కాకిబొడ్డు

పెరట్లోంచి ఊపుగా వస్తోన్న కోస కూర వాసనని వీధిలో ముక్కారా ఆస్వాదిస్తున్న కొండూరి రామరాజుగారు తమ లోగిట్లోకి ఎవరో వస్తుండడం దూరంనుంచే గమనించారు. వస్తున్నదెవరా? అని ఆనవాలు పట్టడానికి వాలుకుర్చీలో జారబడిన వారల్లా వీపుని నిటారు చేసి మెడని ముందుకు చాపారు. పిల్లంకలో జరిగే వారప్పందేల్లో రామరాజుగారి కోళ్ళు ప్రతివారం క్రమం తప్పకుండా బరిలో దిగాల్సిందే. ఖచ్చితంగా పందెం పొడవాల్సిందే. అలాగని ఏనాడూ ఆయన ఆ పందేల ఛాయలకి వెళ్ళెరగరు.

మోతుబరి, యాభై ఎకరాల ఆసామి అయిన రామరాజుగారిని ఊళ్ళోవాళ్ళంతా పెదరాజుగారంటారు. బంధువర్గంలో వాళ్ళంతా రామమావయ్యనీ రామతాతయ్యనీ ఇలా ఏవేవో వరసలు పెట్టి పిలుస్తుంటారు. పేరుకి పెదరాజైనా ఆయన వయస్సు యాభైకి అటూ ఇటూ అంతే. మూడెకరాల కొబ్బరితోటలో వుంటది పెదరాజుగారి మండువా. ఆ తోటని ఆనుకునే వెనకవైపు పంటకాలవ. అది దాటితే ఏటిగట్టు. తూర్పుగాలి వీస్తే గోదారి ఘోష పెదరాజుగారి పెరట్లోకి వినిపిస్తూ వుంటుంది. మగమహరాజులకి మాత్రమే ఆ లోగిట వీధి ప్రవేశం. ఆడవారికి పెరటిదారే రహదారి. ఆ ఇంటి పద్ధతులలాంటివి. అంతా గోషా పాటించి తీరాల్సిందే.

“ఎవర్రా వచ్చేది?” పందెంకోడి దెబ్బలకి పసరు మందేసి, కుట్లు కుడుతున్న వాడపల్లిని అడిగారు.

చేస్తున్న పనాపి, అటు చూసిన వాడపల్లి “రాచపోలికంపడ్డంనేదుగానండీ తెల్లగుడ్డల్లో తనతన్నాడతన్నారు… సుట్టాలేవోండి,” చెప్పి తిరిగి తనపనిలో పడ్డాడు. వాడపల్లి కుట్లు కుడుతుంటే పుంజుని అటూ ఇటూ కదలకుండా బక్కడు గట్టిగా పట్టుకున్నాడు. తయారుతిండి తిని బాగా బలిసిందేమో! కోడి కండలోకి సూది దిగనని మొరాయిస్తోంది. దాంతో కోడిపుంజు ఉండుండి గట్టిగా కేర్‌మని అరుస్తూ బక్కడి చేతుల్లోంచి బయటపడడానికి గింజుకుంటోంది.

“వోసోస్ వత్తాదని! నానేసే సూదిపోటు, కద్దెబ్బకన్నా నెప్పెట్టేత్తందా? ఊరుకోయాస్!” అంటూ పుంజుని పోటుకీ పోటుకీ మధ్య అనునయిస్తున్నాడు వాడపల్లి.

హెర్క్యులస్ సైకిల్ జోరుగా తొక్కుకుంటూ సరాసరి వాకిట్లోకి వచ్చిన బాబయ్యని తేరిపార చూసిన పెదరాజుగారు “రండ్రండి మావగారు!” అంటూ కుర్చీలోంచి లేచి ఆహ్వానించారు.

పెదరాజుగారంతటివారు స్వయానా కుర్చీలోంచి లేచి ఎదురు సన్నాహాలు చేస్తున్నారంటే వచ్చింది లెక్కల్లో మనిషని కనిపెట్టిన బక్కడు చేతిలో వున్న కోడిని వాడపల్లికిచ్చేసి అలవాటు ప్రకారం బిందెలో నీళ్ళు చెంబుతో ముంచిచ్చి, ఆయన కాళ్ళు కడుక్కోగానే తువ్వాలు అందించాడు. నీళ్ళతడిని తుడుచుకున్న బాబయ్య అరుగుమీద వున్న కుర్చీలో కూర్చుంటే ఎదురుగా వాలుకుర్చీలో ఆసీనులయ్యారు పెదరాజుగారు. బాబయ్య వేసుకొచ్చిన సైకిల్‌కి ఎండతగలకుండా దూళ్ళ చావిట్లో స్టాండేసి వచ్చాడు బక్కడు.

“ఎవర్రా అక్కడ? ఆ మొక్కతోటలోకెళ్ళి నాలుగు చెన్నంగి బొండాలు తెంపుకురండి,” అంటూ దర్పంగా పురమాయించిన పెదరాజుగారు “పొద్దున్నుంచీ కాకరుత్తుంటే కవురూ కాకరకాయా లేకుండా చుట్టాలెవరో ఊడిపడేలా వున్నారు, బేగా వంటలు చేసుంచమని పెరట్లోకి కబురెట్టాను. ఇయ్యాళ మన మావుల్లో కొరమేనులు, బొమ్మిడాయిలు మా దిట్టంగా పడ్డాయిలెండి. బొమ్మిడాయల పులుసు, కొరమేను వేపుడు, నాటుకోడి పలావు సరిపోతాయా? ఇంకా రెయ్యలు, పీతలు ఏవన్నా భ్రముంటే చెప్పండి వలేయించేత్తాను,” అన్నారు.

“మీ రాజులతో ఎలా అయినా పేచీయేండి. నచ్చితే పెట్టి చంపేత్తారు. నచ్చాపోతే కొట్టి చంపేత్తారు. రాజులవంటా కడుపు మంటా అని ఊరికే అన్నారా ప్రెభూ. మీ ఇంట్లో మీగడ పెరుగూ ఆవకాయబద్దా చాలండి మా మొహం మొత్తెయ్యడానికి. ఇంకా ఆ రకరకాలెందుకులెండి?”

