ఆంధ్రుల చరిత్రలో వెలుగుచూడని కొన్ని ఘట్టాలు 2: నిజాముగారి బాకీలు
నిజాముగారు ఇంగ్లీషు వర్తక కంపెనీతో చేసికొనిన సంధిషరతుల ప్రకారము కొంత ఇంగ్లీషు సేనను ఆయన రక్షణ నిమిత్తము హైదారాబాదులో నుంచునట్లును దానికగు వ్యయము ఆయన భరించునట్లును ఏర్పాటు చేసికొనిరి. ఆ సైనికుల జీతము క్రింద నిజాముగారు సాలుకు 40 లక్షల రూపాయలు భరించవలసి యుండెను. ఈ సేనలు ఇంగ్లీషువారికి టిప్పు సుల్తానుతోను, మహారాష్ట్రులతోను చేసిన యుద్ధములం దుపయోగించినవి. ఈ సైనిక వ్యయము కొరకు కావలసిన సొమ్మును నిజాము ఎన్ని చిక్కులు పడియైనను సమకూర్చవలసి యుండెను. 1819లో హైదరాబాదులో రెసిడెంటుగా నుండిన రస్సెలుగారు ఇట్టి అసాధారణ వ్యయము కొరకు నిజాముగారు అసాధారణ పద్ధతులలో సొమ్ము సమకూర్చుచుండిరనియు, నిజాముగారి యుద్యోగులు ప్రజల ఆస్తిని జప్తు చేసియు, బలవంతముగా కొల్లగొనియు పీడించి వసూలు చేయుచుండిరనియు వ్రాసినారు (Nawab Mohsnul Mulk; Hyderabad affairs 1884).
సర్ జాన్ మాల్కంగారు స్వయముగా చూచిన కొన్ని విషయములను విన్నవించిరి. నిజాముగారు ఆంగ్లేయోద్యోగుల సహాయముతో చాల కఠినముగా రివిన్యూ వసూలు చేయసాగిరి. ప్రజలలో ఒక్కొక్క వ్యక్తి చెల్లించవలసిన మొత్తమును ముందుగా నిర్ణయించి దానిని వసూలు చేయుటకు చిత్రహింసల గావించుచుండిరి. కొందరి చెవులకు తుపాకులను తగిలించిరి. కొందరి రొమ్ములపైన పెద్ద బండలనుంచిరి. మరికొందరి వ్రేళ్ళను ఎర్రగా కాల్చిన పట్టుకార్లతో నొక్కసాగిరి (Hyderabad Residency Records, 1884 358 pp.97). రైతులవలన పన్ను వసూలు చేయుటకిట్టి చిత్రహింసలను గావించుచుండిరని కెప్టెన్ సదర్లాండుగారు కూడా వ్రాసియున్నారు (Malcolm Life, vol. 1 p. 17).
హేస్టింగ్స్ ప్రభువు 1813లో గవర్నరు జనరలుగా వచ్చి 1821లో పదవిని విరమించినను 1822 సంవత్సరాంతము వరకును భారతదేశములోనే యుండెను. ఆయన పరిపాలనమునందు చాలా అవినీతికరమైన ఘట్టము హైదరాబాద్ వ్యవహారమని చెప్పవచ్చును. “హైదరాబాద్ జాడ్యములకు పుట్టినిల్లు. అక్కడ అవినీతి తప్ప మరేమియు వర్ధిల్లదు. ఆదేశము నందలి దురదృష్ట ప్రజలను తుపాకి సన్నీల (బాయొనెట్ల) వాడిమొనలను చూపి భయపెట్టియు, పదునైన ఖడ్గములను ఝుళిపించియు సొమ్ము వసూలు చేయుదురు. అక్కడి యన్యాయములకు అంతము లేదు. దానిని గూర్చి విచారించువారు లేరు. వారి మొరలాలకించువారు లేరు. వారి కష్టములను దీర్చువారు లేరు. మహారాష్ట్ర రాజ్యములందు వలనే అక్కడి ప్రభుత్వమునందు క్రమవిధానము లేదు. దానికిని దీనికిని తారతమ్యమేమనగా నిక్కడ పరాయిజనము కొరకు ప్రజలను నిర్దాక్షిణ్యముగా, నిరంతరాయముగా పీడించి బాధించుచుండుటయే. నిజాముగారి క్రింద సివిలు మిలిటరీ యుద్యోగములు చేయుటకు ఆంగ్లేయులు చాల ఉత్సాహముతో వచ్చుచుండిరి. పెద్దపెద్ద యుద్యోగముల నిమిత్తము రెసిడెంటుగారికి నిరంతరముగా అర్జీలు వచ్చుచుండెను. ఇంగ్లీషువారి జేబులలో చాల పెద్దమొత్తములు పడుచుండెను. ఏపనికైనను నిజామే ఖర్చు పెట్టినను దానికి అన్నిఖర్చులు నిజ్జీయే భరించునని ఇంగ్లీషువారు ఛలోక్తిగా చెప్పుట ప్రారంభించిరి.” (Nizzie – Nijam.)
