శోకము: ఒక పరిశీలన

పైట లాగాను. బలంగా.

జారలేదు. కొంచెం కూడా.

ఇంకా ఇంకా లాగాను.

అతుక్కుపోయింది. గోడకు అంటించిన పోస్టర్‌లా. పార్సెల్‌కి వేసిన ప్లాస్టర్‌లా. లాగటానికి వీల్లేకుండా.

గీకాను. గోకాను. పీకాను.

పెచ్చులుగా. పొరలుగా. చీర.

తల ఆన్చి గీకాను. గోకాను. ఇంకొంచెం అయితే చాలు.

తల జారిపోయింది ఆ ఎదలోకి. నల్లటి చిక్కటి చీకటి. అమ్మా! అమ్మా! అని అరిచాను.

“లాస్ట్ స్టాప్ మెజస్టిక్! మెజస్టిక్! జల్దీ బన్ని సార్… బన్ని మాడం! మెజస్టిక్!”

నేను కంగారుగా లేచాను. లాప్‌టాప్ బాగ్ వెనక్కేసుకొని సీటు కింద చెప్పులకోసం వెతికాను. వాటిని సగం మాత్రమే ఎక్కించుకొని, గబగబా కిందకు దిగాను. వెతగ్గా వెతగ్గా హాండ్‌బాగ్‌లో లగేజ్ స్లిప్ కనిపించింది. ఇంతలో నాన్న ఫోను. “బస్ చేరుకుందా? లేట్ అయ్యిందా? ఆటోనా, ఓలానా? వెళ్ళాలా ఆఫీసుకి? ఇంటి నుండి పనిచేయడం కుదరదా? బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తావ్? మమ్మీ ఇంకా లేవలేదు. లేచాక కాల్ చేయమననా?”

బేరమాడగా ఆడగా ఆటో కుదిరింది. ఆటో ఎక్కి కూర్చున్నాను. చలి. జాకెట్ హుడ్ తలమీదకు లాక్కున్నాను.

ఇండియా నుండి ఇరవై వరకూ మిసెడ్ కాల్స్. అమ్మకి ఫోన్ చేశాను. పక్కింటాయన ఎత్తాడు. చాలా చెప్పాడు. ‘మదర్ సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియట్లీ!’ అన్నది మాత్రమే తలకెక్కింది. తల మెడ మీదే ఉంది.

కొలీగ్ ఏర్‌పోర్ట్‌ వరకూ వచ్చాడు. “అమ్మకేం కాదులేరా! భయపడకు,” భరోసా ఇచ్చాడు.

ప్లేన్ ఎక్కాను.

అమ్మకేమవ్వచ్చు? హార్ట్ అటాక్? కిడ్నీ ఫెయిల్యూర్?

అమ్మకేమీ కాదు. జెనీవాలో ఆ పార్క్‌లో బొమ్మను చూడగానే అమ్మే అని అనిపించింది. తల కిందకు వంచి, భుజాలు వంగిపోతూ, చేతులు మోకాళ్ళపై పెట్టుకొని కూర్చున్న బొమ్మ. ఆడో మగో తెలిసే వీలు లేని బొమ్మ. ఛాతీ లేదు. పక్కటెముకలు లేవు. పొట్ట లేదు. మెడ నుండి తుంటి వరకూ పెద్ద సున్నా. అంతా ఖాళీ.

అమ్మే. ముమ్మాటికీ అమ్మే! అమ్మ పైట వెనుక దాచేది ఆ ఖాళీనే!

“యేను మాడం! ఎల్లిగ హోగబేకో గొత్తా నిమగే?” గొడవ కన్నడంలో మొదలై హిందీలోకి దిగింది. ఒక చోట లెఫ్ట్ తీసుకోమని చెప్పడం మర్చిపోయాను. అది మిస్ అయినందుకు కిలోమీటర్ తర్వాత యూ-టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. మీటర్ మీద ఇరవై ఎక్స్‌ట్రా అన్నవాడు ఇప్పుడు నలభై ఇచ్చినా ఊరుకోలేదు. వాకిళ్ళు తుడుచుకుంటున్న వాళ్ళంతా తల ఎత్తి చూసేంతగా అరిచాడు.

