‘రారాదూ మాచ్ చూడ్డానికి? వరస్ట్ కేసులో కూడా సచిన్ రెండుసార్లు వచ్చి వెళ్తాడు క్రీజ్‌కి…’ అని అతడు కాల్‌క్యులేషన్స్‌తో ఊరించలేదు. ఆమె వీక్ పాయింట్ మీద కొట్టలేదు.
నెపమంతా అతడి మీద వేయడం కాకపోతే, అతడే ముందు అడగాల్సిన అవసరమేం లేదు. హైదరాబాద్‌కి బెంగళూరు ఎంతో దూరమేమీ కాదు, బస్సు ఎక్కితే ఒక రాత్రి ప్రయాణం, విమానమెక్కితే నాలుగైదు గంటలంతే! ‘అమ్మో… ఒక్కదాన్నే వెళ్ళాలా?’ అన్న భయాలు ఆమెకి లేవు. ‘అబ్బా… క్రికెట్ ఏం చూస్తాంలే బాబూ రోజంతా!’ అన్న అనాసక్తా అంటే, అదీ కాదు. ‘పిచ్చ పనుంది బాబూ, ఇప్పుడు ఆఫీసు ఎట్లా ఎగ్గొట్టడం’ లాంటి మిన్నువిరిగి మీదపడే వంకలూ పుట్టుకురాలేదు.
ఆమెకి తట్టలేదంతే. వెళ్ళొచ్చని, వెళ్ళి మాచ్ చూడచ్చునని, సచిన్… సచిన్… అని చిన్నస్వామి స్టేడియమంతా మారుమ్రోగిపోతుంటే దాంట్లో మునిగితేలచ్చునని, మనసా-వాచా దేవుడిగా భావించే సచిన్‌ని, అన్నీ కలిసొస్తే మనసా-వాచా-కర్మణా దేవుడి స్థానంలోకి ప్రమోట్ కాగలవాణ్ణీ ఒక చోట, ఒకేసారి చూసే అవకాశమిదని ఆమెకి తట్టలేదంతే!
టెస్ట్ మాచ్ మొదలైన రోజు, శనివారం, ఇండియా బాటింగ్‌కి దిగలేదు. అయినా స్టేడియంలో సందడి మామూలుగా లేదు. ‘సచిన్… సచిన్’ అన్న మంత్రోచ్ఛారణ ఆగే ప్రసక్తే లేదు. ఇంకో ఏడాదో, మహా అయితే రెండేళ్ళో- అంత కన్నా ఎక్కువ సచిన్ ఆడడు. ఈ ముక్క ఫాన్స్‌కి, సచిన్‌కీ బాగా తెల్సు కనుకే ప్రతీ క్షణంలో ఆనందాన్ని పిండుకోకుండా ఎవరూ వదలలేదు.
హౌ వజ్ ఇట్? అని టెక్స్ట్ చేయాలనుకోలేదు. ‘సచిన్ మా స్టాండ్ దగ్గరకి రెండుసార్లు వచ్చాడు తెల్సా ఫీల్డింగ్‌కి! వెనక్కి తిరిగి ‘చాలు చాలు’ అని చేతులతో సైగచేసేవరకూ అరిచాం తెల్సా!’ అన్న ఒక్క మాట తప్పించి పావుగంట సేపు ఇంక వేరే దేని గురించీ అతడు మాట్లాడలేదు.
ఆ మెసేజ్‌లు చదివి, ఆమె ఉడుక్కోలేదు. చాకెట్లు, బొమ్మలు అన్నీ వేరే పిల్లాడి దగ్గర చూసిన చిన్నపిల్లలా ‘నాకూ కావాలి!’ అని ఏడవలేదు, పెంకిగా పేచీ పెట్టలేదు. అడల్ట్‌లా ‘వాట్ ది ఫక్! వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్? ఐ షుడ్ బి దేర్… నౌ!’ అనీ హైరానా పడిపోలేదు.
దిస్ ఈజ్ ది గూగ్లీ షి కాన్ట్ రీడ్.