“భలేటోరే! మీకోసం మేమేమీ శ్రమడిపోట్లేదు. నిన్న మన కక్కిరాయి పందెం పొడిచింది. దీనికీ చిన్న చిన్న దెబ్బలు తగిలేయనుకోండి. ఆటికే పాలేరు చేత జార్తగా మందేయింతనాను. ఏదొరేయ్ వాడపల్లీ పుంజునోసారి మావగారికి చూపించు,” అన్నారు పెదరాజుగారు మీసం దువ్వుకుంటూ.

వాడపల్లి పుంజుని తెచ్చి, ఇద్దరి మధ్యనా నిలబెట్టి, రెక్క ఎత్తి, దాని సట్ట మీద తగిలిన దెబ్బ చూపించాడు.

“నాను దింపిన మట్టులో పిల్లేండి. దీం తల్లీ మోడిది వరసాగ్గా పందెం కొట్టడం ఐదోసారండి. నోగిట్లో పుంజులన్నాటికీ మందే తరిపీదండె,” హెచ్చులుపోయాడు వాడపల్లి.

“పుంజుల్ని మేపడంలో మా పనోడు లెండీడు. పందాల్లో పడి వున్న పది సెంట్లూ అమ్మేత్తే అమ్మేసాడు గాని,” అని వాడపల్లికి కితాబిచ్చి “సరే దీన్నిక్కన్నుంచి పట్టుకెళ్ళి, పెట్ట ముండలని దరిదాపుల్లోకి రాకుండా ప్రత్యేకంగా జాబులో వేసుంచు. ఏడా బక్కడు? నాలుగు కొబ్బరి బొండాలు దింపడానికింసేపా? ఇంతాలస్యం చేశామని వీళ్ళూల్లో తెలిస్తే మన మర్యాదేవన్నా నిలబడుద్దిరా! ఏది ఓ కేకెయ్యి.”

పెదరాజుగారు తనని పొగిడారో తెగిడారో అర్థంకాక అయోమయంలోకి జారిపోయిన వాడపల్లికి ఆయన పురమాయింపు చెవికెక్కలేదు.

“మీ లోగిల్లో కోళ్ళక్కూడా గోసా పద్దతుంటే ఇలా పుంజుల్ని జాబుల్లో ఏసే పని తప్పునేమోనండి అల్లుడుగారూ!” వెటకారమాడారు బాబయ్య.

ఆ మాటకి పెదరాజుగారి మనస్సు చివుక్కుమంది. బాబయ్య మాటల్లో ఎత్తిపొడుపు ఏమైనా వుందేమోనని వెదికి చూశారు. అలాటిదేమీ కనిపించకపోవడంతో స్థిమితపడ్డారు. పెదరాజుగారు ఏదో చెప్పబోతుండగా బక్కడు ఓ పళ్ళెంలో పెట్టిన కంచెంబుతో మజ్జిగ దాహం పట్టుకువచ్చాడు. వాడి కూడా వచ్చిన చిరంజీవి దాన్ని బాబయ్యకి అందించి “పుచ్చుకోండి,” అన్నాడు.

అతిథులకి పాలికాపులు మంచినీళ్ళివ్వడం, మజ్జిగలు వడ్డించడం అసలేమాత్రం పధ్ధతి కాదు. ఆ రాజుల మర్యాదకి ముగ్ధుడైన బాబయ్య చిరంజీవిని కిందనుంచి పైదాకా చూసి “మనవడుగారు ముద్దుగా వున్నారు. అచ్చుగుద్దినట్టు మీ పోలికలే. పెద్దబ్బాయిగారబ్బాయా? చిన్నబ్బాయిగారబ్బాయా?” అని అడిగారు.

“నా శ్రాధ్ధం కనబడ్డంలేదూ? ఈడా తోట్లో చిట్రారి మనవడు. ఆడి బడీపక్కనే. అందుకే అక్కడ తక్కువా ఇక్కడెక్కువా మసులుతాడు. మాకంటే మీ అమ్మాయిగారికీడే ఎక్కువ. ఎక్కడే చెత్త దొరికినా పోగేసుకొచ్చి పెరట్లో పారబోస్తాడు,” పెదరాజుగారు విసురుగా చెప్పడంతో బాబయ్య గతుక్కుమని మజ్జిగ గటగటా త్రాగేసి చెంబు కింద పెట్టేశారు. ఆయన అవస్థకి ముసిముసిగా నవ్వుకున్న బక్కడూ చిరంజీవీ ఆ చెంబు పట్టుకుని లోపలకి పోయారు.

బాబయ్య అసలు పేరు ఆవుల బాబూరావు. పుగాకు వ్యాపారం చేసే ఆయనది అద్దరినున్న అయినాపురం. పెదరాజుగారు అత్తోరూరు కూడా అయినాపురవే. అదీ ఇద్దరి మధ్యా వున్న చుట్టరికం. తెల్లటి షరాయి, లాల్చీతో సైకిల్ మీద తిరిగే బాబయ్యకి అద్దరిరాజులనీ ఇద్దరి రాజులనీ వరసబెట్టి పిలిచే సాన్నిహిత్యం వుంది. వ్యాపారం నిమిత్తం ఊళ్ళట్టుకు తిరిగే బాబయ్య అక్కడి యోగక్షేమాలు ఇక్కడికీ, ఇక్కడి యోగక్షేమాలు అక్కడకీ చేరవేస్తుంటారు.

“రాజోలవతల రావరాజులంకలో ఏదో రాచ్చస వివాహంలో కలిసినట్టున్నాం. ఏడాదయ్యిందా? ఏన్నర్ధం అయ్యిందా? మళ్ళీ ఇన్నాళ్ళకి,” అన్నారు పెదరాజుగారు.

