1
ఆదివారం మధ్యాహ్నం. వీధి అరుగు మీద కూర్చుని నరసింగరావ్, ఇంటికి వచ్చిన స్నేహితుడితో కలిసి చదువుకొంటున్నాడు. లోపల అతని తల్లి చేస్తున్న లడ్డూల ఘుమఘుమలు వీధరుగు మీద కూర్చున్న వాళ్ళ నోరూరిస్తున్నాయి.
“సింహం!” అన్న కేక వినగానే లోపలికి పరిగెత్తాడు. “ఇంద తీసుకో!” అని ఒక లడ్డూని కొడుకు చేతిలో పెట్టింది అన్నపూర్ణమ్మ. నరసింగరావ్కి మరోటి కావాలి. తను తన స్నేహితుడింటికి ఎప్పుడు వెళ్ళినా అతను తన్ని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. వాళ్ళమ్మ ఏమన్నా చేస్తే ఇద్దరికీ పెడుతుంది. కాని, అతనెప్పుడు తన ఇంటికి వచ్చినా అమ్మ ‘అందర్నీ ఇంట్లోకి తేకు’ అంటూ కోప్పడుతుంది. అందుకనే తను అతన్ని వీధరుగుమీద చాప వేసి కూర్చోబెడ్తాడు. కాని ఇవాళ లాభంలేదు. వాసనబట్టి అతను, అమ్మ లడ్డూలు చేసిన విషయం పోల్చుకొనే ఉంటాడు. ఇవాళ అతనికి పెట్టకుండా తింటే తనకే చిన్నతనం.
“అమ్మా! ఇంకోటి ఇవ్వవా?” అని అడిగాడు.
“పిచ్చి వెధవా! ఇక్కడే తినేసి పో! వీధిలోకి వెళ్ళి తినకు. లేకివెధవలెవరైనా అడిగినా అడుగుతారు” మరో లడ్డూ ఇస్తూ అన్నపూర్ణమ్మ నరసింగరావ్ని హెచ్చరించింది. నరసింగరావ్ అల్లానే అని తలూపి రెండూ తినేసినట్టు నటించి వీధిలోకి జారుకొని, స్నేహితుడి చేతిలో ఒకటి పెట్టాడు.
చదువుకోవటం పూర్తయ్యాక ఇంటికి వెళ్తున్న స్నేహితుడిని సాగనంపడానికి నరసింగరావ్ గేటుదాకా వెళ్ళాడు. అతన్ని పంపించి వెనక్కి తిరిగిన నరసింగరావ్కి తన ఇంటిముందర పెట్టె బండి ఆగటం, అందులోంచి చిన్న తాతయ్య కూతురు నర్సమ్మత్త, ఆమె కూతుర్తో సహా దిగటం కనిపించింది. నరసింగరావ్ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి “అమ్మా! నర్సమ్మత్తొచ్చింది” అని తల్లికి కబురు చెప్పి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ పూలు ఏరుతున్న నాయనమ్మని వీధిలోకి లాక్కువచ్చాడు.
అప్పటికే నర్సమ్మ సామాన్లు ఇంట్లో పెట్టించేసి బండి అబ్బాయికి డబ్బులిచ్చి పంపేసింది.
“రావే! నీ మొగుడ్ని విడిచిపెట్టేసి…” అంటూ లక్ష్మమ్మ ఆప్యాయంగా నర్సమ్మని పలకరించింది.
“ఫో దొడ్డమ్మా! నువ్వు మరీను. నాకు పెళ్ళయి పదేళ్ళయిందని మర్చిపోతావ్. మొగుడ్ని వదిలెట్టేసి ఎక్కడికేనా పారిపోదాం అనుకునే వయస్సొచ్చీసింది నాకు. ఇంతకూ వదినేది?”
“అది వంటింట్లో ఏదో చేస్తోంది.”
వంటింటికేసి నడిచింది నర్సమ్మ. అత్త వెనకాతలే వెళ్ళిన నరసింగరావ్ వంటిల్లు చూసి ఆశ్చర్యపోయాడు. అరగంట క్రితం ఆ గదిలో తన తల్లి పిండివంట చేసిన చిహ్నాలేవీ అక్కడ లేవు. కొట్టు గదిలోంచి చెయ్యి తుడుచుకొంటూ వచ్చి అన్నపూర్ణమ్మ, “ఏవమ్మా నర్సమ్మా! బాగున్నావా? విజయనగరం వెళ్తూ దిగావా?” అని పలకరించింది.
“అవునొదినా! అమ్మని చూసి రెండేళ్ళవుతోంది. రెండేళ్ళ క్రితం పెదనాన్న పోయినప్పుడొచ్చానా, మళ్ళీ రాలేదు. దొడ్డమ్మని కూడా ఓసారి చూసేసి పోదామనిపించి దిగాను.”
“లేకపోతే నన్ను చూద్దామని దిగావనుకున్నానా ఏమిట్లే!”
అన్నపూర్ణమ్మ నిష్ఠూరమాడ్తోందో, వేళాకోళమాడ్తోందో నర్సమ్మకి తెలియలేదు. ఉండే రెండ్రోజుల భాగ్యానికి ఎత్తి పొడుపు మాటలు అనుకోడం ఎందుకని నర్సమ్మ జవాబివ్వలేదు.
“కాఫీ ఇవ్వనా?” అని అన్నపూర్ణమ్మ అడిగింది.
“అన్నయ్యని రానీ, ఏకంగా కలుపుదువు గాని” అంది నర్సమ్మ.
నర్సింగరావ్ తండ్రి శివరామయ్య ఆ రోజు ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చాడు. అన్నయ్యని చూసే బయల్దేర్దామని నర్సమ్మ అనుకోడంతో ఆపూటకామె ఆగిపోవాల్సి వచ్చింది. మర్నాడు పొద్దున్నే లేచి విజయనగరం ప్రయాణం పెట్టుకుంది. అంతకు పూర్వం, ఆమెప్పుడు విశాఖపట్నం వచ్చినా రెండ్రోజులుండే విజయనగరం వెళ్ళేది. కానీ యీసారామెకు వుండాలనిపించలేదు. అన్నపూర్ణమ్మ మాటలతీరామెను బాధపెట్టింది. పూర్వం లాగా లక్ష్మమ్మ కోడల్ని గదమాయించలేక పోతోందన్న విషయం గమనించింది. పెత్తండ్రి పోయాక పెత్తనం చేతులు మారివుంటుందని సులభంగానే ఊహించింది. మనుష్యుల నిజస్వరూపాలు అణిగి ఉన్నప్పుడు కనిపించవు. అధికారం చేతిలోకి వచ్చినప్పుడే బయటపడ్తాయి.
‘నాకు స్వంత ఆడబడుచులంటూ ఎవరూ లేరుకదా! నువ్వే నాకాడబడుచువి’ అంటూ మన్నించి మర్యాద చేసిన అన్నపూర్ణమ్మ యిప్పుడిలా మారిందంటే కారణం, తన పెత్తండ్రి బ్రతికుండగా ఉన్న భయం లేకపోవడమే అనుకుంది నర్సమ్మ.
“వెళ్తానన్నయ్యా!” అంది కాఫీల దగ్గర నర్సమ్మ.
“రెండ్రోజులుండిపో” అన్నాడు మామూలుగా శివరామయ్య.
“రెండ్రోజుల్లో వెనక్కి వెళ్ళిపోవాలి. ఈలోపల అమ్మని కూడా చూడాలి కదా.”
“ఇంకోరోజైనా వుండవే!”
“వీలవదు దొడ్డమ్మా!”
“నువ్వు చెప్పు అన్నపూర్ణా! నువ్వు చెప్తే ఉంటుంది.”
“తనకి వీలైతే ఎందుకుండదు, పూర్వం ఎన్నోసార్లుండలా? తనకి పనులున్నాయంటుంటే మనం బలవంతపెట్టటం ఏం ధర్మం? తనకి తల్లిని చూడాలని వుంటుంది కదా! చూడు నర్సమ్మా! యిప్పుడు వెళ్తే వెళ్ళుగాని, తిరిగి వెళ్ళేటప్పుడిక్కడ దిగి ఓ పూటుండి మరీ వెళ్ళాలి తెలిసిందా?” అంది అన్నపూర్ణమ్మ.
ఓ పూట అనడంలో ‘ఇది మాటవరసకి పిలిచిన పిలుపు. నిజమనుకుని దిగగలవ్! దిగినా రోజుల్తరబడి వుండేలా రాకు’ అన్న అర్థం స్ఫురించింది నర్సమ్మకి.
“అల్లాగే వదినా! వీలైతే ఓ పూట వుండేలాగానే వస్తాను. రాకపోతే మాత్రం ఏమనుకోకు. సింహం చేత బండి తెప్పిస్తే వెళ్తాను.”
“స్నానం అయినా చెయ్యకుండా ప్రయాణం ఏమిటే!” అని లక్ష్మమ్మ ఆశ్చర్యంగా అడిగింది.
“ప్రయాణంలో ఎల్లాగో దుమ్ము పడ్తుంది. ఏకంగా ఇంటికివెళ్ళి స్నానం చేస్తాను. సింహం! కొంచెం బండి తెచ్చిపెట్టు.”
నరసింగరావ్ బండి తేగానే నర్సమ్మ కూతుర్ని, సామాన్ని తీసుకొని బండెక్కింది. లక్ష్మమ్మ వూరుకోలేక “ఒరేయి శివుడూ! చెల్లెలికో రవికముక్కైనా పెట్టకుండా బండెక్కిస్తావురా!” అంది కొడుకుతో. శివరామయ్య జేబులోంచి ఇరవై రూపాయలు తీసి చెల్లెలి చేతిలో పెట్టి, “టైము లేకపోవడం చేత బజారుకెళ్ళి ఏమీ తీసుకు రాలేకపోయాను” అన్నాడు నొచ్చుకొంటూ.
“అభిమానాలు పెట్టుపోతల్తో కొలుస్తామా అన్నయ్యా?” అంది నర్సమ్మ.
‘నువ్వు డబ్బిచ్చినంతమాత్రాన నీకు నామీద అభిమానం వుందని అనుకోను’ అని అర్థమా, లేక ‘ఇవ్వకపోయినా నీకు అభిమానం లేదని అనుకోను’ అని అర్థమా అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు శివరామయ్య.
నర్సమ్మ బండిలో వెళ్ళిపోయింది.
ఎనిమిదిగంటల వేళ “మీరు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఓ రెండ్రూపాయలిచ్చి మరీ వెళ్ళండి, నూనె తెప్పించుకోవాలి” చెప్పింది మొగుడితో అన్నపూర్ణమ్మ.
“మొన్ననే కదూ తెప్పించావ్!”
“మొన్న కొంత ఆవకాయలో తక్కువైతే పోసాను. నిన్న లడ్డూల్చేసాను. అయిపోయింది.”
“యుద్ధం రోజుల్లో వస్తువుల్దొరక్క చస్తుంటే లడ్డూల్చేశావా?”
“అదేమిటి అన్నపూర్ణా! కుర్రముండ చేతిలో అయినా ఒకటి పెట్టావ్కావు!” అంది లక్ష్మమ్మ లడ్డూల విషయం గుర్తుకురాగానే.
తల్లి ఎందుకు పెట్టలేదా అని నరసింగరావ్ కూడా నిన్నట్నుంచి ఆశ్చర్యపోతున్నాడు. పూర్వం నర్సమ్మత్త వచ్చినప్పుడల్లా నాయనమ్మ పెద్ద ఆర్భాటం చేసి ప్రత్యేకంగా పిండివంటల్చేసి పెట్టేది. కాని ఈసారి తన తల్లి ప్రత్యేకంగా ఏమీ చెయ్యకపోయినా చేసినవైనా పెట్టలేదేమా అనుకున్నాడు.
“కొంచమే చేశాను. సింహం రోజూ స్కూలు నుంచి ఆవురావురుమంటూ వస్తాడు. రోజూ ఏదో ఒకటి చెయ్యటం కష్టం కదా! లడ్డూలు చేసి దాస్తే రోజూ వాడికోటి పెట్టొచ్చని అనుకున్నాను. అల్లా అయితే ఓ పది రోజులు వస్తాయనుకున్నాను. ఆ కాసిని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ పెట్టడం మొదలుపెడ్తే ఓ రోజు కూడా రావు. మనం జమీందార్లం కాము కదా! పైగా బండి ఎక్కేటప్పుడు చేతిలో పెట్టేవి ఎల్లాగో తప్పవు.” అంది.
అన్నపూర్ణమ్మ మాటలకు శివరామయ్య జవాబివ్వలేదు. కాని లక్ష్మమ్మ ఊరుకోలేకపోయింది. “ఇదేం చోద్యమమ్మా! మనకున్నదాంట్లో మనకు వీలైనంత నలుగురికీ పెట్టి మనం తినడం గృహస్థులమైన మన ధర్మం.”
“అవన్నీ నమ్మే మీరు మాకు ఈ ఇల్లు తప్ప ఏమీ మిగల్చలేకపోయారు. మేమూ మీలాగే చేస్తే సింహానికీ యిల్లు గూడా మిగలదు. ఇల్లు గుల్లయిపోతుంది.”
“నాకు తెలియకడుగుతాను మరి, కిందట్నెల మీ అన్నయ్య పిల్లలు వచ్చినప్పుడు ఎందుకంత ఆర్భాటం చేశావ్? అప్పుడు ఇల్లు గుల్లయిపోతుందని గుర్తులేదా? నేను గాని, నా కొడుకు గాని మావాళ్ళూ, మీవాళ్ళూ అని ఎప్పుడూ ఆలోచించలేదు. అందరు బంధువులు మనవాళ్ళే అనుకున్నాం. నువ్వలా కాదు.”
‘అవును. మామయ్యవాళ్ళు వచ్చినప్పుడమ్మ చాలా మర్యాదలు చేసింది’ అనుకున్నాడు నరసింగరావ్.
“నేను నావాళ్ళు, మీ వాళ్ళు అనే ఉద్దేశంతో మాట్లాడటం లేదు. రోజులు నానాటికి గడ్డురోజులైపోతున్నాయి, ఇందాక మీ అబ్బాయి అన్నట్టు. పైగా అన్ని దరిద్రాలు విశాఖపట్నంలోనే ఉన్నాయి. పడమటన డబ్బు పెడ్తే అన్నీ దొరుకుతాయి, పండుతాయి. ఇక్కడ అన్నింటికి రేషనే! అందుకని బంధువులంటూ అందర్ని పోగేస్తే మన గడ్డి మనం తినాలి. ఇల్లు నడిపే మగవాడి తల్లిదండ్రులు, తోబుట్టువులు, వాళ్ళ కుటుంబాలు, ఇంట్లో చాకిరి చేసే ఆడదాని తల్లిదండ్రులు, తోబుట్టువులు, వాళ్ళ కుటుంబాలు- వాళ్ళే బంధువులు. అంతేగాని, ఎవర్నో తీసుకువచ్చి నీ ఆడబడుచని మీరంటే నేనెల్లా అనుకోను!” అంటూ ‘తనవాళ్ళ’కి నిర్వచనం ఇచ్చింది అన్నపూర్ణమ్మ.
“నర్సమ్మ ఎవరో ఎలా అవుతుందే! అది సాక్షాత్తు మీ చినమావగారి కూతురు. చెయ్యడానికి నీకు వేరే ఆడబడుచులంటూ లేరు కదా! మీ మావగారు బతికున్నంతకాలం దానికీ యింట్లో ఆడబడుచు స్థానం నీతో సహా అందరం ఇచ్చాం. ఆ విషయం నువ్వు మర్చిపోయుండవు. అట్లాంటిది ఉన్నట్టుండి నర్సమ్మ పరాయిదైపోయిందా?”
“అప్పటికి ఇప్పటికి తేడా అప్పుడు మావగారు బతికున్నారు. ఇప్పుడు లేరు. అప్పుడు యిల్లు నడిపే యజమాని ఆయన. ఆందుకని ఆ రోజుల్లో ఈ యింటికి రావటానికి పోవడానికి ఆయన అన్నదమ్ములకి, వాళ్ళ పిల్లలకి హక్కుంది. కాదనటానికి మధ్య నేనెవరు? ఇప్పుడాయన లేరు. అది గ్రహించి వాళ్ళు రావటం మానుకోవాలి. తప్పనిసరై వచ్చినప్పుడు పూర్వంలా మర్యాదలు జరగటంలేదని అనుకుని లాభంలేదు.”
“నీ మొగుడికి తోబుట్టువుల్లేరనీ నీకున్నారనేగా ఈ మిడిసిపాటు!”
“మీరెల్లా అనుకున్నా సరే. ఆయనకి తోబుట్టువుల్లేని కొరత తీర్చడానికిగాను ఆయనకి అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ వరస అయినవాళ్ళందర్నీ పోగేసి నేను చాకిరి చెయ్యను” అని అన్నపూర్ణమ్మ కుండ బద్దలుకొట్టి చెప్పింది.
ఆపైన నూనె మాట గుర్తుకువచ్చి, “అన్నట్టు రెండ్రూపాయలివ్వండి” అని అన్నపూర్ణమ్మ శివరామయ్యని అడిగింది.
“లేవు” అన్నాడతను బుఱ్ర గోక్కుంటూ.
“అయితే బడాయికి పోయి జేబులో ఉన్నదంతా ఆవిడగారి చేతిలో పెట్టారన్నమాట!”
2
లక్ష్మమ్మ పోయిన మరుసటేడు అన్నపూర్ణమ్మకి కనకమహాలక్ష్మి పుట్టింది. తనకంటే పన్నెండేళ్ళు చిన్నదయిన లక్ష్మంటే నరసింగరావ్కి ముద్దే. కాని తల్లి గాని తండ్రి గాని తన్ని మరీ పెద్దవాడిగా చేసి మాట్లాడ్తుంటే నరసింగరావ్కి నచ్చేది కాదు. ఏకధాటీగా తన ముద్దు సాగటం వల్ల నరసింగరావ్కి లక్ష్మి అప్పుడప్పుడు పోటీదారురాలు లాగా కనిపించేది.
