూపాయలు రొక్కముగా చెల్లించుచుండిరి. భూములకు నిర్ణీతమైన శిస్తులుగాని, పన్నులుగాని లేవు. దేశపాండ్యాలు, దేశముఖులు మొదలైనవారు భూమి పన్నులనేగాక మగ్గము పన్ను, కలాలీ పన్ను, తోళ్ళ పన్ను, పెండ్లి పన్ను, పీనుగుల పన్ను, తోకపన్ను మొదలైన చిల్లరమల్లర పన్నులనేకములను వసూలు చేయుచుండిరి.
ప్రతి గ్రామములోను జాగీరుదారులు వ్యాపారులను బాధించి సరుకులపైన సుంకములను లాగుచుండిరి. అందువలన 1800 మొదలు 1855 వరకును హైదరాబాదు రాష్ట్రమునందు వ్యాపారము క్షీణించెను. హైదరాబాదు ప్రభుత్వము ఆంగ్లేయ సైనికవ్యయము కొరకును, పరిపాలనానిర్వహణ కొరకును అప్పులు చేయుచునేయుండెను. దివాన్ పేష్కారు రాజా చందులాల్‌గారు దేశములోని అరబ్బులు, పఠానులు, గోసాయిలు, సైనిక నాయకులు, స్థానికులైన షాహుకారులు మొదలైనవారందరి దగ్గరను హెచ్చు వడ్డీలకు రుణములు చేయుచు ప్రభుత్వము సాగించుచుండిరి. క్రమక్రమముగా హైదరాబాదు జిల్లాలపైనవచ్చు రివిన్యూ ఆదాయమంతయూ తాకట్టుపెట్టి బుణములు తీసుకొనవలసివచ్చెను. విజాతీయ సైనికుల మూకనాయకులు అప్పులిచ్చి తమ సైనికులకు ఉద్యోగములు సాధించుచుండిరి. ప్రజల వలన చాల కఠిన పద్దతులతో పన్నులు వసూలు చేయసాగిరి. సర్కారుకు ముందుగా సొమ్ము చెల్లించి, నజరానానిచ్చి వివిధ జిల్లాలలో నుద్యోగము చేయుటకు వెళ్ళినవారందరు హైదరాబాదు నగరములో నుండి తమ గుర్రములపైన బోవునప్పుడు వెనుకనేమి జరుగుచున్నదో అని తమ ముఖములను గుర్రపుతోకల వైపునకే త్రిప్పి–కూర్చుండి పోవుచుండిరని ప్రజలు హాస్యమునకనుచుండిరి. జిల్లాలలో తాలూకాదారులు పోటీలు పడి ఒండొరులతో పోరాడుచుండిరి. ప్రజలను చిత్రహింసలను పెట్టి బాధించి సొమ్ము వసూలు చేయుచుండిరి. పొలముల పైన పైరు కూడా బాకీల కింద జప్తుచేయబడి కోయుటకు వీలు లేనందున పక్షులు తినివేయుట మూలముగాను, దొంగలు దోచుకొనుట మూలముగాను నశించుచుండెను. హైద్రాబాదు పరిపాలన చాల అధ్వాన్నముగానుండెను. న్యాయపరిపాలన శాఖ, పోలీసు శాఖలందు నీతి లేకపోగా క్రమపద్ధతియైనను లేకుండెను. ప్రభుత్వమువారి సామాన్య దేశీయ సేనలు ఏబది వేలమంది యుండిరి.
ఇందు పదునారు వేలమంది అరబ్బులును, వారికి పుట్టిన సంకరజాతులవారును ఉండిరి. దేశములో అశాంతి ప్రబలెను. రాజబాటల పైన ఖజానాగాని, విలువగల వస్తువులు గాని పోవుచున్నట్లు పసికట్టినచో వానిని దోపిడి దొంగలు బాహాటముగా దోచుకొనిపోవుచుండిరి. అరబ్బులు, రోహిలాలు, సిక్కులు, పఠానులు–మొదలైన విజాతీయుల ఆకతాయి మూకలు హద్దుపద్దు లేక నగరమునందు చెలరేగి ప్రజలను పలువిధములుగా బాధించుచుండిరి. దేశములో ఆలనపాలనలు లేవు. ఈ దేశమును తమ వశము చేసుకొనుటేతప్ప ఇక్కడ శాంతిభద్రతలను క్రమపరిపాలనమును స్థాపించుటకు వేరు మార్గము లేదని బ్రిటిషు ప్రభుత్వమునకు తోచెను. తూర్పు ఇండియా వర్తకసంఘమువారి బ్రిటిషు ప్రభుత్వమునకు కూడా హైదరాబాదు సంస్థానమువారు చాలా సొమ్ము బాకీపడిరి. సేనల జీతము బాపతు బకాయిలు పెరుగుచుండెను. సాధారణముగా నిజాముగారి ఇంగ్లీషు సేనలకు నాలుగు నెలల జీతము బాకీయుండెను. అప్పుడప్పుడింకను హెచ్చునెలల జీతములు బాకీపడుచుండును. ఇదిగాక మహరాష్ట్ర యుద్ధములు జరిగిన పిమ్మట నిజాముగారి వలన స్టయిపెండులు, పించనులు మొదలైన బాపతు సొమ్ము రావలసియుండెను. ఈ పరిస్థితులు దుర్భరములైపోగా రాజా చందూలాల్‌గాగారు తమ మంత్రి పదవికి 1843లో రాజీనామానిచ్చిరి.
