విశ్వమహిళా నవల: 10అ. జేన్ ఆస్టిన్ నవలలు

‘You must be the best judge of your own happiness’ అంటుంది జేన్ ఆస్టిన్ (ఎమ్మా, భా.7లో). మనకు ఏది ఆనందం కలిగిస్తుందో మనమే తేల్చుకోవాలి. నిజమే. కానీ అది సాధించడం కంటే ముందు, దాన్ని గుర్తించడం కూడ అంత సులభం కాదు. జేన్ ఆస్టిన్ నవలల్లో స్త్రీపురుషులు తమ ఆనందం ఎక్కడుందో గుర్తించి, దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నమే ప్రధానాంశం. అయితే ఈ సాధనలో వచ్చే అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐశ్వర్యం; రెండోది సాంఘిక హోదా. ఇవి రెండూ స్త్రీపురుషుల అనుబంధాలకు ఎప్పటికప్పుడు అడ్డంకులుగా ఉంటూనే ఉంటాయి. వాటిని నిర్లక్ష్యమైనా చెయ్యాలి; అధిగమించనైనా అధిగమించాలి. ఈ క్రమంలో ఎన్నో జీవిత సత్యాలను గ్రహించడం బోనస్.

19వ శతాబ్ది రెండో దశకం అంటే బ్రిటన్‌లో రీజెన్సీ యుగం. 1811-1820 వరకూ ఉన్న కొద్ది కాలాన్నే రీజెన్సీ యుగం అంటారు. మూడో జార్జి అనారోగ్యం పాలు కాగా, ఆయన కుమారుడు, అందగాడు, యువకుడు, రొమాంటిక్ నాయక లక్షణాలున్నవాడు నాల్గవ జార్జి తాత్కాలికంగా రాజయ్యాడు. అతని కాలం పార్టీలకు, విలాసాలకు, వినోదాలకు, ప్రణయసల్లాపాలకూ పేరుపెట్టింది. అందుకే ఈ యుగంలో వచ్చినవన్నీ రొమాన్సులే. కానీ ఈ తొమ్మిదేళ్ళకే రొమాంటిక్ యుగం పరిమితం కాలేదు. అంతకుముందే కాల్పనికకవులు (వర్డ్స్‌వర్త్, కాలరిడ్జి, విలియమ్ బ్లేక్ వంటి వారు) రొమాంటిక్ యుగానికి నాంది పలికారు. 1820 తర్వాత కూడ ఈ ధోరణి కొనసాగింది. కానీ నాల్గవ జార్జి కాలానికే రీజెన్సీ యుగమని పేరు వచ్చింది. ఈ కాలంలో సుప్రసిద్ధులైన బ్రిటిష్ రచయితలు చారిత్రక కల్పనా నవలలు రాసిన వాల్టర్ స్కాట్, ప్రణయనవలలకు కొత్త అర్థాన్నిచ్చిన జేన్ ఆస్టిన్. కవుల్లో షెల్లీ, బైరన్. విలాసజీవితాలు ఉన్నతహోదాల్లో ఉన్నవారికి, రాచరిక కుటుంబాలవారికే పరిమితమైనా, ఆ విలాసజీవితం నుంచి వచ్చిన ప్రణయేచ్ఛలు, కాల్పనిక ప్రేమబంధాలూ మధ్యతరగతికి కూడ విస్తరించడంతో, రీజెన్సీ యుగంలోని కళలన్నీ రొమాన్సుల చుట్టూ తిరిగాయి. ముఖ్యంగా సాహిత్యంలో కాల్పనిక చారిత్రక నవలలు (historical romances), మధ్యతరగతి ప్రణయనవలలూ రాజ్యమేలిన రోజులవి. ఈ నేపథ్యానికి చెందినవే జేన్ ఆస్టిన్ ఆరు నవలలూ. కానీ అందులో ఆమె ప్రత్యేకత ఆమెదే.

ఆస్టిన్ ధోరణి

స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి (common sense), ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది. ప్రణయనవలలకు అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఈ అవగాహనే జేన్ ఆస్టిన్‌ని అన్ని యుగాలవారికీ ప్రేమపాత్రురాలని చేసింది. దానితో పాటే యువతులు, తమకున్న అనేక కుటుంబ, సామాజిక పరిమితుల దృష్ట్యా ఈ పరిణతిని ఎలా సాధించగలరు? అన్నదాన్ని ఆమె చర్చకు పెట్టింది. ఆస్టిన్ నవలలన్నిటినీ కలిపే సూత్రం 19వ శతాబ్ది బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థలో, ప్రేమ, పెళ్ళి అన్నవి నిరంతరం డబ్బుతో, సామాజిక హోదాతో ముడిపడివుంటాయన్న వాస్తవమే. వాస్తవికతను వదిలి, ఊహాత్మకమైన రొమాన్సులో పడిపోవడం అవివేకమని తన నవలలన్నిటిలో ఆమె చెబుతుంది.

