చిరంజీవి శర్మ

[రచయిత కవనశర్మ అక్టోబర్ 2018లో మరణించారు. వారి జ్ఞాపకార్థం వారి మిత్రులు 2019 జనవరి 27న కవనస్మృతులు అన్న పుస్తకం విడుదల చేశారు. ఆ పుస్తకంలోనుంచి ఈ వ్యాసంతోబాటు కవనశర్మ రాసిన రెండు కథలు ఈ సంచికలో తిరిగి ప్రచురిస్తున్నాం. – సం.]


సుమారు పాతికేళ్ళక్రితం ప్రసిద్ద పాపులర్ రచయిత కుష్వంత్‌సింగ్‌ను ఆయన ఇంట్లో కలిసి గంటన్నర గడిపి వచ్చాను. అప్పటికి ఆయన వయసు ఎనభై దరిదాపు. ఆయనతో ఉన్నంతసేపూ, ఆయన మాటలు విన్నంతసేపూ భవిష్యత్తులోకి ఆశావహంగా తొంగితొంగి చూసే ఓ నవయువకుడే కనిపించాడు. ప్రాంతీయ, దళిత, స్త్రీవాద, మైనారిటీ సాహిత్యాల ఉనికినీ, అవసరాన్నీ స్పష్టంగా గుర్తెరిగిన అనుభవశీలి కనిపించాడు. తనను గానీ తన సాహితీసృష్టిని గానీ శ్రుతిమించిన అంచనాలకు గురిచేసి సంతృప్తి అసంతృప్తులతో వేగిపోయే ఊగిపోయే సగటు వయసు మళ్ళిన మనిషి జాడే కనిపించలేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కుష్యంత్‌సింగ్‌ను ఓ ముదుసలి మనిషిగా ఊహించుకోవడం దాదాపు అసాధ్యం.

దాదాపు కుష్యంత్‌సింగ్‌ను కలిసిన సమయంలోనే నాకు కవనశర్మతో మొట్టమొదటి సంపర్కం. అప్పటికి పాతికేళ్ళుగా ఆయన కథలూ నవలలూ వ్యంగ్య రచనలూ చదివి ఇష్టపడిన నేపథ్యంలో విశాఖ ద్వారకానగర్‌ లోని కందులవారింటికి వెళ్ళి కలిసి ఓ గంట గడిపి వచ్చాను. అప్పటికాయన ఏభైలు దాటుకొని అరవైకేసి వెళుతున్నారు. కానీ, ఆ మనిషిలోని వాడీ వేడీ వగరూ చూస్తే నాకు పాతిక ముప్పై ఏళ్ళ మనిషి అనిపించారు. మరో పాతికేళ్ళ తర్వాత 2018లో వివినమూర్తి సప్తతి సమావేశంలో చివరిసారిగా కనిపించినపుడు, అదే చురుకుతనం. అదే మాటకారితనం… ఎనభైలోకి వచ్చేశాను అన్నారు గానీ ఆ ఛాయలే కనిపించలేదు.

అవును, కొంతమంది నిత్యయవ్వనులు. సంజీవదేవ్‌నూ, ఆచంట జానకీరామ్‌నూ, దేవానంద్‌నూ, చార్లీ చాప్లిన్‌నూ వయసు మళ్ళినవారిగా ఊహించగలమా? భావించగలమా? ఆ కోవకు చెందిన మనిషే కవనశర్మ. ఇంకా చెప్పాలంటే తన భావనల బలంతో రచనల తాజాతనంతో కలకాలం జీవించే వ్యక్తుల కోవకు చెందిన మనిషి కవనశర్మ,


1953లో పదిహేనేళ్ళ వయసులో మొదటి కథ.

65 ఏళ్ళపాటు, వెళ్ళిపోయేవరకూ రాస్తూనే ఉన్నారాయన. చివరి రోజుల్లో కూడా ఫేసుబుక్‌ను తన మాధ్యమంగా చేసుకొని అనేకానేక విషయాలమీద వ్యాఖ్యలు, టపాలు, వ్యాసాలు రాశారాయన. మొహమాటాలూ, సంకోచాలూ లేకుండా రాశారు. నమ్మిన విషయాలను కుండ బద్దలుగొట్టి మరీ చెప్పారు. అవసరమయినచోట వివరణ, ఇంకా అవసరమయితే వాదన, అత్యవసరమయితే అక్షరాల పిడిగుద్దులు–దేనికీ వెరవని యోధుడు కవనశర్మ. ఆయన భావాలతో విభేదించినా కందుల వరాహ నరసింహశర్మని మనిషిగా అభిమానించకుండా ఉండలేము.

