…
వచ్చేసిందా?
ఇంకా లేదు.
ప్చ్.
ప్చ్, ప్చ్.
నిన్నటి దాకా వచ్చేశాడా కాస్తా ఇవాళ వచ్చేసిందా అయిపోయాడు. -వేదాంత్.
ఏం జరిగింది? -అనుమాన్.
ఆక్సిడెంట్. -ఘంటాపథ్.
సూర్యోదయం అవుతోంది.
ఇంట్లో పెద్దావిడ, ఇద్దరు పిల్లలే ఉన్నారు. పిల్లలు ఇప్పుడే నిద్రలేచారు. ఏం జరిగిందో వాళ్ళకి తెలీదు. వాళ్ళవిడ, పక్కింటాయన హాస్పిటల్‌కి వెళ్ళేరు. ఏ హస్పిటలో పెద్దావిడకి తెలీదు. -రిపోర్టర్.
మరో రెండు కాకులు వచ్చి చేరాయి.
ఏముందీ, వాడికి టైమ్ అయింది. వాడి ట్రైన్ స్టేషన్ చేరింది. -మేటరాఫ్‌ఫేక్ట్.
మరో పావుగంటకి కాకుల గుంపు, గోల మరింత పెరిగింది.
దారుణం, చాలా అన్యాయం, పిల్లలింకా చాలా చిన్నవాళ్ళండీ. -జనాంతిక్.
ఎలా జరిగిందిట?
ఇంత ఉదయాన్నే ఎక్కడికెళ్ళాడట?
వాళ్ళ సిస్టర్ వస్తున్నట్టు చెప్పేడు. స్టేషన్‌కి బయల్దేరాడేమో?
చాలా జాగ్రత్తగా ఉండే రకం. స్పీడ్ వెళ్ళడు. హెల్మెట్ లేకుండా ఎక్కడికీ వెళ్ళడు.
మనం జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అవతలవాడి అజాగ్రత్త మన ప్రాణాలమీదకి వస్తుంది. ముల్లొచ్చి ఆకుమీద పడ్డా, ఆకొచ్చి ముల్లుమీద పడ్డా… అంతే! -సామెత్.
ఉదయాన్నే లారీలు, బస్సులు చాలా స్పీడుగా వెళ్తారండి. ఆ కూరల వేన్లయితే మరీను. మెయిన్ రోడ్డు మీద లేన్డిసిప్లిన్ ఉండదండి ఆ టైమ్‌లో వాళ్ళకీ.
ఉన్న డిసిప్లిన్‌కే దిక్కులేదు ఇంక లేని డిసిప్లిన్ ఏమిటి?
లేన్ డిసిప్లిన్‌రా బాబూ.
హెల్మెట్ ఇంట్లోనే ఉంది. -రిపోర్టర్.
మరింకేం పోలీసులు పట్టుకోబోయుంటారు. -అనుమాన్.
మరీ ఇంత ఉదయాన్నే అంత డ్యూటీయా? ఆక్సిడెంటే అయుంటుంది. -శంకిత్.
యూ నో ఐ హేవ్ మై ఓన్ డెఫినిషన్ ఆఫ్ ఆక్సిడెంట్! Convergence of two objects at an unexpected point and time. At least one of them must be animate. The other may be inanimate. -సిధ్ధాంత్.
ఈమధ్య చాలా దారుణమైన ఆక్సిడెంట్ చూశాను. కాఫీపొడి కోసం నంబీస్ కాఫీ దగ్గర బండి ఆపాను. నాడార్ కొట్టుకి ప్రొవిషన్స్ దింపుతున్న ఎడ్లబండి ఫుల్ లోడ్‌తో ఉంది. నాలుగు టైర్ చక్రాలున్న ఎడ్లబండి. కొంచెం ముందుకెళ్ళి ఎడ్లకి దూరంగా ఆపాను నా బండి. కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. కొట్లోకి వెళ్ళి కాఫీపొడి కొనుక్కుని వచ్చేను. ఎడ్లబండి బయల్దేరుతోంది. బండీవాడు అంబారీ మీద కూర్చున్నట్టు చాలా ఎత్తులో ఉన్నాడు. ఇంకా కుక్కపిల్ల గోల ఆగలేదు. అప్పుడు చూసేను. వెనక టైర్ కింద తగులుకుని ఉంది దాని మొహం. కుఁయ్యోఁమంటూ. బండి ఆపమని గోల పెట్టేను. బండివాడికర్థమై ఆపేటప్పటికి దాని కాలం తీరింది. పటపటమనే శబ్దంతో బరువైన బండి టైరు దాని మొహం మీంచి వెళ్ళిపోయింది. ఇప్పటికీ నాకర్థంకాడంలేదు దాని మొహం టైర్ కిందకి ఎలా వెళ్ళిందా అని. -అనుమాన్.
