[అమెరికాకు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది, రచయిత, మహోపన్యాసకుడు అయిన రాబర్ట్ ఇన్గర్‌సాల్ (Robert G Ingersoll, 1833-99) స్వేచ్ఛాలోచనకు స్వర్ణయుగం అని పిలవబడిన 19వ శతాబ్ది మధ్యకాలంలో మతాన్ని, మతాచారాలను ప్రశ్నిస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, ఎన్నో ప్రసంగాలిచ్చాడు. అజ్ఞేయవాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి ‘ది గ్రేట్ అగ్నాస్టిక్’గా పేరు పొందాడు. ఈతని వ్యాసాలు, ఆలోచనలు ఇప్పటికీ పాతపడలేదు సరికదా ఇప్పటి సమాజానికి మరింతగా వర్తిస్తాయి. నౌడూరి మూర్తి తెలుగులోకి అనువదించిన కొన్ని ఇన్గర్‌సాల్ వ్యాసాలు ఈమాటలో ప్రచురిస్తున్నాం. – సం.]
అన్ని తత్త్వశాస్త్రాలూ సత్యం కోసం, వాస్తవాలకోసం అర్రులు చాస్తుంటాయి, ఒక్క క్రైస్తవధర్మతత్వశాస్త్రం (Theology) తప్ప.
ఒక్క ధర్మతత్వశాస్త్రం బోధించే పాఠశాలలలోనే ఒక ఆచార్యుడికి తన మతవిశ్వాసాలకి విరుద్ధంగా ఒక వాస్తవం కనిపిస్తే, దాన్ని అతను గోప్యంగానైనా ఉంచాలి, లేదా దాని ఉనికిని నిరాకరించాలి. లేకపోతే అతను తన పదవిని కోల్పోవలసి వస్తుంది. సత్యప్రకటన నేరం, పిరికితనం. కానీ, ఆత్మవంచన మాత్రం ఒక సుగుణం.
మతవిశ్వాసానికి విరుద్ధంగా ఉండే ఏ వాస్తవమైనా అసత్యం క్రింద పరిగణించబడి తోసిపుచ్చబడుతుంది. ఆ సత్యాన్ని బహిరంగంగా ప్రకటించే వ్యక్తి దైవదూషణ చేసినట్టు లెక్క. ప్రతి ఆచార్యుడూ కాపట్యాన్ని నిశ్వసిస్తుంటాడు; మనసుని వంచించుకుంటాడు. మోసాన్ని అతి పవిత్రంగా ఆచరిస్తుంటాడు. ధర్మతత్వశాస్త్రం ఒక్కటే, నిజమైన తత్త్వశాస్త్రం కానిది. అదొక్కటే విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడి, పరిశోధనని ఏవగించుకుని, ఆలోచనలని, తర్కాన్నీ అసహ్యించుకునేది.
కేథలిక్ చర్చికి చెందిన ధర్మతత్వ శాస్త్రవేత్తలందరూ తర్కాన్ని మానవాళికి శత్రువెవరో ప్రసరిస్తున్న దీపంగా, అది వినాశనానికి దారి తీసేదానిగా ఖండించేరు. లూథర్ మొదలుకుని నేటి సంప్రదాయ చర్చివరకూ ఉన్న ప్రొటెస్టెంటు తత్త్వవేత్తలు కూడా తర్కానికీ వివేకానికీ శత్రువులే. అన్ని కాలాలలోనూ, సంప్రదాయ చర్చిలన్నీ విజ్ఞానశాస్త్రానికి శత్రువులుగా వ్యవహరించేయి. ఖగోళ శాస్త్రజ్ఞులపై, భూభౌగోళిక శాస్త్రజ్ఞులపై వారు ఏదో నేరం చేసినట్టు, హత్యలు చేసినట్టు దాడిచేశారు. వైద్యుల్ని దేవునికి శత్రువులుగా, భగవంతుని ఆదేశాలను వమ్ము చేస్తున్నవారిగా పరిగణించేరు. జీవశాస్త్రజ్ఞులు, మానవశాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, పురాతన శాసనాలని చదివేవారు, భూగర్భంలో కనుమరుగైన నగరాల వివరాలను వెలికి తీసేవారు–వీరందిరినీ ధర్మతత్వ శాస్త్రవేత్తలు ద్వేషించారు. బైబిలు చెబుతున్న దానికి విరుద్ధంగా సత్యాలని ఎక్కడ వెలికి తీస్తారోనని వీరి భయం.
ఇప్పుడు లభిస్తున్న వాస్తవాలు, ప్రపంచంలోని అన్ని మతాలూ సుమారుగా ఒకే మూలాధారం నుండి ఉత్పన్నమైనట్టు నిర్వివాదంగా ఋజువు చేస్తున్నప్పటికీ, క్రిస్టియన్ తత్త్వవేత్తలలో ఏ ఒక్కరూ దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అతను తన మత విశ్వాసమైన భగవత్సందేశాన్ని పరిరక్షించవలసిందే. అతను నిజాయితీగా ఉండలేడు. కారణం, అతను నిజాయితీ అన్న బడిలో చదువుకోలేదు మరి. నిజాయితీగా ఉండడం అతను నేర్చుకోలేదు. అతనికి బోధించింది కేవలం విశ్వసించమని, దాన్ని వాదనలకు, ఋజువులకూ అతీతంగా పరిరక్షించమనీ.
బైబిలు భగవత్ప్రేరితమైన సందేశమని ఋజువుచేయగల అణుమాత్రమైన ఋజువునైనా ప్రపంచం మొత్తం మీద ఉన్న ఈ ధర్మజ్ఞాన శాస్త్రవేత్తలలో ఒక్కరంటే ఒక్కరు చూపించలేరు.
్బుక్ ఆఫ్ రూత్ దైవప్రేరణవల్ల రాయబడిందన్న ఋజువేది? సాంగ్ ఆఫ్ సాలమన్ దేవుడు రాసేడని ఋజువేమిటి? అసలు ఏ వ్యక్తికైనా భగవంతుడు ప్రేరణనిచ్చేడన్నదానికి ఋజువేమిటి? క్రీస్తు అప్పుడూ ఇప్పుడూ భగవంతుడేనని ఋజువేమిటి? స్వర్గం, నరకం అన్న ప్రదేశాలు ఉన్నాయని ఋజువేమిటి? అసలు అద్భుతాలు సృష్టించేరన్నదానికి దాఖలా ఏమిటి?
ఎక్కడా ఏదీ లేదు.
ధర్మతత్వశాస్త్రం ఋజువులమీద ఆధారపడినది కాదు.
దయ్యాలు, భూతాలు, దేవదూతలు, దేవుడూ ఉన్నారన్నదానికి ఋజువేమిటి? వాటినెవ్వరైనా చూడడం గాని, ముట్టుకోవడం గాని చేశారా? మన ఇంద్రియాలలో ఏ ఒక్కటైనా వాటి ఉనికిని నిర్ధారించిందా?
ధర్మతత్వ శాస్త్రవేత్తలు చెప్పుడు మాటల మీద ఆధారపడతారు. వాళ్ళ దగ్గర ఏ ఋజువులూ ఉండవు. ‘సీజరు జీవించాడు’ అన్న ధోరణిలోనే ‘క్రీస్తు జీవించాడు’ అని మాట్లాడతారు. కాకపోతే, సైనై పర్వతం మీద మోజెస్ యెహోవాతో మాటాడేడని, బ్రిగమ్ యంగ్ యూటా రాష్ట్రంలో దేముడితో మాటాడేడన్నట్టు మాటాడతారు. రెండు సందర్భాల్లోనూ వేటికీ ఋజువులు, సాక్ష్యాలూ ఉండవు.
