పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013)

ద సింప్సన్స్ (The Simpsons) సజీవ వ్యంగ్య చిత్ర సరణి. తెలుగులో చెప్పాలంటే animated cartoon series. మేథ్యూ గ్రేనింగ్ (Matt Groening) సృష్టించిన ఈ సరణిలో ఉపాఖ్యానాలన్నీ ఫాక్స్ టెలివిజన్ సంస్థ వారు ప్రసారం చేశారు. మొట్టమొదటి కథ డిసెంబర్ 17, 1989లో ప్రసారితమయ్యింది. ‘ద సింప్సన్స్‌’కి డజను పైగా ఎమ్మీ అవార్డులు వచ్చాయి. గత పాతిక ఏళ్ళల్లో 552 సింప్సనోపాఖ్యానాలు ప్రసారం అయ్యాయి. ఈ ఉపాఖ్యానాలని ఆధారంగా చేసుకొని విశ్వవిద్యాలయాలలో గణితశాస్త్ర పాఠాలు, సంఖ్యా శాస్త్ర పాఠాలు, గేమ్ థీరీలలో పాఠాలు చెప్పుతున్నారంటే అతిశయోక్తి కాదు. అమెరికన్ తపాల శాఖ వారు ఈ సరణి గౌరవార్థం ఒక తపాలా బిళ్ళ కూడా ముద్రించారు.


ద సింప్సన్స్ అండ్ దెయిర్
మేథమెటికల్ సీక్రెట్స్
బ్లూమ్స్‌బరీ, న్యూ యార్క్, 2013.

సైమన్ సింగ్ రాసిన పుస్తకం ద సింప్సన్స్ అండ్ దెయిర్ మేథమెటికల్ సీక్రెట్స్ (The Simpsons and Their Mathematical Secrets) పరిచయం చెయ్యటం నా ప్రధాన ఉద్దేశం. నిరుడు మొదలు పెట్టి ఇప్పటి వరకూ ఈ పుస్తకం అధ్యయనం చేసి ఉండకపోతే, నేను ఈ వ్యాసం రాయగలిగే వాణ్ణి కాదు.

ద సింప్సన్స్ కార్టూనులు నేను, నా మిత్రులు కలిసి 1990-2004 మధ్య అడపా తడపా చూసేవాళ్ళం. అప్పట్లో, వాటిలో ఉన్న గణితశాస్త్ర సూత్రాలని, వాటి లోతులనీ చాలామంది లాగానే నేనూ ఎక్కువగా పట్టించుకోలేదు. నేను భుక్తి కోసం భౌతికశాస్త్రం చదువుకున్నాను. గణితశాస్త్రంలో ప్రవేశం లేకపోతే భౌతికశాస్త్రం లోతులు అర్థం కావు. అయితే, ప్రత్యేకంగా గణితశాస్త్రాన్ని వేదంలా అధ్యయనం చేసేవాళ్ళు ఋషులు అని నా అభిప్రాయం. అటువంటి వాళ్ళకి భుక్తి ప్రధానం కాదు. శ్రీనివాస రామానుజన్ అటువంటి ఋషి. అంకెల్లో దేవుణ్ణి చూసిన ఋషి.

ద సింప్సన్స్ సరణి శాశ్వత రచయితల్లో ముఖ్యులు:

– జేమ్స్ బర్న్స్ (J. STEWART BURNS, BS Math, Harvard Univ., MS Math, UC Berkeley),
– డేవిడ్ కోహెన్ (DAVID S. COHEN, BS Physics, Harvard Univ. MS Comp. Sci. UC Berkeley),
– ఆల్ జీన్ (AL JEAN, BS Math, Harvard Univ.)
– కెన్ కీలర్ (KEN KEELER, BS and PhD Applied Math. Harvard Univ.)
– జెఫ్ వెస్ట్‌బ్రూక్ (JEFF WESTBROOK, BS Physics, Harvard Univ., PhD Comp. Sci. Princeton Univ.)