“దిమాగ్ కహా రక్కె ఆతె, కాయ్‌కీ!” అంటూ వెళ్ళిపోయాడు.


“కాన్సర్. లెట్స్ ట్రై అవర్ బెస్ట్.”

ఇది మోసం. ఇది కుట్ర.

ఇది అన్యాయం. ఇది అమానుషం.

క్లాసులో ఒక పాఠం చెప్పి, పరీక్షలో వేరే పాఠం నుండి ప్రశ్నలు అడిగినట్టు. అవుటాఫ్ సిలబస్!

ఆమె లోపలంతా పుట్టగొడుగుల్లా ట్యూమర్లు మొలిచాయి. ఎప్పటి నుండి మొలుస్తున్నాయో? తెలియలేదా? చూసుకోవద్దా? అని డాక్టర్లు.

‘డౌన్ అగైన్ విత్ హెడేక్?’ సిక్ లీవ్ మెసేజ్‌కి మానేజర్ రిప్లయ్. ఐదు నిముషాలు తటపటాయించి బదులిచ్చాను, అవునని. ‘ఓకే. టేక్ కేర్. లెట్‌మి నో ఇఫ్ యు నీడ్ ఎనీ హెల్ప్!’

అమ్మ ఫోను చేసింది. హలో అనగానే గొంతెందుకు అలా ఉందని అడిగింది. రాత్రంతా పనిచేసి నిద్రలేక అని చెప్పాను. పెరుగన్నం తిని పడుకుంటే సరైపోతుందని చెప్పి కట్ చేశాను.

సరైపోతుంది. సరైపోతుంది.

డాక్టర్లు ఇలానే చెప్తారు. గోరంతది కొండంత చేసి. ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని లక్షల బిల్ చేయటం కోసం. అంతే! అన్నీ అయ్యాక, “నథింగ్ టు వర్రీ! రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే సరిపోతుంది.” అని అంటారు. అంతే! అంతే!

జెనీవాలో చూసిన బొమ్మ లెక్కలో అమ్మ లోపలంతా ఖాళీ అని అర్థమయ్యింది. ఇప్పుడేమో లోపలంతా కిక్కిరిసిన ట్యూమర్లున్నాయని అంటున్నారు.

ఏది నిజం? ఎలా అర్థం చేసుకోవడం?

అమ్మ. అమ్మను లోలోపల ఇన్నాళ్ళూ తొలిచేస్తున్నదేదో ఊహకి అందనిది కాదు. అలా తొలిచేయడం వల్ల ఏర్పడ్డ ఖాళీలు. ఖాళీ అయిన ప్రదేశంలో సరుకంతా అక్కడే కుప్పలుగా. వాటినేనా డాక్టర్లు ట్యూమర్లని అంటుంది?


“నో మా! అట్లీస్ట్ థర్టీ మినిట్స్ సన్ ఈజ్ ఎ మస్ట్! ఉదయాన్నే ఏడు నుండి ఏడున్నర వరకూ ఎండలో కూర్చోండి. వీలైతే నడవండి. లేకపోతే కష్టం.” డాక్టర్ ఉవాచ.

పొద్దున్నే దగ్గర్లో ఉన్న పార్క్‌కి వెళ్ళటం మొదలెట్టాను. స్కూల్ హడావిడి ఉంటుంది కాబట్టి పిల్లలెవరూ రారు ఆ సమయంలో. పెద్దవాళ్ళే పార్క్ చుట్టూనో, పార్క్‌లో ఒక పక్కగా పెట్టిన జిమ్ ఎక్విప్‌మెంట్ చుట్టూనో తిరుగుతారు.

చేయి చాచినంత దూరంలో అమ్మ చుట్టూ అన్నయ్య తిరుగుతాడు.

నా చేయి సాగినంత దూరంలో నేను అన్నయ్య చుట్టూ తిరగాలి.

అమ్మ సూర్యుడు.
అన్నయ్య భూమి.
నేను చంద్రుడు.

అట.

ఆట.

నేను ఆట మధ్యలో అమ్మ దగ్గరకు పరిగెత్తి చీర కుచ్చిళ్ళల్లో దూరిపోయాను. రూల్స్ ఒప్పుకోవు అంటూ వెనక్కి లాగాడు.

సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడూ తిరగాలి అన్నాడు.

అయితే నేను భూమి. నేనే అమ్మ చుట్టూ తిరుగుతా.

కుదరదు. సూర్యుడు అన్నింటికన్నా పెద్ద. భూమి చిన్నది. చంద్రుడు ఇంకా చిన్న. మనింట్లో అందరికన్నా చిన్నవాడివి నువ్వే!

అమ్మ నిజమేనని చెప్పింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటేనే మనకి పగలు, రాత్రి, కొత్త సంవత్సరాలు వస్తాయని చెప్పింది.

మనమిలా ఆడుకుంటూ ఉండాలంటే నేను అమ్మ చుట్టూ, నువ్వు నా చుట్టూ తిరగాలిరా! అన్నాడు.

కానీ వాడో అబద్ధాలకోరు. ఫకింగ్ బిగ్ లయర్!

పార్క్ వాచ్‌మెన్ ఈల ఊదాడు, గేట్లు మూసే టైమ్ అయ్యిందని సూచించడానికి. మొబైల్ చూసుకుంటే టైమ్ ఐదు నిముషాల తక్కువ తొమ్మిది. తొమ్మిదన్నరకి మీటింగ్ ఉంది. గబగబా ఇంటికి పరిగెత్తాను.


‘ఇవ్వాళ సాయంత్రం ఏడింటికి రంగశంకరలో బిఖరె బింబ్ నాటకానికి ఒక టికెట్ ఉంది. ఎవరికైనా కావాలంటే నన్ను పింగ్ చేయండి.’ ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ చేసిన ఐదు నిముషాల్లో టికెట్ ఫార్వార్డ్ చేయడం అయిపోయింది.

‘నువ్వు రావటం లేదా? ఇది తప్పకుండా చూడాల్సిన నాటకం అని ఊదరగొట్టావ్! ఆల్ ఒకే?’ ఒక స్నేహితుడు.

‘యెస్. యెస్. నీడ్ టు ఫినిష్ సమ్ స్టఫ్ ఎట్ వర్క్. సో…’

‘కమాన్! ఇట్స్ వీకెండ్ యార్!’

ఒక స్మైలీ ఇచ్చి ఊరుకున్నాను.

అమ్మా! ఛీ! ఛీ! నువ్వు పాకిస్థాన్‌కి సపోర్టా?! చీర మార్చెయ్!

నీలం చీరలేవీ లేవురా చిన్నా! ఇందాకే పైన ఆరేసి వచ్చా! అప్పుడే ఎండవ్.

ఛత్. టీవీ మళ్ళీ దొబ్బింది. మాచ్ ఉన్న రోజునే మాయరోగం దీనికి.

వంట అయ్యింది. అన్నం తిందురు రండి.

అమ్మా! అమ్మా! మనం కూడా కేబుల్ కనెక్షన్ పెట్టించుకుందామమ్మా! నేను పరిగెత్తుకొనెళ్ళి కేబుల్ సాయిగాడిని పిల్చుకొని రానా?

ఉండ్రా! పైకెళ్ళి నేను ఆంటెన్నా సరిజేసి వస్తా! నువ్వు ఇక్కడుండి టీవీలో బొమ్మ వస్తుంటే చెప్పు.

రేయ్… చెప్పులేసుకొనెళ్ళు. కాళ్ళు కాలిపోతున్నాయి పైన. కుక్కర్ చల్లారేవరకూ ఆకలని ప్రాణం తోడేశారుగా!

రావట్లా… రావట్లా… ఆఁ… వస్తుందొస్తుంది!… లేదు, పోయింది… ఇంకొంచెం ఇటు. లేదన్నయ్యా అటే… ఇందాకట్లా పెట్టు… ఆఁ… ఆఁ… ఇంకొంచెం అటే…

థాడ్!

అరుపులు. పరుగులు. గుంపులు.

ఎర్రగా మారుతున్న అమ్మ కట్టుకున్న ఆకుపచ్చని చీర. అన్నయ్య ఒంటికి చుట్టుకొని ఉన్న నీలం రంగు చీర.

ఆంబులెన్స్ సైరన్లు.

