“సూర్యం గారిల్లిదేనాండీ?” అంటూ ఎవరిదో గొంతు వినిపించి మధ్య గదిలో టైపు చేసుకుంటున్నవాణ్ణి ఒక్కసారి ఆగాను. ఇండియన్ ఎక్స్ప్రెస్కి త్వరగా ఈ వార్తని టెలిగ్రాం పంపించాలి. మూడింటిలోగా విజయవాడ అందితే రేపు పేపర్లో వచ్చేస్తుంది. నా పత్రికాఫీసు మా ఇంటికి దగ్గర్లోనే వుంది. అక్కడయితే వచ్చీ పోయేవాళ్ళ గోలతో పని కాదు. అందుకని ఇంటికొచ్చి మరీ టైపు చేసుకుంటున్నాను.
“సూర్యం గారూ! మీ కోసం ఎవరో వచ్చారు..” మా ఇంటి యజమాని గట్టిగా అరిస్తే లేచి వీధి గుమ్మం వైపు నడిచాను. అక్కడ ఒక కుర్రాడు కనిపించాడు. చామనచాయ రంగులో ఉన్న ఆ వ్యక్తి నన్ను చూడగానే నమస్కరించాడు. నేను ప్రతినమస్కారం చేసాను. వచ్చినతన్ని ఎప్పుడూ చూసినట్లు లేదు.
“నమస్కారమండీ. నేను మిమ్మల్ని కలవాలని మద్రాసు నుండొచ్చాను.”
“అలాగా!” అంటూ లోపలకి రమ్మనమన్నట్లు సంజ్ఞ చేసాను. కుర్చీలో కూర్చోమని చెప్పి నేను నా టైపు మిషన్ ముందు కూర్చున్నాను.
“ఎవరు మీరు? మిమ్మల్నెప్పుడూ..” అంటూండగానే అతనే చెప్పుకొచ్చాడు.
“నా పేరు రాఘవ. మాది మద్రాసు. మీరు ఆ మధ్య ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక ఆర్టికల్ చదివి మిమ్మల్ని కలవాలని ఇంత దూరం వచ్చాను.”
“నా ఆర్టికల్ చదివి వచ్చారా? ఏదది?” అతను మద్రాసు నుండి వచ్చాడంటే ఆశ్చర్యం వేసింది.
“అవునండీ. నెల్లాళ్ళ క్రితం మీరు రాసిన ‘డౌరీ ఫర్ కుకింగ్?’ అన్న ఆర్టికల్ చదివి చాలా ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే పేపరుకి ఒక ఉత్తరం కూడా రాసాను. చూళ్ళేదా మీరు?” లేదన్నట్లు తలూపాను.
ఓ నెల ముందు నేను ‘డౌరీ ఫర్ కుకింగ్?’ అన్న పేరుతో ఇక్కడే కోనసీమలో జరిగిన ఒక సంఘటన్ని పేర్లు మార్చి ఆర్టికల్ రాసాను. అదేమిటంటే నందంపూడి వెంకట్రామయ్య కూతురి పెళ్ళిచూపులు. ముందు పెద్దవాళ్ళొచ్చి పిల్లని చూసారు. పెళ్ళికొడుకు విశాఖపట్నంలో ఉద్యోగం. పెళ్ళికొడుకుతో రెండోసారి వచ్చినప్పుడు పిల్ల నచ్చిందీ తాంబూలాలు అప్పుడే తీసుకుందామని ప్రస్తావించారు. అంతే కట్నాల దగ్గర పేచీ వచ్చింది. వెంకట్రామయ్యకీ సంబంధం తెచ్చింది నేనే! పెళ్ళికొడుకు తండ్రి మాకు దూరపు చుట్టం. ఆ మధ్య వైజాగెళ్ళినప్పుడు వాళ్ళబ్బాయి పెళ్ళికొడుకని తెలిసింది. వెంకట్రామయ్యా నేనూ చిన్నప్పటినుండీ స్నేహితులం. ఇద్దరం అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోనే వెలగ పెట్టాం. వాడు ఎయిత్ ఫోరంలోనే చతికిలబడితే చదువచ్చి రాలేదని వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకోమన్నాడు. నేను స్కూలు ఫైనలు వరకూ అక్కడే చదివాను. తరువాత మద్రాసులో కొంతకాలం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీసులో పనిచేసాను. మా నాన్న పోరు పడలేక ఆ వుద్యోగం వదిలేసి ఇక్కడ అమలాపురంలో విలేకరిగా సెటిల్ అయ్యాను.
ఆ పెళ్ళి చూపుల్లో కట్నాల దగ్గర నేనే మధ్యవర్తిగా ఉన్నాను. ముప్పైవేలు కట్నం, లాంచనాలూ ఇవ్వడానికి వెంకట్రామయ్య సిద్ధపడ్డాడు. పెళ్ళికొడుకు మాత్రం ఏభైవేలకి తగ్గనని మొరాయించాడు. ఏభైవేలంటే చాలా ఎక్కువ.
వెంకట్రామయ్యకి దమయంతి పెద్ద కూతురు. మగపిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. దమయంతి మొహం మాత్రం చాలా కళగా ఉంటుంది. స్కూలు ఫైనల్ దాకా చదివింది. కానీ పొట్టీ, కొంచెం లావూ! ఫొటోలో మొహం చూసి ఎవరైనా ఇట్టే పడిపోతారు. తీరా మనిషిని చూస్తే గతుక్కుమంటారు. దమయంతికి గతంలో చాలా సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోయాయి. వెంకట్రామయ్యకి కూతురి పెళ్ళి బెంగ.