వీళ్ళు కాక ఇంకా చాలామంది గణితశాస్త్ర ప్రవీణులు ఈ శ్రేణిని తీర్చి దిద్దడంలో నిపుణులుగా కృషి చేశారు. 1999లో ముఖ్య రచయితలలో కొంతమంది ఫ్యూచరామా (Futurama) అనే సైన్స్ ఫిక్షన్ సరణి తయారుచేశారు. ఆ కథల్లో గణితశాస్త్రం పాలు మరికొంచెం ఎక్కువ. సైమన్ సింగ్ పుస్తకంలో ఆఖరి నాలుగు అధ్యాయాలూ ఫ్యూచరామా గురించే! అందులో ఒక్క అధ్యాయాన్ని గురించి మాత్రమే నేను చూచాయగా ముచ్చటిస్తాను.



సింప్సన్స్‌ కుటుంబం – హోమర్, మార్జ్
బార్ట్, మాగీ, లీసా.

‘ద సింప్సన్స్‌’లో ప్రధాన పాత్రలు – హోమర్, మార్జ్, వీళ్ళ పిల్లలు బార్ట్, లీసా, మాగీ, వారి పెంపుడు కుక్క శాంటాస్ లిటిల్ హెల్పర్. విశ్వాసం గల పెంపుడు కుక్కగా చాలా కథనాలలో వస్తుంది. మొక్కజొన్న చేల వ్యూహంలో దారితప్పి, శోష వచ్చి పడిపోయిన హోమర్‌ని రక్షిస్తుంది. మరికొన్ని కథనాలలో ఇతర కుటుంబసభ్యులని కూడా సహాయం, రక్షణ ఇస్తుంది. లీసా ఎనిమిదేళ్ళ మేథావి. బార్ట్‌కి పదేళ్ళు. వీడూ తెలివిగలవాడే. కాని, కాస్త తలతిక్క ఉన్న కుర్రాడు. మాగీ పసికందు. కథాస్థలం స్ప్రింగ్‌ఫీల్డ్ అనే ఊరు. వీళ్ళు కాకుండా, రకరకాల వ్యక్తులు కథల్లోకి వస్తారు. అయితే కథలన్నీ సింప్సన్స్ కుటుంబం చుట్టూరా జరుగుతాయి. అది నాంది.

గణితం, సమస్యాసాధన ఈ సరణికి ముఖ్యం కాబట్టి, ఒక చిన్న సమస్యని ఎలా వాడుకున్నారో చూద్దాం.

2009లో వచ్చిన గాన్ మాగీ గాన్ (Gone Maggie Gone) కథనం ఒకరకంగా DAn braun (Dan Brown నవల) ద డవించి కోడ్‌కి (The Da Vinci Code) పేరడీ. పూర్తి సూర్యగ్రహణంతో కథ ప్రారంభమయి, St. Teresa of Avila ధరించిన ఆభరణం ఆవిష్కరణతో అంతం అవుతుంది.

సమస్య సాధన పరంగా ఈ కథనంలో హోమర్, మాగీ (పసి పాప), పెంపుడుకుక్క, విషంతో నిండిన పెద్ద సీసా, నదికి ఆవలి ఒడ్డున చిక్కుకుంటారు. ఒక చిన్న పడవలో ఇవతలి ఒడ్డుకు రావాలి. అయితే పడవలో హోమర్‌తో పాటు మరొక్కరే వెళ్ళగలరు. మాగీని, విషం సీసానీ వదిలితే, ఆ పాప విషం మింగే ప్రమాదం ఉంది. కుక్కనీ, మాగీనీ వదిలితే, కుక్క పాపని కరవచ్చు. ఎలా ఒడ్డుకి అందరూ క్షేమంగా చేరతారు, అన్నది సమస్య.

ఇటువంటి కథ కొద్ది మార్పుతో అన్ని సంస్కృతుల్లోనూ ఉన్నది. నక్క, మేక, గడ్డిమోపు, పడవ, రైతు, కథ మనకి తెలుసు. హోమర్ బాగా ఆలోచించి సమస్యా సాధన మొదలుపెడతాడు. అయితే, పూర్తి చెయ్యకముందే, మాగీని, క్రైస్తవ సన్యాసినులు ఎత్తుకోపోతారు: కారణం. మాగీని కొత్త మసీహా (New Messaiah) అని నమ్మబట్టి!

