మళ్ళా జాషువా గురించి

బహుదేశ మత మహాపరిషత్తు తలయూచ
పలికి వచ్చినది మా భరతసుతుడు
కండెబొట్టున నైదు ఖండాల నోడించి
కొలువు లందినది మా కోమటన్న
సీమలో నాచార్య సింహపీఠిక మీద
నిలిచివచ్చినది మా తెలుగువాడు
విశ్వసన్మానంబు వెలయ నోబెలు కీర్తి
రంగమెక్కినది మా వంగ సుకవి

చెట్టుచేమల సుఖదుఃఖ జీవితములు
నిజము దేల్చినవాడు మా నేలవాడు
నన్ను దొలగించి లెక్కించినారు గాని
మొదట నెల్లర మన్న దమ్ములము మేము
(గబ్బిలము, 3వ ముద్రణ, 1954.)

ఈ పద్యంలో వివేకానందుణ్ణి, గాంధీని, రాధాకృష్ణన్‌ని, టాగూర్‌ని, జగదీశ్ చంద్రబోస్‌ని ఉద్దేశించాడని వేరే చెప్పక్కర్లేదు. అందులో ముఖ్యమయిందల్లా ఆఖరి భాగం తేటగీతి లోని చివరి రెండు పాదాలు: ‘నన్ను దొలగించి లెక్కించినారు గాని మొదట నెల్లర మన్న దమ్ములము మేము’ అనేవి. జాషువా మొదటినుంచి సమాజంలో తాను కూడా వేరుపరచబడని వ్యక్తిగా ఉండాలని, అన్ని కులాల వాళ్ళలో తను కూడా ఒకడుగా లెక్కపెట్టబడాలని, తనను అంటరానివాడిగా చూడకూడదని, తను సమాజంలో భాగమని, అంచేత దేశచరిత్రలో, సమాజ చరిత్రలో తనని వేరేగా చూడకుండా కలుపుకోవాలని పట్టుదలగా అనుకున్నవాడు. ‘మొదట నెల్లర మన్న దమ్ములము మేము’ అన్న మాటలో బలమైన సమైక్యతా కాంక్ష వుంది.

గబ్బిలానికి ముందు రచయిత మాటగా జాషువా స్పష్టంగా చెప్తాడు–ఇది కాళిదాసు మేఘసందేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన కావ్యము అని. కాని సమాజంలో తనలాంటి పేదవాడికి గొప్పగొప్ప సందేశహారులు ఎవరుంటారు. అంచేత గబ్బిలమే భగవంతుడి దగ్గరికి సందేశం తీసుకెళ్ళగలిగినది. అది దేవాలయ శిఖరంలోకి, దేవాలయం గర్భగుడిలోకి నిరభ్యంతరంగా వెళ్ళగలదు. జాషువా ప్రతిభ అల్లా గబ్బిలాన్ని ఎంచుకోవడంలోనే. దీనిలో మొదటి కొన్ని పద్యాలు పక్కన పెడితే తరవాత కావ్యమంతా దేశపు గొప్పతనాన్ని, పాతకాలపు కవుల, రాజుల కీర్తిని చెప్పేదే. కైలాసంలో శివుడి దగ్గరికి గబ్బిలానికి కవి వెళ్ళమని చెప్పిన దారి వంకరటింకరగా ఉండి, బోలెడు రాజ్యాలని, ఆ రాజ్యాల చారిత్రక వైభవాన్ని వర్ణిస్తూ సాగుతుంది. తంజావూరు ఈ గబ్బిలం వుండే మొదటి స్థానం. ఎందుకంటే ఈ అంటరానివాడు కూడా తంజావూరులోనే వుంటాడు. ఆ తరవాత రఘునాథరాయల ఆస్థానాన్ని కవి వర్ణిస్తాడు. సరస్వతీ మహల్‌ని చూసి తెలుగుదేశపు సరిహద్దుల్లో తెలుగువాళ్ళ శౌర్యాన్ని చూడమంటాడు. అంతకన్నా విశేషంగా సంస్కృత మహాభారతం ఒక దారీతెన్నూ లేని అడివిలాగా వుంటుందని, దాన్ని పదిహేను పర్వాల్లో తెలుగుతనం ఏర్పడేలాగా మలిచి మంచి పేరు తెచ్చుకున్న తిక్కన వుండే నెల్లూరుకి వెళ్ళి అక్కడ పెన్నా నదిలో స్నానం చేయమంటాడు. నెల్లూరి నెరజాణల గురించి వాళ్ళు గొప్ప కవుల్ని కూడా తికమక పెట్టగల జాణలు అని ఒక మాట వుంది, నిజమో కాదో తెలుసుకోమంటాడు. తప్పకుండా హంపీ క్షేత్రాన్ని చూడమంటాడు. అది ఒకప్పుడు తెలుగు రాజ్యపు వైభవానికి ఆలవాలమైన ప్రదేశమని, ఆ కాంతి అంతా ఇప్పుడు పోయిందని, అక్కడ నీ చుట్టాలు కొంపలు కట్టుకుని నివాసముంటారని, నీకు వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటుందని, అక్కడ అంగళ్ళలో కుప్పలు పోసి రత్నాలు అమ్మేవారన్నది తలచుకుంటే ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది అని విజయనగర రాజ్యవైభవాన్ని చాలా అందమైన పద్యాల్లో వర్ణిస్తాడు.