క్రీస్తు పునరుత్థానాన్ని ఎలా ఋజువు చేస్తారు? ఆ విషయం ఒక పుస్తకంలో ప్రస్తావించి ఉండడాన్ని ఋజువుగా చూపిస్తారు. ఆ పుస్తకాన్ని ఎవరు వ్రాశారు? వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు అది ఋజువు ఎలా అవుతుంది? పుస్తకంలో ఉన్న తక్కిన విషయాలు కూడా నిజమయితే తప్ప, అది ఋజువు కాలేదు.
ఒక అద్భుతాన్ని మరొక అద్భుతం తోటి, దాన్ని మరొకదాని తోటీ అలా నిరంతరాయంగా ఋజువు చెయ్యగలమా? అద్భుతాలని జరిగినట్టుగా స్వీకరించడానికి మనుషుల సాక్ష్యం సరిపోదు. ఏ వ్యక్తి అయినా దాన్ని నమ్మాలంటే, ఆ అద్భుతాన్ని తాను స్వయంగా చూడాలి.
క్రిస్టియానిటీ రెండువేల సంవత్సరాల క్రిందట జరిగిన అద్భుతాలద్వారా నిజమని నిరూపింపబడి స్థాపించబడిందని చెప్తారు. ఆ అద్భుతాలలో ఏ ఒక్కదాన్నీ, మూర్ఖులు, మొండివాళ్ళూ తప్ప వేరెవ్వరూ నిరూపించలేరు. అది కూడా అమాయకపు మనసుల్ని విషపూరితం చెయ్యకుండా నిరూపించలేరు. ఈ విషయంలో సఫలత సాధించడానికి దివ్యజ్ఞానులు ఉయ్యాలలో ఉన్నవారిమీద, శిశుమందిరాలమీదా దాడి చేస్తారు. ఆ పసిపిల్లల మనసులమీద మూఢనమ్మకాలను సులువుగా నాటుతారు. పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని చెడగొడతారు. హాయిగా ఆనందంగా ఉండే వారి మనసులని బాధల భయాలతో నింపుతారు. దుర్దశలో హీనమైన స్థితిలో ఉన్న అభాగ్యులను హేయమైన అసత్యాలతో శాంతపరుస్తారు.
అవధులు లేని ఈ కపటత్వం వాళ్ళ ముఖాలమీద స్పష్టంగా కనిపిస్తుంది. మానవత్వానికి గురుతులైన బుగ్గలు సొట్టలు పడేలా నవ్వడం గాని, మాటలలో పరిహాసం గాని లేకుండా, వాళ్ళ ముఖాలు ఎప్పుడూ గంభీరంగా, ఏ సానుభూతి లేకుండా, బెల్లంకొట్టిన రాయిలా ఏ ఉద్వేగాలు లేకుండా, ఒక వికారపు నవ్వు పులుముకుని ఉంటాయి. సహజంగా, ప్రకృతి సిద్ధంగా కళకళలాడే నవ్వు ముఖానికి వారు వికృతి. నవ్వుతూ కేరింతలు కొట్టే వాళ్ళని వీరు ‘కుక్కలున్నాయి జాగ్రత్త!’ అన్నట్టు హెచ్చరిస్తుంటారు. మెడూసా కథలోలా, వాళ్ళ దృష్టి ఎవరిమీద పడితే వాళ్ళు ఎంత కిలకిలలాడుతున్నా రాయిలా మారిపోవలసిందే. వాళ్ళ ప్రవర్తన ఆనందానికి ప్రతిఘటన, హెచ్చరిక, ఒక బెదురుపాటు.
మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఆత్మ, శరీరపు ముఖకవళికలద్వారా తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. ప్రతి ఆలోచనా దాని గుర్తులను విడిచిపెడుతుంది.
ఈ ధర్మతత్వశాస్త్రం చదివే విద్యార్థులకి, బాల్యంలోనే, తల్లి పొత్తిళ్ళలో ఉండగానే బోధన ప్రారంభించి ఉండాలి. అన్నిటికన్నా ముందుగా అసత్యాలను మెదడులో బీజావ్యాపనం చేస్తారు. అతనికి ఎటువంటి ప్రశ్నలూ వెయ్యకుండా విశ్వసించడం నేర్పుతారు. సందేహించడం దుర్మార్గమని, పరిశోధన పాపమని, నమ్మిక ఒక సుగుణమని, అవిశ్వాసం ఒక నేరమనీ చెప్తారు.
ఆ ప్రకారంగా అతని మెదడు పాడు చేసి దాని వివేచనాశక్తిని నిర్వీర్యం చేస్తారు. అతనికి అన్ని విషయాలలోనూ స్వేచ్ఛ ఉంటుంది, తక్కిన అన్ని విషయాలనూ కూలంకషంగా చదవమని, ఆలోచించమనీ చెబుతారు. తల్లి ఒడినుండి తిన్నగా ‘సండే స్కూల్’కి వెళతాడు. పాపం, అతని చిన్నారి మెదడు నిండా అద్భుతాలు, వింతలూ నిండి ఉంటాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేముడి గురించి, అతను ఇవ్వబోయే బహుమతులు, వేయబోయే శిక్షలగురించీ బోధిస్తారు. భగవంతుడే బైబిలు వ్రాసేడని, క్రీస్తు అతని కొడుకనీ బోధిస్తారు. ‘మొట్టమొదటి పాపము’ గురించి, దాని ప్రాయశ్చిత్తం గురించీ బోధిస్తారు. అతను ఏది వింటే దాన్నే నమ్ముతాడు. కారణాలు చెప్పరు. వాస్తవాలు, ఋజువులు చూపించరు. కేవలం ఉద్బోధనే. పొరపాటున అతను ప్రశ్నలు లేవనెత్తితే, మరింత కటువుగా, గంభీరంగా బోధించి అతని నోరు మూయిస్తారు. అతన్ని సైతాను వేసే ప్రశ్నలనుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. ప్రతి సండే స్కూలూ ఒక ధర్మవిచారణ సభలాంటిది. అక్కడ పిల్లల మనసుల్ని హింసించి, వికృతంగా తయారుచేస్తారు. వాళ్ళ ఆత్మలని కేథలిక్, ప్రొటెస్టెంటు అనే మూసల్లోకి పోసి వాళ్ళ మౌలిక వ్యక్తిత్వాలని, ఆత్మల సత్యసంధతనీ నాశనం చేస్తారు. ఆ బడులలో జరిగే విధ్వంసం పరిపూర్ణం.
మతబోధకుడు విద్యాలయాన్ని విడిచిపెట్టే వేళకి అతను సత్యాన్వేషకుడిగా తయారవడు. సత్యం అతని దగ్గరే ఉన్నట్టు ఉంటాడు. అతని దగ్గర భగవంతుడి వాక్యాలున్నాయి. దానికి అక్షరాలా అనుగుణంగా నడచుకునే మతము, విశ్వాసాలూ ఉన్నాయి. భగవంతుడు చెప్పాడని చెప్పిన వాక్యాన్ని, మత విశ్వాసాన్నీ నిలబెట్టడమే ఇప్పుడు అతని ముందున్న కర్తవ్యం. వాటికి వ్యతిరేకంగా ప్రకటించే ఏ వాదాన్నయినా అతను వినడు, చదువడు. అతని మతానికి వ్యతిరేకంగా ఎన్ని ఋజువులు కనిపించినా వాటిని అతను త్రోసిపుచ్చుతాడు. అతను స్పష్టంగా, నిష్పక్షపాతంగా ఉండలేడు. అద్భుత సత్యాలైన స్వర్గ సుఖాలు, నరకంలోని శిక్షలూ అతని మతంలో ఉన్నాయి. నిజాన్ని తిరస్కరించి అసత్యాన్ని నమ్మడం వల్ల వచ్చే ప్రఫలం అది.