సింప్సన్స్‌ మతసంబంధ విషయాలపై సుముఖత చూపించరు. హోమర్ ప్రతి ఆదివారం చర్చ్‌కి వెళ్ళమని ప్రోత్సహించే జనాన్ని సహించడు. వారం వారం సింప్సన్స్ కార్టూను ఉపాఖ్యానాలని చూసే వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలుసు. “What’s the big deal about going to some building every Sunday? I mean, isn’t God everywhere?… And what if we’ve picked the wrong religion? Every week we’re just making God madder and madder?” అని ఖచ్చితంగా చెపుతాడు (Homer the Heretic, 1992). అందుకే కాబోలు, చాలామంది చర్చ్ పూజారులు (క్రిష్టియన్ మత ప్రచారకులూ) తమ చర్చ్ ప్రబోధాలలో సింప్సన్ కుటుంబంలో నైతిక సందిగ్ధతలని ప్రస్తావిస్తూంటారు.

సింప్సన్స్ ఉపాఖ్యానాలన్నీ అమెరికన్ సాంఘిక విలువలని, సంసార విలువలనీ ఎద్దేవా చెయ్యడానికే చేస్తున్నారని అధ్యక్షుడు జార్జ్ బుష్ (George H. W. Bush) ఒకసారి ఆరోపించాడు. రెండవసారి తను ఎన్నికలలో గెలవడానికి తన ప్రణాళికలో ఒక భాగంగా, 1992 రిపబ్లికన్ కన్వెన్షన్లో ఇలా అన్నాడు: “We are going to keep on trying to strengthen the American family to make American families a lot more like the Waltons and a lot less like the Simpsons.”

సింప్సన్స్ రచయితలు వెంటనే బుష్‌కి సమాధానంగా, 1991లో ప్రసారితమైన కథని (Stark Raving Mad) ప్రారంభంలో మార్పు చేసి బుష్ మాట్లాడిన మూడురోజుల తరువాత తిరిగి ప్రసారం చేశారు. ప్రారంభంలో మార్పు ఇది:

సింప్సన్ కుటుంబ సభ్యులందరూ ప్రెసిడెంటు ఇంతకు ముందు వాల్టన్ల గురించి, సింప్సన్ల గురించి చేసిన ఉపన్యాసం వింటారు. హోమర్‌కి ఆశ్చర్యం వేస్తుంది. రిమ్మెత్తిపోయి నోటమాట రాదు. హోమర్ కొడుకు బార్ట్, ప్రెసిడెంటుకి సమాధానంగా, ‘Hey, we’re just like the Waltons. We’re praying for an end to the Depression, too.’ అంటాడు: (వాల్టన్స్ టెలివిజన్ కథలన్నీ 1930లలో వచ్చిన డిప్రెషన్ రోజుల్లో అమెరికనులు పడిన ఇబ్బందులని ప్రస్తావిస్తూ చిత్రీకరించారు.)

అయితే ఈ మతాచారులు, రాజకీయ నాయకులు పూర్తిగా పప్పులో కాలేశారు. సింప్సన్స్ కథల్లో ఇరుక్కొని అంతర్గతంగా ఉన్న అసలు పాఠం వాళ్ళకి అర్థం కాలేదు. ఈ ఉపాఖ్యానాలు రాసిన వాళ్ళందరికీ అంకెలు, సంఖ్యలు అంటే పరమ వ్యామోహం. ఎడతెగని ప్రేమ. వీళ్ళందరూ గణితశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్నవాళ్ళు. ఏదోరకంగా, ఈ సజీవ వ్యంగ్య చిత్రసరణిలో గణితశాస్త్రాన్ని టిఫిన్లా, ఫలాహారంలా ప్రజలకి పంచిపెట్టాలనే ఉబలాటం. పై, ఐ, గేమ్ థీరీ, బీజగణితం, కాల్క్యులస్, జామెట్రీ, మూలక (రేషనల్) సంఖ్యలు, కరణి (యిర్రేషనల్) సంఖ్యలూ, వగైరాలని కథల్లో జొప్పించడం అతి చమత్కారంగా చేశారు.


