అర్బిల్ నుంచి బాగ్దాద్ వెళ్ళే బస్సులతో కుర్దిస్తాన్ స్క్వేర్‌లో ఉన్న బస్సు స్టాండు నిండి ఉంది. మహమూద్ కారు పార్క్ చేశాడు. కారులోంచి శ్రీనివాసరావు దిగాడు. ఆ దిగడంలో తొట్రుపాటూ, బెదురూ ఉన్నాయి. అతను సాయంత్రానికి బాగ్దాద్ చేరగలడో లేడోనని భయపడ్తున్నాడు, వెళ్తే అక్కడ నుంచి బొంబాయి వెళ్ళే విమానం ఆరోజు బయలుదేర్తుందో లేదో అనుమానం. ఒకసారి వెంకటేశ్వరస్వామికి మనస్సులో దండం పెట్టుకొన్నాడు. దార్లో యూనివర్సిటీ ఆఫీసు పక్కనున్న మసీద్ కనిపిస్తే ఏ విధంగా ప్రార్థిస్తే అల్లా పలుకుతాడో తెలియకపోయినా అల్లాని తనకి తెలిసిన విధంలో ప్రార్థించాడు.
శ్రీనివాసరావునక్కడే నిలబడమని మహమూద్ బస్సు స్టాండంతా కలయదిరిగి తెలిసిన డ్రైవర్‌ని పట్టుకొని శ్రీనివాసరావుని బాగ్దాద్ జాగ్రత్తగా చేర్చమని చెప్పాడు.
“ఆ డ్రైవర్ పూర్వం మన యూనివర్సిటీలో డ్రైవర్‌గా ఉండేవాడు. తెలిసినవాడు. అతనికి అన్నీ చెప్పాను. మనం సామాను ఎక్కిద్దాం.” అంటూ మహమూద్ సగం శ్రీనివాసరావు సామాన్లు చేతిలోకి తీసుకొన్నాడు. శ్రీనివాసరావు మిగిలిన సగం చేతిలోకి తీసుకొన్నాడు.
ఇద్దరూ కలిసి బస్సు కింద భాగంలో ఉన్న అరల్లో సామాన్లు పెట్టారు. డ్రైవర్ దానికి తాళం పెట్టాడు. బాగ్దాద్ వెళ్ళే బస్సులు ఏ వరుసలో వచ్చాయో ఆ వరుసలోనే వెళ్తాయి. దేనికీ నిర్ణీతమైన టైము లేదు. నిండగానే బయల్దేరటమే. శ్రీనివాసరావు సామాన్లు పెట్టిన బస్సు క్రమంలో అయిదోది. అప్పుడు ఉదయం తొమ్మిది గంటలైంది. కనీసం బస్సు పదకొండు గంటలకైనా బయిల్దేరకపోదు. మహమూద్ సెలవు తీసుకొన్నాడు. శ్రీనివాసరావు ఒంటరివాడైపోయాడు.
శ్రీనివాసరావు కాకుండా ఆరోజు మరో ఇద్దరు బాగ్దాద్ నుంచి అదే విమానంలో బొంబాయి వెళ్తున్నారు. అందులో శివస్వామి తెలుగువాడే. “కల్సే వెళ్దాం” అన్నాడు శ్రీనివాసరావుతో. శ్రీనివాసరావు “మనం కల్సిరాలేదు. కల్సి వెళ్ళడం ఎందుకు?” అన్నాడు. శివస్వామి అసలే నాస్తికుడు. ఇనుముతో ఉన్న నిప్పుకి సమ్మెట పోట్లు తప్పవు. అతని దురదృష్టం తనకి అంటుకొంటుంది అనుకొన్నాడు శ్రీనివాసరావు.
జీతంలో సగం ఇరాకీ ప్రభుత్వం ఇండియా తీసుకువెళ్ళనిస్తుంది. ఆ డబ్బు డాలర్లలోకి మార్చుకోడానికి ఎంత శ్రమ పడవలసివచ్చింది! బుధవారం రఫీదియాన్ బ్యాంక్‌కి శివస్వామితో కలసి వెళ్ళాడు. ఏమైంది? పని ఏమీ కాలేదు! సరిగ్గా పదిహేనురోజుల క్రితం హఠాత్తుగా మోసుల్ వెళ్ళి అనుమతి తెచ్చుకొంటేగాని డాలర్లు ఇవ్వమన్నారు. మోసుల్‌లో ఫారిన్ ఎక్ఛేంజివారు అప్లికేషన్ తీసుకొని అనుమతి పత్రం ఆర్బిల్‌కి తామే పంపిస్తామన్నారు. ఇరాకీ ఎయిర్‌లైన్స్‌వారు ‘వెయిటింగ్ లిస్టులో పెట్టాం నీ పేరు’ అన్నారు. అప్పుడు తను శివస్వామితో మోసుల్ వెళ్ళాడు. క్రితం రోజు శుక్రవారం సెలవుదినం. అదృష్టం కొద్దీ గురువారం నాటికి ఏర్‌లైన్స్ సీట్ కన్ఫర్మ్ చేసింది. బ్యాంకు డాలర్లు ఇచ్చింది. అప్పుడు శ్రీనివాసరావు శివస్వామి లేకుండా ఒక్కడే వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు. మిగిలిన దీనార్లతో బంగారపు గొలుసు కొన్నాడు. శ్రీనివాసరావు మెడ తడుముకున్నాడు. గొలుసు త్రీపీస్ సూట్‌లో చొక్కా క్రింద క్షేమంగా ఉంది. చొక్కా మీద ఉన్న టై దాన్ని చేతుల స్పర్శకి సులభంగా తెలియకుండా దాచి ఉంచింది. శ్రీనివాసరావు కనకధారాస్తవం చెయ్యగా ఇరాక్ రాగలిగాడు. ఇరాక్‌లో ఉన్నన్ని రోజులు దాన్ని దీక్షగా పఠించాడు. అందుకనే ఇరాక్ యుద్ధంలో మునిగి ఉన్నా డబ్బు ఇండియాకు తీసుకువెళ్ళడం సాధ్యమౌతోంది. భార్యతో రమారమి అరవైవేలు పంపించాడు. ఇప్పుడు మరో అరవై వేలు తను తీసుకువెళ్తున్నాడు. లక్ష పైగా ఒక సంవత్సరంలో దాచడం మాటలా! దైవానుగ్రహం ఉంటే తప్పించి!