కాలనీలో కుర్రాడు అయ్యుంటే, ‘ఆ ఎమ్.సి.హెచ్.లో ఆఫీసరు వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్ సీటు వచ్చిందట… బెంగళూరులో… నువ్వూ అలా తెచ్చుకోవాలి మరి’ అన్న పోలికలు తప్పేవి కావు. కాలేజ్‌లో సీనియర్ అయ్యుంటే ఒక్కసారైనా కాస్తయినా రాగింగ్ చేయకుండా వదిలిపెట్టుండేవాడు కాడు. ఆఫీస్‌లో కొలీగ్ అయ్యున్నా ‘పిల్లకూన!’ అన్న ఫీలింగ్ ఇచ్చే అవకాశాల్ని వదులుకునేవాడు కాడు.
స్టేడియం బయట టికెట్ల కౌంటర్ దగ్గర ఎంతకీ తరగని క్యూలో నిల్చున్న ఆసామిగా ఎదురయ్యుంటే, లేడీ లాగా వచ్చి క్యూ మొత్తంగా కట్ చేసి నేరుగా టికెట్లు తెచ్చుకుని, అవి దొరక్క అతను తిరిగివెళ్ళిపోతుంటే ‘అయ్యో… ఇంకా టికెట్లు దొరకలేదా, పాపం?!’ అని జాలిపడేది కాదు. ఒకే స్టాండ్‌లో సీట్ అడ్జస్ట్‌మెంట్లు అవసరమై వాళ్ళ గాంగ్ అంతా ఆమెను ముందుకి తోస్తే, ‘ఎక్స్‌క్యూజ్ మీ…’ అని ఎక్కడాలేని దైన్యాన్ని మొహంలో చూపిస్తూ అతని సీట్ మార్పించడానికి జంకేది కాదు.
ఐఐటీ-జీలు, ఎమ్‌సెట్‌లు అని బండకేసి బాదించుకోవడం తప్ప ఇంకోటి తెలియనివాళ్ళు, ఆ మాత్రం కాంపిటీటివ్ స్పిరిట్ లేకుండా, చూపించకుండా ఉండలేరు. కానీ అతడి మీదున్నది ప్రేమో-దోమో-ఇంకేదో అనేది ఇంకా తేలకముందే, ‘నీ సుఖమే నే కోరుకున్నా… నిను వీడి అందుకే వెడుతున్నా’ లాంటి సినిమాస్థాయి త్యాగాల ట్యూన్లు మనసులో ఎందుకు మొదలవుతాయో ఆమెకి అర్థమై చావలేదు.
అర్థం కావడం లేదని నడుస్తున్న లెక్చర్‌ని ఆపి చీట్-షీట్లని గూగుల్ చేయడానికి జీవితమేమీ ఆన్‌లైన్ క్లాస్‌రూమ్ కాదు. జీవితం పాజ్ బటన్‌తో రాదు. ఆమె తన భావోద్వేగాలు విసిరే గూగ్లీలతో తంటాలు పడుతుందని రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియావాళ్ళ మిగిలిన ఐదు వికెట్లు పడకుండా ఉండలేవు. ఆ పైన మనవీ రెండు మూడు స్వాహా చేసేవరకూ వాళ్ళూ ఊరుకోలేదు.
సచిన్ క్రీజ్‌కి రాక తప్పలేదు. ‘వచ్చాడ్రోయ్ మనోడు’ అనే భావనని ఇంకెలా, ఇంతెలా చెప్పాలో తెలీని వివశతలో ఒంటినంతా ఊపేస్తున్న పరవశాన్ని గొంతుల్లో నింపుకుని నింగికెగరేసే కేరింతల కచేరికి భారీ కాంక్రీట్‌తో కట్టిన చిన్నస్వామి స్టేడియం తాళం వేయకుండా ఉండలేకపోయింది.
ఆ పట్టలేని సంబరాన్ని టి.వి.లు పట్టుకోలేవు. సచిన్ మొదటి బాల్ ఆడేవరకూ అన్ని రకాల, వయసుల, వర్గాల, తరాల, ప్రాంతాల, భాషల జనం, ఓ నలభై వేల మంది, ఏకధాటిగా చేసే అల్లరిని మాటల్లో చెప్పలేక కామెంటేటర్లు కవిత్వాల్లోకి దిగలేక ‘అన్‌బిలీవబల్ సీన్స్ హియర్!’ అని మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చెప్పడం తప్పించి ఇంకేం చేయలేరు. ఇట్లాంటి ట్రాన్స్‌మిషన్ లాస్‌లు కూడా ఉంటాయని టెక్నాలజిస్టులు ఊహించి ఉండరు.
