చేయగలిగింది

“లోపల ఉండారు సార్!” కారు డోర్ తెరిచి చెప్పాడు శివ.

“పద!” కష్టం మీద దిగి ఒక చేయి శివ భుజం మీద వేసి నెమ్మదిగా మెట్లెక్కాడు. వరండాలో నిలబడి కుతూహలంగా చూస్తూంది ఒకావిడ.

“శివరామయ్యగారు మా మేష్టారు!” చెప్పాడు.

“రాండి, కూచోండి!” లోపలికి వెళుతూ వాకిలి పక్కనే మంచంలో పడుకున్నాయన్ని తట్టి చెప్పింది “మామయ్యా, మీకోసం ఎవరో వచ్చారు, లేస్తారా?”

“ఆఁ!” అంటూనే లేవడానికి ప్రయత్నించాడు ఆయన. ఆమె సాయంతో లేచి కూచున్నాడు.

మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూచుని అడిగాడు “నేను మీ స్టూడెంట్ నాగేంద్రని. కోడిపాలెం హైస్కూలు. గుర్తున్నానా మేష్టారూ?”

ఆయన అట్లాగే గాజుకళ్ళతో చూస్తూ ఉన్నాడు అతని మొహం వంక.

“మా పిల్లల్నే గుర్తుపట్టటంలేదు, మిమ్మల్నేం గుర్తుపడతారు? మూడేళ్ళవుతుంది అల్జీమర్స్ వచ్చి. కొన్ని గుర్తుంటయ్యి, కొన్ని ఉండవు.”

అడ్డంగా తలూపాడు ఆయన “గుర్తు తగలడం లేదు.”

లోపల్నుంచి పనామె పిలవడంతో ఆమె లోపలికి వెళ్ళింది.

ఆయన చేతి మీద చేయి వేసి పట్టుకుని చెప్పాడు “దీపావళి ముందు ఒకరోజు క్లాసులో వెనక కూచుని లక్ష్మీ బాంబు కాల్చాను గుర్తుందా? మీరు భయపడి బయటికి పరుగుతీశారు. తర్వాత నన్ను పట్టుకుని చితకబాదారు.”

“దీపావళి బాగా చేసుకున్నారా?”

ఆ ప్రశ్న పట్టించుకోలేదు అతను. “గుర్తు తెచ్చుకోండి. తర్వాత మీరు పొద్దున్నే ఇంట్లోంచి వస్తూ మెట్ల మీద జారిపడ్డారు. రెండు నెలలు మంచం మీదే ఉండవలసొచ్చింది. గుర్తొచ్చిందా?”

అడ్డంగా తలూపాడు ఆయన.

“ఆ మెట్లమీదకి నూనె ఎట్లా వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఆ వేకువజామునే లేచి నేనే పోశాను. ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. అప్పుడు భయంవేసింది కానీ ఇప్పుడు చాలా బాధవేస్తుంది. తప్పు చేశాను. మీ బాధకు కారణమయ్యాను. అది చెప్పడానికే, క్షమాపణ అడగడానికే వచ్చాను.”

“నూనె పోశావా?”

“అవును, గుర్తొచ్చిందా? క్షమించండి!”

“గుర్తులేదు. సరేలే!” నవ్వినట్టు అనిపించింది అతనికి.

లోపలినుంచి వస్తున్న ఆమెతో అన్నాడు చేతితో అతని వైపు చూపిస్తూ “కాఫీ ఇవ్వకపోయావా!”

“పొయి మీద పెట్టాను” అంటున్నా అతను లేచాడు. “లేదండీ! ఇంకా వెళ్ళవలసిన చోట్లు ఉన్నాయి! వస్తాను!”

“అయ్యో తాగిపోదురుగాని! అయిదు నిముషాలాగండి!” ఆవిడ అంటూనే ఉంది.

“అమ్మా నానా బాగున్నారా?” ఆయన అడిగితే వెనక్కి తిరిగి “ఇద్దరూ పోయి పదేళ్ళవుతూంది” అని చెప్పి, ఆవిడతో “ఏం అనుకోవద్దండి. ఇప్పటికే ఆలస్యం అయింది” అని, “శివా!” అని బయటివేపు కేకేశాడు.