1987వ సంవత్సరం జూన్ నెల చివరికి వచ్చేసింది. రోజూ ఉష్ణోగ్రత మధ్యాహ్నం 45 సెల్సియస్ దాకా ఉంటోంది. శ్రీనివాసరావు ఎన్నో పొరలున్న దుస్తులు వేసుకొన్నా గాలిలో తేమ లేకపోవడం వల్ల ఇబ్బందిగా లేదు. పది గంటలైంది. రెండో బస్సు బయల్దేరటానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ మిశ్రా కుటుంబంతో వచ్చి హడావిడిగా సామాన్లని కుటుంబాన్ని మూడో బస్సులో ఎక్కించాడు. మూడోది నిండితే గాని బయల్దేరదు. శ్రీనివాసరావు మిశ్రాని దూరం నుంచే పోల్చుకొని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న బస్సు చాటుకి తప్పుకొన్నాడు. అయితే అది వెంటనే బయల్దేరి శ్రీనివాసరావుకి మరుగు లేకుండా చేసింది. శ్రీనివాసరావు మిశ్రా భార్య కళ్ళబడ్డాడు. ‘భాయి సాబ్’ని ఆమె భర్తకి చూపించింది. అతను వెంటనే ‘శ్రీనివాస్!’ అని పిలుస్తూ బస్సు దిగాడు. శ్రీనివాసరావుకి తప్పలేదు. మిశ్రా చాచిన చెయ్యిని కుదిపాడు.
“బాభీ, పిల్లలు ఎల్లా ఉన్నారు? అన్ని సమస్యలూ తీరాయా?” అని అడిగాడు.
సరిగ్గా ఆ ప్రశ్ననే శ్రీనివాసరావు తప్పించుకోవాలని ప్రయత్నించాడు. మిశ్రాకి కనబడక తప్పలేదు. అతను ఆ ప్రశ్న అడగకా మానలేదు.
శ్రీనివాసరావు ఓ ఇబ్బంది నవ్వు నవ్వి “బాగానే ఉన్నారు” అన్నాడు. సమస్య తీరిందో లేదో చెప్పలేదు.
“మీరూ మా బస్సులోనే వస్తున్నారా?”
“లేదు. ఆ తరువాత బస్సులో వస్తున్నాను.”
“చోటుంది కదా, ఇందులో రాకూడదా?”
“ఇంకో దాంట్లో సామాను పెట్టాను. పైగా కొద్దిగా వేరే పనుంది.” అని శ్రీనివాసరావు చిన్న అబద్ధం ఆడాడు. నిజానికి మహమూద్‌కి తెలిసినవాడి బస్సులో వెళ్ళటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని తెలిసినా అతనికి మిశ్రాతో పాటు ప్రయాణం చేయటం ఇష్టంలేదు.
డాక్టర్ మిశ్రా ఉన్నంతసేపు శ్రీనివాసరావు ముళ్ళమీద నిల్చున్నట్టే నిల్చున్నాడు. మూడో బస్సు పదకొండయ్యేసరికి కదిలింది. శ్రీనివాసరావు తన ఆలోచనల తోడుగా మిగిలిపోయాడు. డాక్టర్ మిశ్రా ఇండియాలో మళ్ళా ఎక్కడా తనకి తగలకూడదని కోరుకున్నాడు. సరిగ్గా ఆరు నెలల క్రితం అతనితో పరిచయం కోసం శ్రీనివాసరావు తహతహలాడాడు. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా వుంది పరిస్థితుల్లో. అప్పుడూ శ్రీనివాసరావు భయపడ్డాడు. ఇప్పుడూ శ్రీనివాసరావు భయం పడ్తున్నాడు. అప్పుడు భయనివారణకి డాక్టర్ మిశ్రా సాయం కోరాడు. అదే మిశ్రా ఇప్పుడు భయకారణం.
శ్రీనివాసరావు సెప్టెంబర్‌లో ఇరాక్ వచ్చాడు. అతను బొంబాయిలో విమానం ఎక్కుతున్నప్పుడు అతని భార్య, కొడుకు గట్టిగా చెప్పారు ఇరాక్ వెళ్ళగానే తమని తీసుకువెళ్ళే ప్రయత్నం చెయ్యమని. శ్రీనివాసరావు అమెరెకాలో పిహెచ్.డి చెయ్యటానికి వెళ్ళినప్పుడు పెళ్ళాన్ని, పసివాడైన కొడుకుని ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళాడు. పిహెచ్.డి చెయ్యటానికి అయిదేళ్ళు పట్టింది. ఈసారి ఇరాక్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలుండిపోతాడో అన్న భయంకొద్దీను, విదేశాలు చూడాలనే సరదాకొద్దీను వీళ్ళు శ్రీనివాసరావుకా విషయం ఉత్తరాల్లో ప్రతీ వారం గుర్తుచేయసాగారు. అయితే శ్రీనివాసరావు కొడుకు తొమ్మిదో క్లాసు చదువుతూ ఉండటంచేత వేసంగి వరకు ఆగితే కాని ఎక్కువ రోజులుండటానికి వీలవదు. డిసెంబరు సెలవలకి వస్తే వెంటనే వెళ్ళిపోవాలి. తండ్రి తోనో, భర్త తోనో ఉండిపోడానికి వచ్చేవారికి మాత్రమే యూనివర్సిటీ ఎయిర్ టికెట్స్ ఇస్తుంది. అదీ సమస్య. శ్రీనివాసరావు తన భార్యాపుత్రులు తనతో ఉండటానికి వస్తున్నారని చెప్పి టిక్కెట్లిప్పించుకొని వాళ్ళని డిసెంబర్‌లో రప్పించుకొన్నాడు.
సంక్రాంతి వెళ్ళగానే ఇండియన్ డాక్టర్లతో కోరి పరిచయం పెంచుకొన్నాడు. అందరిలోకీ డాక్టర్ మిశ్రా కాస్త స్నేహశీలిగాను ఉపకారబుద్ధి ఉన్నవాడుగాను కనిపించాడు. అతన్ని, అతని కుటుంబాన్ని భోజనానికి పిలిచాడు.
“మీవాడు సంవత్సరం మధ్యలో వచ్చాడు కదా! చదువు పాడవదా?” అని డాక్టర్ మిశ్రా అడిగాడు.
శ్రీనివాసరావుకి సరిగ్గా కావాల్సింది అదే! తన గోడు చెప్పుకొన్నాడు. తన మాట వినకుండా కొడుకు వచ్చాడని, కొడుకుని స్వంత ఖర్చు మీద వెనక్కి పంపడానికి తనవద్ద డబ్బు లేదని, అల్లా అని డబ్బు సమకూడే వరకు కొడుకు ఇక్కదే వుంటే చదువు పాడవుతుందని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశాడు.