“ఆగండాగండి. చెయ్యేరు బులిరాజుగారింట్లో కార్యం భోజనాలకి బంతిలో మనిద్దరం పక్కపక్కనే కూచ్చున్న భోగట్టా మర్చిపోయినట్టున్నారు,” గుర్తుచేశారు బాబయ్య.

“మీకు బానే గుర్తుందండోయ్. పిల్లలు మరీ లేతగా వున్నారు. తెల్లార్లూ ఏం పుర్రాకులు పడతారో అని నవ్వుకున్నాం కదా! యాడాత్తిరక్కుండానే కవలపిల్లలు పుట్టేసేరండాళ్ళకి,” చెప్పారు పెదరాజుగారు.

“అబ్బో శుభవార్త చెప్పేరు. బారసాల భోజనాలకి వెళ్ళారా లేదా?”

“ఇధాయకంగా ఎల్లాల్సిందే. కానీ పిల్లేదు. అదే మంచిదిలెండి. అన్నిటికీ మనలా కక్కా ముక్కా రకం కాదాళ్ళు. దానికేంగానీ చుక్కకీ సూరీడుకీ ముడెట్టేసేరకం. ఏంటిలా దైచేసారు?”

“రేపు శివరేత్రికదా? కోటిపిల్లెళదారని బైదెళ్ళేను. అల్లుడుగార్ని చూసి చాన్నాళ్ళయ్యింది కదాని ఏటిగట్టునుంచిలా సైకిల్ మళ్ళించాను. భోయనాలయ్యాకా ఓ కునుకులాగి సైకిలెక్కితే గంటలో దంగేరెళ్ళిపోతాను. మాపిటికి మా బామ్మద్దింట్లో పడుకొని, దర్శనం అయ్యేకా తెల్లారగట్టే ఆ రేవు దాటేత్తాను.”

“అదేంటలాగే ఎళ్ళిపోవడం. ఏ రేవైనా ఒకటే కదా! ఎళ్ళేప్పుడు కూడా ఇలాగే ఎళ్ళండి. మావగారికి ముఖ్యమైన పత్రాలు పంపాలి. ఈలోగా రాయించుంచుతాను,” అభ్యర్ధించారు పెదరాజుగారు.

“చిత్తం. తవరన్నాకా చెల్లుద్దా? కానోమాటియ్యాల. రేపసలే శివరేత్రి. అందులోనూ శనారం. ఈ పీతలు రెయ్యలూ లాంటి లంపటం ఎట్టనంటే అలాగే చేత్తాను.”

“శివాజ్ఞ లేందే చీమయినా కుట్టదంటారు. ఏంటో మీపిచ్చి! ఈ వారం తినకూడదు, ఆ వారం తినకూడదు అని. నాకైతే ప్రతిరోజూ ముక్క లేందే ముద్దిగదు సుమండీ.”

ఇంతలో చిరంజీవి వచ్చి “తాతయ్యా వడ్డన్లు చేసెయ్యమంటారా?” అని అడిగాడు.

ఏమంటారన్నట్టు బాబయ్య వంక చూసిన పెదరాజుగారు ఆయన తలూపకుండానే “కానియమను,” అన్నారు.

వెళ్తున్న చిరంజీవిని “ఇగో బాబు!” అని పిలిచి “ఇది మామ్మగారికియ్యండి.” అని చేతి సంచి అందించారు బాబయ్య. ఏంటి అన్నట్టు చూసిన పెదరాజుగారితో “గోరింటాకండి. మా అమ్మాయికి సరదా అని ఆళ్ళమ్మగారంపించారు.” చెప్పారు బాబయ్య.


తెల్లటి ముగ్గుతో దీపం చిమ్నీలని తుడుస్తున్న రామ్మామ్మ బాబయ్య తెచ్చిన గోరింటాకుని చూసి ఒకటే మురిసిపోతున్నారు. ‘మా పుట్టింటి నుంచి వచ్చింది. నాకిష్టవని మా అమ్మయ్య పంపించారు’ అంటూ కోడళ్ళ ముందు ఒకటే గొప్పలు పోవడం మొదలెట్టారు. అసలు వాళ్ళూరి గోరింటాకు పండినట్టు ఇంకేవూరి గోరింటాకు పండదన్నట్టు బడాయిపోయారు. చేటలో పోసిన గోరింటాకుకి చిరంజీవి ఈనెలు తీస్తుంటే “ఒరేవ్ సిరంజీ! రేపు ఎక్కడన్నా కనబడితే కాంత కాకిబొడ్డట్రారా. అదేసి రుబ్బితే గోరింటాకు ఇంకా బాగా పండుద్ది,” అని పురమాయించారు.

“అలాగేండి మామ్మయ్యా. ఎండు తాటాకు ముక్క కూడా తెత్తాను,” ఉత్సాహంగా అన్నాడు చిరంజీవి.

రామ్మామ్మ సంబరాన్ని కోడళ్ళిద్దరూ ఓ కంట కనిపెడుతూనే తమ పనులు తాము చేసుకుంటున్నారు.

దీపాల్లో చమురు నింపుతున్న రామ్మామ్మ “జన్మానికో శివరాత్రని, యావర్రోయ్ మీరూ రేప్పెందరాడే లెగిసి తెమలండి. పొద్దున్నే గోదారి స్నానం చేసొద్దాం. మీ మావగారు, ఊరు మంచం దిగేలోపు వెళ్ళొచ్చెయ్యమన్నారు. రాత్రికి జాగారం కూడా చేయాలి,” కోడళ్ళకి చెప్పారు.