సచిన్ ఓ ఇరవై ముప్ఫై బాల్స్ దాటేవరకూ ఆమె స్థిమితంగా కూర్చోలేదు. తన జోన్‌లో ఉన్నాడని, భారీ స్కోర్ చేసే సూచనలు ఉన్నాయని నమ్మకం కుదిరేదాకా కడుపులో అదురు తగ్గలేదు.’మండే, మై ఫుట్! అర్జెంటుగా ఫస్ట్ ఫ్లైట్ టిక్కెట్ ఎప్పుడుందో చూడు’ అని ఆమె మనసు హైపర్ అవ్వలేదు. రెండో రోజు ముగిసేసరికి సచిన్ పేరు పక్కన 44* ఉందంటే, మర్నాటి స్కోర్ బోర్డ్‌లో సెంచరీ ఊహించి ఆమె ఉబ్బితబ్బిబైపోలేదు.
‘చాలు, ఈ జీవితానికిది చాలు.’ అతడి మెసేజ్ రావడం ఆలస్యమవలేదు.
“లేదు కన్నా, రేపు సచిన్ సెంచరీ చేస్తాడు చూడు. నీ కోసం’ అని టైప్ చేసినా పంపలేదు. ‘హాపీ ఫర్ యు’ అని పంపి, ‘గోయింగ్ టుమారో?’ అని సమాధానం ముందే తెలిసిన ప్రశ్న వేయకుండా ఉండలేదు.
‘యెస్. యెస్. యెస్!’
‘హాపీ ఫర్ యు’కి జవాబొస్తుందేమోనని ఆశపడింది కాని, ఊహు… రాదు. తిరిగో ‘థాంక్యూ’ కొట్టలేదు కనుక ఏదో మాటవరసకి అన్న మాటగా కొట్టిపారేశాడనుకోడానికీ లేదు. ‘నువ్వుంటే మజా వచ్చేది’ అని రిప్లయ్ రాలేదు కాబట్టి, అది ‘మిస్ యూ’ లైన్ దాటి ‘లవ్ యూ’లోకి చొరబడుతుందా అని థర్డ్ అంపైర్ దగ్గరకెళ్ళే అవకాశమూ లేదు. ‘యు కెన్ ఆల్వేస్ బి హాపీ ఫర్ మి. ఎనీటైమ్. ఫీల్ ఫ్రీ!’ అన్న భరోసా తప్పించి దాని గైర్‌హాజరీలో మరోటి కనిపించలేదు.
ఆట మూడో రోజు ఆఫీసుకి వెళ్ళలేదు. టి.వి. ముందు నుంచి లేవలేదు. రోజంతా సచిన్ ఔట్ అవ్వలేదు. ఆమెకొచ్చే పింగ్స్ ఆగనే ఆగలేదు. ‘హే, సచిన్ సెంచరీ!’ ‘సెంచరీ ముబారక్ హో’, ఐ యామ్ సో హాపీ ఫర్ యు, గాల్! ఎంజాయ్ మాడి–ఆమెకొచ్చే పింగ్స్ ఆగనే ఆగలేదు. ‘హాపీ ఫర్ మి’ అని ఆమె అనుకోలేదు. అందరికీ జవాబులిచ్చింది కానీ వాటిల్లో ఆమె లేదు. రోజంతా ఆగిన ఆలోచన రొద ఆమెలో రవ్వంత ఓపికనూ మిగల్చలేదు.
మొదటి సెషన్ (ఆట మొదలైన దగ్గరనుంచి లంచ్ బ్రేక్ వరకు): స్టేడియం చేరుకునుంటాడా? అనవసరమైన పనేమైనా వచ్చిపడిందేమో? ట్రాఫిక్ ఉందేమో బాగా? అసలే మండే. పైగా సచిన్ బాటింగ్. వాళ్ళ బాస్ పిల్చి చచ్చాడా ఊరికే దొబ్బడానికి? పార్కింగ్ దొరికిందో లేదో. బైక్ వేసుకుని వెళ్ళుంటే బాగుణ్ణు, కార్ అయితే లేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అంతా కరెక్ట్ టైమ్‌కి రెడీ అయ్యారో లేదో. హోప్ హి డౙ్ నాట్ మిస్!