అయితే గబ్బిలం ఆడది ఎందుకు కావలసి వచ్చింది? ఖగరాజ్ఞి, ఖగవధూటి, ఖగభామ, ఇలాటి మాటలు వాడి గబ్బిలాన్ని స్త్రీగా భావించడంలో ఔచిత్యం ఏమిటి అని ఆలోచించాలి. నిజానికి గబ్బిలం స్త్రీ కావలసిన అవసరం లేదు. తెలుగు భాషలో జంతువులతో పాటు స్త్రీలను కూడా కలిపి ఏకవచనంలో ఒకే ప్రత్యయం ఏర్పరచడం అలవాటు; కుక్క వచ్చింది, పక్షి వచ్చింది, అమ్మాయి వచ్చింది, మహారాణి వచ్చింది. వీటన్నింటిలోను ప్రత్యయం ‘ది’ అనేదే. అది అనే సర్వనామం ఏకవచనంలో జంతువులకి, పక్షులకి, ఆడవాళ్ళకి ఉమ్మడిగా వాడవచ్చు. ఆ ఆలోచనతో గబ్బిలాన్ని కూడా జాషువా స్త్రీగా భావించి వుండాలి. ఈ గబ్బిలం మొగ గబ్బిలమైతే ఏమి చేయాలో జాషువాకి తెలిసుండేది కాదు. అంచేత యథాలాపంగా చివర ఉండే ‘ది’ అనే పదాంతం ఆధారంగా గబ్బిలాన్ని ఆడ జంతువుగా భావించాడు జాషువా.

జాషువా మొదట్నించీ పద్యాన్ని పట్టుకోవాలి, పద్యాన్ని బాగా రాయాలి అన్న ప్రయత్నంలోనే ఉన్నాడు. తను కవిత్వం రాసే కాలానికి పద్యం పాత పద్ధతుల్లో లేదని, పద్యాన్ని భావకవులు వచ్చి మాటల కూర్పు మీద, ఊహల పొందిక మీద దృష్టి పెట్టి పద్య స్వభావాన్ని మార్చేశారని జాషువా గుర్తించలేదు. ఆయనకు కావలసిందల్లా పాత పద్ధతుల్లో భావాన్ని ఛందస్సులో ఇమిడ్చి చెప్పడమే. ఆ మాట జాషువా స్పష్టంగా చెప్పుకున్నాడు కూడా: ‘కావ్యశిల్పమున కన్ననభిప్రాయ ప్రకటనమే పరమావధి’ అని ఆయన స్వప్నకథకి రాసిన ముందుమాటలో రాశాడు. పద్యాలుగా రాసిన తన పుస్తకాలన్నీ పెద్దకులాలవాళ్ళకే అంకితం ఇచ్చాడు కూడా.