సత్యశోధన అత్యంత ప్రమాదకారి. అవిశ్వాసం మితిలేని అపరాధం. దానికి అంతులేని శిక్ష విధించవలసిందే. ఈ అద్భుతమైన ‘వాస్తవం’ నీడలో అతని సాహసం చచ్చుపడిపోతుంది. అతని మానవత్వం మంటగలుస్తుంది. ఆ భయంతో, అతను నిజంగా నమ్మినా నమ్మకున్నా, నమ్ముతున్నాననే ప్రకటిస్తాడు. అతను కూడా నమ్మకం క్షేమకరమని, ఆలోచన ప్రమాదకారి అనీ బోధిస్తాడు. భగవంతుడు తనను సాటి మనుషులకి జ్ఞానబోధ చెయ్యడానికి ఎంపికచేసిన గురువుగా, మార్గదర్శకుడిగా నటిస్తాడు.
ఈ సంప్రదాయ మతబోధకులు ఈ శతాబ్దంలో నిజమైన శాస్త్రజ్ఞులందరినీ దూషించి అప్రతిష్టపాలు చేసేరు. గొప్ప భూభౌగోళిక శస్త్రవేత్త లయెల్‍ని (Lyell) ఈ భూమి స్వభావం గురించి వాస్తవాలు ప్రకటించినందుకు నిరసించేరు. ఈ జాతి గర్వించదగ్గ గొప్పవ్యక్తుల్లో ఒకడైన హమ్‍బోల్ట్‌ని (Humboldt) ద్వేషించి, అవమానించేరు. ప్రపంచం ఇప్పటివరకూ ఎరుగని అద్భుతమైన సత్యశోధకుడు, వాస్తవానికి పెద్దపీటవేసిన సునిశిత పరిశీలకుడు, వృక్షజీవశాస్త్రజ్ఞుడూ అయిన డార్విన్‌ని (Darwin) వేళాకోళం చేసేరు.
ప్రతి సంప్రదాయ చర్చి వేదిక మీదా ప్రపంచానికి వెలుగు చూపిన మహోన్నత శాస్త్రవేత్తలను తూలనాడే వ్యక్తి నిలుచుని ఉంటాడు. ప్రతి శాస్త్రానికి, ప్రతి ఆలోచనాపరుడికీ చర్చి ప్రబల విరోధి. శతాబ్దాల కాలం నుండి విజ్ఞాన ప్రగతిని అడ్డుకోడానికి అది తన అధికారాన్ని వినియోగిస్తూనే ఉంది.
నిజానికి మతబోధకులు స్వతంత్రులై ఉండాలి. వాళ్ళు రాబోయే ప్రభాతాలకి మేలుకొలుపు పాడాలి. కానీ వాళ్ళు గబ్బిలాలు, గుడ్లగూబల్లా కాంతిద్వేషులు. తమ ఆలోచనలను నిజాయితీగా ప్రకటించే వ్యక్తులను దైవదూషణ చేసినట్టు నిందించి వాళ్ళ నోళ్ళు మూయించడానికి వాళ్ళు చెయ్యగలిగినదంతా చేస్తారు. కానీ, బైబిలుకు మాత్రం చట్టం అండ కావాలి. చట్టసభలు తమని ఎవరూ హేళనచెయ్యకుండా కట్టుదిట్టం చెయ్యాలి. కాని, వాళ్ళకి వ్యతిరేకంగా మాటాడేవారందరినీ న్యాయస్థానాలు ప్రశ్నించాలి. పిరికిదనం, ఆత్మవంచన, కుతంత్రం సమపాళ్ళలో ఉండడం వల్ల వచ్చిన పర్యవసానం ఇది.
సంప్రదాయ చర్చి వేదిక మీదనుండి ఇప్పటివరకూ ఏ విలువైన సత్యమైనా వెలువడిందా? ఈ విశ్వ జ్ఞానభాండాగారానికి క్రైస్తవమత కూటమి ఏ విలువైన విషయాన్నైనా జోడించగలిగిందా?
చర్చి వందల సంవత్సరాల క్రితం క్రైస్తవులందరికీ తాత్త్విక చింతనలేని, తెలివితక్కువయిన, హీనాతిహీనమైన మూర్ఖపు ప్రవర్తనా నియమావళిని అందించింది. చర్చి మనిషిని న్యాయవర్తనుడిగా, దయాళువుగా మలిచేనని చెప్పుకుంటుంది. అవిశ్వాసుల్ని చిత్రహింసలకు గురిచెయ్యడం, కళ్ళు పొడిపించడం, బ్రతికుండగా చర్మం ఒలిపించడం వల్ల సాధించిందా? నిరంకుశులైన మతాధికారులచే విచారణలు జరిపించి, గోళ్ళు పెకలించడం, చేతులూ కాళ్ళూ యంత్రాలతో సాగదీయడం, సజీవదహనం చెయ్యడం వల్లనా? చర్చి ఏ శాస్త్రాన్ని సమర్థించి వెనకేసుకొచ్చింది? కువిమర్శలకు గురైన ఏ సత్యానికి చర్చి తలుపులు తెరిచింది? క్రైస్తవం వల్ల మనిషికి ఒనగూడిన లాభం ఏమిటి?
వాళ్ళు ఆదినుండీ ఇప్పటివరకూ విద్యకి సహకరిస్తున్నామని చెప్పుకుంటారు. నేను ఆ వాదనని తిరస్కరిస్తున్నాను. చర్చి కళాశాలలు స్థాపించింది మనుషులను అక్షరాస్యులుగా చెయ్యడానికి కాదు; మతపరివర్తనకీ లేదా మార్పిడికీ; దానిని పరిరక్షించుకుందుకూ. ఇది అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడమనే సహజ కాంక్షకి అనుగుణంగా చేసిన ప్రయత్నం. ఏ సంప్రదాయ చర్చి ఇప్పటి వరకు నిజమైన విద్యాభ్యాసానికి సహకరించలేదు, ఇకముందు సహకరించదు. ప్రతి కేథలిక్కు ఒక అనాగరికుడిని మరొక కేథలిక్కుగా తయారుచెయ్యడానికి కావలసిన విద్య కలిగి ఉన్నాడు. ప్రతి ప్రొటెస్టెంటు ఒక కేథలిక్కుని ప్రొటెస్టెంటుగా మార్చడానికి కావలసినంత విద్య కలిగి ఉన్నాడు, కానీ వీరిద్దరికీ మనుషులకి ఎటువంటి విద్యవల్ల వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించి, మానవత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి విద్య అందించడంలో అభిరుచి లేదు.
మతాధికారులు దానధర్మాలు చేయమని బోధిస్తామని చెప్పుకుంటారు. అది సహజం. వాళ్ళు బ్రతికేదే ఇతరులు వాళ్ళకు చేసే దానధర్మాలమీద. ముష్టివాళ్ళందరూ ఇతరులు దానధర్మాలు చెయ్యాలనే కోరుకుంటారు.
చర్చి ఆసుపత్రులు నిర్మించిందని చెప్పుకుంటారు. అది నిజం కాదు. మనుషులు ఆసుపత్రులు కట్టించింది వాళ్ళు క్రిస్టియన్లు అయినందువల్ల కాదు, వాళ్ళు మనుషులు అయినందువల్ల. వాళ్ళు ఆసుమత్రులు కట్టించింది దయాగుణం వల్ల మాత్రం కాదు, తమని తాము రక్షించుకుందుకి.
ఒక వ్యక్తి మశూచితో మీ గుమ్మం ముందు నిలబడినప్పుడు, మీరు అతన్ని లోనికి రమ్మనలేరు, అలాగని చంపనూలేరు. అతనికి ఒక చోటు చూపించడం అత్యావశ్యకం. అలా చెయ్యడం మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో ఒక భాగం. దానికీ క్రిస్టియానిటీకి ఏ సంబంధమూ లేదు.