సెన్స్ అండ్ సెన్సిబిలిటీ

జేన్ ఆస్టిన్ నవలల్లో ప్రచురింపబడిన తొలి నవల సెన్స్ అండ్ సెన్సిబిలిటీ. అక్కాచెల్లెళ్ళ పరస్పరవిరుద్ధమైన స్వభావాల రూపేణా వాస్తవం, కల్పనల మధ్య అంతరాన్ని హృద్యంగా చిత్రిస్తుంది. ఇందులో అక్క ఎలినార్ వివేకానికి (సెన్స్‌) ప్రతినిధి అయితే, చెల్లెలు మారియాన్ ఉద్వేగానికి (సెన్సిబిలిటీ) ప్రతినిధి. వీళ్ళిద్దరి జీవితానుభవాలు, అవి నేర్పే గుణపాఠాలు, ప్రేమకు సంపదతో ఉన్న అనివార్యమైన సంబంధం – నవలలో చర్చింపబడతాయి. ఈ నవలలో ముఖ్యమైన అంశాలు రెండు. మొదటిది, ఆడపిల్లలకు స్వేచ్ఛగా ప్రేమించి, అనుభూతులు ప్రకటించే హక్కు లేదన్నది; రెండోది, ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేకపోవడమే వారి అభద్రతకు కారణమన్నది. హెన్రీ డాష్‌వుడ్ అనే మధ్యతరగతి వ్యక్తికి మొదటి భార్యతో ఒక కొడుకు, రెండో భార్య వల్ల ముగ్గురు కూతుళ్ళు. అతని అన్న సంపాదనాపరుడు. అవివాహితుడు. తన అనంతరం ఆస్తి తన తమ్ముడి మొదటి భార్య కుమారుడైన జాన్‌కే వెళ్ళేలా వీలునామా రాస్తాడు. అతని రెండో భార్యకు ముగ్గురు కూతుళ్ళున్నా వాళ్ళకు దమ్మిడీ రాయడు. హెన్రీ హటాత్తుగా చనిపోవడంతో, మొదటి భార్య కొడుకు సవతి చెల్లెళ్ళను ఆదుకుందామని అనుకున్నా అతని భార్య ఫానీ దానికి అడ్డు చెప్పడంతో, అదీకాక, చెల్లెళ్ళకి పంచేస్తే తన కొడుకుకు ఆస్తి మిగలదని తోచడంతో, ఆ పని మానుకుంటాడు. అక్కడినుంచి ఆ ముగ్గురు అక్కచెల్లెళ్ళు తల్లితో కలిసి మరో చోటికి వెళ్ళి తలదాచుకుంటారు. అప్పుడు మొదలయ్యే వారి జీవితాల్లో, షోగ్గాడైన లార్డ్ విల్లోబీ వలలో భావోద్వేగాల మారియాన్ పడిపోవడం, అతను ఆమెను మోసం చెయ్యడం; తను మనసారా ప్రేమించే అన్న బావమరది ఎడ్వర్డ్‌కి ఎలినార్ తన ప్రేమను చెప్పుకోలేని పరిస్థితులేర్పడడం, ఆమె నిత్యం విషాదంలో ఉన్నా, కుటుంబ బాధ్యతలు ఆమె వేదన కంటే ముఖ్యమని భావించడం, ముఖ్యంగా మారియాన్ భావోద్వేగాల వల్ల కలిగే సంఘర్షణలు ఎక్కువ భాగం ఆక్రమిస్తాయి. కొంత కథ నడిచాక, మోసగాడి ప్రేమ నుంచి కోలుకుని వాస్తవం తెలుసుకున్న మరియన్ తనను నిజంగా ప్రేమించిన కల్నల్‌ని వివాహం చేసుకోవడం, ఎలినార్ ఎడ్వర్డ్ సాంఘిక హోదాల ఆటంకాన్ని అధిగమించి వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

19వ శతాబ్ది ఆరంభంలో ఆడపిల్లకు వారసత్వపు హక్కు లేకపోవడం గురించి విరివిగా రాసిన తొలి రచయిత్రి జేన్ ఆస్టినే. ఎప్పుడైతే వారికి ఉపాధి సంపాదించుకునే చదువు, అవకాశాలు లేవో, వాళ్ళు చేయగల ఉద్యోగాలు ఏవీ లేవో, వారు ఆర్థికంగా మరొకరిపై ఆధారపడవలసిందే. దీనికితోడు ఆస్తి హక్కు కూడా లేదు కనక, వారికి డబ్బున్న వరుణ్ణి వెతుక్కోవడం ఒక్కటే జీవితాశయమైపోతుంది. వారి తల్లిదండ్రులకు కూడా సంపన్నుడైన అల్లుణ్ణి వెదుక్కోవడమే పరమార్థమైపోతుంది. ఆస్తిపరులైన అబ్బాయిలను ఆకర్షించడం, చేజిక్కించుకోవడం ఆ ఆడపిల్లల నిత్యకృత్యం. పైపైన చూసినపుడు, ఈ ఆడపిల్లలకు, వారి తల్లులకు పెళ్ళి తప్ప మరో చింత లేదా అనిపిస్తుంది కాని, దానికి కారణం స్త్రీలకు ఏరకమైన ఆర్థిక వనరులు, హక్కులూ లేకపోవడమేనని ఆస్టిన్ స్పష్టం చేస్తుంది. అయితే ఆమె నవలల్లో చిన్న పాత్రలు అలా డబ్బుకోసం రాజీలు పడిపోయినా కథానాయికలు భర్త విషయంలో ఎంత హీనమైన పరిస్థితుల్లోనూ రాజీపడ్డానికి సిద్ధంగా ఉండరు. అటువంటి బలమైన స్త్రీ పాత్రలు ప్రైడ్ అండ్ ప్రెజుడిస్‌లో ఎలిజబెత్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీలో ఎలినార్, పర్సుయేషన్‌లో ఆన్ ఎలియట్. ముఖ్యంగా సెన్స్ అండ్ సెన్సిబిలిటీలో వీలునామాలు, వారసత్వపు హక్కులు వంటి విషయాలపై జరిగే చర్చలు, బ్రిటిష్ సమాజంలోనూ ఆడపిల్లలు ‘గుండెలమీద కుంపటులే’నని, మగపిల్లలు ‘మహారాజులే’నని నిరూపిస్తాయి. మగపిల్లల్లోనూ పెద్దవాడికే అన్ని హక్కులు, వారసత్వాలు. రెండో కొడుక్కి ఆస్తి హక్కులు ఏ మాత్రం ఉండవు. ఇవన్నీ వారి ప్రేమసంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ నవల చెబుతుంది. నవలలో ఒక యువతి ధనికుడి పుత్రుడని మొదట తమ్ముణ్ణి ‘ప్రేమిస్తుంది’. అతనికి ఆస్తి రాదని, అన్నకే వస్తుందనీ తెలియగానే తన ‘ప్రేమ’ను అన్నపై మళ్ళించేసి, అతన్నే పెళ్ళి చేసుకుంటుంది. బ్రిటిష్ భూస్వామ్య సమాజంలో సంపన్నుడైన తండ్రికి పెద్దకొడుకుగా పుట్టడం మాత్రమే అదృష్టం. తక్కిన పిల్లలకు అతను దయతలిస్తే ఇవ్వొచ్చు. కానీ ఇవ్వాలన్న నియమమేమీ లేదు. కుటుంబ సంబంధాలను సంక్లిష్టం చేసే ఈ చట్టపరమైన అంశాన్ని జేన్ ఆస్టిన్ తన నవలలన్నిటిలోనూ తరచుగా ప్రస్తావిస్తూంటుంది.