జాషువాకి దేశభక్తి ఎంత ఎక్కువంటే, నాగార్జునసాగర్ అనే ఖండకావ్యంలో భారత ప్రధానమంత్రులందరినీ పేరుపేరునా ప్రశంసిస్తూ రాసిన ఈ పద్యం చూస్తే తెలుస్తుంది.

జవహరువోయె శాస్త్రి దివిషత్సభ కేగె మహాత్ముడెప్పుడో
యవని త్యజించె జహ్వరుని యాత్మజ దండము చేతబట్టె మా
ర్దవమతి కోమలంబగు హృదబ్జము గల్గిన యిందిరమ్మ హైం
దవ ధరణీ శుభోన్నతికి తప్పక తోడ్పడు దేశ సోదరా!

వీలున్నప్పుడల్లా గాంధీని, గాంధీ అహింసా మార్గాన్ని పొగిడాడు జాషువా. లోకంలో పెద్దకులాలవాళ్ళు అందరూ అనుసరించిన మార్గమే తన మార్గం చేసుకున్నాడు. జాషువా నిజానికి దళితకులంవాడు కాదు. అతను గొల్ల. అయినప్పటికీ మాదిగ కులంలో ఉన్న ఒక అమ్మాయిని కావాలని పెళ్ళి చేసుకున్నాడు. ఇందుకు అతని క్రైస్తవ మతం తోడ్పడింది. అయినా క్రైస్తవుడు అయి ఉండి కూడా హిందూ మత భావాలు, హిందూ మత పద్ధతులు అనుసరిస్తూ పద్యాలు రాయడం క్రైస్తవులకి నచ్చలేదు. చివరికి వాళ్ళని ఒప్పించడం కోసం క్రీస్తు చరిత్ర రాశాడు.

జాషువా నా కథ అన్న పేరుతో తన జీవిత చరిత్రని పద్యాల్లో నాలుగు భాగాలుగా రాశాడు. అప్పటికి తన జీవితాన్ని వెనక్కి చూసుకునే ఒక సమ్యక్దృష్టి ఏర్పడింది. ఎవరి జీవిత చరిత్ర అయినా దానిని ఒక కథగానే చూడాలని ఇప్పటి విమర్శకుల అభిప్రాయం. తన జీవితంలో ఏ భాగాన్ని ప్రముఖంగా చేసి చూపించాలి, ఏ భాగాన్ని చెప్పకుండా వదిలేయాలి, ఏ భాగం తనకి గుర్తుండకుండా పోతుంది అనే విషయాలు తీసుకుంటే ఎవరు తన జీవిత కథ రాసుకున్నా అది ప్రధానంగా కథే అవుతుంది, దాన్ని కథగానే చూడాలి. తాను చాలా పేదరికంలో పుట్టానని జాషువా ప్రకటంగా చెప్పుకున్నాడు తన జీవితకథలో. ఆ మాట నిజమే. జాషువా రకరకాల చిన్న ఉద్యోగాలు చేశాడు. మూకీ సినిమాలలో కథ చెప్పే ఉద్యోగం నుంచి నాలుగు డబ్బులొచ్చే ఏ ఉద్యోగాన్నీ తాను కాదనలేకపోయాడు. ఆ పరిస్థితుల్లో కూడా పద్యాలు రాస్తూనే ఉన్నాడు. తాను ఎంతగా పై కులాలవాళ్ళతో కవిత్వంలో సమానుణ్ణని అనిపించుకోవాలని కోరుకున్నా అది తనకి తేలికగా సాధ్యపడలేదని జాషువాకి బాగా మనసులో గుచ్చుకుని ఉంటుంది. చివరికి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి నరసింహం లాంటి వాళ్ళు తనని గౌరవించిన తరవాతే అతనికి నమ్మకం కుదిరింది. అతన్ని కవిగా పైకులాల వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు.

