వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ

[డిసెంబరు 29, 2015న విజయవాడ రేడియో స్టేషన్ వారి కోసం వెల్చేరు నారాయణరావుతో చేసిన ఈ ఇంటర్‌వ్యూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సంక్షిప్తరూపాన రెండు భాగాలుగా (వివిధ: మార్చి 11, మార్చి 18) ప్రచురించబడింది. దానికి పొడిగింపుగా ఈ ఇంటర్‌వ్యూ పూర్తిపాఠం ఈమాటలో ప్రచురిస్తున్నాం. – సం.]


వెల్చేరు నారాయణరావు నలభయ్యయిదేళ్ళకు పైగా అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పనిచేశారు (యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌, మాడిసన్‌; యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో, షికాగో; ఎమరీ యూనివర్సిటీ, అట్లాంటా). ఆయన పరిశోధనలవల్ల వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం ప్రపంచంలో చాలా దేశాలకి అందింది. ఇప్పటికి ఇరవయి పుస్తకాలు, పెద్ద సంఖ్యలో వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యం అనువాదం చేయటమే కాకుండా దానిని ఎలా చదవాలో కూడా చెప్పారు. ఆయన సాహిత్యకృషిని తెలుగువాళ్ళకు పరిచయం చేయడం ఈ సంభాషణ ముఖ్య ఉద్దేశం.

నమస్కారం నారాయణరావుగారు, నలభై ఏళ్ళకు పైగా అమెరికాలో పనిచేస్తున్నారు కదా, ఈ నలభై ఏళ్ళుగా మీరు చేసిన పనిని గురించి మీతో మాట్లాడాలని వొచ్చాను. మీరు చేసిన పనివల్ల తెలుగు సాహిత్యం ప్రపంచంలో చాలా దేశాలకి అందిందనీ, ప్రపంచంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకి తెలుగు సాహిత్యం అందుబాటులోకి వొచ్చిందని ఇక్కడ తెలుగు దేశంలో ఎక్కువ మందికి తెలియదు. మీరు గత నలభై ఏళ్ళుగా చేసిన పని క్లుప్తంగా చెప్తారా?

నలభై ఏళ్ళలో చేసిన పని నాలుగు వాక్యాల్లో చెప్పలేను కాని, చాలా చెయ్యాలని అనుకున్నాను, కొంతవరకు చేశాను.

ఈ మాటంటే చాలామందికి తీవ్రమైన అభ్యంతరం ఉండొచ్చు కాని, తెలుగు సాహిత్యం గురించి తెలుగువాళ్ళకే ఎక్కువ తెలియదు. మనకి కొన్ని ముఖ్యమైన పుస్తకాల పేర్లు తెలుసు, వాటిని గురించిన పొగడ్తలు తెలుసు. ఆ పుస్తకాలు రాసిన కవుల కాలం గురించి, ఆ కవుల్ని పోషించిన రాజుల్ని గురించి చాలా వివరాలు తెలుసు. ఆ పుస్తకాల్లో పద్యాలు మనకి కొన్ని కంఠతా ఒచ్చు. కానీ, ఆ పుస్తకాన్ని చదివి దాని సాహిత్యార్థం ఇది; ఆ పుస్తకం చదివితే వచ్చే ప్రశ్నలు ఇవి, వాటికి సమాధానం ఇది, వాటిని సమన్వయించే పద్ధతి ఇది, ఆ పుస్తకం చదవాల్సిన మార్గం ఇది, అని వివరించి చెప్పే వ్యాసాలు తెలుగు సాహిత్యంలో చాలా పుస్తకాల మీద రాలేదు. ఒక్క విశ్వనాథ సత్యనారాయణగారే ప్రాచీన సాహిత్యంలో పుస్తకాల గురించి తెలుగులో నిజంగా సాహిత్య విమర్శ అన్నదగ్గ వ్యాసాలు రాశారు. ఒక పుస్తకం గురించో, కవిని గురించో రాసిన చక్కని విమర్శకులు ఇంకా వున్నారు. వారిలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, బండారు తమ్మయ్యగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట్టపర్తి నారాయణాచార్యులుగారు చెప్పుకోదగ్గవారు.

అయితే, కవులచరిత్ర పేరుతో వీరేశలింగంగారు చేసిన పని, తెలుగు సాహిత్యానికి పనికొచ్చే పని కాదు, ఆ వరసలోనే వొచ్చిన గురజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితాలు, ఇంకా విస్తృతంగా వొచ్చిన చాగంటి శేషయ్యగారి ఆంధ్ర కవితరంగిణి సంపుటాలు, వీరేశలింగంగారితో పోల్చిచూస్తే చాలా మెరుగు. కాని ఇవి కూడా తెలుగు సాహిత్యతత్త్వాన్ని గురించి పట్టించుకోకుండా, పాశ్చాత్య ప్రభావంలో పడి నిర్మించిన కవి జీవితచరిత్రలు మాత్రమే. వీటన్నిటి వల్లా, ఈ మధ్య వచ్చిన అనేక సాహిత్య చరిత్ర గ్రంథాలవల్లా పాశ్చాత్య ప్రభావాన మనలో కవి పేరుతో ఉన్న పుస్తకం గురించి, కవికి మనం చారిత్రకంగా నిర్మించిన జీవితం గురించి కలిగిన అభిప్రాయాలు సార్వకాలిక సాహిత్య సత్యాలుగా మిగిలిపోయాయి. వీటిని ఎదుర్కొని తెలుగు సాహిత్య మౌలిక స్వభావాన్నీ, తెలుగు కవుల, పాఠకుల, శ్రోతల సమాహారాలనీ, వారి అనుభవ భూమికల్నీ ఆవిష్కరించడానికి నేను ప్రయత్నించాను. తలపెట్టిన పని పెద్ద పని, సాధించింది చాల అల్పం. ఈ అల్పం కూడా తెలుగు వాళ్ళు ఎవరేనా చదివేరా, అవుననో, కాదనో అన్నారా? ఏమో నాకు తెలియదు. ఈ పనిలో నాకు తోడయిన ఆయన నా మిత్రుడు డేవిడ్ షూల్మన్, అతనితో పాటు కొన్ని సందర్భాలలో కలిసి పనిచేసినవాడు ప్రఖ్యాత చరిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యం.

నన్నయ గొప్పవాడే; ఎందుకు గొప్పవాడు, శ్రీనాథుడు చాలా గొప్పకవి; కాని ఎందుకు గొప్ప కవి. ఏ కారణం చేత శ్రీనాథుడిని మనం చదవాలి? శ్రీనాథుడివల్ల తెలుగు సాహిత్యానికి, ఆ చుట్టుపక్కల కాలంలో తెలుగు ప్రజలకి, ఇవాళ తెలుగు చదువుతున్నవాళ్ళకి, ఇంకో దేశంలో వాళ్ళకి ఏ రకమైన సాహిత్యానుభవం కలగాలి? ఈ ప్రశ్నలు వేసుకుంటే వచ్చే సమాధానాలు వేరు. ఈ ప్రశ్నలు వేసుకొని రాసిన పుస్తకాలు తెలుగులో లేవు. మేం ఆ ప్రయత్నం చేశాం.

తెలుగులో శ్రీనాథుడి గురించిన చర్చలన్నింటిలో ఉన్నది ఏమిటి? శ్రీనాథుడు ఏ కాలం వాడు? ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం రాశాడు? క్రీడాభిరామం అతను రాసిందేనా, శ్రీనాథుడు శృంగారా, లేకపోతే ఈశ్వరార్చన కళాశీలుడా? ఇలాంటి ప్రశ్నలే అందరూ చర్చించినవి. శ్రీనాథుడి గురించి వచ్చిన చాటువులన్నీ యథార్థంగా అతని జీవితాన్ని గురించి చెప్పేవి, అవి ఆయనే చెప్పినవి అని అమాయకంగా నిశ్చయించుకుని, అక్కడ నుంచి మిగతా ప్రశ్నలు వేసుకున్నారు అందరూ.

మేం–అంటే డేవిడ్ షూల్మన్, నేనూ–శ్రీనాథుడి గురించి ఒక పుస్తకం రాశాం. ఆ పుస్తకంలో శ్రీనాథుడు రాసిన ప్రతి పుస్తకాన్నీ వేరువేరుగా తీసుకుని దాని సాహిత్య విశేషాన్ని చర్చించాం. సంస్కృతంలో కవిత్వాన్ని తెలుగులో కవిత్వంగా మార్చినప్పుడు, శ్రీనాథుడు నిర్మాణగతంగా చేసిన మార్పులు చూపించాం. అందువల్ల కవిత్వానుభవంలో వొచ్చిన విశేషాన్ని వివరించాం. భీమఖండంలో శబ్దం ద్వారా శ్రీనాథుడి కవిత్వంలో దేవాలయ నిర్మాణం వ్యక్తమయే తీరు చూపించాం. ఇక శివరాత్రి మాహాత్మ్యం గురించి చర్చిస్తూ, అది నవల అని చెప్పి, అది ఒక నవల కాదు, రెండు నవలల సమాహారం అని చెప్పాం. ఇప్పుడు మనం short story అని, చిన్న కథ అని అనుకుంటున్నామే, అది పాశ్చాత్య ప్రభావం వల్ల ఏర్పడిన రూపం. కాని తెలుగులో ఇంకో రకమైన కథాకథనం వుంది, అది మన చిన్న కథ. దాని రూపాలు శ్రీనాథుడిలో ఉన్నాయి. ఇదిగో ఇలా ఉంటాయి, అని శ్రీనాథుడి హరవిలాసంలో ఒక కథ విశ్లేషించి చూపించాం. కాని ఇంత స్వల్పంగా మేము చేసినది చెప్తే ఏమీ చెప్పినట్టు కాదు. ఆ పుస్తకం చదివి చూడండి అని చెప్పాలి అంతే.

ఇప్పుడు శ్రీనాథుణ్ణి ప్రపంచంలో గొప్ప కవులలో చేర్చదగినవాడుగా గుర్తించడానికి కావలసిన సామగ్రి ఏర్పడింది. అది నిజంగా మాకు తృప్తి కలిగించే విషయం.

