మహాభారతాన్ని మూడు భాగాలు చేసి వ్యవహరించడం సామాన్యం—ఆదిపంచకము, యుద్ధషట్కము, శాంతిసప్తకము. కాని స్త్రీపర్వంలో యుద్ధం లేదు. యుద్ధానంతర విషాదమే ఉంది. అందుకే కావచ్చు, వావిళ్ళవారు యుద్ధషట్కమనలేదు—ఆరుపర్వాలను ఒకే సంపుటిగా వేసినా, ఆ సంపుటిని ‘యుద్ధపంచకము, స్త్రీపర్వము’ అని వేరు చేసి చెప్పారు.
భారతంలో ఒక్కొకపర్వము ఒక ప్రత్యేకకావ్యమనదగినది, మహాభారతసమగ్రతను సమర్థిస్తూనే. ఇందులోని స్త్రీపర్వం కూడా అటువంటి ప్రతిపత్తికి అర్హమైనదే. అంతేకాదు, ఒక్క మహాభారతంలోనే కాక ప్రపంచంలోని గొప్ప కావ్యాలలో ఒకటిగా దాని విశిష్టతను ప్రత్యేకతను నిలుపుకోగల కావ్యమనవచ్చు ఆ పర్వం. వీరరసప్రధానంగా, యుద్ధవర్ణనబహుళంగా కావ్యాలు అనాదిగా అనేకం వచ్చాయి. నిజానికి కావ్యరచన యీ వీరరసప్రధానంగానే మొదలయిందనవచ్చు, ప్రపంచసాహిత్యమంతటా. శృంగారం వీరరసానికి అంగం. అన్నిభాషలలోనూ ఆదికావ్యాలలో యీ వీరశృంగారరసాల సమ్మేళనమే. కాని భారతంలోని యీ స్త్రీపర్వంలో విజయం లేదు విషాదమే ఉంది. (Triumph and Tragedy లోని విషాదార్థమే ఉన్నది, పూర్వార్థం యుద్ధషట్కం.) అలా అని యీ పర్వం మిగిలిపోయిన ముక్కగా కాక, పూర్ణం సమగ్రమనిపించగల లక్షణాలు కలది. అలా స్వతంత్రంగా ఉంటూనే, మహాభారత ఆద్యంతాలను కలిపి ముడివేయగలదు. అలా మహాభారతార్థాన్ని సమస్తంగా పోషించడం దీని ప్రత్యేకత, విశిష్టత. సాధారణంగా, వీరసప్రధానమైన కావ్యాలు వీరుల గురించి, వారి సాహసం గురించి, మరణించినవారి వీరస్వర్గం గురించి, గెలిచినవాని వైభవవర్ణనతో ఉంటాయి. స్త్రీల భావాలు వారి విషాదం ఆ కావ్యాలలో ప్రధానం కాదు, అవి అప్రధానం కూడా. స్త్రీకి సమాజాలు యిచ్చే అప్రాముఖ్యమే కావ్యాలలోనూ ప్రతిఫలించడం సహజమే. పురుషుడి శృంగారానికే స్త్రీ అనాదిగా వస్తువు, కావ్యవస్తువు. ఇతర రసాలకు స్త్రీ వస్తువు కాదు. ఊహించగలిగిందే. యుద్ధాలలో ఎక్కువ నష్టపోయేది స్త్రీయే. అయినా యుద్ధం స్త్రీల జీవితాలలో కలిగించే విషాదానుభూతి కావ్యవస్తువుగా ప్రపంచంలో ఏ గొప్ప కవీ గ్రహించినట్టు కనిపించదు.