అయితే అతనికి వచ్చిన బిరుదులు, సన్మానాలు, గుర్తింపులు ఇవన్నీ ఒక విలక్షణమైన భావవైరుధ్యం వల్ల వచ్చినవి. నవయుగ కవిచక్రవర్తి లాంటి బిరుదులు మనకు అలవాటైన ఆడంబరం కోసం ఇచ్చినవి. అవి వదిలేస్తే ఇతనికి వచ్చిన పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలు; ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన కళాప్రపూర్ణ బిరుదు; కేంద్ర సాహిత్య అకాడమీ క్రీస్తు చరిత్ర కావ్యానికిచ్చిన బహుమానం; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన్ని శాసన మండలి సభ్యునిగా నియమించడం; వీటిలో పెద్ద కులాల వాళ్ళకి ఇతన్ని తమతో సమానంగా గౌరవిస్తున్నామనే ఆదరణ భావం వుంది. జాషువాకి పెద్ద కులాలవాళ్ళు తనని గౌరవిస్తున్నారనే సంతృప్తి వుంది. ఈ రెండూ ఒకదానికి ఒకటి విరోధంగా వుండేవి. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఇతను తక్కువ కులంవాడు కావడం పెద్ద కులాల వాళ్ళకి అవసరం. ఈ గుర్తింపు ఇచ్చిన వాళ్ళు పెద్ద కులాలవాళ్ళు కావడం జాషువాకి అవసరం. అయితే ఇందులో ఉండే పరస్పర వైరుధ్యం పైకి కనిపించకుండా ఉంటుంది.

జాషువా పద్యం ధారాళంగా రాయగలడు. పద్యంలో కవిత్వపు చిక్కదనం కాని, పదాల పొందిక కాని ఒక పద్ధతిలో ఉండాలి అనే దృష్టి జాషువాకి లేదు. అంతకు మించి భావాల దగ్గరకి వస్తే, అవే అతనికి ప్రధానం కాని, అవి రాజకీయంగా, సామాజికంగా, ఆలోచనాపూర్వకంగా ఉండాలనే కోరిక కూడా అతనికి లేదు. ఒక పక్క గాంధీని పొగుడుతూనే, అదే గొంతుకతో, అదే ధోరణిలో బోస్‌ని కూడా జాషువా పొగుడుతాడు. హిట్లర్ బోస్‌ని ఆదరించి, అతనితో కరచాలనం చేసి జాగ్రత్తగా అతన్ని తగిన రక్షణలతో జపాన్‌కి పంపడం, అక్కడ జపాన్‌లో హిరోహిటో బోస్‌ని చూడగానే లేచి నిలబడి కరచాలనం చేయడం ఇవన్నీ బోస్‌లోని సమ్మోహనశక్తికి గుర్తింపులుగా జాషువా ప్రశంసిస్తాడు. కాని నిజానికి హిట్లర్, హిరోహిటో–వీళ్ళే గెలిచి భారత దేశానికి సుభాష్ చంద్రబోసే నాయకుడైతే అప్పుడు ఏర్పడే ప్రభుత్వం ప్రజారంజకం అయే ప్రభుత్వం అవదని, కేవలం అది ఇంకొక రకమైన ఫాసిస్టు ప్రభుత్వం అవుతుందని సవిమర్శకంగా ఆలోచించే శక్తి జాషువాలో ఎక్కడా కనిపించదు. ఆ సంగతి జవహర్‌లాల్ నెహ్రూకి తొలిరోజుల్లోనే స్పష్టంగా తెలుసు. బోస్ గాని భారతదేశానికి జపాన్ సహాయంతోనో, జర్మనీ సహాయంతోనో వస్తే అది దేశానికి చాలా ప్రమాదకరమని గ్రహించాడు నెహ్రూ. అందుకే బోస్‌కి వ్యతిరేకంగా స్పష్టమైన ప్రకటనలు చేశాడు కూడా. నెహ్రూకి అక్షరాజ్యాలమీద–జర్మనీ, ఇటలీ, జపాన్–ఆ మూడింటి కూటమి మీద ఏ రకమైన భ్రమలూ లేవు. ఇలా రాజకీయాలని జాగ్రత్తగా వివేచించి అర్థం చేసుకునే ఆలోచన జాషువాలో ఏ కోశానా కనిపించదు. కేవలం గాంధీని పొగిడిన నోటితోటే బోస్‌ని పొగడటం, అదే వరసలో ఇందిరా గాంధీని పొగడటం ఈ రకంగా ఎవరు ప్రముఖంగా ఉంటే వాళ్ళని తలకెత్తుకోవడమే, వాళ్ళని గురించి ధారాళమైన పద్యాలు రాయడమే జాషువా చేసిన పని. ఈ కలగాపులగపు దృక్పథం కేవలం జాషువాదే కాదు. మామూలు ప్రజానీకానికి కూడా ఇలాటి ఆలోచనలే ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. హిట్లర్ రాసిన మైన్ కాంప్ఫ్ (Mein Kampf) అనే పుస్తకానికి ఇంగ్లీషు అనువాదం తెలుగు దేశంలో బాగా అమ్ముడు పోయిందని మనలో కొందరికైనా గుర్తుండి ఉంటుంది. తెలుగుదేశపు ఊళ్ళలో గాంధీ విగ్రహం పక్కనే మిలటరీ దుస్తుల్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టడం అప్పట్లో ఎవరికీ ఎబ్బెట్టుగా అనిపించలేదు. మనకి మిలటరీ అధికారం పట్ల, మిలటరీ పాలన పట్ల లోపల ఎక్కడో ఆకర్షణ ఉంది. ఈ రకమైన కలగాపులగపు అభిప్రాయాలు జనంలో వ్యాపించి వుండగా జాషువాలో కూడా అవే అవిమర్శకంగా కనిపించడం ఆశ్చర్యం కాదు.