క్రీడాభిరామం మీద మనం చేసిన చర్చలు ఏమిటి! అది పనికొచ్చే పుస్తకమా, పనికిరాని పుస్తకమా? అని. అది పరమ అశ్లీలమైన పుస్తకం అని కొందరి వాదం. అయినా చరిత్రకి పనికొస్తుంది అని మరికొందరి సమాధానం. క్రీడాభిరామంలో శ్రీనాథుడి చెయ్యి ఎంత ఉంది? ఈ పద్యాలు శ్రీనాథుడివి అయిఉంటాయా కాదా? ఇది ఇంకొక చర్చ. ఈ చర్చల్ని పక్కకి పెట్టి, తెలుగు సాహిత్యంలో క్రీడాభిరామం వల్ల జరిగిన ప్రయోజనం ఏమిటి, అన్న విశేషాన్ని వివరిస్తూ పెద్ద చర్చ చేశాం. ఒక నూతన హేళన సాహిత్యప్రక్రియగా దాని స్వరూపాన్ని వివరించాం. క్రీడాభిరామానికి మేము చేసిన అనువాదానికి చివర రాసిన వ్యాసంలో ఈ సమాచారమంతా ఉంది. అది తెలుగువాళ్ళు చదివి చూస్తారనే మా ఆశ.

ఇంకొక సంగతి. చాటువుల విషయంలో మేం చేసిన పని. ఇది మేం A Poem at the Right Moment అనే పుస్తకానికి రాసిన ఉపోద్ఘాతంలోను, చివరి మాటలోను చెప్పాం. చాటువుల గురించి తెలుగులో రాసిన ఏ పుస్తకంలో అయినా సరే, అవి అచ్చంగా ఏ కవి పేరున వున్నాయో ఆ కవి, లేదా కవయిత్రి, రాసిందే అని ఒప్పేసుకుని, ఆ పద్యాలని చారిత్రక ఆధారాలుగా తీసుకుని చేసిన చర్చలే కనిపిస్తాయి. శ్రీనాథుడి చాటువులు శ్రీనాథుడే రాశాడు/లేదా చెప్పాడు. అలాగే అష్టదిగ్గజాలు ఉన్నారు, తెనాలి రామలింగడు ఉన్నాడు అని మనకి అందరూ చెప్తారు. కాని తీరా అష్టదిగ్గజాలు ఎవరో చెప్పొచ్చేసరికి తలొకరూ తలొక రకంగా తేదీలు కిట్టిస్తారు. అష్టదిగ్గజాలు చారిత్రకంగా లేరు, వాళ్ళని మనం కల్పించుకున్నాం–అని చెప్పింది మేము. అష్టదిగ్గజాల గురించి ఊహ ఎప్పుడొచ్చింది మనకి? ఇది బహుశా కృష్ణదేవరాయల తర్వాత దాదాపు ఒక వంద సంవత్సరాలకి పదిహేడవ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక కొత్త కల్పన. ఈ కల్పనకి చాటు సంప్రదాయం చోటిచ్చింది. ఆనాటికి తెలుగు సాహిత్యం రాజాస్థానాలు దాటి జన ప్రపంచంలోకి ప్రవేశించింది. చిన్న ఊళ్ళలో బాగా చదువుకున్నవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు తయారుచేసుకున్న ప్రపంచం చాటు ప్రపంచం. ఈ చాటు ప్రపంచం గురించి వేరే చర్చించాలి అని గుర్తించింది మేము. ఫలానా వారి పేరుతో చాటువు కన్పించగానే వెంటనే అది ఆయన/ఆవిడ చెప్పిన చాటువు అని అనుకోకూడదు అని చెప్పాం మేము. ఆ పద్యం ఆ ఫలానా కవి శైలిని అనుకరించి చెప్పిన పద్యం. ఆ పద్యానికి చాటుత్వం రావడానికి కారణాలు కూడా చెప్పాం. చాటు ప్రపంచంలో కవికి వేరే రకమైన శక్తులు ఉన్నాయని సోదాహరణంగా చూపించాం. భోజప్రబంధంలో కాళిదాసు వేరు. కుమారసంభవమ్, అభిజ్ఞాన శాకుంతలమ్ మొదలైన పుస్తకాలు రాసిన కాళిదాసు వేరు అని వివరించి చూపించాం.

మీరు చాలాకాలం బసవ పురాణం మీద కూడా పనిచేశారు కదా. తెలంగాణా ఉద్యమ సమయంలోను, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా యేర్పడిన తర్వాత ఈ పుస్తకాన్ని గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో బసవ పురాణంపై మీ ఆలోచనలు చెబుతారా!

పాల్కురికి సోమనాథుడికి ఈ మధ్య ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణా సాహిత్యవేత్తలు మాట్లాడుతున్నారు. తెలుగులో ఆయనే మొదటి కవి అని, నన్నయ కన్నా ఆయనకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆ మధ్య హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు సభల్లో చాలామంది మాట్లాడారు. ఇది ఒక రకంగా రాజకీయమైన వాదన. కానీ అసలు సంగతి చెప్పాల్సి వస్తే పాల్కురికి సోమనాథుడి పుస్తకాలు చదివి అర్థంచేసుకునే పరిస్థితిలో మనం లేము. ఆయన రాసిన బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర శుభ్రంగా అచ్చయి, సమగ్రమైన వ్యాఖ్యానంతో దొరకను కూడా దొరకవు.

నేను బసవ పురాణాన్ని 1990లో జీన్ రోగెయ్‌ర్ (Gene Roghair) తోడ్పాటుతో అనువాదం చేశాను. ఆ అనువాదం చెయ్యడానికి ముందు ఆ పుస్తకం చదివి బోధపరుచుకోవడానికి నాకు దాదాపు పదేళ్ళు పట్టింది. పీఠికలు మాత్రమే చదివి ఆ పుస్తకం గురించి చాలా పెద్ద పెద్ద మాటల్లో రాసేవాళ్ళు మనకి చాలామంది ఉండగా అందులో ప్రతి పదం పట్టిచూసిన వాళ్ళు ఎక్కువమంది లేరని నాకప్పుడు బోధపడింది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి లాంటి వారు సంయమనంతో ఆ పుస్తకాన్ని చూసి అందులో ఆవేశం పాలే కాని దానిలో కవిత్వం పాలు తక్కువని నిర్ణయించారు కూడా. అయినా ఆయన కూడా ఈ పుస్తకం ప్రతిపదార్థాన్ని గురించి పట్టించుకోలేదు.

దీనిలో బ్రాహ్మణ వ్యతిరేకతను గుర్తించిన సి.పి. బ్రౌన్ తనకున్న బ్రాహ్మణ వ్యతిరేక దృష్టితో దీన్ని ఆదరించి ఎవరో పేరు చెప్పని జంగమదేవరల చేత పాడించి రెండు లిఖిత ప్రతులు తయారు చేయించాడు. నేను ఆ ప్రతుల్ని బ్రిటిష్ లైబ్రరీ నుంచి సంపాదించాను. బ్రౌన్ లిఖిత ప్రతి చేయించాడు కాని అందులో పదాల అర్థాల మీద దృష్టి పెట్టలేదు. బసవ పురాణం వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించి సాధ్యమైన అర్థాలు చెప్పి, చాలా వివరాలతో కూడిన టీకతో ప్రకటించారు. తరవాత బండారు తమ్మయ్యగారు ఆ పుస్తకాన్ని పరిష్కరించి ప్రకటించారు కూడా. ఈ రెండు ముద్రణలు ఇప్పుడు దొరకవు. ఈ రెండిటితో పాటు నిడదవోలు వెంకటరావుగారు ప్రకటించిన ప్రతి కూడా వుంది. ఈ మూడు ప్రతులు చూసినా అర్థం కాని భాగాలు చాలా వుండిపోయాయి. అప్పుడు నేను రాజమండ్రిలో మల్లంపల్లి శరభయ్యగారి దగ్గర ఒక నెల రోజులు కూర్చుని బసవ పురాణం ప్రతి పంక్తి చదివాను. ఆయన శ్రద్ధగా పంక్తి పంక్తికి అర్థాలు చెప్పారు. అయినా ఆయనకు కూడా స్పష్టపడనివి, తెలియనివి చాలా పంక్తులు మిగిలిపోయాయి. నా అనువాదంలో ఆ తెలియని భాగాలు అలాగే వుంచి ఈ పంక్తులకు అర్థాలు తెలియడం లేదు అని రాశాను కూడా. ఇంత చేసినా, ఈ అనువాదం నాకు నచ్చలేదు. నేను ఈ అనువాదాన్ని పెద్దగా పట్టించుకోను.

ఇప్పుడు మనం ఇంత గొప్పగా మాట్లాడే పాల్కురికి సోమనాథుడి పుస్తకం ఈ దశలో ఎందుకుంది? సోమనాథుడి పుస్తకం శ్రీశైలంలో వీరశైవులు సమష్టిగా చదివేవారు. అంటే ఒకరు చదవడం, ఇంకొకరు వినడం కాకుండా అందరూ కలిసి చదివేవారు. ఆయన ద్విపద పదిమంది కలిసి పెద్ద గొంతుకతో చదవడానికి అనుకూలమైనది. అసలు ద్విపద ఒకరు చదువుతుంటే కొందరు కూర్చుని వినే ఛందస్సు కాదు. ఎక్కడో ఒక చోట ఆపి దాని మీద వ్యాఖ్యానం చెప్పి, మళ్ళా ఇంకొక భాగాన్ని అందుకుని చదవడానికి ద్విపద అనుకూలించదు. అది సమష్టి పఠనానికే వాడాలి. కాని, ఈ లోపున వీరశైవ సమాజమే కులాలు కులాలుగా ముక్కలైపోయింది. సమష్టి పఠనానికి అవసరమైన సమాజం లేకుండాపోయింది. ఆ సందర్భంలో బసవ పురాణాన్ని పిడపర్తి సోమన్న పద్యరూపంలో చంపూ కావ్యంగా రాశాడు. ఆ పుస్తకానికి ప్రాచుర్యం రావడంతో ద్విపద రూపంలో వున్న పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం మరుగున పడిపోయింది. దానికి వ్యాఖ్యానాలు, ప్రతిపదార్థాలు లేవు సరికదా శుభ్రమైన అచ్చుప్రతి కూడా చాలా కాలంపాటు లేదు. ఇప్పటికీ అర్థం సుష్టుగా బోధపడని స్థితిలో వుంది బసవ పురాణం.