నార్తాంగర్ ఆబీ

నిజానికి ఆస్టిన్ రాసిన తొలి నవల ఇది. కానీ ప్రచురింపబడింది మాత్రం ఆమె మరణానంతరమే. ఆస్టిన్ ఈ నవలని రెండుమూడు దఫాలుగా రాసి చివరి ప్రతి తయారు చేశాక మరణించింది. ఒక రకంగా ఈనాడు మనం ‘కమింగ్ ఆఫ్ ఏజ్ ‘ సినిమాలని (అమాయకపు బాల్యం నుంచి, సంక్లిష్టమైన యౌవనంలోకి అడుగుపెట్టడం) చెప్పుకునే ధోరణికి చెందిన నవలగా దీన్ని చెప్పవచ్చు. దానితో పాటే ఇందులో ఆనాడు ప్రచారంలో ఉన్న గాథిక్ నవలలపై విమర్శ, వెక్కిరింత ఉన్నాయి. ఆ కాలం నాటి ఆడపిల్లలు కొన్ని నవలలు చదివి (ఇక్కడ ఆన్ రాడ్‍క్లిఫ్ నవలల్ని లక్ష్యంగా ఎంచుకుంది జేన్) చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా అతిగా ఊహించుకుంటారో చెప్పే నవల ఇది. నగరజీవితంలోకి తొలిసారి అడుగుపెట్టిన అమాయకత్వం నుంచి బయటపడడానికి, జీవితానికి, కల్పనాసాహిత్యానికీ ఉన్న తేడాను తెలుసుకోడానికి కథానాయిక కేథరిన్ చేసే ప్రయత్నం ఈ నవలలో ప్రధానం. తనను ప్రేమించిన హెన్రీ గురించి ఏమీ తెలియకుండానే, అతని తల్లిని తండ్రే చంపేశాడని, పైకి పెద్దమనిషిలా కనిపించే అతను లోపల విలన్ అనీ (గాథిక్ హారర్‌లు చదివిన ప్రభావం) ఆమె తన ఊహలకు రెక్కలు తొడిగి తన మనసుకు నచ్చిన హెన్రీని అతని తండ్రిపై అనుమానం కారణంగా దూరంగా ఉంచుతుంది. అసలు అలాంటిదేమీ జరగనేలేదని తెలిశాక, తను చదివిన పుస్తకాలు తనను ఊహాప్రపంచంనుంచి బయటకురాలేని దుస్థితికి ఎలా చేర్చాయో అర్ధమై సిగ్గుపడుతుంది. అయితే భార్యను చంపనప్పటికీ హెన్రీ తండ్రి నిజంగానే దుర్మార్గపు బుద్ధి ఉన్నవాడే. ఒకరకంగా కేథరీన్ తన అమాయకత్వంలో అతన్ని సరిగ్గానే అంచనా వేస్తుంది.

ఈ నవలలో కూడ ఆర్థికకోణం చాలా ముఖ్యం. వివాహానికి అన్నిటికంటే ఆర్థిక సమానహోదాయే ముఖ్యమన్న ఆనాటి ఆలోచనావిధానం ఆస్టిన్ నవలలన్నిటిలాగే ఇందులోనూ కనిపిస్తుంది. కానీ ఈ నవల ప్రత్యేకత, ఆడపిల్లల చదువుకు, వారికి అందుబాటులో ఉండే సాహిత్యానికీ సంబంధించింది. నవలలు ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, రచయితల్లో హిపోక్రసీ ఉండడం ఎంత అన్యాయం వంటి ఆలోచనలు, చర్చలు ఈ నవలలో మెటాఫిక్షన్ లక్షణాలు కూడ ఉన్నాయని నిరూపిస్తాయి.

పర్సుయేషన్

రచయిత్రి వర్జీనియా ఊల్ఫ్ జేన్ ఆస్టిన్ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది: It was strange to think that all the great women of fiction were, until Jane Austen’s day, not only seen by the other sex, but seen only in relation to the other sex (A Room of One’s Own).