ఇకపోతే ఫిరదౌసి వంటి కావ్య వస్తువు జాషువాకి ఆకర్షకంగా కనిపించడంలో మనకి ఆశ్చర్యమేమీ లేదు. ఒక్క ఫిరదౌసి కావ్యమే జాషువా కొంత తాదాత్మ్యంతో రాసినట్టు కనిపిస్తుంది. అందులో కొంత ఆత్మాశ్రయం ఉందేమో కూడా. కవిగా తనని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికార వర్గంలో ఉన్నవాళ్ళు తగింతగా గుర్తించలేదనే భావం జాషువాకి ఫిరదౌసి మీద సానుభూతికి అవకాశం ఇచ్చి ఉంటుంది. కావ్యవస్తువులో పూర్తిగా లీనమైపోయి రాసిన కథాకావ్యమిది.

జాషువా జీవితంలో చాలా దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు. అతనికి ఒక పక్క పొగడ్తలు, సన్మానాలు, కొండొకచో గజారోహణలు జరుగుతున్నా అవేవీ నిత్యజీవితానికి కావలసిన డబ్బు సంపాదించినట్లు లేదు.

పప్పున్ బియ్యము, దానికిం దగిన సంభారంబు లెన్నాళు లి
ట్లప్పుల్ జేసి, ప్రతిష్ఠ జారని రహస్య క్లేశ సంసారపుం
దెప్పన్ ద్రిప్పెద వోయి, నీ బిరుదముల్ నీ కాలి పెండారముల్
దుప్పట్లక్కర దీర్చునా? సుకవు లెందున్ మందభాగ్యుల్ గదా?
(ఖండకావ్యము, 6వ భాగము, 1962.)

ఈ పద్యంలో ఆ ఇబ్బందిని గురించి జాషువా స్పష్టంగా చెప్పాడు. అలాగే తన క్రైస్తవ మతం కూడా అతనికి ఆసరా కాలేదు. ఈ క్రింది పద్యాలు క్రైస్తవ మతంలో వుండే కులభేదాల గురించి బాధపడుతూనే చెప్పినవి.

