సమాజానికి, సాహిత్యానికి కేంద్ర బిందువు మనిషి. సమాజం, సాహిత్యం మనిషి కోసం మనిషి సృష్టించినవి. మనిషికి మనిషికి మధ్య వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో రూపొందే నిర్మాణాలు, భావజాలం వాటిని నానాటికి ఉన్నతీకరిస్తుంటాయి. మనిషి తను ఎవరినన్న జిజ్ఞాసతో తనను తాను తెలుసుకొనటానికి, తనను తాను నిర్వచించు కొనటానికి చేసే నిరంతర అన్వేషణ ఫలితమే తత్త్వశాస్త్రం. అది సమాజానికి,సాహిత్యానికి కూడా చోదక శక్తి. అందువల్ల మనిషి తనను తాను గుర్తుంచుకొని, తనను తాను నిర్వచించుకొనే క్రమంలో ఆ అనుభవాన్ని నలుగురి తోనూ పంచుకొనటానికి కవి కావటం జరుగుతుంది. కవి అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అని చలం చెప్పిన మాటలు ఈ సందర్భంలో గుర్తు చేసుకోదగినవి. ఈ నేపధ్యంలో కవి కాళోజీ మనిషిగా మనిషి గురించి పడిన తపన ఆయన కవిత్వంలో ప్రతిఫలించిన తీరు తెలుసుకొనటం ఆసక్తికరంగా ఉంటుంది.
ఆధునిక కాలంలో మనిషి కేంద్రంగా అభివృద్ధి చెందిన తత్త్వశాస్త్రం అస్తిత్వవాదం (Existentialism). మనిషికి సర్వ స్వతంత్రత, స్వేచ్ఛానువర్తన, స్వయం సంపూర్ణత సహజం అని, మనిషి అస్తిత్వం ఒక్కటే ఉన్నతమయిన వాస్తవం అని, ప్రపంచం వైపు చూడటం, దాని గురించి ఆలోచించటం, వ్యక్తిగా ప్రతిస్పందించటం, ప్రవర్తించటం — ఆ క్రమంలో తన స్వభావాన్ని నిర్వచించుకొంటూ మనిషిగా రూపొందటం నిరంతరం జరుగుతూనే ఉంటుందని అస్తిత్వవాదం చెప్తుంది. ఈ సిద్ధాంత ప్రకారం భగవంతుడి పేరు మీదనో, సంఘం పేరు మీదనో, మతం పేరు మీదనో మనిషిని శాసించటం, నిర్దేశించటం కుదరదు. ప్రతి మనిషి తన జీవిత సూత్రాలను, విలువలను తానే సృజించుకొని, వాటి ప్రకారం జీవిస్తూ తనకు తానే బాధ్యత వహించటం జరుగుతుంది. ఆ రకంగా మనిషి తన జీవితానికి తానే కర్త, తన జీవిత పరమార్ధ నిర్ణేత. మనిషి గురింఛి 1940-1960ల మధ్యకాలంలో అభివృద్ధి చెందిన ఈవిధమయిన భావజాల ప్రభావానికి ప్రత్యక్షం గానో పరోక్షం గానో లోనయిన బుద్ధి జీవులలో కాళోజీ కూడా ఒకడు. అస్తిత్వ చేతన మూర్తీభవించిన కాళోజీ వ్యక్తిత్వానికి నిలువుటద్దం ఆయన కవిత్వం.
1914 సెప్టెంబర్ 9న పుట్టి హైస్కూల్ చదువుల నాటి నుండే అధికారంపై ఆగ్రహ ప్రకటన ఒక ప్రజాస్వామిక చర్యగా చేపట్టి, అటు నిజాం ప్రభుత్వ పాలనను, ఇటు బ్రిటిష్ వలస పాలనను ఆనాడు ఎంతగా నిరసించాడో, స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ అధికార రాజకీయాలను అంతగా విమర్శకు పెట్టాడు. ప్రజాస్వామ్య మనుగడకు ప్రధాన షరతు అయిన పౌర చైతన్యం గురించి, పౌరుల పట్ల పాలకవర్గపు బాధ్యత గురించి తపన పడి కవిత్వం రాశాడు. 1953లో ఆయన మొదటి కవిత సంకలనం నా గొడవ అచ్చు అయింది. యాభయ్ ఏళ్ళ కాలం మీద ఆయన రాసి అచ్చు వేసిన కవిత్వమంతా నా గొడవ అన్న పేరు తోనే వచ్చింది. గొడవ ప్రపంచానిది. దానిని తనదిగా చేసుకొన్నాడు. అలా చేసుకోనటం లోనే ప్రజాకవి అయినాడు. ‘నా’ అనటంలో అస్తిత్వ చేతన మేల్కొన్న లక్షణం ఉన్నది. ఆ అస్తిత్వ చైతన్యం కాళోజీ కవిత్వంలో మనిషిని నిర్వచించటంలో, నిలబెట్టటంలో, మనిషి పక్షాన నిలబడటంలో కూడా కనిపిస్తుంది.