జేన్ ఆస్టిన్ తెరపైకి వచ్చేవరకూ స్త్రీలను పురుషుల కోణం నుంచి, పురుషులతో వారికున్న సంబంధాల కోణం నుంచీ మాత్రమే చూడడం నవలల్లో కనిపిస్తుందని వర్జీనియా ఊల్ఫ్ అన్న మాటలు పర్సుయేషన్ నవలపై చేసిన వ్యాఖ్యానమే. ఆస్టిన్ నాయిలందరిలోకీ పరిణతి చెందిన నాయికగా ఈ నవలలొ ఆన్ ఎలియట్ కనిపిస్తుంది. అసలు 40 ఏళ్ళ వయసు గల స్త్రీని నాయికను చేయడమే ఆ రోజుల్లో గొప్ప తిరుగుబాటని చెప్పవచ్చు. అంతకుముందు రాసిన నవలలకంటే ఈ నవల కొంత భిన్నంగా ఉంటుంది. వాస్తవిక చిత్రణకే పేరుపొందిన జేన్ ఈ నవలలో ప్రకృతి చిత్రణపై ఇష్టాన్ని, కాల్పనిక భావజాలాన్ని కొంత ఎక్కువే ప్రదర్శించింది. కథానాయిక ఆన్ ఎలియట్ తరచు అంతర్ముఖురాలై ఉండడం కూడ కొంత రొమాంటిక్ యుగలక్షణమే. అందుకే పర్సుయేషన్ నవలను జేన్ ఆస్టిన్ నవలల్లో ప్రత్యేకమైందిగా కొందరు భావిస్తే, అదే అత్యుత్తమ నవల అని అనుకున్నవాళ్ళూ ఉన్నారు. ఈ నవల జేన్ ఆస్టిన్ తనకు తానే ఇచ్చుకున్న బహుమానమని జేన్ ఆస్టిన్ జీవిత చరిత్ర రాసిన క్లెయ్‍ర్ టమాలిన్ (Claire Tomalin) అంటుంది. జేన్ కూడ, ఆన్ ఎలియట్‌లా తన యుక్తవయస్సులో టామ్‌ని ప్రేమించింది. కానీ ఆర్ధిక కారణాల వల్ల, హోదా ప్రమేయం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. ఈ నవలలో ఆన్, వెంట్‌వర్త్‌లు అలాగే విడిపోతారు. కానీ నవలాంతానికి ఇద్దరూ మళ్ళీ కలుసుకుని తమ ప్రేమను సఫలం చేసుకుంటారు. అలా చేసుకోలేకపోయిన తన దురదృష్టాన్ని స్మరించుకుంటూ ఈ నవలను రచించిందని జేన్ జీవిత చరిత్ర రాసిన క్లెయ్‍ర్ అభిప్రాయం.

ఆన్ ఎలియట్‌ సామాజిక హోదా, అంతస్తు, కెప్టెన్ వెంట్‌వర్త్‌ కంటే ఎక్కువ కనక, ఆమె తల్లిదండ్రులు వాళ్ళ వివాహాన్ని నిరాకరిస్తారు. వారి మాటలను కాదనలేని బలహీనతతో ఆమె అతన్ని తిరస్కరించడంతో నవల ప్రారంభమవుతుంది. తర్వాత అనేక సంఘటనలు జరగడం, ఆన్ ఎలియట్ కుటుంబం ఆర్థిక పరిస్థితి దిగజారడం, అదే సమయంలో వెంట్‌వర్త్‌ సామాజిక హోదా పెరగడం ఇవన్నీ జరుగుతాయి. అనేక సంఘటనల తర్వాత, చివరికి వాళ్ళిద్దరూ తిరిగి తమ ఎంగేజ్‌మెంట్‌ని పునరుద్ధరించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకుముందు ఏ నవలలోనూ సమకాలీన రాజకీయాల ప్రస్తావన చెయ్యని జేన్ ఆస్టిన్ ఇందులో కథానాయకుడు, నెపోలియన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొనడం వల్ల, అక్కడక్కడా బ్రిటిష్, ఫ్రాన్స్ రాజకీయ సంబంధాలను సూచిస్తుంది. జేన్ ఆస్టిన్ నవలల్లో ఆలస్యంగానైనా అందరి ఆదరణకూ, లోతైన విమర్శలకూ నోచుకున్నది ఈ నవలే.

మాన్స్‌ఫీల్డ్ పార్క్

ఇది జేన్ ఆస్టిన్ నవలల్లో కెల్లా బలహీనమైన నవలగా ఎక్కువమంది పరిగణిస్తారు. ఆమె రాసిన మూడో నవల ఇది. నవలానాయిక ఫానీ ప్రైస్ ఆమె నాయికలందరిలోకీ బలహీనురాలే. దానికి కారణం చిన్నప్పుడే తల్లిని కోల్పోయి బంధువుల ఇంట్లో ‘పేదచుట్టం’గా జీవించాల్సిరావడం. తమ మీద ఆధారపడిన ఈ 15 ఏళ్ళ అమ్మాయిని మామయ్య గాని, అతనిపిల్లలు గానీ ప్రేమించరు; ఆదరించరు. ఒక్క రెండో కొడుకు ఎడ్మండ్ మాత్రమే సానుభూతితో చూస్తాడు. ఈ పరిస్థితుల వల్ల కాబోలు ఫానీ ఎక్కువగా మనసులో మాట్లాడుకుంటుందే తప్ప, బయట ధైర్యాన్ని, నిశ్చయాన్నీ ప్రకటించదు (ఇతర జేన్ నాయికల్లా). కానీ నిజానికి మగవాళ్ళ స్వభావాన్ని అంచనా వేయడంలో ఆమె ప్రతిభ ఏమీ తక్కువకాదు. మామయ్య కూతురిని బుట్టలో వేసుకుంటున్న హెన్రీ కపటత్వాన్ని గుర్తించేది ఆమె ఒక్కతే. అలాగే ఎడ్మండ్ మరియా ప్రేమలో పడుతూండడం చూసి, ఆమె అతని ప్రేమకు అర్హురాలు కాదని, అతన్ని మోసం చేస్తుందనీ ఊహించేది కూడ ఫానీయే. చివరకు అలాగే జరుగుతుంది కూడ. నవలాంతానికి, ఎడ్మండ్ ఫానీలోని మంచి గుణాలను, తెలివితేటలను గుర్తించి, ఆమెను వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం. జేన్ ఆస్టిన్ నవలల్లో ‘ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని నవల’గా మిగిలిపోయిన రచన ఇది.