ఇక మిగిలినవల్లా సోమనాథుడెప్పటి వాడు? ఏ కులం వాడు? అనే ప్రశ్నలు. బలమయిన ఏ ఆధారాలు లేకుండా సోమనాథుడు బ్రాహ్మణుడే అని నిర్ణయించారు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, నిడదవోలు వెంకటరావుగారు. బండారు తమ్మయ్యగారు మాత్రం సోమనాథుడు జంగం కులం వాడని, అంటే బ్రాహ్మణుడు కాదని పట్టుదలగా వాదించారు. ఈ వాదనలకి ప్రాధాన్యం వచ్చి అసలు పుస్తకం మరుగున పడిపోయింది.

ఇక పోతే సోమనాథుడి పండితారాధ్య చరిత్ర దగ్గరికి వస్తే పరిస్థితి ఇంకా అన్యాయంగా వుంది. దాని మీద కష్టపడి పని చేసినవారు చిలుకూరి నారాయణరావుగారు ఒక్కరే! ఆయన పరిష్కరించి, ప్రచురించిన పుస్తకం అచ్చులో దొరకదు. ఆయన కూడా అందులో వున్న మాటలన్నిటికీ అర్థాలు చెప్పలేకపోయారు. ఈ పుస్తకంలో కొన్ని భాగాల్లో ప్రతి రెండవ పంక్తి ఏవో ఉపనిషత్తుల్లోనుంచో, వేదాల్లోనుంచో తెచ్చిన భాగమయి ఉంటుంది. ఈ సంస్కృత భాగానికి ఆచూకీ కాని, అర్థం కాని చెప్పగలిగిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు.

‘భక్తి తోడి వలపు బ్రాహ్మ్యంబుతో పొత్తు వదలలేను నేను బసవలింగ’ అని పండితారాధ్యుడు అన్నాడని చాలామంది ఉదహరిస్తారు. కానీ ఈ మాటలు ఎక్కడివో ఏ పుస్తకంలోవో ఎవరూ ఆచూకీ చెప్పలేదు. పండితారాధ్య చరిత్ర నాకు బోధపడే స్థితిలో లేదు. అందుచేత దానిని అనువదించే పని అసాధ్యమని వదిలేశాను. పాల్కురికి సోమనాథుడు మొదటి తెలుగు కవి, నన్నయకన్నా ముఖ్యమైనవాడు, ఇలాంటి మాటలు ఉపన్యాసంలో చెప్పడం ప్రధానం కాదు, ఆయన పుస్తకాలు సమర్థంగా పరిష్కరించి ప్రతిపదార్థ తాత్పర్యాలతో తప్పుల్లేకుండా అచ్చు వేయడం అంతకన్నా ముఖ్యమైన పని అని నేను చాలా చోట్ల చెప్పాను.

మీరు నాయకరాజుల మీద Symbols of Substance అని ఒక పుస్తకం, ఆ తర్వాత ఇంకా అంతకంటే బాగా అందరి దృష్టిలో పడి ఇండియాలోనూ బయటా బాగా చర్చించబడిన Textures of Time అని, చరిత్ర రచన గురించి ఇంకో పుస్తకం రాశారు. ఇలా చరిత్ర మీద కూడా చాలా పనిచేశారు మీరు. ముఖ్యంగా ఈ రెండు పుస్తకాలలో మీ ఆలోచనలు ఏమిటో చెప్పండి. అసలు చరిత్ర పరిశోధనలోకి మీరు ఎలా వచ్చారు?

అది నేను ఒక్కణ్ణే చేసిన పని కాదు, అందులో డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం కూడా కలిసి ఉన్నారు. సంజయ్‌కి చాలా భాషలు వచ్చు. అతను ప్రఖ్యాత చరిత్రకారుడు. డేవిడ్‌కీ చాలా భాషలు వచ్చు. మేం ముగ్గురం కలవడం మూలంగా కొన్ని కొత్త సంగతులు గమనించే, ఊహలూ చేసే అవకాశం కలిగింది.

మనకి చరిత్ర లేదు అనేది దాదాపుగా అందరూ చెప్పే మాట. ఇంగ్లీష్వాళ్ళు వచ్చిన తర్వాతే మనం చరిత్ర రాయడం నేర్చుకున్నాం, అంతకుముందు భారతీయులకి–కేవలం తెలుగు వాళ్ళకే కాదు–చారిత్రక స్పృహ లేదు, అందుచేత చరిత్ర లేదు అని పెద్ద ఆరోపణ. దాన్ని కాదనటానికి Textures of Time రాశాం. అందులో తెలుగు పుస్తకాల్లో బొబ్బిలి కథ, కాటమరాజు కథ, కుమార రాముని కథ, రంగరాయ చరిత్రము–ఇవి ప్రధానంగా చర్చించాం. మేం చెప్పిందేమిటంటే ఇవి అందరూ జానపద గేయాలుగా, (నాకు జానపదం అనేమాట ఇష్టం లేదు. అది వేరే సంగతి) లేదా రంగరాయ చరిత్ర అయితే ప్రబంధంగా, చూస్తారు. కాని, అవి జానపదమూ కాదు, ప్రబంధ సాహిత్యమూ కాదు, ఇవి ప్రధానంగా చరిత్ర గ్రంథాలు అని మేం చెప్పాం. మనకి కైఫియత్తుల లాగా మహారాష్ట్రానికేమో బకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చరిత్రగా తీసుకున్నాం. ఇలాంటివి ఆధారంగా తీసుకొని వాటి చారిత్రిక స్వరూపం చర్చించాం. ఆ పుస్తకంలో మేం చేసిన ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటంటే, సాహిత్యంలో ఒక కాలంలో, ఒక సమాజంలో ఏ ప్రక్రియ ప్రధాన ప్రక్రియ అవుతుందో, చరిత్ర ఆ ప్రక్రియలో రాయబడుతుంది, అని. అంటే ఒక కాలంలో ప్రబంధం చాలా ముఖ్యమైన సాహిత్య ప్రక్రియ అనుకోండి. ఆ కాలంలో చరిత్ర ప్రబంధ రూపంలో రాయబడుతుంది. రంగరాయచరిత్ర అలాంటిది. రంగరాయచరిత్ర చూడడానికి కావ్యం లాగా ఉంటుంది. కాని అది జాగ్రత్తగా చదివితే అది బొబ్బిలి రాజుల చరిత్ర. ఒక కాలంలో, ఒక సమాజానికి జంగం కథ ప్రధాన సాహిత్య రూపం అనుకొండి, చరిత్ర కూడా ఆ రూపంలోనే ఉంటుంది. బొబ్బిలి యుద్ధం, పెద్దబొబ్బిలి రాజుకథ, అవి కేవలం కథలు మాత్రమే కావు. అవి నిజంగా చరిత్రలు. కాలం గడిచిన తరవాత చరిత్ర సుమా ఇది, ఆ రూపంలో రాయబడడానికి ఆ రోజుల్లో ఆ రూపం సాహిత్యంలో ప్రధాన ప్రక్రియగా ఉండడమే కారణం అనే గుర్తింపు మరుగున పడిపోతుంది. ఆ గుర్తింపుని సమకాలీన సమాజానికి చూపించి మనకి చరిత్ర ఉన్నది అని చెప్పడమే ఆ పుస్తకంలో మేం చేసిన ప్రధానమైన పని.

అందుకని texture అనే ఒక ఊహని వాడుకున్నాం. texture అంటే వాక్య వైఖరి, పద పద్ధతి. ఈ మాట బోధపడడానికి పాశ్చాత్యులు కూడా శ్రమపడుతున్నారు. వాళ్ళలో చాలామందికి భారతీయ భాషలు అంతంత మాత్రంగానే వొచ్చు. భాషలో texture విషయికమైన తేడా తెలియడానికి ఆ భాష బాగా వొచ్చి వుండాలి. ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఆ పుస్తకంలో మేం చేసిన ప్రయత్నం అది.

నాయకరాజుల కాలంలో వచ్చిన సాహిత్యాన్ని కూడా తీసుకొని దాన్ని చరిత్రతో జోడించి, రాచరికం, రాజు, అనే వ్యవస్థలు ఎలా మారాయో చెప్పారు కదా?

మనకి రాజులని గురించి రెండు రకాల ఊహలున్నాయి. అవి తెలుగులోనే కాదు, సంస్కృతంలోనూ, భారతదేశంలో ఇతర ప్రాంతాలలోనూ కూడా ఉన్నాయి. ఒకటి రాజు విష్ణ్వంశ సంభూతుడు అనే ఊహ. ఆయనకి విష్ణువు అంశ ఉంటుంది. కానీ రాజు విష్ణువు కాడు. రాజరికం అలాంటి రాజు చేస్తాడు. బ్రాహ్మణత్వం ఉన్నటువంటివారు కొందరు ఉన్నారు. రాజుకి వీళ్ళు క్షత్రియత్వాన్ని కల్పిస్తారు. ఈ బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, రెండు జోడీలుగా కలిసి రాజ్యాన్ని పరిపాలించాయి శతాబ్దాలపాటు. (ఈ విషయాన్ని గురించి వివరంగా నేను ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు విశ్వగుణాదర్శ చంపుకి చేసిన అనువాదానికి రాసిన ముందుమాటలో చెప్పాను.)

