చక్కని తండ్రికి చాంగుభళా!

“బోళాశంకరుడిని చేసి అందరూ మా శివయ్యని ఆటపట్టించేవాళ్ళే!”

“ఇంతకీ ఏమైంది అమ్మాయీ?”

“అది కాదు అబ్బాయీ! ఎంత నిందాస్తుతి అయితే మాత్రం ఆయన రూపురేఖలను గేలిచేస్తూ ఎన్నెన్నో పాటలు కదా!”

“రూపురేఖలను కాదుగా ఆహార్యాన్ని మాత్రమే! శరణు కోరితే ఎక్కడెక్కడి వారికో తన ఒంటి పైన ఆశ్రయమిచ్చి అలా కనపడతాడు కానీ! ఆయనకేమి?! అమ్మవారు నలుపు, అయ్యవారు తెలుపు, తెలుసు కదా! ఈ సృష్టి నలుపు తెలుపుల కలయిక అని చెప్పే అర్ధనారీశ్వరతత్వం. మింటి నుండి దూకే గంగమ్మని భరించాడంటే ఎలాంటి దేహధారుఢ్యం, ఎంత ఒత్తైన కేశ సంపదో కదా!”

“నిజమే! విష్ణువేమో అలంకార ప్రియుడు. ఈయనేమో కట్టుకునేది ఏనుగు చర్మం, రాసుకునేది బూడిద పూత. గౌరిని వివాహమాడేందుకు వస్తూ – విష్ణువు అడిగిన మరుక్షణం ఒకే ఒక్కసారి పెళ్ళికొడుకు అలంకరణలోకి మారుతాడుట. ఆ తరువాత ఈయనని చూసి విష్ణువే అసూయపడతాడుట!”

“ఆ విషయం కాళిదాసు కుమారసంభవంలోను, శ్రీనాథుడు హరవిలాసంలోను వ్రాశారుగా! అవును, అదే విషయం నువ్వు కథగా వ్రాయొచ్చుగా! మూలకథని మార్చకుండా కాస్త కల్పనని జోడించి అబ్బాయి అలంకరణకి ప్రాధాన్యతని ఇచ్చి!”

“ఊఁ! నిజమే సుమా! మంచి సలహా! మల్లాది రామకృష్ణశాస్త్రిగారు వ్రాసి, ఘంటసాలగారు పాడిన ఆ యక్షగానం ఓ మారు పెట్టకూడదూ! లోకోన్నత మహోన్నతుని తనయా! అంటూ ఆలోచనలలోకి ఆ గిరికన్య రావాలే కానీ వెనువెంటే ఆ శంకరుడు కూడా విచ్చేస్తాడు కదా!”


ఆనాటి ప్రత్యూష వేళ, ఉషస్సు తొలి వెలుగు రేఖలు ఔషద వృక్షాల లేత చిగుళ్ళను మరింత ఎరుపుచేస్తున్నాయి. ఆ చిరు కెంజాయ వెలుగు ధాటికి ధ్యానంలో వున్న తాపసి రాగివర్ణ జటాజూటం అగ్నిశిఖని మరిపిస్తోంది. కమండలంలో కొత్తనీరు నింపి, పరిసరాలను శుభ్రపరచి, పుష్పాలతో పూజించే ప్రయత్నంలో ఎదుట నిలచివుంది గిరికన్య. అన్యమనస్కినైయున్న ఆమె విశాల నేత్రాలు తేజోవంతమై వెలుగుతున్న పరమశివుడి వదనం పైన చలిస్తున్నాయి. ఆనాడు ప్రత్యేకంగా కల్యాణ సౌగంధికాలను ఏరి తెచ్చింది. వాటి సుగంధ పరిమళాలకి అతడికి ధ్యానభంగం అవుతుందేమోనన్న వెరపు కూడా ఆమెకి అప్పుడే కలిగింది.