మా తెల్లపిల్లీ అలాగే చచ్చి, పోయింది. జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూనే రోడ్డు మీద దాటుతూంటుంది. కానీ ఆరోజు రోడ్డుకడ్డంగా పరిగెత్తింది. ఫియట్ టాక్సీ కింద పడింది పోగాలం తరుముకొచ్చి. -సామెత్.
అది కాదురా ఆక్సిడెంట్. మొన్న మ్యూజియం దగ్గర కాలేజీ పిల్ల పోయిందే అది. పెట్రోల్ బంక్ ఎదురుగా. పెట్రోల్ ఫిల్ చేసుకుని తుర్రుమని రోడ్డుమీదకి దూసుకొచ్చింది టూవీలర్ మీద ఎడం వేపు చూసుకుంటూ. కుడివేపు నుంచి వాటర్ టాంకర్ 304A మచ్చ వేసేసింది రోడ్డుమీద. ఆ దెబ్బకి హెల్మెట్, నో హెల్మెట్ మేక్స్ నో డిఫరెన్స్. అసలీ టాంకర్ డ్రైవర్స్‌కి నీటితో నిండి ఉన్న బండి డైనమిక్స్ అర్థంగాదు. సడెన్ బ్రేక్ వేసినప్పుడు టాంకర్ లోని నీరు ఎక్‌స్ట్రా ఫోర్స్‌తో ముందుకి నెడుతుంది. -సిధ్ధాంత్.
ఒరేయ్ చావు తప్పదు. రోజూ రాత్రి మందు కొట్టు, ఉదయాన్నే జాగింగ్ చెయ్యి. ఎలా పోయేవో, ఎప్పుడు పోయేవో నీకే తెలీకుండా గుండాగి పోతావు. అనాయాస మరణం. బెస్ట్. ముత్తురామన్ ఎలా పోయాడు ఊటీలో? -మేటరాఫ్‌ఫేక్ట్.
చావుకబుర్లు చల్లగా.
హాస్పిటల్ దగ్గర ఆంబులెన్స్ బయల్దేరింది. -రిపోర్టర్. (బైక్ పార్క్ చేస్తూ.)
నువ్వెప్పుడెళ్ళావ్? ఏ హాస్పిటలో ఎలా తెలిసింది?
ఉదయాన్నే పాలమనిషి వచ్చిందట. దాన్నడిగాను. పడిపోయాడంది. ఏం జరిగిందో దానికి కూడా తెలీదు. ఎక్కడికెళ్ళేరో చెప్పింది. -రిపోర్టర్.
ఫ్రీజర్ బాక్స్ లోపలికి తీసుకెళ్ళేరు. ఒక్కసారిగా అందరూ ఘొల్లుమన్నారు.
లోపల చల్లగా హాయిగా కళ్ళుమూసుకుని పడుకొని ఉన్నాడు.
పక్కింటాయన బయటకొచ్చాడు.
రాత్రి నార్మల్‌గానే ఉన్నాడండీ. ఉదయాన్నే ఎప్పటిలానే లేచాడు.
అబ్బ ఈయనొకడు! పొద్దున్నయిన ఆక్సిడెంట్‌కి రాత్రినుంచి ప్రారంభించాడు. ఎప్పటికవుతుంది. ఆక్సిడెంట్ ఎలా అయిందండి? -ఆతృత్.
ఆక్సిడెంటా? ఏ ఆక్సిడెంటూ?
ఇవాళ పొద్దున్న అవలేదా?
ఎక్కడా?
నువ్వాగరా. మావాడెలా పోయాడండీ? -మేటరాఫ్‌ఫేక్ట్.
అదేగదా చెప్పబోయింది. ఈలోగా ఈయనేదో ఆక్సిడెంట్ అంటేనూ, ఎక్కడండీ? -పక్కింటి అయోమయ్.
మావాడు ఆక్సిడెంట్‌లో పోయాడనుకున్నావండీ.
అబ్బే, చాలా దారుణవండీ బాబూ, రోజూలాగే మార్నింగ్ వాక్‌కి వెళ్ళడానికి తయారవుతూండగా బాత్రూమ్‌లో పడి, పోయాడండీ తల వాష్‌బేసిన్‌కి తగిలి.
ఇంక ప్రశ్నలు జవాబులు అనవసరం.
జరగవలసిన కార్యక్రమానికి కావలసిన జనం అక్కడున్నారు.
బండి స్టార్ట్ చేసి బయల్దేరాడు మేటరాఫ్‌ఫేక్ట్. హెల్మెట్ బండికి తగిలించే ఉంది భద్రంగా.