విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ

జేన్ ఆస్టిన్‌కి మార్గం చూపిన ఫానీ బర్నీ

అది 1778వ సంవత్సరం. ప్రముఖ బ్రిటిష్ చిత్రకారుడు, సర్ జాషువా రెనాల్డ్స్ (Joshua Reynolds) ఒక నవల చదువుతూ ఎవ్వరితోనూ మాటలాడలేదు; పుస్తకం కింద పెట్టలేదు. పూర్తయ్యేవరకూ అలాగే కూర్చున్నాడు. ప్రఖ్యాత తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ (Edmund Burke) అదే పుస్తకం చదవడంలో పడిపోయి రాత్రంతా తను మేలుకునే ఉన్నానని గ్రహించి నివ్వెరపోయాడు. ఏ మారుమూలో కూర్చుని చదివిన స్మాలెట్, జాన్సన్ వంటి సుప్రసిద్ధ సాహితీవేత్తలతో సహా అందరూ అబ్బురపడిపోయారు. నవల పైన రచయిత పేరు లేని పుస్తకమది. ఇంతమంది మేధావులు చదివి ముచ్చటపడిన ఆ నవల పేరు ఎవలీనా. రచయిత్రి ఫానీ (ఫ్రాన్సిస్) బర్నీ (Frances Burney, 1752-1840). ఆమె రచనలే కాదు. జీవితం కూడ చాలా ఆసక్తికరం. తండ్రికి వ్రాయసగత్తెగా పనిచేసినా, ఫ్రెంచి విప్లవానికి మద్దతుగా కరపత్రం ప్రకటించినా, తొలి బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నా, అంతవరకూ మగరచయితలకే పరిమితమైన ‘కోటబుల్ కోట్స్’ అనేకం తన రచనల ద్వారా అందించినా, సమకాలీన రాజకీయాల మీద సాధికారికంగా రాసినా (కార్న్ వాలిస్ గురించి, ఎడ్మండ్ బర్క్ గురించి రాసిన వ్యాసాలు) ఆమెకే చెల్లు.

బ్రిటిష్ నవలా సాహిత్యంలో రచయిత్రుల ప్రసక్తి రాగానే మొట్టమొదట గుర్తుకు వచ్చే రచయిత్రి జేన్ ఆస్టిన్. ఆమె నవలలు ఇప్పటికీ పాఠకాదరణ పొందుతూనే ఉన్నాయి. ఆమె నవలలు స్త్రీ పాత్ర ప్రధానాలు కావడంతో పాటు, అప్పటి బ్రిటిష్ మధ్యతరగతి, సంపన్నతరగతి జీవితాలను కనీకనిపించని అధిక్షేపంతో చిత్రించే పదునైన రచనలు కావడం మరో ముఖ్య కారణం. అయితే ఆస్టిన్ కంటే ముందే బ్రిటిష్ సమాజంపై, కుటుంబ వ్యవస్థపై చెణుకులు విసిరి, ఆమెకు దారిచూపిన రచయిత్రి ఫ్రాన్సిస్ బర్నీ. “The whole of this unfortunate business,” said Dr Lyster, “has been the result of pride and prejudice.”–సిసీలియా నవలలోని చివరి వాక్యమే జేన్ ఆస్టిన్ సుప్రసిద్ధ నవలకు శీర్షిక అయిందని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

ఆమె జీవించిన కాలంలోనే (18వ శతాబ్ది ఉత్తరార్ధం) ఇంగ్లీష్‌లో, ఫ్రెంచిలో, జర్మన్‌లో రచయిత్రులు నవలలు రాస్తున్నప్పటికీ తనని తాను రచయిత్రిగా పరిగణించుకోలేని, చెప్పుకోలేని ఒక బలహీనత ఫానీలో ఉండేది. స్త్రీలు సృజనాత్మక పనులు చేయడం తప్పని భావించే సగటు మనస్తత్వాన్ని ఆమె కొంతకాలం అధిగమించలేకపోయింది. అందుకే ఆమె తన తొలి రచనలన్నిటినీ కుప్పపోసి తగలబెట్టింది. ‘నా పుస్తకాలనైతే తగలబెట్టగలిగాను కానీ నా ఆలోచనలను తగలబెట్టలేకపోయాను’ అంది ఆమె ఆ తర్వాత. అందుకే, ఇక రాయకుండా ఉండలేకపోయిన ‘బలహీనత’ తోనే ఎవలీనాకు (Evelina) అక్షరరూపం ఇచ్చింది. అక్కడికీ తన పేరు ప్రచురించుకునే ధైర్యం చెయ్యలేకపోయింది. తర్వాతి ముద్రణలోనే ఆమె పేరు ప్రకటించారు. ఈ నవల గొప్ప సంచలనం సృష్టిస్తుందని కాని, అనంతర రచయిత్రులకు స్ఫూర్తిదాయకమౌతుందని గానీ ఆమె ఊహించలేదు. ఆ తర్వాత సిసీలియా (Cecilia), ది వాండరర్ (The Wanderer), కమీలా (Camilla) అనే మరో మూడు నవలలు, కొన్ని నాటకాలు, తన తండ్రి జీవితచరిత్ర, 25 సంపుటాల లేఖలు, డైరీలు ప్రచురించింది.