పంచములలోన మాదిగవాడ నేను
పంచమీయులలో మాలవాడతండు
ఉభయులము క్రైస్తవమతాన నొదిగినాము
సోదరత గిట్టుబాటు గాలేదు మాకు

జాషువా చివరికి ధైర్యంగా;

కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు, విశ్వనరుడ నేను
(ఖండకావ్యము, 5వ భాగము, 1962.)

అని సగర్వంగా ప్రకటించాడు. తరవాత తన పద్యాలు బాగున్నాయని మెచ్చుకున్నవాళ్ళే తన పద్యాలు వింటూ వింటూ మీదేకులం అని అడిగి ఆ కులం తెలుసుకున్న తరవాత మధ్యలో లేచి పోవడం జాషువాని చాలా బాధ పెట్టింది. నా కథ లోని పద్యం,

నా కవితా వధూటి వదనంబు నెగాదిగా జూచి రూపురే
ఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళియన్న వారె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లుగున్ పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్

ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది.

జాషువా హిందూమత వస్తువులని తీసుకుని పద్యాలు రాయడం క్రైస్తవులకు నచ్చలేదు. అతనిపై ఇంకేవో అపవాదులు వేసి క్రైస్తవులు అతన్ని కులం నుంచి వెలివేశారు. చివరికి జాషువా తండ్రి వీరయ్యగారు కూడా తన ఫాదరీ ఉద్యోగం పోతుందనే భయంతో కొడుకుని ఇంటికి రావద్దని అభ్యంతర పెట్టాడు. ఈ పరిస్థితుల్లో జాషువా ఊరికి దూరంగా ఒక పాడుపడ్డ మసీదులో పగలంతా కాలక్షేపం చేసి రాత్రి చీకటి చాటుగా ఇంటికి వచ్చి తల్లి పెట్టిన భోజనం తిని మళ్ళా మసీదుకు చేరుకునే వాడట. ఈ సంగతి జాషువా కుమార్తె హేమలతగారు రాశారు (చూ. హేమలతా లవణం, మా నాన్నగారు, పుట 11). ఈ పరిస్థితుల్లో జాషువా తన చుట్టూ వుండే సాలెపురుగులు, గిజిగాడి గూళ్ళు ఇలాంటి వస్తువుల మీద పద్యాలు రాశాడు.

నీలో నూలు తయారుజేయు మరగానీ, ప్రత్తిరాట్నంబు గా
నీ, లే దీశ్వరశక్తి, నీకడుపులోనే లీనమై యుండునో;
యేలీలన్ రచియింతు వీజిలుఁగునూలీ పట్టుపుట్టంబులో
సాలీఁడా! నిను మోసగాఁడవని విశ్వంబేల దూషించెడిన్?

ఢక్కామల్లు పసందు నేతపనివాండ్రా, నీయుపాధ్యాయులి
ప్డొక్కండున్ గనరాఁడు, డాగుకొనినారో నీదుగర్భంబునం
దిక్కాలంబున నిన్ను మించుపనివాఁడే లేఁడు; దుర్వృత్తికిన్
దిక్కై నీయసమానకౌశలము వ్యర్థీభూతమై పోయెడిన్

తరువాత గిజిగాడు గూడు మీద జాషువా రాసిన చక్కని పద్యం కూడా ఈ కోవలోదే.

తేలిక గడ్డిపోచలను దెచ్చి, రచించెద వీవు తూఁగుటు
య్యేలగృహంబు మానవుల కేరికి సాధ్యము గాదు దానిలో
జాలరు లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా
మేలు భళీ! పులుంగుటెకిమీడవురా! గిజిగాడ నీడజా!

ఎలాంటి ఇబ్బందులకు లోనయినా పేదరికం, కులభేదం, వెలివేత ఇన్నిట్నీ భరించి జాషువా నిబ్బరంగానే నిలబడ్డాడు.