“యూనివర్సిటీ ఖర్చులో పంపాలంటే హెల్తుగ్రౌండ్స్‌లోనే పంపాలి. లేకపోతే మీ ఉద్యోగం పూర్తయ్యేవరకు ఇక్కడుంటే అప్పుడు యూనివర్సిటీ టిక్కెట్లిస్తుంది.” అన్నాడు డాక్టర్ మిశ్రా.
అనుకొన్న దారిలోకి డాక్టర్ మిశ్రా రాగానే, “అవునా! మావాడికి ఈ వెదర్ పడటంలేదు. డస్ట్ ఎలర్జీ ఉంది. ఆ కారణం సరిపోతుందా?”అని అడిగాడు శ్రీనివాసరావు. మిశ్రా సరిపోతుందని, మర్నాడు ఆసుపత్రికి వస్తే పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తానని చెప్పాడు.
మిశ్రా దయవల్ల శ్రీనివాసరావు కొడుకును యూనివర్సిటీ ఖర్చు మీద వెనక్కి పంపాడు. శ్రీనివాసరావు పథకం పారింది.
అతనికి, భార్యకి హద్దులేని ఏకాంతం దొరికింది ఎన్నో సంవత్సరాల తరువాత. పైగా కొడుకు వెళ్ళిపోయేసరికి ఇరాన్ అర్బిల్ మీద బాంబులు వెయ్యటం మొదలుపెట్టింది. శ్రీనివాసరావు భార్య సైరన్ల కూతలకి, విమానాల రొదలకి, బాంబుల ధన్‌ధన్‌లకి, ఉంటున్న ఇల్లు అదురుడికి విపరీతంగా భయపడిపోతూ అతన్ని కరుచుకుపోయేది. ఇరాన్ ప్లేను కూలిపోయాక బాంబులు పడటం తగ్గిపోయింది కాని కుర్దీల తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. రాత్రంతా వాళ్ళ కళ్ళముందు దీపావళి బాణసంచాలాగా తుపాకుల తూటా వెలుగులు, చెవులకి శబ్దాలు. హద్దులేని ఏకాంతం, యుద్ధ భయం, భీభత్సం ఆలుమగలని అనేకసార్లు ఏకం చేశాయి. శ్రీనివాసరావు వస్తూ ఒక్కడే వచ్చిన కారణం చేత (నిరోధ్‌లు) ఏమీ తెచ్చుకోలేదు. ఎదిగిన కొడుకుతో ఇరాక్ వచ్చిన అతని భార్యా తేలేదు. ఇరాక్‌లో దొరకకపోతాయా అనుకొంది. అయినా అది శ్రీనివాసరావుకి సంబంధించిన శాఖ ఇండియాలో. అవి ఇరాక్‌లో దొరకకపోయాయి. యుద్ధంలో జననష్టం విపరీతంగా ఉండటం వల్ల తప్పనిసరి ఆరోగ్య పరిస్థితుల్లో తప్ప గర్భవిచ్ఛేదన దండనార్హమైన నేరంగా ప్రభుత్వం పరిగణిస్తుంది. ప్రతీ సంతానానికి ప్రభుత్వం అధిక భత్యం ఇస్తుంది. కొందరికి జీతం కంటే ఈ సంతానభత్యమే ఎక్కువగ ముడ్తుంది. అటువంటి దేశంలో శ్రీనివాసరావు భార్య గర్భందాల్చింది. అప్పుడు శ్రీనివాసరావుకి తప్పనిసరై మళ్ళీ డాక్టర్ మిశ్రా సహాయం కావల్సివచ్చింది. శ్రీనివాసరావు భార్య ఆరోగ్యవంతురాలవటం వల్ల గర్భస్రావం చెయ్యటానికి ఆరోగ్యశాఖ అనుమతివ్వలేదు. శ్రీనివాసరావు తన భార్య ఆరోగ్యం సరిగా లేదంటూ చేసిన వాదనను అంగీకరించక మరీ ఆలస్యం చేస్తే పొట్ట పెరిగి దాచటం కష్టమవుతుందని శ్రీనివాసరావు మేనెల మొదట్లోనే భార్యని పంపించేశాడు. యూనివర్సిటీకి ‘నా భార్య కొద్ది నెలలకి ఇండియా వెళ్తోంది. మీరు టిక్కెటివ్వండి. పైసారి ఆమె వచ్చి వెళ్ళటానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకొంటాను అని హామీ ఇస్తున్నాను’ అని హామీ వ్రాసిచ్చి ఆమెను అర్జెంటుగా ఇండియా పంపించి అక్కడ గర్భస్రావం జరిపేలా చేశాడు.
శ్రీనివాసరావు భార్య కడుపుతో ఉన్న విషయం మిశ్రాకి తెలుసుగాని ఇంకెవరికీ అంటే అర్బిల్‌లో వున్న ఇండియన్స్‌కి తెలియదు. అందుకని శ్రీనివాసరావు తన భార్య వెళ్ళిపోయాక యూనివర్సిటీలో ఉద్యోగం ముగిసి తను వెళ్ళిపోతున్న ఆ రోజు వరకు మిశ్రా తారసపడే అవకాశం ఉన్న అన్ని స్థలాలకి వెళ్ళటం మానుకొన్నాడు. నలభై అయిదేళ్ళ భార్య మళ్ళీ గర్భం దాల్చటం, యాభై ఏళ్ళ తను మళ్ళీ తండ్రి కాబోవడం, సిగ్గుపడాల్సిన విషయంగా భావించి అది ఎవరికీ తెలియకూడదని కోరుకొన్నాడు. తెలిసిన డాక్టర్ మిశ్రా కుటుంబాన్ని తప్పించుకొని తిరిగాడు.
శివస్వామి వచ్చాడు. నాలుగో బస్సులో ఎక్కాడు. అతనితో తను తరువాతి బస్సులో వస్తున్నట్టు చెప్పాడు శ్రీనివాసరావు.
“మంచిది.” అన్నాడు శివస్వామి.