ఫానీకి రాయడం చిన్నప్పటినుంచీ అలవాటే. కానీ అవన్నీ తన తండ్రి ఛాల్స్ బర్నీ సంగీతగ్రంథాలు. ఆమె తండ్రి సంగీతశాస్త్రంలో నిపుణుడు. స్వయంగా గాయకుడు. ఆయన డిక్టేట్ చేస్తూంటే ఆయన పుస్తకాలు రాయడానికే యుక్తవయస్సులో ఆమె సమయమంతా గడిచిపోయేది. ఆయనతోపాటు నాటకాలు, సంగీతకచ్చేరీలకు తరచు వెళ్తూండేది. ఈ అనుభవాలు ఆమె నవలలో కూడ ప్రతిఫలిస్తాయి. తండ్రికి ఈమె రాయగలదని తెలీదు. రాయగలిగినా ఆయన తనకు సహాయకురాలిగానే ఆమెను చూశాడు. అయితే తండ్రి స్నేహితుడు సామ్యూల్ క్రిస్ప్ ఆమె సృజనాత్మకతను బాగానే గుర్తించాడు. కానీ స్వంత రచనలకు మొదట్లో వీళ్ళిద్దరూ ఆమెను ప్రోత్సహించలేదు. అకస్మాత్తుగా చుట్టూ ఉన్న సాహిత్యకారులందరూ ఒక అనామక నవల అద్భుతంగా ఉందని పొగుడుతూంటే ఫానీ తండ్రి తను కూడ తెచ్చుకుని చదివాడు. చదువుతూండగా అనుమానం వచ్చింది తన కూతురేనేమోనని. తర్వాత ఆమే బయటపెట్టింది అది తన రచనేనని. అక్కడి నుంచి ఆమె రచయిత్రిగా నిలబడ్డానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. ప్రచురణకు ఇచ్చిన తన తొలి నవల ఎవలీనాను ఆమె దస్తూరీ మార్చి రాసిందట. ఎందుకంటే అంతకుముందే తండ్రి గ్రంథాలను తనే రాస్తోంది కనక పబ్లిషర్ ఈ నవలలో తన దస్తూరీని గుర్తించే ప్రమాదం ఉందని! అంత జాగ్రత్తగా, 26 ఏళ్ళ వయసులో తనను తాను దాచిపెట్టుకున్న ఫానీ, తన 58 ఏళ్ళ వయసులో తన వక్షోజాల నొప్పిని గురించి, తను చేయించుకున్న వక్షోజం తొలిగించే శస్త్రచికిత్స గురించి అన్ని వివరాలతో ఉత్తరం రాసి దాన్ని ప్రచురించడం చూస్తే, ఎక్కడి భయస్తురాలైన అమ్మాయి ఎంత ధైర్యస్తురాలిగా మారిందని ఆశ్చర్యం కలక్క మానదు. ఈనాటికీ బ్రెస్ట్ కేన్సర్‌ని గట్టిగా పదిమంది ముందు చెప్పుకోలేని స్త్రీలు ఉన్నపుడు, 1811లో తన వ్యాధిని, తన సర్జరీ వివరాలను స్వహస్తాలతో రాసిన ఫానీని తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఫానీ తల్లి ఎస్తర్ ఫ్రెంచి కుటుంబం నుంచి వచ్చింది. కనక తొలినుంచీ ఫ్రెంచి, బ్రిటిష్ రెండు సంప్రదాయాలనూ ఫానీ తనలో ఇముడ్చుకుంది. చివరికి తన 41వ యేట ఫ్రెంచి వ్యక్తి అలెక్సాన్ద్ర్‌ను (Alexandre d’Arblay) వివాహం చేసుకుంది. అతను ఆర్టిలరీ ఉద్యోగి. ఒక ప్రసిద్ధ ఫ్రెంచి విప్లవనాయకుడికి ఆంతరంగికుడు. భర్త సావాసంతో ఫ్రెంచి విప్లవం పట్ల గౌరవం పెంచుకుని సామాజిక న్యాయం, స్వేచ్ఛల గురించి తన డైరీలు, తదితర రచనల్లో రాసింది ఫానీ. అప్పట్లో ఫ్రెంచి విప్లవానికి మద్దతు కూడగట్టి, కరపత్రాలు రాసిన ఇంగ్లండ్ మేధావుల్లో ఫానీ కూడ ఉంది. తల్లి మరణానంతరం తండ్రి మరో పెళ్ళి చేసుకోవడం, ఆమెతో ఫానీకి, ఆమె అక్కచెల్లెళ్ళకూ పడకపోవడం మరో కథ.