“జరిగిందంతా చూస్తూ
ఎరగనట్లు పడి ఉండగ
సాక్షీ భూతుణ్ణి గాను
సాక్షాత్తూ మానవుణ్ణి”
అని మానవుణ్ణి అన్న చిన్న కవితలో తనను తాను నిర్వచించుకున్నాడు కాళోజీ. సూర్యుడిని సర్వసాక్షి అంటారు. సూర్యుడు అన్నిటినీ చూస్తాడు. కానీ దేని పైనా తన అభిప్రాయం చెప్పలేడు. పంచభూతాల సాక్షిగా, దేవుని సాక్షిగా, అనే పదప్రయోగాలు ఉన్నాయి. కానీ అవసరానికి నోరు విప్పి సత్యం చెప్పగలవి కావు. అందుకే రావిశాస్త్రి వాటికి సంబంధించిన అసలు వాస్తవాన్ని కోర్టుకు రాని సాక్షులు అనే కధలో బయట పెట్టాడు. అవసరానికి రాలేని, మాట్లాడలేని శక్తులకు ఎంత తెలిసినా తెలియనట్లే అన్నది కాళోజీ అభిప్రాయం. ఉపయోగానికి రాని చదువుల వలె ఉపయోగానికి రాని ఎరుక కూడా వృధానే. ఎరగనట్లు పడి ఉండగ / సాక్షీభూతుణ్ణి కాను అని చెప్పటం ద్వారా సూర్యుని ఆధిక్యతను తగ్గించి సాక్షాత్తు మానవుణ్ణి అని మానవుని ఆధిక్యతను అంతిమ తీర్పుగా ప్రకటించాడు. మానవులంటే ప్రపంచాన్ని చూస్తూ మౌనంగా ఉండేవాళ్ళు కాదు, ఆలోచిస్తూ, ప్రతిస్పందిస్తూ అవసరము, ఔచిత్యము అయిన చర్యకు దిగేవాళ్ళు అన్నది కాళోజీ భావన. ఈ క్రమంలో కాళోజీ దేవుని ఉనికిని కూడా నిరాకరించటానికి సందేహించలేదు. ఉన్నది కేవలం మానవుడు అని ప్రకటిస్తూ ఆయన ఒక కవిత రాశాడు.
“దేవ దానవుల హయాము లో
శిష్ట రక్షణ దుష్ట సంహారం చేయ
అవతారాలెత్తి యెత్తి
విసుగెత్తిన దేవుడు
మానవుణ్ణి సృష్టించి ఉంటాడు”
అన్న ఎత్తుగడతో ప్రారంభించిన కవితలో కాళోజీ దాని పరిణామం దేవతలు రాక్షసులు మాయం కావటమూ శిష్ట, దుష్ట అనే నిర్దిష్ట రూపాలు నశించటమూ అంటాడు. మనిషి లోనే శిష్ట దుష్ట లక్షణాలు భాగమయి ఉంటాయి. మనుషులను మంచివాళ్ళనో చెడ్డవాళ్ళనో విడదీసి చెప్పలేము. వాళ్ళ వాళ్ళ చర్యలను బట్టి ఆ నిర్దిష్ట సందర్భం నుండి వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అవుతుంటారు. ఈ అస్తిత్వ భావనను పలికించటంతో పాటు ఈ కవిత దేవుడి అవసరాన్ని కూడా నిరాకరించింది.
“దేవుడు, దేవతలు, రాక్షసులు ఎవరూ లేరు
ఉన్నది కేవలం మానవుడు –
వాడే అంతాను”
అని మానవుడి అస్తిత్వం ఒక్కటే సత్యమని నిర్ధారిస్తూ తన కవితను ముగించాడు.
మనిషిలో మంచి చెడులు అనే వైరుధ్యాలు అవిభాజ్యంగా ఉంటాయని, మంచి చెడులు అని ఒకరనుకునేవి నిరపేక్షమైనవి కావని చాలా సరళంగా, సున్నితంగా, చమత్కారంగా మనిషి అనే కవితలో చెప్పాడు కాళోజీ.
“మనిషి ఎంత మంచివాడు!
చనిపోయిన వాని చెడును
వెనువెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు”
ఇది కవితలో మొదటి భాగం.
“మనిషి ఎంత చెడ్డవాడు!