పెళ్ళి మాటల్లో ‘ఏభయికి తగ్గేది లే’దని ఆ పెళ్ళి కొడుకు గట్టిగా అనడం లోపల్నుంచి దమయంతి వింది. విసురుగా పదిమంది మధ్యకూ వచ్చి – “సరే నువ్వు కోరినట్లుగానే మా నాన్న కట్నం ఇస్తాడు. కానీ ఒక షరతు. పెళ్ళయ్యాక నువ్వు నాకు వంట చేయాలి. దానికి నువ్వు రెడీ అయితే నిన్ను పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే ఇక్కణ్ణుండి వెళ్ళచ్చు.” అంటూ అనేసరికి అక్కడున్న పెద్దలందరమూ నోరెళ్ళ బెట్టాం. దమయంతి మాటలకి షాక్ తిన్నాడా పెళ్ళికొడుకు. మొత్తానికి ఆ సంబంధమూ చెడింది.
“నాన్నా! పెళ్ళి కాకపోతే ఇలాగే ఉండిపోతాను. అంతేకానీ ఈ వేలంపాటకి బలి కాను. నువ్వసలు నాకు సంబంధాలే చూడద్దు” అని తండ్రికి తెగేసి చెప్పింది. దమయంతి తెగువకి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ పదిమందిలోకీ రావడానిక్కూడా సిగ్గు పడే దమయంతి అందరి మధ్యా అలా అనేసరికి ఆశ్చర్యంతో పాటు, ఆమె ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాను.
ఈ సంఘటనే పేర్లు మార్చి రాసి పేపరుకి పంపాను. వాళ్ళకి నచ్చి మద్రాసు ఎడిషన్లో కూడా వేసారు. ఈ వ్యాసానికి వచ్చిన స్పందన చూసి మద్రాసు ఎడిటర్ నన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉత్తరం రాసాడు. అతను కూడా అది చదివి నన్ను అభినందించడానికొచ్చాడని అనుకున్నాను.
“మీ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాకబు చేసి మరీ వచ్చాను. మీరు జరిగిన సంఘటన ఆధారంగా రాసారని గ్రహించాను. మీరు ప్రస్తావించిన ఆ అమ్మాయిని కలుద్దామని వచ్చాను సార్! ఆ అమ్మాయి ధైర్యమూ, సంస్కారమూ చూసి ముచ్చటపడ్డాను. ఆ అమ్మాయిలా ప్రతీవారూ ఉంటే ఈ వరకట్నం అన్నదే పోతుంది.” అంటూ అతను వచ్చిన విషయం చెప్పాడు.
ఆ వచ్చినతను దమయంతిని కలవడానికొచ్చాడని గ్రహించాను. అతనికి జవాబేం చెప్పాలో తెలీలేదు.
నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దని స్నేహాన్ని తెంపేసాడు. నేనూ ఒక మధ్య తరగతి తండ్రినే! నాకూ ఇద్దరు ఆడపిల్లలున్నారు. కట్నం ఇవ్వందే పెళ్ళి కాదన్న సంగతి నాకూ తెలుసు. వెంకట్రామయ్యకి నచ్చ చెప్పినా వినే స్థితిలో లేడని తెలిసి నేనూ రెట్టించలేదు. వారం క్రితం కొడుక్కి ఉపనయనం చేస్తే నన్ను పిలవలేదు. వాళ్ళ ఆడవాళ్ళు కూడా మాకు తెలుసున్న వాళ్ళందరినీ పిలిచారు కానీ మా ఆవిడ పూర్ణకి బొట్టు పెట్టి పిలవలేదు. పూర్ణ బాధ పడింది. నేనివేమీ పట్టించుకోలేదు.
జరిగినదంతా అతనికి చెప్పాను. అతను దమయంతిని కలుస్తాననీ, వాళ్ళ పెద్దలకి అంగీకారమయితే పెళ్ళి కూడా చేసుకుంటాననీ చెప్పాడు.
నేను దమయంతి పేరూ, వెంకట్రామయ్య పేరూ అతనితో చెప్పలేదు. పైకి నా స్నేహితుడనే చెప్పాను. అతను వాళ్ళ అడ్రసివ్వమని నన్ను బలవంతం చేసాడు. అసలే వెంకట్రామయ్యకి నేనంటే పీకల వరకూ ఉంది. ఇలా నేనే పంపించానని తెలిస్తే అగ్గిమీద గుగ్గిలమవుతాడు.
“తప్పయ్యా! నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అసలే మాకూ, వాళ్ళకీ చెడింది. ఇలా నిన్ను పంపానని తెలిస్తే…”
అతను బ్రతిమాలాడు. అతని మాట తీరు చూస్తే మంచి వాడిలాగే అనిపించింది. చివరకి వెంకట్రామయ్య ఎడ్రసిచ్చాను. నా పేరు ఎక్కడా ఎత్తొద్దనీ చెప్పాను. అతను వెంటనే వెళ్ళి కలవడానికి లేచాడు.
అతను వెళుతూండగా – “మీ ఇంటి పేరు?” వెనక్కి పిలిచి అడిగాను. చెప్పాడు. ఆ వచ్చినతని కులమూ, వెంకట్రామయ్య కులమూ ఒకటి కాదని అర్థమయ్యింది. వెంకట్రామయ్య ఈ పెళ్ళికొప్పుకోడన్న నిర్ధారణకొచ్చేసాను నేను.