చర్చి నిజానికి ఎవరికీ ఏమీ ఇవ్వదు. ఎందుకంటే, అది ఏదీ ఉత్పత్తి చెయ్యదు గనుక. చర్చి స్త్రీ పురుషులను క్షమాగుణం గలవారుగా తయారు చేశానని చెప్పుకుంటుంది. చర్చి క్షమాగుణాన్ని బోధించిందని ఒప్పుకుంటాను. కానీ అది తన శత్రువుని క్షమించలేదు, ఎన్నడూ. ధైర్యశాలురైన గొప్ప గొప్ప ఆలోచనాపరులకి వ్యతిరేకంగా చెప్పలేనన్ని అసత్యాలు కల్పించి ప్రచారం చేసింది. నిజాయితీపరుడైన తన శత్రువు గురించి నిజాన్ని చెప్పడం గాని, చెప్పడానికి ప్రయత్నించడం గాని ఎన్నడూ చెయ్యలేదు.
చర్చి ప్రకృతికి అతీతమైన శక్తుల అస్తిత్వాన్ని బోధిస్తుంది. భగవంతుని మాయల మీద దానికి నమ్మకం. సర్వశక్తిమంతుడి కళ్ళు తెరిస్తే ప్రత్యక్షమయే, కళ్ళు మూస్తే మాయమయే వివరణలపై నమ్మకం. కారణం లేకుండా కార్యాలని, కార్యం లేకుండా కారణాలనీ సృష్టించే వ్యక్తులమీద విశ్వాసం; ఎవరి లీలలు ఈ విశ్వాన్ని పరిరక్షిస్తాయో, ఎవరు ప్రార్థనకి లోబడతారో, పూజాపునస్కారాలకి మెత్తబడతారో, వాళ్ళ ఉనికిని నమ్మినందుకు ప్రతిగా మనని రక్షించి, ప్రకృతిసిద్ధమైన అపాయాలనుండి కాపాడతారో వాళ్ళని నమ్ముతారు.
చర్చి ఈ సృష్టికి ఆది, అంతమూ అనంతమైన కార్య-కారణ సంబంధాలవల్ల జరుగుతుందంటే ఒప్పుకోదు.
ఈ చర్చి సాధించిన మంచి ఏమిటి?
చర్చి శాంతిని బోధించేనని చెప్పుకుంటుంది, ఎందుకంటే దాని వ్యవస్థాపకుడు, ‘నేను ఇక్కడ శాంతిని స్థాపించడానికి రాలేదు, ఖడ్గంతో వచ్చేను’ అని చెప్పేడు గనుక.
అది కుటుంబాలని నిలబెట్టేనని చెప్పుకుంటుంది, ఎందుకంటే దాని వ్యవస్థాపకుడు భార్యాబిడ్దలను పరిత్యజించినవారికి ఇహంలో వందరెట్లు, పరంలో అనంతమైన సుఖాలు ఇస్తానని వాగ్దానం చేసేడు గనుక.
మనుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని బోధించేనని, ప్రభువు ఉపదేశం ప్రపంచమంతటికీ చాటుతున్నాననీ చెప్పుకుంటుంది. ఎందుకంటే క్రీస్తు సమారియాకి చెందిన స్త్రీతో, ‘ఇజ్రాయేలులో దారి తప్పిన గొర్రెలకోసం వచ్చేను. పిల్లల నోళ్ళ దగ్గర రొట్టె లాక్కుని కుక్కలకు ఆహారంగా వెయ్యడం ధర్మం కాద’ని చెప్పేడు గనుక.
శాశ్వతమైన శిక్షతో బెదిరించిన క్రీస్తు పేరు మీద అది క్షమని బోధించింది.
ఈ సంప్రదాయ మతబోధకుల వల్ల ప్రయోజనం ఏమిటి?
వాళ్ళు ఆనందానికి శత్రువులు. నాట్యం వాళ్ళదృష్టిలో ఘోరమైన పాపం. వాల్జ్, పోల్కా వంటి నృత్యాల్లో అనైతికతకి వాళ్ళు దిగ్భ్రాంతులయ్యారు. నాటకకళకి వాళ్ళు శత్రువులు. నటులని, నటీమణులనీ అప్రతిష్టపాలు చేశారు. శాబత్ (Sabbath) లోని పవిత్రగంభీరతను నిలబెట్టడానికి వాళ్ళు ప్రాకులాడుతుంటారు. ఆరోజు ప్రజలు ఆనందంగా ఉండడం వాళ్ళకి కంటకంగా ఉంటుంది. సముద్రతీరాల్లో అలలవెంట పరిగెత్తడాన్ని, అడవుల్లో చెట్లనీడలకు ఆరాటపడుతూ చేసే విహారయాత్రలని, వనభోజనాలనీ వద్దని బోధిస్తారు. సైకిళ్ళన్నా, నిక్కర్లన్నా వాళ్ళకి ధర్మాగ్రహం. విడాకులకు వారు వ్యతిరేకం. ప్రభువు ప్రాభవం నిలబెట్టడానికి ఒకర్నొకరు అసహ్యించుకుంటున్నప్పటికీ దంపతులు బలవంతంగా కలిసి బ్రతకాలి. బైబిలును ప్రేమించడం తప్ప ఏ ఇతర సాహిత్యమన్నా అసహ్యమే. ప్రపంచ సాహిత్యంలో అద్భుతమైన కావ్యాలు ఏవీ వారు చదవడానికి యోగ్యమైనవి కావు. ప్రార్థనా గీతాలతోను, మృత్యువు, నరకం గూర్చి చెప్పిన పద్యాలతోనూ ప్రజలు సంతృప్తి చెందాలి.
వారు కళాద్వేషులు. గ్రీకు శిల్పాలన్నా, అసలు మనిషి శిల్పాకృతులన్నా ఇష్టం ఉండదు. వాళ్ళకి బొమ్మలు, శిల్పాలూ అక్కరలేదు; చేతులు, ముఖాలు, దుస్తులూ కావాలి. ఈ మతబోధకులలో చాలామంది నంగనాచులు. వాళ్ళు రహస్యంగా ఏది మెచ్చుకుని, ఆనందిస్తారో, బహిరంగంగా దాన్ని అసహ్యించుకుంటారు. నగ్నత్వానికి ఎదురుగా నిలిచినపుడు తమ పవిత్ర హస్తాలతో కళ్ళు మూసుకుంటారు గాని, వేళ్ళ మధ్య ఎడం ఉంచడం మరిచిపోరు. నైతికబోధనకి సమ్మతిస్తున్నట్టు నటిస్తూనే, చట్టం నియంత్రించాలని కోరుకుంటారు. వాళ్ళ చేతిలో అధికారం ఉంటే, స్త్రీపురుషులు ఆనందించే అన్ని విషయాలనూ వాళ్ళు నిషేధించి ఉండేవారు. శాబత్ రోజుల్లో, గ్రంథాలయాలు, మ్యూజియంలు, చిత్ర శాలలు, నాటక శాలలూ మూసివేయాలని కోరుకుంటారు. ఆదివారాలు, పండగరోజుల్లో వార్తాపత్రికలు, కార్లు, బస్సులూ నిషేధించి ప్రబోధాలు, ప్రార్థనలు, కీర్తనలూ విని ఆనందించమని ప్రజల్ని బలవంతం చేస్తారు.
ఈ మతబోధకులు వాళ్ళ సమావేశాలకు పేదలు హాజరు అయినప్పుడు ట్రస్టులమీద, వాణిజ్య సంఘాలు, వర్తకవ్యవస్థ, సంపద, మారుతున్న సంప్రదాయాలు, భోగలాలసలు వంటివాటన్నిటి మీదా విరుచుకుపడతారు. అప్పుడు దయాగుణ సంపద గురించి, లాజరస్ పునర్జీవనం గురించీ చెప్పి, సంపన్నులు నరకంలో ఉన్నట్టు, పేదలు స్వర్గంలో ఉన్నట్టూ చిత్రిస్తారు.