బ్రతికి ఉన్నవాని మంచి
గుర్తించడు కాని వాని
చెడును వెతికి కెలుకుతాడు”
అన్న నాలుగు పంక్తుల రెండవ భాగంతో కవిత ముగుస్తుంది. చెడును మరవటం, మంచిని తలవటం – ఒకరి విషయంలో; మంచి గుర్తించక పోవటం, చెడును వెతికి కెలకటం – మరొకరి విషయంలో; ఎందుకు జరుగుతున్నది? ఎలా జరుగుతున్నది? అన్నది ప్రశ్న. వీటిల్లో ఇది మంచి, ఇది చెడు అని నిర్ధారించి చెప్పే ప్రమాణాలు ఎవరు రూపొందించారు అన్న విచికిత్స లేకుండానే మంచి చెడుల గురించి తీర్పులు ఇచ్చే మనిషి గురించిన దిగులు కాళోజీది. అందులోనుండి పుట్టిన వేళాకోళం ఈ కవితను దీప్తిమంతం చేసింది.
మనిషి అస్తిత్వానికి భంగకరంగా మనిషికి మనిషికి మధ్య, మనిషికి సమాజానికి మధ్య ప్రబలమవుతున్న పరిస్థితులపై కాళోజీ కవితలు విమర్శను సంధించాయి. మనిషికి స్వీయ అస్తిత్వ చేతన ఎంత సహజ హక్కో తోటి మనిషి అస్తిత్వాన్ని గుర్తించటం, గౌరవించటం అంత సహజమైన బాధ్యత. ఆ బాధ్యత మరచిన పౌరుల పట్ల కాళోజీకి అసహనం. ఎవనికి వాడే కవిత ఆ అసహనం నుండే పుట్టింది. ఎవనికి వాడుగా, ఎవని గొడవ వానిదిగా మనిషి మనుగడ సాగటం కాళోజీకి కష్టమైన విషయం. అందరి గొడవను తన గొడవగా చేసుకొన్న కాళోజీకి అది సహజమే. అందుకే ఎవని గొడవ వాళ్ళదిగా కుంచించుకు పోవద్దని చెప్పాలన్న తపనతో వినేవాళ్ళ కొరకు వెతుకులాట ఈ కవితలో కనపడుతుంది.
సమూహంగా జీవించటం సౌకర్యవంతంగా, సౌఖ్యంగా ఉంటుందని మనుషులు సమాజాన్ని నిర్మించుకున్నారు. మనుషుల ఇచ్ఛ శక్తిగా మారి మనుషులనే శాసించటం అసలు విషాదం. “మనుజుల చేతనే మనెడు ప్రపంచము / మానవునే మననీదు ప్రపంచము” అని కాళోజీ ప్రపంచము (1942)కవితలో చెప్పినది అదే.
“శాస్త్రకార్లు శాసనకర్తలు / జనులకు తాళీ కట్టని భర్తలు“(ద్వైత జగత్తు) అని చెప్పటంలో కూడా గతాను గతికమయిన నీతులు, ధర్మ సూత్రాలు, శాసనాలు మనిషి మీద బరువై కూర్చున్న తీరును గుర్తించి నిరసించటం కనిపిస్తుంది. “మానవుని మానవుడు మానవుని మాదిరిగ /మన్నించ లేనంత మలినమైనాది”అని హృదయ మాలిన్యం కవితలో వేదన పడ్డాడు. జాతి, రీతి, దేశం, వేషం మొదలైనవి మనుషుల మధ్య విద్వేషాలకు కారణమవుతున్నాయని ఈ కవితలో చెప్పాడు. సంఘ నియమాలు, సనాతన సంప్రదాయాలు, లంచాలు, లాంఛనాలు మొదలయినవి మనిషి లోని కుళ్ళు మారు రూపాలు అని చెప్పటం (మారు రూపాలు) కూడా దానికి కొనసాగింపే. మనిషి సృష్టించిన మర మనిషి జీవితాన్ని నియంత్రించటం గురించి నిరసనతో, మర జీవితం అనే కవిత రాశాడు కాళోజీ.
“మనిషి బ్రతకాలనుకుంటే అయిపోవాలే మర / మరగా మారిన మనిషే ఏలుతాడు సమాజాన్ని” అన్న పంక్తులు కీలకమైనవి. స్వతహాగా, సహజ అస్తితతో, సృజనాత్మకంగా తన బ్రతుకుకు తానే బాధ్యుడుగా బ్రతికే అవకాశం మనిషికి అభావం చేస్తున్న సామాజిక శక్తుల మీద కోపాన్ని ఇవి ప్రతిధ్వనిస్తాయి.
మనిషిగా బ్రతకటమంటే ఆత్మ గౌరవంతో జీవించటం. ఇష్టమైనది చేయటం. చేసే దానికి చెప్పే దానికి మధ్య వైరుధ్యం లేకుండా ప్రవర్తించటం. ఈ మూడిటికి తప్పి చరించే వాళ్ళను ఏం మనుషులు అని ఈసడించుకున్నాడు కాళోజీ. ఏం మనిషి అన్న కవిత ఈవిధమయిన కాళోజీ ద్రుక్పధానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
“ఆత్మకు అవమానం జరిగినా
దవడ పళ్ళు రాలతాయన్న భయంతో
పెదవి విప్పలేని మనిషి ఏం మనిషి”
అని ప్రారంభమవుతుంది ఈ కవిత.