చుట్టాలు. చుట్టుపక్కలవాళ్ళు. తెలిసినవాళ్ళు. తెలుసుకొని వస్తున్నవాళ్ళు.

వచ్చారు. ఏడ్చారు. వెళ్ళారు.
వచ్చారు. ఏడ్వాలన్నారు. వెళ్ళారు.
వచ్చారు. ఏ గాయానికైనా కాలమే మందన్నారు. వెళ్ళారు.

ఇక రావడం ఆపేశారు.

ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దం. నన్ను చూడగానే క్లాసులోనూ నిశ్శబ్దం.

ఒక రోజు టీవీని కిందపడేసి దాని మీద కాళ్ళేసి కసితీరా తొక్కుతూ అరిచాను. పాపిష్టిదానా, నీ వల్లే అంతా!

అమ్మ పరిగెత్తుకుంటూ హాల్‌లోకి వచ్చింది. నేనింకా మిగిలే ఉన్నానని బహుశా అప్పుడే అమ్మకి స్ఫృహ వచ్చినట్టుంది.

తలుపు కొట్టే శబ్దాలు. నా పేరు వినిపిస్తుంది. కరెంటు ఎప్పుడు పోయిందీ? టైమ్ ఎంతవుతుందీ? చీకట్లో అన్నీ దాటుకుంటూ వెళ్ళి తలుపు తీశాను.

“ఏంటమ్మాయ్! కంగారు పెట్టేస్తున్నావ్‌గా అసలు!” అంటూ లోపలికి వచ్చిన ఫ్రెండ్, మొబైల్‌లో ఫ్లాష్ లైట్ వేస్తూ… “ప్లే‌కి వెళ్తా అన్నావ్? ఫేస్‌బుక్ అప్డేట్ చూసి ఇంట్లో ఉంటావ్ కదా అని ఒక వంద ఫోన్లు చేశా. లిఫ్ట్ చేయవేం?! హమ్మ… ఈ మూడు ఫ్లోర్లు హెక్క…లేక… మంచినీళ్ళు…”

నేను గదిలోనే ఉన్నానా అన్న అనుమానంతో గదంతా ఫ్లాష్ లైట్ తిప్పింది. వెలుతురు నా మీద పడేసరికి నేను మొహానికి చేతులు అడ్డుపెట్టాను.


మేము ముగ్గురం కూర్చున్న దగ్గర తప్పించి మిగతా లైట్స్ అన్నీ తీసేశారు. ఎ.సి. ఉండీ లేనట్టు ఉంది.

మెషీన్ల జోలలో అమ్మ నిద్రపోతుంది. నేనా పక్కనే కూర్చున్నాను.

“సాలా! ఏక్ బజ్ గయా! అసలు ఇష్యూనే అర్థమవ్వటం లేదు. ఇంకెప్పుడు ఫిక్స్ చేస్తాం? ఎప్పుడు రిలీజ్ చేస్తాం?” నా సైగ చూసి మాట్లాడుతున్నవాడు మెల్లిగా మాట్లాడాడు.

అమ్మకి మెలకువ వస్తే! భరించలేని బాధలో ఉంది. ఇప్పుడే కొంచెం పడుకున్నట్టుంది.

“మిస్టర్. మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ కీమో పనిచేసే తీరే అంత. సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత చాలా ఎక్కువ…”

“డామిట్! యు ఆర్ కిల్లింగ్ ది గుడ్ సెల్స్!” అన్నాను.

కోడ్ మార్చబోతున్న సాగర్ ఆగిపోయి చూశాడు. అజ్జూ నీళ్ళ బాటిల్ అందించాడు.

“…భరించాలి. లేదంటే ట్రీట్‌మెంట్ ఆపేయాలి. బీ బ్రేవ్, యంగ్ మాన్! నాకీ కేస్‌లో చాలా హోప్ ఉంది.”

నీళ్ళు తాగాను. “నో, ఐ మీన్, సమస్య లేని కోడ్‌ని ఈ టైమ్‌లో కెలికితే మనం దీంట్లోంచి ఈ రాత్రికి బయటపడం. ఆల్రెడీ బి.యు. హెడ్ నుండి మూడు మెయిల్స్ వచ్చాయి, ఎంత వరకూ వచ్చిందంటూ. కస్టమర్ టికెట్స్ ఇంకా ఎక్కువవుతున్నాయి. ప్లీజ్. లెట్స్ నాట్ మెస్ ఇట్ ఫర్దర్!”