ఫ్రాన్సిస్ కొంతకాలం తన తండ్రి ప్రోద్బలంతో రెండవ కింగ్ జార్జి, రాణి షార్లట్‌ల అంతఃపురంలో (ఆర్థిక కారణాల వల్ల) ఒక చిన్నపాటి కొలువు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు, కళాకారులతో ఇష్టాగోష్టికీ ప్రాణమిచ్చిన ఫానీ, ఈ అంతఃపుర బందీఖానాలో ఉన్న అయిదేళ్ళూ చాలా దిగులుగా గడిపింది. (ఉన్మాదిగా పేరుపడిన జార్జి రాజు ఒక రాత్రి నైట్‌డ్రెస్‌లో ఫానీ వెంట పరిగెత్తాడని, అతి కష్టంమీద అతని నుంచి తప్పించుకుందనీ ఒక కథ ప్రచారంలో ఉండేది). చివరికి అనారోగ్యం సాకు చెప్పి వాళ్ళ నుంచి విముక్తి పొంది తండ్రీ, సవతి తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంది. ఒకప్పుడు సైనికుడైనా, ప్రస్తుతం పైసా సంపాదనలేకుండా బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఫ్రెంచి పౌరుడు దార్‌బ్లే. కనక అతనికి కుటుంబాన్ని పోషించే స్థాయి లేదు. అయితే అతన్ని ఇష్టపడిన ఫానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అదృష్టవశాత్తు ఫానీ రెండో నవల సిసీలియా కూడ ప్రాచుర్యం పొందడంతో ఇల్లు గడవడానికి ఇబ్బంది లేకపోయింది. దాదాపుగా కుటుంబాన్ని పోషించింది ఫానీనే. ఆమె నాటకాలు కూడ రాసినా, స్త్రీల నాటకాల ప్రదర్శన అంత అభిలషణీయం కాదన్న తండ్రి నిర్ణయం వల్ల వాటి నుంచి సంపాదన ఏమీ రాలేదు. కానీ నవలల ద్వారా బాగానే సంపాదించింది ఫానీ. ఆమె ఫ్రాన్స్ ఇంగ్లండ్‌ల మధ్య తన తదనంతర జీవితాన్ని గడిపింది. ఈ దంపతులకు ఒక్కడే కొడుకు. ఫ్రాన్స్‌కి వెళ్ళాక, భర్త ఫ్రెంచి రాజు లూయీ-18 దగ్గర ఉద్యోగం సంపాదించడంతో ఆర్థికంగా కుదుటపడ్డారు. 1818లో భర్త మరణించిన అనంతరం, కొడుకుతో వచ్చి ఇంగ్లండ్‌లోని బాత్ నగరంలో స్థిరపడింది.

80 ఏళ్ళకుపైగా జీవించిన ఫానీ తన నవలలకే కాక, ఇతర రచనలకు కూడ ప్రసిద్ధురాలు. బ్రెస్ట్ కాన్సర్ శస్త్రచికిత్స గురించి చెల్లెలికి ఆమె అతి వివరంగా రాసిన లేఖ ఆమె సృజనాత్మక రచనలతో సమానంగా ప్రసిద్ధిచెందింది. 1811లో ఈ సర్జరీ చేయించుకుంది. బహుశా మేసక్టెమీ చేయించుకున్న తొలి మహిళ ఆమేనని చరిత్రకారుల అభిప్రాయం. అంతే కాదు. అవి అనస్తీషియా లేని రోజులు. సరైన మత్తుమందు లేకుండానే సర్జరీని పళ్ళబిగువున చేయించుకున్న సాహసి ఫానీ బర్నీ! ఆ అనుభవాన్ని ఆమె వర్ణించిన తీరు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆమె కొడుకు 1837లో మరణించాడు. ఆ తర్వాత మూడేళ్ళు జీవించింది ఫానీ.