1953లో, పదిహేనేళ్ళ వయసులో మొదలయిన రచనా వ్యాసంగం 1970ల తొలిదశలలో మారాకుల స్థాయి దాటి పువ్వులూ ఫలాలూ ఇవ్వడం మొదలెట్టింది. అప్పటికి పదేళ్ళనుంచే ఆలోచనలు కలిగించే రచనలకు అలవాటుపడిన నాకు 70ల తొలి సంవత్సరాలలో బ్రెయిన్ డ్రైయిన్ అనే వడ్డించే మనవాళ్ళ కథలు పంచభక్ష్య పరమాన్నాలు అయ్యాయి. ఎవరీ కవనశర్మ అన్న ఆరా మొదలయింది. వివరాలు తెలిశాక మనలాంటి ఇంజనీర్, ఇంత గొప్పగా రాస్తున్నాడే అన్న ‘ఆరా’ మొదలయింది. పత్రికల్లో ఆయన రచనల్ని వెదికి చదవడం మొదలయింది. అలా ఆకర్షణ-వ్యామోహం, బంగారు రోజులు పరిచయమయ్యాయి. తెలుగు నవలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నడిపించినంత సులువుగా ఆస్ట్రేలియా నగరాల్లోనూ నడిపిస్తోన్న కవనశర్మమీద ఆకర్షణ, ఆరాధన మొదలయ్యాయి.

నాకు నలభైలు దాటి ఏభైలలోకి వచ్చి, సాహిత్యంతో ఆహ్లాదత వ్యంగ్యాలకన్నా ఆలోచనలూ ఆవేదనలకోసం వెదుక్కుంటోన్న సమయంలో శర్మగారు రాసిన ‘ఆమె ఇల్లు’, ‘విడాకులు’ కనిపించాయి. అరె! ఎంత గొప్ప విషయాలను తనదైన తేలికశైలిలో ఎంత గాఢమైన ఆలోచనకు హేతువులుగా చెయ్యగలిగాడూ అన్న సంభ్రమాశ్చర్యం… నాకు తెలియకుండానే అతని నుంచి మరిన్ని సీరియస్ రచనలకోసం ఎదురు చూశాను. కావాలని డిమాండ్ చేశాను. ఇదే డిమాండుకు కుష్యంత్‌సింగ్ తలవొగ్గి ‘అవును-నేను పాపులర్ రచనలవెంట పడకుండా సాహితీసృజనను మరికాస్త సీరియస్‌గా తీసుకొని ఉంటే బావుండేది’ అని అలవోకగా ఒప్పేసుకున్నారుగానీ కవనశర్మ–ఆయన మాటల్లోనే–మొండిఘటం, కొరకరాని కొయ్య. ‘ఏదో పొరపాటున సీరియస్ కథలు రాశానేగానీ నా బాడీ హాస్యవ్యంగ్యాలే. అసలు మీ బాపతు కుహనా కమ్యూనిస్టులకు హాస్యాన్ని ఆస్వాదించి గౌరవించడం తెలియదు.’ అని ఎదురుదాడికి దిగేవారాయన. ఆ మాటల యుద్ధం దాదాపు పాతికేళ్ళు సాగింది. ఆయన నన్ను గానీ, నేను ఆయన్ని గానీ ఒప్పించలేకపోయాం. ఇద్దరి మాటలూ నిజమే అయినపుడు అసలీ ఒప్పింపుకు ఆస్కారం లేదు కదా…

అలా అని ఆయన ఆలోచనలూ ఆవేదనలూ సామాజిక సంవేదనలూ ఆమె ఇల్లు, విడాకులు కథల దగ్గర ఆగిపోలేదు. నర్మదా బచావో ఆందోళనల సమయంలో ఏదో గలాక్సీలోని ఏదో గ్రహంవాళ్ళు దిగివచ్చి ‘మేము మీకన్నా ఎన్నో శతాబ్దాలు ముందున్నాం. విశ్వ శ్రేయస్సుకోసం అంతరిక్ష వారధులు నిర్మిస్తున్నాం. అందుకు మీ భూగ్రహం అడ్డొస్తోంది. ఫలాన ఫలాన సమయంలో దాన్ని పేల్చేసి దారి సుగమం చెయ్యబోతున్నాం. మూటాముల్లే సర్దుకుని సిద్ధంగా ఉండండి. మీ అందరికీ సురక్షితంగా మరో చక్కని గ్రహంలో పునరావాసం కల్పిస్తాం’ అని ప్రతిపాదించే బచావ్ అన్న కథ రాసి ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచేలా చేశారు. మచ్చిక, సృహ అన్న–విజ్ఞతగల పాఠకులు కూడా అంతగా గుర్తుపెట్టుకోని–విలక్షణమైన కథలు రాశారు.

