రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మంజుఘోష

రచన: సమవర్తి
సెప్టెంబర్ 2014

ఓయీ కవీ!

గురజాడ జాడ నడవఁగ
దొరకొంటివి గాదె! యిపుడు దూరమ్మై యా
కఱకైన కత్తి మొనతో
విరచింతువు కవితలరయ విడ్డూరంబౌ!

చుట్టున్ ‘జీకటి’, దానియందు ‘భయ’ మంచున్ వ్రాతు వద్దానిలో
నెట్టో ‘రక్తముఁ’ జూపి యీ ప్రజల నోయీ బీల్చ నీవూపిరిన్
కట్టా! కైతలు ప్రేత భూతగణ రాగాలాపనాటోపముల్
ఇట్టెట్టీ వొనరింతువో కవివరా! యెట్టీవు నిద్రింతువో!

ఈ వైప్లవ్య పథోన్ముఖత్వమును బోధింపన్ ప్రజాభావముల్
బ్రోవై క్లిష్టికి దారితీయుననియేన్ – బోదేల నీ బుద్ధి, ధా
త్రీవైక్లబ్యము గుండె జీల్పదొకొ, శాంతిన్ గోరి, కీలాలముల్
నీవై దోహదమీయ బారుటకు, నేనెంతేని యల్లాడెదన్!

అంకితమిత్తు నా కవిత నార్తజనావలి కంచుఁ జెప్పి నీ
వంకిలి లేక రక్త ఝరులైన మహా కృతులోలి సేయఁగా
నంకెకు రావు సౌఖ్యములనంత జగత్ప్రలయాంతకంబు నౌ
టింక నిజమ్ము; శాంతివెలయింపగ నిద్ది పథంబు కాదురా!

కట్ట గోచియులేని కడుపేద నడువీధి
         నాఁకటి కేడ్వగా నవల దిరిగి
చూడఁ గన్నులులేని వాఁడు వారగ వచ్చి
         నినుదాకి తూలఁగా నిప్పు లుమిసి
వట్టిపోయిన గుండె పసికూన సాఁకలే
         కొక్కర్తు పాల్వేడ నోకిలించి
చిల్లర లేదంచుఁ జెప్పు రిక్షావాని
         చిరుపైసలకుఁ గూడ చీదరించి

కవిత వ్రాతువు వారిపై కరుణ యనెదు
కవివరేణ్యుఁడ నేనంచు గర్వపడెదు
కవిత యార్జించి యిచ్చిన కాసులందు
విసరివైచితె వారికి వీసమైన!

ఆవేశాన రచించు రక్తకవితల్ అయ్యా శుభమ్మీవు, ద్వే
షావిర్భావపు కారణా లసలు భాషాదేవి నీకెన్నడేన్
భావవ్యోమపథానఁ గానఁబడదో, భావింపవో సౌమ్యగా
నావీణావరపాణి మౌళితల చంద్రార్ధప్రభా స్నిగ్ధయే!

పుట్టను బుట్టియున్, ములుకు ముట్టి గతించిన జంటకేడ్చు నా
పిట్ట యెలుంగు విన్న ముని బిట్టడలన్ గడకయ్యె కావ్య మ
ప్పట్టున నెన్ని గుండెలకుఁ బ్రాకెనొ, యా కరుణాస్రవంతి, చూ
పట్టదె నిల్వు నీరవుట భావుక చిత్తము తత్కథా శ్రుతిన్!

తమ స్వార్థాగ్నికి నింధనమ్ములుగ విద్యార్థుల్, కవుల్ కొల్లలై
సమయన్ జూతురు రాజకీయ కుహనాసంస్కారు లావంతయేన్
గమనింపన్ దగదో జగమ్ముగతి, యింకన్ నీ కలానన్ కవీ
గమకింపంగదవోయి యీ భువిని ప్రాగ్భారంబుగా శాంతికిన్
రమణీయామృత నవ్యవార్షుక పృషల్లాక్షణ్యవర్ణాదృతిన్!

ఓయీ చదువరీ!

నిను కదలింపలేనిది, మనీషను గుర్తెరిగింపరాని వ్రా
తను దరికొల్పుమగ్ని శతధా, యెది నీదగు గుండె లోతులన్
కణకణ మండు భావముల గాయములన్ మృదువాక్యధార మా
న్చిన దది కైత, దానిఁ గొని జేర్చుము మౌళి సదా సహస్రధా!