రామ్మామ్మకి అసలు పేరేదో వుండేది. రామతాతయ్యకి పెళ్ళాం అయి ఈ ఊరొచ్చాకా ఆ పేరు మరుగునపడిపోయి రామ్మామ్మ, రామత్తయ్య, రామొదినియ్యగా మారిపోయారు. ఆవిడ పోతేపోయారు, ఆమె కోడళ్ళకీ అదేగతి పట్టింది. రెండేళ్ళక్రితం లోగిట్లో అడుగెట్టిన పెద్దకొడుకు అచ్చిబాబు పెళ్ళాం అచ్చత్తయ్య, అచ్చప్పగానూ, ఏడాది క్రితం అడుగెట్టిన చిన్నకొడుకు బుచ్చిబాబు పెళ్ళాం బుచ్చత్తయ్య, బుచ్చమ్మలుగానూ రూపాంతరం చెందేసారు. పనోళ్ళు, పాలికాపులైతే రామ్మామ్మని పెద్దయ్యగారని, అచ్చత్తయ్యని చిన్నయ్యగారని, బుచ్చత్తయ్యని కొత్తయ్యగారని పిలుస్తుంటారు.

అత్తగారి మాటలకి కోడళ్ళ గుండెలు గుభిళ్ళుమన్నాయి. ‘అసలే శీతాకాలం. పొద్దెక్కాకా లేవాలంటేనే బద్దకం. చలిలో వణుక్కుంటూ అందూరం పోయి గోదారి స్నానం చేయాలా? అమ్మనాయనే! మనవల్ల కాద’ని ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకొని మథనపడిపోయారు.

రొయ్యల కూరలోకి ఉల్లిపాయలు వలుస్తున్న పెద్దకోడలు అచ్చత్తయ్య వెంటనే అప్రమత్తమయిపోయి “అత్తయ్యా, మీకు చెబితే హడావిడిపడిపోతారని చెప్పలేదు కానీ ఇందాకా మెట్లు దిగుతుంటే నా కాలు బెణికిందండి. అస్సలు నడవలేకపోతున్నాననుకోండి. ఇందాకా చిరంజీవి కుంటాట ఆడదామన్నా కుంటలేకపోయాను. కదండి చిరంజీవీ,” అంటూ చిరంజీవిని సాక్ష్యం వేసుకున్నారు.

“అవును మామ్మయ్యా. పాపం అచ్చత్తయ్యకి నెప్పితో ఇందాకటనుంచి కళ్ళంట ఒహటే నీళ్ళొచ్చేస్తున్నాయి. మీరేమో ఉల్లిపాయలొలుస్తున్నందుకొస్తున్నాయనుకుంటున్నారేమో,” వెంటనే అల్లుకుపోయిన చిరంజీవి వత్తాసు పలికాడు.

“అయ్యో! అయ్యో! ఎంత పనయిందేవ్ చెప్పొద్దా? వుండు, చింతపండు గొజ్జు తీసి వెచ్చబెడతా పట్టేసుకుందువుగాని,” కంగారుపడ్డారు రామ్మామ్మ.

బియ్యంలో బెడ్డలేరుతున్న చిన్నకోడలు బుచ్చత్తయ్య తోడికోడలి తెలివికి బిత్తరపోయి ‘అప్ప కుంటిసాకుతో భలే తప్పించుకుంటున్నారు. మనవూ ఏదో ఎత్తు వేయకపోతే చలికి బలయిపోవాల’నుకొని “అత్తయ్యా అప్ప కాలు నెప్పి తెల్లారేటప్పటికి ఇంకా ఎక్కడెక్కడకి పాకేస్తుందో ఏంటో పాపం. నేను దగ్గరుండి ఉప్పుతో కాపడం పెట్టి, నూనెతో మర్ధనా చేస్తాను. మీరెళ్ళి వచ్చేద్దురూ. వచ్చేటప్పుడు బుడ్డిచెంబుతో ఓ చెంబుడు నీళ్ళు తెచ్చేస్తే నెత్తిమీద చల్లేసుకుంటాం,” అంటూ గారంగా రాగం తీశారు.

కోడళ్ళిద్దరినీ మురిపెంగా చూసిన రామ్మామ్మ, “ఒసేవ్! ఇంకా ఎంతసేపే తోమడం? ఆ గెదర దాకని మిగతా అంట్లతో ముడెట్టకు. రేపసలే మడి వంటలు చేసుకోవాలి,” అంటూ పనిమనిషి రంగమ్మని గద్దించారు.

మాంసాహారం వండడానికి ప్రత్యేక దాకలు, డేగిసాలు ఆ ఇంట చాలానే వుంటాయి. వాటిని మిగతా వాటితో కలిపితే అవి మైల పడిపోతాయని మామ్మయ్య నమ్మకం. కడిగిన అంట్లగిన్నెలన్నిటినీ తెచ్చి రంగమ్మ వంటింటి వసారా మీద పేర్చింది. అక్కడివరకే దానికి అనుమతి. వంటింట్లోకి వెళ్ళటానికి ఆ ఇంటి వాళ్ళు మాత్రమే అర్హులు.

కోడళ్ళ ఎత్తులకి రామ్మామ్మ చిత్తయిపోవడాన్ని చూసి చిరంజీవితో పాటూ వాకిలి తుడవడానికి చీపురు వెదుక్కుంటున్న రంగమ్మా విస్తుపోయారు.


కోడి కూతలకి మెలుకువ వచ్చిన పెదరాజుగారు యథాప్రకారం మంచం మీదనుంచి దిగి వీధిలోకి వచ్చారు. చలిగాలి ఈడ్చిపెట్టి కొడుతుండడంతో చెవుల మీదుగా తలపాగా చుట్టారు. మూలన నిలబెట్టున్న చేపాటి కర్ర అందుకొని తోట చివరకి నడిచారు. వేపపుల్లొకటి విరిచి, నేలనూతి దగ్గర దంతధావనం చేసొచ్చి, వాకిట్లో వేసున్న వాలుకుర్చీలో సావకాశంగా కూర్చొని, మర్ఫీ రేడియోలోంచి వస్తున్న వెంకటేశ్వర సుప్రభాతం వినడం మొదలెట్టారు. అది అయిపోవస్తోంది కానీ ఆసరికి పెరట్లోంచి వినిపించాల్సిన కవ్వం చప్పుళ్ళు వినిపించడం లేదు. రేడియోలో పొలం పనులు కార్యక్రమం మొదలైపోయింది కానీ ఆ సరికి ఆయన కడుపులో పడాల్సిన కాఫీ పడలేదు. ఎప్పుడూ లేనిది ఆయన మనసదోలా అయిపోయింది. కాలుగాలిన పిల్లిలా కాస్సేపు కుర్చీలోంచి లేచి పచార్లు చేసిన ఆయన పెరట్లోకి వెళ్దామనుకుని అంతలోనే ఆగిపోయారు. పెరట్లో కోడళ్ళుంటారు. అసలే గోషా. ఏం పనులు చేసుకుంటున్నారో ఏంటో? తను కనబడితే మన్నన కోసం ఎలా వున్న వాళ్ళు అలా ఏదో పక్కకి పోవాలి. వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం అని ఆగిపోయారు.