అంతాకలసి నూట ఇరవై కథలు రాశారు కవనశర్మ.

కథలతోపాటు ఆరు నవలలు, ఎనిమిది నాటకాలు, సైన్సు సాహిత్యం, సరదాలకు చెందిన అనేకానేక వ్యాసాలు, ఇరాక్, ఇథియోపియాలలో పనిచేసిన నేపథ్యంలో రాసిన ఇరాక్ డైరీ, డింకనేష్ అన్న యాత్రానుభవాలు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమాలమీద ఉన్న వల్లమాలిన అభిమానంలోంచి రాసిన వ్యాసాలు, ఆత్మకథాత్మకంగా రాసిన మా కుటుంబం అన్న విలక్షణ పుస్తకం–నిజానికి కవనశర్మను ఏదో ఒక ప్రక్రియకు చెందిన రచయితగా పరిగణించడం చాలా కష్టం.

ఆయన రాసిన నవలలలో అతి విలక్షణమైనది పరిధి.

తనదైన బాణీలో సామాజిక సంబంధాలకు లెక్కలకు సంబంధించిన సెట్‌థీరీని అనుసంధించి క్రమక్రమంగా కౌటుంబిక సంబంధాల పరిధి ఎలా కుంచించుకుపోతోందో, మనిషి చిట్టచివరి తనకు తాను ఒక అతిచిన్న పరిధిలో మిగిలిపోయి ఎలాంటి సామాజిక ఎలియనేషన్‌కు గురి అవుతున్నాడో, గురిచేసుకుంటున్నాడో ఎంతో ఆసక్తికరంగా, ప్రతిభావంతంగా చిత్రించిన నవల ఇది. వల్లంపాటి లాంటి విమర్శకులూ, వివినమూర్తి లాంటి కథకులూ మెచ్చుకొన్న రచన ఇది. కవనశర్మ ఈ విషయంలో తన పరిశీలనా పరిధిని సోషియాలజీ ప్రాథమిక సూత్రాలను కూడా జోడించి ఉంటే ఆయా పరిధులు కుంచించుకుపోవడం వెనక ఉన్న కారణాలను కూడా మరింత శాస్త్రీయంగా నవలకు జోడించి ఆ రచనను ‘మంచి’ స్థాయి నుంచి ‘గొప్ప’స్థాయికి చేర్చగలిగేవారు కదా అనిపించింది.


ముందే చెప్పినట్టు కవనశర్మతో వ్యక్తిగత పరిచయం స్నేహానికి 1994లో పునాది పడింది.

విశాఖలో కలవడం, కారాకు జనపీఠం అవార్డు ఇవ్వడం కోసం ఆయన సంకల్పానికి తలపెట్టిన ఢిల్లీ సాహితీప్రియుల తరఫున చేయూత అందించడం, ఆ రవీంద్రభారతి సభలో పాలుపంచుకోవడం, ఆ సందర్భంగా ఆయనతో కలిసి విశాఖ నుంచి హైదరాబాదు వరకూ ఒకరోజంతా ప్రయాణం చెయ్యడం–పరిచయం స్నేహంగా పరిణమించిన దశ ఇది.

2000 సంవత్సరంలో నేను మకాం ఢిల్లీ నుంచి బెంగళూరు మార్చిన తర్వాత ఆ స్నేహం స్థిరపడింది. బలపడింది. తరచూ కలుసుకోవడం, ఒకరినొకరు అభిమానించుకోవడం, సాహిత్యం గురించి భిన్న కోణాలలో చర్చించుకోవడం మొదలయింది. ఆమె ఇల్లు, విడాకులు నాటి దృక్కోణం నుంచి ముందుకెళ్ళి జీవితాన్ని, సమాజాన్ని, చరిత్రను, సంప్రదాయాలను వర్తమానమూ భవిష్యత్తూ దృష్టితోనే కాకుండా గతకాలపు దృక్కోణాన్ని కూడా సంతరించుకొని చూడాలని ఆయన ప్రయత్నం చేస్తోన్న సమయమది. ఆ విషయంలో మా మధ్య చర్చలూ వాదాలు జరిగాయి. వాదించే అవకాశం ఆయన నాకిచ్చారు అనడం సబబు. కానీ ఆయనతో వాదించే మేధోపటుత్వం గానీ, మానసిక చురుకుతనం గానీ, గాఢత గానీ నాకు లేవని తెలిశాక నా వాదనలు చాలావరకూ తగ్గించుకొన్నాను.

