ఇంకో సాయంత్రం

నువ్వూ నేనూ ఇద్దరమే
నువ్వూ నేనూ పక్కపక్కనే

కొంచెం దూరంగా సంగీతం
ఉద్వేగం నిండిన సంబరపు
గొంతుల్ని కలుపుకుని
కనపడకుండా నాట్యం

ఏదో జరగబోతుందన్నట్టు
కుతూహలంగా పరుగులు తీస్తూ
వదలకుండా మన చుట్టూ నీటిగాలీ

నీ మొహమ్మీద మెరుస్తూ
చక్కిలిగింతలు పెడుతూ
వెలుతురు అలలూ

నీ చేతిని తాకి ఉండేవాణ్ణి
నా చేతిలోకి తీసుకోగలిగీ ఉండేవాణ్ణి
నీ కంటిమీదుగాపడుతున్న వెంట్రుకల పాయని
వెనక్కి సర్ది ఉండేవాణ్ణి
అక్కడికక్కడే ఆగి ఆపి ఉండేవాణ్ణి

అది మనకు గుర్తుండిపోయే సాయంత్రమయ్యేది
‘ఒకానొక సాయంత్రం’ అని మొదలుపెట్టి
ముచ్చట్లు చెప్పుకోవడానికి మనకుండేది

ఇప్పుడదొట్టి ఇంకో సాయంత్రం
విచ్చుకోకనే రాలిపోయిన జ్ఞాపకం


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...