“లాభాల కొరకు
లాభంతో సమకూడె హాయి కొరకు”
ఇష్టం లేని పని చేయటమయినా, ఇష్టమున్న పని మానుకొనటమయినా మనిషిని మనిషిగా మిగలనీయదని భావించాడు కనుక అటువంటి మనిషి మనిషే కాదని తరువాతి భాగంలో సూచించాడు. మూడవ భాగంలో పాము నెపంగా ద్వంద్వ వైఖరి మనిషిని మనిషిగా మిగల్చదని హెచ్చరించాడు.
“బ్రతికున్న పాము
ఎక్కడ బుస్సని పడగ విప్పుతుందోనని
పగబట్టి కాటేస్తుందని
ఆపాద మస్తకం వణికి పోతూ
నాగ స్వరాల ఆసరాతో మెప్పిస్తూ
పూజిస్తూ నాగులచవితి మొక్కుబళ్ళు చెల్లిస్తూ
చచ్చినపామును బడితల్తో బాది
నిరసన జూపి, భర్సన జరిపి
విషనాగుల్ని చితక పొడవాలె
అని నినదించే మనిషి ఏం మనిషి”
ఇక్కడ పాము ఒక సంకేతం మాత్రమే. అది అధికారం. దానిని చూస్తేనే భయపడేట్లు మనిషి తరతరాలుగా పొందుతూ వచ్చిన శిక్షణ ఫలితమే భక్తి. పూజించటం, మొక్కుబళ్ళు చెల్లించటం భక్తికి పరిణామం. అధికారం పట్ల భయ భక్తులు ప్రదర్శించటం ఒక పద్ధతి అయితే అధికారాన్ని దువ్వుతూ ప్రశంసలతో మెప్పిస్తూ పబ్బం గడుపుకోనటం మరొక పద్ధతి. బ్రతికి ఉన్న పాము పట్ల మనుషుల సాధారణ ధోరణి అది. అదే మనుషులు చచ్చిన పాము పట్ల వీరుల వలే ప్రవర్తించటం హాస్యాస్పదం. అధికారాన్ని అవసరమయినప్పుడు ఎదిరించలేరు గానీ తమ బ్రతుకు భద్రతకు ముప్పు లేదని తెలిసినప్పుడు తెలివిగా, అధికారం నశించాలి అని నినదించే మనుషుల మనుష్యత్వాన్ని సందేహించాడు కాళోజీ. దుష్టులకు దూరంగా ఉండాలంటూ సౌకర్యవంతంగా తప్పించుకొనే వాళ్ళే దుష్టులను శిక్షించాలని నినదిస్తుంటే అందులో నిజాయితీ ఏ పాటిది అని కాళోజీ సంధించిన ప్రశ్న ఈ కవితకు ముక్తాయింపు. కాళోజి మనిషి తన సౌఖ్యం గురించి, ముద్దు ముచ్చట్ల గురించి ఆలోచించేటప్పుడు మనిషిగా తోటి మనుషులపట్ల బాధ్యతగా ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఆ విశాల ప్రజా క్షేమ కామనను, ముక్తకం అనే చిన్న కవితలో గొప్పగా వ్యక్తీకరించాడు.
“ఎరుగుదువా నేస్తం
ఎన్ని మొద్దు బ్రతుకుల
ముద్దులు ముచ్చట్లు
రంపపు కోతల పాలైతే
మన ముద్దు ముచ్చట్లు”
నేస్తం అని సంబోధించటంలో మనిషిగా తాను తోటి మనిషితో సమస్థాయి సంబంధాలను నెరిపే ప్రజాస్వామిక దృక్పధం ఉంది. నేస్తం కట్టిన చోట వాళ్ళ హితవును కోరటం ఉంటుంది. ఎరుక కలిగితేనే హితం కలిగేది. కాళోజీ తన మిత్రులందరికి ఎవరయినా తమ అభివృద్ధి గురించి ఆలోచించేటప్పుడు అందరికీ అది అందుబాటులో ఉందా లేదా అనీ, ఎంతో మందిని అభివృద్ధి ఆవలి అంచులకు నెట్టేసే అభివృద్ధి వాంఛనీయం కాదనీ తెలిసి ప్రవర్తించాలని అనుకొంటాడు. ఆ విధంగా ఒక సమగ్ర మానవుడి ఆవిష్కరణ కాళోజీ కల. ఆ కలను పదుగురికి పంచిన కళ ఆయన కవిత్వం.
(సెప్టెంబర్ 9 కాళోజీ పుట్టిన రోజు.)