ఓ ప్రక్కన ఖాళీ కడుపు కెలికేస్తుంటే మండువా లోపలకి వెళ్ళి “అచ్చీ అచ్చీ!” అని పెద్దకొడుకు అచ్చిబాబుని పిలిచారు. “అయ్యా!” అంటూ నిద్రకళ్ళు నులుముకుంటూ వచ్చారాయన.

ఏదో ఆలోచించిన పెదరాజుగారు “నువ్వొద్దులే. ఏదీ బుచ్చినిలా రమ్మను,” అంటూ వీధిలోకి నడిచారు.

“బుచ్చీ బుచ్చీ!” అంటూ అచ్చిబాబు పిలిచిన పిలుపుకి “ఏంటన్నయ్యా?” అంటూ బద్దకంగా ఆవులిస్తూ వచ్చారు బుచ్చిబాబు.

“ఏమోరా. బావజ్జీ పిలుస్తున్నారు వెళ్ళు,” అనగానే బుచ్చి నిద్ర ఎగిరిపోయింది. లుంగీ బిగించుకుంటూ వచ్చి “బావజ్జీ, పిలిచారట,” అన్నారు బుచ్చి చేతులు కట్టుకొని.

“చూడు, మీ అమ్మ ఏంజేస్తుందో? ఏదీ ఇంకా కాఫీ కూడా రాలేదు,” గంభీరంగా చెప్పారు పెదరాజుగారు.

పెదరాజుగారి పిలుపుకి మొగుళ్ళ ప్రక్కలో ఆదమరిచి నిద్రపోతున్న కోడళ్ళు తుళ్ళిపడి లేచారు. తెగబారెడు పొద్దెక్కడం చూసి చలితేలుళ్ళా పెరట్లోకి పరుగులు తీశారు. అక్కడ వంటిల్లు ఇంకా తెరుచుకోకపోవడం చూసి అయోమయంగా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోయారు.

చిన్నవారు కాబట్టి, ఏ వేళలోనైనా పెరట్లోకి వెళ్ళగలిగే మగాడు ఆ ఇంట్లో బుచ్చిబాబు ఒక్కరే. అదే అచ్చిబాబు వెళితే గోషాలో బావగారి మన్నన చేస్తూ బుచ్చిబాబు పెళ్ళాం మళ్ళీ ఏదో చాటుకి పరిగెత్తాలి.

“వదినయ్యా అమ్మయ్యేరండి? ఇంకా కాఫీ పెట్టలేదని బావజ్జీ కోప్పడుతున్నారు. మీరన్నా పెట్టలేకపోయారు…” పెరట్లో మొహమొహాలు చూసుకుంటున్న తోడికోడళ్ళ దగ్గరకి వచ్చి అడిగారు బుచ్చిబాబు.

“తెల్లవారుజామున గోదారి స్నానానికి వెళతానన్నారండి. ఇంకా రానట్టుంది,” భయంభయంగా చెప్పారు బుచ్చత్తయ్య.

“అదేంటింత పొద్దెక్కినా రాపోడం!” అంటూ ఖంగారుగా వీధిలోకి వెళ్ళిన బుచ్చిబాబు “బావజ్జీ, గోదారికెళ్ళిన అమ్మయ్య ఇంకా రాలేదట. వదినియ్యా వాళ్ళూ భయపడుతున్నారు,” అని చెప్పారు.

“ఆఁ… రాలేదా! ఏవయ్యుంటది?” ఆలోచిస్తూ కుర్చీలో కూలబడ్డారు పెదరాజుగారు.

“మీరేవీ ఖంగారు పడకండి. నేనూ అన్నయ్యా అలా ఏటిగట్టుకెళ్ళి ఓమాటు చూసొస్తాం,” అని, “అన్నయ్యా! అన్నయ్యా!” అంటూ పిలిచారు. అక్కడకి వచ్చిన అచ్చిబాబుతో విషయం చెప్పి ఇద్దరూ ఏటిగట్టు బాటపట్టారు.

వెళుతున్న కొడుకులిద్దరినీ “ఒరేయ్! ఆగండి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఎంత అప్రదిష్ట! ఎవరైనా ఇలా వచ్చేరేం? అనడిగితే ఏంజెబుతారు!” అని అడిగారు పెదరాజుగారు.

“గౌడుగేదె కట్టు తెంపుకువచ్చిందని చెబుతాం లెండి. నువ్వు త్వరగా నడవరా,” అంటూ తమ్ముడిని తొందరచేశారు అచ్చిబాబు.

పెరట్లో కోడళ్ళిద్దరూ మెత్తగా ఏడుపులందుకున్నారు. అత్తగారు గోదాట్లో ఎక్కడ కొట్టుకుపోయారోనన్న భయం వారిని వణికిస్తోంది. ‘మస్కా కొట్టి ఆగిపోయాం. మనమూ కూడా వెళితే ఏ అనర్థం జరగకుండా వుండేదేమోనని తర్జన భర్జన పడ్డారు.

