అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు!

ఏమిటీ!? ఆ బట్టలతో పాటు మీ వింటర్ కోట్ కూడా సాల్వేషన్ ఆర్మీకి ఇచ్చెయ్యమంటారా?

నిక్షేపం లాంటి కోటు. కిందటి ఏడాదేగా అమ్మాయి క్రిస్మస్ గిఫ్ట్‌గా ఇచ్చింది. అప్పుడే ఇచ్చేయడమా! ఏదో ఒలక పోసుకుని పాడుచేసుకుని వుంటారు అవునా? ఏమిటీ… అదేం కాదా! కోటు బావుంది కానీ… వేసుకుంటే బరువుగా వుండి మోయలేక పోతున్నారా?

ఆ! ఇప్పుడైనా ఒప్పుకుంటారా మీకు ముసలి వయసు మొదలైందని?

కోటు బరువుగా వుండటానికీ మీ వయసుకు సంబంధం ఏమిటీ అంటారా?

సంబంధం వుంది కనుకనే చెప్తున్నాను. మీరు గమనిస్తున్నారో లేదో ఈ మధ్య ఈ మాటని పదేపదే అంటున్నారు! ఇవ్వాళ రోజు వేసుకునే కోటు బరువు అన్నారు. కిందటి వారం మీకెంతో ఇష్టమైన కాఫీ మగ్గు బరువుగా వుందన్నారు. కిందటి నెల డిన్నర్ పార్టీకి వెళ్ళినప్పుడు, ఇదేమిటీ! ఇంకా ఏమి వడ్డించుకోకుండానే ప్లేటు ఇంత బరువుగా వుందీ? అన్నారు. ఆర్నెల్ల క్రితం ట్రిప్పులో ఆ హోటల్ తలుపులు బరువుగా వున్నాయన్నారు గుర్తుందా? ఇలా చెప్పుకుపోతే చాలా వున్నాయ్. వున్నట్టుండి తేలిగ్గా వుండే వాటిని ఇష్టపడుతున్నారంటే నాకు నమ్మబుద్ధి కావడంలేదు. ఇది ఖచ్చితంగా వయసు తెచ్చిన మార్పే కాని మీ అభిరుచిలో వచ్చిన మార్పుకాదని నాకు తెలుసు!

ఆ రోజుల్లో అమెరికా వచ్చిన మీరు ఇక్కడి వస్తువుల్లోని నాణ్యత, మన్నిక చూసి మహదానందపడి పోయేవారు. కారు దగ్గిర నుంచి కాగితం దాకా ఇక్కడ అన్నీ ఎంత బరువుగా వుంటాయో ఇండియాలో అందరికీ గొప్పగా చెప్పేవారు! వంటింట్లోకి కావాల్సిన వస్తువుల దగ్గరనుంచి వ్యాక్యూమ్ క్లీనర్ల దాకా అన్నీ బరువ్వే కొనేవారు. ఇక ఇంట్లో ఫర్నిచర్ సంగతి చెప్పనే అక్కరలేదు. ఎందుకండీ ఇంతింత బరువు వస్తువులు అంటే, నీకేం తెలీదు ఇలా వుంటేనే నాలుగు కాలాలు మన్నుతాయి! అంటూ నా నోరు మూసేవారు. నేను ఏ వస్తువైనా బావుందీ అంటే, బరువు చూస్తుంటేనే తెలుస్తోంది అది ఎలాంటిదో! అంటూ కొట్టిపారేస్తూ వచ్చారు.

వెనకటికి మా అమ్మ మేనమామ కూడా అన్నింటికీ ‘బరువు, బరువు’ అంటుండేవాడుట! మీరు వస్తువుల్లో బరువు చూసినట్టుగా ఆయన డబ్బు, హోదాల బరువు చూసేవాడుట. ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ ఆస్తిపాస్తులను తూకం వేసి బరువుగా వుందనుకుంటేనే పెళ్ళిళ్ళు చేసేవాడుట! ఇక తన ఇంటికి వచ్చే కోడళ్ళని, బాగా బరువుగా కట్నాలు ఇచ్చుకోగలిగే వాళ్ళను చూసి మరీ ఎంచుకునే వాడుట!

పూర్వం పెళ్ళికి వచ్చిన బంధువులు కూడా పెళ్ళికూతురికి అత్తారు పెట్టిన పట్టుచీరల బరువు చూసి వాళ్ళ అంతస్తు ఏమిటో ఇట్టే అంచనా వేసేవారుట! పెళ్ళి కొడుక్కి చేసుకున్న అమ్మాయి మీద ఎంత ప్రేమ వుందీ అన్నది, అతను శోభనం నాడు భార్య కొంగుకు కట్టే బంగారం బరువు చూస్తే తెలిసిపోయేదిట! మా నాయనమ్మ తన చామంతిబిళ్ళ కొడుకు చేతికి ఇచ్చి, కోడలి కొంగుకు కట్టరా, అంటే బాంబేలో చదువుకున్న మా ఆఖరు బాబాయి, నథింగ్ డూయింగంటూ పిన్ని చేతికి నాజుకైన గడియారం కడితే, ఆడవాళ్ళందరూ దవడలు నొక్కుకున్నారుట!