ఈ సమయంలోనే బెంగళూరులో చర్చ అన్న సాహితీవేదిక రూపుదిద్దుకొంది.

అడపాదడపా కలిసే మేమంతా అనుకొని నెలకోసారి కలిస్తే బావుంటుందనీ, ఆ కలవడం ఒక స్పష్టతతో, ప్రయోజనం కోసం కలిస్తే బావుంటుందనీ నేను ప్రతిపాదించాను. అంతా అంగీకరించారు. కవనశర్మ, వివినమూర్తి, రజనీకాంత్, మన్నం రాయుడు, శ్రీవల్లీ రాధిక, వి. రామలక్ష్మి, బి. పద్మావతి, టైటానిక్ సురేష్, శైలేంద్ర, కందుల విజయలక్ష్మి, చోడవరపు ప్రసాద్, అపుడపుడు వచ్చి కలిసే కన్నెగంటి రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, బాబయ్య, వెల్దుర్తి హర్షవర్ధన్, అన్నపూర్ణ, చలసాని ప్రసాద్, కారా, సుధాకరరెడ్డి, ఎన్.జె.రావు–అద్భుతమైన సాహితీమిత్ర సందోహమది. దాదాపు ఏభై అయిదు నెలలపాటు ఎంపికచేసిన రచనలూ పుస్తకాల గురించి ఎంతో అర్థవంతమైన చర్చలు నడిచిన సందర్భమది. అందులో అతిచురుకైన పాత్ర కవనశర్మగారిది. 2009 తర్వాత ‘చర్చ’ ఓ నాలుగేళ్ళపాటు నడవలేదు. మళ్ళా పూనుకొని దానిని 2012లో పునరుద్ధరించి నూతన సభ్యులను సమకూర్చి, నిలబెట్టి నడిపించిన మనిషి కవనశర్మ. ‘చర్చ’ ఈనాటికీ కొనసాగుతోంది.

ఏదో సందర్భంలో నాతో కారా అన్నారు: ‘కథా సాహితీపరంగా నాకు రెండు జంటలంటే చాలా ఇష్టం. వాళ్ళ కార్యసరళినీ పురోగమనాన్నీ శ్రద్ధగా గమనిస్తున్నాను.’ అందులో ఒక జంట అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి. రెండవది వివినమూర్తి, కవనశర్మ. వీళ్ళిద్దరూ 80లో, 90లో మిత్రస్పర్ధతో కథలు రాయడం సాహితీ పరిశీలకులు గమనించిన విషయం. ఇద్దరూ ఆప్తమిత్రులన్నది నాబోటి వాళ్ళు దగ్గరగా ఉండి గమనించి మురిసిన విషయం…

ఇద్దరూ కలిసారంటే వ్యంగ్యాలూ, విసుర్లూ, చెణుకులూ గలగలా పారేవి. ఇద్దరూ ఏమాత్రం తగ్గకుండా మాటలయుద్ధం చేసేవారు. హెూలీ పిస్తోళ్ళతో మాటల రంగులు ఒకరిమీద ఒకరు విరజల్లుకొనేవారు. నేను బెంగళూరు చేరిన తర్వాత వారి వాగ్యుద్ధాలకు సాక్షినవడమేగాకుండా మూడో మనిషి పాత్ర పోషించడమూ జరిగింది. గాలి నా మీదగా మళ్ళిన తరుణాలు కోకొల్లలు. ‘ఆయన గురువు, ఈయన విధేయ శిష్యుడు’ అని కవనశర్మ నా గురించీ, వివినమూర్తి గురించీ ఆటపట్టించేవారు. అదో మధుర జ్ఞాపకం.

బెంగళూరులో ఐదారేళ్ళపాటు కలిసి నివసించడమే గాకుండా రెండు మూడు సందర్భాలలో కలిసి ప్రయాణాలు చేశాం. గడిపాం.

