ఈమాట జులై 2007 సంచికతో మొదలై నిరాఘాటంగా షుమారు పన్నెండేళ్ళు సాగిన నాకు నచ్చిన పద్యం శీర్షిక అనివార్య కారణాల వల్ల వచ్చే సంచిక నుండీ ఆగిపోతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాం. కేవలం ఒక పద్యానికి అర్థం చెప్పడమే కాదు, ఆ పద్యం ఎందుకు మంచి పద్యమో, అందులో కవి గొప్పతనమేమిటో, ఇలా వివరించి చెప్తూ పద్యకవిత్వపు లోతులని నేటి పాఠకులకు అందజేయడం ద్వారా వారికి పద్యాన్ని, తద్వారా కవిత్వాన్ని చదవడం ఎలాగో కూడా తెలియజెప్పిన శీర్షిక ఇది. మొదలైన నాటినుండీ ఎందరో పాఠకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన శీర్షిక ఇది. ఈ శీర్షికను ఇన్నేళ్ళపాటు సమర్థవంతంగా పాఠకాదరణకు ఇంతగా నోచుకొనేలా నిర్వహించిన చీమలమర్రి బృందావనరావు, భైరవభట్ల కామేశ్వరరావులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతీ సంచికకూ కాకపోయినా, ఇక ముందు కూడా వారికి నచ్చిన పద్యాలను అప్పుడప్పుడు ఈమాట పాఠకులతో పంచుకుంటూ ఉంటారని, ఉండాలని ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో, ఈ శీర్షికను ఇక ముందు కొనసాగించటానికి, ఇదే ధోరణిలో తమకు నచ్చిన పద్యాలను పాఠకులకు పరిచయం చెయ్యడానికి, ఇతర కవిపండితరచయితలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
ఇటాలియన్ ఆపెరాలను తెలుగులో యక్షగానాలుగా పునఃసృజిస్తున్న తిరుమల కృష్ణదేశికాచార్యుల మరొక నాటిక సేవికయే నాయిక; నలభై అయిదేళ్ళకు పైగా అమెరికా విశ్వవిద్యాలయాలలో తన తెలుగు సాహిత్య పరిశోధనలో భాగంగా రాసిన వ్యాసాలే కాక ఎన్నో అనువాదాలు కూడా చేసిన ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు అమోఘమైన కృషిని తెలుగువారికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో పరుచూరి శ్రీనివాస్ ఆయనతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం జరిపిన ఇంటర్‌వ్యూ; ఇటీవల మరణించిన విశిష్ట కథకుడు కవనశర్మ స్మృతిలో దాసరి అమరేంద్ర నివాళితో పాటూ ఆయన కథలు; ఇతర రచనలు, గడి నుడి…ఈ సంచికలో.
ఈ సంచికలో
- కథలు: చేయగలిగింది – చంద్ర కన్నెగంటి; సాక్ష్యం – ఆర్ శర్మ దంతుర్తి; ఈ కథ – మాధవ్ మాచవరం (ఎట్గార్ కెరెట్); పరిధి – కవన శర్మ; భయం-భక్తి – కవనశర్మ; బేతాళ కథలు: కథన కుతూహలం-9 – టి. చంద్రశేఖర రెడ్డి; గోరీ డెత్ అను హెల్మెట్ కథ – వేగోకృప.
- కవితలు: మాటకు మాట – విజయ్ కోగంటి.
- ఇతరములు: చిరంజీవి శర్మ – దాసరి అమరేంద్ర; వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ – పరుచూరి శ్రీనివాస్; ఆ రేయి నీరెండ – అన్వర్, కె.ఎన్.వై. పతంజలి; నాకు నచ్చిన పద్యం: అభినవ పోతన అభివ్యక్తి సొగసు – చీమలమర్రి బృందావనరావు; పద్యరూపకం: సేవికయే నాయిక – తిరుమల కృష్ణదేశికాచార్యులు; గడి నుడి-29 – కొల్లూరు కోటేశ్వరరావు.
- శబ్దతరంగాలు: సి. ఎస్. ఆర్ పాటలు – సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.