కానీ ఒక కోణం నుంచి చూస్తే ఆనాటి ‘నైతిక విలువలకు’ ఉదాహరణగా నిలిచే నవలగా దీన్ని చెప్పవచ్చు. ఫానీతో సహా, ఆమె కజిన్ కుటుంబమంతా నాటకం వేద్దామని అనుకున్నపుడు, కథానాయకుడైన ఎడ్మండ్ తన చెల్లెలు నాటకాల్లో వేయడం తనకిష్టం లేదంటాడు. ఆడపిల్లలు నాటకాల్లో పాల్గొనకూడదన్న ఆనాటి సంప్రదాయభావజాలమే అతనిలోనూ కనిపిస్తుంది. నవలంతటా ప్రేమకు, నీతికి ఉన్న సంబంధం, నైతిక విలువలు ప్రేమకంటే ముఖ్యమన్న భావన, ఎవరు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలన్న చర్చలన్నీ నీతి చుట్టూ తిరగడం, దీన్ని పూర్తిగా ‘నీతిగ్రంథం’గా చేసేశాయని అనిపిస్తుంది. తక్కిన నవలల్లో మానవస్వభావంలోను, సంబంధాల్లోనూ ఉన్న సంక్లిష్టతలని చక్కగా చిత్రించిన జేన్ ఆస్టిన్ ఈ నవలలో కొంత ‘ఓవర్ సింప్లిఫికేషన్’కు పాల్పడిందేమో అనిపిస్తుంది.

ఎమ్మా

‘I am going to take a heroine whom no one but myself will much like’ అంది జేన్ ఆస్టిన్ ఈ నవలకు ముందుమాటలో. కానీ 1815లో రాసిన ఈ నవలను ఈ శతాబ్దంలోనూ సినిమాగా తీస్తున్నారంటే ఈ నవల, అందులో ఎమ్మా వుడ్‌హౌస్ పాత్ర పాఠకులను ఎంతగా కట్టిపడేశాయో అర్ధమవుతుంది. ఆస్టిన్ నవలల్లో పాత్ర చిత్రణ ఎంత బాగున్నా, వాటిలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ ఎమ్మా దానికి అపవాదం. ఇది పూర్తిగా పాత్ర ప్రధానమైన నవల. ఇందులో ఎమ్మా పాత్ర విలక్షణమైంది. ధనవంతురాలు, అందగత్తె, తెలివైనది; గారాబంగా పెరిగింది; జగమొండి. ఇతర ఆస్టిన్ నాయికల్లా ఆర్ధికంగా ఎవరిమీదా ఆధారపడే అవసరంలేని అదృష్టవంతురాలు. తనకే అంతా తెలుసునన్న భ్రాంతిలో ఉంటుంది. ఈ భ్రాంతివల్లే తన గవర్నెస్‌కు తనే సంబంధం కుదిర్చి పెళ్ళి చేస్తుంది. తనకు ‘పెళ్ళిళ్ళ పేరమ్మ’గా అనితరసాధ్యమైన ప్రతిభ ఉందని నిర్ణయించుకుంటుంది. కొత్తగా పరిచయమైన అమ్మాయి హారియట్‌ని తన శిష్యురాలిగా చేసుకుని, ఆ అమ్మాయి పెళ్ళి నిర్ణయం తన నెత్తిన వేసుకుంటుంది. ఒక బీద రైతును ప్రేమిస్తున్న హారియట్‌కి అది అవివేకమని చెప్పి, మరో ధనిక యువకుడిని ప్రేమించమని ఆదేశిస్తుంది. ఎమ్మా వంటి హోదా, డబ్బుగల మహిళ తనను పట్టించుకున్నందుకే ఉబ్బి తబ్బిబ్బయిన హారియట్ ఆమె మాటలు అక్షరాలా పాటిస్తుంది. నవలలో ఎమ్మా వ్యవహారశైలిని అనుక్షణం విమర్శించే వ్యక్తి ఆమె అక్క బావగారైన నైట్లీ. ఎమ్మాకు, ఇతరుల ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చవద్దని, పెళ్ళళ్ళు చేయవద్దనీ చెప్పడానికి విఫలయత్నం చేస్తాడు నైట్లీ. హారియట్‌ను ఆమెను నిజంగా ప్రేమిస్తున్న రైతునే పెళ్ళి చేసుకోనివ్వమని ఎంతో చెప్పి చూస్తాడు కానీ ఎమ్మా ఒప్పుకోదు. చివరకి ఎమ్మా చూసిన ‘ధనిక యువకుల’ సంబంధాలన్నీ విఫలమవుతాయి. కానీ ఓటమిని ఒప్పుకోవడం ఇష్టంలేక హారియట్‌ని ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగినపుడు, ఆమె అమాయకంగా ‘మిస్టర్ నైట్లీ’ అని చెబుతుంది. ఆమె అలా చెప్పేవరకూ తనే మిస్టర్ నైట్లీని ప్రేమిస్తున్నట్టు ఎమ్మా గ్రహించదు. ఏ అమ్మాయినైతే తను పెద్దరికంతో చేరదీసి, పెళ్ళి చేసి జీవితంలో స్థిరపరచాలని అనుకుందో ఆ అమ్మాయి తను ప్రేమిస్తున్న వ్యక్తినే కోరుకోవడం ఐరనీ. చివరికి, ఎప్పటినుంచో ఎమ్మాని ప్రేమిస్తూ, ఆమెకు ఆ విషయం చెప్పడం వల్ల ప్రయోజనంలేదని తన ఇష్టాన్ని దాచుకున్న నైట్లీ ఇక తన మనసులో మాట చెప్పడంతో కథ క్లయిమాక్స్‌కి చేరుతుంది. హారియట్ కోసం అప్పటివరకూ వివాహం చేసుకోకుండా ఎదురుచూస్తున్న రైతు రాబర్ట్ మార్టిన్‌నే హారియట్ వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

