బేతాళ కథలు: కథన కుతూహలం – 4

పట్టుదలకి మారుపేరయిన విక్రమార్కుడు, తాను చేయాల్సిన పని తనని ఎంత ఇబ్బంది పెడుతున్నా, తాను రావాల్సిన చోటికి, తనకు కావాల్సిన చోటికి మళ్ళీ వచ్చాడు.

శశి విలుప్తమయిన నిశిరాత్రి. ఎందుకు పొడుచుకోవాలని ఎదురు ప్రశ్న వేయకపోతే కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని చీకటి. ముగ్గు వేయాలనుకుని చుక్కలు పెట్టి గీతలు గీయటం మర్చిన ముంగిలిలా ఆకాశం. ఉలిక్కిపడేలా, నీరవనిశీధిలో ఒక ఫేరవం ఊళ. విన్నవాళ్ళ గుండెలు అవిసేలా ఉన్నట్లుండి ఒక మృగదంశక అరుపు. ఒక తీతువు కూత. నిశ్శబ్దంలోంచి ఉండుండి పుట్టుకొస్తున్న శబ్దాలు ఒడలు జలదరించేలా ఉన్నాయి.

వీటికి తాను అతీతం అన్నట్లు విక్రమార్కుడు చెట్టు దగ్గరకి తన కారువెలుతురు (కారుచీకటికి వ్యతిరేక పదం కాదు) సాయంతో చేరాడు. తడిగా అనిపిస్తున్న తన అరచేతుల్ని ఉత్తరీయానికి గట్టిగా తుడుచుకున్నాడు. చెట్టుని ఎక్కి బేతాళుడు దాక్కున్న శవాన్ని భుజం మీద వేసుకుని నెమ్మదిగా కారు దగ్గరకు నడిచాడు. ఇంతకు ముందులా పరధ్యానంలో ఉండకుండా, అతిజాగ్రత్తగా శవాన్ని, దాంతో పాటు బేతాళుడ్ని ముందు సీట్లో ఆసీనుణ్ణి చేశాడు. మెలకువ వచ్చిన బేతాళుడు అలవాటు ప్రకారం తన గొంతు ఇంకోసారి విప్పాడు.

“రాజా! ఒకసారి ఒక విషయంలో మొదటిసారి పొరపడితే అది అనుభవరాహిత్యం. అదే విషయంలో రెండోసారి పొరపాటు చేస్తే మూర్ఖత్వం. నిన్నటి పొరపాటు ఇవ్వాళ జరగకుండా నువ్వు తీసుకున్న జాగ్రత్త చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మరీమరీ నీతో ముచ్చటలాడాలనిపిస్తోంది. అదే పని పదేపదే చేస్తున్న నీకు శ్రమ అనిపించకుండా, విసుగు కలగకుండా మన అభిమాన పాఠకరావు ధోరణిలో మరో వింత కోణాన్ని ఈ రోజు నీ ముందు ఆవిష్కరిస్తాను. విను.”

అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. ఈసారి ఎలాంటి విరామమూ ఇవ్వలేదు. విక్రమార్కుడు సక్రమంగా వినే స్థితిలో ఉన్నాడా లేదా అనేది పట్టించుకోదల్చులేదు.

“పట్టు వదలని పాఠకరావు, ఈసారి మరో పుస్తకాన్ని తెచ్చుకుని కథాసాగర మథనం చేయటానికి సంసిద్ధమయ్యాడు. ప్రతి కథనీ పరిశీలిస్తూ పేజీలని తిరగేశాడు. పేజీల క్రింద దేని కోసమో వెతికాడు. ‘ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది’ అని పైకే అన్నాడు. మధ్యమధ్యలో ఆగి పట్టిపట్టి వాక్యాల్లోకి చూశాడు. ‘ఎక్కడికక్కడ కూడా లేవన్నమాట. అయితే ఎలా?’ అని గొణుక్కున్నాడు. ప్రతి కథా చివర్లో ఆగాడు. చివరి కథ ముగింపు దగ్గరకు వెళ్ళి ‘పోనీలే! దీనికయినా ఉంది,’ అని గట్టిగా అని, కొంచెం వెనక్కి వెళ్ళి అదే లోకంగా ఆఖరి కథ పుటల్లో మమేకమయ్యాడు.