ఆ ఘడియల కోసమే ఎదురుచూస్తూ అల్లంత దూరంలో నిలిచివున్న సుమచరుడు అచ్చెరువొందాడు. ఆనాడతడు కూడా పూలబాణాన్ని చివురు గరికలతో, లేమావిపూవులతో మరింక శ్వేతసౌగంధికలతో శ్రద్ధగా అలంకరించాడు. గిరిపుత్రి చేతిలో కూడా ఆ విరులే కనబడి, అన్నీ శుభసూచనలే అనిపించాయి అతగాడికి. కలవరపడుతున్న రతీదేవికి కళ్ళతోనే నచ్చజెప్పాడు. దేవతల తరపున నిలిచి అడిగిన ఇంద్రుడికి మాటిచ్చివున్నాడు. ఆ ఆది దంపతులను తిరిగి ఒక చోటికి చేర్చడమే ఇప్పుడతడి ఏకైక లక్ష్యం. ఇక వెనుకంజ వేసేదిలేదు. ఆ వింటినారిని వీడిన పుష్పశరానికెన్నడూ తిరుగులేదు. అది కలిగించే సమ్మోహనానికి మరింక ఎదురులేదు. అప్పుడూ అదే జరిగింది.

పరమశివుని కనులు విచ్చుకున్నాయి. ఆర్తిగా చూస్తున్న పార్వతి నయనాలతో చూపులు పెనవేసుకున్నాయి. ఆ పద్మనయని ముగ్ధమోహన రూపాన్ని మంత్రముగ్ధుడై చూస్తుండిపోయాడు. లజ్జతో తత్తరపాటుతో ఆమె కనురెప్పలు బరువెక్కినాయి. మోహం కాలాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేసి విఫలమైంది. శంకరుడు తేరుకున్నాడు. మనసు చలించిన కారణం తెలిసీతెలియగానే ముక్కంటి మూడో కన్ను తెరుచుకుంది. వెన్నంటి వున్న రతీదేవిని చూచి గ్రహించుకునేలోపునే జరగాల్సిన విధి జరిగి పోయింది. మన్మథుడు భస్మమై అశరీరుడైనాడు.


పెళ్ళికుమారుడు వచ్చే సమయమాసన్నమైంది. దారి పొడవునా పందిళ్ళతో తోరణాలతో అలంకరించి పూల తీవాచీలు పరిచారు. మన్మథుడి విఫలయత్నం–ఆ పిమ్మట అత్యంత కఠిన తపస్సు చేసి గిరిరాజతనయ శివుడి మనసును గెలుచుకున్న తీరు–ముందే తెలిసివున్న సర్వజనావళి అతగాడిని చూచేందుకు అత్యంత కుతూహలంతో మిద్దెల పైన, మేడల పైన, మరింక దారి పొడుగునా నిలిచి ఎదురుచూడసాగారు. స్వయాన ఆ ఆదిదేవుడే మేనాదేవి, పర్వతరాజులకి అల్లుడు కాబోతున్నాడుట అంటూ బంధుజనం కూడా పెళ్ళికొడుకై తరలివస్తున్న ఆ పరమేశ్వరుడిని చూసేందుకు వేగిరపడసాగారు. అప్పటి అచ్చటి కోలాహలం మిన్నంటినట్లే వుంది, దేవతలు కూడా అత్యంత ఆసక్తితో గగనతలం పైనుండి చూడసాగారు.

మొదట బ్రహ్మదేవుడు ఆయన వెనుక విష్ణుమూర్తి ఆ వెనువెంటే ప్రమథగణాలూ కదలి వచ్చారు. వారి వెనుకగా వస్తున్న రుద్రగణాన్నీ వారి అనాగరిక బాహ్య రూపాలను, చేష్టలను నివ్వెరపోయి చూస్తున్న జనమంతా వారి మధ్యలో నందీశ్వరుడిని అధిరోహించి వస్తున్న ముక్కంటిని చూచి ముక్కున వేలేసుకున్నారు.

ధరించినదా ఏనుగుచర్మము. ఒంటినిండా మరింక బూది పూత. సంస్కారము లేక జడలు గట్టిన కేశపాశములు. ఏనాడు పుట్టినాడో ఎవరికి పుట్టినాడో తెలియదుట! తల్లితండ్రుల సమరక్షణ లేనివాడు పాపం అని సరిబెట్టుకుందామనుకున్నా ధరించిన ఆభరణములు కేవలం పాములే! ఇదేమి పెళ్ళికొడుకమ్మా? చిన్నపిల్ల పార్వతిది తెలియనితనం కావొచ్చు! ఆ హిమరాజెట్లు ఒప్పుకున్నాడు? ఆ తల్లి ఎట్లంగీకరించినది?! అంటూ చూస్తున్న సమస్త జనం గుసగుసలు పోసాగారు. కొందరు నిరాశపడినారు. మరికొందరు కోపగించినారు. ఇంకొందరు నవ్వుకున్నారు.