నాయకరాజుల కాలానికి రాజే దేవుడయ్యాడు. రాజే దేవుడవడం చాలా విశేషమైన మార్పు. రాజు దేవుడవగానే రాజు దగ్గర ఉన్నవాళ్ళందరు కూడా భక్తులు, భృత్యులు అవుతారు. దేవుడైన రాజుకి అందరికన్నా దగ్గరగా ఉండే వాళ్ళెవరు? స్త్రీలు. అంచేత ఆ రోజుల్లో స్త్రీ కవిత్వానికి చాలా ప్రాధాన్యం వచ్చింది. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరినైనా సరే ఆస్థానకవి అని చెప్పదగ్గ కవి ఎవరైనా ఉంటే, రంగాజమ్మ గురించి చెప్పాలి. రాజు దేవుడవడం మూలంగా వచ్చినటువంటి మార్పులు మేం ప్రత్యేకంగా చెప్పాం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు భాగాలు సమాజాన్ని గురించిన ప్రధాన భావనగా ఉండగా, వర్ణ పద్ధతి ప్రకారం వైశ్యత్వం ఉన్నటువంటి బలిజలు నాయకరాజుల కాలంలో రాజులయ్యారు, అంటే క్షత్రియత్వం పొందారు. అంటే, వైశ్యత్వం, క్షత్రియత్వం కలిసిపోయాయి. చాతుర్వర్ణ వ్యవస్థ దెబ్బతింది. ఇది సామాజికంగా చాలా పెద్ద మార్పు. ఆ పెద్ద మార్పును తట్టుకోడానికి, దానిని బోధపరుచుకోడానికి పూర్వపు పురాణ కథలలో ధర్మ విరుద్ధమైన వాటిని కవులు తిరిగి రాశారు. అహల్యాసంక్రందనము, తారా శశాంకవిజయం–ఇలాంటివి. ఆ కథలలో ఆచారానికి విరుద్ధమైనటువంటి సందర్భం ఉంటుంది. గురువుగారి భార్యకీ శిష్యుడికీ మధ్య, ముని భార్యకీ ఇంద్రుడికీ మధ్య రహస్య కామసంపర్కం ఈ కథల్లో ప్రధాన విషయం. అంతకుముందు కాలంలో అవి పాపాలు. ఆ పాపాలకి అహల్య, చంద్రుడు, శిక్షించబడ్డారు. కాని నాయకరాజుల కాలంలో వాళ్ళు ప్రశంసించబడతారు. ఈ కాలపు పుస్తకాలలో కామ వర్ణనలు అవినీతికరమైనవని, ఆ వర్ణనలు విశృంఖలంగా ఉన్నాయని ఇరవయ్యో శతాబ్దంలో ప్రభుత్వం ఆ పుస్తకాలని నిషేధించిందని మీకు తెలుసు. ఈ యుగం సాహిత్యంలో క్షీణయుగం అని అనడం మనం చేసిన పెద్ద పొరపాటు.

ఇంతకీ, ఆ కాలంలో ఇటువంటి కథలు రాయవలసిన అవసరం ఎందుకేర్పడింది? సామాజిక వ్యవస్థ మారుతోంది. మారుతున్న వ్యవస్థలో పుట్టుకతో ఉన్న కులంవల్ల వచ్చినటువంటి గొప్పతనం కాకుండా, తానూ వ్యక్తిగతంగా సంపాదించుకున్న డబ్బు వల్ల పైకి వస్తున్నాడు మనిషి. అంటే డబ్బుకి ప్రాధాన్యం ఏర్పడింది. డబ్బుకి ప్రాధాన్యం ఏర్పడగానే సమాజంలో మార్పులు చాలా వస్తాయి. నేను ఫలానా కులం వాడిని అంచేత నాకు తప్పక ఈ స్థానం రావాలి, అనుకోవడం వేరు, నేను సంపాదించుకున్న డబ్బిది, నా అంతట నేను గొప్పవాడినయ్యాను, నాకు ప్రాధాన్యం రావాలి అని చెప్పడం వేరు. ఇది పెద్ద మార్పు. సమాజంలో వచ్చిన పెద్ద పెద్ద మార్పులు సాహిత్యం ఎలా ప్రతిబింబించిందో చూపించాం మా పుస్తకంలో. నాలుగు వాక్యాల్లో ఇంతకన్నా చెప్పలేను కాని, అది మేం చేసిన ప్రధానమైన పని.

సాహిత్య చరిత్రలో ఎవరు ఏ పుస్తకం రాశారు, ఎప్పుడు రాశారు–ఇలాంటి ప్రశ్నలే ఇంకా వస్తున్నాయి. కాని మీరు అలాటి ప్రశ్నలు వొదిలేసి అసలు ఒక పుస్తకం అనే భావానికీ, రచయిత అనే భావానికీ ఉండే సంబంధం గురించి చర్చిస్తూ, Authors Without Texts and Texts Without Authors అన్న పేపర్ రాశారు. ఇది చాలా ముఖ్యమైన ఆలోచన అని అనుకొంటున్నాను. కర్త, కర్తృత్వం, పుస్తకం–వీటిని గురించి మీ అభిప్రాయాలు చెప్పండి.

ఆ వ్యాసంలో సంగతులు చాలాచోట్ల మాట్లాడేనే కాని, ప్రచురించలేదు. మనకి బ్రిటిష్వాళ్ళు వచ్చిన తర్వాత, అచ్చు యంత్రం వల్ల పుస్తకాలు ఎవరికి వారు ఒక్కరూ నిశ్శబ్దంగా చదువుకునే అలవాటు వచ్చింది. దాంతోపాటూ ఒక కొత్త రకమైన కాలిక స్పృహ వచ్చి, ఏ పుస్తకం ఎవరు ఎప్పుడు రాశారు అనే ప్రశ్నకి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాహిత్య చరిత్ర రాయాలి అంటే నన్నయ ఎప్పటి వాడు, శ్రీనాథుడు ఎప్పటి వాడు–ఇలాటి ప్రశ్నలకే ప్రాధాన్యం వచ్చింది. చాలామంది కవులు తమ పుస్తకాలు రాజులకో, మంత్రులకో అంకితం ఇచ్చారు కాబట్టి, ఆ కవుల కాలనిర్ణయం చెయ్యడం వీలయ్యింది. కాని అలా చెయ్యని పాల్కురికి సోమనాధుడి గురించి చూడండి, అతడేమో ఏ రాజుకీ పుస్తకం అంకితమివ్వలేదు. అంచేత ఆయన ఏ కాలానికి చెందినవాడో ఆధారాలు దొరకట్లేదు, అంచేత నానా శ్రమలూ పడి కాల నిర్ణయం చేసి, తన కులం ఎక్కడా చెప్పుకోని వాడు, బ్రాహ్మణుడే అని నిర్థారించారు మన సాహిత్య చరిత్రకారులు. శాసనాలు చదవడం వాటి తేదీలు నిర్ణయించడం ప్రధానమైన పని అయిపోయింది సాహిత్యంలో.

కాని, మనం వదిలేసింది ఏమిటి? కవులను గురించి బోలెడు కథలున్నాయి. ఈ కథలన్నీ కట్టుకథలని కొట్టిపారేశాం. ఈ కథలు లేకుండా సాహిత్య చరిత్ర రాయాలి–అని మనకి సి. ఆర్. రెడ్డిగారు చెప్పారు. కాని, ఆ కథలకి చాలా ముఖ్యమైన ప్రయోజనం ఉంది. ఆ కథలే నిజమైన సాహిత్య చరిత్ర మనకి. వాటిని వదిలేయడం మనం చేసిన పొరపాటు. ఉదాహరణకి శ్రీనాథుడికి, పోతనకి, సంబంధించిన కథలు మనకున్నాయి. శ్రీనాథుడు ఎటువంటి జీవితం జీవించాడో, పోతన ఎటువంటి జీవితం జీవించాడో ఆ కథలు మనకి చెప్తాయి. శ్రీనాథుడు నిజంగా శృంగారమైన జీవితం జీవించాడా? శ్రీనాథుడు చివరికాలంలో చాలా కష్టాలు పడ్డాడా? ఇది కాదు ప్రధానం, కాని ఆ కథలు ప్రధానం. పోతన వ్యవసాయం చేసుకుంటూ చిన్న పల్లెటూళ్ళోనే ఉన్నాడా? అది ప్రధానం కాదు, కాని ఆ కథ ప్రధానం.

ఈ కథ ఎప్పుడొస్తుంది. పోతన భాగవతాన్ని మనం భక్తి గ్రంథంగా చదవటం మొదలుపెట్టాక. శ్రీనాథుడి పుస్తకాలని శృంగార గ్రంథాలుగా భావించడం మొదలుపెట్టాక. ఆ గ్రంథాలకి ఈ అర్థాలు వచ్చిన తరవాత, వాటి కర్తలకి అందుకు అనువైన కథలు అల్లుతాం. అంటే ఏమిటి? పుస్తకాన్ని చదివే తీరు వల్ల కర్త మారాడు. పోతన భాగవతం పూర్తిగా భక్తి గ్రంథం కాదు. మనం చదివే తీరు వల్ల అది భక్తి గ్రంథం అయ్యింది. దానివల్ల పోతన భక్తుడయ్యాడు. భక్తుడు రాజాశ్రయం ఒప్పుకోడు. అందువల్ల పోతన పొలం దున్నుకుని బతకాల్సిన అవసరం ఏర్పడింది. శ్రీనాథుడు కేవలం స్త్రీలోలుడు కాడు. కాని మనం ఆయన పుస్తకాలు చదివే తీరువల్ల అతను శృంగారకవి అయ్యాడు. ఈ సందర్భంలోనే రాజ కవికి, భక్తి కవికి, పెద్ద తేడా మనం కల్పించాం. రాజ కవి సుఖంగా బతకాలి. రాజు దగ్గిరనుండి డబ్బులు తీసుకొని విలాస పురుషుడిలా బతకాలి. భక్తి కవి పేదవాడుగా బతకాలి, వ్యవసాయం చేసుకుంటూ బతకాలి. రాజుని తిరస్కరించి, రాజు తన పుస్తకాన్ని అంకితం ఇవ్వమని అడిగితే నిరాకరించి బతకాలి. ఇది ఒక అవసరం మనకి. ఈ అవసరం వల్ల ఈ కథల్ని కల్పిస్తాం. ఈ కథల వల్ల ఆ పుస్తకానికి కొత్త కర్తృత్వం ఏర్పడుతుంది. అంచేత నేనంటున్నదేమిటంటే, పుస్తకం చేసిన కర్తని గురించిన కథలు పుస్తకం చదివిన తర్వాత ఏర్పడ్డాయి. అంచేత పుస్తకం కర్తృత్వాన్ని తయారుచేస్తుంది కాని, కర్త పుస్తకాన్ని తయారుచెయ్యడు అని.