లక్ష్మికి తనకంటే అయిదేళ్ళు పెద్దదయిన ఓ స్నేహితురాలుండేది. ఆ పిల్ల పేరు సుభద్ర. లక్ష్మి వయస్సుకు మించిన క్లాసు చదవటం వల్ల, సుభద్ర కొంచెం వెనకబడటం వల్ల సుభద్ర లక్ష్మి కంటే రెండు క్లాసులు పైన చదువుతుండేది. సుభద్రకి పద్నాలుగు సంవత్సరాలు వచ్చినప్పటినుంచి, నరసింగరావ్ రాజకుమారుడిలాగా కన్పించసాగాడు. వీలైనంతవరకూ లక్ష్మి కోసం నరసింగరావ్ ఉన్న సమయాల్లోనే వాళ్ళింటికి వెళ్ళేది. అతని గురించి లక్ష్మి ఏమన్నా చెప్తే ఆసక్తితో వినేది. నరసింగరావ్ ఎమ్మే పాసై యూనివర్సిటీలో లెక్చరర్‌గా జేరేసరికి సుభద్రకి పదహారేళ్ళు నిండి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
లక్ష్మిని ఎప్పుడైనా నరసింగరావ్ సినిమాకి తీసుకువెళ్ళేవాడు. అది గమనించిన సుభద్ర, “నాకు పెద్దమనుషులు సినిమా చూడాలని ఉందోయి. నువెళ్తే నేనూ వస్తాను” అంది.
“మా అన్నయ్యనడగాలి” అంది లక్ష్మి అమాయకంగా.
“అడుగు” అంది సుభద్ర గడుసుగా.
మర్నాడు లక్ష్మి నరసింగరావ్ని “పెద్ద మనుషులు సినిమా చూద్దామా?” అని అడిగింది.
“ఆలోచిద్దాం” అన్నాడు.
“మనం వెళ్తే సుభద్ర కూడా వస్తుందిట.”
“మధ్యలో సుభద్రెందుకూ?” నరసింగరావ్ భయపడ్డాడు. మరో మనిషికి కూడా తను టిక్కెట్టు కొనాల్సి రావచ్చునని, తనతో వచ్చినప్పుడు ఆ పిల్ల దగ్గర డబ్బు తీసుకోడం కష్టం కదా అనుకున్నాడు.
“సుభద్ర మనతో రావాలని సరదాపడ్తోంది.”
నరసింగరావ్ ఆశ్చర్యంగా చూసాడు. అన్నయ్య మాట్లాడకపోవటం చూసి “సుభద్రకి నువ్వంటే చాలా ఇష్టం” అంది. అన్నాక నాలిక కరుచుకుంది. సుభద్ర లక్ష్మితో తనకి నరసింగరావ్ అంటే చాలా ఇష్టమని చెప్పి ఆ విషయం లక్ష్మి నరసింగరావ్తో చెప్పాలనే కోరికతో ‘మీ అన్నయ్యతో చెప్పద్దు’ అని ఆంక్ష పెట్టింది.
నరసింగరావ్ మరింత ఆశ్చర్యపోయి “ఎవరు చెప్పార్నీకు ఆ విషయం?” అని అడిగాడు.
“నేనే అల్లా అనుకున్నాను.”
“ఎందుకని?”
“గుర్తులేదు.”
“నిజం చెప్పు. నిజం చెప్పకపోతే సినిమాకి తీసుకెళ్ళను.”
“సుభద్రే చెప్పింది. నీతో తనన్నట్టు చెప్పద్దంది.”
“బావుంది” అని నరసింగరావ్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
రెండ్రోజులు పోయాక “ఇవాళ పెద్దమనుషులు సినిమాకి వెళ్దాం” అని చెప్పాడు నరసింగరావ్ లక్ష్మితో.
“సుభద్రతో చెప్పేదా?”
“నీ ఇష్టం.” అల్లా అన్నాడేగాని లక్ష్మి చెప్పదేమోనని భయపడ్డాడు. సుభద్రకి తనంటే యిష్టం అని తెలిసినప్పటినుంచి, సుభద్ర పట్ల అతనికి కుతూహలం రేకెత్తింది. కాని సూటిగా ‘సుభద్రని కూడా తీసుకురా’ అని లక్ష్మితో చెప్పలేకపోయాడు. సాయంత్రం వరకు సుభద్ర రాదేమోనని నరసింగరావ్ మనసు పీకుతూనే ఉంది. సాయంత్రం సుభద్రని చూడగానే నరసింగరావ్ మొహం వికసించింది. నరసింగరావ్తో వెళ్ళబోతున్నా కదా అని సుభద్ర జాగ్రత్తగా తయారై మరీ వచ్చింది సినిమాకి.
రెండు నెలలు తిరిగేసరికి ముగ్గురూ కలిసి మూడు సినిమాల్చూసారు. ఇప్పుడు సుభద్ర నరసింగరావ్తో ధైర్యంగా ముఖాముఖి మాట్లాడ్తోంది. ఒకసారి నరసింగరావ్ సినిమాకి వెళ్దామని సూచించిన రోజు సుభద్రకి వీలవకపోతే ‘పోనీ రేపు వెళ్దాం’ అంటూ వాయిదా వేశాడు నరసింగరావ్. లక్ష్మికది వింతనిపించింది. తనని అభిమానించే సుభద్రలో నరసింగరావ్కి రోజు రోజూ అందాలు కనిపించసాగాయి. లక్ష్మిని పావుగా పెట్టుకొని యిద్దరూ పరిచయం పెంచుకున్నారు. లక్ష్మి చిన్నపిల్లవటంతో జరుగుతున్న కథ అర్థం చేసుకోలేకపోయింది.
ఓరోజు సాయంత్రం లక్ష్మి సుభద్ర యింటికి వెళ్తే వాళ్ళవాళ్ళు “నువ్వు సుభద్రతో సినిమాకి వెళ్ళలా?” అని అడిగారు.
“లేదే! సుభద్ర వెళ్ళిందా?” అని అడిగింది. వాళ్ళు మౌనంగా తలూపారు.
ఆ టైములో సుభద్ర నరసింగరావ్తో సినిమా చూస్తోంది. ఆ సినిమా ఇంగ్లీషు సినిమా. ఆ క్రితం రోజు సుభద్ర లక్ష్మి కోసం లక్ష్మివాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు నరసింగరావ్, “ఇంగ్లీషు సినిమా ఉంది వెళ్దామా?” అని సుభద్రని అడిగాడు.
సుభద్ర తలూపింది. “ఆరున్నర గంటలకల్లా సరస్వతీ హాలు దగ్గరకి రా. అక్కడ కలుసుకుంటాను.”
“లక్ష్మి రావడం లేదా?”
“ఇంగ్లీషు సినిమాలు దానికేం అర్థమౌతాయి?” అని నరసింగరావ్ కొట్టిపారేశాడు.
సుభద్ర నరసింగరావ్తో వంటరిగా సినిమా చూడటం గురించి ఇరవైనాల్గు గంటలు ఊహాలోకాల్లో తేలిపోతూ గడిపింది.
అంత మధురంగా ఇరవై ఏడు గంటలు గడిపిన సుభద్రని ఇంటిదగ్గర పెద్దలు “సినిమాకి ఎవరితో వెళ్ళావ్?” అని నిలదీస్తే, “లక్ష్మీవాళ్ళతో” అంది.
“వాళ్ళెవరు?”
“వాళ్ళన్నయ్య.”
“వాళ్ళన్నయ్యతో వెళ్ళావేమోగాని లక్ష్మితో కాదు. లక్ష్మి ఇక్కడికి వచ్చింది నువ్వెళ్ళాక. వాళ్ళ అన్నయ్యతో వెళ్ళావా?”
“వెళ్ళాను.”
‘వయసొచ్చిన పిల్లవి నీకు వెళ్ళడానికి సిగ్గులేదు, వెళ్ళానని చెప్పడానికి భయం లేదు. మీరిద్దరూ సినిమాకి వెళ్ళిన విషయం వాళ్ళ కాలేజీ కుర్రాళ్ళుగాని, మీ కాలేజీ పిల్లలుగాని చూస్తే మన వంశగౌరవం ఏమైపోవాలి? ఆడపిల్ల అరిటాకులాంటిదని, మొగపిల్లాడు ముల్లులాంటివాడని అన్నారు. ఆఖరికి మచ్చంటూ పడితే అది నీకే’నన్నారు.
వాళ్ళని అన్నీ అననిచ్చి “నేను నరసింగరావ్ని పెళ్ళిచేసుకొంటాను” అంది ధైర్యంగా.
“అతను నిన్ను చేసుకోవద్దూ!”
“మీరు వెళ్ళి అడగకపోతే ఎల్లా చేసుకొంటాడు?”
సుభద్ర తెగువకి వాళ్ళాశ్చర్యపోయారు. విషయం నలుగురి నోళ్ళలోను పడకముందే జాగ్రత్తపడదామని, మొట్టమొదట మంచిరోజున వెళ్ళి నరసింగరావ్ తల్లిదండ్రులతో మాట్లాడారు. వాళ్ళడిగిన కట్నాలు కానుకలు వీళ్ళివ్వగలిగినవే కావటంచేత ఓ నెల రోజుల్లో సుభద్రకి మూడుముళ్ళూ పడి, చదువాగిపోయింది. సుభద్ర తనకి వదిన కావటాన్ని లక్ష్మి చాలా హర్షించింది. పెళ్ళి కాకమునుపు అన్నయ్య, సుభద్రని విడిగా సినిమాకి తీసుకువెళ్ళాడని పెద్దవాళ్ళ మాటలబట్టి అర్థం చేసుకొంది.
పెళ్ళయిన అయిదోరోజున నరసింగరావ్, సుభద్ర సినిమాకి వెళ్తూ తనని రమ్మనలేదని లక్ష్మి ఉడుక్కుంది.
“పానకంలో పుడకలాగా మధ్య నువ్వెందుకే!” అంది నవ్వుతూ అన్నపూర్ణమ్మ.
“ఏం, మొన్నమొన్నటివరకూ సుభద్రకి తను సినిమాకి వెళ్ళడానికి నేను కావల్సి వచ్చాను. ఇవాళ మాటవరసకైనా రమ్మన్లేదు తను, నన్ను అన్నయ్య మాత్రం అన్నాడా? అన్నయ్యకి నాకంటే సుభద్ర దగ్గర్దయిపోయిందా? ఈసారి వాళ్ళు రమ్మంటే మాత్రం నేను వెళ్తాననుకున్నావా?” అంది లక్ష్మి రోషంగా.
“వాడికి సుభద్రెంత దగ్గర్దో రేపు నీకు మొగుడొస్తేగాని అర్థం కాదులేవే!” అంది అన్నపూర్ణమ్మ నవ్వుతూనే. తల్లి నవ్వు చూస్తుంటే లక్ష్మికి వళ్ళు మండింది.
“నేను పెళ్ళి చేసుకోను” అని గట్టిగా అరిచి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొంది.
3
కాలేజీ నుంచి అలిసిపోయి, వడలిపోయిన తోటకూర కాడలాగా తయారై వచ్చింది లక్ష్మి. వస్తూనే కనీసం సబ్బుపెట్టి మొహం అయినా కడుక్కోకుండా నిస్త్రాణగా కుర్చీలో కూలబడింది. కాస్సేపటికి కాస్త ఓపిక తెచ్చుకొని వంటింట్లో ఉన్న సుభద్రకి వినపడేలా “వదినా! కాఫీ” అని ఓ కేక పెట్టింది.
సుభద్ర కాఫీ గ్లాసు తీసుకువచ్చి అందించింది. అన్నపూర్ణమ్మ “సుభద్రా! నువ్వలా దాన్ని నెత్తికెక్కించుకొంటే ఎల్లా చెప్పు?” అని మందలించింది.
“ఆడబడుచూ అర్ధమొగుడూ అన్నారు. వదిన అన్నయ్యకి చేసే సేవల్లో సగందాకా నేను కూడా చేయించుకోవచ్చు! నేనింకా మంచిదాన్ని కనక తలకి నూనె రాయమనను. బాత్రూమ్లోకి వెళ్ళి ‘సుభద్రా తువ్వాలు’ అని అరవను, గుండీలు కుట్టమనను, ఇంకా…” అంటూ ఆగింది చాలా సీరియస్‌గా మొహం పెట్టి.
“మీ అన్నయ్య నాకు రెండు నెలలకైనా ఓ చీరంటూ కొంటారు. మరి నువ్వు కనీసం ఓ రవికల గుడ్డయినా కొనవ్!” అంది సుభద్ర.
“నీ కొడుకుని రోజుకి రెండుగంటలైనా ఆడిస్తాను. నువ్వు నీ శ్రీవారితో సినిమాలకి చెక్కేస్తే నేను వాడికి బేబీ సిట్టింగ్ చెయ్యడంలేదూ! వీటన్నింటికీ నా ఛార్జెస్ నెలకు యాభై రూపాయలు. ప్రతీ నాలుగో నెలా నాకా యాభై యివ్వకుండా నువ్వు చీర కొనుక్కో.”
వదినా ఆడబడుచులు హాస్యాలాడుకొంటుంటే పోస్టువాడు ఉత్తరం పడేసి వెళ్ళాడు.
“నాన్నగారికి” అంది ఎడ్రస్ చూసి లక్ష్మి అన్నపూర్ణమ్మతో.
“చదువు, పోస్టుకార్డే కదా” అంది అన్నపూర్ణమ్మ.
శివరామయ్యగారికి,
మన స్నేహం బంధుత్వంగా మారితే బాగుంటుందని మీరు వ్రాసిన ఉత్తరం అందింది. మీ అమ్మాయి బియస్సి చివరి సంవత్సరం…
“ఛీ నే చదవను” అంటూ లక్ష్మి ఆ ఉత్తరం వదిలేసి వెళ్ళిపోయింది.
…మీ అమ్మాయి బియస్సి చివరి సంవత్సరం చదువుతోందని, బావుంటుందని వ్రాశారు. అమ్మాయిని చూసుకోడానికి అబ్బాయితో కలిసి వీలు చూసుకొని వస్తాం. వచ్చేముందర ఉత్తరం వ్రాస్తాం. మీతో సంబంధం కలుపుకోవాలని ఎదురుచూస్తున్నాం.
ఇట్లు,
సుబ్బారావు.
తలుపు చాటునుంచి లక్ష్మి పాము చెవులు చేసుకొని వింటూ నిలబడింది. “పెళ్ళికొడుకు వివరాలేమిటి?” అని సుభద్ర కుతూహలంగా అడిగింది.
“అబ్బాయి హైదరాబాద్‌లో జూనియర్ ఇంజినీర్‌గా ఉన్నాడుట. పేరు రఘుట. పెద్ద ఉన్నవాళ్ళు కారు కాని మంచివాళ్ళుట. మీ మావగారికి చిన్నప్పటి స్నేహితుడట ఆయన. చిన్నప్పుడు ఏఁవోయి అంటే ఏఁవోయి అని పిలుచుకున్నా, ఇప్పుడు వయస్సు వచ్చాక మీరంటే మీరనుకుంటున్నారుట. వాళ్ళనెప్పుడో ఒకసారి రైల్లో చూసాను” అంటూ అన్నపూర్ణమ్మ వివరాలిచ్చింది.
లోపల నుంచి అంతా విన్న లక్ష్మి పంచరంగుల కల కనడం మొదలుపెట్టింది. సింహం, సుభద్రల్లాగా తను, రఘు సినిమాకి గంట ముందరే వెళ్ళి క్యూలో నిలబడక్కర్లేదు. ప్యూను వెళ్ళి టికెట్లు కొని, సీట్లు రిజర్వ్ చేసి తమకోసం నిరీక్షిస్తూ వుంటాడు. తను, ఆయన జీపులో సరిగ్గా సినిమా మొదలయ్యేసరికి హాలుకి జేరుకుంటారు. తను సుభద్ర కంటే ఎక్కువ సినిమాలే చూస్తుంది.
పెళ్ళివారు ఒక్క నెల లోపలే లక్ష్మిని చూసుకోడానికి వచ్చారు. సుభద్ర చాలా శ్రద్ధ తీసుకుని లక్ష్మిని తయారుచేసింది. పెళ్ళివారికి ఫలహారాలు చేసింది. అటు సోఫా ఇటు జరిపింది. గోడకున్న ఫోటోలకు బూజు దులిపింది. కుర్చీలలో దిళ్ళకి కొత్త గలీబులు తొడిగింది. టీపాయ్ మీద గుడ్డ వేసింది. సుభద్ర హడావిడి చూసి, “ఏమిటమ్మా! పెళ్ళివారు చేసుకోదల్చుకొంటే యివన్నీ పట్టించుకొంటారా? చేసుకోదల్చుకోకపోతే వీటిని చూసి మనస్సు మార్చుకొంటారా? నీ చాదస్తంగాని!” అంది అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా.
అసలు సుభద్ర భయం యీ ఇంటి కోడలిని అనుకొంటారేమోనని. “మీరలాగే అంటారు. కాని లక్ష్మో! వచ్చే రాజకుమారుడు లక్ష్మికి నచ్చాడనుకొందాం. కాని ఈ పెంకెపిల్ల అతనికి నచ్చకపోతే, మా వదిన సరైన ఏర్పాట్లు చెయ్యలేదు. నేను అతనికి సరిగా కనపడి వుండను. మధ్యలో టేబుల్ అడ్డం వుంది కూడాను అనుకొని, ఆపైన నన్ను ఝాడిస్తుంది” అంది సుభద్ర, పెళ్ళిచూపుల గదికి చివరి మెరుగులు దిద్దుతూ.
రైలు స్టేషన్‌కి వెళ్ళిన శివరామయ్య, నరసింగరావ్లు పెళ్ళివారిని తీసుకొని టాక్సీలో వచ్చారు. సుభద్ర చీడీ మీద బక్కెట్టూ నీళ్ళూ పెట్టింది. అందరు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చారు.
“అన్నపూర్ణ మీకు తెలుసుకదా! పోతే ఆ పిల్ల మా కోడలు” అంటూ శివరామయ్య పరిచయం చేశాడు.
కాఫీలు టిఫిన్లూ అయి పెళ్ళికూతుర్ని తీసుకువచ్చే లోపల పెళ్ళివారు గోడల్నీ, కుర్చీల్నీ, అక్కడున్న ప్రతి వస్తువునీ పరిశీలిస్తూ కూర్చున్నారు.