కాబోయే బావగారిని ముందుగా చూడవలెనన్న కుతూహలంతో వీధి చివరన ఎదురు చూస్తున్న చిన్ని అమ్మాయిలు కొందరు వేగంగా వెనుకకు తిరిగివచ్చారు. పెళ్ళికొడుకు రూపురేఖలను వర్ణించి వర్ణించి ఇతర బంధుజనానికి చేరవేశారు. ఒక నోటికి వంద చెవులుగా వార్త పాకిపోయింది. పెళ్ళికుమారుడిని చూడవలెనన్న వారందరి ఆతృతలో ఇప్పుడు సరికొత్త కుతూహలం వచ్చిచేరింది.


సంప్రదాయ అలంకరణలో సమర్థవంతులైన ఓ ఇరువది మంది పుణ్యవతులను అప్పటికే మేనాదేవి నియమించి వున్నది. అభ్యంగన స్నానానికి, అలంకరణకి కావలసిన వస్తువులు, పట్టువస్త్రములు చేకొని వారంతా పెళ్ళికుమారుని విడిదికి కదలివెళ్ళారు. తీరా వెళ్ళినవారు తీరికూర్చుని ఎదురుచూస్తున్న హరుని సమీపించడానికే వెనుకాడసాగారు. అందచందాలు సరే! యోగ్యుడయిన పురుషునికి రూపురేఖలతో పని యేముంది? ఇక వస్త్రధారణ అంటారా! అది కూడా సరిపెట్టుకొనవచ్చు! కానీ… కానీ… ఆ నాగులేమిటమ్మ? ఎవరు సాహసించి వాటి జోలికి పోగలరు? నీవు ముందు కదులు, నీవెనుకే నేను వస్తానంటూ ఒకరినొకరు తోసుకుంటారేగాని కోరికోరి ఎవరు విషముతో ఆడుకొంటారు?

“తప్పుకోండమ్మా! అబ్బాయిని మమ్మల్ని సింగారించనివ్వండి!” విని అందరూ ఆశ్చర్యంగా వెనుతిరిగి చూసి వస్తున్నవారికి దారినిచ్చారు. ముందుగా కుంకుమ వన్నె చీర ధరించిన ఓ పెద్ద ముత్తైదువు, ఆమె వెనుకే మరో ఆరుగురు ముత్తైదువులు, వారి వెనువెంటే మరో ఇరవైఏడుమంది లలనామణులు కదిలి వచ్చారు. వీరందరిని మునుపెవ్వరూ చూచి వుండలేదు. వారిని చూసి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వడంతో ఖచ్చితంగా పెళ్ళికుమారుని తరుపువారే అని నిర్ధారణ అయింది.

“పెళ్ళికుమార్తె తరపు వారిని నిరాశపరచకూడదు నాయనా! మమ్మల్ని నిన్ను అలంకరింపనివ్వు” అంటూ ముత్తైదువులు అభ్యంగన స్నానానికి కావలసిన వస్తుసామాగ్రితో పెళ్ళికుమారుడిని స్నానశాలకి తరలించారు. మిగిలినవారు అలకరణకు కావలసినవాటిని సమకూర్చుకోసాగారు.

అప్పటికే ఇక్కడ జరుగుతున్న జాప్యం – దానికి గల కారణం – తెలిసి బెంబేలుపడుతూ విడిదికి వచ్చిన మేనాదేవి పెద్ద ముత్తైదువుని జూసి “అమ్మా అరుంధతీ! వచ్చారా తల్లీ!” అంటూ ఆనందం ప్రకటించింది. పిల్లనిమ్మని అడిగిరమ్మని హరుడు అరుంధతిని సప్తఋషులతో పాటు మేనాదేవి హిమవంతుల వద్దకు పంపించి వున్నాడాయే! అరుంధతి పరిచయం చేసిన తక్కిమ ఋషిపత్నులను, చంద్రసతీమణులను పేరు పేరున పలకరించి మేనాదేవి సంతృప్తిగా తిరిగివెళ్ళింది.

హరుని శరీరంపైనున్న ప్రతి నాగుని అరుంధతీదేవి తాకీతాకగానే బంగారు ఆభరణంగా మారి వెండిపళ్ళెంలోకి చేరుకున్నాయి. మెడలోని వాసుకి కంఠాభరణమై, మిగిలిన నాగులన్నీ దండ కడియాలుగాను, చేతి కంకణాలుగాను, చెవి భూషణాలుగాను మారితే వాటి మణులు మణులుగానే మిగిలి మరింత శోభ చేకూర్చాయి.