సమావేశాలు ధనికులతో జరిపినప్పుడు వాళ్ళ తూటాలు రెండవవైపు ఎక్కుపెడతారు.
వారికి విద్య పట్ల, ప్రజలకు మానసిక వికాసం కలిగించడంపట్ల నమ్మకం లేదు. వాళ్ళు ఆశలకు, భయాలకే విలువిస్తారు. వారు ఎవరినీ ఆలోచించమని గాని, పరిశోధించమని గాని చెప్పరు. అందరూ విశ్వాసం కలిగి ఉండాలని మాత్రమే బోధిస్తారు. వాళ్ళ దృష్టిలో విశ్వాసం అత్యున్నతమైన లక్షణం, సందేహించడం అతి క్రూరమైన పాపకర్మ.
ఈ వ్యక్తులు విజ్ఞానానికి, ప్రగతిశీలమైన ఆలోచనల అభివృద్ధికీ శత్రువులు. గొప్ప గొప్ప మేధావులపై వాళ్ళు నిందలు మోపారు. పవిత్ర గ్రంథాలలో చెప్పినదానికి వ్యతిరేకంగా కనిపించిన ప్రతి సత్యాన్నీ వారు ఖండించేరు. వాళ్ళు ఇప్పటికీ యొహోవా చెప్పిన ఖగోళశాస్త్రాన్ని, మోజెస్ చెప్పిన భూభౌగోళిక శాస్త్రాన్నే నమ్ముతారు. గతంలో చేసినట్టు చెప్పిన అద్భుతాలనే నమ్ముతారు. ప్రత్యక్షంగా చూపిస్తున్నవి దేనినీ నమ్మరు. వాస్తవానికి విరోధులు, విజ్ఞానానికి బద్ధ శత్రువులు. ఈ జీవితంలో, ఇక్కడ హాయిగా ఆనందంగా ఉండటం లౌకికమని, క్రూరమని, మరొకలోకంలో సుఖపడాలనుకోవడం మాత్రం పుణ్యమని, ఆధ్యాత్మికమనీ బోధిస్తారు.
ప్రతీ సాంప్రదాయ చర్చి ఒక అసత్యం మీద, ఒక పొరపాటు మీద ఆధారపడి నిలబడినది. ప్రతి మతబోధకుడూ తనకు తెలిసినదాన్ని నిరాకరించి, తెలియనిదాన్ని ఉన్నట్టు ప్రచారం చేస్తాడు.
ఈ సంప్రదాయ మతబోధకులు అటు దైవానికీ ఇటూ మానవాళికీ చేస్తున్న సేవ ఏమిటి?
అక్షరాలా శూన్యం.
వాళ్ళు చేస్తున్న నష్టం ఏమిటి?
ప్రతి వ్యక్తిలోనూ మూఢనమ్మకాన్ని నాటుతున్నారు. మెదళ్ళు చచ్చుపడేలా చేసి, పిల్లల ఆలోచనాశక్తిని హరిస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో భయాలను నింపుతున్నారు. వాళ్ళ బోధనలతో వేలమంది మతిభ్రష్టులౌతున్నారు. వాళ్ళ దృష్టిలో ఆత్మవంచన గౌరవప్రదమైనది, స్పష్టత గర్హనీయమైనది. మనుషుల మనసులను ఎదురు తిరగలేని బానిసత్వంవైపు తీసుకెళుతున్నారు. వాళ్ళ బోధనలు విని మనుషులు తమ శక్తియుక్తులను వృధా చేసుకుని, అసాధ్యమైన వాటికి జీవితాన్ని అంకితం చేసుకుని, అగోచరమైన వాటిని ఆరాధిస్తూ, ఊహించలేనివాటికై ప్రార్థిస్తూ, అజ్ఞానం, అవివేకం నుండి పుట్టిన, దారుణమైన కల్పితగాథలకి వణుకుతూ బ్రతికే బానిసలుగా మారుతున్నారు.
మూఢనమ్మకం ప్రతి అందమైన ఈడెన్ ఉద్యానవనంలోనూ ప్రాకుతూ బుసలుకొట్టే ఒక విషసర్పం. అది దాని విషపుకోరలని మనుషుల గుండెలకే సూటిగా గురిపెడుతుంది. దానిని మించిన శత్రువు మానవజాతికి మరొకటి లేదు.
మూఢనమ్మకం ఒక యాచకుడు, ఒక నిరంకుశపాలకుడు. విజ్ఞాశాస్త్రం ఒక హితైషి.
మూఢ నమ్మకం రక్తం చిందిస్తుంది. విజ్ఞానం వెలుగులు విరజిమ్ముతుంది.
మన గౌరవనీయ మతబోధకులు ఈ సృష్టి క్రమాన్ని–ఈడెన్ వనాన్ని, మట్టిలోంచి చేసిన మనిషిని, అతని ప్రక్క ఎముకల్లోంచి సృష్టించిన స్త్రీని, నడుస్తూ, ప్రాకుతూ ఉండే సర్పాన్నీ–విడిచిపెట్టాలి. ఆపిలుని, మనిషి పతనాన్ని, అతని బహిష్కరణని, కత్తులతో ద్వారాలు పహారా కాసే దేవదూతలనీ విడనాడాలి. వరదని, బాబెల్ గోపురాన్ని, భాషల గందరగోళాన్నీ విడనాడాలి. అబ్రహామ్‌ని, జాకోబ్‌కీ దేముడికీ మధ్య జరిగిన మల్లయుద్ధాన్నీ విడిచిపెట్టాలి. అలాగే, యోసెఫ్ కథని, హీబ్రూలని ఈజిప్షియన్లు బందీలు చెయ్యడాన్ని, మోజెస్‌ని బుట్టలో విడిచిపెట్టడాన్ని, మండుతున్న పొదల్ని, కర్రలు పాములుగా, నీరు రక్తంగా మారడాన్ని, అద్భుతంగా సృష్టించిన కప్పలని, వడగళ్ళతో ఆవుల్ని చంపడాల్ని, దుమ్ము పురుగులుగా మారడాన్నీ విడిచిపెట్టాలి.
ఈ గౌరవనీయ మతబోధకులు కొమ్ము ఊదితే నగరపు కోటగోడలు పడిపోవని అంగీకరించాలి. జెఫ్తా (Jephthah) తన కూతుర్ని బలి ఇవ్వడం దారుణమని, దిన ప్రమాణం పెరగలేదని, యొహోవాకోసం చంద్రుడు ఆగలేదని, మరణించిన సామ్యూల్‌ని మంత్రగత్తె బ్రతికించలేదని, అగ్నిరథంలో మనిషి స్వర్గానికి ప్రయాణం చెయ్యలేదని, జోర్డాన్ నది ఉడుపుల తాకిడికి రెండుగా చీలలేదని, ప్రవక్తని చూసి నవ్వినందుకు పిల్లల్ని తోడేలు తినలేదని, అమాయకులైన ప్రజల్ని చంపడానికి దేశదిమ్మరియైన జోస్యుడు ఎవరూ మెరుపుల్ని మూటగట్టుకోలేదని, అతను వర్షాన్ని కురిపించడం, ఇనుము నీటిలో తేలేట్టు చెయ్యడం నిజంకాదని, బోధకులు భోజనం, విశ్రాంతి తీసుకుందుకి అనువుగా కాకులు హోటలు నడుపలేదని, ఒక రాజు వ్రణం నుండి కోలుకోడాన్ని సూచిస్తూ గడియారం ముల్లు పది డిగ్రీలు వెనకకు తిరగలేదని, ఎజెకీల్‌కి దేముడు భోజనాన్ని ఎలా తయారు చెయ్యాలో చెప్పలేదని, జోనా తిమింగలం కడుపులో ప్రయాణించలేదని, పాత నిబంధనల గ్రంథంలో చెప్పిన అద్భుతాలు కథలుగా చెప్పిన నిజాలు కావని, అవి పచ్చి అబద్ధాలనీ అంగీకరించాలి.
