బేతాళ కథలు: కథన కుతూహలం-9

పట్టు వదలని విక్రమార్కుడు, తన కారుని వెనక్కి తిప్పుకుని ఇంతకు ముందు వచ్చిన చోటికే వచ్చాడు. రోడ్డుకు ఒక పక్కగా కారు ఆపాడు. నిన్నటిదాకా కనపడని ఓ కొత్త దృశ్యం కంటపడింది. కొంచెం దూరంగా ఎవరో మంటల వెలుగులో చలి కాచుకుంటున్నారు. ఆ వెలుగులో కొంచెం దూరం నడిచి, తనక్కావాల్సిన చెట్టు మీదకి నెమ్మదిగా ఎక్కాడు. అక్కడ కొమ్మల్లో ఉన్న శవాన్ని భుజం మీద వేసుకుని జాగ్రత్తగా క్రిందకు దిగాడు. శనివారం ఒక పూట ఉపవాసం ఉందేమో! మిగిలిన రోజుల్తో పోలిస్తే, ఈ రోజు శవం బరువు చాలా తక్కువగా ఉంది.

భుజం మీదనే శవాన్ని మోసుకుంటూ అతికష్టం మీద కారు దాకా నడిచొచ్చాడు. కారు వెనుక తలుపు తీసి శవాన్ని వెనకసీట్లో పడుకోపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళగానే వెనకనించి తనని ఎవరో పిలిచినట్లనిపించింది. వస్తున్న ధ్వనితరంగాల దిశని బట్టి, విక్రమార్కుడికి తనని పిలిచిన కంఠధ్వని శవం లోంచి వస్తోందని సులభంగానే అర్థమయింది.

‘ఇప్పటికో మంచి పని చేశావు రాజా! నీ పక్క సీట్లో ఇరుక్కుని కూర్చోవటం కన్నా వెనకసీట్లో కాళ్ళు ముడుచుకునయినా పడుకోవటమే హాయిగా ఉంది సుమా!’ అంటున్నాడు. ఓ క్షణం తర్వాత విక్రమార్కుడికి కనపడకుండా అతని వంక చూసి, “రాజా! నువ్వు ఇంత కష్టపడటం వెనక నీ ఉద్దేశం తెలియకపోవటానికి, నేనేమీ రాజకీయనాయకుల ఉపన్యాసాలు నమ్మి ఓటు వేసే ప్రజల్లో ఒకడ్ని అనుకోకు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అలాంటి వాళ్ళని ఎలా గద్దె దింపాలో తెలిసిన ఓటర్లలాంటివాడిని నేను. నీ పన్నాగాన్ని తిప్పికొట్టటానికి ఓ కథ వినిపిస్తాను. నేనో సూర్యతేజాన్ని అనుకుని, నన్ను నీ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకుండా కారును జాగ్రత్తగా నడుపు. అలాగే రాముడు మంచి బాలుడిలా నేను చెప్పేది విను” అని మొదలుపెట్టాడు.

“తర్వాత రోజు గురువారం. పుట్టింటికి వెళ్ళిన పాఠకరావు శ్రీమతి నిన్న సాయంత్రమే ఊర్నించి తిరిగొచ్చింది. పొద్దున్నే భర్తని లేపి, ఆ రోజు ‘నక్షత్ర’ వారపత్రిక వస్తుందని గుర్తు చేసింది. ‘అవును! గుర్తుంది’ అంటూ అతడు వెంటనే బయటికి పరిగెట్టాడు. అన్ని ‘వర్గాల’ పాఠకులకీ నచ్చే అనేక శీర్షికలుండబట్టి ఆ వారపత్రికకి, బ్రతికున్న పాఠకుడు పడి చచ్చేంత గిరాకీ. ఆలస్యం అయితే వచ్చిన కాపీలన్నీ అయిపోతాయేమోనని అతడి అనుమానం. అతడి అదృష్టం బాగుంది. ఒంటరిగా మిగిలిన చివరి ప్రతిలో ప్రతి పేజీ అతడి కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తోంది. ఇంటికివచ్చి స్నానాదికాలూ అవీ ముగించి పత్రిక ముందేసుకుని కూచున్నాడు. ‘కాలు కదలకుండా పత్రిక ఫెవికాలులా ఓ గంటసేపటి దాకా పనిచేస్తుందన మాట’ అని అతడ్ని చూసి, అతడి భార్య తనలో తానే నవ్వుకుంది.

అలవాటు ప్రకారం, పాఠకరావు విషయసూచిక చూశాడు. మొత్తం నాలుగు కథలున్నాయి. చిత్రంగా ఈసారి ఏ కథ ముందుగా చదవాలో అనేది తేల్చుకోవటానికి ఎలాంటి ప్రయత్నమూ అతడు చేసినట్లు లేదు. ఒక్కో కథని వరసగా చదువుకుంటూ పోయాడు. మొదటి కథ చదివి, ‘ఇచ్చిన దాంతో నేను ఏకీభవించాలని ఎక్కడ ఉంది?’ అని గొణుక్కున్నాడు. రెండో కథనీ అంతే దీక్షగా చదివి ‘చెప్పిన దానికీ, ఇచ్చిన దానికీ ఏమయినా పొంతన ఉందా?’ అని విసుక్కున్నాడు. మూడో కథని మరింత పరిశీలనగా చదివి ‘ఏదో ఒక ఆధారం ఉంటే కదా, నేనేదైనా ఊహించుకోగలిగేది’ అని కోపపడ్డాడు. నాలుగో కథ చదివి, ‘హమ్మయ్య! ఇప్పుడు నా మెదడుకు కొంత మేత దొరికింది’ అని ఆనందపడ్డాడు. ఒక గుప్తనిధిని సిద్ధింపచేసుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు, నాలుగో కథని ఇంకోసారి ఇంకాస్త చిత్తశుద్ధితో చదవటం మొదలుపెట్టాడు.”