నలుగులు నలిపి, కురులు శుభ్రపరచి, ఇదే మహదావకాశం అన్నట్లు పోటీలుపడి బిందెలతో నీరుపోస్తూ ముత్తైదువులందరూ తృప్తిగా ఆ మహాదేవునికి అభిషేకాలు చేశారు. సతిని పోగొట్టుకొని విరాగిగా ఎన్నెన్నో క్షేత్రాలు తిరిగి తిరిగీ పిచ్చితండ్రి ఎంత వేతనపడ్డాడోకదా! ఈ రోజుతో ఆ వేదనలన్నీ కొట్టుకునిపోవాలి సుమా! అని అరుంధతి మనసులోనే కోరుకుంది.

స్నానానంతరం పాలమీగడ వర్ణపు దేహఛాయకు మరింత వన్నెతెచ్చే కెంపురంగు అంచున్న పసుపుపచ్చని పట్టువస్త్రము ధరించి అలంకరణ పీట వద్దకు నడచివస్తున్న ఆజానుబాహుడైన కైలాసవాసుని ఇతడతడేనా అన్నట్లు నివ్వెరపడి చూశారు ఆ విడిది మందిరంలోనివారంతా. ఆ పిమ్మట వారి సనసన్నని మాటల ధ్వని క్రమేణా అణగారిపోయి జరుగుతున్నదంతా కళ్ళు విప్పార్చుకుని చూస్తుండిపోయారు.

చంద్రసతీమణులు ఇద్దరుగా ముగ్గురుగా జతపడి ఫాలాక్షుని అలంకరణకు పూనుకున్నారు. తైలమర్దనంతో మెత్తబడి కుంకుళ్ళ ధాటికి శుభ్రపడి సాంబ్రాణి ధూప సెగలకి జలజలా విడివడి హరుని ఒత్తైన కేశసంపద వెన్నుభుజాలను కప్పివేస్తూ కూర్చున్న ఆతగాడి నడుము వంపుదాకా వచ్చివాలింది. నుదిటి పైనుండి దువ్వి కొంత భాగం ఒడిసిపట్టి ఒకరు ముడిచుట్టితే మరొకరు పచ్చని చామంతుల దండని ఆ కొప్పు చుట్టూ తిప్పికట్టారు. దానితో అతడి తీరైన నుదురు, శ్రీకారం వంటి చెవులు, సూదంటురాయంటి నాసిక మరింత స్పష్టమయినాయి. అప్పటివరకు కళ్ళు చిట్లించుకుని చూస్తున్న ఓ వృద్దురాలు “ఎవరన్నారు ఇతడనాదివాడని? ఇరువది ఏళ్ళ కుర్రకుంకవలెనున్నాడు సుమీ ఈ శివయ్య!” అంటూ గొణిగింది. తక్కినవారికి అది నిజమే సుమా అనిపించింది.

తారలిద్దరు కాళ్ళకు లత్తుకను అద్ది పారాణి తీర్చితే మరి నలుగురు సిరిచందనానికి కస్తూరి వంటి పరిమళ ద్రవ్యాలను చేర్చి హరుని మేనికి అలిమారు. పుష్యమి చనువుగా చెంపలకు కేసరిని అద్దింది. కృత్తిక తన కుడిచేతి మూడువేళ్ళని దగ్గరగా చేసి నుదుట వీభూదిని లేలేతగా తీర్చితే, ఫాలమధ్యాన నిలువునా తిలకాన్ని తీర్చి రోహిణి అతగాడిని పెళ్ళికొడుకుని చేసింది. హారమై వేచి చూస్తున్న వాసుకి శివుని మెడపైనుండి జారి విశాల వక్షస్థలం పైకి చేరి వన్నె చేకూర్చాడు. మిగిలిన ఆభరణాలు వాటి వాటి స్థానాలకి చేరుకోవటంతో భుజంగభూషితుడు కాస్తా స్వర్ణాలంకార భూషితుడై వెలుగొందాడు. అప్పటివరకూ ఊపిరి నిలిపి చూస్తున్న పార్వతి చెలులు, సఖులు, బంధువనితలు విడిచిన నిశ్వాసాలతో వాతావరణంలో తిరిగి సందడి నెలకొన్నది.