రెండో సెషన్ (లంచ్ నుంచి టీ బ్రేక్ వరకు): నేనెందుకు లేనక్కడ? ఉంటే ఎంత బాగుండేది! సచిన్ సెంచరీ రన్స్ కొట్టగానే అతడెలా ఎగిరి గెంతేశాడో చూసేదాన్ని. ఈల వేయడం వచ్చన్నాడు. ఎంత గట్టిగా వేసుంటాడో. సచిన్… సచిన్… అని అరిచినప్పుడు ఆ గొంతులో వెర్రి ఆనందం, ఆ కళ్ళల్లో మెరుపు, ఆ… అవును, డాన్స్ వేసుంటాడా? రిజర్వ్‌డ్ ఫెలో… అంతమందిలో వేయడేమోలే… ఏమో, ఇంపాజిబుల్ ఫెలో… ఏమైనా చేస్తాడు…
మూడో సెషన్ (టీ బ్రేక్ నుంచి ఆ రోజుకి ఆట ముగిసేవరకు): 150 కొట్టడానికి సచిన్ 245 బాల్స్ ఆడాడు. అంటే, సా… చిన్… సా… చిన్… అని కనీసం అన్నిసార్లు ఖచ్చితంగా చీర్ చేసుంటాడనేగా అర్థం. ఈపాటికి గొంతు బొంగురు పోయుంటుంది. చలికాలం కూడా మొదలైంది. అసలే సైనస్ ఉంది మనిషికి. సీట్ ఎక్కడ దొరికిందో. నీడపట్టున కూర్చున్నాడో లేదో. ఆ స్టేడియంలో నీళ్ళు, తిండి పడతాయో లేదో… అయ్యో, ఇంటికొచ్చాక ఆఫీస్ పని చేయాలన్న నస లేకుండా ఉంటే బాగుణ్ణు.
ఎనిమిది గంటల సేపు కళ్ళార్పకుండా, బాల్ మిస్ కాకుండా ఒక మాచ్ మొత్తం చూసి కూడా ఒక్క షాట్ కాని, ఒక వికెట్ గానీ గుర్తులేకపోవడం ఆమెకి ఇంతకు ముందెప్పుడూ అనుభవం లేదు. టి.వి. స్క్రీన్ మీద అన్నీ మసకబారిపోయి మాయమైపోయి, స్టాండ్స్‌ని జూమ్ అవుట్ చేసి, ఏదో స్టాండ్‌లో ఏదో మూలన ఉన్న అతణ్ణి పిక్సెల్-మాత్రంగానైనా చూసుకోవాలని, రొదలా వినిపిస్తున్న జనాల నాయిస్‌ని ప్రాసెస్ చేసి అతడి గొంతు మాత్రమే వెలికితీయాలనీ ఏవో అర్థం లేని కోరికలు ఆమెని నిలువనివ్వలేదు.
సచిన్ 191 నాటౌట్ అన్న యూఫోరియా అతడికి హాంగోవర్‌లా దిగలేదు. సచిన్ 191 నాటౌట్‌ని అతడు ప్రత్యక్షంగా చూశాడన్న నషా ఆమెకి నరాల ద్వారా ఎక్కినంత బలంగా ఉంది కాబట్టి దిగే సమస్యే లేదు.
నాలుగో రోజు ఆమె ఆఫీసుకెళ్ళక తప్పలేదు. ఆమెకి క్రిక్ఇన్ఫో.కామ్ తెరిచే వీలు చిక్కలేదు. స్టేడియం నుంచి పర్సనల్ లైవ్ కామెంటరీ చేయడానికి అతడేం ఇబ్బంది పడలేదు: సచిన్ డబుల్ సెంచరీ, ఇండియా ఆలౌట్, వాళ్ళు బాదుడు షురూ, త్రీ డౌన్, మూడు వికెట్స్ తీసి 200+ ఛేజ్ చేయాలి. ఇది మన గేమ్! టుమారో ఈజ్ అవర్స్.