బస్సుస్టాండులో షెల్టర్ లేదు. ఎడారి నీడలో వేడి తక్కువ ఉండదు. ఒకవేళ ఉండినా శ్రీనివాసరావుకి విపరీతంగా దాహం వేసింది. పెప్సీ కొనుక్కుని తాగాడు. దాంతో దాహం తీరకపోగా ఎక్కువైంది. కుర్దీ పిల్లవాడు మంచుగడ్డలు వేసిన నీళ్ళు అమ్ముతూ కనిపించాడు. మగవాళ్ళందరు ఎక్కువగా యుద్ధానికి పోవటంవల్ల, ఇరాక్‌లో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కష్టపడి పనిచేస్తూ ఉండటం మామూలే. ఆ కుర్రవాడమ్ముతున్న నీళ్ళు తాగటం శ్రీనివాసరావు కిష్టంలేదు.
‘ఇరాక్ వెళ్తున్నావు. తురకలకి ఎంగిలి పట్టింపు లేదు జాగ్రత్త!’ అని అతని బంధువులంతా అతను ఇరాక్ వెళ్తున్నాడని తెలిసినప్పుడు శ్రీనివాసరావుని ఆటలుపట్టించారు. ఇంతవరకు టీ, మజ్జిగ మొదలైన వాటిలో ఎంగిలి పట్టింపు వదిలిపెట్టినా మంచినీళ్ళ విషయంలో పట్టింపు వదిలిపెట్టలేకపోయాడు. బస్సుస్టాండు ఊడుస్తున్న అమ్మాయి పాతిక ఫిల్స్ (దీనార్లో నలభయ్యో భాగం) ఇచ్చి మంచినీళ్ళు అల్యూమినియం బొచ్చెతో తీసుకొని కరిచిపెట్టుకొని తాగింది శ్రీనివాసరావు చూస్తుండగా. ఆమె తాగాక ఆ బొచ్చెనే ఆ కుర్రాడు బక్కెట్టులో ముంచి నీరు నిండా తీసి శ్రీనివాసరావు దగ్గరకి వచ్చి ‘కావాలా?’ అని అడిగాడు. శ్రీనివాసరావు వద్దన్నాడు కాని ఆ కుర్రాడు శ్రీనివాసరావుని వదలక “నీకు అమితాబ్(బచన్) తెలుసా, హేమామా(లిని) తెల్సా?” అని విసిగించజొచ్చాడు.
కుర్దీలు సాధారణంగా తమని హింద్ దేశ వాసుల బంధువులమనుకొంటారు. ‘మీరూ మేమూ కూడా ఆరీ(ఆర్యు)లమే!’ అని చెప్తారు. కుర్దీ అంకెలన్నీ సంస్కృతంవే. తల్లిని ‘దాయి’ అని పిలుస్తారు. వాళ్ళు తనని తమవాడిగా అనుకొన్నంత దగ్గరగా శ్రీనివాసరావు వాళ్ళని అనుకోలేకపోయాడు, మతం వల్ల. ఆ కుర్రవాడు విసిగిస్తూనే ఉన్నాడు. ఎదురుగా బొచ్చెలో చల్లని నీళ్ళు. శ్రీనివాసరావు దాహం పెరిగిపోయింది. డాక్టర్ మిశ్రా మామూలుగా కబుర్లలో ‘కుర్దీల దగ్గర జబ్బులేం ఉంటాయి నా మొహం. మహా అయితే గొంతునొప్పి అంటుకోవాలి వాళ్ళనుంచి’ అని అనేవాడు. అతనికి ఆ విషయం గుర్తుకు వచ్చిందిప్పుడు. శ్రీనివాసరావు ఎంగిలి పట్టింపు విడిచిపెట్టి మంచినీళ్ళు తాగాడు. అప్పటికి పన్నెండున్నర అయింది టైము.
అతని సామాన్లు పెట్టిన బస్సు డ్రైవరు ఛాన్సు తరువాతది అనుకొంటుంటే కాదని మధ్యలో మరో బస్సుందని తేలింది. శ్రీనివాసరావుకి కంగారు మొదలైంది. ఆ బస్సులోంచి సామాను తీసి రెడీగా ఉన్న బస్సులో ఎక్కించే లోపల రెడీగా ఉన్న బస్సు నిండిపోయింది.
“కిర్‌కుక్ రెండున్నర లోపల దాట్తామా?” అని భయంగా అడిగాడు ఆ పాత యూనివర్సిటీ డ్రైవర్ని.
“నాది బాధ్యత.” అన్నాడతను. ఫారినర్స్‌ని రెండున్నర తరువాత కిర్‌కుక్‌లో బాగ్దాద్ వైపు వదలరు. ఆ రాత్రి అక్కడ హోటల్లో ఉండిపోవల్సిందే. ఈ శనివారం విమానం మిస్సయితే మళ్ళీ శనివారందాకా విమానం లేదు. అందులో మళ్ళీ చోటుండక పోవచ్చు.
శ్రీనివాసరావు బస్సు ఒంటిగంటంపావుకి బయల్దేరింది. ఎయిర్ కండిషన్‌డ్ బస్సు అవటం వల్ల ప్రాణానికి హాయిగా ఉంది. ‘ఏడుకొండలవాడా! మక్కా మదీనావాడా! మా బస్ కిర్‌కుక్ దాటేలా చూడు! కాదు కాదు బస్సెలాగో దాట్తుంది, నాతో దాటేలా చూడు బాబూ!’ అని దండం పెట్టుకొన్నాడు మనసులో.
దార్లో యూనివర్సిటీ ఆఫీసు, ఇంజినీరింగ్ కాలేజి బస్సు దాటింది. బస్సులకి కండక్టర్లుండరు. వెనకవాళ్ళు ముందరవాళ్ళ చేతులకి తమ టిక్కెట్టు మొత్తం చెల్లిస్తారు. అది డ్రైవరు దగ్గరకు వెళ్ళగానే అతను ఎవరికి రావలసిన చిల్లర వాళ్ళకి అందజేస్తాడు. ముందు ప్రయాణీకుడు, “నీ సామాన్లకి మరో దీనారు ఇమ్మంటున్నాడు డ్రైవరు.” అని చెప్పి శ్రీనివాసరావు దగ్గర తీసుకొని డ్రైవర్‌కి అందజేశాడు.
రెండుంపావుకి కిర్‌కుక్ ఆయిల్ రెఫైనరీ కనిపించింది. ‘అమ్మయ్య!’ అనుకొన్నాడు శ్రీనివాసరావు కిర్‌కుక్ చేరబోతూ, చెక్‌పోస్ట్ దాటగానే.
బస్సు కిర్‌కుక్‌లో ఆగింది. శ్రీనివాసరావు దిగి మజ్జిగ తాగాడు.