బోదెలేర్ (Baudelaire) కవిత హంస (Le Cygne) దీనికి అపవాదమనవచ్చేమో? అది పరిమాణంలో ఒక మహేతిహాసమో బృహత్కావ్యమో కాకపోవచ్చు. యుద్ధాల ప్రభావం స్త్రీలపై ఎలా ఉంటుంది అన్న దృష్టికోణంనుండి వారి వైధవ్యం, ప్రవాసం, దాస్యం కావ్యవస్తువుగా కదిలించే కవితలు ఎక్కువ లేవు. రాసీన్ (Racine) రాసిన ఫ్రెంచి నాటకం ఆన్ద్రొమాక్ (Andromaque) అటువంటి విషాదనాటకం. అప్పటికి చాలాకాలం ముందు యురిపిడీస్ (Euripides) కూడా ఒక నాటకం రాశాడు కాని, అతడి నాటకాలకు అంత ప్రసిద్ధి లేదు. అదే విషయంగా బోదెలేర్ రాసిన హంసలో కూడా యుద్ధము, స్త్రీవిషాదము ప్రధానవస్తువు. కవిత ప్రారంభమే ‘ఆన్ద్రొమాక్! నీవు గుర్తొస్తున్నావు! (Andromaque, je pense à vous!…)’ అంటూ, ఆన్ద్రొమాక్ కన్నీళ్ళు సుజలాలై తన కవితాసుక్షేత్ర్రాన్ని సస్యశ్యామలం చేశాయి అంటున్నాడు. (A fécondé soudain ma mémoire fertile: Suddenly made fruitful my fertile memory.) యుద్ధాలు ఆమె జీవితాన్ని శోకమయం చేశాయి. ఆ శోకంలోనుండి తన శ్లోకం వచ్చింది అంటున్నాడు బోదెలేర్.
ట్రోయ్ వీరుడు హెక్టర్. అతడి భార్య ఆన్ద్రొమాక్. ఎఖిలీస్ (Achilles) ట్రోయ్ నగరాన్ని జయించినపుడు, కొందరు స్త్రీలను, పిల్లలను తప్ప ఆ నగరాన్ని మొత్తం విధ్వంసం చేశారు స్పార్టన్లు. ఆ స్త్రీలను పిల్లలను బానిసలుగా పంచుకున్నారు గెలిచినవారు. నియోటోలమస్ (Neoptolemus) బానిసలుగా ఆన్ద్రొమాక్, ఆమె కుమారుడు, అతనితో ఎపైరస్ (Epirus) వెళ్ళారు. అతడికి ఆన్ద్రొమాక్ ముగ్గురు కొడుకులను కన్నది. నియోటోలమస్‌ను శత్రువులు చంపిన తరువాత ఆమెను హెక్టర్ తమ్ముడు హెలెనస్ (Helenus) చేసుకున్నాడు. అతడు కూడా చనిపోయిన తరువాత ఆమె తన చిన్న కుమారుడు పెర్గమస్‌తో (Pergamus) స్వస్థలానికి తిరిగి వెళ్ళింది. అప్పుడా స్వస్థలం తన వారెవరూ లేని శూన్యసమాధి. అక్కడ హెక్టర్ సమాధిముందు ఆన్ద్రొమాక్ శోకమూర్తిని వర్ణించాడు:
ఒక మహావీరుడైన పతికౌగిలి నుండి
మహాగర్వి పైరస్ చేతులలో జారిపడిన బలిపశువువు,
శూన్యసమాధివద్ద పరవశవినమితకృశవ్రతవు,
ఒకనాటి హెక్టర్ భార్య, అయ్యో! ఆపై హెలెనస్ ఆలి!
Andromaque, des bras d’un grand époux tombée,
Vil bétail, sous la main du superbe Pyrrhus,
Auprès d’un tombeau vide en extase courbée
Veuve d’Hector, hélas! et femme d’Hélénus!
Andromache, fallen from the embrace of a mighty husband
Into the hands of proud Pyrrhus,
Bowed in ecstasy before an empty tomb,
Widow of Hector, alas! and wife of Helenus!
ఒక్క ఆన్ద్రొమాక్‌నే కాదు, యుద్ధాలలో స్వస్థలాలను పోగొట్టుకున్న ఒక ప్రవాస నీగ్రో స్త్రీని కూడా తలచుకున్నాడు. ఆ నీగ్రో స్త్రీ యుద్ధాలలో అన్నీ పోగొట్టుకున్ల స్త్రీలకందరికి ప్రతినిధి.
చిక్కిశల్యమైన నీగ్రోవనిత గుర్తొస్తోంది,
బురదదారులు తొక్కుతూ, పొగమంచు వెనక
అదృశ్యమైన తన గొప్ప ఆఫ్రికా
కొబ్బరిచెట్లకోసం ఆబగా వెదకుతూ;
Je pense à la négresse, amaigrie et phtisique
Piétinant dans la boue, et cherchant, l’oeil hagard,
Les cocotiers absents de la superbe Afrique
Derrière la muraille immense du brouillard;
I think of the negress, frail and phthisic,
Trampling the mud, and seeking, with a haggard eye,
Behind the immense wall of mist;
The absent coco-palms of superb Africa.