“చూశారా అత్తగారు?” అంది అన్నపూర్ణమ్మ చెవిలో సుభద్ర.
“అమ్మాయిని తీసుకురా అమ్మా సుభద్రా!” అని శివరామయ్య అనగానే సుభద్ర లోపలికి వెళ్ళి లక్ష్మిని తీసుకువచ్చింది.
లక్ష్మి సిగ్గుపడ్తూనే చూసింది. అబ్బాయి పొడుగ్గా చామనచాయగా బాగున్నాడు అనుకుంది. లక్ష్మి అతన్ని చూసే సమయంలోనే అతను లక్ష్మిని చూశాడు. రఘు కళ్ళు చిలిపిగా నవ్వాయి. లక్ష్మి కంగారుపడి తలదించుకొంది.
“నీ పేరేమిటమ్మా?” రఘు తల్లి అడిగింది.
“లక్ష్మి.”
“ఏం చదువుతున్నావ్?” సుబ్బారావు ప్రశ్నించాడు.
“బియస్సి ఫైనలియర్.”
“పెళ్ళయ్యాక చదువు మానేస్తారా? పూర్తి చేస్తారా?” రఘు నెమ్మదిగా అడిగాడు. అడగటానికి చాలా మొహమాటపడ్డాడు. తన తల్లిదండ్రుల ఎదుట, లక్ష్మి తల్లిదండ్రుల ఎదుట, లక్ష్మితో మాట్లాడటానికి సిగ్గుగా ఉంది. ఈ పెళ్ళిచూపులు పెళ్ళికొడుక్కి ప్రాణాంతకం. పెళ్ళికూతుర్తో మాట్లాడాలని చాలా కోర్కెగా వున్నా మాట్లాడాలంటే అంతమందిలో గొంతుక పట్టేస్తుంది.
“నీ ఇష్టం బాబు. చదివించమంటే చదివిస్తాం, వద్దంటే మానేస్తాం.” అన్నాడు శివరామయ్య.
“నేను చదివించమంటే, మీరు చదివిస్తే ఆవిడ చదువుతుందా? తనమటుక్కి తనకి చదవాలనో వద్దనో వుండదా?” అని అడిగాడు రఘు కాస్త ధైర్యం చేసి.
“అదేం ప్రశ్నరా రఘూ! మనదేశంలో ఆడపిల్లల చదువులంతే కదా!” అని సుబ్బారావు మందలించాడు.
“నాకు బియస్సి పూర్తిచేయాలని వుంది.” అంది హఠాత్తుగా లక్ష్మి. ఆ అవకాశం పోతే రాదేమోనన్న భయంతో.
“బియస్సి పూర్తిచేసి ఆపైన పెళ్ళి చేసుకొంటారా? లేక పెళ్ళయ్యాక పూర్తి చేస్తారా?”
“పెళ్ళయ్యాకే పూర్తిచేస్తుంది. చదువు పూర్తయ్యేలోపల నువ్వు వస్తూపోతూ వుంటే…” శివరామయ్య జవాబిచ్చాడు లక్ష్మికి అవకాశం ఇవ్వకుండా.
“పరీక్ష తప్పడానికా?” రఘు నవ్వుతూ అడిగాడు.
“పరీక్షలింకా ఎనిమిది నెలలున్నాయి. పెళ్ళికో వారం, దీపావళికో మూడ్రోజులు, సంక్రాంతికో మూడ్రోజులు పోయినా చదువు అంతగా పాడవుతుంది అనుకోను” అన్నాడు శివరామయ్య పెళ్ళెక్కడ వాయిదా పడుతుందోనన్న కంగారుతో, ఆడపిల్లల తండ్రులకుండే సహజమైన ఆత్రంతో.
రఘు లక్ష్మికేసి చూశాడు. లక్ష్మి సిగ్గుపడుతూ తలవంచుకొంది, నా అభిప్రాయం అదేనని సూచిస్తూ.
“అమ్మాయి నచ్చిందీ లేందీ వెళ్ళగానే ఉత్తరం రాస్తారు కదా!” శివరామయ్య మాటలో అభ్యర్థన గ్రహించి, “నచ్చాల్సింది మా వాడికి. వాడి మొహం చూస్తుంటే మీకేమనిపిస్తోంది?”
లక్ష్మి సిగ్గుపడ్తుంటే సుభద్ర లోపలికి తీసుకువెళ్ళింది.
“మీ వీలు చూసుకునొచ్చి తాంబూలాలు పుచ్చుకోండి” అన్నాడు సుబ్బారావు. అన్నపూర్ణమ్మకంతా వింతగా వుంది. అందరు కతికితే అతకదని ఆడపెళ్ళివారు ఏం పెట్టినా తినరు. వీళ్ళు శుభ్రంగా అన్నీ తిన్నారు. అభిప్రాయం కూడా అక్కడికి అక్కడే చెప్పేస్తున్నారు!
“మాకొక్కగానొక్క ఆడపిల్ల. పెళ్ళి ఘనంగా చేస్తాం. లాంఛనాల విషయంలో కూడా లోటు చెయ్యం. కట్నం…”
“నేను కట్నం తీసుకోను. మా నాన్నగారు, నేను తీసుకొందామన్నా, తీసుకోనీరు” అన్నాడు రఘు గట్టిగా, లోపలున్న లక్ష్మికి వినిపించి తన్ని మనసులో మెచ్చుకోవాలని. శివరామయ్య సంతోషానికి అవధుల్లేకపోయాయి.
“కాని మరో విషయం. నేను నా కొడుక్కి కట్నం పుచ్చుకోకపోవడమే కాదు. నా కోడలికి బంగారం కూడా పెట్టను. మీ అమ్మాయికి పెళ్ళిలో మేము ఏమీ పెట్టకపోవడం మీకు చిన్నతనం అనుకొంటే, మీకు తోచిన ఆభరణాలు మీరే పెట్టండి” అన్నాడు సుబ్బారావు.
“అల్లాగే కానివ్వండి.” అన్నాడు శివరామయ్య.
4
ఆశ్వీయుజ మాసంలో లక్ష్మి పెళ్ళి ఏ లోపం లేకుండా జరిగింది. అల్లుడికి ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వాలని శివరామయ్య చాలా అనుకున్నాడు. అలక పానుపుపైన అల్లుడిని ఏమన్నా కోరుకొమ్మని అడిగాడు.
“నేను అలగందే!” అని కొట్టిపారేశాడు రఘు.
“కనీసం మా ముచ్చట కోసం అడుగు బాబూ!” అన్నాడాయన. అల్లుడి మంచితనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయనకి తెల్లని కాకులు కూడా ఎక్కడో ఉండకపోవు అనిపించింది ఆ క్షణాన.
“ఆయన సంతోషం కొద్దీ యిస్తున్నప్పుడు తప్పులేదు. మామగారు తండ్రితో సమానం, అడుగు” అని సుబ్బారావు వియ్యంకుడిని సమర్థించాడు.
“నాకు వద్దు బాబూ అంటే వినరేం!” అన్నాడు రఘు విసుగ్గా.
“అడగండి బావగారూ!” నరసింగరావ్ కోరాడు.
“ఓ చిన్న విమానం కావాలి.”
“నీ చిన్న విమానం కోరిక నా శక్తి కంటే పెద్దది బాబూ!” అన్నడు శివరామయ్య నవ్వుతూ.
“పోనీ ఓ బెంజ్ లారీ.”
“ఏమిట్రా పెద్దవాళ్ళతో ఆ వేళాకోళం?” రఘుని తండ్రి మందలించాడు.
“ఆయనసలే ఇంత ఖర్చుపెట్టి పెళ్ళి చేశారు కదా! ఇంకా ఇవన్నీ ఏమిటి నాన్నా?”
“వద్దంటే ఇప్పుడే ఇవ్వను. అమ్మాయిని మీ యింటికి పంపేటప్పటికి, కాస్త కాలు చెయ్యి కూడదీసుకొని కొంటాను. అందుకని నీక్కావలసిందేదో అడుగు” అన్నాడు రాజీగా శివరామయ్య.
రఘు ఆలోచించాడు. చాలా రోజుల్నుంచి అతనికి మోటార్ సైకిల్ కొనుక్కోవాలని ఉంది. అది మగవాడన్నవాడికి ఉండాల్సిన వాహనం అని అతని నమ్మకం. మగవాడన్నవాడికి మోటార్ సైకిల్‌తోపాటు వెనక కూర్చోపెట్టుకోడానికి ఓ మగువ కావాలి. ఆ మగువ మనసైన మగువ కావాలి. అందుకని పెళ్ళయ్యాక కొనుక్కుందామని మానేశాడు. హఠాత్తుగా బ్రేకులు వేస్తుంటే వెనకాతల కూర్చున్న శాల్తీ వచ్చి తన్ను గట్టిగా వాటేసుకొంటుంటే, కౌగిలింత ఒక్కటికి ఒక్కో రూపాయి చొప్పున లెక్కవేసుకున్నా, మోటార్ సైకిల్‌కి ఖర్చుపెట్టిన డబ్బు కిట్టుబాటవటమేగాకుండా, రెండేళ్ళు తిరిగేసరికి లాభాలు వచ్చిపడ్తాయి. అందుకని ‘మోటార్ సైకిల్’ అని రఘు తన కోరిక చెప్పాడు.
“ఏమండోయి బావగారూ! మావాడు అడిగేశాడు. మీరు కొనక తప్పదు. మీరు కొనకపోతే మావాడికి కోపం వస్తుంది. అసలే పెంకి ఘటం!” హెచ్చరించాడు సుబ్బారావు.
“మీరు మమ్మల్ని మరీ తీసిపారేస్తున్నారు. విమానాలు, లారీలు ఇవ్వలేకపోయినా మోటార్ సైకిల్ కొనివ్వలేకపోం. బావగారూ! మీరింక అలకపాన్పు దిగండి. మీ యింటికి మా చెల్లెలు, మోటార్ సైకిల్ ఒకేసారి వస్తాయి” అన్నాడు నరసింగరావ్.
“మీ చెల్లెల్ని మీరు పంపించడం విషయంలో నాకే అనుమానం లేదు” అన్నాడు రఘు హాస్యంగా.
“అంటే మీకు మోటార్ సైకిల్ విషయంలోనే అన్నమాట అనుమానం ఉంది. మోటార్ సైకిల్ మేం కొనిచ్చాకే మీరు మా చెల్లెల్ని రానిద్దురుగాని” అన్నాడు నరసింగరావ్ కొంచెం తీవ్రంగా.
“బావుంది. అల్లా అంటే, మీ ముద్దుల చెల్లెలు మీ యింట్లోనే ఉండిపోతుంది. నేను పెళ్ళి చేసుకుంది అందుకా?”
హాస్యాలు శ్రుతిమించుతున్నాయని గ్రహించి, “హాస్యాలు చాలుగాని లేవరా రఘూ!” అన్నాడు సుబ్బారావు.
అప్పగింతల సమయంలో అన్నపూర్ణమ్మ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. “మీరు, నేను మనవాళ్ళను వదిలేసుకొని రాలేదా? అల్లాగే లక్ష్మీను. మంచిచోటుకు వెళ్తోంది. మీరు బాధపడకూడదు” అంది సుభద్ర.
“అమ్మా! మీకు తెలియదని కాదు. పెళ్ళయితే ఆడపిల్ల మీ ఇంట్లోంచి వెళ్ళిపోతోంది అనుకోకూడదు. అల్లుడనే కొత్త సభ్యుడు మీ కుటుంబంలోకి వస్తున్నాడు అనుకోవాలి. అల్లుళ్ళు, కోడళ్ళు కుటుంబ పరిధిని పెంచుతారేగాని తగ్గించరు” అని ఓదార్చాడు సుబ్బారావు.
“ఆడపిల్లను కన్నవారి బాధ ఈ సమయంలో…”
“నేను కాదనడం లేదు. అయినా పరీక్షలయ్యేవరకూ అమ్మాయి యిక్కడే ఉంటుంది. మూడు నిద్రలవగానే వెనక్కి వచ్చేస్తుంది. ఆడపిల్లలు పెళ్ళయి తల్లిదండ్రుల్ని వదిలేస్తే మొగపిల్లలు ఉద్యోగరీత్యా వదలివెళ్తారు. అంతే తేడా. కణ్వుడంతటివాడు శకుంతల అత్తవారింటికి వెళ్తుంటే బాధపడ్డాడు. మీరు బాధపడటం సహజమే. కాని మీరు బాధపడ్తే అమ్మాయి బెంగపెట్టుకొంటుంది. అందుకనే ఇంతగా చెప్పాను.”
అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకొంది. కూతురు చేతులు వియ్యపురాలి చేతిలో పెట్టి నమస్కారం పెట్టి “సింహానికి, దీనికి పన్నెండేళ్ళు తేడా. అందుకని లక్ష్మికి చాలా గారాబం జరిగింది. మా అమ్మాయిని నెత్తికెక్కించుకోమని చెప్పను కాని…”
వియ్యపురాలు నవ్వి, “నా కూతురు మరోచోట కాపురం చేస్తోందన్న విషయం నాకు గుర్తుంటుంది వదినగారూ! దాన్ని దానత్తగారు ఎల్లా చూడాలని కోరుకుంటానో మీ అమ్మాయిని అల్లా చూసుకొంటాను. సరేనా! అయినా లక్ష్మి ఇప్పుడు కాపురానికి రావటంలేదు కదా!” అంది.
5
అత్తవారింటినుంచి సంక్రాంతికి ఆహ్వానం వస్తుందనుకున్న రఘుకి తన మామగారు ఏక్సిడెంటయి పోయారన్న టెలిగ్రామ్ అందింది. కబురు వినగానే రఘు విశాఖపట్నం వెళ్ళాడు. లక్ష్మి రఘుని చూడగానే బావురుమంది. ఆత్మీయుల్ని చూడగానే దుఃఖం పెల్లుబుకుతుంది. పెళ్ళిలోను, తరువాత దీపావళికి మాత్రమే చూసిన రఘు, లక్ష్మికి అత్యంత ఆత్మీయుడయ్యాడు. రఘు లక్ష్మిని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. “బాగా చదువుకో లక్ష్మీ! పరీక్షలు దగ్గరకి వస్తున్నాయికదా! చదువులో ఎల్లాంటి దుఃఖాన్నైనా మరిచిపోవచ్చు” అన్నాడు రఘు.
అన్నపూర్ణమ్మ మూలగదిలోంచి బయటికి రాలేదు. అన్నిరోజులు సుభద్రే అన్ని పనులు చూసుకొంది. నరసింగరావ్ శాస్త్రోక్తంగా కర్మ చేశాడు. దానాల దగ్గరకు వచ్చేసరికి అందరు గోదానం చెయ్యాలన్నారు. అన్నపూర్ణమ్మ కూడా చెయ్యమంది. సుభద్ర మాత్రం “మనం ఓ యాభై పెట్టి ఆవును కొన్నట్టు, అది మనం దానం చేసినట్టు నటిస్తే, అది దానం పుచ్చుకొన్న బ్రాహ్మడు మళ్ళీ దాన్ని మనకు ఆవును అమ్మినవాడికి ముప్పైకి అమ్మేస్తాడు. ఎందుకీ నాటకం? నిజంగా మనం ఓ రెండు మూడొందలు ఖర్చుచేసి ఆవును కొని దానం చేసి, ఆ బ్రాహ్మడు దాన్ని ఉంచుకొని, దాని పాడి అనుభవిస్తే ఆ దానానికి అర్థం ఉంటుంది. అల్లా ఇష్టం లేకపోతే బ్రాహ్మడి చేతిలో ఓ పదో పదిహేనో పెట్టి దండం పెట్టండి” అంది.
“అల్లాగ సేస్తే పెద్దయ్యోరి ఆత్మం కట్టమెట్టుకోదా!” అన్నాడు ఆవును అమ్మినట్టు నటించడానికి వచ్చిన గౌరవాడు.
“చచ్చిపోయినవాళ్ళ ఆత్మకోసం, ఇల్లాంటి అబద్ధపు పనులు చెయ్యటం నాకిష్టంలేదు” అంది సుభద్ర.
నరసింగరావ్కి సుభద్ర మాటే నచ్చింది. అన్నపూర్ణ మాట వినలేదు. తన చేతిలోంచి పెత్తనం సుభద్ర తీసుకొంటున్నట్టు తనకు తెలియజెప్పటానికి సుభద్ర ఈ సందర్భాన్ని వాడుకుందని అన్నపూర్ణమ్మకి అవగాహన అయింది. అందుకని అన్నపూర్ణమ్మ మరి మాట్లాడలేదు.
రఘు తిరిగి వెళ్ళిపోతూ “బాగా చదువు లక్ష్మీ! పరీక్షలయిపోగానే హైదరాబాద్ వద్దూగాని. మీ అమ్మగారిని కొంచెం బాధ మరిచిపోయేవరకు కనిపెట్టుకొని ఉండు” అని లక్ష్మితో చెప్పాడు.
నెల తిరక్కుండానే ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని అడ్డుగోడలు వచ్చాయి. మనుషులు, కుర్చీలు, బల్లలు స్థలాలు మారాయి. నరసింగరావ్ తండ్రి ప్రేమగా వాడుకొంటూ వచ్చిన వస్తువులు పాత వస్తువుల పేరుతో అటకలకెక్కాయి. లక్ష్మికి అన్నపూర్ణమ్మకి కలిసి ఒక గది కేటాయించబడింది. సగం భాగం అద్దెకివ్వబడింది.
తల్లి రాత్రిళ్ళు ఉండి ఉండి ఏడ్చేది. ఆ ఏడ్పుతో లక్ష్మి చదువు సాగేది కాదు. పరామర్శకెవరైనా వచ్చినప్పుడల్లా మానుతున్న గాయం కెలుకుతున్నట్లయ్యేది. కూతురి పరీక్షలు దగ్గరపడుతున్న కొద్ది అన్నపూర్ణమ్మ గుండె దిటవు చేసుకొని ఇంట్లో పనులు చెయ్యటం, మనవడితో కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. దానివల్ల లక్ష్మి చదువు మీద శ్రద్ధ చూపించటానికి అవకాశం కలిగింది.
పరీక్షలన్నీ లక్ష్మి బాగానే వ్రాసింది. ఫస్టుక్లాసు రాకపోయినా పాస్ కాకపోను అనుకొంది. అన్నని, వదిన్ని, మేనల్లుడిని వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉన్నా చవిచూడబోయే కొత్త అనుభవాలకోసం మనస్సు ఉరకలు వేస్తోంది.
6
చి. నరసింగరావ్కి,
చి. సౌ. లక్ష్మి పరీక్షలు అయిపోయాయని తెలిసింది. కనుక కోడల్ని తీసుకొనివచ్చి ఇక్కడ దింపవలసింది. ఇక్కడ కొన్నాళ్ళుంచుకొని హైదరాబాదు పంపిస్తాం.
ఇట్లు,
సుబ్బారావు.
నరసింగరావ్ చదివి వినిపించిన ఉత్తరం విని అన్నపూర్ణమ్మ “మంచిరోజు చూసి అమ్మాయిని అత్తవారింట్లో నువ్వూ నీ పెళ్ళాం వెళ్ళి దింపిరండి” అంది.
నరసింగరావ్ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు, పళ్ళాలు, బట్టలు కొన్నాడు. సుభద్ర లడ్డూలు, జిలేబీలు చేయించింది. మంచం, పరుపు కొనుక్కోమని చెల్లెలి చేతిలో ఓ ఐదువందలుంచాడు. ప్రయాణం రెండ్రోజులనగా రఘు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది.
డాక్టర్ నరసింగరావ్గారికి,
మోటార్ సైకిల్ మాట మర్చిపోయి ఉండరని అనుకుంటున్నాను. మూడువేలా అయిదువందలు మీ చెల్లెలి చేతికిచ్చే పంపవలసింది. జావా కొనుక్కొంటాను.
ఇట్లు భవదీయుడు,
రఘు.
ఆ ఉత్తరం చూడగానే నరసింగరావ్ తన నెత్తిమీద ఎవరో సుత్తితో కొట్టినట్టు దిమ్మెరబోయాడు. అతనా విషయం మర్చిపోయాడు. చెల్లెల్ని అత్తవారింటికి పంపడానికిగాను ఇప్పటికే వెయ్యి రూపాయలు ఖర్చు చేశాడు. మరో మూడువేల అయిదువందలు కావాలి!
“ఏమిట్రా ఆ వుత్తరం?” అని అన్నపూర్ణమ్మ అడిగింది.
“రఘు ఉత్తరం వ్రాశాడు. పెళ్ళిలో అలకపాన్పు మీద కొంటామన్న మోటార్ సైకిల్ విషయం గుర్తు చేశాడు.”
“అవును. అప్పుడు అమ్మాయిని పంపేటప్పుడు కొంటామని అన్నాం. ఇప్పుడు కొనడమే మర్యాద.”
“అలకపాన్పు అనేది ఓ ముచ్చట, తమాషాను. దాన్ని సీరియస్‌గా తీసుకొంటే ఎలా?” అంది సుభద్ర.
“మరే!” అన్నాడు నరసింగరావ్.
“తమాషా ఏమిట్రా! అతను వద్దు మొఱ్రో అంటుంటె మీరే అడగమని బలవంతపెట్టి, ఇప్పుడు తమాషా అంటే ఎల్లా?”
“అతను అడిగినప్పుడు తమాషాగానే అడిగాడు అనుకున్నాను.”
“అల్లా అని మానేస్తే అతనికి కోపం రాదూ!”
“కోపం వస్తే ఏం చేస్తాడుట? లక్ష్మిని మనింట్లోనే ఉంచేస్తాడా? ఉంచనీ! లక్ష్మి మనకేం బరువా?”
“మనింట్లో ఉంచుకోడానికే దానికి పెళ్ళి చేశామా? అప్పుడు ఇస్తామని ఇప్పుడు ఇవ్వకపోతే ఏం మర్యాదా?”
“అయినా ఇస్తామన్నది మావగారు. ఆయనే లేరు ఇప్పుడు” అంది సుభద్ర కల్పించుకొని.
“అన్నయ్య మాత్రం పౌరుషానికి పోలేదా? విమానాలు, లారీలు ఇవ్వలేమేమోగాని మోటార్‌సైకిల్ కొనలేకపోం అని అనలా?” అంది లక్ష్మి కోపంగా.
“అప్పుడే మొగుడ్ని వెనకేసుకొస్తున్నావే” అంది సుభద్ర నవ్వడానికి ప్రయత్నిస్తూ.
“నువ్వు వేసుకొని రావడంలా? అల్లాగే నేనూను” అంది లక్ష్మి.
“ఇప్పటికే మీ అన్నయ్య ఓ వెయ్యి ఖర్చుపడ్డారా! మరో మూడ్నాలుగు వేలంటే మాటలా! నువ్వే ఆలోచించు” అంది సుభద్ర.
“ఇవన్నీ ఆరోజున మాటిచ్చిన రోజున అనుకొని వుండాల్సింది. ఇప్పుడనుకొని ఏం ప్రయోజనం? సింహం, చూడు! మీ నాన్నగారి ఇన్సూరెన్సు డబ్బుంది కదా! అందులోది ఖర్చుపెట్టు” అంది అన్నపూర్ణమ్మ చివరిమాటగా నరసింగరావ్తో.
“ఆ పదివేలు నీ పేరుమీద వేద్దామనుకుంటున్నానమ్మా! నీ పేర్న కొంత డబ్బంటూ ఉండటం మంచిది కదా!” అన్నాడు తెలివిగా నరసింగరావ్.
“ఇన్సూరెన్సు డబ్బు దానికియ్యి. ఇంట్లో సగభాగం అద్దెకిచ్చామా, దానిమీద అద్దె నెలనెలా నాకియ్యి. నేను కూడా పోయాక ఇల్లు నువ్వు తీసుకో. ప్రావిడెంట్ ఫండ్ ఎల్లాగో నీకే!” అంది అన్నపూర్ణమ్మ, కూతుర్ని రెండ్రోజుల్లో అత్తవారింటికి పంపుతూ వాటాలు వేసుకోవాల్సి వస్తున్నందుకు బాధపడ్తూ.
“అమ్మా! లక్ష్మికి పెద్ద చదువు చెప్పించాం. చాలా ఖర్చుపెట్టి పెళ్ళి చేశాం. రేపు పురుళ్ళకి పుణ్యాలకి ఇక్కడికే వచ్చిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వాటా ఏమిటమ్మా?” అన్నాడు నరసింగరావ్ అనునయంగా.
“ఇవాళ ఇంత ఆలోచిస్తున్నవాడివి; ఎప్పుడో ఏదో చేస్తానంటావేమిట్రా! రఘు పేరుమీద మూడు వేల అయిదువందలకి డ్రాఫ్టు తీసుకో, మిగిలిన ఇన్సూరెన్సు డబ్బే నా పేరుమీద వెయ్యి. ఇంటి అద్దె నువ్వే తీసుకో. ఇంక మాట్లాడకు” అని అన్నపూర్ణమ్మ తేల్చిచెప్పేసింది.
ఆ సాయంత్రం రఘు పేరుమీద మూడువేల అయిదువందలకు డ్రాఫ్టు తీసుకున్నాడు. ఇంటికి వచ్చాక “అమ్మా! డ్రాఫ్టు, సారె కలిపి నాలుగువేల అయిదువందలైంది. అయిదువేల అయిదువందలు ఇన్సూరెన్సు తాలూకు డబ్బు మిగిలింది. అది రేపు నువ్వు బ్యాంకుకి వస్తే నీపేర్న వేస్తాను.” అని లెక్కలు చెప్పాడు నరసింగరావ్.
‘చెల్లెలికి తనంతట తానుగా కొన్న సారె సామాన్లు, చేతిలో పెట్టిన డబ్బు కూడా వీడు నా మొత్తంలో లెక్క కట్టే అంతటి స్వార్థపరుడయ్యాడేమిటి!’ అని ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ. కాని ఆ మాట బయటికి అనలేదు. తన పెంపకంలో ఏం లోటుందా అని ఆలోచనలో పడింది. తను తన కొడుక్కి కొంత స్వార్థం నేర్పితే మిగిలింది అతనంతట అతనే నేర్చుకొన్నాడన్న విషయం అన్నపూర్ణమ్మకి తట్టలేదు.
7
లక్ష్మి అత్తవారింటికి వెళ్ళింది. అక్కడ్నుంచి రఘు హైదరాబాద్ తీసుకొని వెళ్ళాడు. ఊరుజేరగానే బ్యాంక్‌కి లక్ష్మిని తీసుకువెళ్ళాడు. నరసింగరావ్ పంపిన డబ్బుకి మరో పదిహేను వందలు కలిపి మొత్తం అయిదువేలు లక్ష్మి పేరుమీద ఫిక్సెడ్ డిపాజిట్లో పడవేశాడు. లక్ష్మికి అంతా అయోమయంగా ఉంది. ఇంటికి వచ్చాక, “మీరు మోటార్ సైకిల్ కొనుక్కోరూ!” అని అడిగింది.
“ఊహూ”
“పోనీ మీకని ఇచ్చిన డబ్బు మీ పేరుమీద వేసుకోకుండా నా పేరుమీద వేశారేం?”
“మీ నాన్నగారి డబ్బుగదా అందుకని నీ పేరుమీద వేశాను. నీకు నీది అంటూ కొంత డబ్బు ఉండటం మంచిది కదా. అసలు బ్యాంక్‌లో ఉంటే వడ్డీ తినచ్చు.”
“నాకంటూ ప్రత్యేకించి ఖర్చులేం ఉంటాయి!”
“నేనింట్లో లేనప్పుడు అయిస్ ఫ్రూట్ అమ్మవస్తుంది. నీకు తినాలనిపిస్తుంది. అప్పుడు, ఏమండి అయిదు పైసలిస్తారా అని అడగాల్సి వస్తుంది.”
“ఆకాడికి మీరే నాకు నెలనెలా కొంత పాకెట్ మనీ ఇవ్వవచ్చు కదా!”
“ఇవ్వవచ్చు. ఇవ్వాలనే ఉంటుంది. కాని ఇవ్వలేను. ఎందుకంటే ఇంటి ఖర్చులెప్పుడూ జీతానికి సరిపడా పెరిగి కూర్చుంటాయని అనుభవజ్ఞులు అంటారు.”
“మరి మోటార్ సైకిల్ మాటో!”
“నేను మూడు నెలల క్రితమే కొన్నాను. మీ అన్నయ్య మన పెళ్ళిలో అంత పౌరుషానికి పోయాడని తమాషాకి ఆ విషయం గుర్తు చేస్తూ రాశాను. అప్పటికే కొనుక్కున్నాను. నిన్ను ఏకంగా ఆశ్చర్యపరుద్దామని నీకు రాయలేదు.”
“మా అన్నయ్యకి పాపం డబ్బూ వదిలి, పేరూ దక్కలేదు.”
“అల్లా ఎందుకనుకోవాలి! మీ అన్నయ్య మోటార్ సైకిల్ కొన్నట్టే లెక్క. బ్యాంక్‌లో వేసిన అయిదువేలు నీకు నా ప్రెజెంట్.”
“ఇంతకూ అసలు శాల్తీ ఏదీ?”
“మా ఫ్రెండు దగ్గరుంది. నేను మా వూరు వచ్చినప్పుడు అతనికిచ్చాను. తెచ్చుకోవాలి.”
మర్నాడు ఆఫీసుకు వెళ్తూ “యివాళ సాయంత్రం టాంక్బండ్ మీదకి షికారుకు వెళ్దాం తయారుగా ఉండు” అని చెప్పి వెళ్ళాడు రఘు. అందుకని సాయంత్రం అయ్యేసరికల్లా అందంగా తయారైంది. కాలర్ మెడ, పొడుగు చేతులు ఉన్న రవిక, టెర్లిన్ చీర కట్టుకొని తయారైంది. ఆరయ్యేసరికల్లా ‘బడ్ బడ్’ అని శబ్దం చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద వచ్చాడు రఘు.
రఘుకి ఫలహారం పెట్టాక “మీరివ్వాళ మోటార్ సైకిల్ తెస్తానని చెప్పలేదేం?” అని అడిగింది.
“చెప్పుంటే?”
“వేరేలా తయారయి ఉండేదాన్ని.”
“ఏం పోయింది! రేపు అల్లా తయారవుదువుగాని.”
ముందు బజారుకి వెళ్ళారు లక్ష్మి కోరిక మీద. ఇద్దరికి సరిపడే మంచం, పరుపు, ఓ డ్రస్సింగ్ టేబుల్ కొన్నారు. మర్నాడు వాటిని ఇంటికి డెలివర్ చెయ్యమని చెప్పి అక్కడ్నుంచి టాంక్బండ్ మీదకు వెళ్ళారు. అక్కడ కాస్సేపు తిరిగి తాజ్‌కు వెళ్ళి భోంచేసి ఇంటికి చేరుకొన్నారు. రాత్రి దగ్గరకు తీసుకొంటున్న రఘుతో “రేపటిదాకా ఆగరా ప్లీజ్!” అంది లక్ష్మి.
రఘు పొద్దున్నే భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. పదకొండు గంటలయ్యేసరికల్లా షాపువాడు మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ పంపించాడు. వాటిని బెడ్రూమ్లో సర్దించింది. తెచ్చినవాళ్ళకి చాయ్ తాగడానికి డబ్బులిచ్చి పంపించేసింది. ఆపైన ఇంటికి తాళం వేసి దగ్గర్లోనున్న బజార్లో షాపింగ్‌కు వెళ్ళింది.
ఆరుగంటలయ్యేసరికల్లా రఘు వచ్చాడు. లక్ష్మి ఎదురువెళ్ళింది. రఘు లక్ష్మిని పోల్చుకోలేదు. ఇంటికెవరో అతిథులు వచ్చారనుకున్నాడు. లక్ష్మి నవ్వింది. నవ్వునుబట్టి పోల్చుకున్నాడు, ఆ నిల్చున్నది లక్ష్మేనని. మోటార్ సైకిల్‌కి స్టాండ్ వెయ్యడం మర్చిపోయి నిలబడిపోయాడు. లక్ష్మి పంజాబీ డ్రెస్‌లో పోనీటెయిల్‌తో కొత్తగా ఉంది.
“ఏమిటల్లా నిలబడిపోయారు రండి” అంది లక్ష్మి.
ఆశ్చర్యం నుంచి తేరుకొని రఘు లోపలికి నడిచాడు.
“ఈ అమ్మాయెవరో చాలా ఫాషనబుల్‌గా ఉంది, లక్ష్మి అయివుండదు అనుకొన్నాను. ఏమిటి కథ? ఏమిటీ వేషం?” అన్నాడు హాస్యంగా రఘు.
“నాకు చిన్నప్పటినుంచి పంజాబీ డ్రెస్ వేసుకోవాలని సరదా. మా అన్నయ్య అల్లాంటి పనులు చేస్తే తంతాననేవాడు. పెళ్ళయ్యాక నీ మొగుడు వేసుకోనిస్తే వేసుకుందూగాని అనేది అమ్మ. ఇన్నాళ్ళకు ఛాన్సొచ్చింది. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్సయితే మరింత రొమాంటిక్‌గా ఉండదూ?” అంది.
పావుగంటలో రఘు తయారై రాగానే బయల్దేరారు. లక్ష్మి తన కుడిచేతిని, రఘు చుట్టూ తిప్పి అతని ఛాతీమీద వేసింది. ఎడం చేతిని ఎడం భుజం మీద వేసింది. ఈ భంగిమలో రఘుకి చేతనైనంత దగ్గరగా ఆనుకొని కూర్చుంది. రఘుకి ఆ స్పర్శ చాలా సుఖంగా ఉన్నా తనకి తెలిసినవాళ్ళు ఎవరైనా చూస్తారేమోనని ఇబ్బందిగా కూర్చున్నాడు. లక్ష్మి ఈ ప్రపంచంలో లేదు. రఘు టాంక్‌బండ్‌కి చేరాక దిగమని లక్ష్మితో అనేదాకా లక్ష్మి అల్లాగే ఉండిపోయింది.
లక్ష్మి, రఘు పక్కపక్కనే నడుస్తున్నారు. రఘు తన చెయ్యి పట్టుకొంటాడేమోనని కొంచెంసేపు చూసింది. ఆ ధోరణిలో రఘు లేకపోవడంతో, తనే రఘు చెయ్యి పుచ్చుకొంది. ఉన్నట్టుండి రఘు చెయ్యి విడిపించుకొని “గుడీవెనింగ్ సార్!” అని ఒకాయన్ని పలకరించి “మై వైఫ్ సార్!” అని లక్ష్మిని పరిచయం చేశాడు. “బాగున్నారా?” ఆయనతో ఉన్న ఆవిడను పలకరించి, “ఈయన మా అసిస్టెంట్ ఇంజినీరు. ఈవిడ ఆయన భార్య” అంటూ లక్ష్మికి వాళ్ళిద్దరిని పరిచయం చేశాడు.
మగవాళ్ళిద్దరు కాస్సేపట్లో ఆఫీసు గొడవల్లో పడిపోయారు. అసిస్టెంటు ఇంజినీర్ భార్య “మీరు కాస్సేపు చల్లగాలికి తిరుగుదామని వచ్చారేమోకదా!” అని లక్ష్మిని అడిగింది.
“అవును” అని లక్ష్మి నింపాదిగా జవాబిచ్చింది.
“మేమూ అందుకే వచ్చాం పదండి” అన్నాడు అసిస్టెంట్ ఇంజినీర్.
“మీరెక్కడికి, కొత్తగా పెళ్ళయిన వాళ్ళతో? బావుంది. మీతో నడవటానికి నేనున్నానుగా” అని భర్తని మందలించి, “డే టైమ్‌లో ఎప్పుడైనా తోచకపోతే మా యింటికి రండి” అని లక్ష్మితో చెప్పి, “పదండి” అని భర్తని మరో దిశలో కదిల్చింది.
కాస్సేపు అటూ ఇటూ తిరిగాక రఘు, ఇంటికి వెళ్ళడానికి తొందరపడ్డాడు. “ఇంటికివెళ్ళి వంటచెయ్యాలి కూడాను” అంది లక్ష్మి. “వంటాలేదు గింటాలేదు. దార్లో ఏదైనా తినేసి పోదాం,” అన్నాడు రఘు, లక్ష్మి రాసుకున్న సెంటువాసన మత్తెక్కిస్తుంటే.
ఇంటికి జేరేసరికి తొమ్మిదయింది.
“నేను స్నానం చెయ్యాలి, నాకు చెమట పోసింది” అంది లక్ష్మి.
“ఇదో ఆలస్యమా?” అన్నాడు అసహనంగా రఘు.
“మీరు చెయ్యరా?”
“నువ్వు చెయ్యి, నేను చూస్తాను.”
“ఛీ పాడుమాటలు!” అంది లక్ష్మి.
మంచం మీద అలసిపోయి నిద్రపోతున్న రఘు తలని గుండెలకు హత్తుకొని జుట్టు నిమురుతూ ఆలోచనల్లో పడింది. రఘు డబ్బు తీసుకోవడం వల్ల అమ్మకి అపకారం జరిగింది. ఆ విషయం తలుచుకొంటే బాధవేస్తోంది. కాని రఘు తీసుకోకపోయినంత మాత్రాన సింహం ఆ డబ్బు అమ్మకిచ్చేవాడా? తను సింహం గురించి మరీ అన్యాయంగా ఆలోచిస్తోంది.
అమ్మకి నిజంగా ఏదైనా ఇబ్బంది వస్తే అన్నయ్యే చూస్తాడు. చూడకపోతే ఊళ్ళోవాళ్ళు నోట్లో గడ్డి పెట్టరూ! కాని సుభద్ర పడనివ్వాలి కదా! ఛ! తనిల్లా ఆలోచిస్తోందేమిటి? తను మాత్రం ఓ యింటి కోడలు కాదా? తనకి మాత్రం ఆడబడుచులు లేరా? వాళ్ళు తన గురించి అంత నీచంగా ఆలోచిస్తే! సుభద్ర తన స్నేహితురాలు కూడాను.
తన భర్త తన యిల్లు. ఇదే తన పరిధి.
8
శివరామయ్య పోయి గిర్రున సంవత్సరం తిరిగింది. సంవత్సరీకాలు వచ్చాయి. అన్నపూర్ణమ్మ పెత్తనం పోయి ఈ యేడాదిలో క్రమేపీ సుభద్ర పెత్తనం వచ్చింది. నరసింగరావ్ ఇంటిఖర్చుకు కావలసిన డబ్బు సుభద్ర చేతిలో పెడ్తున్నాడు. అది పొదుపుగా వాడి మిగిల్తే తన స్వంత ఖర్చులకి వాడుకొంటుంది సుభద్ర. సంవత్సరీకాలకి కూతుర్ని, అల్లుడ్ని పిలవమని అన్నపూర్ణమ్మ చెప్పలేదు. సుభద్రే ‘లక్ష్మీ, వాళ్ళాయన రాకుండా ఎల్లా? ఉత్తరం రాయండి’ అని నరసింగరావ్ చేత ఉత్తరం వ్రాయించింది.
రఘు సెలవుపెట్టి లక్ష్మిని తీసుకొని వెళ్ళాడు. అన్నపూర్ణమ్మ ఎక్కడా అల్లా చెయ్యండి, ఇల్లా చెయ్యండంటూ సూచనలు చెయ్యలేదు. తననెవరైనా ఏదైనా చెయ్యమని అడిగితే ఆ పని మాత్రమే చేస్తూ గడిపేసింది.
సంవత్సరీకాలు అవగానే ప్రయాణం పెట్టుకొన్న రఘుతో లక్ష్మి “నేను మరో రెండ్రోజులుండి వస్తానండి. ఈ హడావిడిలో అసలు మా వాళ్ళతో మాట్లాడినట్టే లేదు” అంది.
“తమ్ముడుగారూ! మీరు లక్ష్మిని రెండ్రోజులు విడిచి ఉండగలిగితే మా దగ్గర ఉంచి వెళ్ళండి. కాపురానికి వెళ్ళాక లక్ష్మి ఇదే రావటం” అంది సుభద్ర. రఘు లక్ష్మిని వీలైనంత త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు.
మర్నాడు లక్ష్మి తల్లినడిగింది. “ఏమిటమ్మా! మరీ నాన్నగారు పోయినప్పటి నుంచి అంత దిగులుపడిపోయావు! ఏదో ఇంట్లో పనులు కలిపించుకొని చేస్తూ ఉంటే జ్ఞాపకాలంతగా బాధించవు కదా!” అని.
ఈ మాటలు హాల్లో కూచుని తీరుబడిగా పాత పేపర్లు చూస్తున్న నరసింగరావ్కి, వంటింట్లో పనిచేసుకొంటున్న సుభద్రకి వినిపించాయి. ఆ ఇద్దరు, లక్ష్మితోపాటే అన్నపూర్ణమ్మ జవాబుకోసం ఎదురు చూశారు.
కాస్సేపు అన్నపూర్ణమ్మ మాట్లాడలేదు. ఆ తరువాత నెమ్మదిగా, “నీకు తెలియదే లక్ష్మీ! సింహం చాలా మారిపోయాడు. ఇప్పుడు పెత్తనం అంతా వాడి పెళ్ళాంది. ఇంత బతుకూ బతికి, ఇవాళ నేను దాన్ని ‘బియ్యం ఒక్క పావు పోసేదా? రెండు పోసేదా?’ అని అడగనా! ఇల్లా దాన్నడగకుండా పోస్తినా, దాని మొగుడి సంపాదనంతా నేను పాడుచేస్తున్నాననుకొంటుంది” అంది.
ఆ మాటలు వింటూనే సుభద్ర తారాజువ్వలా లేచివచ్చి, “నేనెప్పుడల్లా అనుకున్నాట?” అని అడిగింది.
“రెండు నెలల క్రితం, మా అన్నయ్య కుటుంబం వచ్చినప్పుడు మరో రెండ్రోజులుండి వెళ్ళండిరా అన్నానని నువ్వా తరువాత నాతో పోట్లాడలేదూ?”
“నువ్వే చెప్పు లక్ష్మీ! ఈ ఊరికి ఆసుపత్రి పనిమీద, యూనివర్సిటీ పనిమీద, కొత్తగా పెట్టిన కాల్టెక్స్ కంపెనీలో ఉద్యోగాలకోసం ఎంతోమందొస్తుంటారు. వాళ్ళందర్నీ మనింట్లో ఉంచుకోవాలంటే మాటలు కాదు. ఈ గడ్డు రోజుల్లో మనమెంత? మన ఆస్తులెంత? అయినా నేను వచ్చిన చుట్టాల్ని వెళ్ళమనలేదు. కాని వెళ్తామని అన్నవాళ్ళని ఉండమని బతిమాలడం ఎందుకన్నాను!”
“మా అన్నయ్య కుటుంబం, మిగిలిన బంధువులూ ఒకటా?” ముక్కుమీద వేలేసుకొంది అన్నపూర్ణమ్మ.
ఆవిడ మాటలు విని లేచి వచ్చాడు నరసింగరావ్.
“నువ్వేమీ అనుకోనంటే ఒక్కమాట చెప్తానమ్మా! నా చిన్నప్పుడు, అప్పటికింకా లక్ష్మి పుట్టలేదు. నర్సమ్మత్త విజయనగరం వెళ్తూ ఈ ఊళ్ళో దిగింది. అప్పుడు మనింట్లో జరిగిన రాద్ధాంతం నాకు బాగా గుర్తుంది.”
“నర్సమ్మత్త ఎవరు?” అని సుభద్ర అడిగింది.
“మా చిన్న తాతగారి కూతురు. మా తాతగారు బతికున్న రోజుల్లో నర్సమ్మత్తకి మా యింట్లో, మా యింటి ఆడబడుచుగా మర్యాదలు జరిగేవి. ఆవిడ మా తాతగారు పోయిన రెండు సంవత్సరాలకి మా యింటికోసారి వచ్చింది. అమ్మా! అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? సంపాదించేవాడి తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇంటిచాకిరీ చేసేదాని తల్లిదండ్రులు తోబుట్టువులు తప్పించి మిగిలిన అందరు దూరపు బంధువులే అన్నావు. ఇవాళ సంపాదన నాది. చాకిరి సుభద్రది. అందుచేత నీ నిర్వచనం ప్రకారమే మావయ్య ఈ యింటికి దూరపు బంధువు.”
నరసింగరావ్ అన్న మాటలకి అన్నపూర్ణమ్మ నోరెత్తలేకపోయింది. ఆ మాటలు అన్న రోజున అన్నపూర్ణమ్మ తన నొసటన వైధవ్యం వ్రాసుందని అనుకోలేదు. తను ముత్తైదువుగానే పోతుందని, తను బతికున్నన్నాళ్ళు తన మాట చెల్లుతుందని అనుకొంది.
“ఆ చవక రోజుల్లో కనుక మీ అమ్మగారు అంతమందిని దగ్గర బంధువుల లిస్టులో వేశారు. ఈ రోజుల్లో అత్తగారికి, మావగారికి, మొగుడికి, పిల్లలకి చేసి మెప్పించగలిగితే చాలు ఆడదానికి. తల్లిదండ్రులకి, పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టగలిగితే చాలు మొగాడికి” అంది సుభద్ర.
సుభద్ర తనతో కావాలనే ఇదంతా చెప్పిందని లక్ష్మి అనుకొంది. లక్ష్మికి చెయ్యాల్సిన విధాయకం తనకి లేదని, లక్ష్మికి తెలియజెప్పటమే సుభద్ర అన్న మాటలకి లక్ష్యం.
“చూడు లక్ష్మీ! ఇదేదో నిన్ను మనసులో పెట్టుకొని అన్నాననుకోగలవ్. అదికాదు. పూర్వం రోజుల్లోలాగా ఆడపిల్లలు నెలలకొద్దీ పుట్టిళ్ళలో ఉండటం ఈ రోజుల్లో జరగటంలేదు ఎందుకు? రోజులు మారాయి కనుక. నేను నా పుట్టింటికి వెళ్తున్నానా? నువ్వు మాత్రం ఎన్నిసార్లు ఇక్కడికి రాగలుగుతావ్? ఎన్నిరోజులుండగలుగుతావ్? మనం అందరం కూడా ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని గమనించాలి. ఇదంతా నేను చెప్తున్నది నువ్వు రాకూడదని కాదు. నువ్వు నాకు ఆడబడుచువే కాక స్నేహితురాలివి కూడాను. అందుకని నువ్వెప్పుడు రాదల్చుకున్నా రావచ్చు.”
“నేను రాదల్చుకొని రావటానికి, నువ్వు పిలిస్తే రావటానికి తేడా లేదూ?”
“ఇంట్లో ఏదైనా కార్యమైతే నేను పిలవనా, నువ్వు రావా?”
సుభద్ర అభిప్రాయం లక్ష్మికి స్పష్టంగానే తెలిసింది. ఏదైనా శుభకార్యం అంటూ జరిగితే తనే పిలుస్తుంది. మిగిలినప్పుడు లక్ష్మి రాదలుచుకొంటే రావచ్చును! లక్ష్మి చర్చ పొడిగించలేదు.
లక్ష్మి మరో రెండ్రోజులుండి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ కూతుర్ని మరో రెండ్రోజులుండమని అనలేదు.
సుభద్ర అన్న మాటలు లక్ష్మి మీద పనిచేస్తూనే ఉన్నాయి. ‘విశాఖపట్నంలో నాకే అధికారం లేకపోతే పోనీ, ఈ ఊళ్ళో ఈ ఇంటికి మహారాణిని నేను. ఈ ఇంట్లో నాకు తప్ప ఎవరికీ అధికారం లేదు’ అనుకొంది. హైదరాబాద్‌లో తన యింట్లో ఇక్కడి కుర్చీ అక్కడికి, అక్కడి కుర్చీ ఇక్కడికి జరుపుతూ.
9
ఓ రోజున రఘుకి ఓ పోస్టుకార్డు వచ్చింది. అది జనవరి నెల.
డియర్ రఘు,
రేపు పదో తారీకున బెజవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాము. మీ బావగారికి హైదరాబాద్‌లో మీటింగ్ ఉంది. వీలైతే స్టేషన్‌కి రా. నువ్వు స్టేషన్‌కి రాకపోయినా మేము ఇంటికి రా(లే)కపోము. ఇంతే సంగతులు.
ఇట్లు
కనకదుర్గ
పి.ఎస్: నేను వ్రాసిన దాంట్లో పదవ తారీకున బెజవాడలో బయల్దేర్తున్నామో, హైదరాబాద్ చేర్తున్నామో తెలియడంలేదుట. హైదరాబాద్‌కి పదో తారీకున ఎక్స్‌ప్రెస్‌లో జేర్తున్నాం అని వ్రాయమన్నారు మీ బావగారు. నువ్వు స్టేషన్‌కి రాకుండా ఎగకొడ్తే, ‘నేనే సరిగా వ్రాయలేదండీ ఉత్తరం’ అంటూ నిన్ను సమర్థిస్తానుట. బావమరుదులకి, లేమ్ కుంటిసాకులు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వరాదుట.
ఉంటా
దుర్గ.
ఆ ఉత్తరంలో ఉన్న అధికార ధోరణి చూస్తుంటే లక్ష్మికి వళ్ళు మండిపోయింది. గతంలో చైనావాళ్ళు భారత భూభాగం మీద తమకి అధికారం ఉందంటే భారతీయులకెలా వళ్ళు మండిపోయిందో అంత మండిపోయింది వళ్ళు లక్ష్మికి.
ఇంతకు ఈ కనకదుర్గ, రఘు స్వంత అక్క కూడా కాదు. పెత్తండ్రి కూతురు. రఘు ఇల్లాంటి ధోరణిలో అసలు సింహంతో మాట్లాడనే మాట్లాడడు. అల్లాంటప్పుడు కనకదుర్గ ఇల్లాంటి ఉత్తరం వ్రాయడం ఏం మర్యాద? అనుకున్నది.
ఆవిడ కొన్నిరోజులపాటు పిల్లల్తోను, భర్తతోను ఇక్కడ తిష్ట వెయ్యబోతోందన్న విషయం ఉత్తరంలో స్పష్టంగానే ఉంది. తను వీళ్ళందరికి ఎందుకని వళ్ళు విరుచుకొని వండి వార్చాలి? తను వార్చదు. వీళ్ళని ఏ హోటల్లోనో దింపమని రఘుతో చెప్పాలి. సుభద్ర ఇల్లాంటి పరిస్థితుల్లో అంతే చేస్తుంది. అయితే తను మంచిది కనుక వాళ్ళను ఓ పూట భోజనానికి పిలుస్తుంది.
సాయంత్రం రఘు వచ్చి ఉత్తరం చూస్తుంటే, లక్ష్మి తన అభిప్రాయాన్ని రఘుకి చెప్పింది.
“ఛ, అదేం బావుంటుంది! దుర్గక్క రాకరాక వస్తుంటే,” అన్నాడు రఘు.
“ఎందుకు బావుండదు? బ్రహ్మాండంగా వుంటుంది. మొన్న యుద్ధం వచ్చినప్పటి నుంచి ధరలన్నీ మండిపోతున్నాయి. ఈ గడ్డు రోజుల్లో ఏం దగ్గర బంధువులని మనింట్లో దింపుకోవాలి! పైగా ఇల్లా దింపుకుంటూ పోతే ఈ రాజధానిలో అంతెక్కడ?”
“అందర్ని మనమెక్కడ దింపుకుంటాం, మనకైనవాళ్ళనే మనం దింపుకొంటాం.”
“మనకైనవాళ్ళకి నిర్వచనం?”
“మనకి చేసేవాళ్ళే మనకైనవాళ్ళు. వాళ్ళకే మనం చేస్తాం.”
“ఆవిడ మనకు చేస్తుందా?”
“మనం బెజవాడ వెళ్తే నెత్తిమీద పెట్టుకుంటుంది.”
“మనం వెళ్ళం కదా?”
“ఎందుకు వెళ్ళం?”
“ఇంతకు పూర్వం వెళ్ళామా?”
“అయితే ఎప్పుడూ మనమే ముందరవెళ్ళి తరువాతే ఎవళ్ళనైనా మనింటికి రానివ్వాలా? వాళ్ళు మనకెల్లాంటి మర్యాద చేశారో చూసి మనం దానికి తగినరీతిగా తిరుగు మర్యాద చెయ్యాలా?”
“అవును.”
“వాళ్ళూ అల్లాగే అనుకొంటే?”
“మనం వెళ్ళొద్దు.”
లక్ష్మి ఒక కోణంలోంచే చూస్తోంది. తను ఎవరింటికి వెళ్ళదు. వెళ్ళినా అక్కడ తన యింట్లో లాగా సుఖంగా ఉండదు కనుక వెళ్ళదు. అల్లాంటప్పుడు, ఎప్పుడూ వెళ్ళి, వాళ్ళ యిళ్ళల్లో ఉండటానికి తను యిష్టపడని చుట్టాలకి తను చెయ్యడం ఎందుకు?
“చూడు లక్ష్మీ! మనకెంత ఎక్కువ బంధు బలగం ఉంటే అంత మంచిది కదా?”
“మీరేమన్నా చిన్నప్పుడు సోషల్ స్టడీస్‌లో చదువుకున్న వసుధైక కుటుంబం సభ్యులా?” అంది లక్ష్మి నవ్వుతూ. వాతావరణం కాస్త తేలికపడింది.
“కాను. అందరు నావాళ్ళనుకోగల విశాల హృదయం ఉంటే నేను మహాత్ముడినే! అంత విశాల హృదయం లేదు నాకు. కాని నా పెళ్ళాం పిల్లలు మాత్రమే నావాళ్ళనుకోడం నాకు నచ్చదు. ‘తనవారెవరైనా దరిజేర ప్రేమమీర ఆదరించువారి అనురాగపు సంసారమే సంసారం’ అని చిన్నప్పుడో పాట ఉండేది.”
“అందర్నీ ఆదరిస్తే ఇల్లు గుల్లయిపోతుంది.”
“నువ్వు పాట సరిగ్గా వినలేదు. అందులో ప్రేమతో దరిజేరిన బంధువుల్ని మాత్రమే ఆదరించమని వుంది. అందర్ని కాదు. మన మీద ప్రేమతో వచ్చేవాళ్ళు మన యిల్లు గుల్ల చేయరు. మనల్ని చేసుకోనివ్వరు.”
“ఏమో! నాకు చిన్నప్పటినుండి కూడా బంధువులంటే సదభిప్రాయం లేదు. నేను స్నేహితుల్తోనే ఎక్కువ కలవగలుగుతాను. స్నేహితుల్ని మనం ఏర్పరుచుకోవచ్చు. బంధువులల్లా కాదు. నాకు సుభద్రతో వదినగాకంటె, స్నేహితురాలిగానే ఎక్కువ చనువు.”
“స్నేహితుల విషయం తీసుకో. వాళ్ళ విషయంలో మనకు ఛాయిస్ లేదు. మనకి నచ్చకపోయినా కొన్నిసార్లు వాళ్ళని భరించక తప్పదు. అల్లాగే స్నేహితుల్లో బోర్ కొట్టే వారుండరా?”
“మనకి తెలిసినవాళ్ళంతా మన స్నేహితులు కారు. మనకి నచ్చినవాళ్ళే మన స్నేహితులు.”
“అల్లాగే మనతో చుట్టరికం ఉన్నవారంతా మన బంధువులు గారు. మనకి నచ్చినవాళ్ళే మనకి బంధువులు అనుకుంటే పోలా! అల్లాంటి వాళ్ళతో రాకపోకలుంటే యేం? వాళ్ళనే పోనీ స్నేహితులనుకో.”
“బంధువులంటే పెట్టుపోతలుంటాయి బాబూ! అవంటే నాకు భయం.”
“పెట్టుపోతలన్నవి సాంఘికాచారానికి సంబంధించింది. స్నేహితుల పెళ్ళిళ్ళకి, పుట్టిన రోజులకి శక్తున్నా, లేకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా మనం గిఫ్టులు తీసికెళ్ళటం లేదూ? అల్లాగే బంధువుల్తోనూ.”
లక్ష్మి మాట్లాడలేదు. మళ్ళీ రఘుయే అన్నాడు. “ఈ పెట్టుపోతల్లో ఒక సోషలిజం ఉంది. మా పెదనాయనమ్మ బతికున్న రోజుల్లో మా యింటికి వస్తూ వుండేది. చచ్చేలా చాకిరి చేసేది. మానాయనమ్మేమో వాళ్ళ అక్కకి తనకున్న దానిలో బట్టలో, వస్తువులో, దినుసులో ఏవో ఆవిడ వెళ్ళేటప్పుడు ఇచ్చేది. కొంచెం పచ్చగా ఉన్నవారు తమ పచ్చను, పచ్చగాలేని బంధువులతో పంచుకోవడం సోషలిజం కాదా? అయితే ఇది బంధువుల మధ్య మాత్రమే అమలు జరుగుతుంది కనక, ఒకళ్ళూ పచ్చగా లేని వర్గాలు దెబ్బతింటూ వచ్చాయి. అందరూ పచ్చగా ఉన్న కుటుంబాలు మరీ ధనికులైపోయారు. అందుకనే ఈ సోషలిజం అప్రతిష్ట పాలైంది.”
“మీ ఆలోచనలు వేరు, నావి వేరు. నా ఆలోచనలు నేను పుట్టిననాటి నుంచి పెరిగిన వాతావరణంలో నేను విన్న మాటలు బట్టి ఏర్పడినవి. ఒకరి జోలికి సొంఠికి పోకపోడం, మనజోలికి వచ్చేంత చనువు ఎవరికి ఇవ్వకపోవడం చేస్తే, జీవితం చాలా సుఖంగా గడిచిపోతుందని నాకనిపిస్తుంది.”
“మనం అంటున్నావ్. మనం అంటే ఎవరు? నువ్వూ, నేనూ మన పిల్లలూనా? మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టు లోంచి తీసేస్తారు. కనుక మన లిస్టులో వాళ్ళని వేసుకున్నా వాళ్ళు మనల్ని వేసుకోరు. ఇంక మిగిలింది నువ్వూ నేనూ. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ళ పరిధిలోకి రానీయరు. ఇంక కేవలం నన్ను కట్టుకున్న దానివి నువ్వు మిగిలావ్. నువ్వుమాత్రం నాదానివని ఎందుకనుకోవాలి? కేవలం నేను మాత్రమే నా వాడినని ఎందుకనుకోరాదు?”
లక్ష్మికి ఏడుపు వచ్చింది. “నేను మీదాన్ని కానా? అందర్నీ వదిలేసి మీరే నా సర్వస్వం అని నమ్మి వచ్చిన నేను మీకు పరాయిదాన్నా?” అంది లక్ష్మి ముక్కు ఎగబీలుస్తూ.
“వాదనలో ఉడుక్కోడాల్లేవ్. ఆటలో అరిటిపండు. నేను చెప్పేదేమిటంటే కుటుంబపు పరిధిని పెంచుకుంటూ పోతే వసుధైక కుటుంబం వైపు ప్రయాణం చేస్తాం. తగ్గించుకుంటూ పోతే ఏదో ఓ రోజు నువ్వా? నేనా? అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఎప్పుడూ నేనే. అందుకని మనం మన పరిధిని తగ్గించుకుంటూ పోవడం నాకిష్టం లేదు. అల్లా అని పెంచుకుంటూ పోడానికి తగ్గంత మంచివాడిని కాను. అందుకని నేనంటే అభిమానం చూపించేవాళ్ళు నావాళ్ళు అని నిర్వచించుకున్నాను.”
“అంటే మీ దుర్గక్కయ్యకు మీరంటే అభిమానం అంటారు. లేక హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మీరంటే అభిమానం చూపిస్తుందంటారా?” అని అడిగింది లక్ష్మి పెంకెగా.
రఘు నవ్వాడు. నవ్వి “లక్ష్మీ, నీకో చిన్న కథ చెప్తాను విను. మా తాతగారు మా నాన్నగారి చిన్నప్పుడే పోయారు. మా పెద్దనాన్నగారు అంటే దుర్గవాళ్ళ నాన్నగారు తను కష్టపడి చదువుకొని మెట్రిక్ పాసయ్యారు. మెట్రిక్ పాసయి ఉద్యోగంలో జేరి మా నాన్నగారికి ఇంటర్ దాకా చదువు చెప్పించారు. మా నాన్నగారు ఇంటర్ పాసయి ఉద్యోగంలో జేరాక ఆయన ఉద్యోగం మానుకొని బియ్యే చదివారు. ఆయన బియ్యే పూర్తి చేసి ఉద్యోగంలోజేరి మా నాన్నగారిని ఎమ్మే దాకా చదివించారు. మా దొడ్డమ్మ, మా అమ్మా వాళ్ళతో సహకరించబట్టి వాళ్ళు పరస్పరం సహాయం చేసుకుంటూ ఇద్దరూ వృద్ధిలోకి వచ్చారు. ఈరోజుల్లో సోషల్ సెక్యూరిటీస్ కొన్నంటూ ఏర్పడ్డాయి. అందుకని బంధువులకున్న విలువ తగ్గింది. పూర్వం బంధువులు కష్టాలొస్తే ఆదుకొనేవారు. ఇప్పుడు ఇన్సూరెన్సులు. ప్రావిడెంట్ ఫండులు ఉండటం వల్ల బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందవల్సిన అవసరం తగ్గింది. అందువల్ల బంధువులంటే మనుషుల ధోరణులు మారాయి. అంతే!”
“మీ అక్కయ్యను హోటల్లో దింపమన్నానని ఎంత లెక్చరిచ్చారండి! మనింటికే తీసుకురండి.” అంది లక్ష్మి.
10
పదో తారీకున లక్ష్మి, రఘు స్టేషన్‌కు వెళ్ళారు. దుర్గని, ఆమె భర్తని కలుసుకున్నారు.
“పిల్లలేరి?” అని అడిగాడు రఘు.
“మా అత్తగారు చూసిపెడ్తానన్నారు” అంది దుర్గ.
“సెకండ్ హనీమూనింగ్ అన్నమాట” అన్నాడు రఘు నవ్వుతూ.
రఘు స్టేషన్ బయట తన ఇంటికి టాక్సీ మాట్లాడబోతుంటే “మీ బావగారి కంపెనీయే హోటల్ బుక్ చేసింది. కారు పంపుతుంది” అంది దుర్గ.
“మా యింట్లో దిగకుండా అదేమిటి?” అని కోపంగా అడిగాడు రఘు.
“నువ్వే చెప్పావ్ కదా. మాది హనీమూన్ ట్రిప్ అని. మరి మీ యింట్లో దిగితే ఇంక హనీమూనేమిటి నా మొహం. వంటిల్లు నాకప్పచెప్పి ‘అక్కయ్యా, లక్ష్మికి పులిహోర చెయ్యడం రాదు. అందుకని నా నోరు చచ్చిపోయింది. కాస్త పులిహోర చెయ్యవా?’ అంటూ నువ్వు లక్ష్మిని తీసుకొని వీధిలోకి చెక్కేస్తావ్.”
“మేమే వంటింట్లో ఉంటాం. నువ్వూ బావగారు రోజూ పది గంటల వరకు చెట్టాపట్టాలు వేసుకొని షికార్లు కొట్టి రండి. అంతేగాని హోటల్లో దిగుతాం అంటే ఒప్పుకోను.”
“మీటింగుకు హోటల్నుంచి వెళ్ళటం సుఖం, దగ్గరానూ. పదమూడో తారీకు మీ యింట్లో ఓపూట ఉండి మరీ బెజవాడ వెళ్తాం. సరేనా?” అందు కనకదుర్గ.
ఇంతలో కంపెనీ కారొచ్చింది. కనకదుర్గ, భర్త అందులో వెళ్ళిపోయారు. రఘు మోటార్‌సైకిల్ స్టార్ట్ చేశాడు. లక్ష్మి ఎక్కింది. దార్లో “చూశావా! అత్తగార్లు పిల్లల్ని కూడా చూసిపెడతారు. అధికారం చెయ్యటమే కాకుండా” అన్నాడు రఘు లక్ష్మిని ఉడికించే ఉద్దేశ్యంతో. లక్ష్మి “నేనత్తగార్ల విషయం మాట్లాడలేదు” అంది.
పన్నెండో తారీకు వచ్చింది. మర్నాడు దుర్గ వస్తుంది. అందుకని రఘు, దుర్గకి చీరకొనే ఉద్దేశ్యంతో లక్ష్మిని తీసుకొని గద్వాల్ చీరల కొట్టుకు వెళ్ళాడు. దుర్గకి చీర కొంటున్న విషయం, రఘు లక్ష్మికి చెప్పలేదు. అక్కడ లక్ష్మి “ఈ రంగు నాకిష్టం లేదు” అంది.
“నీక్కాదు. దుర్గక్కయ్యకి” అన్నాడు రఘు.
“ఇంటిదగ్గరెందుకు చెప్పలేదు?”
“చెప్పుంటే?”
“ఇక్కడెందుకు చర్చ? ఇక్కడ చర్చించటం నాకిష్టం లేదు.”
“అయితే పద, మళ్ళీ వద్దాం” అంటూ రఘు చీర కొనకుండా బయటకు దారి తీశాడు. లక్ష్మిని ఎక్కించుకొని మోటర్‌సైకిల్ మీద ట్యాంక్‌బండ్‌కి తీసుకువెళ్ళాడు. జనవరి నెలవడంతో అక్కడ చలిగా ఉంది. జనం పలచగా ఉన్నారు. అక్కడ సిమెంటు బెంచి మీద కూర్చున్నాక, “ఇప్పుడు చెప్పు” అన్నాడు రఘు.
“దుర్గగారికి మనం అంత ఖరీదైన చీర ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏమిటి?”
“నాకుద్యోగం అయ్యాక, మా అక్కయ్య నాదగ్గరికి రావటం ఇదే మొదటిసారి. అక్కయ్యకు నేనంటూ ఎప్పుడూ ఒక్క చీరా కొనలేదు.”
“నాకు కొన్నారు కదా, పాపం! ఈ మూడేళ్ళలోనూ!”
“కొనలేదా?”
“కట్టుడు చీరలు కొన్నారు.”
“ఖరీదైన చీరలు నీకే యాభయ్యో ఉన్నాయనే ఉద్దేశ్యంతో పెళ్ళయ్యాక కొనని మాట నిజమే గాని పెళ్ళికి కొన్నాను కదా?”
“పెళ్ళికి కొన్న చీరను ఎన్నింటిలో లెక్క పెడ్తారు?” అని అడిగింది లక్ష్మి.
“ఎన్నింట్లో పెట్టాను?” అని ఆశ్చర్యంగా అడిగాడు రఘు.
“పెళ్ళిలో పెళ్ళికూతురికి పెట్టే అయిదు చీరల్లో ఒకటిగా పెట్టారు కదా మీవాళ్ళు దాన్ని.”
“మేము నీకు ఐదు చీరలు పెడతామన్నామా?” ఇంకా ఆశ్చర్యపోయాడు రఘు.
“అనాలేమిటి! ఆనవాయితీ లేదూ?”
“ఉందా? ఉందని ఎవరు చెప్పారు?
“సుభద్ర, మా అమ్మ. పెళ్ళికి వచ్చిన నా స్నేహితురాళ్ళు.”
“ఇంకా ఏమన్నా చెప్పారా?”
“చెప్పలేదు.”
“బతికించారు.”
అప్పటికి రఘుకి కోపం తగ్గి లక్ష్మి అమాయకత్వం మీద జాలి చోటు చేసుకుంది. “విను లక్ష్మీ! కొందరు మొగపెళ్ళివారు పెళ్ళికొడుక్కి రిస్టువాచి, పట్టుబట్టలు, ఉంగరం, వెండి కంచం, వెండి చెంబు, వెండి గ్లాసు, మూడో నాలుగో సూట్లు, హనీమూన్‌కి వెళ్ళడానికి టికెట్లు, పదివేలు కట్నం అంటూ ఓ పెద్ద జాబితా చదువుతారు. అందుకని మనవాళ్ళు ఆనవాయితీలనేవి ఏర్పరిచారు. అవి రెండు పక్షాల వారికి రక్షణ కలిపిస్తాయి. ఇన్ని వసూలు చేసిన వాళ్ళనుంచి అంతకు ఇంతా ఆడపిల్లకు పెట్టించటంలో ఒక భాగమే అయిదు చీరల ఆనవాయితీ. అయితే ఆనవాయితీల్లో తమాషా ఏమిటంటే ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళకి రావలసినవే గుర్తుంచుకొంటారు. మీ వాళ్ళు ఆ జాబితాలో నాకు ఎన్ని ఇచ్చారంటావ్?”
“మీవాళ్ళు అడిగుంటే వాళ్ళు ఇచ్చుండేవారు” అంది లక్ష్మి.
“మీవాళ్ళు కూడా మమ్మల్ని అయిదు చీరలు పెట్టమని అడగలేదు.”
“మీకామాత్రం తెలుసుననుకొన్నారు. మీరు పెట్టినవి కూడా అయిదే ఉన్నాయి.”
“అదేదో కాకతాళీయంగా జరిగింది. కాని అందులో ఒకటి మాత్రం నేను అభిమానంతో రెండు వందలు పెట్టి కొన్నాను.”
“పోనీ అల్లాగే అనుకొన్నా మరి పెళ్ళయ్యాక ఒక్కటీ కొనలేదేం?”
“పెళ్ళయిన ఏడాది రెండు కొన్నాను.”
“అవి నూలువి.”
“గత సంవత్సరం ఒకటి కొన్నాను.”
“అది టెర్లిన్.”
“ఈ యేడాది కొన్నది?”
“అది కాశ్మీర్ సిల్కు”
“మరి?”
“మీరు మనకి పెళ్ళయ్యాక ఒకటైనా గద్వాల్ చీర కొన్నారా?”
“లేదు.”
“నాకు కొనకుండా మరోళ్ళకి కొనడం తప్పేనా?”
“తప్పే.”
“ఎప్పుడు దిద్దుకుంటారు?”
“ఉగాదికి.”
“అయితే కొట్టుకు పదండి. రేప్పొద్దున్నే దుర్గగారు వస్తారు కూడానూ.”
ఇద్దరు లేచారు. బజారుకు వెళ్ళి ఓ చీరా, రవికల గుడ్డ కొని ఇంటికి జేరుకున్నారు. పక్క మీద పడుకున్నాక రఘు గుండెల మీద రాస్తూ “మా అన్నయ్య కూడా, మీరు దుర్గంటే చూపిస్తున్న అభిమానం నామీద చూపించాలనే కోరిక నాకు తీరకపోవడం వల్ల మీరు దుర్గగారికి చీర కొంటానని అనగానే నాకు కలిగిన మొదటి భావం అసూయ. అందుకని అల్లా వాదించాను. ఏమనుకోకండి. దుర్గగారంటే నాకూ ఇష్టమే. ఆవిడ మన పెళ్ళికి రికార్డ్ ప్లేయర్ ఇచ్చింది కూడాను” అంది. రఘు లక్ష్మిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
“వెర్రిపిల్లా! ఆ ఊరు ఈ ఊరుకెంత దూరమో ఈ ఊరికి ఆ ఊరూ అంతే. మీ అన్నయ్య కొడుక్కి ఈ మూడేళ్ళలోనూ నువ్వేమైనా ఇచ్చావా? లేదు కదా. వాళ్ళు ఇవ్వలేదు, పుచ్చుకోలేదు.” అన్నాడు రఘు.
పదమూడో తారీకు పొద్దున్న లక్ష్మీ రఘు లేచి భోగి తలంట్లు పోసుకొనేసరికి దుర్గ, ఆమె భర్త వచ్చారు.
“వదినగారూ! తలంటి పోసుకోండి. కుంకుడుకాయలున్నాయి” అంది లక్ష్మి.
“అన్నీ హోటల్లోనే అయ్యాయి. కాఫీ, టిఫిన్లతో సహా” అంది దుర్గ.
“మీ వదిన స్నానం చేసినా అల్లాగే ఉంటుంది” అన్నాడు దుర్గ భర్త స్నానం చేసి కూడా చెయ్యనట్టుండడం వల్ల లక్ష్మి చెయ్యలేదనుకొంది అని సూచిస్తూ.
“మా అక్కయ్య స్నానం చెయ్యకుండానే చేసినంత శుభ్రంగా ఉంటుంది. అందుకని తేడా తెలియదు” అన్నాడు రఘు.
“హాస్యాలకేం గాని వంటపని మొదలు పెడదామా లక్ష్మీ?” అంటూ దుర్గ వంటింట్లోకి దారి తీసింది. వంట లక్ష్మిని చెయ్యనిచ్చి దుర్గ పైపని అందుకుంది. కూరలు తరిగి ఇచ్చింది. బియ్యం బాగు చేసింది. వంట చేసిన కీర్తి పూర్తిగా లక్ష్మికే ఇచ్చింది.
పదకొండు గంటలయ్యాక “రఘూ, వంటవాసనకు మీ బావగారి నోరూరి ఆగలేకపోతున్నారు. భోంచేద్దామా?” అంటూ దుర్గ కంచాలు, మంచినీళ్ళు పెట్టింది.
భోజనాలు అయ్యాక కనీసం పెద్దపండుగకైనా ఇంటి దగ్గర ఉండకపోతే పిల్లలు బాధపడ్తారని చెప్పి దుర్గ, ఆమె భర్త ప్రయాణం కట్టారు, రఘు అభ్యంతరం చెప్పడానికి తావివ్వకుండా.
దుర్గకి కొన్న బట్టలు పెట్టింది లక్ష్మి. ఆపైన రఘు, లక్ష్మీ వంగి ఆమెకు, ఆమె భర్తకు నమస్కరించారు.
“మరుసటేడుకి మేనకోడల్ని కనండి” అంటూ దుర్గ దీవించింది వెళుతూ. “వీలు చూసుకొని మాయింటికి రండి” అంటూ ఆహ్వానించింది వాళ్ళిద్దరినీ.
ఆవిడ ఆప్యాయతకు లక్ష్మి కరిగిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక “చూశావా, లక్ష్మీ! అక్కయ్య, బావ మనమెక్కడ కష్టపడిపోతామో అని మనింట్లో ఒక పూటకంటే ఉండలేదు. ప్రేమగల బంధువుల పద్ధతే అంత” అన్నాడు రఘు.
11
చి. సౌ. లక్ష్మికి,
ఆశీర్వచనాలు. నేను ప్రయత్నించగా ప్రయత్నించగా నాకు కెనడా వెళ్ళే అవకాశం వచ్చింది. బాబు ఎస్.ఎస్.ఎల్.సీ పాసైన ఈ సమయంలో ఆ అవకాశం రావడం నా అదృష్టం. విదేశీ డిగ్రీలకు మన దేశంలో ఉన్న విలువ దృష్ట్యా వాడు పైచదువులు కెనడాలోనే చదవటం మంచిది కదా! ఇక్కడ నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. నాకు, బాబుకి వండి పెట్టడానికి మీ వదిన్ని తీసుకెళ్ళక తప్పదు కదా. ఇంటర్ చదువుతూ మానేసిన మీ వదినకు ఇంగ్లీషు మాట్లాడటం పెద్ద సమస్య అవుతుందని అనుకోను. అందుకని ఏకంగా మా ముగ్గురికి ఇమ్మిగ్రేషన్ వీసాకు అప్లయ్ చేశాను. పోతే అమ్మ ఒక్కత్తే విశాఖపట్నంలో ఉండాలి. అమ్మ వంటరితనంతో బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద పడ్తుంది. ఏడాదికోసారో రెండుసార్లో నువ్వు వెళ్ళి చూస్తే చాలు. నేను కెనడా నుంచి రెగ్యులర్‌గా ఉత్తరాలు రాస్తూ ఉంటాను. మేము సెప్టెంబర్ ఒకటవ తారీకు బయల్దేరాలి. ఈ లోపల వీలు చూసుకొని నువ్వు, రఘు, బుజ్జమ్మ రండి.
ఇట్లు
సింహం
లక్ష్మి ఉత్తరం చదవటం పూర్తి చేసింది. లక్ష్మికి పెళ్ళయి పది సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలలోను లక్ష్మి పుట్టింటి సమస్యలతో ఎప్పుడూ సతమతమవలేదు. ఆఖరికి నాలుగేళ్ళ క్రితం బుజ్జమ్మ పురిటికి కూడా వెళ్ళలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో పోసుకుంది. బుజ్జమ్మ పుట్టిన దగ్గర్నుంచి దానికెప్పుడేం దెబ్బ తగుల్తుందో ఎక్కడ పడిపోతుందో అని పంచప్రాణాలు దానిమీద పెట్టుకొని, వెయ్యికళ్ళతో కనిపెట్టుకొని ఉండటం మొదలుపెట్టాక లక్ష్మికి, తన తల్లి తన్నీ అంత జాగ్రత్తగా పెంచి ఉంటుందన్న విషయం అర్థమయింది. అందుకని అన్నపూర్ణమ్మకు నెలకి రెండో మూడో ఉత్తరాలు రాయడం, ఏడాదికో ఏణ్ణర్ధంకో వెళ్ళి చూడటం అలవాటు చేసుకొంది లక్ష్మి.
సింహం అమ్మని వదిలి వెళ్ళడం విషయంలో సింహానికే బాధా ఉండకపోవచ్చును కాని అమ్మకి? అంత దూరంలో కొడుకుంటే అక్కడ వాడేం కష్టపడిపోతున్నాడో అని అమ్మ ఇక్కడ బెంగ పెట్టుకొంటుంది.
“ఏమిటి లక్ష్మీ! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?” అంటూ వచ్చాడు రఘు. లక్ష్మి ఉత్తరం అందించింది. రఘు చదివి “మీ అన్నయ్య లక్కీఫెలో. కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉత్తరం రాయి” అన్నాడు.
“మా అన్నయ్య లక్కీఫెలోయే! కాని పాపం అమ్మ ఒక్కత్తీ విశాఖపట్నంలో ఉండొద్దూ?” అని లక్ష్మి తన బెంగ బయటపెట్టింది.
“మీ అన్నయ్య మీ అమ్మగారిని కూడా తీసుకొని వెళ్తే సరి. మాఫ్రెండొకడు కెనడాకి తల్లిదండ్రుల్నే కాక తమ్ముళ్ళని, చెల్లెళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు. అందుకని మీ అన్నయ్యకి మీ అమ్మగార్ని కూడా తీసుకెళ్ళమని ఉత్తరం రాయి.”
“మా అమ్మ వెళ్ళదేమో.”
“వెళ్తారేమో. ఉత్తరం రాస్తే తప్పేమీ లేదు కదా!”
“అమ్మా, అమ్మమ్మను మనం తెచ్చుకుందాం. మామ్మా, తాతగారు ఇక్కడున్నారు కదా! అమ్మమ్మ కూడా ఉంటుంది” అంది బుజ్జమ్మ.
“అమ్మమ్మ రాదమ్మా! అమ్మమ్మ మామయ్య దగ్గరే ఉండాలి” అంది బాధగా లక్ష్మి.
“ఏం? అమ్మమ్మ నీకు మాత్తరం అమ్మ కాదా? అమ్మమ్మ అచ్చంగా అంతా మామయ్య దగ్గరే ఎందుకు ఉండాలి?”
మన దేశంలో తల్లిదండ్రులు కొడుకు దగ్గరే ఎందుకు ఉంటారో. కూతురు దగ్గర ఎందుకు ఉండరో బుజ్జమ్మకర్థమయేలా ఎల్లా చెప్పాలో లక్ష్మికి తెలియలేదు. కాని నిజంగా అన్నపూర్ణమ్మ వచ్చేటట్టుగా ఉన్నా తన యింటికి పిలిచి అట్టే పెట్టుకొనే స్వతంత్రం తనకుందా? తన అత్తగారు మామగారు ఏమనుకుంటారు? రఘు ఏమనుకుంటాడు? తనేమీ చెయ్యలేదు! సింహానికి తను ఉత్తరం రాయటం ఎందుకైనా మంచిది.
అన్నయ్యకు నమస్కారములు,
నువ్వు, వదిన, బాబు కెనడా వెళ్తున్నారని రాసిన ఉత్తరం అందింది. చాలా సంతోషం. అమ్మని కూడా తీసుకెళ్ళకూడదా? అల్లా తీసుకెళ్ళినవాళ్ళు చాలామంది ఉన్నారని మీ బావగారు అంటున్నారు. మీరు వెళ్ళటానికి వ్యవధి చాలా ఉంది కనుక వీలు చూసుకొని వస్తాం.
ఇట్లు
లక్ష్మి
లక్ష్మి ఉత్తరం రాసిన పదిహేనో రోజున ‘అమ్మకు సీరియస్‌గా ఉంది. వెంటనే రండి’ అన్న టెలిగ్రామ్ నరసింగరావ్ దగ్గర్నుంచి లక్ష్మికి అందింది. టెలిగ్రామ్ అందగానే లక్ష్మి ఏడుపు మొదలు పెట్టింది. లక్ష్మి అత్తగారు లక్ష్మిని ఓదార్చినా లక్ష్మి దుఃఖం ఆగలేదు. లక్ష్మి మామగారు రఘు ఆఫీసుకు ఫోను చేశారు. ఫోనులో విషయం వివరించి వెంటనే రమ్మన్నారు. రఘు వచ్చాక మొదటి రైలుకు విశాఖపట్నం ప్రయాణం అయింది లక్ష్మి, రఘుతో కలిసి. దారిపొడుగునా లక్ష్మి ‘మా అమ్మకెలా ఉందోనండీ’ అంటూ ఏడుస్తూనే ఉంది.
“ఏమీ అవదు. నువ్వు కంగారు పడకు” అంటూ రఘు లక్ష్మికి ధైర్యం చెప్తూనే ఉన్నాడు.
రైలు దిగి ఇంటికి వెళ్ళేవరకు లక్ష్మి మనసు కీడు సంకిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళి, మంచం మీద నీరసంగా పడుకొని ఉన్న తల్లిని చూశాక గానీ లక్ష్మి ఆందోళన తగ్గలేదు. అన్నా వదిన ఇంట్లోనే ఉన్నారు.
“అమ్మకేమిటైంది?” అని లక్ష్మి నరసింగరావ్ను అడిగింది జోళ్ళయినా విప్పకుండానే.
“నాకేమిటి? దుక్కలా ఉన్నాను” అని అన్నపూర్ణమ్మ జవాబు చెప్పింది. నరసింగరావ్ జవాబు చెప్పలేదు.
“ఏం జరిగింది? ఎందుకలా టెలిగ్రామ్ ఇచ్చారు?” అని లక్ష్మి మళ్ళీ అడిగింది.
“చెప్తాలే” అన్నాడు నరసింగరావ్.
సుభద్ర కాఫీ తెచ్చి ఇచ్చింది. రఘు, లక్ష్మి కాఫీ తాగుతుంటే నరసింగరావ్ జరిగిన విషయం చెప్పటం మొదలు పెట్టాడు. “నువ్వు ఉత్తరం రాసినప్పటినుంచి, నేనొక్కత్తినే ఉండలేను. నేనూ కెనడా వస్తానని అమ్మ గొడవ మొదలుపెట్టింది. నేను వద్దన్నాను.”
“ఎందుకన్నావ్?” లక్ష్మి అడిగింది.
“మనమాట కాదు. మన పద్ధతులు కావు. నువ్వక్కడ ఇమడలేవు అన్నాను. మరీ రోజురోజుకీ గొడవ ఎక్కువైపోతే నేను తీసుకు వెళ్తానని నువ్వు ఆశ పెట్టుకోకు అని ఖండితంగా చెప్పాను. అది అయిదు రోజుల క్రితం చెప్పాను. అప్పటినుంచి మౌనంగా ఆలోచిస్తూ నిద్రన్నా పోకుండా కూర్చోడం మొదలుపెట్టింది. దాంతో వర్రీకి బాగా గాస్ తయారై గుండెలకెగదన్ని గుండెనొప్పి పట్టుకుంది. మొదట్లో హార్ట్ ఎటాక్ ఏమోనని భయపడ్డాను. డాక్టర్లు కాదన్నారు. ట్రాన్క్విలైజర్స్, నిద్రమాత్రలు రాసిచ్చారు. మాటిమాటికి బజారు వెళ్ళడం అంటే ఈ ఊళ్ళో మాటలు కాదు కదా. అందుకని మాత్రలు ఒకేసారి ఎక్కువ కొని స్టోర్ చేశాను. మొన్న రాత్రి అవి నేను ఎక్కడ పెడ్తున్నానో అమ్మ చూసినట్టుంది ఓ గుప్పెడు మాత్రలు మింగింది. నిన్న పొద్దున్న ఎంత లేపినా లేవలేదు.”
“ఎంతపని చేసింది అమ్మ!” అంది లక్ష్మి.
రాత్రి లక్ష్మి తల్లి గదిలో పక్క వేసుకొని పడుకుంది. రఘు, నరసింగరావ్ పైన ఆరుబయట మంచాలు వేసుకొని పడుకొన్నారు. సుభద్ర, పిల్లలు మరో గదిలో పడుకొన్నారు.
“ఎంతపని చేశావమ్మా! నాకిరవై నిండకుండా నాన్నగారు పోయారు. ముప్ఫై అయినా నిండకుండా నువ్వూ పోదామనుకున్నావా? మాత్రలు మింగేటప్పుడు నేను గుర్తు రాలేదా అమ్మా!” అంటూ వాపోయింది.
“ఏం చెయ్యను తల్లీ! సింహానికి ఈ ఇంగ్లీషు రాని తల్లి అక్కర్లేకపోయింది. ఈ ముసలితనంలో ఈ యింట్లో నేను అద్దె డబ్బులు పెట్టుకొని దేనికోసం బతకాలనిపించింది. ఆమాటే వాడితో అంటే నేనేదో డబ్బు సరిపోదని అంటున్నానుకొని ‘అక్కడ నుండి నీకు నెలకు మరో వంద పంపుతానమ్మా. మనదేశంలో డబ్బుంటే మహారాజులా బతకచ్చు’ అన్నాడు. మనుషులు డబ్బుకోసం బతుకుతారా? కన్న కొడుకే అభిమానం లేకుండా మాట్లాడ్తుంటే ఆ తల్లి బతుకెందుకు? ‘పోనీ, నీ డబ్బు పెట్టుకొని లక్ష్మి దగ్గరుందూ గాని’ అన్నాడు. ఇంత బతుకు బతికి ఆడపిల్ల ఇంట్లో ఉండనా? నా చావుతో అన్ని సమస్యలూ తీర్తాయనుకొన్నాను. ఈ పాపిష్టిదంటే ఆఖరికి యములాడికి కూడా లోకువే! సింహం నా గొడవ తను పట్టించుకోనే పట్టించుకోడట. నా చావు నన్ను చావనివ్వడట” అంటూ అన్నపూర్ణమ్మ బాధ వెళ్ళబోసుకుంది.
మర్నాడు కాఫీల వేళ “పోనీ అన్నయ్యా! అమ్మని తీసుకువెళ్తే ఏం?” అని అడిగింది లక్ష్మి.
“ఎల్లా కుదుర్తుంది చెప్పు. ‘మా అమ్మ నన్ను విడిచి ఉండలేదు. అందుకని కూడా తీసుకువచ్చా’నని మీ అన్నయ్య చెప్పాల్సి వస్తుంది. అల్లా చెప్తే అందరూ నవ్వరూ!” అంది సుభద్ర.
“స్వర్గానికి పోయినా సవతిపోరు తప్పలేదని, నాకు దూరంగా అది కెనడాకు పోతుంటే నన్ను తీసుకు వెళ్ళమంటావేమిటే పిచ్చితల్లీ!” అంది అన్నపూర్ణమ్మ.
“మీ అబ్బాయి ఎందుకు వద్దంటున్నారో చెప్పాను గాని మధ్య నన్నంటారేం?”
“ఇవన్నీ ఎందుకుగాని, అమ్మకి అక్కడికి వచ్చినా యావంతా ఈ ఊరు మీద, ఈ ఇంటి మీదే ఉంటుంది. అమ్మకు దిగులు పుట్టుకొచ్చినప్పుడల్లా పంపించటానికి దగ్గరా దాపూ కాదు. మూడేళ్ళకోసారి మేము కెనడానుంచి వచ్చి చూస్తూ ఉంటాం. అమ్మకేమన్నా కావాలంటే చూడటానికి నువ్వు ఈ దేశంలోనే ఉంటావు కదా!” అన్నాడు నరసింగరావ్ లక్ష్మితో.
“దానికి నన్నంటగట్టి నువ్వు నీ పెళ్ళాంతో వెళ్ళి కెనడాలో కులుకు!” అంది అన్నపూర్ణమ్మ నిష్ఠూరంగా.
“చూడండి నరసింగరావ్గారూ! ప్రస్తుతం అత్తగారు, మీరు కెనడా వెళ్తే మళ్ళీ తొందర్లో మిమ్మల్ని చూడలేరు కదా! ఆవిడ ఆ బాధనే రకరకాలుగా వెళ్ళబెడుతున్నారు. ఆవిడకు నెమ్మదిగా నచ్చచెప్పండి” అన్నాడు రఘు.
“ఇంక ప్రయాణం రెండు నెలల్లో ఉంది. ఏం నచ్చచెప్పను? ఈవిడ ఏ అఘాయిత్యం చెయ్యకుండా ఈవిడనే కనిపెట్టుకొని కూర్చోనా? ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోనా?” అన్నాడు నరసింగరావ్ నిస్పృహగా.
“ప్రస్తుతానికి ప్రయాణం వాయిదా వేసుకుంటే?” రఘు అడిగాడు.