శ్రీనివాసరావు ఒకటిన్నర నెలల క్రితం తను కిర్‌కుక్ రావటం గుర్తుకి వచ్చింది.
శ్రీనివాసరావు భార్య ఇండియా తిరిగి వెళ్ళిపోయాక ఒక గురువారం శ్రీనివాసరావుకి పి.జి. విద్యార్థి షాహీన్ కిర్‌కుక్ వచ్చి తనతో గడపవలసిందిగా శ్రీనివాసరావుని కోరాడు. కిర్‌కుక్‌లో ఆయిల్ రెఫైనరీని చూపించటానికి తనకి అధికారం లేదని, కాని తాను ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయటం వల్ల ఆ కెనాల్ సిస్టం అంతా చూపిస్తానని చెప్పాడు. విదేశీయుల కదలికలమీద చాలా ఆంక్షలు ఉండటం చేత, వచ్చిన అవకాశం శ్రీనివాసరావు వదులుకోదల్చుకోలేదు. కాని ఎంగిలి పట్టింపు! అన్నం వండగానే అతనికి పెట్టేది విడిగా పెట్టాలని చెప్పాడు. షాహిన్‌కి అర్థంకాకపోయినా సరేనన్నాడు. అతను ఎమ్మెస్సీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌కు గైడుగా శ్రీనివాసరావుని ఎన్నుకొన్నాడు.
అనుకొన్న విధంగా ఒక గురువారం పొద్దున్న కాలేజీలో పని ముగియగానే ఇద్దరూ షాహీన్ కార్లో కిర్‌కుక్ బయల్దేరారు. దార్లో చాలాచోట్ల సిపాయిలు కారాపి షాహీన్‌ని ప్రశ్నించారు. ‘నా ఉస్తాద్. కులియెట్ హందసా (ఇంజినీరింగ్ కాలేజ్)లో పనిచేస్తున్నారు’ అని చెప్పి తన ఐ.డి. కార్డు చూపిస్తూ వచ్చాడు. సిపాయిలు శ్రీనివాసరావుకి గౌరవంగా సలాములు పెట్టారు.
“కుర్దీలు విదేశీయుల్ని అపహరించి ప్రభుత్వానికి దొరికిన తిరుగుబాటుదార్లని ప్రభుత్వం విడిచిపెట్టే పక్షంలో తాము వారిని విడిచిపెడ్తామని బేరాలు పెడ్తారు. అందుకని విదేశీయులు ప్రమాదాల్లో పడకుండా ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకొంటుంది.” అన్నాడు షాహీన్.
శ్రీనివాసరావుకి తెల్సు. ఒకసారి శివస్వామి అర్ధరాత్రిదాకా ఊళ్ళో స్నేహితుల్ని చూసి టాక్సీలో వస్తుంటే పోలీసుల కారు అనుసరించి వచ్చి అల్లా రాత్రిపూట తిరగవద్దని హెచ్చరించారు. శ్రీనివాసరావు అందుకని చీకటి పడ్డాక ఎప్పుడూ బయట తిరగలేదు.
టైగ్రస్ నది నుంచి తవ్విన పంటకాల్వలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. అయితే ఇరాన్‌తో యుద్ధం రావటం వల్ల ప్రాజెక్టు పూర్తికాలేదు. పూర్తికాని భవనాలెన్నో అదే కారణంగా. ఇంజినీరింగ్ కాలేజీకి ఎదురుగానే ఉంది, అటువంటి భవనం ఒకటి.
ప్రాజెక్ట్ చూసుకొని షాహీన్ ఇంటికి వెళ్ళారు. అతను అతని భార్య ఖాజల్‌ని పరిచయం చేశాడు. ఆమె ఆదరంగా చెయ్యిచాపి కరచాలనం చేసింది. ఇరాక్‌లో అరబ్బు, కుర్దీ స్త్రీలు మగవారితో కరచాలనం చేయటం సామాన్య విషయమే.
అందుకని శ్రీనివాసరావు మొదట్లో ఆశ్చర్యపడినా, అలవాటు పడిపోయాడు. ఆ తరువాత, తన రెండు సంవత్సరాల కూతురు రోజ్‌నీను షాహీన్ చూపించాడు. ఆ పిల్ల చాలా ముద్దుగా ఉంది. అతనిల్లు ఉన్న ప్రాంతం శుభ్రంగా ఉంది.
టీ తాగాక, శ్రీనివాసరావు నడిచి ఊరు చూద్దామన్నాడు. షాహీన్ ఆ ఊరి రోడ్లన్నీ తిప్పాడు. ఆ ఊరు ఇండియాలో ఓ చిన్న పట్టణంలాగా ఇరుకుగా మురికిగా ఉంది. షాహీన్ మధ్యమధ్యలో ఆగి స్నేహితులను కౌగలించుకొంటూ ముందుకు సాగాడు. ఒక కారు పక్కన ఆగి అందులోంచి వయస్సు మళ్ళిన వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడివచ్చి శ్రీనివాసరావుతో ‘మా తండ్రిగారు’ అని పరిచయం చేశాడు, అతన్ని తీసుకువచ్చి. అతను ఏదో అన్నాడు. “మా నాన్నగారు మిమ్మల్ని తన ఇంటికి వచ్చి పావనం చెయ్యమంటున్నారు” అన్నాడు. “టైముంటే రేపు చూద్దాం” అన్నాడు శ్రీనివాసరావు.
తిరిగి వచ్చాక ఖాజల్ భోజనం ఏర్పాటు చేసి పిలిచింది. భోజనం నేలమీద ఏర్పాటు చేసింది. శ్రీనివాసరావుకిష్టం అని తెలుసుకొని వెన్నలో పప్పు వండి నెసిక్ చేసింది. శ్రీనివాసరావు వడ్డించుకొన్నాడు.
“నీ భార్య తినదా?” అని శ్రీనివాసరావు అడిగితే తరువాత తింటుందని, కుర్దీ స్త్రీలకి అతిథులకు కడుపునిండా తిండిపెట్టడంకు మించిన ఆనందం ఉండదని అన్నాడు షాహీన్.
శ్రీనివాసరావు బలవంతం చెయ్యగా నెసిక్‌లోని గరిటతో రెండుసార్లు నోట్లో వేసుకొని ఆ గరిట మళ్ళీ అందులో పెట్టింది. మజ్జిగ గిన్నెలోని మజ్జిగ కరిచిపెట్టుకొని తాగింది. ఇంక శ్రీనివాసరావు అవి మళ్ళీ ముట్టుకోక, “నాకివాళ కొంచెం ఆకలి తక్కువగా ఉంది” అన్నాడు భోజనం ముగించి. ఖాజల్ నొచ్చుకొంది.