‘టుమారో ఈజ్ అవర్స్.’ ఈ ముక్క చదవగానే దేని గురించి అంటున్నాడో అర్థమైనా, వాళ్ళిద్దరి విషయంలో అంత భరోసాగా అలాంటో మాట అనగలడా అన్న వైపుకి వెళ్ళే ఆలోచనల్ని ఆమె ఆపలేదు. మాచ్ గెలిచే అవకాశమే లేకపోతే దిగులు తప్ప మరోటి ఉండదు. అదే, మాచ్ గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు, ఏమవుతుందోనన్న ఉత్కంఠ ఆటను ప్రేమించేవారిని తినేయకుండా ఉండదు. ప్రేమంటే ఏంటో ప్రేమించినవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు.
తన మనసుని నొక్కి పట్టేసుకుని, అతడు మనసు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయడం ఆమెకి చేతకాలేదు. బాగా ఆడి, మంచి అడ్వాంటేజ్‌లో ఉన్నాక మాచ్ డ్రా అయితే అది మాచ్ లాస్ట్ కన్నా ఎన్నో వేలరెట్లు ఎక్కువ హింసిస్తుందని తెల్సినా, అతడితో డ్రా ఎలా చేయాలో లోకాన్ని అడగక తప్పలేదు.
‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అని ఆమె పుట్టేనాటికే కనుక్కున్న లోకం ‘మనసుకో వలపు’ అనేవరకూ ఆ స్టడీని కొనసాగించలేదు. ‘లవ్ లాస్ట్’ లేదా ‘లవ్ డ్రాన్’–ఆమెకి కనీసం ఆ అవకాశాలూ లేవు. ఇది ‘లవ్ అబాన్‌డన్డ్’ అని లోకం నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా ఆమెకి ఎక్కలేదు. విషయం మొత్తం అర్థమై, లోకం దీన్ని ప్రేమగా పరిగణించడానికి కూడా ఒప్పుకోలేదు.
ఐదో రోజునాటికి పెచ్చులు ఊడొచ్చేంతగా పాడైపోయిన పిచ్ మీద ఆస్ట్రేలియా బిచాణా ఎత్తేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. మనవాళ్ళు కొట్టాల్సిన 200 పరుగులకి పెద్ద కష్టపడలేదు. గెలిచేటప్పటికి సచిన్, ద్రావిడ్ క్రీజ్‌లో ఉండడంతో ఫాన్స్ సంబరాలకి హద్దులూ లేవు. క్రిక్ఇన్ఫోలో కామెంటరీ చదువుతున్న ఆమెకి సచిన్ గర్జనలో చిద్విలాసం, ద్రావిడ్ చిద్విలాసంలో గర్జన కళ్ళముందు కదలాడక మానలేదు. వాటి వెనుక వాళ్ళు పడిన తపన, ప్రయాసల తీవ్రత మాత్రం ఊహకి అందలేదు. ఎంత ఎత్తులెక్కాలంటే (తనలో తాను) అంత లోతులకీ దిగాలన్న సంగతి ఆమెకి అర్థమయీ అవ్వలేదు.
“…thanks to Bangalore for coming out. You guys made the victory sweeter.”
‘నేనున్నా! నేనున్నా ఆ గయ్స్‌లో!’
ఆ మెసేజ్ చూశాక సచిన్ మీదింక ధ్యాస నిలువలేదు. బౌన్సర్‌లా స్వింగ్ అవుతున్న అతని మనసుని అతని గొంతులో పట్టుకోవాలన్న ఆత్రం ఆగలేదు.
‘కాల్?’
‘నాట్ నౌ. గెస్ట్స్ ఉన్నారింట్లో.’
అతి సాధారణమైన విషయంగా ఆ జవాబుగా కనిపించలేదు. ‘చేస్తాడులే కాసేపుండి’ అని లైట్ తీసుకోలేదు. ‘నీ ప్రేమ సక్సెస్ అయ్యుంటే ఇలా జరిగుండేది కాదు. అతడితో మాట్లాడానికి నువ్వు ఆగాల్సిన అవసరముండేది కాదు. అసలు, నువ్వు లేకుండా మాచే చూసుండేవాడు కాడు.’ ఆమె మనసు పెట్టే రంపపు కోత అంతా ఇంతా అయుండేది కాదు.
‘హలో… దేర్? సారీ… లేట్ అయ్యింది, వాళ్ళు వెళ్ళేసరికి…’
సమాధానమివ్వాలనిపించలేదు. గమ్మునుండాలనీ అనిపించలేదు. వెల్లువలా వచ్చిన ఆంగ్రీ ఎమోటికాన్లకి కారణం అతడికి అంతుపట్టలేదు.
