రెక్కిటికీ

ముందు తెల్లపిల్ల
వెనక నేను
ఎడం ఎక్కువ లేదు
నా వెనకెవరో నాకు తెలీదు.


“విండో ఆర్ ఐల్?”
“విండో.”
టిక్ టిక్ టిక్టిక్ టిక్ టిక్
“గేట్ నంబర్ థర్టీ నైన్, హావ్ ఎ నైస్ ట్రిప్.”
కులుకులకు కుచ్చిళ్ళు సర్దుతూ
గేట్ వైపు నడుస్తూ వెళ్ళిపోయింది పిల్ల.

నా వంతు.
“పాస్ పోర్ట్.”
టిక్ టిక్టిక్ టిక్ టిక్
ఒక నాలికకు రెండు గొంతులు
“గేట్ నంబర్ థర్టీ నైన్. హావ్ ఎ నైస్ ట్రిప్.”

కాబిన్ సంచి బరువెక్కువైతే
డబ్బులు కట్టమంటారేమోనని
తీసి చేత్తో పట్టుకున్న
దుక్కపాటి లెక్కల పుస్తకాన్ని
మళ్ళీ సంచిలోకి సర్దేసుకుని
నేనూ ఆ గేటు వైపుకే…

ఎగుడు – దిగుడు
పైకి – కిందికి
ఎక్కీ దిగీ ఎట్టకేలకు
వెతుక్కున్న సీట్ నంబరు
సరిగ్గా ఆ తెల్లపిల్ల పక్కనే!

కిటికీ లోంచి బయటకు చూస్తున్న పిల్ల
ఇటు తిరిగి చిన్న నవ్వు.
కిటికీ లోంచి చూద్దునూ
విమానం పొట్టలోంచి పొడుచుకొచ్చిన రెక్క.

బోడిగుండంత సుఖం లేదని తెలిసినా
జులపాల జుత్తు పెంచుకున్న వాణ్ణి…
ఊరుకున్నంత ఉత్తమం లేదని తెలిసినా
కంద దురదా కత్తిపీట దురదా
కలిపి కళ్ళకద్దుకుని
నాలుకకు రాసుకున్న వాణ్ణి…

“యు వాంటెడ్ ఎ విండో సీట్?”
పిల్ల చురుగ్గా చూసింది.
“అండ్ గాట్ ఎ వింగో సీట్!”
ఫక్కున్న నవ్వేసింది!

“యూ…?”
“డెన్వర్.”

(ఈ రచన తనంత తనే రూపు మార్చుకునే రెక్కను తయారు చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థీ, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడూ అయిన కోట శ్రీధర్‌కి.)