ఇంకొక కథ చెప్పాలంటే–ఇది మనకందరికీ తెలిసిందే–వాల్మీకి మహర్షి బోయవాడు చంపిన పక్షిని చూసి బాధపడి, ఆ బోయవాణ్ణి శపిస్తే, ఆ వాక్యం శ్లోకం అయ్యింది. బ్రహ్మ వొచ్చి, ఆ శ్లోకంలో వున్న చందస్సుతో రామాయణం రాయమని చెపితే మనకి రామాయణం వొచ్చింది. ఈ కథ మనకి తెలుసు. కాని ఇంకొక కథ ఉంది. ఈ కథలో వాల్మీకి ఋషి కాదు. బోయవాడు. బోలెడుమందిని దారికాచి చంపి, వాళ్ళ దగ్గిర ఉన్న డబ్బు తీసుకుంటుండేవాడు. ఈ డబ్బుతో, పెళ్ళాం పిల్లల్ని పోషించుకుని బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు అతనికి కొందరు బ్రాహ్మలు తారసపడ్డారు. ఆ బ్రాహ్మల్ని, మీ డబ్బివ్వండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నాడు వాల్మీకి. ఈ డబ్బుకోసం నువ్వీ పాపం చేస్తున్నావు, ఇది అంతా ఎవరి కోసం అని అడిగారు ఆ బ్రాహ్మలు. నాకు పెళ్ళాం పిల్లలు వున్నారు, వాళ్ళ కోసం సంపాదిస్తున్నా అన్నాడు ఆ బోయవాడు. అయితే, నువ్వు సంపాదించిన డబ్బుతో పాటు, నీ పెళ్ళాం పిల్లలు, నీ పాపం కూడా అనుభవిస్తారా? అని అడిగారు బ్రాహ్మలు. ఆ బోయవాడికి సమాధానం తోచలేదు. ఆ బ్రాహ్మలు మర్యాదగా, మేం ఇక్కడే వుంటాం. ఇంటికి వెళ్ళి నువ్వు ఇంత పాపం చేసి సంపాదిస్తున్న డబ్బు తిని బతుకుతున్న నీ భార్యా, పిల్లలు నీ పాపం కూడా పంచుకుంటారేమో కనుక్కో అంటారు. ఆ బోయవాడు వెళ్ళి కనుక్కుంటాడు. నువ్వు భర్తవీ, తండ్రివీ కాబట్టి మమ్మల్ని పోషిస్తున్నావు, నీ పాపంతో మాకేం సంబంధం లేదు, నీ పాపం నీదే అంటారు వాళ్ళు. అది తెలుసుకొని ఆ బోయవాడు ఈ బ్రాహ్మల దగ్గరికి వచ్చి, అయ్యా ఎన్నో పాపాలు చేశాను ఇన్నాళ్ళూ. ఈ పాపాలు ఎలా పోతాయి, నాకు దారి చూపించండి, అని అడుగుతాడు. వాళ్ళు అతనికి రామ మంత్రం చెప్పాలనుకుని, ఈ బోయవాడు, వట్టి తామసికుడు, ఏది చెప్పినా దాన్ని తల్లకిందులుగా అర్థంచేసుకుంటాడు అని, రామ మంత్రాన్ని–మరా, మారా–అని తల్లకిందులుగా ఉపదేశిస్తారు. ఆ బోయవాడు తదేక దీక్షతో మరామరామరామరామరామ అంటూ వుంటే అది రామ, రామ, అవుతుంది. నిశ్చలంగా తదేకదీక్షతో రామ నామం జపిస్తున్న ఆ బోయవాడి చుట్టూ పెద్ద పుట్ట పెరుగుతుంది. వల్మీకము అంటే పుట్ట. పుట్టలో నుంచి వచ్చాడు కాబట్టి బోయవాడు వాల్మీకి అయ్యాడు. ఈ కథ ఎప్పుడు వచ్చింది? మనకి రామాయణం, భక్తి గ్రంథంగా చదవడం అలవాటయ్యాక, ఈ కవి భక్తుడు కావాల్సిన అవసరం ఏర్పడ్డ తర్వాత. మొట్టమొదటి శ్లోకం చెప్పిన వాల్మీకి, పుట్టలోనుంచి వచ్చిన వాల్మీకి, రెండు రకాలుగా రామాయణం చదవడానికి గుర్తులు. అంటే రామాయణం మనం చదివే పధ్ధతి మారితే, కర్త మారాడు. అప్పుడు కర్తకి కొత్త జీవితాన్ని కల్పించాం మనం. అంటే, మళ్ళా చెప్తున్నాను–పుస్తకం కర్తను తయారుచేస్తుంది కాని, కర్త పుస్తకాన్ని తయారుచెయ్యడు అన్నమాట.

అచ్చు యంత్రం వచ్చిన తర్వాత కావ్యం చదువుకొనే పద్ధతుల్ని పోగొట్టుకున్నాం అని Print and Silence అనే విషయం మీద మీరిచ్చిన ఉపన్యాసాల్లో వివరంగా చెప్పారు. మీరు దాని గురించి చెప్తారా!

పుస్తకం చదివే పద్ధతి అచ్చు వచ్చిన తర్వాత మారిపోయింది. ఇంతకుముందు పుస్తకం ఎలా చదవాలో ముందు నేర్చుకొని, తర్వాత పుస్తకం చదివేవాళ్ళు. తాటాకు పుస్తకంలో అక్షరాలన్నీ వరసగా రాసి ఉంటాయి. కామాలు ఉండవు. ఫుల్‌స్టాప్‌లు ఉండవు. పద్యానికీ పద్యానికీ మధ్య జాగాలు ఉండవు. అలాటి పుస్తకం చదవాలంటే ఎవరో ఒకరు అది ఇలా చదవాలి అని నేర్పాలి. ముందు చదవడం నేర్చుకొని, తర్వాత పుస్తకం తీసుకోవడం మన పూర్వపు అలవాటు. అది పోయి అచ్చు రాగానే మనకి పుస్తకం మనంతట మనం చదివేసుకోగలం అనే భ్రమ ఏర్పడింది. ఆ భ్రమ ఎలా ఏర్పడిందో చూద్దాం. అచ్చుకి ముందు మనకి లోపల చదువుకునే అలవాటు (silent reading) లేదు. ఇప్పటి నవలలూ, కథలూ నిశ్శబ్దంగా చదవొచ్చు. కాని మన పాత పుస్తకాలు అలా చదవడానికి వీలులేదు. ఆ పుస్తకాలు పైకే చదవాలి. పైకి చదవడంలో రకరకాల మార్పులు వస్తాయి. ఆ గొంతుకలో మార్పులు, ఉచ్చారణలో తేడాలు, ఎక్కడెక్కడ ఆపాలో ఎక్కడ వాక్యం తిరుగుతుందో, ఇవన్నీ తెలుసుకుంటే తప్ప పద్యాన్ని చదవటానికి వీల్లేదు. అందుచేతనే పూర్వపు పుస్తకం మొదటిసారిగా తెరిచి చదవలేం. ఇవాళ ఈ చదివే పధ్ధతి చచ్చిపోతోంది. అందరూ నిశ్శబ్దంగా చదువుతున్నారు. అందువల్ల ఏం జరుగుతుందో చెప్పాను.

ఉదాహరణకి శివరాత్రి మాహాత్మ్యం పైకి చదవవలసిన పద్ధతిలో చదివి, ఎక్కడెక్కడ ఆపాలో చూసి, ఎక్కడెక్కడ వేగంగా చదవాలో, ఎక్కడ వేగం తగ్గించి చదవాలో చదివితే మీకు ఆ పుస్తక స్వరూపం భోధపడుతుంది. అందులో రెండు నవలలూ ఉన్నాయి. అవి గట్టిగా చదవడం మూలంగానే తెలుస్తాయి కాని, నిశ్శబ్దంగా చదివితే తెలియవు. అందుకనే మేం శ్రీనాథుడి గురించి రాసిన పుస్తకంలో A Novel in Two Voices అని ఒక అధ్యాయం రాశాం. చదివే పద్ధతి ఒకటి ఉంది. అచ్చు యంత్రం రావడం మూలంగా ఆ పద్ధతి పూర్తిగా చచ్చిపోతోంది. ఆ చదివే పద్ధతి చెప్పేవాళ్ళు కూడా పోతున్నారు. లేదా నాటక పద్ధతిలో, రాగం తీసి చదివేవాళ్ళు వొస్తున్నారు. Print and silence అనే విషయం తీసుకొని నేను చెప్పింది స్థూలంగా అది.

చదివే పద్ధతుల గురించి, అచ్చుయంత్రం, అక్షరాస్యత గురించి గత 40 ఏళ్ళలో చాలా వివరంగా చర్చించారు. Recorded text, Received text అనే మాటలు మీరు తయారుచేసినవే. అలానే అక్షరాస్యతని రెండు రకాలుగా చూసి Graphic literacy, Oral literacy అని రెండు రకాల అక్షరాస్యతల్ని గురించి చెప్పారు మీరు. వాటి గురించి కొంచెం వివరంగా చెప్పండి.