ఎమ్మా, జేన్ సృష్టించిన మరే నాయికవంటిదీ కాదు. మితిమీరిన ఆత్మ విశ్వాసం, అందరి జీవితాలను తను సరిదిద్దగలనన్న అతిశయం, తనలా చదువు, తెలివితేటలు లేనివాళ్ళ పట్ల నిరసనభావం, తను ప్రేమిస్తున్నానని భ్రమపడిన ఫ్రాంక్, పేదపిల్ల అయిన జేన్ ఫెయిర్‌ఫాక్స్‌ని ప్రేమించడాన్ని భరించలేకపోయిన అసహనం ఆ పాత్రలో నెగటివ్ లక్షణాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మా బ్రిటిష్ పరిభాషలో ‘స్నాబ్’. ఆమెకు భయపడో, గౌరవంతోనో అందరూ ఆమెతో ఏకీభవిస్తూంటారు, ఒక్క మిస్టర్ నైట్లీ తప్ప. ఎమ్మాను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ, ఆమె ఆలోచనాధోరణి తప్పని చెప్పే సాహసం అతనొక్కడే చేస్తాడు. జేన్ ఆస్టిన్ ఇతర నవలల్లోలా ఇందులో కథంటూ ఏమీ లేదు. సంఘటనలూ తక్కువే. ఇంతకుముందే చెప్పినట్టు పూర్తిగా పాత్రవల్ల నడిచే రచన ఇది. ఎమ్మా దృష్టికోణం నుంచి కథంతా చెప్పడం జేన్ ఆస్టిన్ సాధించిన నవ్యత. ఉత్తమ పురుష కథనం, లేదా సర్వజ్ఞదృక్కోణం మాత్రమే చెల్లుబాటవుతున్న కాలంలో నాయికకు సర్వజ్ఞత ఆపాదించి ఆమె చూపుతో కథను చెప్పడం ఆస్టిన్ సాధించిన నవ్యత. ఇంకా విశేషం – ఆ నాయిక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన స్త్రీ కాదు. లోపభూయిష్టమైన స్వభావం కలది. అటువంటి నాయిక చేత కథను చెప్పిస్తూ కూడ ఆమెలోని లోపాలు పాఠకుడికి అర్ధమయ్యేలా చేయడం ద్వారా ఆస్టిన్ నవలా రచనకే కొత్త గౌరవాన్ని తీసుకువచ్చింది. అందుకే జేన్ ఆస్టిన్ నవలాప్రక్రియకు కొత్త రూపాన్నిచ్చిందని విమర్శకులు భావించారు. నవల చివర్లో, తనకు నైట్లీ మీద ప్రేమ ఉందని గ్రహించిన ఎమ్మా, తనే ఊహించని ఈ ‘జ్ఞానంతో’ పొందే ఆరాటం గొప్పగా ఉంటుంది. మొదటిసారిగా, పన్నాగాలు, పథకాలు, కుతంత్రాలు లేకుండా కేవలం భావోద్వేగంతో స్పందిస్తుంది. ఎమ్మాలో వచ్చిన ఈ మార్పును, తను ఎక్కడా జొరపడకుండా, ఎమ్మా ఆలోచనలద్వారానే చూపించడంలోనే ఆస్టిన్ రచనాకళ దాగివుంది. ఎమ్మా నవలను విశ్లేషించడం కంటే చదవడం గొప్ప అనుభవం. ఒక్కసారి చదివితే అందులోని అందాలు అర్థం కావు. పదే పదే చదవాల్సిన నవల ఇది.

ప్రైడ్ అండ్ ప్రెజుడిస్

బహుశా జేన్ ఆస్టిన్ నవలల్లోనే కాక, మొత్తం ఇంగ్లీషు నవలల్లోనే తొలి వరసలో నిలిచే నవల ప్రైడ్ అండ్ ప్రెజుడీస్. అందం, పౌరుషం, ఆత్మవిశ్వాసం, ఖచ్చితమైన అభిప్రాయాలు, మంచితనం కలగలిసిన అపూర్వమైన యువతి ఎలిజబెత్ బెనెట్, ఐశ్వర్యం, అహంభావం, ఔదార్యం, దాపరికం కలగలిసిన అపురూపమైన యువకుడు డార్సీల ప్రేమ కథ ఇది. వారికి సమాంతరంగా, అమాయకత్వం, మంచితనం, కొంత జంకు, అధైర్యం ఉన్న మరో జంట జేన్, బింగ్లీలు. ఈ నలుగురి ప్రణయంలో వచ్చే ఆటుపోట్లు సున్నితంగా, సుందరంగా తీర్చిదిద్దిన నవల ఇది. ఇందులో ఎలిజబెత్‌ని చూసినపుడు యద్దనపూడి సులోచనారాణి నాయికలు జయంతి, రోజా, మీనా తప్పక గుర్తుకు వస్తారు.