రమ్ము, కవిత్వసంపద చిరమ్ము; ప్రభుత్వములేల యేల, స్వాం
తమ్ము నిరంతరమ్ము సుఖితమ్ము తదీయ మహార్థ ప్రాప్తి; వి
శ్వమ్ము మనోహరాకృతి, ప్రసన్న మజస్రము భావుకాళికే
రమ్ము; కవిత్వ సంపద చిరమ్ము గ్రహింతము విశ్వదర్శనన్!

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    కామేశ్వరరావు September 21, 2014 10:23 am

    మంజుఘోష చాలా బాగుంది! అయితే యీ ఘోష ఆ కవుల చెవులకు చేరుతుందన్న నమ్మకం నాకు లేదు.

    “రమణీయామృత నవ్యవార్షుక పృషల్లాక్షణ్యవర్ణాదృతి”లాంటి సమాసోద్ధృతి కన్నా, “ములుకు ముట్టి గతించిన జంటకేడ్చు నా పిట్ట యెలుంగు” పలుకుసొబగు ఈ కవితలో నన్ను బాగా హత్తుకొంది.

    ఈ కవిత చదివగానే నాకీ దాశరథి పద్యం గుర్తుకువచ్చింది:

    ఏనాడెన్నడు కత్తితో గెలువలేదీ విశ్వమున్; ప్రేమ పా
    శానన్ గట్టుము నాలుగంబది ప్రపంచాలన్, మహాత్ముండిదే
    జ్ఞానోద్బోధను జేసె, నెవ్వడు వినెన్? సాహిత్యసామ్రాజ్యమం
    దైనన్ కొంతగ శాంతి పాదుకొననిమ్మా! నీకు పుణ్యంబగున్

  2. 2
    samavarti September 23, 2014 1:12 pm

    గౌరవనీయులైన కామేశ్వర రావు గారికి నమస్కారం.

    సందర్భొచితసమాస గ్రథనమే ఇక్కడ జరిగినదని మనవి.”ఇందులొ తిట్లు ఉన్నయ్యేమో” నన్న సందేహంతో నైనా వారిలో ఒకరైనా చదువుతారని అక్కడ ఆసమాసం వేశాను. కవితను మీరు చదివి అభిప్రాయం తెలిపినందుకు వినయపూర్వక ధన్యవాదములు.

    సమవర్తి

  3. 3
    arya marati balaji rao October 17, 2014 2:35 pm

    సమవర్తి గారూ,

    మీ మంజులమైన హృద్ఘోష బాగున్నది. శ్రీ శ్రీ గురజాడలు వారి వారి దారిలో వారు ప్రయాణించారు. అయితే నేటి కవికపులు చాలమంది వారి అడుగులజాడలో నడుస్తున్నట్లు నటిస్తూ, పద్యాన్ని తిట్టి పోస్తూ, చేస్తున్న రచనలు మీరు చెప్పినట్లు వారి జీవితంలో వాస్తవాలు కాని వాస్తవాలే సుమా!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • జీర్ణమఙ్గే సుభాషితమ్
  • ఆకాంక్ష
  • మంజుఘోష
  • మనభాష – మనపద్యం
  • వేడికోలు

ఇటువంటివే…

  1. ఎడబాటు
  2. నిప్పులు
  3. ఉండు
  4. ఇంకో సాయంత్రం
  5. కవి హృదయం

సెప్టెంబర్ 2014 సంచికలో ...

  • జ్ఞాపకాల వాసన
  • అక్కర లేని సంగతుల
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: బరువు!
  • ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం
  • ఇంకో సాయంత్రం
  • ఈమాట సెప్టెంబర్ 2014 సంచికకు స్వాగతం!
  • ఉండు
  • ఎడబాటు
  • కాళోజీ కవిత్వంలో మనిషి
  • కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు
  • తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు
  • దేశభక్తి గేయాలు
  • నా గురించి నేను
  • నాకు నచ్చిన పద్యం: నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి
  • నిప్పులు
  • పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము
  • పుస్తక పరిచయం: The Simpsons and Their Mathematical Secrets (2013)
  • బాపూ
  • భక్తకవి బొప్పన గంగనామాత్యుని శ్రీ మహాభాగవత పంచమ స్కంధం
  • మంజుఘోష
  • మనిషికెంత భూమి?
  • మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము
  • విశ్వస్వరూపం: టెలిస్కోపులు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఉండు
పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.