మన పూర్వ కవులు ఎప్పుడూ కూడా వ్రాయు అనే క్రియని రచించు అనే అర్థంలో వాడలేదు. పోతన భాగవతం రాయలేదు. నన్నయ మహాభారతం రాయలేదు. వాళ్ళు రచనకి వాడిన క్రియలు చూడండి: చెప్పు, రచించు, చేయు, కట్టు. అల్లు అని కూడా ఉంది ఆఖరుకి. రాయు అనే మాట మాత్రం లేదు. రాసేవాళ్ళు ఎవరు, రాతగాళ్ళు, రాయసగాళ్ళు వేరే ఉండేవాళ్ళు మనకి. ఈ సంగతి ఎప్పుడో 1971లో రాసిన తెలుగులో కవితా విప్లవాల స్వరూపంలోనే చెప్పాను. కాళహస్తిలో రాత పని వారి వీధి అని ఒక వీధి ఉంది. Writers Street అని ఇంగ్లీషులో అర్థం చేసుకుని, రచయితలు అక్కడ ఉంటారని అనుకోకండి. బొమ్మలు వేసేవాళ్ళు ఉన్నారక్కడ. అంటే కలంకారీ బొమ్మలు వేసేవాళ్ళు. రాయు అంటే బొమ్మ రాయడమే. పూర్వ కవులెవరూ, నోటితో పద్యాలూ చెప్పేరే కాని రాయలేదు. మొన్నమొన్నటి సత్యనారాయణగారు కూడా నోటితోనే చెప్పేవారు. చెప్పే వాడు కవి. రాసే వాడు రాయసకాడు. ఏ పురాణమూ మొదటి నుంచి చివరి దాకా ఎవరూ చదవరు, మహాభారతం మొదటి నుంచి చివరి దాకా వరసపెట్టి ఎవరూ చదవరు. పౌరాణికుడు ఎలా చదువుతాడో నా కవితావిప్లవాల పుస్తకంలో వివరంగా చర్చించాను. రచించబడిన పుస్తకం నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రవచించబడిన పుస్తకం శబ్దవంతంగా వుంటుంది. పౌరాణికుల వల్ల తయారయిన పుస్తకాన్ని ప్రవచించబడిన పుస్తకం అన్నాను. తాటాకుల మీద, దరిమిలా అచ్చులోనూ కనిపించే పుస్తకం రచించబడిన పుస్తకం అన్నాను. రచించబడిన పుస్తకాన్ని ఒక్కదాన్నే చూస్తే పుస్తకం సరిగా అర్థంకాదు మీకు. అది ప్రవచించబడిన రూపం/రూపాలు ఏమిటో తెలియాలి. కాని ఇప్పుడు ఆ ప్రవచించబడిన రూపం నిశ్శబ్దంలో కలిసిపోతోంది. దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, రచించబడిన పుస్తకాన్ని మాత్రం పట్టికెళ్ళి లైబ్రరీలో పెట్టుకొని చదువుతున్నాం. Recorded Text, Received Text అని రెండు పేర్లు పెట్టి, ఆ Received Textని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నాను. Received Text లేకపోతే Recorded Text సరిగా అర్థంకాదు అన్నాను. Recorded Text flatగా వుంటుంది, కాగితం మీద. అందులో ప్రతి అక్షరానికీ, ప్రతి పేజీకి ఒకటే విలువ. Received Textలో ప్రతి అక్షరం ప్రాణవంతంగా వుంటుంది. అంతేకాదు, చదివే తీరును బట్టి, కొన్ని భాగాలకి ప్రాధాన్యం వస్తుంది, కొన్ని భాగాలకి ప్రాధాన్యం రాదు అన్నాను. ఈ విషయం బోధపడడానికి ఒక బొమ్మ వేసి చూపించాను.

ముఖ్యంగా మీరు గత ఇరవై ఏళ్ళలో రాసిన పుస్తకాలు చూస్తే వీటన్నింటిలోనూ–ఆధునికత యూరప్‌లో రినైసాన్స్ (renaissance) ద్వారా వచ్చినది కాదు, మాదైన ఒక ఆధునికత ఉంది అన్న వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఆ వాదనలోనే కళాపూర్ణోదయం మొదటి నవలగా చెప్పటం, అన్నమయ్య పాటల్లోని ఆధునికతని చూపించారు మీరు. యూరోపియన్ ఆధునికతకు, మనకు తేడాలేమైనా ఉన్నాయా?

ఆధునికతకి ఏవైతే ప్రధాన లక్షణాలుగా భావిస్తున్నామో, అవి మనకి చాలా ముందే ఏర్పడ్డాయి, బ్రిటిష్వాళ్ళు రావడం మూలంగానే మనం ఆధునికం కాలేదు అని అన్నాను. ఆధునికత ప్రధాన లక్షణాలేమిటి అంటే సమష్టిగా ఉండే సమాజంలో వ్యక్తికి ప్రాధాన్యం రావడం. అలాగే వ్యక్తి ఏకాంతతకి ప్రాధాన్యం పెరగడం. మీకు వచ్చిన ఉత్తరం ఉందనుకోండి, అది మీరే చదువుకుంటారు. మీ పేర వచ్చిన ఉత్తరాన్ని ఇంకొకళ్ళు చూడరు. ఇంకొకరు తీసుకోరు. రహస్యం అని కాదు, అది మీది. ఇంకొకరు కవరు చింపి చూడడం మర్యాద కాదు. ఈవిధంగా వ్యక్తిత్వాన్ని మనం గౌరవిస్తాం. ఈ వ్యక్తికి ఉండే గౌరవం, వ్యక్తి అనే ఊహ పెరుగుతున్న దశలోనే వస్తుంది.

ఆర్థికంగా పొలాల మీద వచ్చేటువంటి ఆదాయం మాత్రమే ఆధారమైన పద్ధతిలో, కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి. సమష్టి కుటుంబం తప్పకుండా బలంగా ఉండాలి. అంచేత, నేను ఫలానా కుటుంబం వాణ్ణి, ఫలానా కులం వాణ్ణి అని చెప్పుకోవడంవల్ల. అందువల్ల మీకు గౌరవం వస్తుంది. ఆర్థిక వ్యవస్థ భూమినుంచి మారి మిగతా రకాలుగా వచ్చేటటువంటి, ఆదాయమే ప్రధానమైన దశలో, ఈ డబ్బు నేను సంపాదించుకొన్నాను, అనే మాటకు గౌరవం ఏర్పడుతుంది. అంచేత నువ్వు ఏ కులం వాడివి? ఏ రకమైన స్థాయి వాడివి? మీ తండ్రి ఎవరు, తాత ఎవరు? వాళ్ళని బట్టి నిన్ను గౌరవిస్తాం, అనేది తగ్గి నీ సంపాదన ఎంత? అనే దానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది. పెద్ద మార్పు ఇది. ఈ పెద్ద మార్పు స్పష్టంగా కనిపించింది, నాయకరాజుల కాలంలో. అది సాహిత్యంలో ఆధునికతకి చోటిచ్చిందని ప్రతిపాదించాం మేము. ఇవి ఆధునికతకి గుర్తులు. ఈ ఆధునికత బ్రిటిష్‌ వాళ్ళు మనకి తెచ్చినలాంటిది కాదు.

బ్రిటిష్‌ వాళ్ళ ద్వారా వొచ్చింది వలస కాలపు ఆధునికత (colonial modernity). ఇది పాత అంతా అజ్ఞానం అని, దాన్నంతటినీ ధ్వంసం చెయ్యాలని చెప్పింది. మనకి మన సంస్కృతి మీద తిరస్కారభావాన్ని నేర్పింది. మనకి ఆత్మ న్యూనతాభావాన్ని నేర్పింది. మన సాంస్కృతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. అంతకుముందున్న ఆధునికత పూర్వాన్ని తిరస్కరించదు. పాతకాలంలో ఉన్నదాన్ని తిరస్కరించి, దాన్ని ధ్వంసం చేసి, కొత్తది సృష్టించితే కాని ఆధునికత కాదు అనేది పూర్వకాలంలో లేదు మనకి. ఇది బ్రిటిష్ వాళ్ళ వల్ల వచ్చింది. ఇది కొలోనియల్ మోడర్నిటీ.

తర్వాత పుస్తకం అసలు ఎలా చదవాలి అనే చర్చను కొనసాగిస్తూ అసలు భారతీయ కథనాల (Indian narratives) గురించి చెప్తూ –రామాయణం కానివ్వండి, కథాసరిత్సాగరం కానివ్వండి, భారతం కానివ్వండి– వీటికి ఒక రకమైన వ్యాకరణం ఉంది అని మీరు ప్రతిపాదన చేశారు…

అది చాలా సూచనమాత్రంగా చేశాను. అందుకనే, Notes towards a cultural grammar of Indian narratives అని మాత్రం అన్నాను, ఇది చాలా పెద్ద పనే. నిజానికి ఎవరన్నా కొనసాగిస్తే బావుణ్ణని నా ఊహ. భారతదేశపు చరిత్రని, మొత్తం అంతటిని కాలక్రమంలో చూడకుండా, భారత నాగరికత మూడు ప్రధాన విభాగాలుగా చూడాలని నా ప్రతిపాదన. భారతదేశంలో మూడు ప్రధానమైన నాగరికతలున్నాయి. ఒకటి, భూమి నుంచి వచ్చే ఆదాయం ఉన్నవాళ్ళ నాగరికత. ఇంకొకటి, పశువుల్నించి వచ్చే ఆదాయం ఉన్నవాళ్ళ నాగరికత. కేవలం వ్యాపారం వల్ల డబ్బు సంపాదించేవాళ్ళ నాగరికత మూడోది. ఈ మూడు వేర్వేరుగా చూడాలి అన్నాను. ఈ మూడు రకాల నాగరికతల్ని/ సంస్కృతుల్ని చూస్తే చాలా విషయాలు బోధపడతాయి. ఉదాహరణకి స్త్రీని గురించి ఈ మూడు నాగరికతల్లోను మూడు రకాల అభిప్రాయాలున్నాయి. భూమిని ప్రధానమైన ఆదాయంగా ఏర్పరుచుకున్న కులాలవాళ్ళు స్త్రీని భూమితో సమానంగా చూస్తారు. భూమి నుంచి పంట వస్తుంది. స్త్రీ నుంచి పిల్లలు వస్తారు. భూమిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్త్రీని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సంస్కృతిలో పాతివ్రత్యానికి విపరీతమైన గౌరవం ఉంటుంది. రామాయణం ఇలాంటి నాగరికత నుంచి వచ్చిన కథ. అందుచేతే స్త్రీ పాతివ్రత్యానికి సీతాదేవిని ఆదర్శంగా చూపించుకుంటాం మనం. ఈ నాగరికతలో వీరుడు తన భూమిని పరిరక్షించుకోవాలి. తన భూమి కోసం అవసరమైతే చచ్చిపోవాలి. భూమి మడత బెట్టి జేబులో పెట్టుకొనే వస్తువు కాదు. వీరుడెప్పుడూ యుద్ధంలో శత్రువుకి వెన్ను చూపించకూడదు. ఈ రకమైన వీరత్వమూ, ఈ రకమైన స్త్రీ పాతివ్రత్యమూ, భూమి ప్రధానంగా ఏర్పడిన నాగరికత నుంచే వచ్చాయి.