రాజా! ఒక పుస్తకం చదవాలనుకునేవాళ్ళు అందులో ఉన్నది చదువుతారు. లేకపోతే వదిలేస్తారు. తన స్వంత వస్తువేదో పోగొట్టుకున్నట్లు పాఠకరావు ఆ కథల పుస్తకంలో దేనికోసం వెతికాడు? చివరకు అతనికి దొరికింది ఏవిటి? అక్కడక్కడ ఆగి అతడు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఏమైనా అర్థం ఉందా? ఉంటే అది ఏవిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల, పడమటి కొండల అంచున కాలు జారి(ఇది మొదటి రకం కాలు జారటం), రాత్రి చట్రాతికి తగిలి చుక్కల ముక్కలయిన సూర్యబింబం కాగలదు.”

‘రానురాను ఇతని విష(య)పరిజ్ఞానం పెరుగుతోందా?’ అన్న అనుమానంతో విక్రమార్కుడు ఒకసారి శవం వంక చూశాడు. మరుక్షణమే ‘విభిన్న విషయాలలో ఇంతకుముందే తనకున్న విస్తృత పరిజ్ఞానాన్ని కొంచెం కొంచెంగా వెలికి తీసి నా మీద ప్రయోగిస్తున్నాడు కాబోలు!’ అని సమాధానపడ్డాడు. తన మనోనేత్రం ముందు బేతాళుడు వర్ణించిన దృశ్యక్రమాన్ని మరోసారి ఆవిష్కరించుకున్నాడు. నెమ్మదిగా సమాధానించటం మొదలుపెట్టాడు.

“బేతాళా! నువ్వనుకుంటున్నట్లు పాఠకరావు ఏమీ పోగొట్టుకోనూ లేదు. దానికోసం కథల సంపుటిలో వెతకనూ లేదు. అతడి మనస్తత్వం ఇంతకు ముందు పూర్తిగా నువ్వు చవిచూడలేదు. కనుకనే, నువ్విలాంటి తావిలేని పూవుల్లాంటి అపార్థాలకు తావిస్తున్నావు. అసలు విషయం చెపుతాను, విను.

ఇపుడొస్తున్న తెలుగు కథల్లో, భాష మూడు రకాలుగా ఉపయోగించటం కనబడుతోంది. కొన్ని కథల్లో కథంతా ఇంతకు ముందులానే వ్యావహారికభాషలో ఉంటోంది. మరికొన్ని కథల్లో కథ మొత్తం ఒక ప్రాంతపు మాండలికాల్తో/యాసతో రాయబడుతోంది. మిగిలిన కథల్లో అన్ని పాత్రలో లేదా కొన్ని పాత్రలో ఒక ప్రాంతపు మాండలికాల్తో/యాసతో మాట్లాడుతుండగా, తతిమ్మా కథ వ్యావహారికభాషలో ఉంటోంది.