అతను వాట్ ది… అని విసుక్కోలేదు. ‘చిన్నా… వాట్స్ బాదరింగ్ యు?’ అనీ కనుక్కోలేదు. విసుగు రాక కాదు. చింత లేక కాదు. ఆ విసుగూ కలతల కలబోతల్లో ఎలాంటి హద్దులు చెరిగిపోతాయోనన్న భయంలో అతను తెగువ చూపించలేదు. ‘ప్రేమెటూ పుట్టదు, కనీసం విసుగయినా పుట్టదా?’ ఆమెకి ఏడుపాగలేదు.
ఇదేదో ఒకసారి జరిగి ఆగిపోయింది కాదు. ఇదేదో ఒక మాచ్ ముచ్చట కాదు. వాళ్ళిద్దరు ఔటూ అవ్వకుండా, రన్నులూ కొట్టకుండా జిడ్డులా క్రీజ్‌ని అంటిపెట్టుకుని ఈ ప్రేమా-కాని-స్నేహమూ-కాని అనఫీషియల్ బెనిఫీషియల్ మాచ్ ఆడ్డం మానలేదు. కథ లూప్‌లో పడిపోయి బయటకి రాలేదు.
‘ఫిజూల్‌కె బాతాఁ నక్కో కరో మియాఁ, కర్నా హై తొ ప్యార్ కర్, వర్నా నికల్’ అని ఆమె అల్టిమేటమ్ ఇచ్చుండచ్చు; ఇవ్వలేదు.
‘సుమ్నె తలె తిన్ బేడమ్మా, హోగ్బిడి… మత్తె వాపస్ బర్బేడి’ అని వదిలించుకుంటూ అతడో దణ్ణం పెట్టుండచ్చు; పెట్టలేదు.
అయినా వెళ్ళిపోడాలూ రాకపోడాలూ మన చేతుల్లో ఉండవు. కాలం గిరాటు వేస్తే మనం ఎక్కడ తేలతామో, అసలు తేలతామో లేదో తెలీదు. ‘నాతో ఉండు, నాతోనే ఉండు’ అన్న స్వార్థం నుంచి ‘ఉండు, ఎక్కడో చోట ఉండు, ఎలాగోలా ఉండు… కానీ ఉండు. ప్లీజ్. ఫర్ మై సేక్’ అనే అభ్యర్థన వరకు చేరుకోవాలంటే ఎన్ని వైతరణులు దాటాలో, ఎన్ని నరకాలు చుట్టి రావాలో ఏ కథల్లోనూ రాసి లేదు.
అందుకే, భగ్నహృదయాలు ఎ.కె.ఎ. బ్రోకెన్ హార్ట్స్‌కి మించిన ఓవర్‌రేటడ్ కాన్సెప్ట్ ఇంకోటి లేదు.
అచ్చంగా పదేళ్ళ తర్వాత…
కోవిడ్ రాకుండా చేతులెలా శుభ్రంగా కడుక్కోవాలో సచిన్ చెప్తుంటే బాట్ పట్టుకోవడం అటుంచి, పొద్దున్నే లేచి వర్కవుట్ చేయాలన్న నియమాన్ని వారం రోజులకన్నా ఎక్కువ పాటించడం చేతకాక సతమతమయ్యే ఆమెకి సచిన్‌ని ఇంత సునాయాసంగా అనుకరించే అవకాశం 2020 తప్ప మరే ఏడాదీ ఇవ్వదు.