సమస్య అర్థమై ఫిక్స్ ఇచ్చేసరికి మూడయ్యింది. నాలుగున్నర వరకూ సర్వర్స్ మానిటర్ చేస్తూ కూర్చున్నాం. కస్టమర్ కాల్స్ తగ్గాయని మెయిల్స్ రావటం మొదలయ్యేవరకూ.

అమ్మ పడుకునే ఉంది. నేను గోడకు ఆనుకొని అమ్మ కోసం తెచ్చిన చీరల్లో ఒకదాన్ని మడత విప్పకుండా చుట్టుకొని కూర్చునే ఉన్నాను.

“ఏంటీ? రాత్రంతా ఆఫీసులోనే ఉన్నావా? వెళ్ళు, వెళ్ళు. సుబ్బరంగా వేడివేడిగా తినేసి నిద్రపో! ఇవ్వాళ్టికి ఇంక పని చేయకు! లేచాక ఫోన్ చెయ్యి!” అమ్మ నుండి పొద్దున్నే వచ్చే కాల్‌ వచ్చేసరికి ఇంకా ఆఫీసులోనే ఉన్నాను.

హాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఉందంటే ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాను. ఖాదీ, కలంకారీ, ఇక్కత్, చికన్‌కారీ, బోలెడన్ని వెరైటీలు. చీరలు, చుడీదార్‌లు, స్కర్టులు, చొక్కాలు, లుంగీలు, అన్ని రకాలు. ‘ఈ చీరెంత బాగుందో కదా!’ అంటూ ఫ్రెండ్ ఆపింది. కేరళ చీర. తెల్ల చీరకి బంగారపు అంచు. కొంగులో పెద్ద దీపపు కుందె బంగారపు దారంతో.

“నాన్నే! నాన్నే చేశాడు.” అని అన్నయ్య. “ఇంకో మాట మాట్లాడితే వీపు బద్దలవుతుంది. నోటికొచ్చినంత మాట్లాడుతున్నావ్!” అని అమ్మ. అమ్మకేసి-అన్నకేసి, అన్నకేసి-అమ్మకేసి చూసే నేను.

నేను అమ్మ కడుపులో ఉన్న దీపావళి. పట్టుచీరలో నిండుగా అమ్మ. కొత్తబట్టల్లో తళతళా అన్నయ్య, నాన్న, నాన్నమ్మ. దీపాలు పెట్టే వేళ అమ్మ కొంగుకి నిప్పంటుకుంది. అందరూ తలో చేత్తో మంటలు ఆపేశారు. పెద్ద ప్రమాదమే తప్పింది. అమ్మ స్ఫృహతప్పి పడబోయింది. పుట్టబోయే బిడ్డకు మంచిది కాదన్నారు.

కొంగే గాలికి దీపం మీదకు పోయిందని అమ్మ. లేదూ, నాన్నే దీపానికి అంటించాడని అన్నయ్య. వీళ్ళిద్దరు తప్ప నాకు ఆ సంఘటన గురించి చెప్పగలిగే మరో మనిషి తెలీదు. ఏది నిజం? ఎవరు చెప్తుంది నిజం? ఎంత నిజం?

కొట్టాయన కొట్టబోయినంత పని చేశాడు చేతిలోని చీర లాగేసుకుంటూ. అతని అరుపులు విని చెరో కొట్టు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేశారు. మిగతావారంతా చేతిలో ఉన్నవి పక్కకు పెట్టి చోద్యం చూడ్డం మొదలెట్టారు.

“మాటలు మర్యాదగా రానివ్వండి, సార్! చీర ఎంత? పదిహేనొందలా! ఇవ్వవే డబ్బులు! ఇది మా చీర ఇప్పుడు.”

చీర కొంగు అంచు నుండి లాగిన దారపు పోగులు నా చేతిలోంచి దులిపింది ఫ్రెండ్.


