ప్రేమల కథలు

1969

మొట్టమొదటిసారి మనం
బస్సు స్టాప్‌లో కలుసుకున్నప్పుడు-

మనమెక్కాల్సిన బస్సు ఒక జీవిత కాలం లేటైతే-
ఎంత బాగుండునో ననిపించింది
ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే బస్సు
సరిగ్గా టైముకి వచ్చేసింది.
డ్రైవర్ కొట్టిన హారన్
నా గుండెల్లో మోగింది.

యువరాణిలా మెరుస్తూ
రాయంచలా నడుస్తూ
వస్తున్న నిన్ను చూస్తూ
నీకోసం ఆగి మరీ
నిను ముందుకు పోనిచ్చాను.
నువ్వలా బస్సెక్కుతున్నప్పుడు
తాచుపాము లాంటి నీ జడ తాకాలనిపించింది
నువ్వు పైమెట్టు నుంచి కాలు తీసి
బస్సు లోపల పెడుతున్నప్పుడు
నీ కాలి హైహీలు ముద్దెట్టుకోవా…

“ఖాళీ లేదు! ఖాళీ లేదు!”
కండక్టర్ అప్పారావు కాళ్ళూ చేతులూ అడ్డం పెట్టేశాడు.
బస్సుకి ప్రేమంటే తెలీదు. అందులో ఖాళీ లేదు.
అప్పారావుకు కాళ్ళూ చేతులే గానీ
గుండె ఏ కోశానా లేదు.
అందమైన అమ్మాయివి నీకైనా తెలీదూ
క్రీగంటో సారి చూసి కిసుక్కున నవ్వుతావూ?

ఎగసిపడే శ్వాసతో ఎదురుగా ఉన్న
హోటల్ తాగేద్దామని
కాఫీ కప్పులో దూరాను.

1975

ఈ చుట్టుకుచుట్టుకు పోతున్న
అల సొరంగమే అయితేనా
నువ్వూ నేనూ అందులో
ఒకళ్ళనొకళ్ళు అల్లుకుపోయి
పడుకుని…
ఎవరికి తెలుస్తుంది
సముద్రం హోరు
మన గుసగుస బుసబుసలేననీ
చంద్రుడు
మనల్ని అభినందించటానికి
ఆకాశం ఎగరేసిన బుడగేననీ*

1976

కలల చూసిన దాని
పిలువ బోయిన వాని
గళ విశాల పథాన
చెలిమి ఎదురై…

తెలిసి తెలియని దాని
వెదుక బోయిన వాని
ఉనికి ముంగిలి యందు
ఊత ఎదురై…

ఊహ చివురులు వేసి
ఈహ పూవులు పూసి
ఎందుకో ఈ వేళ
ఎడదలో స్వర మేళ!

1982

నీ చూపులు తట్టుకోటం కష్టం
నీకిది తెలుసన్నట్టుగానే చూస్తావ్
నీకు ముందు నాకు ఇద్దరమ్మాయిలు తెలుసు
నువ్వు వాళ్ళిద్దరిలాగానూ వుంటావ్

1984

ఈ పద్యం
రేపొచ్చే ఎండాకాలంలో నీకోసం దాస్తున్నాను.
నువ్వప్పుడు మధ్యాహ్నాల ఉక్కపోతలో
చెమట చెలమవై టీ తాగుతుంటావు.
నేను నా పుస్తకంలోంచి తలతిప్పకుండా
“ఎందుకు వంటినిండా అన్ని బట్టలు” అంటాను.
“అన్నేం లేవు!”
నీవన్నది నిజమా కాదా అని
నేను రెండు అయస్కాంత ధృవాలవైపు చూస్తాను.**

1996

నాట నై
నేనొక పాటనయ్యెదను
ఝంపె వై
శంపా నటనమాడెదవా!

పూతావితరగ నై
నే దువాళించెదను
వాసంతవని వై
నీ వవని నిండెదవా!

చంపకము నై
నే ఛందమయ్యెదను
ఉత్పలము నీవై
నా సరస విరిసెదవా!

నేను నీవై నీ ముందు నిలిచెదను
నీవు నేనై నను కౌగిలించెదవా!


* David Niven జ్ఞాపకాల రచన The Moon’s a Balloonలో ఉన్న E. E. Cummings కవిత Who knows if the moon’s a balloon … చదివి.
** 2,3,4లకు అప్పటి ఆంగ్ల రచనలు ఆధారాలు.