వీధిలో పచార్లుచేస్తున్న పెదరాజుగారు పరిపరివిధాల ఆలోచిస్తున్నారు. ‘ఏమయ్యుంటది? ఎలా అని వెదకడం? ఎక్కడని వెదకడం. ఆ రేవు దాటి పోతానన్న బాబయ్యని అనవసరంగా ఇలా రమ్మని గొప్పకి గొరిగించుకున్నాను. ఈ సంగతేంటో తేలకుండా ఆయన వచ్చేస్తే… విషయం ఆయన చెవిన పడితే… ఇంటి పరువు ఇద్దరి నుంచి అద్దరిదాకా గోవిందా గోవింద! ఎప్పుడూ గుమ్మం దాటి వీధిలోకి తొంగిచూసిన మనిషి కాదు. ఏం జరిగిందో ఏవిటో?’ భార్యని తలుచుకున్న పెదరాజుగారి గుండె ఎంత బరువెక్కిపోతుందో… బాబయ్యని తలుచుకోగానే అంతకంటే ఎక్కువగా భయపడిపోతోంది.

ఓ గంటపాటు గోదావరి రేవంతా గాలించిన అన్నదమ్ములిద్దరూ మొహాలు వేలాడేసుకుని వచ్చారు. వాళ్ళ చేతిలో పసుపు కుంకుమలతో తడిచిన కాగితం ముక్కలున్నాయి. కొడుకుల వాలకం చూడగానే పెదరాజుగారికి అర్థమైపోయింది, రామ్మామ్మ ఆచూకీ దొరకలేదని. పెరట్లోకి మగాళ్ళెవరన్నా వచ్చి మంచి వార్త చెబుతారేమోనని కోడళ్ళిద్దరూ ఖంగారుగా ఎదురుచూస్తున్నారు.

“మరకాళ్ళకి కబురెట్టి నావల్లో అలా యానాం దాకా వెళ్ళి వెదికి రమ్మంటారా?” బుచ్చిబాబు అడిగారు.

“పోలీసులకి కూడా కబురెడదాం బావజ్జీ,” అన్నారు అచ్చిబాబు.

“పోలీసులకింకా చెప్పొద్దులే. నా మనస్సు ఏ చెడ్డా జరగలేదని చెబుతోంది. నావల్లో ఎళ్ళి వెదికి రండి. తెలుసుకదా! ఎవరికీ ఏమీ తెలీకుండా పని కానివ్వండి,” హెచ్చరించారు పెదరాజుగారు.

“అన్నయ్యా మీరు ఎవరోకరిచేత వాళ్ళకి కబురంపండి. ముందు నేను బావజ్జీకి త్రాగడానికి ఏవైనా తీసుకొస్తాను,” అంటూ పెరట్లోకి వెళ్ళారు బుచ్చిబాబు.

ఆయన లోపలకి వెళ్ళి, అక్కడ కనబడిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని అన్నయ్యా, బావజ్జీ, అని గావుకేకలు పెడుతూ వీధిలోకి పరిగెత్తారు.


రామ్మామ్మంటే చిరంజీవికి అలాంటిలాటిష్టం కాదు. స్వంతింట్లో అమ్మమ్మ, నానమ్మలకంటే ఆమె అంటేనే వాడికి ఎక్కువ ఇష్టం. మామ్మయ్యకి కూడా అంతే. వాడంటే అదే ఇది. ఇంట్లో చిన్నవాళ్ళెవరూ లేరేమో. వాడు బడెగ్గొట్టి ఇంటికి రాకపోతే ‘ఏవర్రా, సిరంజీగాడు రాలేదేవంటారు? ఏవర్రా, ఆ సిసింద్రీ గాడేమయ్యారంటారు?’ అంటూ కోడళ్ళ చెవికొరికేస్తుంటారు. ఆ కోడళ్ళకీ చిరంజీవంటే అంతే ఇష్టం. వాడొస్తే ఏ యద్దనపూడి సులోచనారాణినో, కోడూరి కౌసల్యాదేవినో చంకన వేసుకు వస్తాడు. ఎన్.టి.ఆర్.నో, ఏ.ఎన్.ఆర్.నో కళ్ళముందు నిలబెట్టేస్తాడు. అదే వాళ్ళకి కాలక్షేపం. మామ్మయ్యకేమో వాడి వికటప్రశ్నలకీ యక్షప్రశ్నలకీ సమాధానాలు చెప్పడం అంటే అదో సరదా. దానికి మించి ‘శాంతత్తయ్యకి కొడుకు పుడతాడట. ఈ చింతకాయలు పట్టుకెళ్ళి ఇచ్చేసి రామ్మా. సుబ్బతాతయ్య గారింట్లో ఈ రోజు సత్యన్నారాయణ వ్రతమంట. ఈ ఆవు పాలు పట్టుకెళ్ళి ఇచ్చేసిరారా,’ అంటే మూడో కంటికి తెలియకుండా పనులు చక్కబెట్టి వచ్చేస్తాడు. ఇలాటివి పెదరాజుగారి కంట్లో పడితే కొంపమాపేస్తున్నారంటూ కయ్యిబుయ్యిలాడతారు.

ఎప్పుడెప్పుడు పెదరాజుగారింటికి పారిపోదామా? చేతినిండా గోరింటాకు పెట్టేసుకుందామా? అన్న ఆత్రుతలో వున్న చిరంజీవి ఆడాళ్ళకంటే ముందే తలంటు స్నానం చేసేసి, దేవుడి గదిలో శివుడికి తెగ మొక్కేసి ఇంట్లోంచి బయటపడ్డాడు. రామ్మామ్మ గోరింటాకులో వేయడానికి కాకిబొడ్డు తెమ్మన్న సంగతిని వాడు మరిచిపోలేదు. తోట దాటి కాలవగట్టు ఎక్కేటప్పటికి ఏటిగట్టు మీద నుంచి కోటిపల్లి తీర్థానికి వరసగా వెళ్తున్న గుర్రాలు కనిపించాయి. ఎక్కడెక్కడనుంచో కోటిపల్లి తీర్థంలో అమ్మడానికి ఆ గుర్రాలని తోలుకువెళ్తున్నారు. నెల్లాళ్ళపాటు ఆ గుర్రాల సంత జరుగుద్ది. వాటిని ఒకటీ రెండూ మూడూ అని లెక్కపెడుతూ కాస్సేపు కాలక్షేపం చేశాకా వాడికి మళ్ళీ కాకిబొడ్డు గుర్తొచ్చింది. కాకిబొడ్డుని ఎక్కడ చూశానా అన్న విషయాన్ని ఓసారి గుర్తు చేసుకున్నాడు. పెదరాజుగారి మామిడి తోటలో బంగినిపల్లిచెట్టు మొదట్లో అది ఉందన్న సంగతి గుర్తొచ్చి హుషారుగా అటు నడిచాడు.