భారతమంతా పగ రగిలినట్లే, పగ అడగించే బోధలు కూడా సాగుతూనే ఉంటాయి. పగ అడగించే సందర్భాలలోను, శోకాపనయనసందర్భాలలోనూ కూడా దేహాల అనిత్యత్వమే బోధవిషయం. భారతంలో భాగమైన భగవద్గీత యుద్ధం చేయడం ధర్మమని, మానడం అధర్మమని చెప్పవలసిన సందర్భంగా చేసిన బోధ. (వాస్తవానికి గీతాబోధ యుద్ధం చేయమనీ కాదు, మానమనీ కాదు. యుద్ధం చేయను అన్న అర్జునుడు చేయననడానికి చెప్పిన కారణాలు సరి అయినవి కావని, ఎందుకు కావో వివరించాడు భగవానుడు. అర్జునుడు నిజానికి యుద్ధం చేయననలేదు, యుద్ధం ‘నా వారితో చేయలేను’ అన్నాడు. భగవానుడు యుద్ధం చేయమన్నది యీ ‘నా’తో (నా వారు, నా కులం, నా మతం-అన్న అభిమానంతో). కనుక భారతం, ముఖ్యంగా భగవద్గీత, పగను పెంచేది, యుద్ధానికి ప్రేరేపించేది అన్న అభిప్రాయం సరి కాదు. భారతంలో ఎక్కువభాగం పగను వదలమని చెప్పే బోధలే ఉన్నాయి, ముఖ్యంగా కౌరవులకు. ధృతరాష్ట్రుడు శ్రద్ధగా వింటాడు, వదిలేస్తాడు. ఆ బోధలకు పురిటిలోనే సంధి. దుర్యోధనుడు ఆ శ్రమకూడా పడడు.
ధృతరాష్ట్రుడికి నిద్రపట్టని జబ్బు. (మోసాలు చేయాలనుకున్నవాడు మెలకువగా ఉండవలె కదా!) నిద్రపట్టనప్పుడల్లా విదురుణ్ణి నిద్రపోనివ్వడు, పిలిపించుకుంటాడు, వేదాంతం వినిపించడానికి. హోమ్ ఫేకల్టీ విదురుడు కాక యింకా అనేక ఋషులు సనత్సుజాతుడితో సహా వచ్చేవారు, ధృతరాష్ట్రుడికి గెస్ట్ ఫేకల్టీ.
స్త్రీపర్వంలో రెండు ఆశ్వాసాలు. రెండు భాగాలు అనవచ్చు. స్థూలంగా, మొదటి భాగం ధృతరాష్ట్రభాగం, రెండవ భాగం తల్లుల, భార్యల భాగం. మొదటి ఆశ్వాసమంతా ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము, పరితాపము, పగ. అన్నిటి కలబోత. ఈ కలబోత అతిసహజం. అనుభవంలోది. ఈ జీవితవాస్తవాన్ని అంత వాస్తవంగానూ వర్ణించారు వ్యాసుడు, తిక్కన కూడా. మహాకవిత్వం భావాలను చెప్పేది కాదు, అనుభవాలను చెప్పేది. స్త్రీపర్వంలోని సన్నివేశం అసామాన్యమైంది. అంత పెద్ద యుద్ధం, అంత మారణహోమం, పశ్చాత్తాపం, పెరుగుతున్న పగ, తీరని శోకం. అన్నిటినీ ఏ మాత్రమూ అసహజత్వం లేకుండా వాస్తవంగా వర్ణించడం ఒక మహాకవి మాత్రమే చేయగలడు. వ్యాసుడు మహర్షి, మహాకవి. తిక్కన కూడా. ఋషిమార్గము రసమార్గము వేరు మార్గాలు అనుకోనవసరం లేదు. నా నృషిః కురుతే కావ్యమ్.