ఎవలీనా

ఎవలీనాకు ముందే ఆ పాత్ర తల్లి కారొలీన్ జీవితాన్ని కూడ ఒక నవలగా రాసింది ఫానీ. కానీ ఆ తొలినవలను కూడ తన తక్కిన రచనలతోపాటు అగ్నికి ఆహుతి చేసింది. ఎవలీనా 440 పేజీల సుదీర్ఘ నవల. 18వ శతాబ్ది రచనాసంప్రదాయం ప్రకారం ఉత్తరాల్లో నడిచే ఈ నవలను మూడు సంపుటాలుగా విభజించింది రచయిత్రి. ఇది ప్రధానంగా ఒక పల్లెటూరి యువతి నాగరిక సమాజంలో అడుగుపెట్టడాన్ని చిత్రించిన నవల. కథ మొదలయ్యేనాటికి ఎవలీనా వయస్సు 18. ఆమె తల్లి కారొలీన్ ఆమెని కని చనిపోతుంది. కారొలీన్ తల్లి, అంటే ఎవలీనా అమ్మమ్మ అయిన మదామ్ దువాల్ కూతుర్ని ఎప్పుడూ పట్టించుకోదు. తల్లితో పడకపోవడం వల్లే ఎవలీనా తల్లి కారొలీన్ సొంత జీవితం ఎంచుకుని, మోసగాడైన జాన్ బెల్‌మాంట్ వలలో పడి అతనితో లేచిపోతుంది. అతను పెళ్ళి చేసుకుని తీసుకువెళ్తాడు కానీ కొంతకాలానికి పెళ్ళి సర్టిఫికెట్ చింపేసి ఆమెతో తెగతెంపులు చేసుకుంటాడు. తనకు కూతురు ఉందని అతనికి తెలుసు. కానీ తనకు ఒక మనమరాలున్న విషయం మదామ్ దువాల్‌కు, ఆ పిల్లకు 18 ఏళ్ళు వచ్చేవరకూ తెలీదు. తెలిసే సమయానికి ఎవలీనా రెవరెండ్ ఆర్థర్ విలర్స్ పోషణలో ఉంది. మదామ్ దువాల్ తన మనమరాలిని తనతో తీసుకువెళ్ళి, ఇంగ్లండ్ సొసైటీలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నట్టు తెలిసి ఆయన భయపడతాడు. కారొలీన్ అకాలమరణానికి తల్లి స్వభావం, ఆమె నిర్లక్ష్యమే కారణమని భావించిన విలర్స్ ఇప్పుడు మనమరాలు ఎన్ని కష్టాలు పడుతుందో అమ్మమ్మతో అని గాభరాపడతాడు. అందుకని తన స్నేహితురాలు, మంచి వ్యక్తి అయిన లేడీ హోవర్డ్ వద్దకు కొన్ని నెలలు ఉండమని పంపేస్తాడు. ఆమె అల్లుడు మార్విన్ సకుటుంబంగా లండన్ వెళ్తున్నాడని తెలుసుకున్న ఎవలీనా, లండన్ చూడాలన్ని కోరికతో ఆ కుటుంబంతో కొన్ని వారాలు గడపడానికి తన గార్డియన్ విలర్స్ దగ్గర అనుమతి తీసుకుంటుంది. అక్కడే అనుకోకుండా అమ్మమ్మని కలుసుకోవడం, లార్డ్ ఆర్విల్ ప్రేమలో పడడం వంటి సంఘటనలు కథను ఆసక్తికరంగా మలుస్తాయి.

బ్రిటిష్ సంపన్న సమాజంపై అధిక్షేపం

అసలు కథ ఆమె స్నేహితులతో లండన్‌కి వెళ్ళడంతో మొదలవుతుంది. ఆ సమాజంలో ఏది తప్పో ఏది ఒప్పో తెలీక, అపరిపక్వతతో, అవగాహనాలేమితో కొన్ని తిక్క పనులు చేసి అపహాస్యం పాలవుతుంది. అక్కడే ఆమెకు ఇద్దరు ‘యోగ్యులైన బ్రహ్మచారులు’ (eligible bachelors) పరిచయమవుతారు; లార్డ్ ఆర్విల్ (Lord Orville), సర్ క్లెమంట్ విల్లోబీ (Clement Willoughby). అలాగే అమ్మమ్మ పుణ్యమాని ఇంతవరకూ తను ఎరగని బంధుజనం పరిచయమౌతారు. లార్డ్ ఆర్విల్ ఆమె మనసుకు నచ్చినా తన బంధువుల కక్కుర్తితనం, తెలివితక్కువ ప్రవర్తనలు చూశాక, ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన తనని అతను ఇష్టపడతాడని ఎవలీనా అనుకోదు. అమ్మమ్మ మదామ్ దువాల్, ఎవలీనా తండ్రి (ఇప్పుడు సర్ బెల్‌మాంట్) జాన్ బెల్‌మాంట్ వివరాలు కనుక్కుని, తన కూతుర్ని స్వీకరించమని ఒత్తిడి తెస్తుంది. ఈ ముసలామె తన ఆస్తి కాజేసేందుకే ఎవరో అమ్మాయిని తన కూతురిగా చెప్తోందని అతను అనుకుంటాడు. అప్పటికే ఒకమ్మాయి అతని కూతురుగా అతని వద్ద పెరుగుతోంది. తనకు మరో కూతురు లేదని అంటాడు. మదామ్ దువాల్ ఎవలీనాని తండ్రి ఉన్న పారిస్‌కి వెళ్ళి తన తండ్రిని కలుసుకోమని చెప్పినా, తనను అంగీకరించని ఆ తండ్రి తనకూ అక్కర్లేదని తిరస్కరిస్తుంది.

