1.
లోకం తాగించిన
ఘాటు సారాయి
పూటుగా తాగి
మతి తప్పి
తిరిగాను
మది డస్సి
ఆత్మ బంధువని తోచి
వెంబడించానొకడిని
నేనెక్కడ దొరికాను నీకు?
అన్నాడతను హేళనగా
ఆత్మ జ్ఞానిగా భావించి
తోవ అడిగానొకడిని
నాకేమిస్తావు పిల్లా?
అన్నాడతను వెకిలిగా
ఆత్మకునిగా తలచి
దీపమడిగానొకడిని
నేనెందుకివ్వాలో?
అన్నాడతను విసురుగా
ధన్యవాదాలు నీకు
ఈ మనుషులని చూపినందుకు
చీకటిలోకి తోసినందుకు
మత్తులో ముంచినందుకు
బయటకి లాగినందుకు
ధన్యవాదాలు.
ఇదిగో, ఇక వస్తున్నా
కోట్ల మైళ్ళ దూరంనించి
ఎర్రని మంటల్లా
తల్లీ, నీ కళ్ళు.
2.
దీనికి సొట్ట పడింది
దానికి కిలుం పట్టింది
దీనికి మకిలి చేరింది
ఈ పాత్రలేవీ
పనికి రావు
పరమాన్నానికి
శుద్ధి చేసిన
వెండి పాత్రే
కావాలి
నైవేద్యానికి
కాళికి.