యుద్ధానికి ముందు, యుద్ధంలో యింతమందిని చంపవలెనా అని బాధపడుతున్న అర్జునుడికి కృష్ణుడు, యుద్ధం తరువాత యింతమందిని చంపించానని శోకిస్తున్న ధర్మరాజుకు భీష్ముడు, యీ శోకం అవివేకం అని నిత్యానిత్యవివేకం బోధించారు. స్త్రీపర్వంలో ధృతరాష్ట్రుడికి కూడా ఆ వివేకమే బోధించారు సంజయుడు, విదురుడు, వ్యాసుడు. చివరకు కృష్ణుడు కూడా పాడిందే పాడి వినిపించాడు పాత గీత–‘తత్ర కా పరిదేవనా’ అని తిరిగి ధృతరాష్ట్రుడికి మెత్తగా చీవాట్లయితే పెట్టాడు ‘ఎందరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కలేదు, ఎందుకిప్పుడు ఏడుస్తావు’ అని. అంత దుఃఖంలోనూ పశ్చాత్తాపంలోనూ ధృతరాష్ట్రుడి పగ సెగలు కక్కుతూనే ఉంది. అప్పుడు కూడా అయోమయభీముణ్ణి విరిచి ముక్కలు చేసేటంత పగ ఉంది. ఉండకపోవడం అసహజం. అప్పుడు కృష్ణుడు అన్నాడు ధృతరాష్ట్రుడితో:
నీయవినీతియుంగొడుకుల దుశ్చరితంబునుం దలచి శోకరోషంబులు విడిచి శాంతుండవై యుండుమనిన ఉపేంద్రునకునన్నరేంద్రుండిట్లనియె.
తెలిసితి నీమాటల పుత్రులదెస నెవ్వగలనెల్ల దొఱగి యనుజపు
త్రుల నాకుంబ్రియమొనర్పంగలవారుగ నడచువాడ కంసారాతీ.
పాత తెలుగు సినిమాలలో చివరి సీనులో విలన్ తను చేసిన తప్పుల లిస్టు చదివినట్టు, మారిపోయినట్టు, మారిపోయాడు ధృతరాష్ట్రుడు. కాని, ఆ సినిమాలలో లాగానే, ఆ మార్పు అసహజమని తెలుస్తూనే ఉంటుంది. ఆ అసహజత్వం చెప్పడమే సహజచిత్రణ. ఆ ఆరని పగ, తాత్కాలికమైన మార్పు అన్నీ సహజమే. అందుకే భారతం కావ్యం. అందులోని స్త్రీపర్వమూ స్వతంత్రకావ్యమే.
స్త్రీపర్వంలో పగ పరాకాష్ఠ చేరిన సన్నివేశం ప్రసిద్ధం. ఆ పగను ఊహించిన కృష్ణుడు (పగను ఊహించడానికి పరమాత్ముడే కానక్కరలేదు) ధృతరాష్ట్రుడికి ముందు ఉక్కుభీముణ్ణి ఉంచిన కథ తెలియనివాడుండడు భారతదేశంలో. పగ పగతో ఆరదు, ఎన్నటికీ తీరదు. ఉక్కు తీర్మానాలు కూడా తుక్కు కావలసిందే. ఇదే భారతం తీర్మానం. భారతం చెప్పిన పరిష్కారం ఏమిటి?
ధృతాష్ట్రుడి పరితాపము పశ్చాత్తాపము దాటి స్త్రీపర్వంలోని ఉత్తరార్ధానికి వద్దాం. ఈ ఉత్తరార్ధంలో భారతార్థం అతి సూక్ష్మంగా నిక్షిప్తమయిందనవచ్చు. ఈ ఉత్తరార్ధం గాంధారిది, స్త్రీలది. ధృతరాష్ట్రుడు అయోమయభీముణ్ణి ముక్కలు చేస్తే, గాంధారి ఏకంగా శ్రీకృష్ణుణ్ణే శపించింది ‘నీ యాదవవంశం నిర్వంశమగుగాక’ అని, ‘నీవు కూడా దిక్కులేని చావు చస్తా’వని సాక్షాత్తు భగవానునే రోజులు లెక్కబెట్టుకోమన్నది:
పూని పాతివ్రత్యపుణ్యఫలంబున సంపాదితబైన సారతపము
బలిమి సాధనముగా పలికెదనుత్తమజ్ఞాతుల తమలోన సంగరమున
పొలియజేసితిగాన పొలియుదురన్యోన్యఘాతుకులై భవజ్ఞాతిజనులు
నీవును తప్పక నేడాదిగ ముప్పదారగునేడైన యద్దినముననరయ దిక్కెవ్వరును లేని యగ్గలంపు కుత్సితంపు తెరంగున కూలువాడ
విట్లు మీ వధూజనములునేడ్చువారు పతుల సతుల బంధుల పనవి పనవి. ( స్త్రీ: 2-161)
ముప్పదియారు దినాలు మాత్రమే అని ముహూర్తం పెట్టింది. ‘దిక్కెవ్వరును లేని యగ్గలంపు కుత్సితంబు తెరంగున కూలువాడవు’ అని నూర్గురు కొడుకుల శవాలమధ్య కూర్చుని తన శోకాన్ని అందులో ఎగసిన సెగను పగను వెళ్ళగక్కింది తల్లిగా. అలా ఆమె శపించకపోవడం అసహజం. ఉన్నదున్నట్టు చెప్పింది భారతం. అదే కదా వ్యాసుడన్నది, లోకంలో ఉన్నదే నేను చెబుతాను అని (యదిహాస్తి తదన్యత్ర).