తన ఉనికిని గుర్తించని తండ్రికంటే, తను పరాయిదైనా ఎంతో ప్రేమతో అక్కున చేర్చుకున్న రెవరెండ్ విలర్స్ పట్లే ఎవలీనాకు భక్తి, ప్రేమ. అతని సంరక్షణలో చక్కని విలువలతో, సహజ ప్రకృతిలో పెరిగిన ఎవలీనా, కృత్రిమ ప్రవర్తన, ద్వంద్వ ప్రమాణాలు, అనవసరపు భేషజాలతో కలుషితమైన బ్రిటిష్ సంపన్నజీవిత వాతావరణాన్ని భరించలేకపోతుంది. దానికి ప్రతినిధులైన కజిన్స్‌తో కలిసివుండడం ఆమెకు దుర్భరంగా ఉంటుంది. అక్కడ ఎన్నో అయిష్టమైన అనుభవాలు ఎదురౌతాయి. వాటిలో ముఖ్యమైంది లార్డ్ విల్లోబీ వేధింపు. ఆమె సౌందర్యాన్ని నిత్యం పొగుడుతూ, వెంటపడుతూ, ఆమె జీవితాన్ని అతను దుర్భరం చేస్తూంటాడు. అతనికి తన అయిష్టతను వ్యక్తం చేస్తూనే ఉంటుంది కానీ అతను వదిలేలా కనిపించడు. ఆమెకు అక్కడ లభించిన ఒకే ఒక మధురానుభవం లార్డ ఆర్విల్‌తో పరిచయం. బ్రిటిష్ సంపన్నవర్గానికే చెందినప్పటికీ, హుందాగా, స్త్రీల పట్ల గౌరవభావంతో, మానవీయమైన ప్రవర్తనతో ఉండే ఆర్విల్‌ని తనకు తెలీకుండానే ప్రేమిస్తుంది. కానీ తన బంధుగణం ప్రవర్తన వల్ల అతను తన గురించి ఎంత నీచంగా అనుకుంటాడో అని భయపడుతుంది. అతను మాత్రం ఆమెతో ఎప్పుడూ ఎంతో స్నేహంగా ఉంటాడు. తమ ప్రేమ ఫలిస్తుందనే ఆశ చిగురిస్తూండగా, ఆమెకు అతని పేరు మీద ఒక లేఖ వస్తుంది. అందులో ఆమె పట్ల చాలా అగౌరవాన్ని అతను వ్యక్తంచేస్తాడు. తిరిగి బెవర్లీ హిల్స్‌లో తన ఇంటికి వచ్చేస్తుంది. జబ్బుపడుతుంది.

ఆమె జీవితంలో జరిగే సన్నివేశాలు, ఎదురయ్యే వ్యక్తులు క్షణక్షణం జీవితాన్ని నాటకీయం చేస్తూంటారు. కొంతకాలం తర్వాత లార్డ్ మెకార్ట్నీ అనే వ్యక్తి పిస్తోలుతో కనిపిస్తే, ఆత్మహత్య చేసుకుంటున్నాడనుకుని అడ్డుపడుతుంది. అతని సమాధానం, ప్రవర్తన ఫానీ బర్నీ సెటైర్ రచనకు అద్దం పడుతుంది. తుపాకీ తెచ్చుకున్నాడు కానీ దాంతో దారిదోపిడీ చేసి డబ్బు సంపాదించి సమస్యల్ని పరిష్కరించుకోవాలా, లేక అంత కష్టపడే బదులు ఆత్మహత్య చేసుకోవాలా అని ఇంకా నిర్ణయించుకోలేదంటాడు. అతన్ని వారించి ఆర్థిక సాయం చేసి సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. వీళ్ళిద్దరి సాన్నిహిత్యం చూసి లార్డ్ ఆర్విల్ అతను తనకు పోటీదారుడనుకుంటాడు. ఆ అపార్థం త్వరగానే తొలిగిపోతుంది. ఎవలీనాకు ఆర్విల్ పేరిట అగౌరవకరమైన లేఖ రాసింది లార్డ్ విల్లోబీ అని తెలుస్తుంది. దానితో ఇద్దరూ నిశ్చింతతో తమ ప్రేమను ప్రకటించుకుంటారు.