కథలో వాడిన భాష ఎలాంటిదయినా, చదివించగలగటం కథ ప్రాథమిక లక్షణం. కాని, ఇపుడున్న పరిస్థితి దానికి కొంచెం భిన్నంగా ఉంది. ఒక ప్రాంతపు భాషను ఉపయోగించి రాసిన కథల్లోని కొన్ని పదాల అర్థాలు మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియటంలేదు. నిఘంటువుల్లో కూడా అవన్నీ కనపడటంలేదు. దాంతో సందర్భంతో పాటు పదాల అర్థం తెలుసుకుంటూ కథను చదవాలనుకునే వారికి కొంత అసౌకర్యం కలుగుతోంది. దీన్ని నివారించాలంటే, అలాంటి కథలకి ప్రతి పేజీ క్రింద, పాదపీఠిక రూపంలో ఆ పేజీలో వాడిన మాండలిక పదాలకి అర్థం ఇవ్వాలి. లేదూ ఆ కథ చివరి పేజీలోనయినా మొత్తం కథలో వాడిన మాండలిక పదాలకి ఒక పట్టిక రూపంలో అర్థాలు అందివ్వాలి. అలాంటి పదాల సంఖ్య కొద్దిగానే ఉంటే, కథలోనే ఏ పదానికి అర్థం ఆ పదానికి ఎదురుగా చెప్పాలి. కాని, ఇవేవీ ఆచరణలో పూర్తిగా జరగటంలేదు. దాంతో, కొన్ని కథలు పాఠకులకు అవాల్సినంతగా దగ్గర కావటం లేదు.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పాఠకరావు చదవటానికి తన చేతిలోకి తీసుకున్న కథల సంపుటి, పూర్తిగా ఒక ప్రాంతపు యాసలో/మాండలికాల్తో రాసిన కథలతో కూడుకున్నది. పుస్తకం తెరవగానే అతడు ఆ విషయం గ్రహించాడు. ఏ కథలోనయినా తెలియని పదాలకు అర్థాలు ఆయా పేజీల అడుగున ఇవ్వబడ్డాయా అని చూశాడు. అవి లేవు. అందుకని ‘ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది’ అని పైకే అన్నాడు. పోనీ పదాలకి ఎదురుగా అర్థాలు ఉన్నాయా అని వెతికాడు. అదీ లేదు. దాంతో ‘ఎక్కడికక్కడ కూడా లేవన్నమాట. అయితే ఎలా?’ అని గొణుక్కున్నాడు. పదాల, అర్థాల పట్టిక ఏ కథ చివరయినా ఉందా అని పరీక్షించాడు. ఆఖరి కథ చివర అలాంటి పట్టిక కనపడింది. ‘పోనీలే! దీనికయినా ఉంది,’ అని గట్టిగా అన్నాడు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఆ కథ చదవటంలో లీనమయ్యాడు.”

ఇలా విక్రమార్కుడికి మౌనభంగం కాగానే, అప్పుల ఊబిలో మునిగిన వేతనజీవి, నెల మొదటి రోజున తీసుకున్న జీతంలా, బేతాళుడు చిటుక్కున మాయమయ్యాడు. విక్రమార్కుడి కారులోంచి అప్పటిదాకా వచ్చిన యుగళగీతం అయిపోయి ‘కల ఇదనీ నిజమిదనీ తెలియదులే, బ్రతుకింతేనులే!’ అని పాట ప్రారంభమయింది.

(సశేషం)

(గమనిక 1: తెలుగు కథల్లో భాష ఎలా ఉంటోందో తెలుసుకోవటం కోసం స్థాలీపులాక న్యాయంగా 371 కథల్ని పరిశీలించాను. వీటిలో 279 కథలు పూర్తిగా వ్యావహారికంలో రాయబడ్డాయి. పూర్తిగా మాండలికంలో 78 కథలున్నాయి. పాత్రలు మాట్లాడుకోవటం కోసం మాండలికం, మిగిలిన కథ చెప్పటానికి వ్యావహారికం 96 కథల్లో వాడబడ్డాయి. ఇన్ని కథల్లోనూ, 2 కథలకు మాత్రమే, మాండలిక పదాలకు కథ చివర్లోనో, ఆ పదం వాడిన దగ్గర్లోనో అర్థం ఉంది.

గమనిక 2: తన కథలో, మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియని పదాలేవో ఆ కథారచయితకు పూర్తిగా తెలిసే అవకాశం తక్కువ. అందుకని అలాంటి పదాలను గుర్తించే బాధ్యత, ఆ కథారచయితకి వదిలేస్తే, అది సమగ్రంగా ఉండదు. అందుకని, కథాసంకలనకర్తలు చొరవ తీసుకుని కథల్లో అలాంటి పదాలను మిగిలిన ప్రాంతాల పాఠకులతో/రచయితలతో గుర్తింపచేయాలి. కథారచయితతో వాటికి అర్థాలు ఇప్పించాలి. పదాలనీ, వాటి అర్థాలనీ కథ చివర్లో పొందుపర్చాలి. ఇదంతా జరిగితేనే, కథ చదివిన పాఠకులందరికీ ఆ కథలో వాడిన భాష పూర్తిగా అర్థం అవుతుంది.)


టి. చంద్రశేఖర రెడ్డి

రచయిత టి. చంద్రశేఖర రెడ్డి గురించి: ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖర రెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు. ...