చందులాల్‌గారి తరువాత నిజాముగారు పదేండ్ల వరకు తన బంధువులను చాలామందిని ఒకరి తరువాత నొకరిని ప్రధానమంత్రులుగా నియమించిరి. కాని వారందరు అసమర్థులుగానుండిరి. దేశ పరిస్థితులు చక్కబడలేదు. ఇంగ్లీషువారు తమ సైనిక దళముల జీతములు క్రిందను తమకు రావలసిన ఇతర బాపతు మొత్తములను రాబట్టుకొనుటకును నిజాముగారి పైన చర్య తీసుకొందురని అందరు ననుకొనసాగిరి. సంస్థానము యొక్క పరిస్థితులును మరింత దుర్భరములయ్యెను. దూరముగానున్న జిల్లాలలో ఆస్తికిగాని, ప్రాణములకుగాని రక్షణ లేకుండెను. 1848లో డాక్టరు బ్రాడ్లీగారిట్లు వ్రాసిరి: ‘పోలీసు సిబ్బందియు, దాని వ్యవహారములును ఎంతమాత్రమును బాగుగా లేవు. వారికొక పద్దతి లేదు. తమకు తోచినట్లు ప్రవర్తించుచుండిరి.’(అవురంగాబాదు గజిటీరు పు. 783.)
‘థగ్గులు గ్రామములందు బాహాటముగా జీవించుచు బాటసారుల కంఠములు పిసికి చంపి విశేష ధనమునార్జించి సుఖజీవనము చేయుచుండిరి. కొన్ని గ్రామములవారు శాంతి స్థాపించుటకు వచ్చిన ఇంగ్లీషు సేనల కెదురుతిరిగి పోరాడుచుండిరి. స్థానిక ప్రభువులు కొందరు థగ్గులను పట్టుకొనకుండా తమకాటంకము కలిగించిరని థగ్గుల నివారణకొరకు నియమింపబడిన ఆంగ్లేయోద్యోగియైన కెప్టెన్ రేనాల్డ్సువారు వ్రాసినారు. (Administration of the East India Co., Kaya P. 373.)
సంస్థానమునందు బందిపోటులును, దోపిళ్ళును వృద్ధియయ్యెను. రాజ్యములోని చిన్న చిన్న సంస్థానములవారు హైదరాబాదు ప్రభుత్వాధికారములను తృణీకరించి కప్పము కట్టుటకు నిరాకరించి బకాయిలు పెట్టసాగిరి.