ఈ గౌరవనీయ బోధకులు ప్రకృతిసిద్ధంగా తండ్రిలేకుండా అద్భుతమైన పిల్లలు పుట్టరని, ఒకవేళ క్రీస్తు నిజంగా జీవించి ఉంటే, ఒక సామాన్య మానవుడు తప్ప అంతకుమించి ఏమీ కాదనీ అంగీకరించాలి. అతను దయ్యాలను విసిరిపారెయ్యలేదని, అంధత్వాన్ని ఉమ్ముతో మట్టితో పోగొట్టలేదని, నీటిని మదిరగా మార్చలేదని, శూన్యం లోంచి రొట్టెముక్కలను, చేపలనూ సృష్టించలేదని, నోటిలో నాణేలున్న చేపలు ఎక్కడ ఉంటాయో అతనికి తెలియదని, నీటిమీద నడవలేదని, అగోచరుడు కాలేదని, మూసిన తలుపులలోంచి బయటకు రాలేదని, మృతుల్ని బ్రతికించలేదని, దేవదూతలు సమాధి మీది రాళ్ళు దొర్లించలేదని, క్రీస్తు మరణించిన తర్వాత లేవలేదని, స్వర్గాన్ని అధిరోహించలేదనీ అంగీకరించాలి.
ఈ పొరపాట్లు, భ్రమలు, భ్రాంతులు, ఈ అద్భుతాలు, కట్టుకథలు, వివేకవంతులైన మనసులలోనుండి తొలగిపోవాలి.
గౌరవనీయులైన బోధకులారా, మిమ్మల్ని నేను అభ్యర్థించేది ఒక్కటే: నిజాన్ని చెప్పండి. మీ కూటముల్లో బైబుల్ లోని ఆదిపంచకాలను (Pentateuch) రాసింది మోజెస్ కాదని చెప్పండి. ఆ ఐదు పుస్తకాలు రాసింది ఎవరో తెలీదని చెప్పండి. బైబుల్ లోని ఐదవ ఆగమనం (Deuteronomy) క్రీస్తుకు పూర్వం ఆరవ శతాబ్దంలోనే రాయబడిందని చెప్పండి. జాషువా గాని, జడ్జెస్ గాని, రూత్, శామ్యుఎల్, కింగ్స్, క్రానికిల్స్, జాబ్స్, సామ్స్, లేదా సాలమన్ పాట, మొదలైనవన్నీ ఎవరు రాసేరో తెలియదని చెప్పండి. నిజం చెప్పడంలో నిజాయితీగా ఉండండి. ఎస్థర్ ఎవరు రాసేరో తెలీదని, ఎక్లెసియాస్టస్ (Ecclesiastes) క్రీస్తుకు చాలా పూర్వమే రచింపబడిందని, అందులో జరుగుతాయని ముందుగా పేర్కొన్న అద్భుతాలన్నీ నిజానికి, జరిగిన తర్వాత వ్రాయబడ్డాయనీ చెప్పండి. ఎజెకీల్, డేనియల్ ఇద్దరూ పిచ్చివాళ్ళని చెప్పండి. గాస్పెల్స్ ఎవరు రాసేరో తెలీదని చెప్పండి. క్రీస్తు గురించి అతని సమకాలీనులు చెప్పిన ఒక్క వాక్యమూ దొరకలేదని చెప్పండి. ఇవన్నీ ఊహలేనని, ‘అయితే, బహుశా’ అనీ చెప్పండి. నిజాయితీగా ఉండండి. సత్యాన్ని వచించండి. మీ మేధను పెంచుకోండి. మీలోని వివేకాన్ని తలెత్తుకుని నిలబడేలా ఉంచడానికి మీకున్న ఇంద్రియజ్ఞానాన్ని వినియోగించండి.
రానున్న కొద్ది రోజుల్లో చర్చిలోని వేదికలను మతబోధకులకు బదులు ఆలోచనాపరులు, ధైర్యం నిజాయితీ గల ఆచార్యులు, అధిరోహించబోతున్నారు. కూటములు సంస్కారవంతంగా, మేధోపరమైన నిజాయితీ గలిగి యోగ్యంగా ఉండబోతున్నాయి.
ఇప్పుడు చాలామంది బోధకులు అనాదిగా చెప్పుకొస్తున్న, సమర్థించశక్యం కాని అసత్యాలనన్నిటిని, కొనవూపిరితో, ఊతకర్రమీద నడుస్తున్న అద్భుతాలని, పొరపాట్లనన్నిటినీ గౌరవించాలని, వాటిని తూరుపుదేశస్థులు చెప్పుకునే ప్రతీకలు, రూపకాలుగా, ఈశ్వరప్రేరితమైన రచనలుగా పరిగణించాలనీ చెబుతున్నారు. వాటిముందు, తక్కిన భావనలన్నీ తలవంచాలని, బూజుపట్టిన ఈ భావాలను గౌరవించాలనీ చెబుతున్నారు. ఈ అసత్యాలు, ఈ వంచనలు, ఈ అబద్ధాలు, పొరపాట్లూ శతాబ్దాలుగా పాలించి, బానిసలుగా చేసి, మానవజాతిని ఆలోచనాశక్తిని కలుషితం చేశాయని వాళ్ళు గుర్తుంచుకోవాలి.
ఈ మతబోధకులు వారి విశ్వాసాలు, ఊహాత్మక సత్యాలూ నోటిమాట ద్వారానే నిరూపించబడ్డాయని కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ దగ్గర హామీలు, బెదిరింపులూ తప్ప ఋజువులేవీ లేవని గుర్తుంచుకోవాలి. పదార్థానికంటే ముందు శక్తికి అస్తిత్వం లేదని, శక్తి లేకుండా పదార్థ అస్తిత్వం ఊహించలేమనీ; అలాగే పదార్థాన్ని, శక్తినీ సృష్టించడం గాని, వినాశనం చెయ్యడం గాని సాధ్యపడదని, సర్వజ్ఞుడైన వ్యక్తి, సర్వవ్యాపియై, అనాదిగా ఈ సృష్టిని ఆవరించి ఉండడం ఊహకి అందదని, సృష్టికర్తని గాని, అతను ఈ సృష్టిని సృష్టించడాన్ని గని ఊహించలేమని తెలుసుకోవాలి.
క్రైస్తవుల దేవుడు ఊహకి కట్టిన పట్టం, ఒక అనుమానం.
ఎక్కడినుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో అన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఏ వ్యక్తి గాని, వ్యక్తుల సమూహం గాని చెప్పలేదు. ఈ సృష్టి రహస్యాన్ని మానవ మేధ విశదీకరించలేదు.
మన పుట్టుకకి పూర్వస్థితి, అస్తిత్వం, మనం చేరుకోలేము. మరణానంతరస్థితిని మనం చూడలేము. అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు, మన సమస్త విజ్ఞానం, అనుభవం, కేవలం ఈ జీవితకాలానికే పరిమితం, ఈ లోకానికే పరిమితం.
మనకి స్త్రీలు, పురుషులు, పిల్లలూ ఉండడం అన్నది వాస్తవమని తెలుసు. ఆనందం అన్నది, ఎక్కువ భాగం, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది.