అల్మారాలో చీరలన్నీ అలానే ఉంచాను. వాటిని చూసే ధైర్యం కూడా లేకపోయింది కొన్నాళ్ళు. అరలో సర్దిన అన్నయ్య పుస్తకాలని, టేబుల్ మీదున్న అన్నయ్య పెన్నులని అలానే చూస్తూ ఉండిపోయేవాణ్ణి. వాటిని తాకే ధైర్యంలేదు. వాడికి పొట్టయిపోయిన నిక్కర్లూ, చొక్కాలూ నేను వేసుకునేలా చేసే అమ్మ, ఒక రోజు నేను వచ్చేసరికి వాడి బట్టలన్నీ తీసేసింది. వాడి అరంతా ఖాళీ అయిపోయింది.

హే! నాకు విపరీతమైన తలనొప్పి. కొంచెం జ్వరం కూడా ఉన్నట్టుంది. రేపు చూద్దామా ఈ పని? యెస్. నేను ఉంటాను. డేటాబేస్ మైగ్రేషనేగా! ఐ విల్ హెల్ప్.

వాడి వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంటే వాడొస్తాడేమోనన్న ఆశ అంటిపెట్టుకొని ఉండేది. ఎలాగూ, టెన్త్ పరీక్షలు కాగానే వాడిని రెసిడెన్షియల్ ఐఐటి కోచింగ్‌లో చేర్చాలని అమ్మ. “పోరా, పో! నువ్వు పోతే, గదంతా నాదే! ఐ యామ్ ది సోల్ కింగ్!” అని ఎగిరాను. వాడలా కోచింగ్‌కని వెళ్ళి…

అబ్బా.. ఏమయ్యింది, ఏమయ్యిందని ఎన్ని సార్లు అడుగుతావ్? ఏమవుతుంది? నేనేదో చచ్చిపోతున్నట్టు ఎందుకంత గాభరా, నీకు?

చీరలు. జాగ్రత్తగా మడతపెట్టి ఉన్న చీరలు. ఒకట్రెండు అరల్లో చక్కగా సర్దిన చీరలు. చీరలు. చీరలు.

ప్లీజ్. ఇప్పుడు కమర్షియల్‌లో షాపింగ్ అంటే నావల్ల కాదు. నాకు బయటకొచ్చే మూడ్ లేదు. ప్లీజ్, అండర్‌స్టాండ్!


అందరూ నన్ను చుట్టుముట్టారు. ఫ్రెండ్స్. అమ్మానాన్న. కొలీగ్స్. ఆఖరికి నేను వెళ్ళే పార్క్‌కి వచ్చేవాళ్ళు కూడా?

అందరూ నిలదీశారు; ఏమయ్యింది నీకు? ఎందుకలా ఉంటున్నావ్? ఏం ఆలోచిస్తూ ఉంటున్నావ్? మొహం ఎందుకలా ఉంటుంది?

సర్దిచెప్పడానికి చూశాను; ఏమీ లేదు? ఏమవుతుంది నాకు? ఏదో కొంచెం తలనొప్పి. అప్పుడప్పుడూ పని వత్తిడి.

ఒప్పుకోలేదు ఎవరూ; లేదు. లేదు. ఇంకేదో ఉంది. ఏదో దాస్తున్నావ్. ఏంటది?

చెప్పక తప్పలేదు.

అంతా విన్నారు; ఏంటీ విడ్డూరం? లేని అన్న పోయాడని బాధేంటి? ఉన్న అమ్మ ఉండగానే పోయినట్టు ఏడుపేంటి? మతి పోయిందా? దెయ్యం పట్టిందా?

“ఇది నీ కథ కాదు. ఎవరి కథనో నీ కథ అనుకుంటున్నావేంటి?”

“ఇది నాదే!”

“డోన్ట్ ఫూల్ అరౌండ్. నువ్వు చెప్తున్న కథలో నీ జెండర్ కూడా మారిపోతోంది. గమనిస్తున్నావా?”

“అది కాదు. నన్ను బాధించే విషయం చెప్పమన్నారు. చెప్పాను.”

“నీ జీవితంలో జరగని ఘటనలు, లేని మనుషులని ఊహించుకొని అది నీకే జరిగినట్టు భ్రమ పడుతూ బాధపడుతున్నావ్!”