నిజాముగారి కెంత సొమ్ము కూడా చాలుటలేదు. ఆయనకు అందుకు అప్పునిచ్చువారు కావలసి వచ్చిరి. ‘విలియం పామరు అండ్ కో’ అను పేరిట విపరీతపు వడ్డీ వ్యాపారము చేయు సంస్థ ఒకటి బయలుదేరి నిజాముగారికి అప్పులిచ్చుట ప్రారంభించినది. ప్రతినెలకు ఇరువదివేల నవరసులను సైనికుల జీతము క్రింద వారప్పు నిచ్చునట్లును, అందు క్రింద నిజాముగారు నూటికి 24వంతుల చొప్పున వడ్డీతో కలిపి లెక్కచూచి తన రాజ్యాదాయము నుండి సాలుకు మూడు లక్షల నవరసులు వారికి వశపరచు చుండునట్లును ఏర్పాటు జరిగెను. పామరు కంపెనీతో నిజాముగారు జరిపిన లావాదేవిలలో నతడు వారిని తన ఆత్మబంధువువలె జూచెను. ఆయన తలకు మీరిన దర్పముతో ప్రవర్తించెను. దీనికి ముఖ్యమైన కారణము ఆ కంపెనీ భాగస్తులలో నొకడు గవర్నరు జనరలైన హేస్టింగ్స్‌గారి పెంపుడు కొమార్తెను పెండ్లియాడిన వాడైయుండుటయే. ఒక స్థిరమైన కార్యాలయము గాని సిబ్బంది గాని లేని ఈ జూటాకోరు కంపెనీవారు జరిగించు వ్యవహారములన్నిటికి గవర్నరు జనరలుగారు మారుమాటాడకుండ తమ అంగీకారము నిచ్చుచుండిరి. దీని విషయమై ఎవరైన ఏదైన అడ్డు చెప్పినచో గవర్నరు జనరలుగారు మండిపడుచుందురు. తూర్పు ఇండియా వర్తక కంపెనీవారికి భారము లేకుండ నిజాముగారి కొరకు పెట్టిన సేనల జీతములు సక్రమముగా చెల్లునను ఆలోచన కూడ ఆయనకుండి యుండవచ్చును.
గవర్నరు జనరలుగారి పెంపుడు కుమార్తెను పెండ్లాడిన సర్ విలియం రంబోల్డుగారు కేవలము ఒక దళారీ మనుష్యుడే. అతడేదో విధముగా వీలైనంత ధనమును సాధ్యమైనంత త్వరలో సంపాదింపవలెనని ఇంగ్లండునుండి హేస్టింగ్సు ప్రభువుతో కూడ భారతదేశమునకు వచ్చినాడు. ఉద్యోగము చేయుటకు గాని, సైన్యములో చేరుటకు గాని అతడు వయసు మీరినవాడైనందున వీలు లేకపోయెను. ధనసంపాదన మార్గముల నన్వేషించుచు నతడు అయోధ్య నవాబు రాజ్యమునకు పోయినాడు. అక్కడ అతనివంటివారు చాలామంది యుండిరి. అక్కడ అధికారిగా నుండిన మెట్‌కాఫ్ ఇతనివంటివారి కవకాశమివ్వడు. మైసూరుకు వెళ్ళినాడు. ఆర్కాటు లేదా కర్నాటక నవాబు దగ్గర పాశ్చాత్యులు చేయుచున్న అవినీతి యొక్క గాలి మైసూరుకు కూడ తగిలినందువలన అక్కడను లాభము లేకపోయెను. అంతట అతను హైదరాబాదు వచ్చినాడు. అయితే అతడి దురదృష్టము వలన మెట్‌కాఫుగారే 1820లో అక్కడికి రెసిడెంటుగా వచ్చినాడు. మెట్‌కాఫుగారు గొప్ప యోధుడు నీతిపరుడు కాని గవర్నరు జనరలుగారికి ఎదురు చెప్పలేక నిజాముతో జరిగిన సంధిషరతులను సవరించుటలో నొక క్రొత్త నిబంధనను చేర్చవలసిన వాడయ్యెను.
ఇటీవల జరిగిన యుద్ధముల వలన నిజాముగారి రాజ్యమునకు మంచి రక్షణము కలిగినందువలనను, రాజ్యాదాయము నందుకూడ అభివృద్ధి కలిగి ఆయనకు లాభము చేకూరినందునను నిజాముగారు తన కృతజ్ఞతను ప్రకటింపదలచి ఒక ధర్మకార్యమును చేయదలచినాడు. పై సందర్భముల నాలోచించి కలకత్తా నగరమునందు గాని పరిసరములందు గాని ప్రజోపయుక్త కార్యముల క్రింద వినియోగించుట కొరకు 16లక్షల రూపాయలను ఆయన సమర్పించుకొనుట కంగీకరించవలసిందని కోరుచున్నాడు. గవర్నరు జనరలుగారి ఇష్టప్రకారము ఆ సొమ్ము వినియోగపరుపవలెను. కలకత్తా నగరమునం దింగ్లీషువారు కాపురముండు వీధులలో రోడ్లు వేయించుటకును లాంతరు దీపములు పెట్టించుటకును మంచినీరు సరఫరా కొరకును ఈ సొమ్ము గవర్నరు జనరల్ హేస్టింగ్సుగారు వినియోగింపదలచిరి. కాని ఇంగ్లండులోని తూర్పు ఇండియా కంపెనీ డైరక్టరులు దీనికంగీకరింపనైతిరి. హైదరాబాదు సంస్థానము యొక్క స్థితిగతులును రాజ్యాదాయస్థితియును బాగుగా లేదనియు, నిజాముగారు ఇంగ్లీషు కంపెనీ వారివలన అప్పు పుచ్చుకొనుట కంగీకరింపవలసినదని యొక ప్రక్కనుండి రాయుచు ఇంకొక ప్రక్కనుండి నిజాముగారు ధర్మకార్యముల క్రింద నింత పెద్దమొత్తము నివ్వదలచినాడనియు దానికి అంగీకరింపవలసినదనియు వ్రాయుట వలనే డైరక్టరుల కోర్టువారు దీనికంగీకరింపలేదని హేస్టింగ్స్ ప్రభువుగారు బయల్పరచిరి. (Life of Metcalfe, Kaye; vol II p.p. 10.45.)
పామరు కంపెనీ వ్యవహారాలు
పామరు కంపెనీ 1814లో స్థాపింపబడెను. దీనిని జెనరల్ విలియం పామరుగారి కొమారుడైన జి. డబ్ల్యు. పామరుగారు స్థాపించిరి. పామరుగారు తన చిన్ననాటనే నిజాముగారి సైనికకొలువులో చేరి అక్కడ దేశీయపెట్టుబడిదారులతో కలిసి వడ్డీవ్యాపారము చేయుట ప్రారంభించిరి. ఇంగ్లీషు రాజైన మూడవ జార్జిగారి కాలమున శాసింపబడిన మూడవ చట్టము ప్రకారము తెల్లవారు భారతదేశీయులతో లావాదేవీలు గాని, వ్యాపారసంబంధము గాని కలిగియుండరాదను నొక నిబంధనముండెను. ఈ నిబంధనను గవర్నరు జనరలుగారి కార్యాలోచన సభలో పామరు కంపెనీవారి వ్యవహారములకు అడ్డు రాకుండ చేయుచు 23-7-1816వ తేదీన తీర్మానించిరి. అట్లు చేయుటవలన ఇంగ్లీషు పార్లమెంటువారిచే ఆ చట్టము ప్రకారము నిషేధింపబడిన వ్యవహారములన్నియు పామరు కంపెనీవారు చేయవచ్చును. అయితే వారిని కోరినప్పుడు ఆ విషయములను గూర్చి ఆ కంపెనీవారు గవర్నరు జనరల్ ప్రభుత్వమువారికి తెలియపరచుచునుండవలెను. వీరు చేయు వ్యవహారము లనేకములుగానుండెను. సొమ్మును వడ్డీకిచ్చుట, పెట్టుబడి పెట్టుట, దేశమున ప్రత్తి, కలప ఇంకను ఇతర సరుకులతో వ్యాపారమును చేయుట, ఇంగ్లండులో తయారైన వస్తువులను భారతదేశములోకి దిగుమతి చేయుట మొదలైన వ్యాపారములు చేయుచుండిరి. మరియు కంపెనీవారు నిజాముగారికి పెట్టుబడి క్రింద క్రమప్రకారము చెల్లించు సొమ్మువల్లనే నిజాముగారు ఉంచుకున్న ఇంగ్లీషు సైన్యము 1817-18 మధ్య జరిగిన మహారాష్ట్ర యుద్ధమునందు యుద్ధభూమిలో పనిచేయుటకు వీలు కలిగెను. ఈ విధములైన లావాదేవీలు నిజాముగారితో 1820వ సంవత్సరము వరకును జరిగెను. వీరి వడ్డీరేటు సహజముగనే హెచ్చుగా యుండెను. అది నూటికి 18 మొదలు 24 వంతుల వరకు నుండెను. అయితే నిజాము ప్రభుత్వమువారు అదివరకే నూటికి 12 వంతుల వడ్డీ చొప్పున అప్పులు తెచ్చుచుండిరి. నిజాము రాజ్యములోను ఇతర సంస్థానములలోను నూటికి 26 మొదలు 40 వంతులును యింకను హెచ్చురేటు చొప్పునను వడ్డీ వ్యాపారము జరుగుచుండెను.
ఆ కాలమున కలకత్తాలోని గవర్నరు జనరల్ కార్యాలోచనసభలో రెండు పక్షములుండెను. ఒక పక్షమువారు హేస్టింగ్స్ ప్రభువు చేసిన పనులన్నిటిని ప్రతిఘటించుచుందురు. రెండవ పక్షమువారు దానిని సమర్థించుచుందురు. అయితే హేస్టింగ్సుగారికి తోడ్పడువారు ఇంగ్లండులో చాలామంది యుండిరి. 1820 నిజాముగారి దివాను పేష్కారుగారు ఈ కంపెనివారి వలన 60లక్షల రూపాయలు అప్పు పుచ్చుకొనగోరగా గవర్నర్ జనరలు గారందులకు తమ అనుమతినిచ్చిరి. అయితే వారి కార్యాలోచన సభలో కొందరి కృషి వలన ఇంగ్లండులోని తూర్పుఇండియా కంపెనీ డైరక్టరులు దీనికంగీకరింపరైరి. ఇది యొక గొప్ప చిత్రకథగా తేలినది.