మిస్టర్ బెనెట్‌కు అయిదుగురు కూతుళ్ళు. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి మగపిల్లవాడికే దక్కాలి. కొడుకులు లేరు కనక ఈ అయిదుగురికీ చిల్లిగవ్వ రాదు. కనక వాళ్ళలో ఒక పిల్లయినా ధనవంతుణ్ణి చేసుకుంటే, తక్కిన అక్కచెల్లెళ్ళను కొంత ఆదుకోగలుగుతుంది. అందుకని కథారంభం నుంచి ఊళ్ళోకి ఏ ధనికయువకుడు వస్తాడా, తన కూతుళ్ళను ఎర వేద్దామా అని చూస్తూంటుంది అతని భార్య. మిస్టర్ బెనెట్‌కు అలాంటి కోరికలేమీ లేవు. ఆడపిల్లల తండ్రికి ఉండాల్సిన కంగారు, భయం, అణకువ కూడ ఆయనలో మృగ్యం. భార్య పడే పాట్లు చూసి వెక్కిరిస్తూంటాడు. తన కుమార్తెలు డబ్బుకోసం వివాహం చేసుకోవాలన్న ఆలోచనే అతనికి నచ్చదు. ఆ అమ్మాయిలు జేన్, ఎలిజబెత్, మేరీ, కిట్టీ, లిడియా. నవలా నాయిక ఎలిజబెత్ అయితే, సహనాయిక జేన్. వీళ్ళ జీవితాల్లోకి ఆస్తికి వారసుడైన బెనెట్ కజిన్ విలియమ్ కాలిన్స్ రావడం, అతను ఈ అయిదుగురిలో ఒకర్ని వివాహం చేసుకోవాలని అనుకోవడం, ఎలిజబెత్‌ని కోరుకోగా ఆమె తిరస్కరించడం – దీనితో కథ మలుపు తిరుగుతుంది. ఆ తొలి సన్నివేశంలోనే ఎలిజబెత్ తను ఆస్తికోసం వివాహం చేసుకోనని, ప్రేమ ఒక్కటే పెళ్ళికి అవసరమైన అర్హత అనీ అంటుంది. తల్లికి ఈ ధోరణి ఏ మాత్రం నచ్చకపోగా, తండ్రి కూతుర్ని అభినందిస్తాడు.

ఎలిజబెత్, జేన్‌లకు మిస్టర్ బింగ్లీ, మిస్టర్ డార్సీలు ఒక పార్టీలో (ఆ రోజుల్లో బాల్ అనేవాళ్ళు) పరిచయమవుతారు. అహంభావిగా చూడగానే తోచే డార్సీ మీద అయిష్టం ఏర్పడుతుంది ఎలిజబెత్‌కి. దానికితోడు, ఆమెతో డాన్స్ చెయ్యడానికి అతను నిరాకరించడం, ఆమె తనకు ఏ మాత్రం ఆకర్షణీయంగా కనిపించలేదని అనడం ఎలిజబెత్ అయిష్టాన్ని మరింత పెంచుతాయి. క్రమంగా, డార్సీ గురించి అతని కజిన్ వికమ్ చెప్పిన అబద్ధాలు, తన అక్క జేన్ పెళ్ళి బింగ్లీతో నిశ్చయం కాకపోవడానికి డార్సీయే కారణమని తెలియడం – ఇవన్నీ కలిసి ఎలిజబెత్‌ని అతని పట్ల ద్వేషం పెంచుకునేలా చేస్తాయి. కానీ ఎలిజబెత్‌ని తొలిసారి అవమానించిన డార్సీ క్రమంగా ఆమె వ్యక్తిత్వంతో ఆకర్షితుడై, తన ప్రేమను ప్రకటిస్తాడు. ఎలిజబెత్ తిరస్కరిస్తుంది. ఆ తర్వాత జరిగే అనేక సంఘటనల ద్వారా డార్సీ ఎంత ఉదారుడో, ఎంతమందిని రక్షించాడో, తన గొప్పలు చెప్పుకోవడం గాని, మనసులో మాట పంచుకోవడం గానీ అలవాటు లేక ఎలా అపార్థాలకు తావిచ్చాడో అర్థమై, ఎలిజబెత్ అతని పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. ముఖ్యంగా తన చెల్లెలు లిడియా, తాత్కాలిక ఆకర్షణలో వికమ్‌తో లేచిపోయినపుడు, ఇంటికి అప్రతిష్ట రాకుండా కాపాడ్డంకోసం డార్సీ దగ్గరుండి, వాళ్ళిద్దరికీ వివాహం జరిపించి తీసుకురావడంతో ఆమెకు అతని పట్ల కృతజ్ఞత ఏర్పడుతుంది. చివరకు అందరికీ అన్ని అపార్థాలూ తొలిగి జేన్ బింగ్లీని, ఎలిజబెత్ డార్సీని వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఎలిజబెత్ అకారణ అయిష్టం (ప్రెజుడీస్), డార్సీ అహం (ప్రైడ్) కథాగమనానికి కారణభూతాలవుతాయి కనక నవలకు ఈ శీర్షిక బాగా నప్పింది.

అందమైన, వ్యక్తిత్వం కలిగిన నాయికా నాయకులు, వారి మధ్య అపార్థాలు, అపురూపమైన సంభాషణలు, భావోద్వేగాలను తెలిపే వారి ఆలోచనలు – చక్కని ప్రణయనవలకు సరైన దినుసులు ఇవేనని తొలిసారి చూపించిన నవల ఇది. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా దీనికి నకళ్ళు చాలానే వచ్చాయి. కథల్లో మార్పు ఉండవచ్చు గానీ పాత్రల్లో ఎలిజబెత్, డార్సీ, మంచి ప్రణయనవలలకి ప్రొటొటైప్‌లుగా మిగిలిపోయారు.