“సెషన్ సెప్టెంబర్ చివరికి మొదలవుతుంది. కనీసం ఓ నెల ముందైనా వెళ్ళి యిల్లూ వాకిలి చూస్కోవాలి కదా! ఒక నెలైనా ఎక్లమటైజ్ అయితే యూనివర్సిటీ తెరిచేసరికి సులభంగా ఉంటుంది. పాఠాలు ప్రిపేర్ అవడానికి ఇబ్బంది ఉండదు. అసలే ట్రావెల్ ఎరేంజ్మెంట్స్తో చాలా స్ట్రెయిన్ అవుతున్నాను. దానికి తోడు మనసుకు శాంతి లేకుండా ఈవిడ గొడవ ఒకటి.”
“అయితే అత్తగారినీ వూర్లో వదలి వెళ్ళక మీకు తప్పదంటారా?”
“ఆల్టర్నేటివ్ లేదు.”
“సరే! అయితే అత్తగార్ని మేము మా ఊరు తీసుకెళ్తాం” అని రఘు తన నిర్ణయం తెలియజేశాడు.
“కాని మీ అమ్మగారితోను, నాన్నగారితోను ఒక్కమాటైనా అనకుండానే…” లక్ష్మి భయపడింది.
“ఫరవాలేదు. మీ అమ్మగారు మావాళ్ళతో పాటే. వాళ్ళకు చెయ్యడం మనకెంత విధో ఈవిడకు చెయ్యడం అంతే.”
“కానీ…” అంటున్న అన్నపూర్ణమ్మతో “అనవసరపు అనుమానాలు పెట్టుకోకండి. లక్ష్మిని వదిలేసి వెళ్తాను. మీ ఆరోగ్యం కుదుట పడగానే వచ్చేయండి” అన్నాడు రఘు.
“నువ్వు లక్ష్మితో వెళ్ళేటట్టయితే ఇల్లంతా ఏకంగా అద్దెకిస్తాను. అద్దెలో మూడు వందలు నీకు ప్రతినెలా లక్ష్మీ వాళ్ళ ఊరు పంపే ఏర్పాటు చేస్తాను. నీ డబ్బు ఖర్చు పెట్టుకొని నువ్వుంటే లక్ష్మికి నువ్వు భారం అనిపించవు” అన్నాడు నరసింగరావ్ సంతోషంగా.
“ఈరోజుల్లో డబ్బుకెంతో విలువుంది కాదనను. అసిస్టెంటింజనీరుగా నా జీతం తక్కువే. అదీ కాదనను. నాకున్న బాధ్యతలు ఎక్కువే, ఒప్పుకుంటాను. కాని ఆవిడకు మీరు నెలనెలా మూడువందల రూపాయలు కాక మూడు రూపాయలే పంపే ఏర్పాటు చేసినా ఆవిడ నాకు భారం అనుకోను. మేం తిన్నదే ఆవిడకు పెడ్తాను. మేము పస్తుంటే ఆవిడని పస్తు పెడతాను” అన్నాడు రఘు నొచ్చుకుంటూ.
“నేను డబ్బు పంపే ఏర్పాటు వల్ల మీరు నొచ్చుకొనేట్టయితే మానేస్తాను” అన్నాడు నరసింగరావ్ గడుసుగా.
ఆ గడుసుదనం గమనించి “డబ్బుతో అవసరం నాకున్నా లేకపోయినా అత్తగారికీ వయసులో తప్పకుండా ఉంటుంది. ఆవిడ వద్దంటే తప్పించి ఆవిడకు మీరు పంపడమే న్యాయం. ఇందులో నా మనస్సు నొచ్చుకొనే మాట ప్రసక్తే లేదు” అన్నాడు రఘు.
ఆ సాయంత్రం రఘు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక “ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా బాధ్యత మాత్రం అప్పచెప్పి పోతున్నావురా!” అంది అన్నపూర్ణమ్మ బాధగా.
“రఘు ఏమీ అమాయకుడు కాదులేండి అత్తగారూ! మీకంటూ నెలకు మూడువందల ఖర్చు ఏమీ ఉండదని అతనికి తెలుసు. అందుకని అదెల్లాగో మీరు వాళ్ళ మీదే ఖర్చు చేస్తారని అర్థం చేసుకొన్నాడు. అందుకనే నెపం మీ మీద పెట్టి, డబ్బు మాత్రం పంపమన్నాడు” అంది సుభద్ర.
‘నెలకి మూడువందలు ఆదాయం ఉన్న అందరినీ మీ ఇంట్లో ఉంచుకుంటావా వదినా?’ అనబోయి లక్ష్మి దేశం విడిచి వెళ్ళిపోయే వాళ్ళతో మాటలు పెంచుకోడం ఇష్టం లేక ఊరుకుంది.
12
అన్నపూర్ణమ్మ లక్ష్మి ఇంట్లో ఉండటానికి మొహమాటపడ్డా మొదట్లో, తరువాత ఆ కుటుంబంలో పెద్ద ప్రయత్నం లేకుండానే కలిసిపోయింది. జీవితం సాఫీగానే గడుస్తున్నా కొడుకు దగ్గర లేడన్న బాధ అప్పుడప్పుడూ తలెత్తుతూనే ఉండేది. కెనడా నుంచి సుభద్ర అప్పుడప్పుడూ రాసే ఉత్తరాలు ఆ బాధని ఉపశమింపజేసేవి.
వెళ్ళిన నాలుగున్నర ఏళ్ళకు నరసింగరావ్ ఇండియా వస్తున్నట్టు ఉత్తరం రాశాడు. తను మార్చిలో వస్తానని సెప్టెంబర్ చివరి వరకూ ఉంటానని రాశాడు. తను సెబాటికల్ లీవ్‌లో రాబోవడం వల్ల విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు తను యూనివర్సిటీకి వెళ్ళి వస్తూ ఉండాలని రాశాడు. అన్నపూర్ణమ్మ సంతోషానికి అవధుల్లేవు. రెండు నెలలు ముందుగానే అద్దెకున్న వాళ్ళచేత ఇల్లు ఖాళీ చేయించింది. ఇంటికి రంగులు వేయించింది. పెరడు శుభ్రం చేయించింది. రఘు సలహా పాటించి యూరోపియన్ పద్ధతిలో మరుగుదొడ్డి కట్టించింది.
నరసింగరావ్ వాళ్ళు రావటానికి ముందే లక్ష్మి, రఘు, పిల్లలు బుజ్జమ్మ, బుజ్జిలను తీసుకొని విశాఖపట్నం వెళ్ళారు. నరసింగరావ్ వచ్చేరోజున ఒక ప్రైవేట్ టాక్సీ తీసుకొని రఘు, లక్ష్మి వాల్తేరు స్టేషన్‌కి వెళ్ళారు. ట్రెయిన్ వచ్చి ఆగింది. నరసింగరావ్, సుభద్ర లక్ష్మిని రఘుని చూసి చెయ్యి ఊపారు. చెయ్యి ఊపినవాళ్ళు నరసింగరావ్ సుభద్ర అని గుర్తు పట్టడం లక్ష్మికి రఘుకి కష్టం అయింది. నరసింగరావ్ నోట్లో పైపు, పిల్లిగడ్డం, గళ్ళకోటు, భుజాన కెమేరాతో దిగాడు. సుభద్ర భుజాలదాకా జుట్టు కత్తిరించుకొని విరబోసుకుంది. మాక్సీ వేసుకొంది. పెదిమలకు గోళ్ళకు రంగు వేసుకొంది. లక్ష్మి, రఘు వాళ్ళ దగ్గరగా వెళ్ళారు.
“ఎలా ఉన్నావ్ లక్ష్మీ డియర్?” అంటూ చనువుగా భుజం మీద చెయ్యివేసి దగ్గరికి తీసుకుంటూ అడిగాడు నరసింగరావ్. లక్ష్మికది ఏమీటో కొత్తగా అనిపించింది. ఆపైన “హౌ ఆర్ యూ!” అంటూ రఘు చెయ్యి కుదిలించి పారేశాడు. సుభద్ర లక్ష్మిని చేతులు పుచ్చుకొని పలకరించి, రఘుని నవ్వుతూ పలకరించింది.
పలకరింపులయ్యాక “బాబేడి?” అని అడిగింది లక్ష్మి.
“ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ గేటు బయటకు దారి తీశాడు నరసింగరావ్.
ఇంటికెళ్ళగానే అన్నపూర్ణమ్మ “బాబేడిరా?” అని అడిగింది.
“వాడు రాలేదు” అన్నాడు నరసింగరావ్.
“ఎందుకుట?” అని వెంటనే అడిగింది.
“నన్ను గుమ్మంలో నిలబెట్టేశావ్! అన్నీ తాపీగా చెప్తాను. నన్ను లోపలికి రానీ. ఇంతకీ నువ్వెలా ఉన్నావ్?” అని నరసింగరావ్ మాట మార్చేశాడు.
భోజనాలు అయ్యాక పెట్టెలు తెరిచాడు. “ఇదిగో అమ్మా! ఈ ట్రాన్సిస్టర్ రేడియో నీకు. పక్కలో పెట్టుకొని పడుకుంటే భక్తిరంజని పాటలు వినిపిస్తాయి. ఈ టేప్ రికార్డర్ కూడా నీకే! అందులో ఉన్న టేప్ ఆన్ చేసి చూడు… అల్లా కాదు, ఇల్లా” అంటూ నరసింగరావ్ దాన్ని ఆన్ చేశాడు.
‘మామ్మా! నేనిక్కడ ఉన్నాను. ఉద్యోగం చేస్తున్నాను. నువ్వెలా ఉన్నావ్? జానెట్ నీగురించి అడుగుతూ ఉంటుంది ఎప్పుడూ. మేమిద్దరం వస్తాం ఎప్పుడో’ అంటూ బాబు గొంతు వినిపించింది.
“జానెట్ ఎవర్రా?” అని అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా అడిగింది.
“వాడి వైఫ్!” అన్నాడు నరసింగరావ్.
“కుర్రవెధవ. వాడికి వైఫేంట్రా?” అంది అన్నపూర్ణమ్మ.
“బాబుకి పందొమ్మిదున్నాయేమో కదా?” అన్నాడు రఘు.
“అంతే! అంతకంటే ఉండవు” అన్నాడు నరసింగరావ్.
“బాబు లాస్టియర్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్రేడ్స్ కూడా బాగానే వచ్చాయి. నరసింగ్ వాడిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యమన్నారు. వాడు చదవనన్నాడు. నీకుద్యోగం చెయ్యాల్సిన ఖర్మేమిట్రా అంటే నాకు చదువుకోవాల్సిన ఖర్మేం అన్నాడు. పైగా, ‘మీరింకా ఇండియాలో లాగే థింక్ చేస్తున్నారు. డిగ్రీలు పోగేసుకుంటే గౌరవం అని ఇక్కడెవరూ అనుకోరు. ఇక్కడ చదువంటే ఇంట్రెస్టుంటేనే పై చదువులు చదువుతారు. నాకు మంచి జాబ్ వచ్చింది. నేనందులోనే పైకొస్తాను. డాడీ మీద డిపెండై చదవటానికి నాకేం ఖర్మ. నన్ను నేను సపోర్టు చేసుకోగలను’ అన్నాడు. వాడు మాట్లాడడం, ఆలోచించడం అన్నీ కెనెడియన్స్ లాగానే చేస్తాడు. ఆఖరికి అమ్మాయిలతో డేటింగ్ విషయంలో కూడా అంతే! ‘ఇవ్వన్నీ వద్దనుకుంటే ఇండియాకెళిపోదాం. అక్కడ మార్కెట్లో ఏదో ఒక డౌరీకి నన్ను అమ్మేద్దురు గాని. అంతేకాని కెనడాలో ఇండియన్స్‌లా ఉందామంటే కుదరదు’ అన్నాడు” అంది సుభద్ర.
“ఇంతకీ జానెట్ ఎవరు?” అన్నపూర్ణమ్మ అడిగింది.
“వాడు అక్కడ అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు. ఆ పిల్ల కార్లు బాగుచేసేవాడి కూతురు. నేనేదో అనబోతే ‘తెలుగు సినిమాల్లోలాగా వంశగౌరవం కబుర్లు చెప్పకు. పైగా ఇక్కడ నల్లవాళ్ళమైన మనం తెల్లవాళ్ళయిన జానెట్ వాళ్ళకంటే తక్కువ కులం వాళ్ళం’ అన్నాడు. ఇంకేం అనలేక నోరు మూసుకున్నాను” అని సుభద్ర కథ ముగించింది.
సుభద్ర వేషంలోనే కాని భావాల్లో పెద్దగా మారలేదు అనుకొంది లక్ష్మి. తన మనవడి పెళ్ళి తను చూడలేదని అన్నపూర్ణమ్మ బాధపడింది. “పోనీ దాన్ని తీసుకొనే రాకపోయాడా?” అని అడిగింది అన్నపూర్ణమ్మ.
“వాళ్ళది కొత్తకాపురం కదా! కొంత డబ్బు దాచుకొన్నాక వస్తారు. వాళ్ళ టికెట్స్‌కి నేను పే చేస్తానన్నా వాళ్ళు వద్దన్నారు” అన్నాడు నరసింగరావ్.
“జానెట్కి వాడు ఇండియా వస్తే దక్కడేమోనని భయం” అంది సుభద్ర.
కొద్దిరోజులుండి లక్ష్మి, రఘు, పిల్లలు వెళ్ళిపోయారు. బాబు పెళ్ళిచేసుకొని విడిపడటం మగవాడైన నరసింగరావ్ని ఎక్కువ బాధపెట్టలేకపోయినా, సుభద్రని బాగా బాధపెట్టిందని లక్ష్మి గుర్తించింది.
“బాబు ఇంప్రెషనబుల్ వయస్సులో కెనడా వెళ్ళాడు. అతను కెనెడియన్లా ఆలోచించటం, ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు” అన్నాడు రఘు లక్ష్మితో.
“ఇది సుభద్రకు పెద్ద దెబ్బే! పాపం” అంది లక్ష్మి.
13
నరసింగరావ్, సుభద్ర తిరిగి కెనడా వెళ్ళిపోయారు. వెళ్ళిన కొన్ని నెలల దాకా ఉత్తరాలు మామూలుగానే అందాయి లక్ష్మికి. తరువాత ఓ ఆరు నెలలపాటు ఉత్తరాలు ఆగిపోయాయి. అన్నపూర్ణమ్మ ఆందోళన పడి ఎన్ని ఉత్తరాలు రాయించినా వాళ్ళు జవాబు రాయలేదు. అల్లాంటిది ఒకరోజు సుభద్ర దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది.
లక్ష్మికి,
ఏం రాయను? నా రాత గురించి రాయాలి. మీ అన్నయ్య తన దగ్గర పిహెచ్.డి. చెయ్యటానికి వచ్చిన పంజాబీ అమ్మాయితో అతిగా ప్రవర్తిస్తుంటే ‘మన బాబు అమ్మాయయి వుంటే అంతే వయసుండును మన అమ్మాయికి’ అని మందలించాను. దాంతో ఆయనకి, నాకు ఘర్షణ జరిగింది.
ఆయనకు మొదటినుంచీ ఈ వాతావరణంలోని ఉద్రిక్తత నచ్చింది. ఆయన మొదట్లో ఆడా మగా అందరితోనూ కలిసి తాగుతుంటే వద్దనేదాన్ని. దానికాయన ‘నువ్వూ తాగు’ అనేవారు. ఆయనకోసం నేను సోషల్ డ్రింకింగ్ అలవాటు చేసుకొన్నాను. డాన్సులకి వెళ్తే ఈయన అందరి నడుములు పట్టుకొని డాన్స్ చేయడానికి సరదాపడేవారు. నేను వద్దంటే ‘నువ్వూ చెయ్యి’ అనేవారు. మనం పుట్టి పెరిగిన వాతావారణం ఎల్లాంటిదో నీకు తెలుసు కదా! పరాయి మొగాడిని మనమీద చెయ్యి వెయ్యనిస్తామా? నేనందుకని డాన్సు చెయ్యడానికి ఇష్టపడలేదు. కాని ఆయన మానుకోలేదు. అప్పుడప్పుడా పంజాబీ అమ్మాయిని ఆ పార్టీలకు తీసుకువెళ్తూ వచ్చారు. ఆ అమ్మాయి ఆయన స్టేటస్‌కు ‘పడిపోయింది’.
ఆఖరికి ఆయన పాతికిరవై ఏళ్ళు కాపురం చేసిన నన్ను, పాత చొక్కా విప్పి కొత్తది తొడుక్కున్నంత సులభంగా విడాకులిచ్చి వదిలిపెట్టారు. నేను విడాకులకు ఒప్పుకోకపోతే ఆయనకు విడాకులివ్వడం కుదిరేది కాదు. కాని నేనంటే ఇష్టంలేని మనిషితో కాపురం చెయ్యటం ఇష్టంలేక విడాకులకి ఒప్పుకొన్నాను. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నానో నీకు తెలుసు కదా?
కన్నకొడుకుని, కట్టుకొన్న భర్తని ఈ దేశానికప్పజెప్పి ఇక్కడ నాకంటూ డబ్బు తప్ప ఏమీ మిగల్చని ఈ దేశాన్ని విడిచిపెట్టి మనదేశం వస్తున్నాను! నా వాళ్ళ కోసం వస్తున్నాను! మీ ఓదార్పు నాకు కావాలి! పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి, నాకు నా పుట్టింటివారు గుర్తుకొస్తున్నారు. కష్టాల్లోనే దేవుడూ తల్లిదండ్రులూ గుర్తుకొచ్చేది అనుకుంటా.
విడాకులతో నాకు, నీకు సంబంధం తెగిపోయినా మన స్నేహం వాడిపోదని, దాని పరిమళం ఇంకా మిగిలివుందని అనుకొంటున్నాను. అన్నపూర్ణమ్మగారికి నా నమస్కారాలు.
ఇట్లు
సుభద్ర.
ఆ ఉత్తరం లక్ష్మిని కదిలించివేసింది. కాని రఘు అన్నదే జరిగింది. వ్యక్తి స్వార్థం పెరిగితే, మరో వ్యక్తికి కూడా చోటు లేనంతగా, అతని పరిధి కుంచించుకుపోతుంది! సింహం ‘తనూ- తనవాళ్ళు’ అని గీసుకున్న పరిధిలో తనే తప్ప తనవాళ్ళు లేరు!
(ఆంధ్రసచిత్రవారపత్రిక, 19/12/1975 – 09/01/1976)