తమ కాయకష్టము వలనగాక పూర్వకాలము నాటి ఇంగ్లీషు దళారీ దొరల వలెనే వీలైనంత సంపదను పామరు కంపెనీ ద్వారా ఆర్జించుటకు రంబోల్డుగారు కృతనిశ్చయులైరి. అందుకనేక మాయోపాయములను పన్నిరి. అయితే మెట్కాఫ్‌గారి స్వభావమును నీతిధర్మమును పామరు కంపెనీవారు సరిగా గ్రహింపలేకపోయిరి. మెట్కాఫుగారికి నిజాముగారి రాజ్యములో నెక్కడ చూచినను దుఃస్థితియు బాధలు పొందు జనులు వూళ్ళు పొలములు వదలి పోవుచుండుటయు కనబడుచుండెను. ఇంగ్లీషు వడ్డీవ్యాపారులు నిజాముగారి యుద్యోగులకన్నను భారతదేశ రాజాధిరాజులైన ఇంగ్లీషు కంపెనీవారి ప్రభుత్వముకన్నను హెచ్చు అధికారములు చెలాయించుచుండుట మెట్‌కాఫ్‌గారికి గోచరించెను. వీరు తనకు లంచమిచ్చి నోరు కట్టజూచుచున్నారనియు ఆయనకు తోచునట్టి కొన్ని సంగతులు జరిగెను. రెసిడెంటుగారు కాపురముండు రెసిడెన్సీకీ పామరు కంపెనీవారు బుట్టలకు బుట్టలు పండ్లు పంపుటయు, రెసిడెంటుగారి గౌరవార్థము గొప్పగొప్ప విందుల నేర్పాటు చేయుటయు ప్రారంభించిరి. ఇది కేవలము మర్యాద కొరకు ఒక్కసారిగాక పెక్కుసార్లు భారీగా విరివిగా జరుగుటవలన మెట్కాఫ్‌గారి అనుమానము స్థిరమయ్యెను. పైగా ఆయనకు పూర్వము రెసిడెంటుగా పని చేసిన దొరగారికిని ఆయన పరిజనులకు అగుచుండిన యింటిఖర్చు నంతయు పామరు కంపెనీవారును నిజాము యుద్యోగులు కలిసి భరించుచు వారికి లేనిపోని భోగములను కూడ అమర్చుచుండినందునను మెట్కాఫ్‌గారి పరివార జనులకు నిప్పుడట్టి భోగములు జరుగనందునను మెట్కాఫ్ గారిట్టివి జరగనివ్వనందులకు సేవకులును పరిజనులును అసంతృప్తితో సణగికొనుచుండిరి.
పామరు కంపెనీవారు పంపు బహుమతులను మెట్కాఫుగారు నిరాకరించుట చూడగా నీ వ్యవహారమంతకు ప్రధాన సూత్రధారుడును గవర్నర్ జనరలుగారికి వేలువిడచిన ఇల్లటల్లుడైన రంబోల్డుగారికి ఆశ్చర్యముగానుండెను. మెట్కాఫ్‌గారికి గవర్నర్ జనరలుగారితో అధికారపూర్వకమైన సంబంధముండుటయే గాకఆయన హేస్టింగ్సుగారికి స్నేహితుడై యుండెను. పైగా పామరు కంపెనీ భాగస్తుడైన విలియం పామరుగారు మెట్కాఫ్ గారికి ప్రాణస్నేహితుడు. అతడు పామరు అను గొప్ప సేనానాయకుని కొమారుడు. అయితే స్నేహము వేరు ఉద్యోగధర్మము వేరు అని మెట్కాఫుగారి యభిప్రాయము. అందువల తనకు అన్యాయమని తోచిన కార్యము జరుగుటకాయన సహింపక తన విద్యుక్తధర్మమును సక్రమముగాను యథావిధిగాను నిర్వహించదలచెను. ఇది చాల కష్టమైన వ్యవహారము. సర్ విలియం పామరు ఢిల్లీలో తన యతిథిగానుండి తన జబ్బులో చాల పరిచర్య చేసినందువలన మెట్కాఫుగారాయన పట్ల చాలా కృతజ్ఞుడై యుండెను. ఇట్టి స్థితిలో పామరు కంపెనీవారు నిజాముగారికి 60లక్షలు అప్పుగా నిచ్చుటకు 1820లో నొక ‘ప్రపోజు’ను పంపిరి. ఇది నిజమైన ఋణము కాదనియు, అదివరకుండిన బాకీ అసలు ఫాయిదా మొత్తమునకే పామరు కంపెనీవారి కమీషను క్రింద మరి ఎనిమిది లక్షల రూపాయలను చేర్చి ఋణపత్రమును తిరుగ వ్రాయించుకొన జూచుచున్నారనియు మెట్కాఫుగారు దీని రహస్యమును వెల్లడి చేయుచు పైకి వ్రాసిరి. ఈ ఋణము మొత్తము పైన వడ్డీ నూటికి 25 వంతుల నుండి 18 వంతుల వరకు తగ్గించబడిన సంగతి నిజమే గాని నిజాముగారికి అవసరమైన ఇతర ఋణముల మొత్తములపైన నూటికి 25 వంతులకు పైబడిన రేటు చొప్పుననే పామరు కంపెనీవారు అప్పు నివ్వసాగిరి. సర్ విలియం పామరుగారు తన పలుకుబడి నుపయోగించి గవర్నర్ జనరల్ కార్యాలోచన సభవారు ఏమియు అనకుండా చూచుకొనెదమనియు, మెట్కాఫుగారిని దీని విషయములో అభ్యంతరము చెప్పకుండా ఊరకుండవలసినదనియు వేడుకొనిరి. నిజాము ప్రభుత్వమువారికేదో కొంత సౌకర్యము కలుగుచున్నప్పుడీ వ్యవహారము వలన మాకు మరికొంత లాభించినచో ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వము వారికేమి బాధయనిరి. ఈ ఋణవ్యవహారమునకు రెసిడెంటుగారు సుముఖులుగా నున్నారని పామరు కంపెనీవారు గవర్నర్ జనరలుగారికి చెప్పిరి. అతడు నిజమే యనుకొనెను. కొంచెమించుమించుగా భారతదేశ బ్రిటీషు ప్రభుత్వమువారీ ఋణమును ఆమోదించినట్టుగా గవర్నర్ జనరలుగారు వ్యవహరించిరి.
పామరు కంపెనీవారి లెక్కలలో నీ క్రొత్త వ్యవహారము వలన అమితమైన వడ్డీ లాభములు చూపబడినందున ఇటువంటి లాభసాటి వ్యాపారములో తమ సొమ్మును వడ్డీకిచ్చి లాభము పొందుటకు ఇంగ్లీషు ఉద్యోగులు ఉత్సాహపడిరి. అభూతకల్పనగా పెరిగిన బాకీ క్రింద నిజాముగారు వాయిదాల ప్రకారము పామరు కంపెనీ భాగస్తులు తమ భోగవిలాసముల కొరకు ఎంత విరివిగా ఖర్చు పెట్టుకొన్నను గూడా యింకనూ మిగిలి కంపెనీ వ్వారికి లాభకరముగానే యుండెను.
మెట్కాఫ్‌గారికీ వ్యవహారమంతయు చూడగా చాలా అన్యాయముగా తోచెను. ఆయనకు కోపము కూడా వచ్చినది. ఎముకలను పిండిచేసి చంపగల కొండచిలువ చుట్టుకొన్నట్లు నిజాముగారిని చుట్టుకొని ఈ పాపపు వ్యవహారము నుండి ఆయన నేదో విధముగా బయటపడవేసి విముక్తుడిని చేయవలెనని తలచి నూటికి 6 వంతుల చొప్పున 6 శాతము వడ్డీనిచ్చు పద్ధతిని 1821లో కలకత్తాలో నొక పెద్దమొత్తమును ఋణముగా తెచ్చుటకు మెట్కాఫ్‌గారు ప్రయత్నించిరి. తన స్వదేశీయులైన ఆంగ్లేయుల మర్యాదను వారి దొరతనము యొక్క గౌరవమును కాపాడవలెనని మెట్కాఫ్‌గారి యూహ. మెట్కాఫ్‌గారు కలకత్తాలో ఋణము చేయుటకు తమ కభ్యంతరము లేదనియు, అయితే నిజాముగారిని ట్లాకస్మికముగ ఋణవిముక్తుని చేయుట వలన తమకు నష్టపరిహారము క్రింద ఆరు లక్షల రూపాయలు చెల్లించవలసి యుండుననియు పామరు