చుబుకాన్ని ఎత్తిపట్టి, చెంపలను వత్తిపట్టి కాటుక దిద్దుతున్నప్పుడు అరమోడ్చిన ఆ కనురెప్పల అంచులపైన వున్న లేత నీలి వర్ణాన్ని చూసి ఇతడెంత సహజ సౌందర్యవంతుడో కదా! అని భరణి మురిసిపోయింది. కాటుకలు దిద్దిన ఆ నయనాలు కనుకొనలనుండి సాగి కలువరేకులవలే విచ్చుకుని ఆకర్ణాంతములలో సన్నబడి కొత్త సొగసులు సంతరించుకున్నాయి. అప్పటి వరకూ తన పతి సౌందర్యం హెచ్చా మరింక హరునిదా అన్న మీమాంసతో కొట్టుకుంటున్న అశ్వని మనోభావనలో వెలతెలబోతున్న చంద్రుని రూపం వచ్చి నిలిచి ఆమె అనుమానం తీర్చివేసింది.

దగ్గర నిలిచి పర్యవేక్షిస్తున్న అరుంధతీదేవి “అమ్మాయి! దిష్టిచుక్క!” అంటూ ఫల్గుణి చెవిలో సన్నగా గుర్తుచేసింది. కేసరినలదిన ఆ పాల వర్ణపు చెక్కిళ్ళపైన కాటుక చుక్క కుదురుగా అమరింది. మొదటినుండీ అంతా గమనిస్తున్న పార్వతికి వదిన వరుసైన ఓ వనితకి సందేహం కలిగింది. రూపము గానీ స్థితిగతులుగానీ తెలియక మునుపే ఉమాదేవి ఇతగాడిని కోరుకున్న కారణం అంతుచిక్కక ఆమె ఆలోచనలో పడింది.

కాబోయే చిట్టిమరదళ్ళు విడిది విశేషాలన్నీ ఎప్పటికప్పుడు పెళ్ళివారింటికి చేరవేస్తూనే వున్నారు. అవేమీ పట్టని ధరణీధరకన్య ఆనందానికి ఐశ్వర్యానికి మారుపేరులా వుంది. కలహంసలు నేచిన అంచులు కలిగి, బంగారు జరీపూలు కుట్టిన సిందూరవర్ణపు పట్టుచీర కట్టి, కళ్యాణ తిలకము పెట్టి, సౌభాగ్యానికి ఆనవాలుగా వుంది. కులదేవతలకు మ్రొక్కి, పెద్దలకు నమస్కరించి, పతి ప్రేమను పొందమని ఆశ్వీర్వదించిన వారి దీవనలను అందుకుని పెళ్ళిమండపానికి ప్రయాణమైంది.


విచ్చేసిన గరుడ గంధర్వ కిన్నర యక్ష సిద్ధ విద్యాధరా శ్రేణులు, మునివరులు మరియు అశేష జనావళి అన్ని దిక్కుల నుండి వివాహ మహోత్సవం వీక్షించే వీలుగా ఎత్తైన విశాలమైన స్థలములో పెళ్ళిమండపం నిర్మించబడింది. నాలుగు వైపులా నాలుగు ఎతైన స్తంభాలను నిలిపి వాటిని పసిడి ముత్యాలచేత పూలగుత్తులు విరిసిన లతలచేత అలంకరించారు. మామిడి తోరణాలు కట్టారు. పసుపుకుంకుమలతో పూలతో వేదికని తీర్చి నాలుగు వైపుల నుండి మండపాన్ని చేరుకునే వీలుగా సుగంధభరితమైన విరులతో తీవాచీలను పరచారు.

ఈ గడియ దాటితే, ఈ క్షణం కరిగితే తిరిగి చూడగలమో లేదో నన్నట్లు అందరి దృష్టి వివాహ వేదిక పైన నిలిచివున్న హరుని పైనే! అతగాడి చూపు మాత్రం హిమగిరితనయ నడిచి రాబోతున్న దారి పైనే!

మంజీరపు మువ్వలు, వడ్డాణపు చిరుగంటలు లయగా మ్రోగుతుండగా, చెలులు వెంటరాగా అశేషజనుల హర్షద్వానాల మధ్య మందగమనయై పెళ్ళికుమార్తె వేదికపైకి ప్రవేశించింది. అలవాటులేని అలంకరణకో, అప్పటివరకూ అందరి దృష్టి తనపైనే నిలిచివుండటం వల్లో గొప్ప ఇబ్బందికి లోనవుతున్న శంకరుడు తేరుకున్నాడు.