కార్లో కూచున్నాక స్టార్ట్ చేస్తూ శివ అడిగాడు “ఇప్పుడు ఎక్కడికి సార్?”

చిన్న పుస్తకం తీసి టిక్కు మార్కు కొట్టుకుని “మెయిన్ రోడ్డు మీదికి పోనిచ్చి కుడి వైపుకు తిరుగు.” లిస్ట్‌లో తర్వాత ఇల్లు చేరేదాకా ఎటు వైపు వెళ్ళాలో పుస్తకంలో చూసి చెప్తూ ఉన్నాడు.

పేరు చెప్తే శివ లోపలికి వెళ్ళి కనుక్కుని వచ్చాడు. “ఇదేనంట!” అని దిగాక నడిపించుకుపోయాడు.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అడుగుతుంది వరండాలోకి వచ్చిన ఆమె. ఆమెని గుర్తుపట్టాడు.

“మీతో మాట్లాడాలి!” నిలబడలేక అక్కడే ఉన్న కుర్చీ వైపు చూస్తుంటే, “కూర్చోండి!” అని చెప్పింది.

“మీరు కూడా కూర్చోండి!” కూచుంది అతని వైపే చూస్తూ “ఏ విషయం? కాలేజ్ విషయమయితే మీరు ఆఫీసుకు వచ్చి అక్కడే మాట్లాడండి.”

“కాదు. పర్సనల్. మీకు నాగేంద్ర గుర్తున్నాడా? డిగ్రీ మొదటి ఏడు.”

ఆమె గుర్తుపట్టింది. “ఇప్పుడు ఎందుకు వచ్చారు?”

ఆమె వంకే చూస్తూ చెప్పాడు “మీ వెంట పడి వేధించాను. మీకూ, మీ కుటుంబానికీ చాలా బాధ కలిగించాను. నావల్లే మీరు కాలేజ్ మానేశారు.”

ఆమె చూపులు పదునెక్కడమూ, పెదవులు వణకడమూ గమనించి కోపంతో అరుస్తుందేమోనన్న భయంతో చేయెత్తి వారిస్తూ చెప్పాడు “పెద్ద తప్పు చేశాను మీ పట్ల. మిమ్మల్నెంత బాధ పెట్టానో నాకు తెలుసు. నన్ను క్షమించండి.”

“ఏం తెలుసు మీకు? తెలిస్తే అంత దారుణంగా ప్రవర్తించేవారా? మీరొక్కళ్ళే కాదుగా, వెనక మీ గుంపూ…”

“వాళ్ళదేం తప్పు లేదు. అంతా నాదే. నా మాట మీదే వాళ్ళూ…”

“ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చానో తెలుసా? ఎన్ని రోజులు బయటికి వెళ్ళాలంటే వణికి చచ్చానో తెలుసా? ఇంట్లో చెప్పలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చి, చెప్పాక వాళ్ళ కోపమూ, ఏడుపూ భరించలేక… ఆపైన మీ బెదిరింపు ఉత్తరాలూ. అది ప్రేమా, పగబట్టినట్టు ఏడిపించారుకానీ!”

ఒకానొక రాత్రి చీకటి గదిలో ఆమె వెక్కి వెక్కి ఏడవడాన్ని ఊహించుకున్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. “అందుకు సిగ్గుపడుతున్నా. బాధా పడుతున్నా. ఏరకంగా చూసినా సమర్థించుకోలేను, సంజాయిషీ ఇచ్చుకోలేను.”

ఆమె కొంచెం సర్దుకుంది “లక్కీగా చదువు మానిపించకుండా స్టెల్లాలో చేర్పించారు కనక సరిపోయింది. లేకపోతే నా జీవితం నిలువునా నాశనం అయిపోయినట్టే గదా!”

ఆగి మళ్ళీ అంది “ఇప్పటికయిందా జ్ఞానోదయం? ఇన్నేళ్ళయ్యాక ఇప్పుడెందుకు చెపుతున్నారు?”