గాంధారి ఎంతైనా స్త్రీ కదా, తల్లి కదా! అభిమన్యుడిని తలచుకొని కూడా పలవించింది. అది దొంగఏడుపు కాదు, ధృతరాష్ట్రుడి ‘అనుజపుత్రుల నాకుంబ్రియమొనర్పంగలవారుగ నడచువాడ’ లాగ. యుద్ధప్రభావం పురుషుడిపై కంటే స్త్రీపై, వారి మనసులపై మరింత గాఢంగా, వారి జీవితాలపై మరింత తీవ్రంగా ఉంటుంది. ధృతరాష్ట్రుడి బాధ తన బాధ. గాంధారిది అందరి స్త్రీల బాధ. గాంధారి శోకంలో ప్రధానాంశం అనిత్యమైన దేహాల గురించే, వాటి నష్టం గురించే. ఒక్కొక్క తల్లి పాత్రలో, పత్ని పాత్రలో ప్రవేశించి గాంధారి వారి బాధలో తను బాధపడుతోంది. అభిమన్యుడి దేహంపై పడి విలపిస్తున్న ఉత్తర శోకంలో గాంధారి తన శోకం చూచుకొన్నది. కృష్ణుడికి చూపిస్తున్నది. (కృష్ణుడికి మేనల్లుడు అభిమన్యుడు!) ‘ఆ ఉత్తరను చూడు ఎట్లా విలపిస్తున్నదో’ అని. ఎలా విలపిస్తున్నది?
దేవలోకంబున నీవిప్పుడెవ్వత దీపారు పలుకలదేర్చి కురులు
పుడుకుచు దగ నన్న పోలె లోలాత్మగా జేయుచున్నాడవు చెలువు నేర్పు
మెరయంగ నచ్చరతెరవలమనమును గలచి యాడుదుగాక యలతి బోదె
యంగనాగోష్ఠి నున్నపుడు నా నడవడి బుద్ధి దలంతె నిన్బొందగాంచి
యారునెలలు వోయె…[నన్నపోలె=నన్ను చేసినట్టే]
ఈ అనిత్యదేహం ఉత్తర శోకానికి ఆత్మ. గాంధారి శోకంలో ఉత్తరతో ఆత్మీయత ఉంది. గెలిచినవారిని ఓడినవారిని ఒకటి చేస్తుంది స్త్రీ శోకం. ఇది గాంధారి శోకంలో ఒక అంశం. కాని, యీ చర్చలో మనం నడుస్తున్నది మరో ముఖ్యాంశం వైపు. అది పురుషార్థసాధనలో దేహాత్మల సమన్వయం. (మహాభారతానికి ఆత్మ ‘దేహం’. ఇహమే దేహం. కామమే ఇహం.) గాంధారి వేదాంతం మాట్లాడడంలేదు. మగవాడు మనసులో లేకున్నా వేదాంతం మాట్లాడుతాడు. స్త్రీ మాత్రమే వాస్తవం మాట్లాడగలదు. ఆ వాస్తవం వైపు, మరో శోకదృశ్యానికి, నడుద్దాం.
సోమదత్తుడి కుమారుడు భూరిశ్రవసుడు. అర్జునుడు భూరిశ్రవసుడి చేయి తెగనరికాడు. తల నరికాడు సాత్యకి. సోమదత్తుడి భార్య, భర్త శవం, కుమారుడి శవం మార్చి మార్చి చూస్తూ శోకిస్తోంది. భూరిశ్రవసుడి తెగిన చేయిని తన తొడపై ఉంచుకొని అతడి భార్య ఒకతె (ఆండ్రురలో నొక్కత యతిరమ్యమూర్తి) యిలా విలపిస్తోంది:
మెలుపారగా బట్టి మొలనూలిమణులు గదల్చుచు దిగుచుచు దగులొనర్చు
చనుగవమీది కల్లన వచ్చి లలితవిమర్దనంబున లజ్జ మరల ద్రోచు
నాభి యూరులు జఘనము మెత్తమెత్తన యొత్తి ముదంబున నుల్లముూన్చు
ననయంబు తిన్నని యనువున గనయంబు ప్రిదులంగ మెలపి సొక్కొదవజేయు
నిక్కరంబు…[ఉల్లము ఊన్చు = ఊయలఊపు, మనసుకు హాయిగొలుపు; సొక్కొదవజేయు నిక్కరంబు, ఈ కరము, యీ చేయి; గనయము = పోకముడి.]
ఈ పద్యం ఆలంకారికులకు పండగ. రసచర్చ, అంగము అంగి, వీటి అంగీకారము–కావలసినంత చర్చ చేసుకున్నారు. కరుణశృంగారరసాల సంఘీభావము, తిక్కన అనితరశిల్పము, వీటిగురించి చాలా చెప్పారు. కాని మనం యిక్కడ పట్టుకోవలసింది అలంకారాలు కాదు. శవాలగుట్టలమధ్య యీ సవివరశృంగారస్మరణ పరమార్థమేమిటి? ఆలంకారికుల ‘మోదముంబొరయ’ రాశాడా తిక్కన యీ వింత పద్యం? తిక్కనను మనం స్మరించవలసింది ఆయన సమగ్రదర్శనానికి. మహాభారత ప్రయోజనానికి అవసరం కానిదేదీ రాయడు. ఈ స్త్రీల శోకంలో వ్యక్తమౌతున్నది ప్రధానంగా దైహికానందం. ఈ దేహాలన్నీ నశించేవే, వాటికోసం శోకించరాదు అన్న వేదాంతం భారతమంతా బలంగానే ఉన్నది. భగవద్గీత కంటే అంతకంటే బలమైన సాక్ష్యం ఏముంటుంది? కాని భగవద్గీత సారం దేహాన్ని నిస్సారం చేయమని, జీవితాలను ఎండగట్టమని ఎంతమాత్రము కాదు. సన్యాసం తీసుకుంటానన్న అర్జునుణ్ణి చీవాట్లు పెట్టాడు భగవానుడు. గీతోపదేశం చావమని కాదు, బతకమని. బతుకును ఎలా సారమయం చేసుకోవాలో చెబుతుంది గీత. గీత నిశ్చితార్థం నిశ్శ్రేయసమే, శంకరుడు తన గీతాభాష్యంలో చెప్పినట్టు. అది నిస్సంశయం. కాని మోక్షం అందరికీ అందనిది. ఏ సాధనవల్ల పొందదగినదీ కాదు. వివాహవ్యవస్థలో, ఏ వ్యవస్థలోనూ, యిమడనిది మోక్షం. అందుకే సన్యాసిని అత్యాశ్రమి అంటారు. ‘ధర్మేచ అర్థేచ కామేచ యేషా నాతిచరితవ్యా, నాతిచరామి’ అని వివాహసమయంలో చెప్పిస్తారు. మోక్షం దీనికి వెలుపలిది, కనుక చేర్చబడదు. (ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ। యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్॥ అన్నది మహాభారతం గురించి వ్యాసుడన్న మాట, భారతంలో నాలుగూ చెప్పబడ్డాయని. వాస్తవమే కదా! గీత, సనత్సుజాతీయము కంటే బలమైన సాక్ష్యం అవసరం లేదు, మోక్షంకూడా అందులో చెప్పబడిందనడానికి.)
గృహస్థాశ్రమికి గీత యిచ్చే ఉపదేశం చావని ఆత్మ గురించి కాదు, చనిపోయే దేహాలను ఎలా సార్థకం చేసుకోవలె అనేదే. అందుకు ప్రధానసాధనం కామం. ధర్మావిరుద్ధమైన కామమే తానని భగవానుడు అన్నాడు గీతలో. పురుషార్థాలలో ప్రధానమైనది కామం. ఆ కామం సువ్యవస్థితమైనపుడే సమాజం సుస్థిరమౌతుంది. సమష్టిలోనే వ్యష్టి పుష్టి. ఈ సమగ్రదర్శనంలో అంతర్భాగంగానే స్త్రీపర్వంలోని యీ పద్యాన్ని (మెలుపారగా) గ్రహించవలె. కామసువ్యవస్థ ఆంధ్రమహాభారత కావ్యవస్తువు. మహాభారతనాటకానికి నాందీశ్లోకం (శ్రీవాణీగిరిజాః) యీ వస్తునిర్దేశమే చేస్తోంది. ఆ నాందీశ్లోకవివరణతో యీ ముచ్చటకు భరతవాక్యం పలుకుదాం.
శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాస్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే.అని సకలభువనరక్షణ ప్రభువులై ఆద్యులైన హరిహరహిరణ్యగర్భపద్మోమావాణీపతుల స్తుతియించి…
శ్రీవాణీగిరిజాః = శ్రీవాణీగిరిజలను (ద్వితీయావిభక్తి ); చిరాయ = చిరాయ అంటే చాలాకాలంగా అని కాదు, అనాదిగా అని. ఎప్పటినుండి, ఎంతకాలంగా అన్న ప్రశ్నకు తావులేదు. సృష్ట్యాదినుండి. సృష్టి ఎప్పుడు మొదలైంది అన్న ప్రశ్న లేదు కనుక. (పద్యం తరువాత వచ్చిన వచనంలో త్రిమూర్తుల క్రమం మారింది. పద్యంలో శ్రీవాణీగిరిజాః, పురుషోత్తమాంబుజభవశ్రీకంధరాః –వచనంలో హరిహరహిరణ్యగర్భులు, పద్మోమావాణీపతులు అయినారు. క్రమం ముఖ్యం కాదు. ముగ్గురు ఒకరే కనుక. వేదాంతేషు యమాహురేకపురుషం (కాళిదాసు విక్రమోర్వశీయం: నాందీ శ్లోకం) అన్న ఏకపురుషుడే. అదే కాళిదాసు వివరించింది కూడా:
నమస్త్రిమూర్తయే తుభ్యం ప్రాక్ సృష్టేః కేవలాత్మనే।
గుణత్రయవిభాగాయ పశ్చాద్భేదముపేయుషే॥(కుమారసంభవం 2.4.)
వేదాంతములయందు, అంటే ఉపనిషత్తులయందు–ప్రాక్ సృష్టే: కేవలాత్మనే, ఆత్మైవేదమగ్ర ఆసీత్ (బృహ. ఉప. 1.4.1)–సృష్టికి పూర్వం కేవలం ఆత్మ ఉండెను. గుణత్రయవిభాగం వలన ముగ్గురుగా కార్యనిర్వహణ చేస్తాడు ఆ ఏకపురుషుడు. అందుకే, త్రిపురుషాస్సంపూజితాః …సురైః. ఇంతకంటే స్పష్టంగా భగవద్గీత చెప్పింది:
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం।
సంభవః సర్వభూతానాం తతో భవతిభారత॥
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః।
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా॥( 14.3-4)
ఈ నాందీశ్లోకంలో, యీ చర్చలో కూడా, కీలకమైన పదం ‘దధతః’. డుధాఞ్ ధారణ పోషణయోః అని ధాతుపాఠం. భర్త అంటే భార్యను పోషించువాడు అని ఒక అర్థం. పోషించడం అతడి ధర్మం. దయాధర్మం అన్న పదానికి అర్థం ప్రేమతో పోషించడం అని అర్థం, వాడి యిష్టం అని కాదు. ఎందుకు కాదు? త్రిమూర్తి ఏకపురుషుడే కాదు, ఏక పురుషస్త్రీమూర్తి. ‘స ఇమమేవాత్మానం ద్వేధాపాయత్ తతః పతిశ్చ పత్నీశ్చాభవతాం… స్త్రియా పూర్యత ( బృహ. ఉప. 1.4.3.)’–స్త్రీ పురుషుడిలో భాగం. స్త్రీతో కలిసి పురుషుడు పూర్ణుడు. స్త్రీ లేక అతడు అపూర్ణుడు. కనుక త్రిమూర్తి ఒక్క మూర్తి. స్త్రీపురుషులు ఒక్క మూర్తి. ఒక్క శివుడే కాదు, త్రిమూర్తి కూడా అర్ధనారీశ్వరుడే. ఏకతత్త్వమే. ఆమె పుష్టి పురుషుడి తుష్టి. భర్త మరో ప్రాణిని పోషించడం మాత్రమే కాదు, ధరిస్తున్నాడు కూడా (ధా = ధారణ). కనుక ఆ తెలివి ఉన్న పురుషుడు చేసే పోషణ దయాధర్మం కాదు. ఆమె అర్ధాంగి అన్న ఎరుక, ఆమె తన అంగం. దధతః అనడంలో కేవలం ‘వారు వారి స్త్రీలను ధరిస్తున్నారు, వారికెంత ప్రేమ’ అని చెప్పడం కాదు. ధరిస్తున్నారు కనుకనే లోకాలను పాలింపగలుగుతున్నారు. ‘లోకానాం స్థితిమావహంత్యవిహతాం’ లోకాల సుస్థిరత వారి నిత్యసంయోగం వలన. వివాహవ్యవస్థే లోకసుస్థిరత (లోకానాం స్థితిమావహంత్యవిహతాం).
పురుషార్థాలలో యీ విధంగా కామం ప్రధానం. సోఽకామయత – అదే వేదాంతం చెబుతున్నది. అది లోకాల క్షాంతి సంవర్ధిని. స్త్రీపర్వంలోని శవాలగుట్టల మధ్య శృంగారస్మరణ లోకక్షాంతికి శాంతికి ఉపలక్షకం. ఈ లోకం ముఖద్వారంపై రాసి ఉంటుంది శ్మశానవాటిక అని. ’శ్మశానే వసంతం’ అని శివాష్టకం. ఆ శ్మశానంలో వసంతం సృష్టించుకోవలె మనిషి. ఒక్క శివుడే కాదు శ్మశానంలో వసించేవాడు, మనమంతా అక్కడే వసిస్తున్నాం. దానిలో వసంతం సృష్టించగలిగింది వివాహం. కనుకనే పురుషోత్తమాంబుజభవశ్రీకంధరులకన్నా ముందు యీ జగన్నాటకంలో శ్రీవాణీగిరిజల రంగస్థలప్రవేశం.
ఆంధ్రమహాభారతం ఫలశ్రుతిలో (శిక్షితచిత్తులార…) పద్యంలో, ఫలం పుణ్యలోకములు చెప్పబడినవి కాని (అక్షయపుణ్యలోకములయందు రమించు నిరామయస్థితిన్), ‘అలోకంబగు పెంజీకటికవ్వల’ శ్రీకైవల్యపదం -మోక్షం- చెప్పలేదు. మిగిలింది ధర్మావిరుద్ధ కామం. అర్థం కామంలో అంతర్భాగమే.
ముగింపుగా ఒక మాట. తాళి ఎగతాళి అయిన యీ కాలంలో వివాహవ్యవస్థ గురించిన మహాభారతసందేశం విలువ ఎంత? విలువలో దోషం కాదది. విలువ తెలుసుకోలేకపోవడంలోని దోషం. విలువను విస్మరించినవాడు పురుషుడు. ఈ నాటి యీ దుర్వ్యవస్థకు ప్రధానకారణం స్త్రీకి వైవాహికబంధంలో ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించలేని పురుషాహంకారం. ఈ నాటి సామాజిక దురవస్థకు బ్రాహ్మణుడు కారణం, అన్నాడు శంకరుడు తన గీతాసంబంధభాష్యంలో. సామాజికవ్యవస్థకు ఆనాటి పదం వర్ణవ్యవస్థ. అంటే ఎవడి విధులు వాడు సక్రమంగా నిర్వర్తించడం. అలా చేయడానికి బ్రాహ్మణుని జీవనవిధానం, అతడి స్వధర్మాచరణ, సత్ప్రవర్తన ఆదర్శాలై సమాజాన్ని నడిపించవలె, అతడు ఆ బాధ్యతవహించవలె. (బ్రాహ్మణత్వస్య హి రక్షణే రక్షితః స్యాత్ వైదికోధర్మః తదధీనత్వాత్ వర్ణాశ్రమభేదానామ్; బ్రహ్మ క్షత్రే పరిపాలయితుం అలమ్; బ్రాహ్మణ (legislative) క్షత్రియులు (executive) పరిపాలనకు చాలుదురు; అని కూడా అన్నాడు అదే సందర్భంలో.)
సామాజిక అవ్యవస్థకు బ్రాహ్మణుడు బాధ్యుడు. అట్లే, వివాహవ్యవస్థ భగ్నం కావడానికి పురుషుడు బాధ్యుడు. కాలం మారిపోయింది అంటాం. మారింది మనిషి. మారింది మనం.