ఇట్టి కల్లోలములందు మునిగియున్న హైదరాబాదు సంస్థానమును సంస్కరింపవలెనన్నచో దీనినింగ్లీషు ప్రభుత్వమువారు వశపరచుకొని వారియుద్యోగులద్వారా పరిపాలించుట తప్ప గత్యంతరము లేదని రెసిడెంటుగారైన జనరల్ ఫ్రేజరుగారు వ్రాసిరి. సివిల్ పరిపాలనా శాఖలోను, సైనిక శాఖలోను సంస్కరణములు చేయుట అవసరమని స్పష్టీకరించినారు. అప్పటి గవర్నరు జనరలైన ‘డల్‌హౌసీ’ ప్రభువు 1848లో యీ రాజ్యము విషయమున ఇంగ్లీషువారు జోక్యము కలిగించుకొనవలసివచ్చునని గ్రహించెను. అయితే రాజ్యమునంతయు వశపరచుకొన నక్కరలేదనియు, బాకీ క్రింద కొన్ని జిల్లాలను స్వాధీనపరచుకొనిన చాలుననియు నిశ్చయించెను. ఈ సందర్భమున షోరాపూర్, రాయచూర్ జిల్లాలనుగాని, బీదారు పరగణానుగాని వశపరచుకొనుట యుక్తమని అప్పుడు హైదరాబాదు సంస్థానమున నుద్యోగము చేయుచుండిన మెడోస్ టెయిలర్‌గారు సూచించిరి. డల్‌హౌసీ ప్రభువు బీదారును బ్రిటిషువారికి స్వాధీనపరుపవలసినదని నిజాముగారిని కోరిరి. అయితే, తన రాజ్యములో నేభాగమునుగాని ఇంగ్లీషునారికిచ్చినచో తన మర్యాద పోవునని నిజాముగారు గోలపెట్టి, తన స్వంత సొమ్ములో నుండి ముప్పయి లక్షల రూపాయలను 1851 నవంబరు నెలలో ఇంగ్లీషువారి సేనల జీతముల బాకీ క్రింద తాను చెల్లించెను. తరువాత నిజాముగారు తన జవాహరీని వెండి బంగారు వస్తువులను షాహుకారులవద్ద కుదువబెట్టి 80 లక్షల రూపాయలు తెచ్చి సేనలకు రెండు నెలల జీతము క్రింద చెల్లించిరి. హైదరాబాదు రాజ్యము యొక్క పరిపాలనకు కావలసిన సొమ్ము ఆ సంస్థానప్రభుత్వ ఖజానాలో లేదు. నిజాముగారి నేలమాళిగలందు కోట్లకొలది ధనమున్నదని ప్రతీతి. కాని, దాని సంగతి ఎవ్వరికి తెలియదు. సంస్థాన ప్రభుత్వమువారికి కావలసిన సొమ్మును సేకరించుటకు నిజాముగారనేక మార్గములను నవలంబించిరి. అందులో నజరాణాల పద్దతి యొకటి. ప్రతి తాలూకాలోను, ఏ యుద్యోగము కావలసినవారైనను దానికి ప్రతిఫలము క్రింద కొంత రొక్కమును చెల్లించవలెను. 1850లో హైదరాబాదు, నిజాము రాజ్యముయొక్క రాబడి మొత్తము మూడుకోట్ల రూపాయలలో రెండుకోట్ల 31 లక్షల రూపాయలను సైన్యమే మ్రింగుచుండెను.
1853లో నిజాముగారికి రెండుకోట్ల 70 లక్షల రూపాయలు ఋణముండెను. వెంటనే బాకీలను చెల్లించవలసినదనియు, ఇంగ్లీషు సేనల జీతములను సక్రమముగా చెల్లించుచుండవలసినదనియు, లేనిచో ఇంగ్లీషు దొరతనమువారు మిమ్ములను తమ కాలి క్రింద మట్టిగాచేసి వూరుపేరు లేకుండా చేయగలరనియు గవర్నర్ జనరల్ డల్‌హౌసీగారు నిజాముగారికి కఠినముగా వ్రాసిరి. ఈ సంగతి పార్లమెంటు చర్చలందు వెల్లడింపబడెను. డల్‌హౌసీగారి రహస్యలేఖలలో కూడా యీసంగతి యుల్లేఖింపబడినది.
ఆ వెంటనే కొన్ని జిల్లాలను స్వాధీనపరచనిచో దండయాత్ర చేయుదునని ఆ ప్రాంతములనున్న సేనాధిపతి మేజర్ డేవిడ్‌సన్‌గారు నిజాముగారిని బెదిరించిరి. అంతట తన రాజ్యమే పోవునని భయపడి నిజాముగారు 1853లో బ్రిటిష్ ప్రభుత్వమువారు నిర్ణయించిన రాజీ షరతులకంగీకరించిరి.
1853లో బ్రిటిష్‌వారు నిర్ణయించిన సంధిషరతుల ప్రకారము నిజాముగారు సాలుకు ఏబదిలక్షల రూపాయలు ఆదాయము రాగల నలదుర్గము, రాయచూరు, బీదారు జిల్లాలను ఇంగ్లీషువారికి స్వాధీనపరచెను. దీనికి అసైన్‌డ్ టెరిటెరీస్ అని పేరు వచ్చినది. ఆ జిల్లాలపై వచ్చు ఆదాయమును ఇంగ్లీషు సేనల జీతము క్రిందను ఇంగ్లీషువారికి పైనచెప్పబడిన బాకీపైన చెల్లించవలసిన వడ్డీ క్రిందను వినియోగించుచుండుటకు నిజాముగారంగీకరించిరి.
(సశేషం)