దేవతలందరూ మనసు సృష్టించిన అభూతకల్పనలని, ప్రకృతికి అతీతమైనది ఏదీ ఉండదని నమ్ముతున్నాం.
ఆశకి, వాస్తవమైన జ్ఞానానికీ మధ్యనున్న తేడా మనకి తెలుసు. ఈ లోకంలో ఆనందం గురించి ఆశపడతాం. మరణానంతరపు జీవితం గురించి కలలుగంటాం గాని దాని గురించి తెలీదు. దానిగురించి మనం రూఢిగా ఏదీ చెప్పలేము. కేవలం ఆశపడగలం. మనం కలలు గనవచ్చు. విశాలమైన రాత్రిలో, మన నక్షత్రం మెరిసి దాని ప్రకాశం మనం ప్రేమించే వారి సమాధులమీద పడవచ్చు. తెల్లగా పాలిపోయి కళావిహీనమైన మృతులపై తొంగి చూసి, ఈ జీవితం పరిసమాప్తి అయిన తర్వాత, నిట్టూర్పులు, కన్నీళ్ళు, గుండెకోతలూ ఉండవని చెప్పవచ్చు.
ముగింపు
మనం నిజాయితీగా మాటాడుకుందాం. మన ఆత్మల సత్యసంధతని కాపాడుకుందాం. తల్లి ఒడిలో, ఉయ్యాలలో ఉండగానే విద్యాభ్యాసం మొదలవ్వాలి. అదే తొలి బడి. మొట్టమొదటి గురువైన తల్లి ఎంతో నిజాయితీతో మెలగాలి.
ఆ పురిటిగది అబద్ధాలకు నెలవు కాకూడదు. తల్లిదండ్రులు వాళ్ళ అజ్ఞానాన్ని అంగీకరించగల వినమ్రులై, నిజాయితీపరులై ఉండాలి. నిరూపించలేని సత్యాన్ని దేన్నీ సత్యంగా ప్రచారం చెయ్యకూడదు.
ప్రతి బిడ్డకీ ప్రశ్నించడం, పరిశోధించడం, కారణాన్ని వివరించమని అడగగలగడం బోధించాలి. అసత్యాలనుండి, పొరపాట్లనుండి, వంచననుండి, కాపాడుకుంటూ ప్రతి వ్యక్తీ తన విశ్వాసాన్ని సమర్థించుకోగలిగి ఉండాలి. చర్చి వేదికలపై నిలబడే మనుషులతో సహా, దేన్నైనా నమ్మబలికే వ్యక్తులను ఒక కంట కనిపెట్టి ఉండాలి.
పిల్లలు తమ సందేహాలను అడుగుతూ సంతృప్తికరమైన సమాధానాలు వచ్చేలా నిలదియ్యగలిగేట్టు ప్రోత్సహించాలి. విద్యాభ్యాసం యొక్క పరమార్థం ఇంద్రియజ్ఞానాన్ని పెంపొందించుకుని వివేచనాశక్తి అభివృద్ధిచెందడం. ప్రతి పాఠశాలా మనసుకి చక్కని వ్యాయామశాలలా పనిచెయ్యాలి. ప్రతి విద్యార్థీ జీవిత పోరాటాన్ని ఎదుర్కోడానికి కావలసిన నైపుణ్యాన్ని సంపాదించాలి. విశ్వాసము, ఎదురులేని విధేయతా బానిసలకి అలంకారాలు. ఇవి స్వేచ్ఛగా ఉన్నవాళ్ళని బానిసలుగా మారుస్తాయి. పరిశోధించి తెలుసుకోకూడని, అర్థం చేసుకోలేనంత పవిత్రమైన విషయం ఏదీ లేదని అందరికీ తెలియజెయ్యాలి.
చర్చి, పురోహితుడు, మతం, పవిత్ర గ్రంథం ఏమి చెప్పినప్పటికీ, ప్రతి మనిషికీ తనచుట్టూ ఆవరించిన అజ్ఞానపు తెరలు తీసుకుందుకు, ముసుగులు తొలగించుకుందుకు, అడ్డుగోడలు కూలగొట్టుకోడానికి, ఎత్తులు, లోతులు, రహస్య ప్రదేశాలూ శోధించడానికీ హక్కు ఉంది.
అనంతమైన ఈ ప్రకృతి పుస్తకం అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ పుస్తకాన్ని తెలివైనవారు, నిజాయితీపరులూ తప్ప ఎవరూ చదవలేరు. ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో చదివినపుడు పుస్తకంలోని ప్రతి పేజీ మసకగా కనిపిస్తుంది. ఆత్మవంచన తప్పుగా చదివి, తప్పుగా ఉటంకిస్తే, వివేచన చేయకుండా నమ్మే స్వభావం దాన్ని ఉన్నదున్నట్టుగా ఆమోదిస్తుంది. మూఢనమ్మకం ఒక్క వాక్యాన్ని కూడా సరిగ్గా చదవలేదు, ఒక్క చిన్న మాటనీ సరిగా పలకలేదు. అయినా అనంతమైన ఈ ప్రకృతి పుస్తకంలో సృష్టికి చెందిన సమస్త జ్ఞానము, సత్యమూ నిండి ఉండడమే కాదు, ఇది మనిషి ఆలోచనలకు ఉన్న ఒకే ఒక ఆధారం. మానసిక స్వాతంత్య్రం అంటే అందరికీ ఈ పుస్తకాన్ని చదవలిగే హక్కు. ఇక్కడ పోప్ అయినా, సామాన్య రైతయినా ఒక్కటే. ఎవరి మట్టుకు వారు చదువుకోవాల్సిందే; వాళ్ళు నేర్చినది, చదివి అర్థంచేసుకున్నది, నిర్భయంగా, నిజాయితీగా సాటి జనులకు తెలియపరచవలసిందే.
చర్చిలకి గాని, పురోహితులకి గాని ప్రకృతిమీద ఎటువంటి అధికారాలూ లేవు. అధిక సంఖ్యాకుల అభిప్రాయాలు లేదా మెజారిటీలు ఇక్కడ చెల్లుబాటు అవవు. ఇక్కడ కేవలం ప్రకృతికి మాత్రమే, మనం తెలుసుకున్న సత్యాలకు మాత్రమే అధికారం. సత్యాలే మన యజమానులు, అజ్ఞానానికి శత్రువులు, వివేకవంతులకు స్నేహితులూ, దాసులూ.
అజ్ఞానం అద్భుతాలకు, దౌర్భాగ్యానికి, మూఢనమ్మకానికి, శోకానికి, లేమికి, వృధాకీ కన్నతల్లి.
విజ్ఞానం ఒక్కటే నిజమైన వెలుగు. అదే అడ్డంకుల్ని తొలగించుకుని, మనం రాజమార్గంలో ఉండేలా సహకరిస్తూ, ప్రకృతిశక్తులని అనుకూలంగా మలుచుకునేట్టు మనకు తోడ్పడుతుంది. మానవజాతిని ఉన్నత స్థితికి ఎత్తగలిగిన ఏకైక సాధనం అది. మనిషి మేధస్సుని వికసింపజెయ్యటం అంటే, మనిషిని నాగరికుడిగా చెయ్యడమే. విజ్ఞానం స్వర్గం నరకం అనే చీకట్లనుండి భయం అనే భూతాన్ని నాశనం చేస్తుంది. చీకటి నిండిన మనసు లోయలను వెలుగుతో నింపుతుంది.