భోజనం చేస్తున్నంతసేపు ‘కుర్దీలలో కన్యాశుల్కం వేల దీనార్లదాకా ఉంటుందని, తనది ప్రేమ వివాహం అని, తన భార్య తన స్నేహితుడి చెల్లెలనీ, అందుకని తను కన్యాశుల్కం చెల్లించలేదనీ’ చెప్పాడు షాహీన్.
“అంతంత కన్యాశుల్కాలు ఎందుకున్నాయి?” అని అడిగాడు శ్రీనివాసరావు.
భార్య తన బంగారం పుట్టింట్లోనే పదిలపరుస్తుందని, కన్యాశుల్కం డబ్బుతో సాధారణంగా బంగారం కొంటారని, అది ఒకవేళ ఆమెకి భర్త విడాకులిస్తే ఆమెకి ఆధారమౌతుందని చెప్పాడు.
“నువ్వు కన్యాశుల్కం చెల్లించలేదు కదా మరి, నువ్వు ఈమెను విడిచిపెడ్తే ఏం చేస్తుంది?” అని అడిగాడు శ్రీనివాసరావు. “మాలో చాలామందికి ఒక భార్య మించి ఎక్కువమంది భార్యలుండరు. నేను ఖాజల్‌ని విడిచిపెడ్తే మా నాన్నగారు మళ్ళీ నా మొహం చూడరు. ఎక్కడో కుసంస్కారులు కాని, సాధారణంగా భార్యల్ని విడిచిపెట్టరు. పూర్తిగా అనివార్యమైన పరిస్తితుల్లో ఒకరికి విడాకులిచ్చిగాని మరొకరిని చేసుకోరు. ఒకర్నే కొనుక్కోలేనివారు నలుగుర్నెలా కొనగలరు! చాలామంది ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం చేసి ఏ నలభయ్యో ఏటో పాతికేళ్ళ అమ్మాయిని చేసుకొంటారు. అప్పటికిగాని డబ్బు సమకూడదు కదా! యుద్ధంవల్ల, కన్యాశుల్కం వల్లా ఆడపిల్లలకి పెళ్ళికావటం కష్టం. పెళ్ళి అరబ్బు దేశవాసుల మధ్యే జరగాలంటుంది చట్టం.” అని వివరించాడు.
భర్త దుబాసీగా వ్యవహరించగా ఖాజల్ భారతదేశం గురించి తనకున్న సందేహాలు శ్రీనివాసరావునడిగి తీర్చుకొంది. ‘హిందూ స్త్రీలు ధరించే గాజులు తనకి చాలా ఇష్టం’ అని చెప్పింది. శ్రీనివాసరావు తన భార్య ఇండియా వెళ్ళిపోవటం వల్ల తన దగ్గర ఆ వస్తువులు లేవని చెప్పాడు వెంటనే.
“దయచేసి నా భార్య మిమ్మల్ని వస్తువులడిగినట్టు భావించవద్దు” అని షాహీన్ క్షమాపణలు చెప్పుకొనే ధోరణిలో చెప్పాడు.
భోజనానంతరం శ్రీనివాసరావుతో అతని థీసిస్ గురించి చర్చిస్తుండగా షాహీన్ తండ్రి వచ్చి ఒక్క మాట మాట్లాడకుండా గంటసేపు చేతులు కట్టుకొని కూర్చున్నాడు.
“ఆయన నీతో ఏదో మాట్లాడటానికి వచ్చినట్లున్నాడు. పాపం ఆయన పని చూడకూడదా?” అన్నాడు శ్రీనివాసరావు ఇబ్బందిగా.
“ఆయనకి నాతో పనిలేదు. కొడుకు గురువుకి ఆయన ఆవిధంగా గౌరవం చూపిస్తున్నాడు అంతే!” అన్నాడు షాహీన్ అది సాధారణం అన్న ధోరణిలో.
ఇండియా శిష్యుల తండ్రులదాకా ఎందుకు, శిష్యులు ఆమాత్రం గౌరవం చూపిస్తే అల్పసంతోషులైన గురువులు ఎంత సంతోషిస్తారో కదా! అనుకొన్నాడు శ్రీనివాసరావు.
షాహీన్ తండ్రి మరో అరగంట కూర్చుని మర్నాడు తమ ఇంటికి భోజనానికి రమ్మని శ్రీనివాసరావుని ఆహ్వానించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
మర్నాడు పొద్దున్న ఖాజల్ టీ డికాషన్‌లో బోలెడు పంచదార వేసి ఇచ్చింది షాహీన్‌కీ శ్రీనివాసరావుకీ. శ్రీనివాసరావు ఇరాక్ వచ్చిన మొదటి రెండు నెలల దాకా అతనికి పాలపొడి దొరకలేదు. అందుచేత పాలు లేని నల్ల టీకి అలవాటుపడే ఉన్నాడు.
“రెండు నెలలు ఎంత ఇబ్బందిపడ్డానో తెలుసా! పాలపొడి డబ్బా ఒకటి కూడా దొరకలేదు!” అన్నాడు శ్రీనివాసరావు షాహీన్‌తో సానుభూతినాశిస్తూ.
“అవును. ఇరాక్‌లో పాల ఇబ్బంది చాలా పెద్దది. నిజానికది ఇబ్బంది కాదు, కరవు. మా రోజనీ తల్లిపాలు మానేశాక పాలు తాగిన రోజులు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.” అన్నాడు షాహీన్, శ్రీనివాసరావు ఆశించిన సానుభూతి చూపించకుండా. ఇరాక్‌లో చంటిపిల్లలకే పాలు లేకపోతే తనకి పాలు లేవని ఎవరు సానుభూతి చూపిస్తారు! ఇన్నాళ్ళూ తనావిధంగా ఆలోచించలేదు అనుకొన్నాడు శ్రీనివాసరావు.
పొద్దున్న తినడానికి రొట్టె, మొసల్ (పెరుగు) తనియాగా (విడిగా) తెచ్చారు. రొట్టె పెరుగులో ముంచుకు తిన్నాడు. అదో కొత్త అనుభవం. అతను మిగిల్చిన పెరుగు మళ్ళీ ఖాజల్ ఫ్రిజ్‌లో పెట్టింది. తనకు ఇచ్చిన పెరుగు కూడా వాళ్ళు రొట్టె ముంచుకొని తినగా మిగిలినది కాదుకదా! అని అప్పుడు శ్రీనివాసరావుకి అనుమానం వచ్చింది. ఇంకా ఆ ఊళ్ళో ఉండి అక్కడ వారింట్లో మరో భోజనం చెయ్యలేక శ్రీనివాసరావు పనుందంటూ అర్బిల్ బయల్దేరాడు.