కంపెనీవారు చెప్పిరి! హైదరాబాదులోని ఆర్థిక దుఃస్థితిని అన్యాయపు పరిస్థితులను చూచి మెట్కాఫ్‌గారు విషాదముతో నిక్కడి స్థితిగతులను గూర్చి తనకేమాత్రము ఆచూకీ ముందుగా తెలిసినను హైదరాబాదు రెసిడెంట్ ఉద్యోగము తాను అంగీకరించి యుండెడి వాడను కాననిరి. పామరు కంపెనీ వారింత అవమానమకరమైన షరతులను పెట్టినను మెట్కాఫుగారు తన ప్రయత్నమును వదలలేదు. అంతట ఈ మెట్కాఫుగారు తమ కంపెనీకి వ్యతిరేకముగా ప్రవర్తించుచున్నారని చెప్పుచు ఉన్నవి లేనివి గల్పించి గవర్నర్ జనరలు కొక పితూరీ లేఖను రంబోల్డుగారు రహస్యముగ వ్రాసిరి. గవర్నర్ జనరలుగారికి ఆగ్రహము కలిగెను. అయినను మెట్కాఫుగారా వంతయినను జంకలేదు. ఈ సందర్భమున నాయన వ్రాసిన లేఖలు ఆయన యొక్క న్యాయబుద్ధిని సత్యవ్రతమును ధైర్యమును ఆత్మగౌరవమును వెల్లడించుచున్నవి. బహుశః యిట్టి లేఖలు వ్రాయుట వల్లనే ఆయనకు భారతదేశ గవర్నర్ జనరలు పదవి లభించలేదని కొందరనుకొనిరి.
“హైదరాబాదులో వివిధ జిల్లాలను పరిపాలించు అధికారులతో అవినీతిపరులును ప్రజాపీడకులును అగువారితో యీ పామరు కంపెనీ వారికి గల రహస్య సంబంధములను బట్టి రాజ్యములందు జరుగు ఘోరకృత్యములందు వారు భాగస్వాములుగా ఉన్నారని, వారినిగూర్చి ప్రజలనుకొనుటయే గాక, ఇంగ్లీషుజాతి వారందరినీ గూర్చియు అట్టి దురభిప్రాయము ప్రజలలో వ్యాపించుచున్నదని విచారించుచున్నాను. సామాన్యవ్యాపారము చేయు సంస్థకు సాధారణముగా నుండని అధికారముల నీ పామరు కంపెనీవారు చలాయించుచున్నారు. తమకు స్వంతమునకు రావలసిన బాకీలను ఇతరులకు ట్రాన్సుఫరు చేసిన బాకీలను కూడా వీరు నిజాము ప్రభుత్వము వారియొక్కయు బ్రిటీషు ప్రభుత్వము వారియొక్కయు రెండు విధములైన పలుకుబడిని, దానిని పురస్కరించుకొని కొన్ని అధికారములను కూడా ఉపయోగించి బలవంతముగా వసూలు చేయుచున్నారు.
“బ్రిటీషు ప్రభుత్వమువారు ఈ పామరు కంపెనీవారి వడ్డీవ్యాపారము ఇజారాపట్టా నిచ్చినట్లుగా చేసినందువలన నిజాము ప్రభుత్వమువారి పలుకుబడితో స్వంతముగా చౌకరేట్లకు అప్పు తెచ్చుకొని అవకాశము లేకుండ పోయినది. సర్ విలియం రంబోల్డుగారికి గవర్నర్ జనరలుగారైన మీరు సుముఖులుగా నున్నారను వదంతి వలన పామరు కంపెనీవారికి రాజకీయముగా గొప్ప పలుకుబడి యేర్పడినది. ప్రయివేటు లాభము కొరకిట్లు రాజకీయమైన పలుకుబడిని వినియోగించుట అవినీతికి కారణమగును” అని మెట్కాఫ్‌గారు గవర్నర్ జనరలయిన హేస్టింగ్సుగారికి వ్రాసిరి. తనకీ కంపెనీ వారిపై నెట్టి ద్వేషమూ లేదని మెట్కాఫ్‌గారు స్పష్టపరచిరి. మెట్కాఫ్ గారింత గట్టిగా వ్రాసినప్పటికీ లాభము లేకపోయెను. గవర్నరు జనరలుగారు కంపెనీ పక్షమునే వహించిరి.
