అతడు తెల్లని పత్తిపువ్వుల్లా నవ్వేవాడు
ముదిరిన వడ్ల గింజల్లా నవ్వేవాడు
వానాకాలం ముసురుకు నిండిన
పెద్ద కాలువలా తృప్తిగా నవ్వేవాడు
జోడెద్దుల మధ్య నాగలి భుజానేసుకుని
గర్వంగా నవ్వేవాడు
మట్టిని చంటిబిడ్డలా చంకనేసుకుని
నెలరాజులా నవ్వేవాడు
కల్తీ కొంగలు వాలి
ఏ ఏడుకాయేడు పంటను మేసేసినప్పుడూ
నగరం చుట్టూ ప్రాకిన నల్ల కొండచిలువ
సగం పొలాన్ని మింగేసినప్పుడూ
ఆలి కాటిఖర్చుల కోసం
జోడెద్దుల్ని అమ్ముకోవాల్సొచ్చినప్పుడూ
అతడు నవ్వుతూనే ఉన్నాడు
రైతు కడుపున పుట్టి
రైతుగా బతికి రైతుగానే వెళ్ళిపోవడం
భాగ్యం అనుకున్నాడేమో
నా జ్ఞాపకాల్లోనూ
అతడు నవ్వుతూనే ఉన్నాడు!