అపుడప్పుడే వెలుగులు పరుచుకుంటున్నాయి. తోటలో చెట్ల ఆకుల మీదనుంచి కురిసిన మంచు చుక్కలు చుక్కల్లా ఆకుల మీదనుంచి కారుతూ కింద ఎండుటాకులమీద పడి టప్ టప్‌మని చప్పుడు చేస్తోంది. తోట పక్కనున్న కాలిబాట మీదనుంచి వరసగా జనం నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ కాలవకి ఆ పక్కనున్న శివాలయంలో దర్శనానికి పోతున్నారు. ఉత్సాహంగా బంగినపల్లి చెట్టు వైపు నడుస్తున్న చిరంజీవి హఠాత్తుగా ఆగిపోయాడు. బొడ్డుమామిడి మొక్కల మధ్యలో ఎవరో ముసుగేసుకుని కూర్చున్నారు. అది చూసిన వాడికి కాళ్ళల్లో వణుకు పుట్టింది. ‘ఎవర్రా ఎవరది?’ అని పీలగా అరుస్తూ వెనక్కి ఒక్కో అడుగే వేస్తూ పరుగందుకున్నాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఎవడో దొంగవెధవ పునాసకాయలు ఏరుకు పోవడానికొచ్చినట్టున్నాడు. నన్ను చూసి నక్కి దాక్కున్నాడేమో. అని తలచి… వెనక్కి తిరిగి నాలుగు మట్టి బెడ్డలు ఏరుకొని ఒకోటి ఆ మనిషి వైపు విసురుతూ ముందుకు పరిగెత్తాడు.

“ఉరేవ్ ఉరేవ్ సిరంజీ ఆగరా,” అంటూ నెత్తిమీద ముసుగు తీస్తూ రామ్మామ్మ పైకి లేవడంతో చిరంజీవి ఆశ్చర్యపోయాడు. అంతలోనే తేరుకొని “అదేంటి మామ్మయ్యా, కాకిబొడ్డు నేను తెత్తానన్నానుకదా! మీరెందుకొచ్చేశారు. రండి ఆ చెట్టు మొదట్లో వుంది,” అన్నాడు.

వాడి మాటలకి తేలుకుట్టిన దొంగలా అయిపోయిన రామ్మామ్మ వాడిని అనుసరిస్తూ “ఈ తోటెవరిదిరా ఇంత పెద్దదుంది?” అనడిగారు.

“అదేటి మీకు తెల్దా! ఇది మనతోటే మామ్మయ్యా. అదిగో ఆ పక్కన చూడండి… కార్తీకమాసంలో భోజనాలెట్టడానికి తాతయ్య పాతిన పెద్దుసిరి మొక్క. ఈసారందరం ఈ చెట్టుకిందే భోజనాలు చేద్దాం,” అన్న చిరంజీవి చెట్టు మొదట్లో వున్న కాకిబొడ్డును బలవంతంగా విరగ్గొట్టి ఖాళీగా వున్న జేబుల్లో నింపుకుంటుంటే… వెనకనుంచి రామ్మామ్మ అమాంతం వాడిని కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడ్వడం మొదలెట్టారు. ఎప్పట్నుంచి అదిమిపెట్టుకున్నారో దుఃఖాన్ని! వరదగోదారిలా కళ్ళవెంట పొంగుకొస్తోంది. అది చూసి చిరంజీవి బిత్తరపోయాడు.

కాస్సేపటికి కుదుటపడ్డ రామ్మామ్మ “ఎన్నుంటే ఏవిరా నాన్నా! పొద్దున్నుంచి దిక్కూ దివాణంలేకుండా ఈ చెట్లంటా పుట్లంటా తిరుగుతున్నాను. గుండాగి చత్తాననుకున్నాను. నువ్వొచ్చేకా ధైర్యం వచ్చింది,” అని చిరంజీవిని వదిలేసి కొంగుతో కళ్ళు తుడుచుకున్నారు.

“ఏవయ్యింది మామ్మయ్యా? మీరు కాకిబొడ్డుకోసం రాలేదా?” ఆత్రుతగా అడిగాడు చిరంజీవి.

అసలే అమావాస్య రాత్రులు. దానికితోడు దట్టంగా కురుస్తున్న పొగమంచు. కాస్తదూరంలో కూడా ఏంవుందో కనిపించడం లేదు. మండువా వెనక కాలవదాటి ఏటిగట్టెక్కిన రామ్మామ్మ ఆ చీకట్లోనే గోదావరి రేవులోకి దిగి, కాళ్ళకి శుభ్రంగా పసుపురాసుకుని మూడు మునకలు వేశారు. ఆ తడిబట్టలతోనే కనిపించని సూర్యుడికి నమస్కారాలు చేసి, కోడళ్ళని సంప్రోక్షించడానికి బుడ్డిచెంబుతో చెంబుడు నీళ్ళు పట్టుకొని పెద్దరాజుగారి ఆజ్ఞ ప్రకారం వెలుగురేఖ తొంగి చూడకముందే మండువా చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఏటిగట్టు దిగి, వంతెన దాటి కాలవ గట్టెక్కి ఇంటి దారి పడుతుండగా చీకట్లోంచి ఓ నల్లగుర్రం హిహిహీ అంటూ సకిలించి గేలాపు అందుకొంది. కోటిపల్లి వెళుతూ వెళుతూ దండులోంచి తప్పించుకొన్నట్టుంది అది.