హైదరాబాదులో పామరు కంపెనీవారి పక్షీయులైన దొరలును దేశీయులును మెట్కాఫ్‌గారిని హేళన చేయసాగిరి. ఇట్లు కొంతకాలము గడిచెను. తుదకు ఈ వ్యవహారములోని అన్యాయములు అందరికీ తెలిసినందున గవర్నర్ జనరలుగారిని ఇంగ్లండులోని కంపెనీ డైరక్టరులు విమర్శింపగా ఆయన 1821లో పదవికి రాజీనామా నిచ్చిరి. 1822 సంవత్సరాంతవు వరకు నాయన భారతదేశముననే యుండెను. పూర్వము గవర్నరు జనరలుగా నుండిన వారన్ హేస్టింగ్సుగారి అవినీతిని గూర్చి జరిగిన విచారణ సందర్భములందు వలెనే యీ పామరు కంపెనీవారు అక్రమ వ్యాపార సందర్భమునందు హేస్టింగ్సుగారు జరిపిన చర్యలను గురించి వాదోపవాదములు చెలరేగెను. గవర్నరు జనరలు కార్యాలోచన సంఘములో సభ్యుడైన జాన్ ఆడంగారు క్రొత్త గవర్నరు జనరలుగా కొంతకాలము ఆక్టింగు చేసిరి. తరువాత అనహరెస్టుగారు గవర్నరు జనరలుగా వచ్చిరి. ఆడంగారికీ పామరు కంపెనీవారి అన్యాయమంతయూ అవగతమయ్యేను. పూర్వము రెసిడెంటుగారి క్రింది ఉద్యోగులందరు నీ కంపెనీవారితో కలిసి కుట్ర చేసినారని తెలిసినది. అంతట పామరు కంపెనీవారి బాకీలలో ప్రత్యక్షముగా అన్యాయముగా కనపడిన పద్దులన్నిటినీ ఆడంగారు నిరాకరించిరి. కంపెనీవారికి 80లక్షల రూపాయలు చెల్లించబడెను. ఇదియైనను సంస్థానము న్యాయముగా భరించవలసిన ఋణమని చెప్పుటకు వీలులేదు. పామరు కంపెనీవారెంత అన్యాయార్జనము చేసి అమిత లాభము లార్జించినను తరువాత ఒక్క సంవత్సరములోనే దివాలా తీసిరి. ఇతరులకు వీరివ్వవలసిన మొత్తము లివ్వవలసినదని వీరిని వత్తిడి చేయుట వలన వీరు దివాలా తీయలేదు. ఆ కంపెనీవారి సాధారణ వ్యయములకే సొమ్ము చాలక అది దివాలా తీసేనని మెట్కాఫ్‌గారు 1828 సంవత్సరము డిసెంబరు నెల 11వ తేదీనా వ్రాసిన మినిట్సు వలన తెలియుచున్నది. దీని అర్థమేమనగా కంపెనీ భాగస్తులా కంపెనీ సొమ్మును దుబారాగా వాడుకొనుట వలన దినవెచ్చములకే సొమ్ము లేక కంపెనీ నాశనమైన దనియె. కంపెనీ దివాలా తీసినను సర్ విలియం రంబోల్డుగారు యీ దేశముననే చాలా కాలము నివసించి ఈ వ్యవహారమునందు జరిగిన సంగతులకు తన అసంతృప్తిని ప్రకటించుచు నింక నితర వ్యవహారములందు తన చాకచక్యమును చూపుచు కాలక్షేపము చేయసాగిరి.
(సశేషం)