ఇక మిగిలింది ఆమెను తండ్రి ఆమోదించడం. మొదటి నుంచి ఆ కుటుంబానికి స్నేహితురాలైన మిసెస్ సెల్విన్ ఎవలీనాను చూడగానే కారొలీన్ కూతురిగా గుర్తించి సర్ బెల్‌మాంట్‌కు ఆమెను చూపుతుంది. ఎవలీనాని చూడగానే బెల్‌మాంట్‌కు ఆమెలో కారొలీన్ పోలికలు కనిపించి, అవాక్కవుతాడు. మరి తన వద్ద 18 ఏళ్ళుగా ఉన్న అమ్మాయి ఎవరో అతనికి అర్థంకాదు. మిసెస్ సెల్విన్, కొంత పరిశోధన చేసి, ఆ అమ్మాయి కారొలీన్ దగ్గర పనిచేసిన దాది కూతురని, ఆమె కావాలనే తన బిడ్డను అతని కూతురని చెప్పి అక్కడ వదిలిందనీ చెబుతుంది. ఇప్పుడు హటాత్తుగా బెల్‌మాంట్ అసలు కూతురు దొరకడంతో అంతకాలం తండ్రి నీడలో, సుఖంగా జీవించిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తనకెవ్వరూ లేరంటే బాధపడుతుంది. ఆ అమ్మాయి మీద జాలిపడి ఎవలీనా తన తండ్రి ఆస్తిలో సగభాగం ఆమెకు ఇస్తానని ప్రకటిస్తుంది. అన్ని రహస్యాలతో పాటు మరో రహస్యం బయటపడుతుంది. ఎవలీనా రక్షించిన మెకార్ట్నీ కూడా గ్రంథసాంగుడైన జాన్ బెల్‌మాంట్‌కు మరో అమ్మాయి ద్వారా పుట్టిన కొడుకు. అంటే ఎవలీనా, మెకార్ట్నీ సవతి సోదరీసోదరులయ్యారు. బెల్‌మాంట్ వద్ద పెరిగిన అమ్మాయి, లార్డ్ మెకార్ట్నీల పెళ్ళి, ఎవలీనా, లార్డ్ ఆర్విల్‌ల పెళ్ళి జరగడంతో కథ సుఖాంతమవుతుంది. (ఇది చాలా క్లుప్తంగా ప్రధాన కథ.)

ఈ నవలలో కథ కంటే కథనంలోనే ప్రత్యేకత ఎక్కువ. పాత్రల మధ్య అనుబంధాల చిత్రణ ముఖ్యం. ఆనాటి రచయితలు చాలామంది లాగే ఈ నవలను కూడ ఉత్తరాల ద్వారానే నడిపించింది ఫానీ. అప్పటి ఇంగ్లండ్ సంపన్నుల ప్రవర్తనలు, ప్రేమలు, పెళ్ళిళ్ళలోని కపటాలు, నటనలు, సంపన్నుల ప్రవర్తనలోని హాస్యాస్పదమైన అంశాలు, ద్వంద్వప్రవృత్తులు, డబ్బుకోసం వేసే ఎత్తుగడలు – ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిన తొలి ఇంగ్లీషు నవల ఇది. ఆ తర్వాత ఇలాంటి కథనానికి పేరుపొందిన విలియమ్ థాకరే (వేనిటీ ఫెయిర్ రచయిత), జేన్ ఆస్టిన్‌లకు బ్రిటిష్ సమాజ అధిక్షేపం ఎంత సొగసుగా రాయవచ్చునో చూపిన రచయిత్రి.

ఫానీ బర్నీ తర్వాత మరో మూడు నవలలు రాసినా మరపురానిది మాత్రం ఎవలీనా పాత్ర. ఆమెను పెంచిన విలర్స్ ఆమె చిన్నపిల్ల అని, సమాజంలోని దుర్మార్గాలు, వంచనలు, నటనలు తెలీని అమాయకురాలనీ భయపడతాడు కాని, ఎవలీనాలో గొప్ప తెలివితేటలున్నాయి. విచక్షణ జ్ఞానం ఉంది. బ్రిటిష్ సంపన్న సమాజంలోని అలవాట్లు, ఆచార వ్యవహారాల్లో ఆమె పొరపాట్లు చేసిందేమో కానీ అక్కడి మనస్తత్వాలను అంచనా వేయడంలో కాదు. ప్రతిరోజూ తండ్రికి ఆమె రాసిన లేఖల్లో ఒక్కొక్క సన్నివేశాన్ని వర్ణించి, తర్వాత దానిపై తన వ్యాఖ్యానాన్ని ప్రకటించిన పద్ధతి చూస్తే ఎంత పరిణతి ఆమెలో ఉందో అర్థమవుతుంది. పరిచయమైన తొలి సన్నివేశంలోనే వ్యక్తుల మనస్తత్వాలను అంచనావేయగల నైపుణ్యం ఆమెది. హటాత్తుగా తన మీద ప్రేమ ముంచుకువచ్చిన అమ్మమ్మలోని డొల్లతనం, కాంక్షను ప్రేమగా అభినయించే విల్లోబీ దుర్మార్గం, జీవితాన్ని చూసి భయపడే మెకార్ట్నీ అమాయకత్వం, సమాజంలోని కృత్రిమత్వాన్ని తనలాగే అసహ్యించుకునే లార్డ్ ఆర్విల్ ఔన్నత్యం – అన్నిటినీ ఆకళింపు చేసుకుని తనకేం కావాలో స్పష్టంగా గుర్తించిన వివేకం ఎవలీనాది. అమ్మమ్మతో, భేషజాల చుట్టాలతో సన్నివేశాల్లో ఎవలీనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పఠితకు గొప్ప ఆనందం కలిగిస్తుంది. తన తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు పడినా, కొందరు తనని అపార్థం చేసుకునే పరిస్థితులు కల్పించినా, ఎవలీనా స్వభావంలోని స్వచ్ఛత పాఠకులను గొప్పగా అలరిస్తుంది.