మార్చిలో మొదటి టర్మ్ పరీక్షలు పూర్తయ్యాయి. అప్పుడు శ్రీనివాసరావు పెట్టిన పరీక్షకి షాహీన్ పావుగంట ఆలస్యంగా వచ్చాడు. నూటికి 55 మార్కులు తెచ్చుకున్నాడు. పాస్ మార్క్ 60. అంటే షాహీన్ ఆ పరీక్ష మళ్ళీ సెప్టెంబర్‌లో రాయాలి. దానికి సప్లిమెంటరీ పరీక్షాపత్రం తయారుచేసి డీన్‌కి ఇచ్చి శ్రీనివాసరావు ఇండియా బయల్దేరాడు. షాహీన్ పరీక్షలో ఇంపార్టెంటు ప్రశ్నలు తెలుసుకోవటం కోసం తనని ఇంటికి పిలిచి మర్యాద చేశాడా? అన్న అనుమానం శ్రీనివాసరావుని వదలలేదు. అయినా శ్రీనివాసరావు షాహీన్‌కు తను నిర్మొహమాటంగా ఏ సహాయం చేయలేదు. అంటే ఆ నెసిక్‌ని తన దగ్గర ఉడకనీయలేదు. అప్పుడు అది గుర్తుకు వచ్చి నవ్వుకొన్నాడు.
అతను తాగిచ్చిన గ్రాసులో మజ్జిగ పోసి అమ్మే కుర్రాడు మరొకళ్ళకి ఇచ్చాడు. శ్రీనివాసరావు నవ్వుకొన్నాడు. దాహం తీరింది. శ్రీనివాసరావు ఎక్కి కూర్చున్నాడు. బస్సు బయల్దేరింది. ఇరాన్ బోర్డర్‌కి అతి దగ్గర్లో ఉన్న సులేమానియా ఊరుకి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతం గుండా బస్సు పోతోంది. దారి పక్కన మండుతున్న జీపులు, సిపాయిల శవాలు, క్షతగాత్రులతో నిండిన ట్రక్కులు కనిపించాయి. ఇరాక్‌లో బంకర్లలో సిపాయిలు అడుగడుక్కీ తగుల్తారు. ఎక్కుపెట్టిన తుపాకుల్తో సిద్ధంగా ఉంటారు. పొరపాట్న ఓ తుపాకి పేలి ఓ గుండు తగిలితే! శ్రీనివాసరావుకి భయం ఉండేది, ఆ విషయంలో మొదట్లో. అయితే అతనుంటున్న ఫ్లాట్‌కి దగ్గర్లో అనేక షెల్స్ అనేకసార్లు పడటంతో అలవాటుపడిపోయాడు. భయం పూర్తిగా తీరకపోయినా అతనికి నిద్ర వస్తోంది. ఆ క్రితం రాత్రి కుర్దీ తిరుగుబాటుదారులకి, ప్రభుత్వ సేనలకి భీకర పోరాటం జరిగింది. అతని ఫ్లాట్ పక్కనుంచి జనం పరిగెత్తుతున్న బూట్ల శబ్దాలు విని, బాత్‌రూమ్‌లోకి పోయి తలుపు వేసుకొన్నాడు. రాత్రంతా టాయిలెట్‌లోనే గడిపాడు. పొద్దున్న లేచి కర్టెన్లు తొలగించి చూస్తే ఎదురుగా మిలట్రీ ట్రక్. అందులో తుపాకీలు తనవైపే ఎక్కుపెట్టి కూర్చున్న సిపాయిలు కొందరు, టీ తాగుతున్నవారు కొందరు కనిపించారు. అంటే ఆ క్రితం రాత్రి ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో సిపాయిలు కుర్దీ తిరుగుబాటుదార్లని వెంటాడారన్నమాట. వీళ్ళంతా శ్రీనివాసరావు లాంటివారి రక్షణకి ఉండిపోయారన్నమాట.
రాత్రంతా ఆ విధంగా శ్రీనివాసరావుకి నిద్ర లేదు. అంతకుముందు మిలట్రీ ఆఫీసర్లు వచ్చి తిరుగుబాటుదార్లు అక్కడికి రావచ్చునని, విదేశీయులందరు తలుపులు వేసుకొని భద్రంగా ఉండాలని హెచ్చరించారు. కాని హాస్టల్లో ఉన్న విద్యార్థులు ‘ఉస్తాదుల్ని మావాళ్ళు ఎత్తుకుపోయినా హానిచెయ్యరు. గౌరవంగా చూస్తారు. పోతే గాడిదలమీద కొండల్లోకి ప్రయాణం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది’ అని ఆటలు పట్టించారు.
శ్రీనివాసరావుకి కొంచెం తిక్కరేగింది. “ఇంకెన్నాళ్ళు మీ ఆటలు? పదిరోజుల్లో పరీక్షలవగానే మిమ్మల్ని ప్రభుత్వం ఇరాన్ మీదకి యుద్ధానికి పంపుతుంది,” అని సానుభూతి లేకుందా అన్నాడు.
“మేము యుద్ధానికే వెళ్ళాలని ఏమీ లేదు,” అన్నాడందులో ఒకడు.
“ఏం చేస్తావ్?” అని అడిగాడు శ్రీనివాసరావు ఆశ్చర్యంగా.
“తిరుగుబాటుదారుల్లో జేరిపోతా.” అన్నాడతను. యుద్ధం చెయ్యక ఎల్లాగా తప్పదు. అక్కడికి ప్రభుత్వం కోసం కాక తమ స్వాతంత్రం కోసమే పోరాడవచ్చు అన్నట్టుగా. అందులో భయం ధ్వనించలేదు. క్రోధం ధ్వనించింది. ప్రభుత్వం వారి పల్లెల్ని నాశనం చేసినా, బంధువుల మీద కెమికల్ బాంబులు వేసినా వారికి ప్రభుత్వం పట్ల వినయం ఏర్పడలేదు. బుద్ధి రాలేదు! తురకలందరు మొండివారే అనుకొన్నాడు శ్రీనివాసరావు. విసిరేసినట్టు పల్లెల్లో ఉండే కుర్దీలను పట్టణాలకి తరలించే ప్రయత్నంలో ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తించింది మరి. పది రోజుల్లో ప్రయాణం పెట్టుకొని అతనికి గాడిదల మీద ఊరేగటం ఇష్టంలేదు. అప్రమత్తతతో మేలుకొని గడిపాడా పదిరోజులు.