బ్లాసమ్స్ పాత పుస్తకాలని వెతుకుతుంటే వాళ్ళిద్దరి చేతులు పొరపాటున తాకి తడబడలేదని, రంగశంకరలో నాటకం చూస్తూ వాళ్ళిద్దరి చేతులూ చీకట్లో పెనవేసుకోలేదని, చౌడయ్య హాల్‌లో కచేరి మధ్యలో ఆమె నిద్రపోతే అతడి భుజమ్మీద వాలలేదని, చిన్నస్వామిలో అందరూ ఆర్సీబికి సపోర్ట్ చేస్తుంటే వీళ్ళిద్దరూ ఎస్ఆరెచ్! అని అరవలేదని, ఒక్క ఇయర్‌ఫోన్ ఇద్దరూ పెట్టుకుని ఎస్.పి.బి పాట వింటూ ఏడ్వలేదని, ఆదత్-సె-మజ్‌బూర్ వర్క్-బిచింగ్ జుగల్బందీ సెషన్స్ లేవని, మంచం మీద తడి టవలు ఉండకుండా చూసుకునే బాధ్యత, ఎట్‌లీస్ట్ ఫర్ వన్స్, మగజాతి మీద పడే అవకాశం లేకుండా పోయిందని…
ఆమె బుర్రలో ఇన్‌ఫైనైట్ వేస్ ఆఫ్ ‘మిస్సింగ్ యూ’కి (అనువాదం: నా నిన్నటి-నేటి-రేపటి అడియాసల శతసహస్ర రూపాలు నువ్వే) కోవిడ్ కూడా లాక్‌డౌన్ విధించలేకపోయింది. బ్లాసమ్స్, రంగశంకర, చౌడయ్య, చిన్నస్వామి ఆమె బుర్రలో సర్దుకోడానికి పెద్ద ఇబ్బంది పడవు. కానీ అతడలా సర్దుకోడు. ఊహల్లోనే అయినా సరే, బొత్తిగా సహకరించడు. ఆమెతో కథలో అందమైన అబద్ధాలకు సుతరామూ ఒప్పుకోడు.
క్రిక్ఇన్ఫో సోషల్ మీడియాలో పెట్టే మాచ్ ఆనివర్సిరీ పోస్టుల్లో ‘బెంగళూరు టెస్ట్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, 2010’ చూడగానే ఆమెకి కథ రాయచ్చునేమోనన్న ఆలోచనేం రాదు. తనలోంచి కథలని వెలికితీసే సర్జికల్ నైపుణ్యం ఆమెకింకా లేదు.
బెంగళూరు గురించి రాయాల్సొచ్చి ఏం రాద్దామన్నా అతడి ఆలోచనల ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి ఎంతకీ ముందుకి కదలదు. జరిగిన కథైతే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ జరగని కథే కాబట్టి రాయడానికేమని సర్దిచెప్పుకున్నాక కష్టమవ్వదు. కాని…
ఆమె తక్కిన కథల్లానే ఇదీ అందరికీ అర్థమయ్యే కథ కాదు. పాఠకులకు ఇందులో ప్రేమ కనిపించదు సరికదా పాలిటిక్స్ కూడా వెతకగలరని ఆమెకు స్ఫురించదు. ఇది ఆమె సొంత కథా, వేలువిడిచిన చుట్టరికమేమైనా ఉందా, అసలేదీ లేకుండా ఇలా గాల్లోంచి పుట్టించి ఇట్లాంటి కథలు రాయడం ఎలా సాధ్యం అని ఆరా తీయకుండా సాటి రచయితలు కూడా ఉండరు.
అతడికి ఈ కథ చేరుకునే అవకాశం లేదు. చేరి, చదివినా, ఆ ఐదు రోజుల్లో తిన్న బిల్ ఎంతైందో, బండిలో పెట్రోల్ రీడింగ్ ఎంతుందో ఇన్నేళ్ళ తర్వాత గుర్తుండే అవకాశం లేనట్టే ఆమెతో మాట్లాడినవీ గుర్తుండే అవకాశం లేదు. ‘అదో ఆ లైన్‌లో నేనే, ఆ మాట నేనే అనుంటాను…’ అని అతడి మనసు నస పెట్టే అవకాశం ఉందో లేదో తెలియదు. ‘ఎహె ఆపు… సచ్ ఎ ప్రెషియస్ మాచ్ ఇట్ వజ్! దానికి ఇలాంటి స్పిన్ ఇవ్వడమనేది అసలు… ఏం రాసింది కదా! షీ ఈజ్ ఇంపాసిబుల్, మాన్. ఫకింగ్ ఇంపాసిబుల్!’ అని అతడు మురిసిపోతాడో లేదో అంతకంటే తెలియదు.
కాని, అతణ్ణి ఆమె రాసినట్టు ఇంకెవ్వరూ రాయలేరు. రాదు, కాదు, లేదు, అంటూ కథంతా చెప్పడం కేవలం మాటలు కాదు.