పశువులు ప్రధానమైన ఆస్తిగా ఉన్న నాగరికతలో స్త్రీలకి స్వాతంత్ర్యం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ నాగరికతలో వీరులు చచ్చిపోవడం ప్రధానం కాదు, గెలవడం ప్రధానం. అవసరమైతే యుద్ధం నుంచి పారిపోయి వచ్చి కూడా వీరుడు కావచ్చు. మహాభారతం పశువులు ఆధారంగా వుండే నాగరికత లోంచి వొచ్చిన కథ. ద్రౌపది, సీత, ఒకలాంటి పతివ్రతలు కారు.

ఇక వ్యాపారం చేసుకొనేవాళ్ళ కథలు కథాసరిత్సాగరంలో వున్నాయి. అక్కడ స్త్రీ చాలా స్వతంత్రురాలు. ఆమె స్వయంగా తనను తాను రక్షించుకుంటుంది. ఆమెని పురుషుడు వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఆమె పురుషుడి మర్యాదని కాపాడే పని కూడా తానే పెట్టుకుంటుంది. వ్యాపారం చేసుకొనే కుటుంబాల్లో స్త్రీలూ, పురుషులూ వ్యాపార వ్యవహారాలు సమానంగా నిర్వహిస్తారు. అందుచేత ఇద్దరూ సమానమైన స్థాయిలో ఉంటారు.

ఈ మూడు రకాల కథలూ విడదీసి, మూడురకాల నాగరికతలున్నాయి, మూడురకాల వీరత్వం ఉంది, మూడురకాల స్త్రీత్వం ఉంది, మూడురకాల ఇతర మర్యాదలు కూడా ఉన్నాయి అని చెప్పాను. ఇలా చూస్తే భారత నాగరికత చరిత్ర ఇంకొక రకంగా రాయొచ్చు అనేది నేనన్నమాట. వివరంగా చెప్పటానికి ఆ కొద్ది పేజీల్లో నాకు అవకాశం లేదు. అందుకనే Notes Towards a Cultural Grammar Of Indian Narratives అని ఊరుకున్నాను.

గత నాలుగైదు ఏళ్ళుగా మీరు నీతి గ్రంథాల మీద పనిచేస్తున్నారు కదా! ఇంగ్లీష్‌లో మోరల్ అనే పదానికి సంస్కృతంలో నీతి అనే పదానికి ఎలాంటి సంబంధం లేదని మీరు అన్నారు. ఆ సందర్భం గురించి కొంచెం చెప్పండి?

మనకి పాలిటిక్స్ మీద పుస్తకాల్లేవనే అభిప్రాయం ఉంది. కౌటిల్యుడి అర్థశాస్త్రం, కామందకుడి నీతిసారం అంతే, తర్వాత ఏమీ లేవు అనే అభిప్రాయం బలంగా వుంది. సుమతీ శతకం గురించి వ్యాసం రాస్తూ అందులో ఉన్నవి కూడా రాజకీయాలే అన్నాను. సమాజంలో మనిషి పైకి ఎలా రావాలి? ఏ రకమైన ప్రవర్తన లాభకరం? ఏ రకమైన అబద్ధాలు చెప్పొచ్చు? ఎవర్ని ఎలా చూడాలి? హెచ్చు తగ్గులు జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి? అనే సంగతి చెప్పేటువంటి నీతి గ్రంథం సుమతీ శతకం అన్నాను. ఇది తీసిపారేయ్యాల్సిన పుస్తకం కాదు.

బ్రిటిష్వాళ్ళు వచ్చిన తర్వాత, మనకి నీతి లేదు, అనే అభిప్రాయం ఏర్పడింది వాళ్ళకి. విక్టోరియన్ నైతికతలో (Victorian morality) కామాన్ని గురించి మాట్టాడ్డం తప్పు. స్త్రీ, పురుష సంబంధాల్ని చర్చించడం తప్పు. అది అనైతికం (immoral). ఇండియాలో ఏ పుస్తకం తెరిచినా ఇవే ఉంటాయి. ఆఖరుకి దేవాలయానికి వెళ్తే ఈ బొమ్మలే ఉంటాయి. అంచేత భారతదేశంలో వాళ్ళకి నీతి లేదు, వాళ్ళు అవినీతిపరులు అని నిర్ణయించారు బ్రిటిష్వాళ్ళు. ఈ పుస్తకాలు పాఠం చెప్పడానికి యోగ్యమైనవి కూడా కావు అని నిశ్చయించి, డబ్బిచ్చి, బహుమానాలిచ్చి, వేరే పుస్తకాలు రాయించారు. వీరేశలింగంగారు రాసినటువంటి రాజశేఖర చరిత్ర అలాంటిది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? పాఠం చెప్పడానికి యోగ్యమైన పుస్తకాలు మన సాహిత్యంలో లేవు. యోగ్యమైన పుస్తకాలు మీరు రాయండి. మీవన్నీ అవినీతికరమైన గ్రంథాలు. ఈ మాట సి. ఆర్. రెడ్డిగారు కూడా అన్నారు. మన పుస్తకాల నిండా శృంగారం ఉంటుంది. ‘గర్భగుడి తలుపులు వేసిన తర్వాత మిగతావాళ్ళు అందరూ వెళ్ళిపోతారు కాని, కవి వెళ్ళిపోడు. కవి ఇంకా అక్కడే ఉంటాడు. వీళ్ళు చేసిన పనులన్నీ వర్ణిస్తాడు మనకి’ అని సి.ఆర్. రెడ్డిగారు మన ప్రబంధాల గురించి మనకి ఏవగింపు కలిగించారు.

అలాంటి సి. ఆర్. రెడ్డిగారిని మనం ఆధునిక విమర్శకి ఆద్యుడుగా కీర్తిస్తున్నాం. మనకి నీతి లేదు అని నిర్ణయించిన పాలకులు వచ్చి మీకు నీతి బోధించే పుస్తకాలు ఏవన్నా ఉన్నాయా, అవి పాఠాలు చెప్పడానికి వీలుంటుందా అని అడిగారు. అప్పుడు మన పండితులు ఏం చేశారు? ఓహో మాకు సంస్కృతంలో నీతి అనే మాట ఉంది. నీతి అంటే మోరల్‌కి అనుకూలమైన మాట అన్నారు. అంచేత పంచతంత్ర కథలు నీతి పుస్తకాలుగా చెప్పారు. తర్వాత భర్తృహరి సుభాషితాలు నీతి పద్యాలుగా చెప్పారు. శృంగారంతో సంబంధం లేనివి–అప్పిచ్చు వాడు వైద్యుడు లాంటి పద్యాలు–స్కూలు గోడల మీద రాయించారు. మనకి నీతి అనే మాటకి మోరల్ అనే అర్థం రావటం బ్రిటీష్వాళ్ళు వచ్చిన తర్వాతే జరిగింది. అంతకు ముందు నీతి అంటే పాలసీ అని అర్థం, పాలిటిక్స్ అని అర్థం. పొలిటికల్‌గా సమాజంలో పైకి ఎలా రావాలో చెప్పే పుస్తకం సుమతీ శతకం. ఇలాటి పుస్తకాలని బ్రిటీష్వాళ్ళకి కావలసిన నీతిగ్రంథాలుగా మార్చి, నీతి అనే మాటకి అర్థం కూడా మార్చాం మనం.

ఇంతవరకు మనం 19వ శతాబ్దం ముందు జరిగిన పని గురించి మాట్లాడుకొన్నాం. 20వ శతాబ్దంలో వచ్చిన సాహిత్యంపై కూడా మీరు పనిచేశారు. Hibiscus on the Lake అన్న కవితల సంకలనం కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు విశ్వనాథ సత్యన్నారాయణ పుస్తకాలు రెండు అనువాదం చేసి వాటికి చివరిమాటలూ రాశారు. ఆధునిక సాహిత్యం మీద మీరు చేస్తున్న పని గురించి కూడా కొంచెం చెప్తారా?

గత నలభై ఏళ్ళలో ఆధునిక కాలంలో వచ్చిన సాహిత్యంలో సాహిత్యం కన్నా, కవి చెప్పే అభిప్రాయాలకి విలువ ఎక్కువ ఏర్పడింది. కవి చెప్పే అభిప్రాయాలను బట్టి ఆ కవిత్వం మంచిదో కాదో నిర్ణయించే విమర్శకులు ఎక్కువౌతున్నారు. అభిప్రాయాలు చెప్పటం సాహిత్యం పని కాదు. అభిప్రాయాలు చెప్పడమే ప్రధానం అయితే కవిత్వం ఎందుకు, వ్యాసం రాసుకోవచ్చు కదా! అది మానేసి చూస్తే, సాహిత్యాన్ని ఎలా చర్చించాలి అనే దాన్ని గురించి కొన్ని కొత్త ఊహలు, కొత్త విధానాలు కొన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఈ పద్యం ఎందుకు మంచి పద్యం అంటే, పద్య నిర్మాణంలో విశేషమేమిటి, లేకపోతే వచన పద్యం అయితే, దాని పద్ధతి ఏమిటి, ఎందువల్ల ఇది మంచి పద్యం అవుతుంది, ఎందువల్ల మంచి పద్యం కాక పోతోంది–ఇలాంటివి చర్చించడం కోసం మనకి మంచి పద్ధతులు ఉండాలి. పద్యం అంటే ఏమిటో చెప్పే పద్ధతులు ఏర్పడాలి. (నేను వచన కవిత్వాన్ని కూడా పద్యమనే అంటున్నాను.) ఈ పని నేను నా కవితా విప్లవాల స్వరూపంలోనే మొదలు పెట్టాను. అందులో చాలా రకాల పద్యాలని ఏవి ఎలా విశ్లేషించాలో ఉదాహరణలతో సహా వివరించాను.