“డామిట్! నాట్ యువర్ బ్రదర్. నాట్ యువర్ మదర్. సో వాట్? ఐ యామ్ సిక్ ఆఫ్ హియరింగ్ దట్ షిట్!”

అంతే! అందరికి కోపం ముంచుకొచ్చింది. మర్యాదగా మా మాట విను, లేదా మేం ఏమైనా చేస్తామన్నారు. నేను వినలేదు. ఒక చేతి మీద ‘నాకు మతి భ్రమించింది’ అని పచ్చబొట్టు వేయించారు. ఇంకో చేతి మీద ఇంకేదో మొదలెట్టబోయారు.

ఆ సూదుల బాధకు తట్టుకోలేకపోయాను.

మందులన్నారు. మాకులన్నారు.

చివరకి వాళ్ళు చెప్పినట్టే విన్నాను.

మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు. కాకూడదు.
మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు. కాకూడదు.
మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు. కాకూడదు.
మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు. కాకూడదు. (మరి నాకెందుకు ఇంత ఏడుపొస్తుంది?)

మా అమ్మ … మా అన్న… నా బాధ…

మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు. కాకూడదు. (నేనెందుకు ఇంత పీడను అనుభవించడం?)

సారీ! సారీ! ఇంకెప్పుడూ ఎదురు ప్రశ్నించను.

మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు.
మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు.
మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు.
మా అమ్మ కాదు. మా అన్న కాదు. నా బాధ కాదు.

చెప్పిందే అప్పజెప్పితే చాలదంది లోకం. పరీక్షల్లో నిరూపించుకోమంది.

థియరీ పరీక్ష

ప్రశ్న: నీవు నేర్చుకున్నది యెట్టిది?

జవాబు: కన్నీళ్ళు అపురూపమైనవి. అర్థవంతమైనవి. కన్నీటికి స్వార్థము ఉండును. వాటిని కేవలం మన కోసమో, మనవారి కోసమో ఉపయోగించవలెను. అసలు, వేరొకరి కథ వింటున్నప్పుడు మనకు కలిగే కన్నీరు యొక్క మూలాధారము ఆ కథ కాదు. మనలో నిక్షిప్తమైన మరేదో బాధ. ఎవరున్నూ ఎవరి కోసమూ ఏడ్వరు. ఏడ్వకూడదు. మనవారికోసము శోకించకపోవుట ఎంత అనాచరణీయమో, పరుల బాధను సొంత బాధలా భావించడము అంతే అసహజము, అభ్యంతరకరము. కావున, ఎల్లవేళలా కన్నీరుకు కేరాఫ్ అడ్రెస్ మనదే ఉండు విధముగా చూసుకోవలెను. అనాథ కన్నీళ్ళన్నవి లోకమున మనజాలవు.

ప్రశ్న: బాధయందు అడగకూడని ప్రశ్నలు యెట్టివి?

జవాబు: ఎందుకు మరణించడం? ఎందుకు కొందరికే అకాలమరణం? ఎందుకు కొందరు మరణించాలని ప్రయత్నించీ మరణించలేరు? మరణం శిక్షా? ఎవరికి శిక్ష? పోయినవారికా? మిగిలిపోయినవారికా? శాపవిమోచనమా? కొత్త శాపమా? ఇత్యాది ప్రశ్నలు అడుగరాదు. అనివార్యమగు ఈ విషయముల గూర్చి శోకింపతగదు. ముఖ్యముగా ఒక జాతిగా మనము జవాబులు చెప్పుకోలేని ప్రశ్నలను మనమే మరల మరల గుర్తుచేసుకొనరాదు. అట్టివాటిని వ్యర్థమైన ప్రశ్నలుగా భావించి వాటికి దూరముగా ఉండవలెను.

ప్రశ్న: అనవసరపు ఆలోచనలు వచ్చినచో ఏమి చేయవలెను?