కవిశక్రేశుడ గండపెండెరములన్ గాంగేయ తీర్థంబులన్
వివిధోపాయనసత్కృతుల్ గొనిన గాంధీశాంతిసిద్ధాంతమా
ర్దవమార్గాటుడ, గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించు మా
నవతాస్రష్టను నవ్యభావ చతురుండన్ జాషువాభిఖ్యుడన్.
(ఖండకావ్యము, 6వ భాగము, 1962.)

తెలుగులో సాంప్రదాయిక సాహిత్యం మీద ఎంత పట్టు కావాలని అనుకున్నాడో అంత గాఢంగానూ ఆ సాహిత్యంలో మంచీ చెడ్డా ఉన్నాయని, దాన్ని మరమ్మత్తు చేసి ఇప్పటి వాళ్ళు వాడుకోవాలని తన అభిప్రాయం చెప్పాడు కూడా.

మొత్తముమీఁద నాంధ్రకవి ముఖ్యులు పెట్టిన కట్టుబాట్లలో
నుత్తమ మధ్యమాధమము లున్నవి, వానిని కొద్దిగా మరా
మత్తొనరింపనౌ ననెడు మాటకు నేనును సమ్మతింతు, నీ
బిత్తల తోఁకబీకుడు కవిత్వపు ఫక్కి ననాదరించెదన్. (ఖండ కావ్యము, 3వ భాగము, 1946.)

సంప్రదాయ సాహిత్యం మీద ఇంత ఇష్టం ఉన్నా తన విమర్శాదృక్పథాన్ని మాత్రం జాషువా వదులుకోలేదు. ఉదాహరణకి గబ్బిలంలో ఈ పద్యం చూడండి.

ధర్మసంస్థాపనార్థంబు ధరణి మీద
నవతరించెదననె నబ్జభవునితండ్రి
మునుపుజన్మించి నెత్తికెత్తినదిలేదు
నేడు జన్మింపకున్న మున్గినదిలేదు

కులమతాల భేదాలని గురించి, నిమ్నజాతుల్ని అణగార్చిన ‘నాల్గు పడగల హైందవ నాగరాజు’ అని ఎంత చెప్పినా జాషువాకి దేశపు సమాజవ్యవస్థలో సవిమర్శకమైన దృక్పథం లేదని అనిపిస్తుంది. మంచి పద్యాలు రాసి, చివరి రోజుల్లో అందుకు తగిన మంచి ఉద్యోగాలు చేసి, దాదాపు అన్ని గౌరవాలు సంపాదించి జాషువా చివరికి గుర్తుంచుకోవలసిన గొప్ప పద్యాలు రాసినవాడుగా మన మనసుల్లో మిగిలిపోయాడు.

సాహిత్యం రాజకీయాల్లో భాగమైపోతోంది. ప్రతి కవికీ ఎవరో కొందరు అనుయాయులు, ఆశ్రితులు తయారై ఈ కవి మా కవి అనడం పరిపాటై పోతోంది. విశ్వనాథ సత్యనారాయణగారిని హిందూత్వవాదులు, శ్రీశ్రీని మార్క్సిస్టులు, అలాగే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక కులంవాళ్ళో, వర్గంవాళ్ళో, ఆ పద్ధతిలోనే జాషువాని కూడా ఏదో ఒక వర్గంవాళ్ళు మా కవి అనడం ఈ మధ్య కనిపిస్తోంది. సాహిత్య విమర్శలో రాజకీయ దృక్పథం వుండకూడదని కాదు కాని, సాహిత్యపు మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా కవిని ఒక వర్గంలో కలిపేసుకోవడం ఈ మధ్య జరుగుతున్న విషయం. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. జాషువాకి కూడా ఈ పరిస్థితి పట్టకుండా వుండడం కవిగా ఆయనకి, సాహిత్య విమర్శకులకి ప్రధానమైన అవసరం.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...