మనసులో వున్న ప్రేమకు వస్తువు బరువుకు ముడి పెడతారేమిటీ మనవాళ్ళు అని నవ్వుకునేదాన్ని! కానీ ఇక్కడికొచ్చాక తెలిసింది అమెరికాలో కూడా అబ్బాయి ప్రేమ లెవెలు, ఫైనాన్షియల్ లెవెలు చెప్పేది డైమండ్ వుంగరం బరువేనని!

అసలు ఈ బరువుకీ మన బతుకులకీ విడదీయరాని సంబంధం వుంది కాదూ. వయసులో వున్నప్పుడు ఎంత బరువైనా భుజాలమీదకు ఎత్తుకుంటాం. నిజానికి అవి బరువని కూడా మనకు అనిపించవు. పదకొండేళ్ళకు పెళ్ళి అయి పన్నెండో ఏట కాపరానికి వెళ్ళిన మా అమ్మ, అత్తగారు లేని ఆ ఇంట్లో పెద్ద ఆరిందా అయిపోయిందిట. భూమికి జానెడు ఎత్తు లేకపోయినా రోజూ మోకులాంటి ఖద్దరు చీరలు కట్టుకొనేదిట. మేమెవ్వరం పుట్టకమునుపే పీటల మీద కూర్చుని ఇద్దరు మరదుల ఉపనయనాలు, ఇద్దరు ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేసిందిట! మా అమ్మ డెబ్బైయవ పుట్టినరోజని అందరం కలిసి ప్రత్యేకంగా కంచిలో నేయించిన పట్టుచీర పెడితే, అమ్మ నవ్వుతూ, “ఈ చీర వెనకాల వున్న మీ ప్రేమను మోయ్యగలను కానీ, ఈ వయసులో ఈ చీరను కట్టి మోసే ఓపిక నాకు లేదర్రా,” అంది! నిజమే బరువు మొయ్యాలంటే బలం వుండాలి కదా!

ఇన్నాళ్ళుగా వేసుకోగలిగిన కోటు మీకు వున్నట్టుండి బరువై పోయినట్టు ఏళ్ళ తరబడి చేస్తున్న వుద్యోగాలు కూడా ఒక వయసులో హటాత్తుగా బరువనిపిస్తాయి. ఆ బాధ్యతల నుంచి ఎప్పుడు బయటపడతామా ఎప్పుడు రిటైర్ అవుతామా అని ఎదురుచూస్తాం. ఎవరికి వాళ్ళం మనకే అన్ని బాధ్యతలు వున్నాయనీ ఆ బరువేదో మనం ఒక్కళ్ళమే మోస్తున్నాం అనుకుంటూ ఎదుటివారిని చూసి ఈర్ష్యపడుతూ వుంటాం.

పసిపిల్లలతో సతమతమయ్యే దంపతులు వాళ్ళ పైవాళ్ళను చూసి, “మీకేం, హాయిగా స్కూలుకెళ్ళే పిల్లలు, మాకైతే డైపర్ చేంజ్‌లు, నైట్ టైం ఫీడింగ్‌లు… కంటి నిండా నిద్ర పోయి ఎన్నిరోజులైందో… మా పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో…” అంటూ వాపోతారు.

మన పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారంటే, ఎవరైనా కనిపించటం ఆలస్యం, “అబ్బ! మీరెంత అదృష్టవంతులో. ఈ రోజుల్లో పిల్లల చదువులకు ఎంతవుతోందో తెలుసా!” అంటూ వాళ్ళతో వాదనకు దిగుతాం. మొన్న మీ తమ్ముడూ వాళ్ళను మనతో వెకేషనుకు రమ్మంటే ఏమన్నాడో తెలుసా? “నీకేం వదినా! పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఫ్రీ బర్డ్స్. మీకు ఎప్పుడంటే అప్పుడే హనీమూన్. మాకెట్లా కుదురుతుందీ? పిల్లలు సెటిల్ అయ్యేదాకా ఏ వెకేషన్లకు రానంటోంది సుజాత!” అంటూ తన బాధ వెళ్ళబోసుకున్నాడు.

మొన్నామధ్య మా పెద్దక్కయ్యను వాళ్ళ వియ్యాల వారు, మేము ఓ రెండునెలలు తీర్ధయాత్రలకు వెళ్తున్నాం… మీరూ వస్తారా? అని అడిగారుట. నేను, హాయిగా వెళ్ళిరావే అంటే అది వెంటనే, “సడేలే, ఆవిడంటే మొగపిల్లల తల్లి. కొడుకులకు పెళ్ళిళ్ళు చేసేసి దర్జాగా తిరిగేస్తోంది. నాకెక్కడ కుదురుతుందీ ముగ్గురు ఆడపిల్లలతో? వీళ్ళ డెలివరీల తోనే నాకు సరిపోతోంది. ఒకళ్ళదై, హమ్మయ్య అనుకునే లోపు ఇంకోత్తి రడీగా వుంటుంది. పోనీ ఇక్కడ వున్నారా అంటే అదీ లేదు. ముగ్గురూ వెళ్ళి మూడు ఖండాల్లో కూర్చున్నారు. చాకిరీ మాట అలా వుంచి ముందు ఆ ప్లేన్లు ఎక్కలేక, దిగలేక చచ్చిపోతున్నానే రమ్యా!” అని అంటుంటే నాకు ఒకటే నవ్వొచ్చింది!