అంత నిశ్శబ్దంలో ఆ గుర్రం సకిలించేసరికి హడలెత్తిపోయిన రామ్మామ్మ కిందపడిపోయి పల్లంలోకి దొర్లిపోయారు. చేతిలో బుడ్ది చెంబు జారిపోయింది. కాస్సేపటికి గుండె దిటవు చేసుకుని బుడ్డిచెంబుని కాసేపు వెదికి వేసారిపోయి తనొచ్చిన దారిని మరిచిపోయారు. ఆ చీకట్లో అలానే నడుచుకుంటూ ఈ తోటలో చొరబడ్డారు. జనం అలికిడి మొదలయ్యింది. ఎవరి మొహమూ తెలియదు. అసలు ఇది ఏ వూరో కూడా తెలియని అయోమయంతో బిక్కుబిక్కుమంటూ ముసుగు కప్పుకొని కూర్చుని వున్నారు. ఎవరి తాలూకా అని చెప్పాలి? పెదరాజుగారి భార్య పెద్దయ్యగారు దారితప్పిపోయి తమ ఇంటికే దారి అడుగుతున్నారంటే ఎంత నామర్దా!

అవున్నిజమే. పాపం రామ్మామ్మని ఎవరు గుర్తుపట్టగలరు, దగ్గరి బంధువులు కొద్దోగొప్పో తప్ప! ఊళ్ళోవాళ్ళకి ఆ గోషాస్త్రీ ఎప్పుడన్నా కనిపిస్తేనా? ఎప్పుడో నలభై ఏళ్ళకిందట పదమూడేళ్ళ వయస్సులో పెద్దబాలశిక్ష చదువుకున్న రామ్మామ్మ, అమరం ఆంధ్రం ముట్టుకోకుండానే పాతికెకరాల మాగాణి, వంటినిండా బంగారం, సారె చీరలతో మెట్టినింట ఈ ఊరిలో అడుగుపెట్టారు. ఆమె అప్పట్నుంచి వీధి మొహం ఎరిగిన మనిషి కాదు. పెళ్ళికో పేరంటానికో ఎవరన్నా తోడువస్తే పెరటి గుమ్మం నుంచి వెళ్ళి పెరటి గుమ్మంలోకి రావడమే. పురుడుకో పుణ్యానికో పుట్టింటికి వెళ్ళినా పరదాలు కట్టిన బండిలో ఎక్కి, పరదాలు కట్టిన బండిలోంచి దిగడమే. ఇల్లే కైలాసం. వంటిల్లే వైకుంఠంగా బతికే ఆ అత్తగారికీ ఆ ఇంట అడుగెట్టిన కోడళ్ళకీ వాళ్ళ లోగిలి దారులు, ఊరి పొలిమేరలు తెలీకపోవడంలో ఆశ్చర్యం ఏముంది?

ఆవేదనంతా వెళ్ళగక్కేసుకోవడంతో రామ్మామ్మ మొహం తేటబడింది.

“ఒరేవ్, నీకు మజ్జాన్నం సున్నుండలు చేసి పెడతాకానీ ఈ సంగతి ఎవరికీ చెప్పకు చెప్పకురా కొండా. అత్తయ్యలకి కూడా. ఎవరికన్నా తెలిస్తే నామోషీ కూడాను,” బేలగా అన్న రామ్మామ్మ చిరంజీవి చేత బాస చేయించుకున్నారు.

“నడండి మామ్మయ్యా ఊరంతా ఓసారి చూసొద్దాం,” అన్నాడు చిరంజీవి.

“వద్దురా. తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు. అసలే వేళ దాటిపోయింది. తాతయ్య ఆవురావురుమంటూ కాఫీ కోసం అర్రులు చాస్తుంటారు.”

“జన్మానికో శివరాత్రని మీరే అన్నారుకదా! అయిన ఆలస్యం ఎలాగా అయ్యింది. అయినా మీరు మీరేనని ఊరోళ్ళకేం తెలుస్తుంది? అలా ఊరు తిరిగేసి శివాలయంలొ ఓ దణ్ణం పెట్టుకుని వచ్చేద్దాం.”

రామ్మామ్మ, చిరంజీవీ ఒకళ్ళకొకళ్ళు పరిచయం లేనట్టు కొంచెం కొంచెం దూరంలో నడుచుకుంటూ ఊరు మొత్తం చుట్టేశారు. దొరికిందే సందుగా చిరంజీవి రామ్మామ్మ చెవిలో ఊరి విశేషాలు ఊదరగొట్టేశాడు. పనిలో పనిగా తాళం వేసున్న వాళ్ళ బడిని చూపించి, వాడెక్కడ కూర్చుంటాడో కూడా చూపించేశాడు.

గుట్టుచప్పుడుకాకుండా ఊరు మొత్తం బలాదూర్ తిరిగేసిన రామ్మామ్మ, చిరంజీవీ గుర్రం బెదిరిస్తే బెదిరించింది కానీ ఏనుగెక్కినంత సంబరాన్ని మిగిల్చిందనుకుంటూ మళ్ళీ తోట బాటపట్టి మండువాలోకి పెరటి ద్వార ప్రవేశం చేశారు.


దూరంగా మండువా వైపు దూసుకొస్తున్న బాబయ్య సైకిల్ కనిపించగానే పెదరాజుగారి గుండెలు దడదడలాడాయి.

‘ముండా వెధవ! తగుదునమ్మా అని తయారయిపోయాడు. ఆ రేవు దాటిపోతానన్నవాడు పోవచ్చు కదా! ఏదో మాటవరసకి రమ్మంటే వచ్చి తగలడిపోవడమేనా? ఈయన్నిప్పుడు ఎలా ఏమార్చాలి?’ అని ఆలోచనలో పడ్డారు.

ఇంతలో పెరట్లోంచి బుచ్చిబాబు వగుర్చుకుంటూ వచ్చి “అమ్మయ్య వచ్చేసారు బావజ్జీ!” అరిచినట్టు చెప్పడంతో నెత్తి మీద నుంచి పెద్దకొండని దింపినట్టు తేలికపడ్డ పెదరాజుగారి చేయి అలవోకగా మీసం పైకి వెళ్ళింది.