ఈ నవల నుంచి కోట్ చేసుకుంటూ పోతే సగం నవల రాయాల్సివస్తుంది. సజీవమైన భాషలో చక్కని సంభాషణలు, సంభాషణల వెనువెంటే ఎవలీనా చేసే వ్యాఖ్యలు చదువుతుంటే 18వ శతాబ్ది రచనలా అనిపించవు. చాలా ఆధునికంగా ఉంటాయి. ఆద్యంతం ఆహ్లాదపరిచే అభివ్యక్తి వైవిధ్యం, నాటకీయత, హాస్యస్ఫూర్తి, స్వాభావికమైన పాత్ర చిత్రణ, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు – చదివే కొద్దీ చదవాలనిపించే నవల ఎవలీనా. సాధారణంగా ఉత్తరాల నవలల్లో పఠనీయత అక్కడక్కడా అయినా దెబ్బతింటుంది. కానీ ఈ నవలలో అనుక్షణం ఉత్తేజపరిచే ఆసక్తికరమైన రచనే. ఎవలీనా తన పెంపుడు తండ్రి విలర్స్‌కి రాసే ఉత్తరాలే అత్యధిక భాగం. అక్కడక్కడా ఇతరుల ఉత్తరాలు వస్తాయి.

నవల ద్వారా అప్పటి సమాజంలో స్త్రీల పట్ల ఉన్న అభిప్రాయాలు స్పష్టమౌతాయి.

  1. స్త్రీకి శారీరక సౌందర్యమే అతి ముఖ్యం. అందమైన స్త్రీని గురించి మాట్లాడే హక్కు ప్రతి పురుషుడికీ ఉంటుంది. అంతేకాదు. వారి దుస్తులు, వారి ఆభరణాలు నిర్ణయించే హక్కు కూడా చివరికి దుకాణదారుడికి సైతం ఉంటుంది.
  2. స్త్రీలకు ఏ విషయం పైనా స్వంత అభిప్రాయాలుండకూడదు. ఎపుడైనా ఒక చర్చ జరుగుతున్నపుడు స్త్రీలు మాట్లాడబోతే వెంటనే పురుషపుంగవులు వాళ్ళ నోళ్ళు మూయిస్తారు. ‘ఆడముండల్తోనా చర్చ’ అన్న అగ్నిహోత్రావధాన్ల పూర్వజులే వీళ్ళంతా.
  3. పురుషులను ఆకర్షించడం స్త్రీల పరమావధి. స్త్రీలను ‘కష్టాల నుంచి’ రక్షించడం పురుషుడి తక్షణకర్తవ్యం.
  4. పల్లెటూరి పిల్ల లండన్ జీవితానికి అర్హురాలు కాదు; స్త్రీలకు గౌరవం వారి ఆభిజాత్యం నుంచే లభిస్తుంది తప్ప, వ్యక్తిత్వం నుంచి కాదు.

వీటన్నిటితోనూ కనిపించని పోరాటం జరిపిన 18 ఏళ్ళ ఎవలీనా కథ ఇది. మగవాళ్ళను అదుపులో పెట్టడంలో కాని, సంక్లిష్టమైన వాతావరణం నుంచి తప్పించుకోవడంలో కాని, మంచివాళ్ళతో స్నేహాన్ని నిలుపుకోవడంలో కాని, ఎవలీనా ప్రదర్శించే వివేకం ఒక అపురూపమైన పాత్రగా ఆమెను నిలబెడుతుంది. ప్రతి విషయం మీదా ఎవలీనా చేసే వ్యాఖ్యలు ఆమె స్వభావాన్ని, తెలివితేటల్ని కూడ బహిర్గతం చేస్తాయి.

  1. పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఈ మగవాళ్ళు ఎపుడెపుడు తమని డాన్స్‌కి ఆహ్వానిస్తారా అని తహతహలాడుతారన్న అపోహలోనే జీవిస్తారు.
  2. సంగీతకచ్చేరీకి వచ్చేవాళ్ళు పొరబాటున కూడ ఆ సంగీతం వినరు. వాళ్ళ కబుర్లతో ఇతరుల్ని కూడ విననివ్వరు.
  3. ఒక పురుషుడు ప్రేమిస్తున్నానని చెబితే, స్త్రీ ప్రేమించకపోవడం మహా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ పురుషుడికి.
  4. తన సంతానాన్ని ఆమోదించడానికి గాని, తిరస్కరించడానికి గానీ పురుషుడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది.