రిటైర్ అయ్యేలోపు బాధ్యతలన్నీ పూర్తి చెయ్యాలని అందరం ఆశపడుతూ వుంటాం. రిటైర్ అవగానే ఇల్లు, వాకిలి డౌన్‌సైజ్ చేసేసి, లైఫ్‌ని సింప్లిఫై చెయ్యాలని ప్లాన్లు చేసేస్తుంటాం. అందుకోసం ఎంతో కేర్‌ఫుల్గా ఇన్నేళ్ళు చేరేసిన చెత్తా చెదారం తీసిపారేసే పనిలో పడతాం. కానీ దానికంటే ముందు ఏళ్ళుగా అంతులేని కోరికలతో, వ్యామోహాలతో నిండిపోయిన మన మనస్సుని డౌన్‌సైజ్ చేసుకోవాలి. ఇంతకాలంగా పెంచి పోషిస్తూ వచ్చిన అహాన్ని, రాగద్వేషాల్ని పీకి పారేసే ప్రయత్నం మొదలు పెట్టాలి. అనవసరమైన విషయాలకు ఆమడ దూరంలో వుండటం, వున్న దానితో తృప్తిగా సంతోషంగా వుండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన కింది తరం వారు మనల్ని గౌరవించి మన పెద్దరికానికి పెద్ద పీట వేస్తారు.

కూడపెట్టటమే కాని పంచుకోవడం అంటే ఏమిటో తెలియని మా రెండో అక్కయ్య మావగారు మంచంలో తీసుకుంటూ ఆఖరి క్షణంలో కూడా కృష్ణా!రామా!కు బదులుగా డబ్బు!దస్తావేజు! అంటూ ప్రాణం విడిచి అందరి చేతా ఛీ! అనిపించుకున్నాడు. ఇక మా అన్నయ్య అత్తగారైతే, తన హయాములో కోడళ్ళను అందరినీ ఓ వూపు వూపి కాలు చెయ్యి పడిపోయిన తర్వాత, “నాపని అయిపోయిందే అమ్మా! నా మాట వినేవాళ్ళే లేరు…” అంటూ మొసలి కన్నీళ్ళు కారుస్తూ పైలోకానికి వెళ్ళేంత వరకూ కోడళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూనే వుంది.

రిటైర్మెంట్‌కి కావలసిన డబ్బు, దస్కం, పెన్షన్లు, ఇన్సూరెన్స్ లాంటి విషయాల్లో మార్పులు జాగ్రత్తలు తీసుకున్నట్టే మన ఆరోగ్యం, ఆలోచనలు, మన నడవడి విషయాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. జీవితం మొదట్లో ఎంత కష్టపడినా చివరి దశలో మాత్రం మనం కష్టపడకుండా ఇంకొకళ్ళను కష్టపెట్టకుండా జాగ్రత్త పడాలి.

ఉన్నన్ని రోజులు నలుగురితో నవ్వుతూ బతకాలి. కానీ… మనం నవ్వుల పాలు కాకూడదు.

ఒడిదుడుకులను తట్టుకుంటూ నిండుకుండలా వుండాలే కానీ… డీలాపడిపోతూ ఓటిపోయిన కుండలా అవకూడదు.

మనసునీ శరీరాన్నీ తేలిగ్గా వుంచుకోవటం మొదలు పెట్టాలి. కానీ… మన మాట, ప్రవర్తన తేలిపోకూడదు.

సీనియర్ సిటిజనే, కానీ టీనేజర్ వ్యవహారం అన్నట్టు కాకుండా… వయసుకు తగినట్టుగా హుందాగా వుండటం నేర్చుకోవాలి.

ఇవన్నీ పాటించినప్పుడే సీనియర్ సిటిజన్ లైఫ్ స్మూత్… గా సాగిపోతుంది! అందుకని ఇక మనం కూడా నెమ్మదిగా బరువుల్ని తగ్గించుకుంటూ రిటైర్మెంట్ జీవితానికి రడీ అయిపోదాం!

మన జీవితం మనకు బరువు కాకుండా మనం ఇంకొకరికి బరువు కాకుండా చూసుకోవటం లోనే వుంది మన ప్రజ్ఞంతా! ఏమంటారు?

ఏమిటీ!? విషయాన్ని ఇంత బరువుగా చెప్పిన తర్వాత ఇక అనటానికి ఏముందీ అంటారా!