“కొద్ది రోజుల్నుంచీ నేను ఎవరెవరిని బాధించానో లెక్క వేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది. ఇప్పటికయినా తెలిసింది. మిమ్మల్ని బాధించేందుకు నాకేం హక్కు ఉంది? అసలు ఎవరయినా ఎవరినయినా బాధించడం ఏం న్యాయం?”

“అంతా చేసి ఇప్పుడు ఒక అపాలజీ చెప్తే సరిపోయిందా? క్షమిస్తానని ఎలా అనుకున్నారు?”

“క్షమిస్తారని కాదు. క్షమాపణ అడగడానికి వచ్చాను. ఆశపడగలను. ఇప్పుడు నేను చేయగలిగినదంతే కదా!”

“ఇంతకూ ఇప్పుడు ఇది మీకోసమా, నాకోసమా?”

కొద్దిసేపు ఆలోచించి “ఇద్దరి కోసమూ ఎందుకు కాకూడదు?” అని ఆగి “మీ విషయం ఆలోచిస్తూ చాలారోజులు బాధపడ్డాను. ఏమో, నాకోసమేనేమో! కొన్నిసార్లు నిద్రపట్టేది కాదు. నా తప్పుకు ప్రాయశ్చిత్తంగానో, నాకు నేనొక మంచివాడిగా నిరూపించుకోవాలనో, మీ మనసులో నామీద ఉన్న కోపం తగ్గాలనో, మీకేమయినా ఉపశాంతి కలుగుతుందనో!” అన్నాడు.

ఆమె నవ్వి అంది “మీ వల్ల నేను ఏడవాల్సిందంతా అప్పుడే ఏడ్చేశాను. ఇప్పుడు ఇందువల్ల నాకేం తేడా పడుతుంది?”

కొంచెం ఆగి అంది “మీకు మంచిగా అనిపిస్తుందనుకుంటే క్షమించాననే అనుకోండి!”

“అది చాలు! వస్తాను!” అంటూ లేచాడు. అడుగేయబోయి తూలబోతుంటే శివ వచ్చి పట్టుకున్నాడు.

గేటు వైపు నడుస్తుంటే ఆమె అడిగింది “ఆరోగ్యం బాగోడం లేదా?” వెనక్కి తిరక్కుండానే “లేదు” అని చెప్పి కారెక్కాడు.

కారు స్టార్ట్ చేసి “ఇవాల్టికి చాలు ఇంక ఇంటికెలదాం సార్! ఇట్ట తిప్పుతున్నానని తెలిస్తే ఫోన్ చేసినప్పుడు అశోక్ సార్ నన్ను తిడతారు. పోయినసారి వచ్చినప్పుడు జాగర్తగా చూసుకోమని గట్టిగా చెప్పారు.”

“మనకి అంత టైమ్ లేదురా! ఇంకొక్కరిని కలిసి వెళదాంలే! ఇక్కడికి దగ్గరే!”

“ఫోన్ చేస్తే పోయేదానికి ఇంతింత దూరం రావాలా? వొంట్లో బాగుంటే అనుకోవచ్చు! సరే, చెప్పండి ఎటు వెళ్ళాలో!” అతను చెప్పినట్టే తీసుకువెళ్ళాడు. ఇంట్లో కనుక్కుని వచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు.

వాకిట్లో నిలబడిన అతన్ని అడిగాడు “మీరు దయాకర్‌గారే కదా!” “అవును. ఎవరు మీరు? ఏం కావాలి?”

“మీ చిన్నప్పటి క్లాస్మేట్‌ని.”

“అవునా!లోపలికి రండి, కూర్చోండి. ఎవరో గుర్తుపట్టలేకపోతున్నా. మీ పేరేమిటి?” అతని వంక తేరిపార చూస్తూ అడిగాడు.

“కోడిపాలెం హైస్కూల్‌లో. నా పేరు నాగేంద్ర.”

“ఆ పేరుతో ఎవరూ నాకు గుర్తులేదు.”