π విలువ గురించి ఒక పిట్ట కథ:

2001లో బై బై నెర్డీ (Bye Bye Nerdie) అనే ఉపాఖ్యానం ప్రసారితమయ్యింది. ఆకతాయివాళ్ళ దాడి పై లీసా చేసిన పరిశోధన పత్రం సైన్స్ సభలో చదవడానికి సిద్ధమయి ఉన్న తరుణం. ఫ్రింక్ అనే ఆచార్యుడు లీసాని పరిచయం చెయ్యాలి. సభలో ఉన్న సైంటిస్టులలో గందరగోళం ప్రారంభం అయ్యింది. ఫ్రింక్ అసలే పరధ్యాన్నం మనిషి. ఆయన వెంటనే, సభాసదులని ఉద్దేశించి, “π విలువ ఎచ్చు తక్కువ లేకుండా ఖచ్చితంగా మూడు,” అని అంటాడు. వెంటనే సభలో అందరూ నిశ్శబ్దంగా కూచుంటారు. ఫ్రింక్ π విలువ మూడు అని అనడానికి మూలం, ఇండియానా రాష్ట్రం జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించబడ్డ పై –బిల్ 246 (1897). ఎడ్విన్ గుడ్విన్ అనే వైద్యుడు, వర్తులాన్ని చతురస్రంగా మార్చడానికి తను కనిపెట్టిన సూత్రం ఇదిగో అని రాష్ట అసెంబ్లీలో బిల్లు ఆమోదించమని కోరాడు. ఆ సూత్రం ఏమిటయ్యా అంటే — … that the ratio of the diameter and circumference is as five-fourths to four.

π = (circumference)/(diameter) = 4/(5/4) = 3.2

ఈ విలువని ఇండియానా పాఠశాలలన్నీ ఉచితంగా వాడుకోవచ్చట! కాని తను, రాష్ట్రమూ దీనిపై వచ్చే లాభాలు పంచుకోవాలని ప్రతిపాదించాడు. అదృష్టవశాత్తూ, ఈ బిల్లు శాశ్వతంగా వాయిదా పడింది. సి. ఎ. వాల్డో అనే గణితశాస్త్ర ఆచార్యుడు అప్పట్లో అసెంబ్లీకి పాఠం చెప్పి ఈ బిల్లుకి తిలోదకాలివ్వడంలో కృషి చేశాడు. బహుశా ఇప్పటికీ, ఇండియానా వాయిదా బిల్లుల లిస్టులో ఉండే ఉంటుంది, మరొక రాజకీయ నాయకుడి కోసం. రాజకీయ నాయకులు గణితాన్నీ నిర్దేశించడంపై విసురు, ఈ కథ.


హోమర్ ఔత్సాహిక విజ్ఞాని. అప్పుడప్పుడు కొత్త కొత్త యంత్రసాధనాలు తయారు చేస్తూ ఉంటాడు. గోడ పైన ఉన్న నల్లబల్ల మీద రకరకాల సమీకరణాలు ద విౙర్డ్ ఆఫ్ ఎవర్‌గ్రీన్ టెరేస్ (The Wizard of Evergreen Terrace, 1998) అన్న ఉపకథలో కనిపిస్తాయి.


హోమర్ సింప్సన్ సమీకరణాలు

మొట్టమొదటి సమీకరణం హిగ్స్ బోసాన్ (Higgs Boson) అనే ప్రాథమిక కణం ద్రవ్య రాశి విలువ కట్టటానికి, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర ఆచార్యుడు డేవిడ్ స్ఖిమినోవిచ్ (David Schiminovich) ప్రతిపాదించిన సమీకరణం. హిగ్స్ బోసాన్ అనే ప్రాథమిక కణం ఉండాలి అని 1964లో సిద్ధాంతపరంగా ప్రతిపాదించబడింది. ఈ సమీకరణంలో, ప్లాంక్ స్థిరాంకం, కాంతి వేగం, న్యూటన్ ప్రతిపాదించిన ఆకర్షణ స్థిరాంకం ఉన్నాయి. ఈ స్థిరాంకాల విలువలు సమీకరణంలో ప్రతిక్షేపిస్తే, హిగ్స్ బోసాన్ ద్రవ్య రాశి విలువ 775 గిగ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని వస్తుంది. 2012లో యూరప్‌లో ఈ హిగ్స్ బోసాన్ కనుక్కున్నారు. దాని ద్రవ్యరాశి విలువ 125 గిగ ఎలక్ట్రాన్ వోల్ట్స్. పరవాలేదు! హోమర్ సమీకరణం 14 ఏళ్ళకి ముందుగా ప్రతిపాదించబడ్డది. అప్పటికి హిగ్స్ బోసాన్ ఉన్నదో లేదో ఖచ్చితంగా తెలియదు. అంతే కాదు. హోమర్ ఔత్సాహిక విజ్ఞాని కదా!