జవాబు: మన ఆలోచనలు యథావిధిగా వదిలివేయరాదు. వాటిని అనునిత్యం నీడలా వెంటాడవలెను. వాటిని క్రమశిక్షణలో ఉంచవలెను. ఏదేని ఆలోచన గాడి తప్పుతుందన్న స్పృహ కలుగగానే దాన్ని అంతమొందించవలెను. మన ఆలోచనలు మన చేతిలో ఉన్నవి. అవి ఆడించినట్టు ఆడుట మూర్ఖుల లక్షణం.

ప్రాక్టికల్ పరీక్ష

ప్రశ్న: మీరు మీది కాని కథలో బందీయై ఉన్నారు. అక్కడ నుండి తప్పించుకొని చూపించండి.

చాలాసేపు ఆలోచించాను. థియరీ పరీక్షల్లో ఏమన్నా రాసి తప్పించుకోవచ్చుగానీ, ప్రాక్టికల్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అటూ ఇటూ అయినా అక్కడక్కడే సున్నా మార్కులు వేసేస్తారు.

తల బద్దలైపోతుంది. ఆలోచన మాత్రం అంగుళం కూడా కదల్లేదు. ప్రాక్టికల్స్ జరుగుతున్న లాబ్ ఒక త్రీ బి.హెచ్.కె. అపార్ట్‌మెంట్. దాని బాల్కనీలోకి వెళ్ళాను. నేను తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు ఇక్కడనుండి తప్పించుకొని చూపాలి.

అటూ ఇటూ తిరిగితే ఆలోచనలూ కదులుతాయేమోనని తిరిగాను. బెడ్రూమ్ లోంచి కిచెన్‌కి. మళ్ళీ వెనక్కి. బ్రహ్మాండమైన ఐడియా తట్టింది.

అబ్జక్టివ్: ఈ కథనుండి, అంటే ఈ ఇంటి నుండి తప్పించుకోవడం.

అప్రోచ్: ఇష్టంలేని పెళ్ళి అవుతున్న హీరోయిన్ నాలుగైదు చీర కొసలను ఒకదాని చివర ఒకదానితో ముడివేసి, మొదటి చీర కొసను బాల్కనీకో కిటికీకో బలంగా కట్టి, దాన్ని పట్టుకొని కిందకు దిగుతూ తప్పించుకున్నట్టు నేనూ ఈ కథలోంచి తప్పించుకుంటాను.

ఇంటి తలుపు మూసి అల్మారా తెరిచాను. ఒక అరంతా మడతపెట్టిన చీరల దొంతరలు. అన్నీ లేత రంగు చీరలే. కాటన్‌వి ఎక్కువ. ఒక దొంతర మీద చేయి వేశాను. సుతిమెత్తగా తాకిన బట్ట. మూడో చీరకి నాలుగో చీరకి మధ్య అరచేయి చాపాను. ఇన్నాళ్ళైనా ఇస్త్రీ వెచ్చదనం ఉందనిపించింది. చేయి వెనక్కి లాగి ఇంకా లెక్కపెడుతుంటే బూడిద రంగు చీర ఒకటి కనిపించింది. బయటకు తీశాను. లేత గులాబీ రంగులో అక్కడక్కడా చిన్న బుటా. అరంగుళమంత మామిడి పిందెలు.

మడత విప్పుతూ పైట వేసుకొని అద్దంలో…

బెల్ మోగింది. హాఫ్ టైమ్ అయిపోతుందనుకుంటా.

చీర నేల మీద పరుచుకుంది. నేను దాని మీద కూలబడిపోయాను.

మునగదీసుకొని దొర్లాను, చీర మొత్తం నన్ను చుట్టుకునేట్టు. అది చీర కాకుండా పోయినట్టు. అరవై కేజీల మనిషిని మోయగల గర్భసంచిగా మారినట్టు.

బెల్ మోత ఇంకా గట్టిగా వినిపించింది.

చీర పొరల్లోంచి సన్నగా జారుతున్న వెలుగు. వెలుగులో మెరుస్తున్న మామిడి పిందెలు.

ఒకదాన్ని నిమిరాను. కాస్త చిన్నగా అయ్యాను.

ఇంకా నిమిరాను. ఇంకొంచం చిన్నగా అయ్యాను.

నిమిరాను. నిమిరాను.

ఒక దారపు పోగు అయ్యేంతవరకూ.

అందులో నేను కలసి పోయేవరకూ.


రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...