ఆభిజాత్యమంటే, భేషజాలంటే పడి చచ్చిపోయే తన అమ్మమ్మ, ఒకసారి ‘దోపిడీదొంగలు’ అటకాయించి, గుర్రబ్బండి నుంచి దింపేస్తే, తన పేజీలో ‘ఉంగరాల జుట్టు విగ్’ ఊడిపోయిందని ఎక్కువ ఏడ్చిందని వర్ణించడంలో, ఆ అమ్మమ్మని చూసి నవ్వాపుకోలేక నానా అవస్థలు పడిన నాయిక వర్ణనలో (నిగమశర్మ అక్క తన ముక్కెర ఎత్తుకుపోయాడని ఏడ్చినట్టు) ఫానీ చతురత కనిపిస్తుంది. దుర్మార్గమైన పనులు చేసిన సర్ జాన్ బెల్‌మాంట్ మాటల్లోనూ హాస్యం చిందించడం రచయిత్రి సెన్స్ ఆఫ్ రిడిక్యూల్ ఏ స్థాయిలో ఉందో, మాటల్లో ఐరనీని ఎలా సాధించిందో తెలుపుతుంది.

మిసెస్ సెల్విన్ ఎవలీనాను తండ్రికి చూపించాలన్న ఉత్సాహంతో వచ్చినపుడు వాళ్ళను చూడడానికి కూడ నిరాకరిస్తాడు మొదట్లో. అప్పుడు అతను చెప్పే కారణం ఇలా ఉంటుంది: “I am much indebted to you, Madam, for this desire of increasing my family, but you must excuse me if I decline taking advantage of it. I have already a daughter, to whom I owe everything. And it is not three days since, that I had the pleasure of discovering a son; how many more sons and daughters may be brought to me, I am yet to learn, but I am, already, perfectly satisfied with the size of my family.”

మాటల్లో ఇలాంటి ఐరనీ ఆ తర్వాత 19వ శతాబ్ది నవలల్లో తరచు కనిపిస్తుంది. ఫ్రాన్సిస్ ఇలాంటి శైలిలో చాలామందికంటే ముందుంది. ఇందులోని పాత్రలను కూడా ఖచ్చితంగా చెడ్డ, మంచి అని చిత్రించకపోవడం చెప్పుకోవాల్సిన విషయం. బెల్‌మాంట్ తన చర్యలకు పశ్చాత్తాపపడి అప్పటికే తన కూతురు అనుకుంటున్న అమ్మాయిని చేరదీశాడు. లార్డ్ విల్లోబీ కూడ ఎప్పుడు ఎవలీనా కష్టాల్లో చిక్కుకున్నా (తాగుబోతులు వెంటపడ్డం వంటివి) ఆమెను ఆపద్భాంధవుడిలా రక్షిస్తూనే ఉన్నాడు. కనక పాత్ర చిత్రణలోకూడ స్వాభావికతకే ఆమె పెద్దపీట వేసింది.

ఎక్కువగా పురుషుల రచనల్లో కనిపించే ఉల్లేఖనీయమైన వాక్యాలు (quotable quotes) ఫ్రాన్సిస్ బర్నీ నవలల్లో, డైరీలలో కూడ కనిపిస్తాయి. మచ్చుకి కొన్ని:

– No man is in love when he marries. He may have loved before; I have even heard he has sometimes loved after: but at the time never. There is something in the formalities of the matrimonial preparations that drive away all the little cupidons. (పెళ్ళి ‘తంతు’ ప్రేమను చంపేస్తుంది.)

– O! how short a time does it take to put an end to a woman’s liberty! (స్త్రీ నుండి స్వేచ్ఛను లాక్కోవడం ఎంత సుళువు!)

– Misery is a guest that we are glad to part with, however certain of her speedy return. (బాధను పంపినంత సేపు పట్టదు అది తిరిగి రావడానికి.)

– But authors before they write should read.(కానీ రాసేముందు రచయితలు చదివితే బాగుండు కదా)

వర్జీనియా ఊల్ఫ్ చేత The mother of English Fiction అన్న ప్రశంసలు పొందిన ఫ్రాన్సిస్ బర్నీ నాటకాలు (కామిడీలు, ట్రాజెడీలు), డైరీలు, ఉత్తరాలు ఇటీవలి కాలంలో పరిశోధనకు, అధ్యయనానికి నోచుకున్నాయి. ఆ కాలం నాటి రచనలు ఎలా చదువుతాం అని అనుకునేవాళ్ళు కూడ స్వాభావికత, హాస్యస్ఫూర్తి, వైవిధ్యభరితమైన పాత్రలతో నిండివున్న ఎవలీనాని హాయిగా చదవగలరు.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...