“మేమంతా మిమ్మల్ని ఏడిపించేవాళ్ళం. తగూ వచ్చినప్పుడు కులం పేరుతో తిట్టాం. చిరిగిన చొక్కాను ఇంకాస్త చింపేవాళ్ళం. మీకు గొరిల్లా అని పేరు పెట్టి ఎగతాళిచేశాం.”

“అది చెప్పటానికి వచ్చారా? అదంతా అసలు ఎందుకు కెలుకుతున్నారు?”

“మేం… నేను మనిషిగా ప్రవర్తించలేదు. మీ కులాన్నీ, రంగునీ, రూపాన్నీ, బీదరికాన్నీ అడ్డుగా పెట్టుకుని క్రూరంగా, దారుణంగా అవమానించాం, హింసించాం. తెలియక కాదు, కావాలనే. ఇప్పుడు తలుచుకుంటే ఏడుపొస్తుంది. మేమెంత దుర్మార్గులమో అనీ, మీరెంత బాధపడి ఉంటారో అనీ. చాలా సార్లు ఏడ్చాను. మీరెంత బాధపడి ఉంటారో ఇప్పుడు తెలుస్తూంది. తెలుసనుకుంటున్నాను కానీ తెలియదనీ తెలుసు.”

బదులుగా నవ్వి అన్నాడు “అవమానించిందీ, ఏడిపించిందీ మీరొక్కరే అనుకుంటున్నారా! వందలమందిలో మీరొకరు. అవన్నీ ఎప్పుడో అలవాటు అయిపోయాయి. ఇప్పుడు అంత బాధ ఏమీ ఉండదు. అవన్నీ ఏం పట్టించుకోను. అయినా ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు?”

“నన్ను క్షమించండి. దాన్ని ఇప్పుడు సరిచేయలేను. క్షమించమని అడగడం తప్ప మరేమీ చేయలేను.”

“అందుకే వచ్చారా?” అని నమ్మనట్టు చూసి “ఇంతవరకూ ఎవరూ ఇలా చెప్పలేదు, అడగలేదు. అయినా తప్పు చేసినట్టు ఇన్నేళ్ళకు తెలిసిందా?”

“నిజమే, ఆలస్యమయింది. కానీ నేను చేయవలసింది చేయాలి. నేను చేయగలిగిందల్లా బాధపడడమూ, క్షమాపణ అడగడమూ!”

“మిమ్మల్ని క్షమిస్తే నా బాధ తీరిపోతుందా! ఇప్పటికీ నా వెనకజేరి ఎంతమంది నన్ను వెక్కిరిస్తారో నాకు తెలుసు.”

“వస్తాను.” అతను లేచాడు. శివ వచ్చి భుజం ఆసరాగా అందించాడు.

“మీరెవరో నాకు గుర్తురాలేదు. కనీసం మీరొకరయినా పనిగట్టుకు వచ్చారు తప్పు తెలుసుకుని. మీకు కావలసింది క్షమాపణే కాబట్టి క్షమించాను. ఇక ఆ విషయం మరిచిపొండి.”

అతను దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు. “సంతోషం! చాలా సంతోషం! మీరెంత మేలుచేశారో మీకు తెలియదు. వస్తాను.”

బయటికొచ్చి కారెక్కాక శివ అడిగాడు ” ఇంటికేగా సార్!”

“ఆఁ! ఇంటికే!

“ఇంకా ఎంతమంది దెగ్గరకి ఎల్లాలి సార్?” పుస్తకం వంక చూస్తూ అడిగాడు.

ఎంత మంది? ఇంకా చాలా మంది. అడక్క ముందే ఎప్పటికీ కనపడకుండా వెళ్ళిపోయినవాళ్ళు. తనకు తెలిసి తనవల్ల బాధపడ్డవారు సరే, తనకు తెలియకుండానే తన మూలాన బాధ పడ్దవారూ. ఆ లెక్క అంతా ఎప్పటికి తేలుతుంది?

“తెలియదురా తెలియదు!” అతని కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. వాటిని దాచడానికి చేతులూ అడ్డుపెట్టుకోలేదు, తలా పక్కకి తిప్పుకోలేదు.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...