2012లో ననుకొంటాను తనకు గురుతుల్యులయిన కలువకొలను సదానందకు రావిశాస్త్రి అవార్డు ఇవ్వడంకోసం మేమంతా తిరుపతి వెళ్ళాం. ఒకేచోట రెండు రోజులు గడిపాం. విశ్వవిద్యాలయంలోనూ, ఊళ్ళోని దేవాలయాల్లోనూ కలిసి తిరుగాడాం. అదో మంచి జ్ఞాపకం.

అలాగే మూడు నాలుగేళ్ళక్రితం పలమనేరులో బాలాజీ నిర్వహించిన మెగా సాహితీగోష్టికి కవనశర్మ, అరిపిరాల సత్యప్రసాద్‌లతోపాటు నేనూ ఒకే కారులో బెంగళూరు నుంచి వెళ్ళి రోజు రోజంతా గడిపాను. అనేకమంది సాహితీ దిగ్గజాలనూ, నాయని కృష్ణమూర్తి, కరణం బాలసుబ్రమణ్యం పిళ్ళై లాంటి అరుదైన సాహితీమూర్తులనూ కలిసి పలకరించాం. జ్ఞాపకాలను ఉమ్మడిగా పోగుచేసి తెచ్చుకున్నాం.

2016 చివరిలో మా ఢిల్లీ సాహితీ యాత్రాసాహిత్యంమీద సదస్సు నిర్వహిస్తోంటే ‘నేనూ వస్తాను. ఇరాక్ డైరీ రాశాను గదా, నేనూ యాత్రాసాహితీకారుణ్ణే’ అంటూ వచ్చేశారు కవనశర్మ. మా ఢిల్లీ బాణీలో సదస్సు కోసం బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా ఇంట్లోనే బస. సదస్సులో ప్రసంగాలూ చర్చలూ ఒక ఎత్తయితే మా ఇంట్లో కబుర్లూ స్నేహసౌరభాలూ మరో ఎత్తు. అప్పటికి చిన్నచిన్న వ్యధలతో మథనపడుతోన్న శర్మ ఆ మూడు రోజులూ పాత కవనశర్మ అయిపోయి జీవించడం, నాకో ఋణవిముక్తి మార్గంలా తోచింది. ఆనంద పరచింది.

కవనశర్మ గురించి చెప్పాలంటే అదో అంతులేని కార్యక్రమమవుతుంది.

స్నేహశీలి. విశ్వభ్రమణి. సంఘజీవి. కుటుంబానికి ప్రాణం ఇచ్చే మనిషి, జలశాస్త్ర నిపుణుడు. నిరంతర జిజ్ఞాసి.

ఎంత వయసువచ్చినా, ఎన్నెన్ని పీఠాలు ఎక్కినా, ఎన్నెన్ని దేశాలు తిరిగినా తనలోని పసిబాలుణ్ణి పదిలంగా దాచుకొన్న మనిషి. తనమీద తానే చెణుకులు విసురుకోగల ఆత్మజ్ఞాని. తన ఆలోచనకూ మాటకూ చర్యలకూ మధ్య ఏమాత్రం భేదం చూపించని మనిషి. భయసంకోచాలకూ, మిథ్యాగౌరవాలకూ ఆమడ దూరంలో నిలిచిన మనిషి. అరుదుగా కోపం తెచ్చుకొన్నా అది మనుషులమీదగాక అది వారి ఆ చర్యమీద మాత్రమే అని స్పష్టంగా చూపించగల మనిషి. మనుషుల్నీ, జీవితాన్నీ, ప్రపంచాన్నీ ప్రేమించిన మనిషి.

తన కథలకన్నా, రచనలకన్నా, సాంకేతిక పరిజ్ఞానంకన్నా, భావాలకన్నా, నమ్మకాలకన్నా ఉన్నతమైన అరుదైన చిరంజీవి కవనశర్మ.

(కవన స్మృతులు – కూర్పు: బసిరెడ్డి సుధాకరరెడ్డి, మన్నం రాయుడు, వివినమూర్తి. మొదటి ముద్రణ: జనవరి, 2019. ప్రచురణ: చర్చ, 41/3 ఆరతి అపార్ట్‌మెంట్స్ (గ్రౌండ్ ఫ్లోర్), 13వ క్రాస్, 6వ మెయిన్, మల్లేశ్వరం, బెంగళూరు 560003. ముఖచిత్రణ: డి.ఎం.వి. రాంబాబు. వెల: అమూల్యం. పుస్తకం కావలసినవారు: చర్చ, బెంగళూరు, లేదా ఈ ఫోన్ నంబర్‌పై (94490 57022) వివినమూర్తిగారిని సంప్రదించవచ్చు.)