ప్రకృతికి అతీతమైన శక్తి ఉందనడానికి ఎటువంటి దాఖలాలూ లేవని అందరికీ చెప్పాలి. కొయ్యబొమ్మ ముందు, రాతిబొమ్మ ముందూ ప్రార్థనచేసేవాడు ఎంత మూర్ఖుడో, మనసులో దేముడిని ఊహించుకుని ప్రార్థన చేసేవాడు కూడా అంతే మూర్ఖుడని చెప్పాలి; అసలు పూజలన్నిటికీ ఒకే భయం, ఒకే అజ్ఞానం, ఒకే పొరపాటు పునాది. వ్యక్తిగతంగా దేముడు తనను కాపాడుతున్నాడని, సైతాను తనను వెంటాడుతున్నాడని నమ్మడం, దయ్యాలలో పెద్దవి చిన్నవి ఉంటాయని నమ్మినంత మూర్ఖత్వం.
కనుక అందరికీ ఒక విషయం విడమరచి చెప్పాలి. ప్రకృతి శక్తులని, సత్యాలని మన ప్రార్థనలతో, పొగడ్తలతో, అభ్యర్థనలతో, పూజలతో, బలి ఇవ్వడాలతో సంతృప్తిపరచడం గాని, మార్చడం గాని, నియంత్రించడం గానీ చెయ్యలేము. మాయలు, అద్భుతాలూ అనేవి ఉండవని, ఒక శక్తిని మరొక శక్తి మాత్రమే ఎదుర్కోగలదని, ఈ సృష్టి అంతా సహజంగా ఉద్భవించిందనీ చెప్పాలి. ప్రకృతికి మించి మనని రక్షించగల శక్తి ఏదీ లేదని, అలాగే, దానికి మానవుడి పట్ల జాలి గాని, వైరం గాని లేవని, ఆ ప్రకృతిశక్తులు మానవుడి ఉనికితో సంబంధంలేకుండా, చెయ్యాలన్న తలంపుతో మేలు చెయ్యడం గాని, కీడు చేసినందుకు విచారం వెలిబుచ్చడం గాని చెయ్యవనీ చెప్పాలి.
నిజమైన మతం అందరికీ ప్రయోజనకారిగా ఉండగలగడమే పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పాలి. పోప్‌లయినా, కార్డినల్స్ అయినా, బిషప్పులయినా, ప్రీస్టులయినా, పార్సన్‌లయినా, ఎందుకూ ఉపయోగం లేనివారే. వారు ఏదీ ఉత్పత్తి చెయ్యరు. వాళ్ళు ఇతరులు చేసే కష్టం మీద జీవిస్తారు. భయపడినవారి మీద బ్రతికే పరాన్నభుక్కులు వారు. నిజాయితీగా కష్టపడి పనిచేసేవారి రక్తాన్ని పీల్చే రక్తపిశాచులు. ప్రతి చర్చీ వ్యవస్థీకరించిన యాచకత్వం. అందులో అందరూ భయపెట్టో, బలవంతానో సంపాదించిన ముష్టి మీద జీవించేవారే. ప్రతి సంప్రదాయ చర్చి స్వర్గాన్ని ఆశపెట్టి, నరకంతో భయపెడుతుంది. ఈ వాగ్దానాలు, బెదిరింపులూ డబ్బు సంపాదించుకుందుకూ, ముష్టెత్తుకుందుకూ చేసిన ప్రయత్నాలు. ప్రతి చర్చీ ‘విశ్వాసంతో దానం చెయ్యి’ అని అడుగుతుంది.
ప్రపంచానికి నవశకం ఆరంభమవుతోంది. మతం యొక్క నిరుపయోగ్యత ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు.
అడవుల్ని నరికినవాళ్ళు, భూమిని చదునుచేసి దున్నినవాళ్ళు, ఉక్కు వంతెనలతో నదులకు వారధి కట్టినవాళ్ళు; పెద్ద పెద్ద ఓడలు, పంటకాలువలు, రైలుమార్గాలూ నిర్మించినవారు; ఇంజన్లను, స్వయంచాలిత యంత్రాలనూ కనిపెట్టినవాళ్ళు మనుషుల అనేక అవసరాలను తీరుస్తున్నారు. తంతితీగల్ని, తీగెలద్వారా వార్తాప్రసారాన్ని, ఆలోచనలని, ప్రేమనీ బట్వాడా చేసినవారు; ప్రపంచానికి కావలసిన దుస్తుల్ని తయారుచెయ్యడానికి నూలు కండెలని, మగ్గాలని కనిపెట్టినవారూ, కవిత్వాన్ని, కల్పనలని, సత్యాన్నీ ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావడానికి, రానున్న తరాలకు భద్రపరచడానికీ అచ్చుయంత్రాన్ని, పత్రికలనీ కనుగొన్నవారు; మనం నిత్యం ఉపయోగించే కలప, ఉక్కు ఉత్పత్తుల్ని ఒడుపుగా పోతలలోంచి తయారుచెయ్యగల అద్భుతమైన మూస యంత్రాలను కనిపెట్టినవారు; రోదసిని పరీక్షించి నక్షత్రాల కదలికలని కనిపెట్టినవారు–వీరందరూ మహాపర్వతశ్రేణిని, ఎగసిపడుతున్న సముద్రాన్నీ దగ్గరగా చదివినవారే.
బాధలను ఉపశమింపజేసి జీవనప్రమాణాన్ని పెంచినవారు; ప్రపంచాన్ని విజ్ఞానపు వెలుగులతో నింపిన ప్రకృతి శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు; తమ అలోచనలతో మనసును సమ్మోహనపరిచిన కవులు; తమ చిత్రాలను, జీవకళ ఉట్టిపడే శిల్పాలనూ తమకు బదులుగా మాటాడేలా తీర్చిదిద్దిన చిత్రకారులు, శిల్పులు; ప్రపంచాన్ని తమ వాగ్ధాటితో ఉర్రూతలూగించిన ఉపన్యాసకులు, శబ్దానికి తమ ఆత్మలను అంకితం చేసిన సంగీతకారులు, గొప్ప పరిశ్రమలను స్థాపించినవారు, న్యాయం కోసం పోరాటంచేసిన సైనికులు, ఉపయోగకరమైన పనులుచేసే అనేక కోట్లమంది మనుషులు–వీరే మనకు క్రీస్తులు, ఋషులూ. విజ్ఞానశాస్త్రం సాధించిన విజయాలే మన అద్భుతాలు. ప్రకృతి సత్యాలతో నిండిన పుస్తకాలే మన పవిత్ర గ్రంథాలు. అణువు మొదలు నక్షత్రం దాకా, జీవం ఉన్న ప్రతి వస్తువులోనూ అంతర్లీనంగా ఉండి, వాటి ఎదుగుదలకు సహకరిస్తూ, ఆలోచించగల శక్తినిచ్చి, ఆనందంలోను విషాదంలోను తోడు ఉండే శక్తి మనకున్న ఏకైకదేముడు.
పరమాత్మ గురించి మనంత మనం తెలుసుకోలేము. ఆ భావన ప్రకృతి పరిమితులకి అతీతమైనది. మనం అధిగమించలేనిది. మన పరిధిలో ఉన్న అన్ని బాధ్యతలు, విద్యుక్త ధర్మాలు, మనం నెరవేర్చవలసిన కార్యస్థానం–ఇక్కడే. ఈ లోకంలోనే. మనం ఒకర్నొకరు ప్రేమించుకుంటూ శ్రమిద్దాం. మనం ఒకరికొకరు నిరీక్షించి కలిసికట్టుగా పనిచేద్దాం. ధైర్యాన్ని, ఉల్లాసాన్నీ అలవరచుకుందాం. మన హృదయాలను మంచిదనానికి, మన బుద్ధిని సత్యానికీ తెరుద్దాం. మనం స్వేచ్ఛగా జీవిద్దాం. భవిషత్తు మన పిల్లలకి శాంతిని, ఆనందాన్నీ తీసుకొస్తుందని ఆశిస్తూ, అన్నిటికంటే మిన్నగా, మన ఆత్మల సత్యసంధతని పరిరక్షించుకుందాం.