బస్సులో చల్లదనానికి, అంతకు ముందు రాత్రుల నిద్రలేమికి శ్రీనివాసరావు నిద్రలోకి జారుకొన్నాడు.
బస్సు సాయంత్రం అయిదు గంటలవుతుండగా బాగ్దాద్ చేరింది. బస్సు దిగి టాక్సీలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాడు సామాన్లతో శ్రీనివాసరావు.
అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావుకి షాహీన్, అతని తండ్రి కనిపించారు. వాళ్ళవాళ్ళని ఎవరినో విమానం ఎక్కించడానికి వచ్చి, తిరిగి వెళ్ళబోతూ కనిపించారు. శ్రీనివాసరావు సామాన్లు టాక్సీలో వేసి మేడమీదకి చేరవెయ్యటంలో సహాయం చేశారు.
శ్రీనివాసరావు అందరికి పెప్సీలు కొన్నాడు. కస్టమ్స్‌లోకి ప్రవేశించడానికింకా అర్ధగంట వ్యవధి ఉంది.
“మీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్దామనుకొని మీరు మరోలా అర్థంచేసుకొంటారేమోనని చెప్పలేదు. నాకు మీ సబ్జెక్టంటే చాలా ఇష్టం. కాని పరీక్ష బాగా వ్రాయలేదు. బహుశా ఫెయిల్ అయివుంటాను,” అన్నాడు షాహీన్.
“అయ్యావు!” అన్నాడు శ్రీనివాసరావు.
“అయినందుకు బాధ లేదు. కాని మీరు నేను చదవలేదనుకొని ఉంటారని బాధ. కాని చదివే అవకాశం లేకపోయింది ఆ ముందు రెండు రోజులు,” అన్నాడు షాహీన్.
“ఎందుకని?”
“అదే చెప్తున్నాను. పరీక్షనాడు చెప్తే మీ నుంచి మార్కులు ఆశించి చెప్తున్నాననుకొంటారేమోనని చెప్పలేదు. పరీక్షకి రెండురోజుల ముందర మా పినతండ్రి, నలభైయేళ్ళవాడు, యుద్ధంలో చనిపోయాడు. అతని దేహం పరీక్ష ముందు రోజున మా ఊరు వచ్చింది. ఆ రాత్రంతా ఆ శవాన్ని పెట్టుకొని మసీద్‌లో కూర్చున్నాం. చుట్టాలందరూ వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. అందుకని చదవటం కుదరలేదు.”
“పరీక్ష ఉందని చెప్పలేకపోయావా? మీ వాళ్ళకి తెలియదా?” అని విసుగ్గా అడిగాడు శ్రీనివాసరావు. “ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేను తెల్సుకదా!”
“తెల్సు. కాని పరీక్ష ఉందని చెప్పి వెళ్ళిపోవడానికి కుదరదు మాలో. చనిపోయిన వ్యక్తికి అతి సన్నిహితులు నువ్వింక వెళ్ళవచ్చు అనేవరకు ప్రతీవాళ్ళు ఉండాలి. మా పిన్నికి పరీక్ష రోజు ఉదయం అంత దుఃఖంలోనూ నాకు పరీక్ష ఉందని గుర్తువచ్చి నన్ను వెళ్ళమంది పాపం. అప్పుడు బయల్దేరి ఇంటికి వెళ్ళి తయారై కార్లో బయల్దేరాను. కిర్‌కుక్ దగ్గర చెక్‌పోస్ట్ తెరిచాకగాని కిర్‌కుక్ వదలటానికి అవలేదు. అందుకే పరీక్షకి ఆలస్యమయ్యాను. మామూలుగా అయితే ముందురోజు హాస్టల్లో పడుకొనేవాడిని. ఈ విషయాలు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్దామనుకొని నేను సానుభూతిని కోరి చెప్తున్నట్టు మీరు అపార్థం చేసుకొంటారని చెప్పలేదు.” అన్నాడు.
శ్రీనివాసరావు మొదటిసారి కుర్దీల నిబ్బరానికి చలించిపోయాడు. “అందుకేనా అన్నిరోజులు నల్లబట్టలు కట్టుకొని కాలేజీకి వచ్చింది?” అనడిగాడు శ్రీనివాసరావు గుర్తుకు తెచ్చుకొని.
“అవును. అవి కూడా మా పిన్ని విడవమనే వరకు కట్టుకోవటం మా ఆచారం.” అన్నాడు.
“ఇటు యుద్ధంలోను అటు తిరుగుబాటులోను మీ కుర్దీలు నాశనమైపోతున్నారు,” అన్నాడు శ్రీనివాసరావు సానుభూతిగా.
“అవును. మాకు ఈ ఆయిల్ వద్దు. దానివల్ల వచ్చే డబ్బు వద్దు. ఈ యుద్ధం వద్దు. మేము శాంతియుతంగా బతికే జాతివాళ్ళం. ఇదంతా ప్రభుత్వం మాకు కట్టబెడ్తున్నది ప్రగతి పేరున, మతం పేరున.”
షాహీన్, తండ్రి మాటలను అనువదించి చెప్పాడు.
“అల్లా మాకెందుకో ఈ శిక్ష విధించాడు!” అన్నాడతనే మళ్ళీ బాధగా.
దేవుడిమీద విశ్వాసంతో మంచిరోజులకి ఎదురు చూస్తున్న రెండు తరాల కుర్దీలని విడిచి కస్టమ్స్‌లోకి ట్రాలీ తోసుకొంటూ వెళ్ళాడు శ్రీనివాసరావు.
‘ఇదే మన దేశంలో అయితే ప్రభుత్వాలు మారటానికి, స్కైలాబ్స్, మిస్సైల్స్, గ్రహాలు, గతులు తప్పటానికి నేతుల్తో పాలతో పూజలూ యజ్ఞాలూ చేయిస్తారు మన స్వాములు. మనకి భయం లేదు.’ అనుకొన్నాడు శ్రీనివాసరావు భయంతో బాగ్దాదు వదుల్తూ. ఇరాకీలకి ఆ సదుపాయం లేనందుకు ఓ క్షణం విచారించాడు.
(రచన పత్రిక 01-08-1992)