సిగ్గు దొంతరలను పక్కకు నెట్టి పార్వతిదేవి చెలులు అందించిన పూలహారాన్ని ఈశ్వరుని మెడలో అలంకరించింది.

చిరుదరహాసంతో చూస్తున్న ఆమె కనులనిండా అతడి రూపమే! హారాన్ని చేతపట్టి అట్టే చూస్తున్న అతడు కలవరపడ్డాడు. ఆ జవ్వని ముగ్ధమనోహర రూపాన్ని అతగాడు తీరుగా రెండు క్షణాలను మించి చూసిందెప్పుడు?! ఆ విశాల నయనాలలో కానవస్తున్న అతడి పెళ్ళికుమారుడి రూపమే కొత్తగావున్నది కానీ… ఈమె… కొత్తకాదే! తపోదీక్షలో నున్నప్పుడు అత్యంతశ్రద్ధతో సేవలు చేసినదీ ఈమే కదా! అపర్ణగా మారి కఠోర తపస్సుజేసి తన మనసుని గెలుచుకున్నదీ ఈమే కదా! ఇంకెవరు చేయగలరట్లు?! ఉద్వేగభరితమైన మనస్సుతో ‘నాకోసమై తిరిగి వచ్చావా సతీ!’ అనుకున్నాడు.

పాణిగ్రహణ ముహూర్త సమయమైంది. హరుడు తన దక్షిణ హస్తముతో గిరిరాజతనయ వామహస్తాన్ని అందుకున్నాడు. ఆ స్పర్శకి ఆమె తనువు పలికిన ప్రకంపనలు అతడిని కూడా చేరాయి. సతీ వియోగానంతరం హరుని అంతరంగమున దాగివున్న వేదన, ఆగ్రహం, విరహం, వైరాగ్యం అన్నింటినీ హరించివేసింది ఆ స్పర్శ. ఆమె మనసున నిండివున్న ప్రేమ, అనురక్తి, అభిమానం లోలోనకి ప్రవహించి అతడిలో ఆమె సగభాగమై నిలిచినట్లు తోచింది ఈశుడికి.

చేతులు కలిపి, చెంగులు ముడివేసుకుని అగ్నిహోమం చుట్టూ ఆ జంట ఏడు ప్రదక్షిణలు చేశారు. సప్తపది పిమ్మట పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదము తీసుకొమ్మని పురోహితుడు చెప్పగానే, ఆదిదేవుడి చేత నమస్సులు అందుకోగల పెద్దలెవరున్నారు కనుక అని చూస్తున్నవారందరూ కుతూహలపడ్డారు.

పరమశివుడు చిరునవ్వుతో గౌరీసమేతుడై అరుంధతిని సమీపించాడు. ఇద్దరూ చేతులు మోడ్చి ఆమెకు నమస్కరించారు. “ప్రేమకి ప్రతిరూపాలై ఆదర్శదంపతులుగా చరితార్థులు కండి!” అంటూ ఆమె నిండుగా వారిని దీవించింది. స్వయంగా ఆదిదంపతులే ప్రణామాలు చేసిన ఈ తల్లికి ఇకపైన కొత్త జంటల చేత దర్శన నమస్కారాలు చేయించాలని, చూస్తున్న పెద్దలు కొందరు నిర్ణయించుకున్నారు. పిమ్మట పితామహుడైన బ్రహ్మకు నమస్కరించి దీవనలందుకున్నారు. ఇంద్రాది దేవతల విన్నపాలను మన్నించి ఈశ్వరుడు మన్మథుడిని తిరిగి సజీవుడిని జేశాడు.

ఈశ్వరుని చిటికనవేలిని తన వేలితో ముడివేసి కైలాసగిరికి తరలివెళ్తున్న తనయ గౌరీదేవిని చూస్తూ మేనకాహిమవంతులు పొంగిపోయారు. గగనతలము నుండి పూలవాన కురిసింది. యక్షులు మంగళగానం చేస్తుండగా చూస్తున్న సమస్త జనావళీ సాగనంపే ప్రయత్నంలో కొత్త జంటని అనుసరించారు.

బిడియపడి భీష్మించి పెండ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం!
జగమేలు తండ్రికి జయమంగళం!
విరులచే వరునిచే కరము చేకొన జేయు జగమేలు తల్లికి జయమంగళం!
జగమేలు తల్లికి జయమంగళం!
జయ మంగళం! నిత్య శుభ మంగళం!
జయ మంగళం! నిత్య శుభ మంగళం!