ఇంతకూ ఈ ఆరు నవలల్లోనూ ఈనాటికీ పాఠకులను ఆకర్షిస్తున్న అంశాలేమిటి? ప్రణయభావనలను అత్యంత సున్నితంగా, పరిణతితో, ఏకకాలంలో పఠితలకు ఉద్వేగాన్ని, ఆలోచననూ కూడ కలిగించే సంభాషణలతో ఆమె రాసిన పద్ధతి. అలాగే, బ్రిటిష్ రీజెన్సీ యుగంలో కుటుంబంలోను, సమాజంలోనూ ఉన్న అసమానతలను ఢంకా భజాయించి చెప్పకుండా, ప్రేమకథల మాటున నిశితంగా విమర్శించడం. బ్రిటిష్, ఫ్రెంచి దేశాల మధ్య ఉన్న సంఘర్షణను పూసల్లో దారంలా చూపించడం; ఐరిష్‌వారి పట్ల బ్రిటన్‌లో ఉన్న అవహేళనను, ఐర్లండ్ ప్రజల అసంతృప్తిని సూచించడం – ఇవన్నీ చేస్తున్నట్టు కనిపించకుండా చేయడం ఆమె ప్రత్యేకత. అప్పటి నవలల్లో ప్రత్యక్ష సంవాదాలే ఎక్కువ. మొదటిసారిగా వాటి స్థానంలో పరోక్ష సంభాషణలు ప్రవేశపెట్టి (indirect speech) ఆ విధమైన రచనకు అసాధారణమైన కళాత్మకతను సాధించడం ఆమె విలక్షణత. ఈ కళాత్మకతకు ఆమె అనుసరించిన భాషావ్యూహం ఐరనీ. ఆయా సంభాషణల్లోని అంతరార్థాల ద్వారా, ఛలోక్తుల ద్వారా ఆమె ఎంత గంభీరమైన విషయాన్నయినా ఆటపట్టించగలదు; ఎంత విషాదాన్నయినా హాస్యంగా మార్చగలదు. ఈ అనుభవం కోసం ఆమె రచనల్ని చదవాల్సిందే కానీ విశ్లేషించడం, అనువదించడం సాధ్యం కాదు.

తెరపై జేన్ ఆస్టిన్

ఆస్టిన్ నవలలన్నీ చిత్రాలుగా, టీవీ సీరియళ్ళుగా వచ్చాయి. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ నాలుగుసార్లు, ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ 12 సార్లు తెరమీద వచ్చాయి. ఇంగ్లీషులోనే కాక, టర్కీ, జపనీస్, హిందీ, తమిళ భాషల్లోనూ వచ్చాయి. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ మమ్ముట్టి నాయకుడిగా, తబు, ఐశ్వర్య నాయికలుగా తమిళంలో వచ్చింది. అలాగే ఎమ్మా, ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ హిందీలో వచ్చాయి. పాప్యులర్ కల్చర్‌లో జేన్ ఆస్టిన్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆమె రచనల గురించి ఎంత రాసినా, ఆమె నవలను చదివిన అనుభూతిలో ఇసుమంతైనా చెప్పలేం.

జేన్ ఆస్టిన్ రచనల నుంచి ఉల్లేఖించడం మొదలుపెడితే ఆపలేం. అంత గొప్ప వాక్యాలుంటాయి. హాస్యం, వివేకం కలగలిసిన గొప్ప రచన ఆమెది. మచ్చుకి కొన్ని:

– It is a truth universally acknowledged, that a single man in possession of a good fortune, must be in want of a wife (Pride and Prejudice).

– If I loved you less, I might be able to talk about it more (Emma).

– The more I know of the world, the more I am convinced that I shall never see a man whom I can really love. I require so much! (Sense and Sensibility).

– Laugh as much as you choose, but you will not laugh me out of my opinion.
– I have not the pleasure of understanding you. Pride and Prejudice

– I may have lost my heart, but not my self-control (Emma).

– I could easily forgive his pride, if he had not mortified mine (Pride and Prejudice).

– Selfishness must always be forgiven you know, because there is no hope of a cure (Mansfield Park).

అక్క కసాంద్రాకు రాసిన లేఖలో అంటుంది:

– I will not say your mulberry trees are dead, but I am afraid they are not alive.
– The most incomprehensible thing in the world to a man is a woman who rejects his offer of marriage.
– I do not want people to be very agreeable, as it saves me the trouble of liking them a great deal.

ఇందులో హాస్యమూ ఉంది. ఎక్కువ మందితో స్నేహం చెయ్యలేని ఆమె విలక్షణ మనస్తత్వమూ ఉంది.

I hate to hear you talk about all women as if they were fine ladies instead of rational creatures. None of us want to be in calm waters all our lives (Persuasion) అనడంలో స్త్రీలను అందమైన మహిళలుగా కాక, వివేకవంతులుగా, సంఘర్షణను ఎదుర్కోగలిగిన సత్తా ఉన్నవాళ్ళుగా చూడాలన్న తపనను వ్యక్తం చేసిన జేన్, చాలా చోట్ల పురుషుల నవలల్లో స్త్రీల పాత్ర చిత్రణను కూడా తన నవలల్లో అంతర్భాగంగా విమర్శించింది. పర్సుయేషన్‌లో కెప్టెన్ హార్విల్‌తో ఆన్ ఎలియట్ సంభాషణ దీనికి ఉదాహరణ. ‘నేను చూసిన ఏ పుస్తకంలోనూ ఆడవాళ్ళ మనసులు ఎంత చంచలమైనవో చెప్పనిది ఒక్కటి కూడా లేదు’ అని అతను అన్నపుడు, ‘మీరు చూసిన పుస్తకాలన్నీ మగవాళ్ళు రాసినవే కదా’ అంటుంది ఆన్.

అలాంటి మగవాళ్ళ కలాలసంకెళ్ళ నుంచి నవలను విడిపించి, కొత్తరకం నాయికలను, పరిణతిచెందిన ప్రణయసంబంధాలను చిత్రించిన మేధావిగా, నవలారచనను కళాత్మక ప్రక్రియగా తీర్చిదిద్దిన రచయిత్రిగా జేన్ ఆస్టిన్ ఎప్పటికీ నిలిచిపోతుంది.


సి. మృణాళిని

రచయిత సి. మృణాళిని గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ...