సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు

ఈ సంచికలో సి.ఎస్.ఆర్ పాడిన కొన్ని పాటలు, పద్యాలు విందాం. సి. ఎస్. ఆర్ పూర్తి పేరు చిలక(ల)పూడి సీతారామాంజనేయులు. ఆయన మొదట నాటకాల్లోను తరువాత సినిమాల్లోను వేసిన పాత్రల గురించి సమాచారం ఇప్పుడు ఇంటర్నెట్లో తేలికగానే అందుబాటులో వుంది. వెంకటరమణగారు నడిపే శోభనాచల బ్లాగులో సి. ఎస్. ఆర్ పైన మిక్కిలినేని, అయ్యదేవర పురుషోత్తమరావుగార్లు రాసిన వ్యాసాలు చదువుకొనవచ్చు. సుమారు పదిహేనేళ్ళ క్రితం నవ్య వారపత్రికలో సి.ఎస్.ఆర్ ని గురించి ఇంకొంత అదనపు సమాచారంతో ఒక పెద్ద వ్యాసం వచ్చింది. కాని అది ఇంటర్నెట్లో లేదనుకుంటాను.

సి. ఎస్. ఆర్ సినిమాలలో పాడిన పాటలు పద్యాలు కూడా వున్నాయి కానీ ఈరోజు మనకు ఆడియో, వీడియో రూపంలో దొరుకుతున్నవి చాలా తక్కువనే చెప్పాలి. ఉదా. శ్రీవేంకటేశ్వరమాహాత్మ్యం (1939), సుమతి (1941), గృహప్రవేశం (1946), రత్నమాల (1947) సినిమాల్లో పాడిన కొన్ని పాటలు. సినిమాలలోకి రాకముందు, అంటే 1936కి పూర్వం (కొన్ని ఆ తరువాత కూడా) పాడిన రికార్డులు మాత్రం చాలావరకు దొరుకుతున్నాయి. పైన చెప్పిన శోభనాచల బ్లాగులో సి. ఎస్. ఆర్ హచిన్స్ కంపెనీకి ఇచ్చిన కొన్ని రికార్డుల వివరాలు చూడవచ్చు. ఆ ప్రకటనలోనుండి ‘హితవైన చోట’ అన్న మువ్వగోపాల పదం ఇక్కడ వినవచ్చు. మిగిలిన పాటలు: భజో మధురహైనాం, తులసివనములకేగ, అసమమేధావియగు జహ్వరీలాలు, జగదోద్ధార కోపమా, సి.డిల పైన లభ్యమవుతున్నాయి. ‘శ్రీకృష్ణుడని పేరు’ అన్న పద్యం చాలా ప్రసిద్ధి గడించినది. ఇది రామాగ్రాఫ్ అన్న రికార్డు కంపెనీ లేబుల్ పైన వచ్చినది. ఈ రామాగ్రాఫు గురించిన చరిత్ర మరొకసారి వివరంగా రాస్తాను. ‘ప్రమదులగూడి’ అన్న చాలా మందికి తెలిసిన పద్యం, ‘రాధా ఎంత కృశించితివే!’, ‘ఎంతటి మోసకారివే’ పాటలు కూడా రామాగ్రాఫ్ లేబుల్ కోసం పాడినవే. చివరిగా మద్యపాన వ్యసనంపైన 1930-40ల్లో తరచుగా వినపడ్డ పద్యం: తాతతండ్రులగోలె. (దీనిని వేరే గాయకులు కూడా రికార్డుల పైన పాడారు.) వీటితో పాటుగా ‘ఆగమేల రాగమేల’ అన్న మరొక సి.ఎస్.ఆర్ “బ్రాండు” పాట కూడా వినండి.

రికార్డింగు అంత బాగా లేనందుకు చింతిస్తున్నాను. రికార్డులు చాలా పాతవి (ఎక్కువ భాగం 1934 ముందు నాటివి.) అప్పటికీ ఎంతో శ్రమతో, అంతకంటే ఓపికతో మిత్రులు మధుసూదనశర్మగారు ఈ పాటల్ని డిజిటైజ్ చేసి ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు.

  1. తాతతండ్రుల గోలె
  2. శ్రీకృష్ణుడను పేరు
  3. సర్వేశ్వరా
  4. రాధా ఎంత కృశించితివో
  5. ప్రమదల గూడి
  6. ఎంతటి మోసకారివే
  7. ఆగమేల రాగలోల
  8. వక్షస్థలేచ విపుల నయనజ్వలేచ… హితవైన చోట