హఠాత్తుగా ఆగిపోయాడు బేతాళుడు. ఆగి మళ్ళీ కొనసాగించాడు.

“రాజా! పాఠకరావు ప్రవర్తన నాకు చిత్రంగా ఉంది. విచిత్రంగా అనిపిస్తోంది. ఇంతకు ముందు అతను ఏ కథ చదవాలో నిర్ణయించుకోవటానికి రకరకాల ప్రయోగాలు చేసేవాడు. ఈ సారి అలా కాకుండా అతను పత్రికలో ఉన్న కథలన్నీ వరసగా ఎందుకు చదువుకుంటూ పోయాడు? మొదటి మూడు కథలూ చదివి అతడు అన్న మాటలకు అర్థం ఏవిటి? నాలుగో కథ చదివి, దాని మీద అతడు భిన్నాభిప్రాయం ఎందుకు వ్యక్తపరిచాడు? మొదటి మూడు కథలూ రెండోసారి చదివే ప్రయత్నం చెయ్యని అతడు, నాలుగో కథని ఇంకోసారి చదవటానికి ఎందుకు ఉపక్రమించాడు? అతడి మెదడుకు దొరికిన ఆ మేత ఏవిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల, ఇపుడొస్తున్న కొన్ని టీవీ సీరియళ్ళలా వెయ్యి ఎపిసోళ్ళుగా పగిలిపోగలదు!”

రోడ్డు మీదనుంచి దృష్టి మరల్చకుండా, విక్రమార్కుడు జవాబు చెప్పటం మొదలు పెట్టాడు.

“బేతాళా! పాఠకరావు చేసిన పనిలో చిత్రం గానీ భళారే విచిత్రం గానీ ఏమీ లేదు. నువ్వే చెప్పావు అతడు ఈ మధ్యన కథలు విరివిగా చదువుతున్నాడనీ, అలా కొన్ని వందల కథలు చదివాడనీ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతడికి ఇప్పుడు కథాసంవిధానంపై కొంత సాధికారత ఉందని.

కథని ఎత్తుగడనుంచి ముగింపు దాకా తీసుకెళ్ళటానికి రచయిత చేసే కదనమే, కథనం.

ఈ ముగింపులు రెండు రకాలు. మొదటిది ‘మూసి ముగింపు’. ఇలాంటి ముగింపు ఉన్న కథల్లో రచయిత తన కథకి తానే ఒక ముగింపు ఇస్తాడు. పాఠకరావు చదివిన మొదటి రెండు కథలూ ఈ రకమయిన ముగింపు ఉన్నవే. క్రమం తప్పక కథలు చదివే కొందరు పాఠకులు, కథ చదువుతూనే ముగింపును ఊహించే ప్రయత్నం చేస్తారు. ఆ ముగింపు తమ అంచనాతో సరిపోతే సంతోషపడతారు. మన పాఠకరావు కూడా ఆ కోవకు చెందినవాడే.

మొదటి కథకు రచయిత ఇచ్చిన ముగింపు, పాఠకరావు ఊహించినదానికి భిన్నంగా ఉంది. అందుకని ‘ఇచ్చిన దాంతో నేను ఏకీభవించాలని ఎక్కడ ఉంది?’ అని గొణుక్కున్నాడు. రెండో కథలో కథ పోకడకీ, ఇచ్చిన ముగింపుకీ సమన్వయం కుదరలేదు. దాంతో ‘చెప్పిన దానికీ, ఇచ్చిన దానికీ ఏమయినా పొంతన ఉందా?’ అని విసుక్కున్నాడు.

మొదటి రెండు కథలతో పోలిస్తే చివరి రెండు కథల్లో ‘తెరచి ముగింపు’ ఉంది. ఇది మొదటి రకం ముగింపుకు పూర్తిగా భిన్నమయినది. ఇలాంటి కథలకి రచయిత తాను ఎలాంటి ముగింపూ ఇవ్వడు. దాన్ని పాఠకుడి ఊహకే వదిలేస్తాడు. అయితే ఆ ముగింపు ఊహకందేలా రచయిత కథలో కొంత ఆధారం ఇవ్వాలి. మూడో కథలో అలాంటి ఆధారం లేదు. అందుకే, దాన్ని చదివి ‘ఏదో ఒక ఆధారం కథనంలో ఉంటే కదా, నేనేదైనా ఊహించుకోగలిగేది’ అని పాఠకరావు కోపపడ్డాడు.

నాలుగో కథారచయిత తన కథనంలో ఆధారం వదిలిపెట్టాడు. అదే పాఠకరావుకు దొరికిన ‘మెదడుకు మేత’. దాన్ని నెమరు వేసి, ముగింపును అంచనా వేయటం కోసమే, అతడు ఆ కథని రెండోసారి చదవటం మొదలించాడు.”

ఇలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, బేతాళుడికి ఆశ్రయంగా మారిన శవం చేతులకి రెక్కలు మొలిచాయి. కారు వెనక సీటు ఖాళీ అయింది. విక్రమార్కుడి కారు లోంచి ‘ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ స్వంతమూ, ఎంతవరకీ బంధమూ,’ అనే పాట ఆరంభమయింది.

(సమాప్తం)


టి. చంద్రశేఖర రెడ్డి

రచయిత టి. చంద్రశేఖర రెడ్డి గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు. ...