వాడిక్కొంచం తేనీరు కావాలి
వాడు నాగరికుడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
కూర్చున్న కుర్చీని
పెద్దమోతతో వెనక్కి తోసి లేస్తాడు
బాత్రూమ్ తలుపును
గట్టిగా తెరచి ఆపైన
ఢామ్మంటూ మూస్తాడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
అడుగులు చప్పుడయ్యేలా
ఇల్లంతా తిరుగాడుతాడు
టీవీ ఆన్ చేసి
వాల్యూమ్ మామూలుకంటే
ఎక్కువ పెంచుతాడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
వంటగదిలోకి వెళ్ళి
గిన్నెలు దొర్లించుతాడు
ఆ గణగణల మధ్య నిలబడి
కాసిని నీళ్ళు తాగుతాడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
అయినప్పటికీ
వాడు నాగరికుడు
నిద్రపోతున్న భార్య
నిద్రలేచింది.
(మూలం: కోళైయిన్ పాడల్‌గళ్(పిరికివాడి పాటలు) 2016, కవితా సంపుటి నుంచి నాగరిగవాన్ కవిత.)