కాని కవిత్వమే కాదు ఈ మధ్య కథలు కూడా అనువాదం చేశారు కదా; చాసో కధల్ని కొన్ని తీసుకొని. అవన్నీ ఈ మధ్య ఒక పుస్తకంగా వచ్చాయి. చాసోనే ఎందుకు తీసుకున్నారు?

చాసో ప్రపంచ సాహిత్యంలో చెప్పదగిన స్థాయి ఉన్న కథకుడు. బుచ్చిబాబు, చలం కూడా అలాటి కథకులే. బుచ్చిబాబు కథలు కూడా అనువాదం చెయ్యాలనే కోరిక ఉంది నాకు. కథాసాహిత్యానికి మరీ అన్యాయంగా, అభిప్రాయాలతో దగ్గరతనం ఏర్పడిపోయింది. కథలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఆధారంగానే, మంచి కథా? కాదా? అనే నిర్ణయం ఏర్పడుతోంది. అలా కాకుండా, కథని కథగా చూసి, కథలో ఉండేటువంటి వ్యక్తుల జీవితాలకి, వాళ్ళలోని అంతర్గత ప్రపంచానికి, ప్రవర్తనలకి కావలసిన ప్రాధాన్యం ఇచ్చి రాసినవాడు చాసో. అందువల్ల చాసోనే తీసుకున్నాం. అందులో మేం చేసిన ప్రతిపాదన చాలామందికి నచ్చలేదు. ఆయన మార్క్సిస్ట్ కాడు అని మేం అన్నాం. ఆయన వ్యక్తిగా మార్క్సిస్టుని అనే అనుకున్నాడు. కాని రచయితగా మార్క్సిస్ట్ కాదాయన. ఆయన ఆధునికుడు అని మా ప్రతిపాదన. అది చెప్పడానికి ప్రయత్నం చేశాం మా పుస్తకంలో ఆయన గురించి రాసిన వ్యాసంలో. దాని మీద వచ్చిన విమర్శలు చూస్తే ఏం చెయ్యాలో తెలియలేదు నాకు. మనకి రచయితని రచయితగా చూసే అలవాటు ఇంకా ఏర్పడలేదు.

మీరు కన్యాశుల్కం నాటకాన్ని కూడా అనువదించారు కదా. దానికి అనుబంధంగా రాసిన వ్యాసంలో కన్యాశుల్కాన్ని మీరు వేరుగా విశ్లేషించారు. అలాగే గురజాడ ప్రతిపాదించిన ఆధునికత పైన చెప్పిన వలస కాలపు ఆధునికత (colonial modernity) కంటే భిన్నమైనదని అన్నారు. మీ ప్రతిపాదనలు ఇక్కడ తెలుగుదేశంలో అందరికీ రుచించినట్లు లేవు. మీరేమంటారు!

అవును నిజమే. నేను కన్యాశుల్కాన్ని చదివిన తీరు, వ్యాఖ్యానించిన విధానం, తెలుగువాళ్ళకి లోకవిరుద్ధంగా కనిపిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా గురజాడని వీరేశలింగం అనుయాయిగా చూడడం అలవాటు చేశారు మన విమర్శకులు. ఆ చట్రం దాటి కన్యాశుల్కం చదవలేరు చాలామంది. కాని, చదివిన కొద్దిమంది నా వ్యాఖ్యానాన్ని అర్థంచేసుకున్నారు. గురజాడ తన నాటకంలో ప్రతిపాదించిన ఆధునికత వలస కాలపు ఆధునికతని తిరస్కరించే ఆధునికత అనీ, ఆయన సమాజానికి సంస్కారం అవసరం లేదన్నాడని, అందుకే మధురవాణిని, గిరీశాన్నీ అంత బలమైన పాత్రలుగా చిత్రించాడనీ నా ఆలోచన. ఆ నాటకంలో బలహీనమైన పాత్ర ఏదన్నావుంటే, అది సౌజన్యారావు పంతులుది. నాటకంలో చివరి రంగంలో మధురవాణి మాటలనీ, సౌజన్యారావు ఓటమినీ నేను వాక్యం వాక్యం పరిశీలించాను. ఆమె మాటల్లో సౌజన్యారావు తనకి దొరికాడని ఆమె గ్రహించిన తరవాత వొచ్చిన మార్పుని ప్రత్యేకంగా చూపించాను. మాటల్లో ఓడిపోయిన సౌజన్యారావుకి, ఓడిపోయాననే భావం కలగనియ్యకుండా మధురవాణి ఆయన దగ్గిర్నుంచి భగవద్గీత తీసుకుని, కృష్ణుడు యాన్టీ నాచ్ కాడాండీ అని అడగడంలో కొంటెతనం గుర్తించి, సౌజన్యారావు తాను స్వయంగా భగవద్గీత చదవలేదని గురజాడ సూచించడం ప్రస్తావించాను. సంఘానికి సంస్కారం కావాలని, అమాయకంగా నమ్మిన ఈ పెద్దమనిషి, భగవద్గీతని తప్పుగా కోట్ చేస్తూ, బైబిల్ పుస్తకాలు పంచిపెట్టే క్రిస్టియన్ మిషనరీలా భగవద్గీత ఇవ్వడంలో గురజాడ చూపించిన వ్యంగ్యాన్ని వివరించాను. ఇవేవీ తెలుగులో ఎవరికీ పట్టలేదు. టాగూరు వలస కాలపు ఆధునికతకు ప్రతినిధి అని, ఆయన వలస కాలంలో బ్రిటిష్ వాళ్ళ ప్రభావం వల్ల వచ్చిన మార్పుల్ని నిరాటంకంగా ఒప్పుకున్నాడని, ఆయన్ని తలకెత్తుకుని గురజాడని ఆ వరసలో ఆధునికుడని చెప్పడం మనం చేసిన పొరపాటు. తెలుగు దేశంలో ఇంగ్లిషు వొచ్చినవాళ్ళు చాలా మంది వున్నారు, ఆలోచించడం వొచ్చినవాళ్ళు కూడా ఎక్కువ మంది వుంటే బాగుండునని నా ఆశ. కానీ ఈ సంభాషణ ఎక్కడో ఒక చోట మనం ఆపాలి.

మీ చిట్ట చివరి పుస్తకం మనుచరిత్ర అనువాదం, అనుబంధ వ్యాసంతో Murty Classical Library of India Seriesలో వచ్చింది. దానిని ఇక్కడ ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. అలాగే మీరు పురాణాలను, తెలుగులో స్త్రీల రామాయణపు పాటలను, పల్నాటి కథ, కాటమరాజు కథ, సన్యాసమ్మ కథ, కామమ్మ కథల వంటి కథలను కూడా విశ్లేషణ చేశారు. మీరు రాసిన ఒక 20 వ్యాసాలు ఈ మధ్యనే ఇండియాలో ఒక సంకలనంగా ప్రచురింపబడి బైటకు రాబోతున్నాయి (Text and Tradition in South India, 2016). ఇప్పుడు ప్రస్తుతం దేని మీద పనిచేస్తున్నారు?

ఇంకో నాలుగు పుస్తకాల మీద పని చేస్తున్నాను. ఏది పూర్తవుతుందో తెలియదు. పాండురంగ మాహాత్మ్యం అనువాదం చేస్తున్నాను, డేవిడ్ షూల్మన్‌తో. హర్షిత కామత్, నేనూ కలిసి పారిజాతాపహరణం అనువాదం పూర్తి చేశాం. అది కూడా Murty Classical Library of India Series లోనే వస్తుంది. ఇంకా ఉన్నాయి పూర్తి అయినవి, కావలసినవి. జాషువా గబ్బిలం చేశాను. బుచ్చిబాబు తిష్యరక్షిత చేశాను. దాన్ని గురించి నా ఆలోచన ఇంకా తెగలేదు. బుచ్చిబాబు తిష్యరక్షిత రెండుసార్లు రాశారు. మొదటిది చిన్నది. అది ‘భారతి’లో అచ్చయ్యింది, అది నాకు దొరికింది. రెండవది పెద్దది. దానిని విజయవాడలో 1964లో విశ్వవాణి పబ్లికేషన్స్ వాళ్ళు బుచ్చిబాబు నాటికలు అన్న పుస్తకంలో అచ్చు వేశారు. అందులో ఒక ముఖ్యమైన జాగాలో వాక్యాలు తికమకగా అచ్చయ్యాయి. అది ఎలా సవరించాలో నాకు తెలియడంలేదు. ఈ పెద్ద నాటకం బుచ్చిబాబుగారు మొదటిగా ఆకాశవాణివారి ‘వాణి’ పత్రికలో ప్రచురించారట. ఆ కాపీ నాకెక్కడా దొరకలేదు. అది దొరికేదాకా నా సమస్య తీరదు. ఇంక పోతే కంప్యూటరులో ఎప్పుడు చూసినా పూర్తి కానివి ఇంకో పది కనిపిస్తాయి. ఎప్పుడు పూర్తి చెయ్యగలుగుతానో!

ఇన్ని చేసినా, ఇక్కడ తెలుగు దేశంలో మీ పని ఎవరికీ తెలిసినట్టు లేదు. ఇంకా తెలుగు సాహిత్యం ఇంగ్లీషు లోకి రావాలి అంటుంటారు. మీరు తెలుగు సాహిత్యం ఇంగ్లిషు లోకి తెచ్చి ఊరుకోలేదు, తెలుగు సాహిత్యాన్ని తెలుగువాళ్ళకి తెలియజెప్పారు కూడా. ఆ సంగతి తెలుగు వాళ్ళు గమనిస్తారని ఆశిస్తాను. చాలా విషయాలు చెప్పారు. నమస్కారం.